మరో వసంతం

రెండేళ్లు – రెండ్రోజుల్లో నేనీ బ్లాగు మొదలెట్టి. ఏడాది క్రితం ఓ సారి సింహావలోకనం చేసుకున్నాను. అప్పుడే మరో ఏడు గడిచింది. ఈ ఏడాదిలో అరవై దాకా టపాలు రాల్చాను. వాటిలో నాకు నచ్చినవి: మిస్టర్ నో, బోఫా, తనాయాసం, మేకింగ్ ఆఫ్ సున్నం, సమైక్య నాదం మరియు ఎక్‌స్ట్రా క్లాస్.

తొలి ఏడాది నాకో శైలంటూ ఏర్పడింది. ఈ ఏడాదీ అదలాగే ఉంది. అందులో పెద్దగా తేడాలొచ్చినట్లు నాకైతే అనిపించలేదు. గతేడాది ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకించిన ఆంగ్ల బ్లాగొకటి ప్రారంభించాను కానీ అదో ఆరంభ శూరత్వ ప్రదర్శనగా మిగిలిపోయింది – ఆంధ్రుడ్ని మరి. దాన్ని మళ్లీ పట్టాలెక్కించే ఆలోచన ప్రస్తుతానికి లేదు. నవతరంగంలో సినిమాల మీద తొమ్మిది వ్యాసాలు రాశాక అందులోనూ ఆసక్తి ఆవిరై పోయింది. మరోటీ రాస్తే పదౌతాయన్న తలపుంది కానీ రౌండ్ ఫిగర్ చేసేయాలని మొక్కుబడిగా ఏదోటి రాసేంత బలీయంగా అది లేకపోవటంతో నవతరంగమూ, దాని ఫాలోయర్లూ బతికిపోయారు.

సింహావలోకనంలో ప్రస్తావించిన ఆరున్నొక్క సూత్రాలు రెండో ఏడాదీ పాటించాను. ఈ ఏడాది తెలుగు బ్లాగుల్లో కురిసిన తిట్లూ రంకెల కుంభవృష్టిలో నేను తడవకపోటానికి అదో కారణం కావచ్చు. అంత మాత్రాన వివాదాస్పద అంశాల జోలికే వెళ్లలేదని కాదు. స్వీయలాభాల కోసం నిష్టగా ఏర్చికూర్చిన అసత్యారోపణలతో వేర్పాటోద్యమాలు వండివార్చి తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చు పెట్టిన రాబందుల రాజకీయాన్ని పది టపాల పరంపర ద్వారా ఎండగట్టాను. వాటిద్వారా నా మీద సమైక్యవాది అన్న ముద్ర పడిపోయింది. నో ప్రోబ్లిమో. విభజనవాది, వేర్పాటువాది, ప్రాంతీయవాది వగైరా ముద్రలకనా ఇది వేలరెట్లు మెరుగు – వ్యతిరేకులు ఎలాంటి పెడార్ధాలు తీసుకున్నా సరే. ఓ వివాదాస్పద అంశమ్మీద ఆ స్థాయిలో చర్చ రగిలినా నా బ్లాగు దూషణ భూషణ కీలల్లో కాలిపోలేదు. ఆ మేరకు వ్యాఖ్యాతల సంయమనానికి సంతోషం, పరిపరి ధన్యవాదం. ఆ టపాలని శ్రీకృష్ణ కమీషన్‌కి పంపమని అనేకమంది సూచించారు. ఇ-మెయిల్ ద్వారా పంపితే అవి చెత్తబుట్టలో చేరే అవకాశాలే ఎక్కువ కాబట్టి, వాటికి మరికొంత స్టాటిస్టికల్ సమాచారం జోడించి ఓ అసెంబ్లీ సభ్యుడి ద్వారా కమిటీకి అందజేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తద్వారా భారతదేశం విచ్చిన్నం కాకూడదని కోరుకునే వ్యక్తిగా నాకు చేతనైన పని నేను చేశాను. ప్రయత్నం ముఖ్యం. ఫలితమేదైనా ఫరకు లేదు.

భావోద్వేగాలు, నీతిబోధల జడిలో తడిసి ముద్దౌతున్న తెలుగు కథల్ని అర్జెంటుగా ఉద్ధరించేద్దామన్న మహాశయంతో గత ఏడాది కథన రంగంలో కాలు మోపాను. ఆ క్రమంలో రాసిన తొలికథ గడియారం నా అంచనాలే అందుకోలేకపోయింది. తొలికథలో చేసిన తప్పులు దిద్దుకుంటూ కొంత సైన్సుకి మరికొంత చరిత్రనీ ఇంకొంత ఊహనీ జతచేసి రాసిన నాగరికథ పాఠకుల ప్రశంసలందుకుంది. ఈ కథ వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్లు కూర్చే కథ-2009 సంకలనానికి ఎంపికైనట్లు కొన్నాళ్ల క్రితం తెలిసింది. అదో అదనపు గౌరవం. అన్‌రిలయబుల్ నెరేటర్ పద్ధతిలో చేసిన సైకో థ్రిల్లర్ ప్రయోగం ఆరోప్రాణం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. లీటర్ సైన్సుకి పావు లీటర్ అధివాస్తవికత, పది మిల్లీలీటర్ల ఆధ్యాత్మకత రంగరించి రూపొందించిన ‘మరో ప్రపంచం’ (ఇంకా విడుదవలేదు) వంగూరి ఫౌండేషన్ వారి 2010 ఉగాది కథల పోటీల్లో ఉత్తమ కథగా ఎంపికయింది. ఏడాదిలో నే రాసిన నాలుగు కథలవి. ప్రస్తుతం మరో మూడు కథలకి ప్లాట్ ఎలిమెంట్స్ బుర్రలో సుడులు తిరుగుతున్నాయి. షరా మామూలుగా ఇవీ తోకలో చిన్నదో పెద్దదో ఓ ట్విస్టుండేవే. ఈ మూడింటి కోసం చేయాల్సిన హోమ్‌వర్క్, సేకరించాల్సిన సమాచారం చాలా బోలెడుంది. ఆయుర్వేదం నుండి అల్లోపతీ దాకా, కాలజ్ఞానం నుండి కెమిస్ట్రీ దాకా తెలుసుకోవలసినవి శానా ఉన్నాయి. కాబట్టి ఈ కథలు ఎప్పటికి వెలుగు చూస్తాయో తెలీదు. వాటికోసం కళ్లలో వత్తులతో పడిగాపులు పడుతున్న చకోరపక్షులెటూ లేవు కావున హడావిడిగా రాసి పడేయాలన్న ఒత్తిడీ లేదు. వచ్చినప్పుడొస్తాయి.

నాకు సాహితీ సదస్సులకీ సమావేశాలకీ వెళ్లే అలవాటు శూన్యం. మొదటిసారిగా పోయినేడాది అటువంటి రెండింట్లో పాల్గొన్నాను. ఒకటి మల్లాది వెంకట కృష్ణమూర్తి గారితో కాలక్షేప గోష్టి, రెండోది మేడసాని మోహన్ గారి శతావధానంలో పృఛ్చకత్వం. రెండూ గుర్తుంచుకోదగ్గ అనుభవాలు. వాటి గురించి నా బ్లాగులో రెండు టపాలు రాశాను.

కొత్తగా మాక్రో ఫోటోగ్రఫీ మీద మోజు మొదలయింది. చుట్టూ ఉన్న సూక్ష్మలోకాన్ని వందల రెట్లు పెద్దది చేసి చూపే ఫోటోలు క్లిక్కుమనిపించి, వాటిలో ఇన్నాళ్లూ చూడని వింతలెన్నో గమనించి విస్తుపోటానికి ఎక్కడెక్కడి సమయమూ చాలటం లేదు. ఈ మోజెన్నాళ్లుంటుందో తెలీదు. ఇదొదిలాకన్నా తన జోలికొస్తానేమోనని ఆశగా ఎదురు చూస్తున్న షార్ట్ ఫిల్మ్ స్క్రిప్టొకటి పుస్తకాల సొరుగులో పడుంది. మూడేళ్ల క్రితం రాసిన ఐదు నిమిషాల చిట్టి సినిమా స్క్రిప్టది. ఎప్పటికన్నా దాన్ని తెరకెక్కించాలన్న కోరిక. అప్పట్లో నాకు నచ్చే నాణ్యతతో తీయగలన్న నమ్మకం లేక పక్కన పెట్టేశాను. ఇన్నేళ్లలో కన్స్యూమర్ కెమేరాల పురోగమనం గమనించాక, నాకవసరమైన క్వాలిటీతో చిత్రీకరించగలిగే కెమేరాలు అందుబాట్లోకొచ్చాయన్న విషయం అవగతమయింది. ఇక నా స్క్రిప్ట్ దుమ్ము దులపటమే తరువాయి. దానికన్నా ముందు – నా సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ప్రతిభ పరీక్షించుకోటానికి ర్యాండమ్ షాట్స్‌తో కూడిన ఒకట్రెండు నిమిషాల నిడివి మ్యూజిక్ వీడియో చేసే ఆలోచనుంది. వీలు కుదుర్చుకుని ఈ వేసవిలో చేసెయ్యాలి.

అదీ రౌండప్. ఆఖరుగా – ఇన్నాళ్లుగా నే రాసినవి చదివి వెన్నుతట్టిన, విమర్శించిన వారందరికీ ధన్యవాదాలు.

26 స్పందనలు to “మరో వసంతం”


 1. 1 Sravya Vattikuti 6:23 సా. వద్ద మే 5, 2010

  బాగుంది మీ ప్రొగ్రెస్స్ రిపోర్ట్ 🙂 మీ మరో ప్రపంచం’ కథ వంగూరి ఫౌండేషన్ వారి 2010 ఉగాది కథల పోటీల్లో ఉత్తమ కథగా ఎంపికయింది అని రెండు మూడు రోజుల క్రితం వారి బ్లాగులోకూడా చదివాను అభినందనలు !
  వాటికి మరికొంత స్టాటిస్టికల్ సమాచారం జోడించి ఓ అసెంబ్లీ సభ్యుడి ద్వారా కమిటీకి అందజేయటం జరిగింది >> well done !

 2. 2 sathibabu akella 8:52 సా. వద్ద మే 5, 2010

  తెలుగోడు గారు,

  నేను ఇప్పుడే మీ “ఒక ఉద్యమం-పది అబద్ధాలు” వ్యాస పరంపర
  చదివాను. నేను సమైక్య వాదానికి సంబంధించి చదివిన వ్యాసాలన్నింటి
  లో కన్నా మంచి వ్యాసం.

  -ఆకెళ్ళ సత్తిబాబు.

 3. 4 విశ్వప్రేమికుడు 9:54 సా. వద్ద మే 5, 2010

  మీ రచనా వ్యాసంగం బ్లాగుతొ తృప్తి పడకుండా కథా రచనకు పరుగులు తీయడం హర్షదాయకం. అభినందనలు 🙂

 4. 5 సుజాత 9:57 సా. వద్ద మే 5, 2010

  అన్నింటికంటే ది బెస్ట్ అచీవ్ మెంట్ మీరు రచయితగా మారడం. రెండోది మీ టపాలు శ్రీ కృష్ణ కమిటీకి చేరడం.

  you got A+ in your progress report.

  congratulations!

 5. 6 SRRao 10:37 సా. వద్ద మే 5, 2010

  ద్వితీయ వార్షికోత్సవ అభినందనలు

 6. 7 3g 10:57 సా. వద్ద మే 5, 2010

  ద్వితీయ వార్షికోత్సవ శుభాబినందనలు.

 7. 8 chinni 11:03 సా. వద్ద మే 5, 2010

  మీకు అభినందనలు అండీ ….కథ 2009 కి ఎంపిక అయినందుకు ,రెండో ది శ్రీకృష్ణ కమిషన్ కి మీ వాయిస్ (మీరు రాసినవి )వినిపిస్తున్నందుకు .

 8. 9 రవి చంద్ర 11:03 సా. వద్ద మే 5, 2010

  అనిల్ గారూ, వేర్పాటవాద ఉద్యమాలపై మీ టపాలను శ్రీకృష్ణకమిటీకి పంపమని మొదట సిఫారసు చేసింది నేనేననుకుంటున్నా (కనీసం బ్లాగు ద్వారా). నాకు చాలా ఆనందంగా ఉంది.
  ఫలితం మీద ఆశ పెట్టుకోకపోవడం కూడా నాకు నచ్చింది. మీరు చెప్పాల్సిన విషయాలు చాలా సూటిగా తగిలేలా చెప్పారు. రాష్ట్ర విభజన అనే పేరెత్తితే కడుపు రగిలిపోతుంది నాకు. మీ ద్వారా సరైన సందేశం వారికి చేరి ఉంటుంది. కృతజ్ఞతలు

  • 10 Sudha 11:36 సా. వద్ద మే 6, 2010

   రవి చంద్ర గారండోయ్. మీ సిఫారసు ని నేను కూడా సిఫార్సు చేశాను. నిజం చెప్పాలంటే
   అబ్రకదబ్ర గారికి చాల కాలంగా అజ్ఞాత అభిమాని ని. ఆయన టపాల్లో శ్రీ ఏసుక్రీస్తు చదివి పిచ్చ పంఖానయ్యా…౧౦ అబద్ధాలని ఎండగడుతూ తెలుగు వారి గోడు వినిపించే టపాలు రెగ్యులర్ గా చదువుతుంటాను.

   ఇంతకు ముందేదో కామెంట్లో కూడా చెప్పినట్టు గుర్తు..తెలుగు బాషలో నిజంగా సత్తా కలిగిన బ్లాగులంటే మూడంటే మూడే. తెలుగోడు , రెండు రెళ్ళు ఆరు, మనసు లో మాట.

   మనసు బాలేకపోతే, పొద్దున ఒక ఏసుక్రీస్తు, మధ్యాన్నం ఒక చెత్తాంటీ, ఇంకా తగ్గక పోతే రెండు రెళ్ళు ఆరు మొత్తం చదివెయ్యండి. దెబ్బ కిబాధలన్నీ మటుమాయం !!!!

 9. 11 nestam 12:32 ఉద. వద్ద మే 6, 2010

  బోలెడు అభినందనలు.. ఇంకా బోలెడు శుభాకాంక్షలు 🙂 .. ఏమో నాకైతే మీరు రాసిన అన్ని పోస్ట్ లు ,మీ వ్యాఖ్యలు చదివినా నచ్చేస్తాయి– ( ఎవో కొన్ని విషయాలు తప్ప అవి సీక్రెట్స్ అనుకోండీ — 😛 ) .. ఇది ఎక్కువ అది తక్కువ అని ఉండదు అన్ని బాగా రాస్తారు 🙂

 10. 12 శ్రీవాసుకి 1:04 ఉద. వద్ద మే 6, 2010

  మీకు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని టపాలతో ఈసంవత్సరం కూడా మమ్మల్ని వాడి వేడిగా అలరించగలరని ఆశిస్తున్నాను. నేను సమైక్యవాదినే. రాష్ట్రం విడిపోవడం అన్నమాటే నచ్చలేదు. కష్టమో నష్టమో అందరం కలిసి ఉండాలి.

 11. 13 కోడీహళ్లి మురళీమోహన్ 4:59 ఉద. వద్ద మే 6, 2010

  మీరు నాకొక కథ బాకీ వున్నారు మరచి పోకండి. ద్వితీయ వార్షికోత్సవ శుభాబినందనలు.

 12. 14 వేణూ శ్రీకాంత్ 8:48 ఉద. వద్ద మే 6, 2010

  అభినందనలు 🙂 మీ వ్యాస పరంపరను శ్రీకృష్ణ కమిటీ కి చేరవేయడం అభినందనీయం..

 13. 15 కొత్తపాళీ 9:04 ఉద. వద్ద మే 6, 2010

  చాలా సంతోషం. మీ రచనల్నీ ప్రయత్నాల్నీ ఇతోధికంగా కొనసాగిస్తారని ఆశ, కొనసాగించాలని కోరిక. బ్లాగులంటే తెలియని వారికి మంచి తెలుగు బ్లాగుల్ని పరిచయం చెయ్యాలి అనుకున్నప్పుడు నేను తరచూ తలుచుకునే బ్లాగుల్లో మీది కూడా ఒకటి.

 14. 16 అబ్రకదబ్ర 7:04 సా. వద్ద మే 6, 2010

  అందరికీ లాట్సాఫ్ థాంకులు 🙂

  మురళీమోహన్ గారు,

  నేను మర్చిపోలేదు. మీరే మర్చిపోయుంటారనుకున్నా. లేదన్నమాట. తప్పకుండా రాసిస్తాను. కాస్త (అంటే చాలా) సమయమివ్వండి.

 15. 18 Ramana 11:52 సా. వద్ద మే 6, 2010

  అభినందనలు. నాకెంతో ఇష్టమైన బ్లాగు. తరచూ చదివించే రచనలు మీవి. ప్రతిసారీ పొగడాల్సొస్తుంది. విమర్శించే అవకాశం కోసం చూస్తుంటా.

 16. 19 krishna 2:42 సా. వద్ద మే 7, 2010

  నేను బ్లాగు లోకానికి పరిచయం కావడానికి కారణమైన ఇద్దరు బ్లాగర్లు, ఇప్పటికి నాకు తెలుగు బ్లాగర్లలో బాగా నచ్చె ఇద్దరు బ్లాగర్లు:మనసులో మాట సుజాత గారు, తెలుగోడు అబ్రక దబ్ర గారు.
  కాని ఇద్దరు బాగా విభిన్న అభిరుచులు కలవారు,ముఖ్యంగా సాహిత్యం విషయం లో.సాహితి చర్చ జరగాలంటె అక్కడ అబ్రకదబ్ర గారి కంటె సుజాత గారు ఉంటడమే నేను ఇష్ట పడతాను.యండమూరి రచనలు ఎక్కువగా చదివిన అనిల్ గారు, మీరు ఆయన శైలి నుండి తప్పించుకోవడానికి బాగానె ప్రయత్నించారు కాని, ఆయన కధలలొ కధా నాయకులకి వుండే కుశలత,చతురత మీ లో దాచుకోలెక పోయారు.హహహ…
  ఇక మీ ఆరున్నొక నియమాలు గురించి…..మనం ఒక విషయం లో ఏ స్టాండూ తీసుకోనంతవరకు, ఎవరి తోని గొడవ వుండదు, ఉదాహరణ కి మీ “నేనాస్తుకుడిని”అన్న టపా.అదే వేర్పాటు వాదులు అబద్దాలు ఎండగట్టినప్పుడు, మీరు అనుకోకుండానే వారి వైరి పక్షంలో(సమైక్య వాదం లో)చేర్చబడ్డారు.అప్పుడు కొంచెం తీవ్రమైన వాదనలే జరిగాయి కదా.కాకపోతె, మీరు ఎన్నడు వ్యక్తిగత దూషణలు దిగలేదు.అదే మీ మీద నాకు గౌరవం ఏర్పడడానికి కారణం.కాని పర్ణశాళ బ్లాగులో ఈ మధ్యన జరిగిన ఒక చర్చ మీరు కూడా మానవ సహజ స్వభావాలకి దూరం కాదు అని నిరూపించింది.అది సహజం.దాని వలన ఒక భ్రమ వదిలింది తప్ప మీ మీద గౌరవం తగ్గలేదు.
  ఇక నీతి కధలు పై మీ అభిప్రాయం(“టెల్గూ స్టొరి”) తో కూడా నేను ఏకీభవించలేను.మీరు తలుచుకుంటె మంచి రచయత కాగలరు, కాని మీరు మంచి పాపులర్ రచయత అవుదామనుకుంటున్నారు.తెలుగులో కూడా మంచి సాహిత్యం వుందండి,కావాలంటె సుజాత గారిని అడగండీ:-).
  ఇది ఒక సద్విమర్శ అని అనుకుంటున్నాను.ఏమన్న తెలియక తప్పుగా అంటె క్షమించగలరు.
  మీరు ఇలాంటి మరో వసంతాలు మరిన్ని జరుపుకోవాలని,అవి కూడా నవ వసంతం అంత ఉత్సాహం తో కూడుకుని వుండాలని ఆశిస్తూ…మీ అభిమాని.

  • 20 అబ్రకదబ్ర 3:21 సా. వద్ద మే 7, 2010

   మీరు లాయర్ వృత్తి గొప్పదనం గురించి లెక్చర్లు దంచుతున్నారనుకోండి. అప్పుడు నేనొచ్చి మిమ్మల్నో ప్రశ్న వేస్తాను, ‘అలాగైతే మీరు లాయరయ్యుండొచ్చుగా’ అని. దానికి మీరు నొచ్చుకుంటారా? కోరు. ఆ ప్రశ్నడిగినందుకు నన్నెవరూ తప్పు పట్టరు కూడా. ఎందుకు? లాయర్ వృత్తి మీ దృష్టిలో ‘నిజంగానే’ గొప్పది కాబట్టి. అలాగే ఆ ఇతరుల దృష్టిలోనూ అదేమీ తప్పుడు పని కాదు కాబట్టి.

   అదే, పడుపు వృత్తిని వెనకేసుకొచ్చే ఒకాయన్ని అలాంటి ప్రశ్నే వేస్తే ఆయనకి వళ్లు మండిపోతుంది. దారినపోయేవాళ్లు కూడా వచ్చి నాకు నాలుగక్షింతలేస్తారు పెద్దరికం ప్రదర్శిస్తూ. ఎందుకు? పైకి ఏమి చెప్పినా లోలోపల వీళ్లంతా ఆ పనిని అసహ్యించుకునేవాళ్లే కాబట్టి.

   విధిలేక వళ్లమ్ముకునేవారి మీద సానుభూతి చూపించటం వేరు, అదీ ఓ వృత్తేనంటూ దాన్ని చట్టబద్ధం చెయ్యాలని వాదించటం వేరు. సరే, ఎవరేమనుకుంటేనేం, నాక్కావలసిన సమాధానం రాబట్టుకున్నాను. నవ్వుకుని నా దోవన్నేను పోయాను.

   Btw, అలాంటి ప్రతిస్పందనొస్తుందని తెలీకుండానే ఆ ప్రశ్నడిగాననుకున్నారా?

   తెలుగులో మంచి సాహిత్యం లేదనటం లేదు. అది ఒకే మూసలో ఉందనేది నా బాధ. ‘టెల్గూ స్టోరీ’లో నేను వాపోయిందదే. వైవిధ్యం ఏదీ? నూటికి తొంభై కథల్లో మొదటి పేరా చదవగానే ముగింపెలా ఉండబోతుందో తెలిసిపోతుంది. కొన్నైతే పేరు వినగానే కథంతా అర్ధమైపోతుంది. నా వరకూ నేను అటువంటివి చదవలేను. Fiction should be what its name implies: fictitious. కథలో కల్పన ఉండాలి. తెలుగు కథల్లో అదేదీ? నాకు కథ చదివితే నా జీవితంలో జరిగిన సంఘటనలేవో గుర్తుకు రాకూడదు. దానికి నా డైరీలున్నాయి. ఎవరో రాసిన కథెందుకు చదవాలి? ఇది నా అభిప్రాయం. అందరూ అలాగే అనుకోకపోవచ్చు.

 17. 21 కన్నగాడు 1:38 ఉద. వద్ద మే 8, 2010

  మొత్తానికి రెండో సంవత్సరం పూర్తైందన్నమాట, ఎన్నింట్లోనో ఆరంభశూరత్వం చూపినట్టు చెప్పుకున్న మీరు బ్లాగడంలో చూపకపోవడం అనందదాయకం. అభినందనలు

 18. 23 ఉష 1:58 సా. వద్ద మే 8, 2010

  అభినందనలు. మీ రచనావ్యాసంగాలు నిరాటంకంగా సాగాలని.. ఫొటోగ్రఫీలో కూడా ఈ ఏడాది పురోగతి రావాలని ఆశిస్తూ..

 19. 24 జ్యోతి 9:11 సా. వద్ద మే 8, 2010

  అభినందనలు అనిల్ గారు,

 20. 25 rayraj 7:31 ఉద. వద్ద మే 12, 2010

  లాయర్ లాజిక్కు బావుంది. ఐనా, ఎప్పుడో తొక్కేసిన ఓ అచ్చేయని పోస్టుని వేస్తున్నాను. పేరు “సెక్రటరీ- సినిమా రివ్యూ” – అందరూ చదవేది కాదు. అసభ్యం అనుకునే వాళ్ళు రాకూడదు.(మీరు మాత్రం చదవాలనే)

 21. 26 lekhari 6:54 ఉద. వద్ద మే 26, 2010

  ఆల్ ద బెస్ట్ అనిల్ గారూ,

  నేను మొదటగా తెలుగు వర్డ్ ప్రెస్ పేజీ తియ్యగానే రవి చంద్ర గారి బ్లాగ్ తరవాత మీ బ్లాగ్ చదవడం తటస్థించించింది.ఒక రకంగా మీ ఇద్దరి బ్లాగులూ చూసాకే నేను కూడా ప్రయత్నిస్తే బాగా రాయగలన్న ఆలోచన వచ్చిందనుకుంటా.ఆ రకంగా మీరిద్దర్నీ నా మెంటర్స్ గా భావిస్తాను.సూటిగా సుత్తి లేకుండా రాసే మీ శైలి నాకు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది పోస్టింగ్ చివరి వరకూ..

  మీరు ఇలాగే ఎక్సైటింగ్ పోస్టింగులు తప్పుల్లేకుండా రాసి(మీ బ్లాగులో తెలుగులో అప్పు తచ్చులు చాలా తక్కువగా ఉన్నాయి..అక్షరాలు సరిగ్గా రాయకపోతే నేనస్సలు చదవలేను ఎందుకో మరి ? భావాన్ని చెప్పాలంటే భాష కూడా ముఖ్యం కదా!) మరిన్ని నవ వసంతాలు జరుపుకోవాలని శుభాకాంక్షలతో.. 🙂 🙂

  లేఖరి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: