వ్యూహాత్మకం

అనగనగనగనగా నేనో స్థానిక క్రికెట్ జట్టుకి నాయకత్వం నెరపే రోజుల్లో – అనగా క్రీపూ కాలంలో అన్నమాట – ప్రత్యర్ధి జట్లని బురిడీ కొట్టించటానికి కొన్ని పద్ధతులు అమల్లో పెట్టేవాడిని. వాటిలో ఒకటి: టోర్నమెంట్ల సందర్భంగా కొత్త ప్రత్యర్ధి జట్లు తారస పడ్డప్పుడు వాళ్లతో ఓ ముందస్తు స్నేహపూర్వక పోటీ ఏర్పాటు చేయించటం, సదరు పోటీ కోసం రూపొందించే నా జట్టుని అనామక ఆటగాళ్లతో నింపటం, ఆ ఫ్రెండ్లీ గేమ్ కావాలనే ఓడిపోవటం, ఆ విధంగా ఎదుటి జట్టులో నా జట్టంటే తేలిక భావాన్ని నింపడం .. అలా మమ్మల్నో పసలేని జట్టుగా అంచనా వేసి ఆడుతూ పాడుతూ టోర్నమెంట్ మ్యాచ్‌లోకి దిగిన ప్రత్యర్ధి జట్టుపైకి నా అసలు జట్టుని దింపి వాళ్లు తేరుకోలేని దెబ్బ కొట్టటం. ఈ వ్యూహం కొన్నాళ్లు బాగానే పని చేసింది. తర్వాత్తర్వాత నా స్నేహపూర్వక పోటీల వెనక దాగున్న మర్మం ఆనోటా ఈనోటా పడి పాతా కొత్తా ప్రత్యర్ధులందరికీ తెలిసిపోయింది. దీనివల్ల నా వ్యూహానికి నూకలు చెల్లాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. రహస్యం బట్టబయలయ్యాక – నా జట్టు నిజంగానే ఆడలేక చేతులెత్తేసి చిత్తుగా ఓడిపోయిన పోటీలని సైతం ప్రత్యర్ధి జట్ల నాయకులు ‘ఇదో వ్యూహాత్మక ఓటమి మాత్రమే’ అని పొరబడటం, ఏ పుట్టలో ఏ పాముందో అనుకుంటూ ఆ కన్‌ఫ్యూజన్‌లో మాతో ఆడే తరువాతి పోటీలో మితిమీరిన రక్షణాత్మక ధోరణి అవలంబించబోయి బోర్లాపడటం .. ఇదీ తంతు.

పద్దెనిమిదో శతాబ్దపు ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్ పేరు మీద లెక్కలేనన్ని అర్బన్ లెజెండ్లు చెలామణిలో ఉన్నాయి. వాటిలో నాకు నచ్చేదిది: తాను ముట్టడించిన దేశంలో అడుగు పెట్టగానే నెపోలియన్ చేసే మొదటి పని, తాము తరలొచ్చిన నౌకలన్నిట్నీ తగలబెట్టించటం! తిరుగు ప్రయాణానికి వాహనాలు లేకుండా చెయ్యటం వెనక మతలబు, తన సైన్యం పలాయనం చిత్తగించే మార్గం మూసేయటమే కాక, ‘మీ ఇళ్లకి తిరిగెళ్లాలంటే ఈ యుద్ధం గెలిచి తీరాల్సిందే’ అని తనదైన శైలిలో నొక్కిచెప్పటమన్నమాట. అదో రకం సైకలాజికల్ గేమ్. నా క్రికెట్ విజయ మంత్రాలు కొన్నిటికి ఇదే స్ఫూర్తి. కాకపోతే వాటిని సొంత జట్టు మీద కాకుండా ప్రత్యర్ధుల మీద ప్రయోగించేవాడిని. అయితే చింతకాయలు రాలాలంటే మంత్రాలేసి ఊరుకుంటే సరిపోదు – చేసే పనిలో చెయ్యితిరిగుండటం అత్యవసరం. నెపోలియన్ యుద్ధాలైనా, నా క్రికెట్ మ్యాచ్‌లైనా – ఆయా గెలుపుల వెనక ఈ చిట్కాల పాత్ర బహు పరిమితం. సుశిక్షితులైన సైనికులు నెపోలియన్ విజయ రహస్యం; రంజీ ట్రోఫీ నుండి ఇంగ్లీష్ కౌంటీల దాకా ఆడిన అనుభవమున్న మెరికల్లాంటి ఆటగాళ్లు నా జట్టు విజయ రహస్యం. ఈ సైకలాజికల్ గేమ్సూ గట్రా వ్యూహాలన్నీ ఆ తర్వాతే. ఆ స్పృహ నెపోలియన్‌కుంది, నాకూ ఉంది. లేనే లేనిది నేటి తరం తెలుగు సినీ నిర్మాతలకి.

ఆ మధ్య ఏయ్ అనే తెలుగు సినిమా ఒకటొచ్చింది. మాజీ బాల నటి భీమిలి కథానాయికగా నటించిన మొట్టమొదటి చిత్రం కావటం దాని ఏకైక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతని వీలైనంత సొమ్ము చేసుకుందామనుకున్న సదరు చిత్ర దర్శక నిర్మాతలు సినిమా విడుదలయ్యేదాకా భీమిలి నిశ్చల చిత్రాలు బయటికి రాకుండా సకల జాగ్రత్తలు తీసుకుని, పెద్దదయ్యాక ఆ అమ్మాయెలాగుంటుందో అన్న ఉత్కంఠ ప్రేక్షక జనాల్లో విజయవంతంగా కలిగించారు. తీరా సినిమా విడుదలయ్యాక భీమిలిని చూసిన ప్రేక్షకులు పెదవి విరవటం, కథలో పస లేకపోవటంతో సినిమా పేలిపోవటం వెంటవెంటనే జరిగిపోయాయి. పక్కోడి అనుభవం నుండి పాఠం నేర్చుకునేవాడు తెలుగు నిర్మాతెందుకవుతాడు? ఏడాది తిరిగేలోపు అదే ఎత్తుగడ పునరావృతమైంది – నరుడు నామధేయంగల తాజా చలన చిత్రానికి. ఈ చిత్రంలో నారి పాత్ర పోషించిన నూతన నటి భామశ్రీ నెహ్రా విషయంలో ఈ గోప్యతా సూత్రం మరింత పకడ్బందీగా పాటించారు – కథానాయిక పేరు సైతం బయటికి పొక్కకుండా. ఫలితం? మళ్లీ అదే. అతి చేస్తే గతి చెడుతుందన్న జ్ఞానముంటే చేదు అనుభవాలు ఎదురవవు. సినిమాలో సరుకుంటే ఇలాంటి చిల్లర చిట్కాలు చన్నీళ్లకి వేన్నీళ్లలా మరిన్ని వసూళ్లు తెచ్చి పెడతాయే తప్ప అవే సినిమాని సూపర్ హిట్ చేసి పెట్టవన్న తెలివి మన నిర్మాతలకెప్పుడు వంటబట్టేనో.

జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెట్టుద్దనేది పాత జాతీయం. అసలు జుట్టే లేకపోయినా ఫర్లేదు విగ్గుతో లాగించొచ్చనేది మన సినీ జనాల ధీమా. ఎన్టీవోడు తెరనేలిన రోజుల్లో ఆ ధీమాకో అర్ధముండేది – అప్పట్లో ప్రేక్షకమారాజులు సినిమాల్లో విలన్లు బయటా ఆ టైపే అని నమ్మేసి శాపనార్ధాలు పెట్టేసేంత అమాయకులు కాబట్టి. దరిమిలా రోజులు మారాయి. విగ్గులున్నది బోడి గుండుని కప్పెట్టటానికేనని కనిపెట్టగలిగేంతగా తెలివిమీరిపోయారు నేటి ప్రేక్షక దేవుళ్లు. వీళ్ల ముందా దర్శక నిర్మాతల కుప్పిగంతులు? వంటకం సరిగా వండకుండా ఎన్నెన్ని మసాలాలతో దానికి తిరగమోతేసిందీ మోత మోగిస్తే ఏం లాభం? మసాలాలంటే గుర్తొచ్చింది – ఈ మధ్య ‘మా సినిమాలో ఫలానా కథానాయిక బికినీ ధరించింది’ అనేదో రొటీన్‌కి భిన్నం కాని ప్రచారపుటెత్తుగడైపోయింది. ఆ చింకిపాతల్లో చిందులేసే హీరోయిన్లని చూసి తరించటానికే చొంగలు కార్చుకుంటూ జనాలంతా సకుటుంబ సపరివార సమేతంగా సినిమాహాళ్లముందు బారులు తీరతారని వాళ్ల వీర భీకర నమ్మకం! ఆ తరహా రసిక ప్రేక్షక వర్గమొకటి లేకపోలేదు. అయితే, ఓ సినిమా జయాపజయాలు నిర్ణయించగలిగే సంఖ్యాబలం వాళ్లకున్నదా అన్నది ప్రశ్న. వాళ్లని రంజింపజేసే ఉద్దేశంతో చొప్పించబడ్డ అనవసర సన్నివేశాల వల్ల సినిమాకి దూరమైపోయే మరో వర్గంతో పోలిస్తే .. గంప లాభం చిల్లి తీసేసినట్లు కాదూ? సరే, ఆ లెక్కలొదిలేద్దాం. చెప్పొచ్చేదేమంటే, బికీనీలు ప్రస్తుతం తెలుగే కాక అన్ని భారతీయ భాషా సినిమాల ప్రచార వ్యూహాల్లోనూ ప్రధానాస్త్రాలైపోయాయి. ఇంతా చేసి ఆ సినిమాలో ఆ ఫలానా నాయిక ధరించింది ఈత డ్రస్సు మాత్రమే అయ్యుంటుంది. సాధారణ స్విమ్ సూట్‌కీ, రెండు పీలికల బికినీకీ తేడా తెలీని దర్శకులు సినిమాలు తీసి పారేస్తున్నారు ఖర్మ. వాళ్లకి తెలీకపోతే పోయె, ఆ తేడా ఏదో ఆ సంగతి అచ్చేసి మనమీదకొదిలిన మీడియా మహారధులకీ తెలిసిన దాఖలాల్లేవు.

మీడియా ప్రస్తావన రానే వచ్చింది కాబట్టి చివరగా వాళ్ల గురించీ ఓ ముక్క. కొన్నేళ్లుగా మన మీడియా జనుల పుణ్యాన ఓ కొత్త రాజకీయ పదబంధం విస్తారంగా వాడుకలోకొచ్చింది: వ్యూహాత్మక మౌనం. కీలకాంశాలపై ఎటూ తేల్చకుండా ఏళ్లూ పూళ్లూ నాన్చే నాయకమ్మన్యుల గోడమీద పిల్లివాటం గుణానికీ, ప్రత్యర్ధుల ఎత్తులకి చిత్తై చేతులు ముడుచుక్కూర్చునే నేతల చేతగానితనానికీ మన పాత్రికేయులు పెట్టిన మహాగొప్ప ముద్దు పేరది. ఆయా మౌనాల వెనకాల నిజంగానే కళ్లు చెదిరే వ్యూహాలున్నాయని ఆ రాసినోడూ, దాన్నచ్చేసినోడూ నమ్మితే నమ్మిపోయారుగాక .. నేను మాత్రం నమ్మను. నా ప్రత్యర్ధి క్రికెట్ జట్ల నాయకులు చేసిన పొరపాటే మన నాయకుల విషయంలో చెయ్యటానికి నేనేమన్నా పిచ్చోడినా?

24 స్పందనలు to “వ్యూహాత్మకం”


  1. 2 రమణ 9:13 సా. వద్ద ఏప్రిల్ 11, 2010

    మన బక్కవీరుడి వ్యూహాత్మక మౌనమేగా 🙂 నా అనుమానం వీడికి సంబంధించిన జాతకం ఏదో చూపించి మళ్ళీ నోరెత్తితే బజార్లో నిలబెడతాం అని ధమ్కీ ఇచ్చారని నా అనుమానం, మనోడికి ఇతర కళల్లో కూడా ప్రవేశం ఉంది కదా. దెబ్బకి గురుడు మింగలేక, కక్కలేక చస్తున్నాడు ఆ రోజునుంచి. వ్యూహాత్మక మౌనమా, గాడిదగుడ్డా … ఏదేమైనా మన ప్రాణాలకి హాయిగా ఉంది.

  2. 3 వేణూ శ్రీకాంత్ 9:47 సా. వద్ద ఏప్రిల్ 11, 2010

    హ హ బాగుంది, ట్యాగ్ చూసి బహుశా మీ ఈ మూడు వారాల మౌనం కూడా వ్యూహాత్మకమేనేమో దాని గురించే రాస్తున్నారేమో అనుకున్నాను 🙂 ఏదేమైనా పేర్లు పెట్టడం లో మీ తర్వాతేనండీ ఏయ్, నరుడు సూపరు.

  3. 5 కత్తి మహేష్ కుమార్ 11:15 సా. వద్ద ఏప్రిల్ 11, 2010

    మొత్తానికి మీరు మీ వ్యూహాత్మక మౌనాన్ని వీడి ఓ మంచి టపా కట్టారు. I agree with most of what you have to say in it.

  4. 6 కన్నగాడు 1:05 ఉద. వద్ద ఏప్రిల్ 12, 2010

    అన్నింటికంటే పేర్లు బాగా పెడతారండి మీరు, సినిమా హిరోల(వారస వానరులు) విషయంలో మనకింతే ప్రాప్తం అని ఏదో విధంగా సర్దుకపోతున్నాంగా హిరోయిన్లనన్నా కాస్త మంచివాళ్ళని పెడితే వాళ్ళ సోమ్మేంపోతుందో.

  5. 7 sravanthi 1:17 ఉద. వద్ద ఏప్రిల్ 12, 2010

    ఏయ్ నుండి తప్పించుకున్నాం కానీ నరుడికి దొరికిపోయానండి

  6. 8 cbrao 2:17 ఉద. వద్ద ఏప్రిల్ 12, 2010

    అయ్యో ,వరుడు (IMDb: Rated 3.0 out of 5.0) చూద్దామనుకుంటున్నానే Big Cinemas Towne 3 లో. ఇప్పుడేమి చెయ్యాలి? DVD వచ్చేదాకా నిరీక్షించాలా?

  7. 10 సునీల్ అల్లారెడ్డి 2:22 సా. వద్ద ఏప్రిల్ 13, 2010

    I read all the articles in your blog and they are really good. Looking forward for more from you. Mee companylko kuda meeku fans unnarani gurthu chestu

  8. 11 ఆంధ్రశాకము 1:07 ఉద. వద్ద ఏప్రిల్ 15, 2010

    చాలా బాగా రాసారండి.పేర్లు పెట్టడంలో మీ తరవాతే ఎవరైనా.మీ ఉద్యోగవిజయాలు నాకొక స్ఫూర్తి.

  9. 12 Chandu 2:45 ఉద. వద్ద ఏప్రిల్ 15, 2010

    Asalainaa alaanti vyooham enduku aacharinchavalasi vachhindi? Kaanee mee telivitetalaki johaarlu. Menu S.S&N college grounds lo aadetappudu, maa team lo evarainaa raanappudu memu Ravipadu nunchi maa friends ni pilipinchukune vaallam. Pratyardhi jattu lo vaallu vaalla oori vaallu koodaa undatam maaku chaalaa saarlu upayogakaram gaa undedi.

    Mee aalochana amogham. 🙂

    Chandu

  10. 13 ఉమ 1:41 సా. వద్ద ఏప్రిల్ 19, 2010

    అబ్రకదబ్ర గారు, మీ ఉద్యోగవిజయాలు చదివి మీ గొప్ప భావాలని ఎంతగానో అభిమానించాను.చందమామ మీద మచ్చలా, మీకు అంత మంచి జట్టు ఉండీ, మీరు అలాంటి మైండ్ గేమ్స్ ఎందుకు ఆడాల్సి వచ్చిందో( ఆటతో పాటు ), ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు.మీ జట్టులో సత్తా ఉన్నప్పుడు అలాంటి ఎత్తులు లేకుండానే, ధర్మ బద్ధంగా గెలవచ్చు కదా.( తేలికగా, ప్రత్యర్ధిని బలహీన పరిస్తే మీ జట్టుకి విజయం సులువు అవుతుంది అంటారా ? ) ఇంక అది మీ జట్టు సత్తాని అవమానించటమే అవుతుంది కదా ?

    మీ పోస్ట్లని చాలా వరకు చూసాను.నేను మీ అభిమానిని అని అందరికీ చెప్పుకుంటాను గొప్పగా. మంచి రచయిత అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి మీకు.ఈ పోస్ట్ ఒక్కటే కొంచెం అయోమయంగా ఉంది( స్పష్టత విషయంలో) .చాలా విషయాలు ఒక్క దాంట్లోనే చెప్పాలనుకున్నారు, అందువల్ల అనుకుంటాను. ఒక వైపు మీ ఆట గురించి, అట్నుంచి సినిమాలు, చివర్లో మీ ఆట శైలిని గుర్తు తెస్తూ , మళ్ళీ సివరాఖరున మీడియా గురించి.

    ఎందుకండీ బాబు, మీడియాకి తెలియని విషయాలు చెప్పి, అవిడియాలు ఇస్తారు.న్యూస్ చానల్స్ లో ఇదొక ఫ్లాష్ న్యూస్ ఐపోగలదు, మన ఖర్మ కాలితే.

  11. 14 ఉమ 1:42 సా. వద్ద ఏప్రిల్ 19, 2010

    ఏమిటో ఈ వర్డుప్రెస్సు లో, నా కామెంట్ పబ్లిష్ అయ్యిందా, లేదా అనేది ఎప్పుడూ ఒక కన్ఫ్యుషన్ !

    • 15 అబ్రకదబ్ర 5:11 సా. వద్ద ఏప్రిల్ 19, 2010

      ఎదుటి జట్టు బలాబలాలు అంచనా వెయ్యటానికి అదో మార్గం – అంతే. ఉద్దేశపూర్వకంగా ఒకడుగు వెనక్కి తగ్గి ప్రత్యర్ధిని బోల్తా కొట్టించటం చెస్ నుండి క్రికెట్ దాకా అన్ని ఆటల్లోనూ ఉన్నదే. ఉదాహరణకి – ఒక బౌలర్ వరసగా నాలుగైదు ఊరించే బంతులు విసిరి ఫోర్లో సిక్సులో కొట్టించుకుని, ఆ తర్వాత చక్కటి యోర్కర్/ఫ్లిప్పర్/గూగ్లీతో బ్యాట్స్‌మన్‌ని అవుట్ చేస్తే అది అధర్మం అంటారా?

      నా జట్టు ఆటగాడు అవుటయ్యాడని నేను రూఢిగా నమ్మిన సందర్భాల్లో, అది నాటౌట్‌గా అంపైర్ ప్రకటించినా నా బ్యాట్స్‌మన్‌ని బయటకు పిలిపించి ఆ నిర్ణయానికి జట్టు విజయాన్ని బలిపెట్టిన సంఘటనలున్నాయి. ఇటువంటివాటితో నా స్పోర్టివ్‌నెస్‌ని అంచనా వేయండి 🙂

  12. 16 ఉమ 3:11 సా. వద్ద ఏప్రిల్ 20, 2010

    అబ్రకదబ్ర గారు,
    మీకెవరైనా ఇష్టమైన రచయిత ఉంటే, వారితో సంభాషించటం ఎంత బాగుంటుందో తెలుసా ? నాకు తెలిసింది ! 🙂
    ఎదుటి జట్టు బలాబలాలు అంచనా వెయ్యటానికి అదో మార్గం అన్నారు. ఇది తెలుసుకోటానికే కదా, ఆట ఉండేది.అసలు ఆటకి ముందే కావాలని ఓడిపోయే ‘ఆటలు’ వల్ల, వాళ్ళని బలహీన పరచటం తప్ప, వారి అసలు బలం ఎలా తెలుస్తుంది ?
    ఇక మీరు అన్న ఉదాహరణకి – ఒక బౌలర్ వరసగా నాలుగైదు ఊరించే బంతులు విసిరి ఫోర్లో సిక్సులో కొట్టించుకుని, ఆ తర్వాత చక్కటి యోర్కర్/ఫ్లిప్పర్/గూగ్లీతో బ్యాట్స్‌మన్‌ని అవుట్ చేస్తే అది అధర్మం అంటారా? ”
    అస్సలు అనను.ఎందుకంటే,ఆట ఆరంభం అయ్యాక, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడవచ్చు,(ఆట నియమాలు ఉల్లంఘిన్చనంత వరకూ ). మీ ఉదాహరణలో అధర్మం అస్సలు లేదు. అది నిజంగా చెస్ లాగా తెలివిగా ఆడటమే అవుతుంది.కానీ, ఆట మొదలవక ముందే, ప్రత్యర్ధి జట్టుని బలహీన పరచటమే, నాకెందుకో రుచించలేదు.ఆటలో సగం విజయం, మీరు అసలు ఆట మొదలవక ముందే తెచ్చుకుంటాం అంటున్నారు.నిజంగా ఆట బయట ఇలాంటి ‘ఆటలు’ ధర్మబద్ధమే అంటారా ? అసలు అంత సత్తా ఉన్న జట్టు ఇలాంటి ‘ఆటలు’ లేకుండా గెలవచ్చు కదా ?

    అదలా ఉంచితే,
    “నాటౌట్‌గా అంపైర్ ప్రకటించినా నా బ్యాట్స్‌మన్‌ని బయటకు పిలిపించి ఆ నిర్ణయానికి జట్టు విజయాన్ని బలిపెట్టిన సంఘటనలున్నాయి. ”
    మీ స్పోర్టివ్‌నెస్‌( దీనికి తెలుగు పదం ఏమిటబ్బా ?) ని అంచనా వేసేసా ! 🙂 ఇది మెచ్చుకోటానికి నాకు మాటల్లేవు ! చప్పట్లు !

    • 17 అబ్రకదబ్ర 12:51 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2010

      >> “ఇది తెలుసుకోటానికే కదా, ఆట ఉండేది”

      Nope. అదుంది బలాబలాలు తేల్చుకోటానికి – తెలుసుకోటానిక్కాదు. ఆ రెంటికీ తేడా ఉంది.

      >> “అసలు ఆటకి ముందే కావాలని ఓడిపోయే ‘ఆటలు’ వల్ల, వాళ్ళని బలహీన పరచటం తప్ప, వారి అసలు బలం ఎలా తెలుస్తుంది?”

      ఎదుటివారిని మోసం చేసి గెలిస్తే తప్పు. ఓడిపోతే తప్పేముంది? నాయకుడిగా నా లక్ష్యం జట్టుని ప్రధాన టోర్నమెంటులో గెలిపించటం. దానికి ముందు జరిగే ముందస్తు/సన్నాహక పోటీలు (లేదా ప్రాక్టీస్ మ్యాచ్‌లు) నా వరకూ ఎదుటి జట్ల బలాబలాలు అంచనా వేయటానికీ, అసలు టోర్నమెంటుకి నా జట్టుని సిద్ధం చెయ్యటానికీ, వ్యూహాలు తయారుచెయ్యటానికీ. ఈ సన్నాహక/స్నేహ పూర్వక పోటీల్లో గెలవటం నాకు ముఖ్యం కాదు.

      ఇకపోతే, ఈ ‘కావాలని ఓడిపోవటం’ అనేది అన్నిసార్లూ జరిగేది కాదు. నా టపాలో అంతకు మించిన వివరాల్లోకి వెళ్లటం అనవసరం కాబట్టి అదంతా రాయలేదు. స్నేహపూర్వక పోటీల్లో ‘అనామక ఆటగాళ్లని’ దించటానికి నేను చెప్పిన కారణం ఒకటే కాదు. మరిన్నీ ఉంటాయి. అవన్నీ రాయాలంటే పెద్ద సీరియల్ అవుతుంది 🙂 వాటిలో ముఖ్యమైనది: మా క్లబ్‌లో ఉన్న ఆటగాళ్లందరికీ ఎప్పుడో ఒకప్పుడు కొన్ని పోటీల్లోనైనా పాల్గొనే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉండటం. ప్రధాన టోర్నమెంట్లలో పాల్గొనే స్థాయి లేని వారికి ఇటువంటి పోటీలాడే అవకాశం ఇవ్వటం ద్వారా ఒక్క దెబ్బకి రెండు పిట్టల్ని పడగొడతామన్న మాట.

      >> “అసలు అంత సత్తా ఉన్న జట్టు ఇలాంటి ‘ఆటలు’ లేకుండా గెలవచ్చు కదా ?”

      Good question. ఏ ఒకటో రెండో తప్పిస్తే, మా ప్రత్యర్ధి జట్లు తీసిపారేయాల్సినవి కావు. మెరికల్లాంటి ఆటగాళ్లు వాళ్లకీ ఉన్నారు మరి. అందుకే ఈ వ్యూహాలతో పని. వాళ్లూ తక్కువ తినలేదు. వాళ్ల వ్యూహాలు వాళ్లకుంటాయి. నేను చాలా నయం. మిగతా వాళ్ల వ్యూహాలు వింటే మీరు బెంబేలెత్తిపోతారు. అంపైర్లతో లాలూచీ పడటం దగ్గర్నుండి ఎదుటి జట్ల ఆటగాళ్లని మభ్యపెట్టటం వరకూ రకరకాల ‘ఆటలు’ ఆడినోళ్లున్నారు నాకెదురుగా.

      Btw, ఎందుకోగానీ మీ వ్యాఖ్యలు spam లోకి వెళుతున్నాయి. ప్రతిసారీ de-spam చేయాల్సొస్తుంది.

  13. 18 ఉమ 4:42 సా. వద్ద ఏప్రిల్ 20, 2010

    https://anilroyal.wordpress.com/2009/10/18/%E0%B0%95%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B8%E0%B0%A8-4/#comments

    ఇందులో కామెంట్ వేయాలని తెగ ఉత్సాహ పడ్డా, discarded అని మెసేజ్ వచ్చింది వర్డుప్రెస్సు నుంచి. ఆశ్చర్యంగా ఉంది.

  14. 19 Rishi 10:31 సా. వద్ద ఏప్రిల్ 20, 2010

    chaalaa baagundi. inni roojuloo manchi blog okati miss ayyaanananmaata.

  15. 20 రమణ 1:12 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2010

    అబ్రకదబ్ర గారు,
    ఆసక్తి కొద్దీ అడుగుతున్నాను. రంజీలు, కౌంటీలు ఆడిన వాళ్ళు మీ టీమ్ లో ఉన్నారన్నారు కదా!, అంటే మాజీ ఆటగాళ్లు అక్కడ సెటిల్ అయిన వాళ్ళా ? మీరు కూడా రంజీ/జిల్లా స్థాయిల్లో ఏమైనా ఆడారా? ఒకవేళ కాకపోతే ఆటగాళ్ల మధ్య ఈగోలు ఉంటాయి కదా ! అవి ఎలా నెగ్గుకొచ్చారు?
    మీకు అభ్యంతరం లేకపోతే మీ జట్టు ఆటగాళ్ల పేర్లు చెప్పండి. క్రికెట్ అంటే ఆసక్తి అంతే.

    • 21 అబ్రకదబ్ర 2:06 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2010

      నేను యూనివర్శిటీ స్థాయి దాటలేదు. అంతకన్నా ముందుకెళ్లే ఆట, ఆసక్తి రెండూ నాకు లేక అక్కడే ఆగిపోయాను. ఇక నా జట్టులో ఆటగాళ్లంటారా. పేర్లు చెప్పినా మీరు గుర్తు పట్టగలిగేవాళ్లు ఎవరూ ఉండకపోవచ్చు. ఇద్దరు ముగ్గురు పంజాబ్ జట్టులో ఆడిన సర్దార్జీలు, ఆంధ్రా జట్టు మాజీ సభ్యుడొకడు ఉండేవారు. కౌంటీ ఆటగాడు ఒకతనుండేవాడు (ఇతను గుజరాత్‌లో పుట్టి ఇంగ్లండ్‌లో పెరిగిన భారతీయుడు. నేను చూసిన వాళ్లలో అత్యద్భుతమైన, అరి వీర భయంకరమైన ఫాస్ట్ బౌలర్). ఇంకా ఒకతను కరిబియన్ దేశవాళీ పోటీల్లో అడిన వ్యక్తి. వీళ్లంతా ఆటని కెరీర్‌గా ఎంచుకున్నవాళ్లు కారు. So, they quit domestic cricket after a few seasons – or perhaps they didn’t have enough game in them to make it all the way up. Whatever their reasons are, I’m honoured to have them in my team. ఇక ఈగోలంటారా – అవి లేకుండా ఎలా ఉంటాయి? అందరికీ కాకున్నా కొందరికా సమస్యుండేది. అదృష్టవశాత్తూ అవేవీ మా జట్టులో చీలికలు తెచ్చేదాకా వెళ్లలేదు.

      నా ప్రత్యర్ధి జట్లలో సైతం మహామహులుండేవారు. అవన్నీ గొప్ప రోజులు. ఇప్పుడా స్థాయి ఆట మానేసి ఐదారేళ్లయింది. ఏదో మీడీయానీ, సినిమాలనీ వెటకరిస్తూ టపా రాసి ఉపోద్ఘాతంగా నా క్రికెట్ గతం నెమరేస్తే ఊరుకోకుండా మీరూ, ఉమగారూ కలిసి ప్రశ్నల మీద ప్రశ్నలేసి నేను మర్చిపోతున్న క్రికెట్ hey days ని మళ్లీ గుర్తు చేశారు 🙂 కొన్నాళ్ళుగా నాకు వచ్చీ రాని టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాను. ఇహ లాభం లేదు. మళ్లీ అసలు సిసలు క్రికెట్ బంతి పట్టాల్సిందే. దెబ్బలెన్ని తగిలినా, అందులో మజా ఈ టెన్నిస్ బాల్ క్రికెట్‌లో ఎక్కడిది?

  16. 22 ఉమ 11:59 ఉద. వద్ద ఏప్రిల్ 21, 2010

    అబ్రకదబ్ర గారూ, “అదుంది బలాబలాలు తేల్చుకోటానికి – తెలుసుకోటానిక్కాదు” – భలే చెప్పారు ! 🙂

    >>అవన్నీ రాయాలంటే పెద్ద సీరియల్ అవుతుంది
    మీరు నిజంగా ఆ సీరియల్ ఏదో రాస్తే బాగుండును ! 🙂 మీ hay days చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

    >>మిగతా వాళ్ల వ్యూహాలు వింటే మీరు బెంబేలెత్తిపోతారు.
    హ్మ్మం,అయితే అందరూ కలిసి, క్రికెట్ ని outdoor చెస్ కింద మార్చేసారు అన్నమాట. 😉
    అలాంటి వ్యూహాలు నా మీద ప్రయోగించి ఉంటే, బెంబేలెత్తి పోయేదాన్నేమో, వినటానికేం ? చెప్తాను అంటే మీదే ఆలస్యం, తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా, కుతూహలంగా ఉంది. 🙂

  17. 23 Indrasena Reddy 6:46 ఉద. వద్ద ఏప్రిల్ 22, 2010

    అబ్రకదబ్ర గారు మీ బ్లాగు చాల్లా బాగుందండి.ఇన్నాల్లు ఎందుకు చూడలేదా అని విచారిస్తున్నా. కూడలి లొ ఎదో గోడు లాగ కనిపిస్తే ఒవెర్ లుక్ లొ వదిలెస్తున్న.మీ బ్లాగు కి మంచి పెరు పెట్టండి సార్.ఇది నా సలహా మాత్రమె. నొ ఒఫ్ఫెన్సె.


  1. 1 Tweets that mention Telugu blogs వ్యూహాత్మకం: కొన్నేళ్లుగా మన మీడియా జనుల పుణ్యాన ఓ కొత్త రాజకీయ పదబంధం ప్రచారంలోక 8:50 సా. వద్ద ఏప్రిల్ 12, 2010 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: