ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 9

తొమ్మిదో అబద్ధం:

ఆంధ్రోళ్లు దోపిడీదార్లు

ఇదీ నిజం:

స్వతంత్రం వచ్చీ రాగానే జాతి సౌభాగ్యం కోసమంటూ పంచవర్ష ప్రణాళికా సంకల్పాలు చెప్పుకున్న దేశం మనది. ఆ జాబితాల్లో రాసుకున్నవీ, రాసుకోనివీ, ఇతరత్రా సవాలక్ష వంటకాలు సక్రమంగా వండబడుతున్నాయో లేదో, వండినవి సరిగా వడ్డించబడుతున్నాయో లేదో చూట్టానికి కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వేలాదిమంది చట్ట సభల సభ్యుల్ని ఎన్నుకోటానికీ, అలా ఎన్నికైనోళ్లలో పని దొంగల్ని తన్ని తగలెయ్యటానికీ ఐదేళ్లకోమారు భూమ్మీద మరే దేశంలోనూ లేనంత భారీ ఖర్చుతోనూ, శ్రమతోనూ ఎలక్షన్ల మహాయజ్ఞాన్ని తలకెత్తుకుని ఆర్భాటంగా అమలు చేస్తున్న దేశమూ మనదే. ఈ సువిశాల కర్మభూమిలో ఏడాది పొడుగునా ఏదో ఓ మూల చిన్నదో పెద్దదో ఎన్నికల క్రతువొకటి జరుగుతూనే ఉంటుంది. ఈ తంతంతా దేనికి? నాయకులు ఎక్కడికక్కడ తాము ప్రాతినిధ్యం వహించే ప్రజల పక్షాన పోరాట్టానికి. దానికి అవసరమైనదేంటి? జన పక్షపాతం. కానీ మన నాయకుల్లో ఉన్నదల్లా స్వార్ధం, స్వజన పక్షపాతం. లేనేలేనిది జవాబుదారీతనం. మరి మళ్లీ ఎన్నికల్లో నెగ్గుకు రావటమెలా? అదో సమస్యైతే కదా. ఓటర్లని ఎంతగా అజ్ఞానంలో ఉంచితే వాళ్లని అబద్ధాలతో ముంచెత్తటం అంత తేలిక. స్వతంత్రం వచ్చేనాటికి దేశంలో వెనకబడ్డ ప్రాంతాలు ఇప్పటికీ వెనకబడే ఉండటానికి కారణం అదే. తెలంగాణైనా, ఉత్తరాంధ్రైనా, బీహారైనా .. ప్రాంతమేదైనా ప్రజల వెనకబాటుదనమే అడ్డగోలు దోపిడీలకి తెగబడే రాజకీయ నాయకులకి ఐదేళ్లకోసారి శ్రీరామరక్ష, ఓటు భిక్షేసే అక్షయపాత్ర.

వెనకబడి ఉన్నోడికి ముందుకెళ్లినోడిపై కడుపు మండేలా చెయ్యటం, వాడినో దోపిడీదారుడిగా చిత్రీకరించి తమ పబ్బం గడుపుకోవటం నేటి తరం నేతలకి వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యలో రెండాకులు ఎక్కువ చదివినోళ్లు తెలంగాణ వేర్పాటువాద సృష్టికర్తలు, సిద్ధాంతకర్తలు, వాళ్ల తోకలైన మేధావి మూకలు. జనహితం ముసుగులో వీళ్లు రేపెట్టే ఉద్యమాల వెనక ఎవరి జెండాలూ, అజెండాలూ వారికున్నాయి. ప్రజలు తమకప్పగించిన పని సక్రమంగా చెయ్యకుండా – తమ అసమర్ధ నిర్వాకాల నుండీ అవినీతి భాగోతాల నుండీ ఓటర్ల దృష్టి మళ్లించటానికీ, పనిలో పనిగా స్వీయ ప్రయోజనాలని ఓ కాపు కాసుకోటానికీ ఈ నేతల చేత నేయబడి తెలంగాణలో విరివిగా చెలామణిలోకి తేబడ్డ అభియోగమే ఆంధ్రావాళ్లు దోపిడీదారులనే దారుణమైన అబద్ధం. దాన్ని వాళ్లెంత పకడ్బందీగా ప్రచారం చేశారో తెలిస్తే గోబెల్స్ సైతం విస్తుపోవటం ఖాయం.

అశ్వత్థామ హతః అంటూ ఎలుగెత్తి చాటి ఆనక కుంజరః అని తనలో తను గొణుక్కున్న అధర్మరాజుకి తీసిపోని తెలివితేటలు వేర్పాటువాదుల సొంతం. ఆంధ్రావాళ్లందరూ దోపిడీదార్లనే అర్ధంలో ఎడాపెడా రెచ్చగొట్టే ప్రసంగాలూ, వ్యాఖ్యలూ చెయ్యటం, అదేమంటే ‘అబ్బే .. అది అందరికీ కాదు, కొందరికే వర్తించే విషయం’ అంటూ ముక్తాయించటం. ఈ లోగా వాళ్ల సందేశం చేరాల్సిన చోట్లన్నిట్లోకీ నిక్షేపంగా చేరిపోయింది, వాళ్లాశించిన ఫలితాలు సైతం తేవటం మొదలెట్టిందనేదానికి సాక్ష్యాలే – తెలంగాణలో కోస్తా పేర్లని పోలిన ఊళ్ల పేర్లు మార్చేసే విపరీత పోకడలు, రాష్ట్ర రాజధానిలో కోస్తా రిజిస్ట్రేషన్లున్న వాహనాల్ని ధ్వంసం చేసే ఉన్మాద చర్యలు, పండక్కి స్వగ్రామాలకెళ్లినోళ్లని తిరిగి రానీయమనే బెదిరింపు ప్రకటనలు (ఆ తర్వాత ఏవో వెన్నపూసే మాటలన్నారు కూడా కదా అంటూ వెనకేసుకొచ్చేవాళ్ల కోసం: మిమ్మల్నెవరన్నా నాలుగు తన్ని ఆ తర్వాత టించర్ రాసి పంపితే మురిసిపోతారా?). అదిలించో బెదిరించో అదుపులోకి తెచ్చుకున్న మెయిన్‌స్ట్రీమ్ మీడియా అండతో, గజ్జెకట్టి చిందులేసే కుహనా విప్లవకారుల చిడతల చప్పుళ్లతో, కాలం చెల్లి బూజు పట్టిన భావజాల పడికట్టు పదాల గారడీలతో కనికట్టు చేసే కవుల కలాల దన్నుతో, జనమెన్నడో మరిచిపోయిన చిన్నాచితకా రచయితల రాతల ఊతంతో, పల్లె పల్లెలో కరపత్రాలూ, పుస్తకాలూ, వాల్‌పోస్టర్లతో అదే పనిగా ఆంధ్రావాళ్లు దోపిడీదారులని ఊదరగొడుతూ చేసిన అసత్య ప్రచారం – తెలంగాణవ్యాప్తంగా వేర్పాటువాదులు ఏళ్లుగా ఓ పద్ధతి ప్రకారం అమలు చేసిన వ్యూహం. వీళ్లకి తోడుగా, పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్లే విద్యార్ధుల్ని పెడతోవ పట్టిస్తూ చాపకింద నీరులా విశ్వవిద్యాలయాల సాక్షిగా సాగించిన అదనపు ప్రచారం – ఈ మధ్యనే వెలుగు చూసిన నిజం.

ఈ బాపతు ప్రొఫెసర్లలో ఆంధ్రావాళ్లంటే అకారణద్వేషం నరనరానా నిండిపోయిన ఒకానొక ప్రబుద్ధుడిని వేర్పాటువాదుల జేఏసీకి పెద్దదిక్కుగా పెట్టుకుంటే ఆ దొర నిన్నో మొన్నో  ‘ఆంధ్రోళ్ల ఆస్థులెన్నెన్నో లెక్కలు కడతాం, డొక్కలు చీరేస్తాం’ అంటూ ఆవులించాడు. ఒక్క ఆంధ్రావాళ్లవే కాకుండా, అయ్యవారు పనిలో పనిగా ప్రాంతాలవారీగా ఎవరెవరు ఎంతెంత కూడేసుకున్నారో కూడా కూపీల్లాగి అశేష ప్రజానీకం ముందర పెడితే వద్దనేదెవరు? ఆ పని చెయ్యటానికి అడ్డొచ్చేదెవరు? తెలంగాణ ప్రాంతంలో (అనగా హైదరాబాదులో) పెట్టుబడులన్నీ ఆంధ్రావారివే ఐనట్లూ, తెలంగాణవారూ, తమిళులూ, మార్వాడీలూ, మరాఠీలూ, బెంగాలీలూ, అంబానీలూ .. మరెవరూ అక్కడ వ్యాపారాలు చేసుకోనట్లూ – చేసుకున్నా వారందరూ నిఖార్సైన నీతిపరులే ఐనట్లూ – ఒక్క ఆంధ్రావారిపైనే ఈ ప్రత్యేక దృష్టేల? వారొక్కరిపైనే దోపిడీదార్లనే ముద్రేల?

తల బద్దలు కొట్టుకోవాల్సినంత బ్రహ్మరహస్యమేమీ దాగిలేదు దాని వెనక. పక్క రాష్ట్రం నుండొచ్చి వ్యాపారాలు చేసుకునేవారిపై దోపిడీదార్లనే ముద్రేసి ఆ వంకతో రాష్ట్రం చీల్చమంటే దేశమంతా నవ్విపోతుంది; పార్లమెంటులో పరాయి రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలేవీ సహకరించవు. అదే – తోటి తెలుగువాళ్లపై కల్లబొల్లి మాటలు చెప్పి కళ్లనీళ్లు పెట్టుకుంటే సానుభూతి వెల్లువెత్తుతుంది, పార్లమెంటులో పప్పులుడికుంచుకునే అవకాశమూ అంతో ఇంతో ఉంటుంది. అన్నదమ్ముల్ని విడగొట్టాలంటే వాళ్లిద్దరి మధ్యే కదా చిచ్చు పెట్టాల్సింది – అలా కాకుండా పొరుగింటి పుల్లయ్యతో తంపులు పెడితే జరిగేదేమిటి? అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఏకమై పుల్లయ్య పని పడతారు. మరి నేతల పనులయ్యేదెలా? తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యాలంటే సాటి తెలుగువారి మీదనే కదా నిందలేయాల్సింది – బయటివారిపై వేస్తే రాష్ట్రమెలా చీలుతుంది? అదీ అసలు సంగతి. అందుకే నదీజలాల నుండి నైజాములో పొలాల దాకా, రాజధానిలో స్థలాల నుండి రాష్ట్ర ప్రభుత్వోద్యోగాల్లో కోటాల దాకా ప్రతి విషయాన్నీ వివాదాస్పదం చెయ్యటం, ప్రతిదానికీ తెలంగాణ వెనకబాటుదనంతో ముడిపెట్టటం, చివరాఖరికి వాటన్నిట్లోనూ ఏకైక లబ్దిదారులుగా ఆంధ్రావారిని తేల్చటం, వాళ్లపై దోపిడిదారులనే ముద్రేయటం. ఇవన్నీ లొసుగులు లేని విషయాలా అంటే కానే కాదు – మనదేశంలో లొసుగుల్లేకుండా అమలయ్యేదేమున్నది గనక? కానీ వాటన్నిట్లోనూ నాణానికి ఒక వైపే చూపించి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టటం వేర్పాటువాదుల చాతుర్యం. స్థలాలైనా, జలాలైనా, మరేవైనా .. వాటివల్ల తెలంగాణకి కలిగిన ఉపయోగాలూ ఉన్నాయి. వాటి గురించి మాత్రం నోరెత్తే వేర్పాటువాది ఒక్కడూ ఉండడు.

మొదట్లోనే చెప్పుకున్నాం – చట్టసభల సభ్యుల అవసరమేంటో, వాళ్లకి ఎన్నికల్లో జనాలు ఓట్లేసి గెలిపించిన పరమార్ధమేంటో. పరీక్ష ఫెయిలై ఇంటికొచ్చిన పిల్లాడు మేస్టారు పాఠం సరిగా చెప్పలేదనో, పేపర్ అవుటాస్ సిలబస్ ఇచ్చారనో, ఇన్విజిలేటర్ మరీ స్ట్రిక్ట్‌గా ఉన్నాడనో, మరోటనో వంక చెప్పినట్లుంది తెలంగాణ వెనకబాటుదనానికి ఆంధ్రావారిపై వేలెక్కుపెట్టటం. సరే, ఆంధ్రావాళ్లు దోపిడీదార్లనే అనుకుందాం. మరి ఇన్నేళ్లుగా ఈ నేతలంతా మొద్దు నిద్ర పోతున్నారా? అరవయ్యేళ్లుగా తెలంగాణలో ఏ నాయకుడూ ఆంధ్రా దోపిడీదారుల దురాగతాలకు బలై కొంపా గోడూ అమ్ముకున్న దురంతాలో, పిల్లా జెల్లా సమేతంగా వీధిన పడ్డ భాగోతాలో జరిగాయనటానికి దాఖలాల్లేవు. వేర్పాటువాద పల్లవందుకున్న రాజకీయ నాయకులందరి చరిత్రలూ తిరగేస్తే – మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రక రకాల పదవులు దశాబ్దాలుగా వెలగబెట్టి కోటానుకోట్లు పోగేసుకున్న వాళ్లే అంతా. సొంత లాభాలు చూసుకునేప్పుడు అడ్డు రాని ఆంధ్రా దొంగలు ఓటర్లకి మొహం చూపించాల్సొచ్చినప్పుడు మాత్రం ఆదుకోటానికి ఎక్కడున్నా లగెత్తుకొస్తారు!

అది – అధికారం అనుభవించినన్నాళ్లూ కనుమరుగైన తెలంగాణ నిర్భాగ్యం పదవి ఊడిన క్షణానే కళ్లలో పడ్డ మందుబాబు కావచ్చు, మంది సొమ్ముని విందు భోజనంలా సకుటుంబ సపరివార సమేతంగా భోంచేసి ఆనక తీరిగ్గా సొమ్ములు పోనాయి ఏటి సేద్దామంటూ తేన్చేసినప్పుడు గుర్తులేని ఉత్తరాంధ్ర దౌర్భాగ్యం గురించి తాజాగా జ్ఞానోదయమైన మహానుభావుడు కావచ్చు – ఇంత విచ్చలవిడిగా పచ్చి అబద్ధాలతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టబూనే ధైర్యం వీళ్లకెక్కడి నుండొచ్చింది? అంత తెగింపు ఎవరిస్తున్నారు వీళ్లకి?

సమాధానం మనలోనే ఉంది. మన సమాజపు పునాదుల్లోనే ఉంది. ఆడలేక మద్దెల ఓడని పాత తెలుగు సామెత. అటూ ఇటూగా అలాంటివే భారత దేశంలో అన్ని భాషల్లోనూ ఉండే ఉంటాయి. ఎందుకంటే, మన చేతగానితనానికి ఎవడినో నిందించటం సిసలైన భారతీయ సంప్రదాయం. దీని సాధనలో తరాలకు తరాలే తరించటమనేది తెలంగాణకో, తెలుగునాటికో, తమిళనాడుకో మాత్రమే పరిమితమైన గుణం కాదు. అదొక జాతీయ లక్షణం. జాతుల గుణగణాల్లోంచి కాక గాల్లోంచి పుడతాయా జాతీయాలు? మరి సదరు గుణాన్ని సొమ్ము చేసుకోటానికి ముందుండేదెవరయ్యా అంటే .. ఇంకెవరు, మన మహా నేతలే. మన మేడిపండు ప్రజాస్వామ్యంలో యధా ప్రజా, తధా రాజా. నీతిమాలిన నేతలు జాతివైరాలూ, జ్ఞాతివైరాలూ రెచ్చగొట్టి తెచ్చిపెట్టిన మహా ప్రపంచ యుద్ధాలు మానవాళికి చేసిన చేటేమిటో చరిత్రలో చదువుకున్నాం. వాటి నుండి పాఠాలు నేర్చుకుందాం. జాతీయ లక్షణం జాతీయ విపత్తుగా మారక ముందే మేలుకుందాం.

(సశేషం)

47 స్పందనలు to “ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 9”


 1. 1 Srinivas 10:45 సా. వద్ద మార్చి 3, 2010

  You deserve applause for such a detailed explanation. I am not against Telengana but It is just a maniac situation created by unemployed political buffoons which made them successful at this point of time. Everyone who wants Telengana because of Andhra people robbed them should go back a step ask themselves what did the politicians do for them all these years?

 2. 2 Surya 11:21 సా. వద్ద మార్చి 3, 2010

  Good one!! I like the first point that you mentioned. Basically it is the lack of peoples empowerment, the reason for the backwardness of the region. Good examples are Bihar and Uttar Pradesh.

  It’s the same lack of empowerment which makes these people as tools and weapons in the hands of selfish leaders. The way these 2 states came into the hands of the Yadavs and other(Mulayam, Lalu, Mayawati). They used peoples weakness to capture power and abused them even further. We all know what happened and what is happening in these 2 states. These 2 main centers of our medieval India are pushed back utterly into backwardness.

  Coming to our state, drought and farmers suicides during TDP’s rule what made people helplessly gravitate towards KCR(separate Telangana). With receding drought, Telangana sentiment also receded. It was proved again and again with KCR loosing strength from election to election. But dirty politics played by power hungry leaders complicated the matters and brought it to this level.

  The so called మేధావులు(some of them) doesn’t have any selfish motives behind what they do. They just enjoy making mess in the society. Some of them should be living in jungles and are not really fit people to be living amongst us.

  Looking at the way Kodandaram running this agitation, it looks like he is completely disconnected from the times we live in.

 3. 3 శ్రీవాసుకి 11:29 సా. వద్ద మార్చి 3, 2010

  నిజంగా ఈ టపా అదిరింది. ఇప్పుటివరకు వ్రాసిన వాటిలో నాకు ఇదే గొప్పగా అనిపిస్తోంది. మీరు వ్రాసిన చాలా విషయాలు యదార్ధాలే.

  >>తెలంగాణైనా, ఉత్తరాంధ్రైనా, బీహారైనా .. ప్రాంతమేదైనా ప్రజల వెనకబాటుదనమే అడ్డగోలు దోపిడీలకి తెగబడే రాజకీయ నాయకులకి ఐదేళ్లకోసారి శ్రీరామరక్ష, ఓటు భిక్షేసే అక్షయపాత్ర.

  >>తమ అసమర్ధ నిర్వాకాల నుండీ అవినీతి భాగోతాల నుండీ ఓటర్ల దృష్టి మళ్లించటానికీ, పనిలో పనిగా స్వీయ ప్రయోజనాలని ఓ కాపు కాసుకోటానికీ ఈ నేతల చేత నేయబడి తెలంగాణలో విరివిగా చెలామణిలోకి తేబడ్డ అభియోగమే ఆంధ్రావాళ్లు దోపిడీదారులనే దారుణమైన అబద్ధం.

  >>గజ్జెకట్టి చిందులేసే కుహనా విప్లవకారుల చిడతల చప్పుళ్లతో, కాలం చెల్లి బూజు పట్టిన భావజాల పడికట్టు పదాల గారడీలతో కనికట్టు చేసే కవుల కలాల దన్నుతో, జనమెన్నడో మరిచిపోయిన చిన్నాచితకా రచయితల రాతల ఊతంతో, పల్లె పల్లెలో కరపత్రాలూ, పుస్తకాలూ, వాల్‌పోస్టర్లతో అదే పనిగా ఆంధ్రావాళ్లు దోపిడీదారులని ఊదరగొడుతూ చేసిన అసత్య ప్రచారం.

  >>అశ్వత్థామ హతః అంటూ ఎలుగెత్తి చాటి ఆనక కుంజరః అని తనలో తను గొణుక్కున్న అధర్మరాజుకి తీసిపోని తెలివితేటలు వేర్పాటువాదుల సొంతం. ఆంధ్రావాళ్లందరూ దోపిడీదార్లనే అర్ధంలో ఎడాపెడా రెచ్చగొట్టే ప్రసంగాలూ, వ్యాఖ్యలూ చెయ్యటం, అదేమంటే ‘అబ్బే .. అది అందరికీ కాదు, కొందరికే వర్తించే విషయం’ అంటూ ముక్తాయించటం.

  >>‘ఆంధ్రోళ్ల ఆస్థులెన్నెన్నో లెక్కలు కడతాం, డొక్కలు చీరేస్తాం’ అంటూ ఆవులించాడు. ఒక్క ఆంధ్రావాళ్లవే కాకుండా, అయ్యవారు పనిలో పనిగా ప్రాంతాలవారీగా ఎవరెవరు ఎంతెంత కూడేసుకున్నారో కూడా కూపీల్లాగి అశేష ప్రజానీకం ముందర పెడితే వద్దనేదెవరు?

  ఇప్పుడు సదరు ప్రొఫెసర్ గారు పరీక్ష పేపర్లు కూడా ప్రాంతాల వారీగా దిద్దాలని సెలవిచ్చారు. తెలంగాణాకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు. ఈయనగారి మట్టి బుర్రలో ఇంకెన్ని ఆలోచనలున్నాయో. వీళ్ళ దిక్కుమాలిన రాజకీయం అఖరికి చదువుల మీద కూడా పడింది.

 4. 4 zulu 11:54 సా. వద్ద మార్చి 3, 2010

  ఈ సిరీస్ చూసి ఒక్క 100 మంది ఆలోచించినా మీరు రాసిన దానికి ప్రతిఫలం ఉంటుంది అని నా అభిలాష. మిత్రులారా, తెలంగాణా సోదరులారా, ఆలోచించండి. ఈ కుహనా రాజకీయ నాయకుల పీచ మనచండి. జై ఆంధ్ర ప్రదేష్. నా తెలుగు గొప్పది. తెలుగు జాతి మనది. నిండుగ వెలుగు జాతి మనది.

 5. 5 KV 11:58 సా. వద్ద మార్చి 3, 2010

  కన్న తల్లి మీద పుట్టిన నేల మీద సహజంగా ఉండే ఉద్వేగాలని రెచ్చగొడుతూ ఈ అవకాశవాద, స్వజన పక్షపాత, వేర్పాటువాద రాజకీయ రాబందులాడే విద్వేష క్రీడా వినోదం లో సమిధలవుతున్న సాదారణ ప్రజల అకాంక్షలు నెరవేరే రోజు, రోజు రోజుకూ దూరమైపోతుంది.
  ఆఖరికి ఒక పదవ తరగతి పిల్లవాడు తన పరీక్ష పేపరు వేరే ప్రాంతం వాళ్లు దిద్దకూడదంటున్నాడంటే, ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తున్న ఈ పసి మనసుల్లో కూడా ఎన్ని అపోహలు నింపారో అర్దమవుతోంది
  పదవి కోసం ఇన్ని నీచాలు చేసే ఈ రాజకీయ నాయకుల్ని ఏంచేసినా పాపం లేదు.

  • 6 WitReal 8:40 ఉద. వద్ద మార్చి 5, 2010

   పదో తరగతి – పసి మనసులా??

   మీరింకా సూడనట్టుంది…
   అదేదో బళ్ళో, మూడో తరగతో లేక ఐదో తరగతొ బుడ్డోళ్ళ చేత పరీక్ష పేపర్ల మీద “తెలంగాణా కావాలి” అని వ్రాయించారు

   చిన్న పిల్లలు కూడా తెలంగాణ కోరుకుంటున్నారు అని, బుర్ర లేని టీవి చానెళ్ళూ వంత పాడాయి!

 6. 7 krishna 12:08 ఉద. వద్ద మార్చి 4, 2010

  నన్ను చాలా రోజులు నుండి పట్టి పీడిస్తున్న ఒక సందేహంకి మీ ఈ టపా లో సమాదానం దొరుకుతుంది అని ఆశించాను.బహుశా మునుపటి టపాల వల్ల పెరిగిన ఆకాంక్షల వల్ల ఈ టపా నన్ను నిరుత్సాహ పరిచింది అనే చెప్పలి.శ్రీ వాసుకు గారు మీ తో నేను విభేదిస్తున్నా!! హైదరాబాద్ మీద సీడెడ్ మరియు సర్కార్ జిల్లాల హక్కు ఎంతో వివరించిన క్రిందటీ టపా అత్త్యుత్తమం నా దృష్టి లో!! ఇక నా సందేహం ఏమిటంటే తెలంగాణ నాయకులు ఆంధ్రోల్లనె ఎందుకు లక్ష్యం గా చేసుకుంటున్నారు? సీమ ప్రజల మీద వారు విషం కక్కడం లెదు కదా?అలాగె ఆంధ్రోల్లు దోపిడిదారులు అయితే సీమోల్లను మటుకు ఉపేక్షిస్తారా? వాళ్ళు ఎందుకు ఆంధ్రోల్లను ఆడిపొసుకోరు?

  • 8 శ్రీవాసుకి 7:06 ఉద. వద్ద మార్చి 4, 2010

   >>తెలంగాణ ప్రాంతంలో (అనగా హైదరాబాదులో) పెట్టుబడులన్నీ ఆంధ్రావారివై ఐనట్లూ, తెలంగాణవారూ, తమిళులూ, మార్వాడీలూ, మరాఠీలూ, బెంగాలీలూ, అంబానీలూ .. మరెవరూ అక్కడ వ్యాపారాలు చేసుకోనట్లూ – చేసుకున్నా వారందరూ నిఖార్సైన నీతిపరులే ఐనట్లూ – ఒక్క ఆంధ్రావారిపైనే ఈ ప్రత్యేక దృష్టేల? వారొక్కరిపైనే దోపిడీదార్లనే ముద్రేల?

   కృష్ణ గారు, మీ వరకు ఇది నచ్చకపోవచ్చు. నా దృష్టిలో ఈ తొమ్మిది టపాలు దేనికదే విభిన్నమైనవి. 50 ఏళ్ళ తెలంగాణ ఉద్యమం అంటూనే “ఆంధ్రోళ్లు దోపిడీదార్లు” అనే మాటతో ఆ ప్రాంత నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కేవలం ఈ అంశంతోనే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రస్తుత వర్తమాన పరిస్థితులకు ఇది సరిపోతోంది.

   • 9 krishna 12:15 సా. వద్ద మార్చి 4, 2010

    >>తెలంగాణ ప్రాంతంలో (అనగా హైదరాబాదులో) పెట్టుబడులన్నీ ఆంధ్రావారివై ఐనట్లూ, తెలంగాణవారూ, తమిళులూ, మార్వాడీలూ, మరాఠీలూ, బెంగాలీలూ, అంబానీలూ .. మరెవరూ అక్కడ వ్యాపారాలు చేసుకోనట్లూ – చేసుకున్నా వారందరూ నిఖార్సైన నీతిపరులే ఐనట్లూ – ఒక్క ఆంధ్రావారిపైనే ఈ ప్రత్యేక దృష్టేల? వారొక్కరిపైనే దోపిడీదార్లనే ముద్రేల?

    ఈ ప్రశ్న కి సమాదానం కోసమే నేను చూస్తుంది? అది ఈ టపా లో లేదని నా ఉద్దేశ్యం.మిగిలిన టపాలతో పోలిస్తె ఇదే ఈ టపాని అసంపూర్ణం గా చేస్తుంది అనిపిస్తుంది.మిగిలిన ప్రతి టపాలో కారణాలను పేర్కొంటు వివరణ వుంటే ఇందులో కేవలం ఒక వాదన మటుకు కనిపిస్తుంది.దాని ని బలపరిచె కారణాలు కూడా అబ్రకదబ్ర గారు అందిస్తారని ఆశిస్తున్నాను.బహుశా నా ఆపేక్షలు బాగా పెరిగిపొవడం వలన(ముందటి టపాల వలన) ఇలా అనిపిస్తుంది ఏమో? నేను తప్పు కావచ్చు!!!

  • 10 WitReal 8:43 ఉద. వద్ద మార్చి 5, 2010

   I agree with krishna.

   this post is more of hot air & less of facts based reasoning.

   emotions are not good for logical rasoning

 7. 11 iamharish 6:44 ఉద. వద్ద మార్చి 4, 2010

  పచ్చగా కనిపించే పొలాలు కోస్త లో ఉన్నాయి కనుక
  కానీ ఆ పచ్చటి పొలాలలో పురుగుల మందు తాగి చచ్చిపోయే రైతులు కోస్త లోను ఉన్నారని చాల మందికి తెలియకపోవచ్చు
  చల్లని గోదారి, కృష్ణమ్మల నీళ్ళు నిండుగా కనిపించేది కోస్తాలో కనుక
  కానీ ఆ నదుల తియ్యటి నీరు పారే చోటనే నెల నీటి లో ఫ్లోరినే కంటెంట్ కూడా ఉందని చాల మందికి తెలియకపోవచ్చు
  హైదరాబాద్ లో సెటిల్ ఐన కోస్తా కోటీశ్వరులు కంటి ముందు కనిపిస్తున్నారు కనుక
  కానీ పూటకి తిండి కూడా లేని మనుషులు కూడా కోస్తాలో ఉన్నారని చాలా మందికి తెలియకపోవచ్చు

 8. 12 kanred 7:45 ఉద. వద్ద మార్చి 4, 2010

  nenaithe oka udyamam – anni abhaddhaley antaanu…………..

  ramakanth

 9. 13 Faustin Donnegal 10:39 ఉద. వద్ద మార్చి 4, 2010

  పక్క రాష్ట్రం నుండొచ్చి వ్యాపారాలు చేసుకునేవారిపై దోపిడీదార్లనే ముద్రేసి ఆ వంకతో రాష్ట్రం చీల్చమంటే దేశమంతా నవ్విపోతుంది; పార్లమెంటులో పరాయి రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలేవీ సహకరించవు. అదే – తోటి తెలుగువాళ్లపై కల్లబొల్లి మాటలు చెప్పి కళ్లనీళ్లు పెట్టుకుంటే సానుభూతి వెల్లువెత్తుతుంది,

  U rock 🙂

  Waiting impatiently for the next one.

 10. 14 Jagan 10:47 ఉద. వద్ద మార్చి 4, 2010

  ధూ అని ఉమ్మినా సిగ్గు ఉండదు మీకు. ఎందుకురా సమైఖ్యం?

  • 15 అబ్రకదబ్ర 12:10 సా. వద్ద మార్చి 4, 2010

   ఏవో మా తిప్పలు మావి. మా దారిన మమ్మల్నొదిలేసి ఆకాశమ్మీదకి ఉమ్మేసే పనిలో మునిగితేలు బాసూ.

   • 16 krishna 12:21 సా. వద్ద మార్చి 4, 2010

    అబ్రకదబ్ర గారు నా ప్రశ్న మీకే!!! పనిలో పనిగా శ్రీ వాసుకి గారికి నా అభిప్రాయం చెప్పానంతే!! మీరు ఇది మా ఇద్దరి మధ్య వాదనలెమ్మని వూర్కుండిపోవద్దండీ:-)

   • 17 అబ్రకదబ్ర 1:18 సా. వద్ద మార్చి 4, 2010

    నాలుగో పేరా చివరి ప్రశ్నకి ఆ కింది పేరాలోనే సమాధానం ఉంది కదా. మీరెలా మిస్సయ్యారు!

    మిగతా టపాల్లో ఉన్నట్లు ఆధారాలు, గణాంకాలు వగైరా ఇక్కడ లేకపోవటం వల్ల మీకిది అసంపూర్ణంగా అనిపించుండొచ్చు. నా వరకూ – ఈ తొమ్మిదో టపా కొంత ప్రత్యేకమైనది. అది తెలంగాణ ఉద్యమానికి మాత్రమే వర్తించేది కాదు.

    దుర్మార్గులకీ, దొంగలకీ, దోపిడీదార్లకీ కుల, మత, ప్రాంతీయ తారతమ్యాలుండవు. వాళ్లు అన్ని చోట్లా ఉంటారు. లేకుంటే – ప్రపంచంలో గొళ్లాలూ, తాళాల అవసరం లేని లోగిళ్లున్న దేశం ఒక్కటైనా ఉండకపోయేదా? నేనిక్కడ ఎత్తి చూపబూనుకుంది ఓ ప్రాంత ప్రజలందరూ దోపిడీదారులేననే ముద్ర వేస్తున్న కుటిల నేతల కొద్ది బుద్ధుల్ని, ఆ తరహా రాజకీయ పాచికలు తరచూ పారటానికి వీలు కల్పిస్తున్న మన బలహీనతలనీ. ప్రజల్లో భావోద్వోగాలు రెచ్చగొట్టి తమ తప్పులు కప్పి పుచ్చుకునే కళలో మన నాయకులకి ప్రాంతీయ భేదాల్లేవు. దేశవ్యాప్తంగా అదే ధోరణి. బొంబాయిలో ఎవరుండాలో, ఎలా ఉండాలో ఆదేశాలు జారీ చేసే దశ దాకా థాకరేలని ఎందుకు ఎదగనిచ్చాం? అలాంటి చీడపురుగుల్ని మొదట్లోనే తుంచిపారేయలేకపోయామంటే లోపం ఎక్కడుంది?

  • 18 WitReal 9:03 ఉద. వద్ద మార్చి 5, 2010

   థూ అని ఉమ్మడం అంటే ఎందో తెల్సా తంబి?

   జె ఏ సి పెట్టి, మిమ్మల్నదర్ని చంక నాకించిండ్రు సూడు, కంగ్రేసోళ్ళు, అది!

   దొంగ మాటలు చెప్పి, పిల్లగాళ్ళని ఆత్మహత్యలకు వుసిగొల్పారే…. జానా, దమొదర్, వి హెచ్, కె కె, యాష్కి…సివరాఖర్న పారిపొయిండ్రు….అది!

   కబుర్లు కాకరకాయలు చెప్పి, గోడ మీన పిల్లి లా ఉన్నారే, టి డి పి నాయకులు.. అది!

   అందరి సేతా రాజీనామాలు సేయించి, తన సీటు మాత్రం పట్టుక్కూసున్నారె, కే సి ఆర్, విజిగశాంతి….. ఆది

   సచ్చేటపుడు, యాదయ్య ఎమి రాసిండో తెల్సున బిడ్డా??
   తెలంగాణ వస్తె ఆడికి ఊజ్జొగం వచ్చుద్ది అనుకున్నడంట…ఆడికి అట్టాంటి అబద్ధాలు సెప్పిన మీ అందరి మీదా…………………. ఆ యాదయ్య…. థూ అని ఉమ్మేసి సచ్చిపొయిండు…

   మేల్కో బిడ్డా!

 11. 19 తెలంగాణా యోధుడు 12:35 సా. వద్ద మార్చి 4, 2010

  తొమ్మిదో అబద్ధం:

  ఆంధ్రోళ్లు దోపిడీదార్లు

  ఇదీ నిజం:

  ఏదీ? ఆ నిజమెక్కడా కనిపించలే. ఈసారైనా నిజం చెప్పుతారు అనుకున్న.

  అందరూ కాదు, కొంతమందినే అంటున్నారని మీరే చెపుతున్నరాయే. కొంతమంది ఆంధ్రోల్లు దోపిడీ దార్లు. అది అబద్ధమా? అయితే ఏట్లనో మీరు చెప్పలేదు. పనిలో పనిగా తెలంగాణా వారిని ఇష్టం వచ్చి నట్టు తిట్టడం మాత్రం మీకు చేత నయితుంది.

  లగడపాటి – వక్ఫ్ భూములు
  రామోజీ – అసైన్డ్ భూములు,
  వివేక – గురుకుల్ ట్రస్ట్ భూములు

  అర్హత లేక పోయినా నదుల్ల డెబ్బై శాతం నీరు వాడుకుంటున్నారు, అది దోపిడీ కాదా?

  తెలంగాణా యూనివర్సిటీలకు ముష్టి కోటిన్నర ఇచ్చి, కడప యూనివర్సిటీకి మూడొందల కోట్లు ఇచ్చుడు దోపిడీ కాదా?

  అంతెందుకు, ఇంత గొడవ జరుగు తున్నా కూడా 120 కోట్ల నాబార్డు నిధులలో 9 కోట్లు తెలంగాణాకు ఇచ్చి మిగతాది ఆంధ్రాలో పందేరం చేసుకోవడం దొంగలు దొంగలు ఊళ్లు పంచుకోవడం కాదా?

  ఇట్ల చెప్పుకుంట పోతె ఈ లిస్టుకు అంతే ఉండదు.

  ఇన్ని జరగడం కండ్ల ముందే కనబడు తుంటే, తెలంగాణా వాళ్ళు చెప్పేది అబద్ధం అనడం దొంగే ‘దొంగ దొంగ’ అని అరవడం కాదా?

  మీడియా ఇంత అభివృద్ధి చెంది, ప్రజలు ఇంత చైతన్య వంతు లైనప్పుదే దోపిడీ ఇంత యధేచ్చ గా సాగు తుంటే, మాటి మాటికి అరవై ఏళ్ళ నుండి ఏం జేస్తున్నారు అని అడుగుడు హాస్యాస్పదం.

  • 20 satya 6:02 ఉద. వద్ద మార్చి 5, 2010

   తెలంగాణ యోధుడి వ్యాఖలు చూసిన తర్వాత నాకు తెలంగాణ నాయకులది తప్పు కొంచెం కూడ అనిపించట్లేదు.

   1) లగడపాటి వక్ఫ్ భూములు, ‘బహిరంగ ‘ వేలం లో అందరికన్నా ఎక్కువ చెల్లించి కొనుక్కునాడు. చేతనైతే హరీష్ రావ్ జీ టీవీ మీద కేసు పెట్టినట్లు పెట్టుకోవచ్చు.. కాని వెయ్యలేదు, ఎందుకంటే తీర్పు ఎటు ఉంటుందో తెలుసు గనుక..
   2) రామోజీ భూములపై ప్రభుత్వం దాడి చేస్తే, రామోజీ కి మద్దతు ఇచ్చింది కేసీఆర్ యే. తన భూముల వివరాలు అతను స్వయం గా పేపర్లో ప్రకటించాడు. సుమారు వెయ్యి కి పైగా ఎకరాలు సొంత డబ్బు తో కొనుక్కున్నాడు, ఎలాంటి రాయితీ లేకుండా.
   3) గురుకుల ట్రస్ట్ భూములు తెలంగాణ ప్రజలకు చెందవు. ఆ భూములు ఇచ్చిన దాత వాటిని విద్యా ప్రయోజనాల కోసం దానం చేసినవి. ఆ భూమి మొత్తం 627 ఎకరాలు, వివేక వి అందులో కేవలం 2 బిల్డింగులు, మిగిలిన వాటిలో ఎందరో తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, బొచ్చెడు మంది ఉన్నారు.

   నెను ఇక్కడ ఎవర్ని సమర్ధించటం లేదు. దోపిడి దారుల్లో అందరూ ఉన్నారు అని చెప్పటానికే.

   మేడ్చల్ దగ్గర వందలాది ఎకరాలు కబ్జా చెసిన దేవేందర్ గౌడ్ మీకు కనిపించడా?

   పీజేఆర్ కబ్జాలు గురించి మీకు పట్టదా?

   మెదక్ జిల్లా పఠాంచెరు దగ్గర సోలిపేట రామలింగారెడ్డి 120 ఎకరాలు గుర్తుకురావా?

   గురువింద కబుర్లు చెప్పకండి.

   దోపిడి దారుల్లో అందరూ ఉన్నారు. కాళోజీ ఇలా అన్నారు. పొరుగూరు వాడు దోచుకుంటే పొలిమేరల దాక తరిమి కొడతాం, ఉన్న ఊరు వాడు దోచుకుంటే ఇక్కడే పాతిపెడతాం

   కాబట్టి ముందు మీ వాళ్ళని పాతిపెట్టి నమ్మకం కలిగించంది ప్రభుత్వాని. అప్పుడు అడగండి తెలంగాణ.

   అసలుగా, ఈ కబ్జాలు అనేవి అభివృద్ది చెందిన అన్ని నగరాలలో జరుగుతున్నదే. ఎవడూ వచ్చి ఆదిలాబాద్ లోనో, మహబూబ్నగర్ లోనో కబ్జా చెయ్యట్లేదు. తిరుపతి లో వేలాది ఎకరాలు కబ్జా చెయ్యబడ్డాయి, వారికి ప్రత్యేక రాష్ట్రం ఇద్దామా?

   >> అర్హత లేక పోయినా నదుల్ల డెబ్బై శాతం నీరు వాడుకుంటున్నారు, అది దోపిడీ కాదా?

   ఇలాంటి గాలి మాటలు వద్దు, మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి.

   >> తెలంగాణా యూనివర్సిటీలకు ముష్టి కోటిన్నర ఇచ్చి, కడప యూనివర్సిటీకి మూడొందల కోట్లు ఇచ్చుడు దోపిడీ కాదా?

   వేల కోట్లు పెట్టి IIT, IIIT, ISB లాంటి సంస్థలు పెట్టినప్పుడు చప్పుడు కాకుండా కూర్చున్నారే, అప్పుడు తెలీలేదా నొప్పి?

   అయినా మొత్తం పదహారు యూనివర్సిటీ ల వివరాలు ఉంటే చెప్పు? కడప దానితోనే ఎందుకు పోలిక? మిగిలినవి చెప్తే గుట్టు రట్టు అవుతుందనా?

   మీడియా ఇంతగా ఉండబట్టే అబద్దాలు ఇంతగా ప్రచారం జరుగుతుంది. మేము మా పాట్లు ఏవో బ్లాగుల్లో పడుతున్నాం. మీ వ్యాఖ్యలకి టీవీ9 ఓ, జీ టీవీ నో కరక్ట్. మంచి ప్రచారం వస్తుంది.
   అన్నట్లు మీ హరీష్ రావ్ ఈ మధ్య జీటీవీ గురించి మాట్లడుతున్నట్లు లేదు, కారణం ఏంటబ్బా?

   • 21 తెలంగాణా యోధుడు 12:52 సా. వద్ద మార్చి 8, 2010

    @సత్య
    అవును భై, గవర్నమెంటే అమ్ముతది, వక్ఫ్ భూములని. ఒక చేత అమ్ముతరు, ఒక చేత కొంటరు. అందుకే ఈ రాజ్యం పోవాలె అంటున్నం. వక్ఫ్ భూములైతె అమ్మొచ్చా? రేపు తిరుపతి ఏడుకొండలు అమ్ముటే ఊరు కుంటవా?

    రామోజీకి కేసీఆర్ సపోర్టు ఇచ్చిండా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. రామోజీ భూములు కబ్జా చేసిండా లేదా అనేది ముఖ్యం. సాక్ష్యం బాగనే పట్టుకొచ్చినవ్, మరి కేసీయారు చెప్పే విషయాలు అన్నిట్ని కూడా ఒప్పుకోరాదు! కేసీయారు ఏమి చెప్పినా రామోజీ భూములు ఆక్రమించిండు అనేది సత్యం.

    వివేకా రెండెకరాలు ఆక్రమించిండు అని నువ్వే చెప్పుతున్నవ్. నీ సాక్ష్యం చాలు.

    ఇవి మచ్చుకే. అయితే ఇవి సరిపోతయి… తెలు-గోడివి అబద్దాలని చెప్పా డానికి.

    తెలంగాణా వాదులు చెప్పిందేమిటి. కొందరు ఆంధ్రా వాళ్ళు దోపిడీ దారులు. ఇది నేను చెప్పలే. తెలు-గోడే చెప్పిండు. ఆ విషయం అబద్ధమని ఇక్కడ ఋజువైంది. దీనికి సమాధానం చెప్పుకోవలసింది తెలు-గోడు.

    ఇంకా నీళ్ళు. నీకు అద్దారాలు గావాలె గద. గిక్కడ చూడు. నీ ఆంధ్రల కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ ఏంత ఉన్నదో కనపడు తది. నీకున్న బేసిన్ కి ధవలేశ్వరమే ఎక్కువ. ఇంకా పోలవరం ఎందుకన్నా? తెలంగాణా గ్రామాలను ముంచి అర్హత కన్నా యెక్కువ నీరు కోసం ఆన కాట్టలు కట్టుకోవడం దోపిడీ కాదా? అయితే నీకల్లకు ఏదీ దోపిడీ కాదు. ఇక పులిచింతల కూడా ఇట్లాంటి దోపిడీ ప్రాజెక్టే. గా సైట్ల ఉన్న మ్యాపును జర మంచిగ జూడు తమ్మీ. కృష్ణా బేసిన్ లోపట రాయల సీమ ఎక్కడన్నా కనపడుతుందా? మరి చిత్తూరు దాన్క ఏ నీళ్ళు పోయినాయి తమ్మీ? తెలంగాణా నీళ్ళు గావా?

    తొందరెందు కన్నా? మొత్తం లెక్కలు తీసే రోజొస్తుంది. గప్పుడు తెలుస్తయి ఆంధ్రోల్ల అసలు దొంగ తనాలు.

 12. 22 తెలంగాణా యోధుడు 12:51 సా. వద్ద మార్చి 4, 2010

  తెలంగాణ ప్రాంతంలో (అనగా హైదరాబాదులో) పెట్టుబడులన్నీ ఆంధ్రావారివై ఐనట్లూ, తెలంగాణవారూ, తమిళులూ, మార్వాడీలూ, మరాఠీలూ, బెంగాలీలూ, అంబానీలూ .. మరెవరూ అక్కడ వ్యాపారాలు చేసుకోనట్లూ – చేసుకున్నా వారందరూ నిఖార్సైన నీతిపరులే ఐనట్లూ – ఒక్క ఆంధ్రావారిపైనే ఈ ప్రత్యేక దృష్టేల? వారొక్కరిపైనే దోపిడీదార్లనే ముద్రేల?

  వాళ్ళందరూ హైదరాబాదులో తాము డెవలప్ అయ్యామని తప్ప ‘హైదరాబాదు మాదే, హైదర బాదుని మేమే డెవలప్ చేశాం’ అని అనడం లేదు. అలా అనడం తెలంగాణా నీటితో ఆంధ్రాలో వ్యవసాయం చేసి, ఆ డబ్బుతో హైదరాబాదులో వ్యాపారం చేసే వారికే చెల్లు.

  • 23 satya 6:09 ఉద. వద్ద మార్చి 5, 2010

   ఇంతకీ హైదరాబాద్ మాది అంటున్నది ఎవరు బాబు? ఆంధ్ర వాళ్ళు అందరికీ చెందుతుంది అన్నారు కాని మాది అన్నట్లు ఎక్కడా వినలేదు.

   అందరిది అనే అంటాం కూడా.. 6 point formula లో భాగం గా అన్ని జిల్లాల నించి వచ్చిన రెవెన్యూ లో సిమ్హభాగం హైదరాబాద్ అభివృద్ది కి కేటాయించటం జరిగింది. అంతేకాదు, రాష్ట్రం లో ఎక్కడ పరిశ్రమ స్థాపించినా దాని రిజిస్ట్రేషన్ హైదరాబాద్ లో ఉండటం వల్ల ఆ పన్నులు అన్నీ హైదరాబాద్ ఖాతా లోకే వెళ్ళాయి. మీరు చెప్పే అంబానీలు, బిర్యానీలు ఇక్కడ పెట్టిన సంస్థ ల నుంచి సుద్ద ముక్క కూడ రాదు.

  • 24 బ్రహ్మి 8:48 ఉద. వద్ద మార్చి 5, 2010

   తెలంగాణా యోధుడు,

   తెలంగాణా నీళ్లేంటి. నీళ్ళు కిందకెళ్ళిపోయిన తరువాత అవి నీ నీళ్ళెట్లా అవుతాయి. ఇంకా నయం, సింగరేణి బొగ్గు భూమిలో నుంచి పాక్కుంటా పోయి, ఆంధ్రాలోకెళ్ళింది అన్లేదు. ఆ లెఖ్ఖన కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు మీ మీద పడి దోపిడీగాళ్ళని మిమ్మల్ని కూడా తిట్టొచ్చుకదా? దేడ్ దిమాక్ అంటే ఇదే మరి.

 13. 26 krishna 1:33 సా. వద్ద మార్చి 4, 2010

  అబ్రకదబ్ర గారు,ఆధారాలు గణాంకాలు లెక పోయిన కారణాలు అయినా ఇవ్వండి.నా చిన్ని బుర్ర కి అర్దం కావడం లేదు? ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాల వారు వుండగా తెలంగాణ వారు కోస్తాంధ్రా వాళ్ళని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్కుని వైషమ్యాలు సృష్టిస్తున్నారు? సీమ ప్రజలుని కూడా టార్గెట్ చెసుకోవచ్చు కదా? మీరన్నట్టు వారు కూడా సాటి తెలుగు వారే కదా?ఎక్కడో నిప్పు ఉండబట్టె పొగ వస్తుందేమో? ఇక తెలంగాణ వారు ఎవరైన నా ప్రశ్న రెండో భాగం కి సమాదానం ఇవ్వాలి: కోస్తాంద్రా వాళ్ళు దోపిడి దారులు అయితె సీమ ప్రజలుని కూడా దోచుకుని వుండాలి? వాళ్ళు ఎప్పుడు తెలంగాణ నాయకుల్లా ఆంధ్రా వారి మీద పడి ఏడవరు కదా?మరి ఏది నిజం?

  • 27 అబ్రకదబ్ర 2:15 సా. వద్ద మార్చి 4, 2010

   కారణం మొదట్లోనే చెప్పాను కదా.

   >> “వెనకబడి ఉన్నోడికి ముందుకెళ్లినోడిపై కడుపు మండేలా చెయ్యటం, వాడినో దోపిడీదారుడిగా చిత్రీకరించి తమ పబ్బం గడుపుకోవటం నేటి తరం నేతలకి వెన్నతో పెట్టిన విద్య”.

   ఆంధ్రప్రదేశ్‌లో ధనికులెక్కువగా పోగుపడ్డ ప్రాంతమేదంటే ఎవరికన్నా చప్పున గుర్తొచ్చేదేది? కోస్తాంధ్ర జిల్లాలే కదా. అక్కడ సంపన్నులు ఎక్కువుండటానికి సవాలక్ష కారణాలున్నాయి (అలాగని అక్కడున్నోళ్లందర్నీ అదృష్టం దరిద్రంలా పట్టి పీడిస్తుందనుకునేరు .. అక్కడా లెక్కకు మిక్కిలి పేదలున్నారు). ఆ సంపదంతా తమని దోచుకుని సృష్టించుకున్నదేనన్న నింద వేర్పాటువాదులది. అయితే వీళ్లో విషయం తెలివిగా దాటేస్తుంటారు. అదేమిటంటే – 1956కి ముందే, రెండు తెలుగు ప్రాంతాలూ విలీనమవకముందే, సదరు కోస్తాంధ్ర ప్రాంతం తెలంగాణ కన్నా ముందంజలో ఉందనేది (ఆ ముక్క వీళ్ల తురుపుముక్క ‘పెద్దమనుషుల ఒప్పందం’లో సైతం స్పష్టాతిస్పష్టంగా ఉంది). అప్పటిదాకా కోస్తాంధ్రులు ఎవర్ని దోచుకుని సంపదలు కూడబెట్టుకున్నారో మరి!?!

   ఇక, మీ ప్రశ్నకొస్తే, కోస్తాంధ్రులు కాకుండా తమకన్నా వెనకబడ్డ ఉత్తరాంధ్రోళ్లో, తమకి మించిన బీడు భూములున్న రాయలసీమోళ్లో తమని దోచుకు తింటున్నారంటే తెలంగాణలో ఎంత అమాయకుడన్నా నమ్ముతాడా?

   అదన్నమాట విషయం.

   (ఇప్పుడర్ధమయింది – మీరు ‘అసంపూర్ణంగా ఉంది’ అన్న కారణం. ఇవన్నీ నేను టపాలోనే ప్రస్తావించుండాల్సింది. ఈ మధ్య సస్పెన్స్ కథలు రాసే మోజులో పడిపోయాను కదా. ఆ ఒరవడిలో, వివరణ అవసరమైన చోట కూడా subtle hints తో సరిపెట్టేస్తున్నట్లున్నాను 🙂 Any how, ఓపికగా పదే పదే ఎత్తి చూపి నానుండి సమాధానం రాబట్టినందుకు ధన్యవాదాలు)

   మీ రెండో అనుమానం నాకూ ఎన్నేళ్లుగానో ఉంది. బదులెవరన్నా ఇస్తారేమో చూద్దాం.

 14. 28 తెలంగాణా యోధుడు 8:15 సా. వద్ద మార్చి 4, 2010

  కృష్ణ గారు,

  మీ సమస్య కోస్తా వారు రాయల సీమ వారిని ఎందుకు దోపిడీ చేయడం లేదని. ఎందుకు లేదు? ఆంధ్రా రాష్ట్రం లో శ్రీభాగ్ ఒప్పందానికి తూట్లు పెట్టారు అనే రాయల సీమ వారి ఆరోపణలు గమనించండి, తెలుస్తుంది. అనంతపురం లో ఉండ వలసిన ఆంధ్రా యూనివర్సిటీ వైజాగ్ ఎందుకు పారిపోయిందో ఆలోచించండి. దోపిడీ కలలో నిష్ణాతు లెవరో తెలుస్తుంది.

  అంతెందుకు? ప్రత్యేక రాయలసీమగా ఉంటాం కాని ఆంధ్రా స్టేట్ లో ఉండబోం అని చెప్పుతున్న టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చాలదా, ముందు ముందు ఏ రకమైన దోపిడీ ఉండబోతుందో చెప్పడానికి?

  • 29 krishna 9:45 సా. వద్ద మార్చి 4, 2010

   గత అరవయ్యేళ్ళలో సీమ వాసులు ఇలాంటి ఆరొపణలు టి.ఆర్.ఎస్స్. అంత తీవ్ర స్తాయిలో ఎప్పుడు చేసినట్టు లేదు కదా? జై ఆంద్రా ఉధ్యమం విన్నాను గాని జై సీమ ఉధ్యమం తెలీదు.ఇంకా చెప్పాలంటె ఆంద్రప్రదేశ్ అవతరణ కి ముందు నుండీ సీమ కోస్తాంధ్రా కలిసె వున్నరు కదా? ఆంద్ర రాష్ట్రం లో, మద్రాసు రాష్ట్రం లో కూడా!!!దోచుకునే వాడికి వాడు దగ్గర ఏముంది దోచుకోడానికి అని చూడక అవకాశం వున్న కాడికి దోచుకోడమే గా ?మరి సీమ వాసులు మరి ఎందుకు (పోల్చి చూస్తె) మౌనం గా కోస్తాంధ్రా వారి దోపిడీ భరించారు? మరి నిఝంగా కోస్తాంధ్ర వాళ్ళు దోపిడిదారులు అయితె తెలంగాణ కంటె ఎక్కువ గా సీమ నాయకులే ఇలాంటి ఆరోపణలు చెయ్యాలేమో?వారి మొదటి ఓటు సమైఖ్యం కే కదా?అయితే కలిసి వుందాం.ఎందుకంటే హైదరాబాద్ మీద్ద మాకు అంతె హక్కు వుందని వాళ్ళు అంటున్నారు కదా?కాని పక్షం లో ప్రత్యేక సీమ అంటున్నరు కదా టి.జి. వెంకటేష్ తదితరులు?

  • 32 satya 6:26 ఉద. వద్ద మార్చి 5, 2010

   తెలంగాణ యోధుడి కి నాదొక సలహా. పదే పదే మీ భాష ని అవమానిస్తున్నాం అని బాధపడటం కాదు. మీ భాష పై మీకు అంత ప్రేమే గనుక ఉంటే మీ తదుపరి కామెంట్లు మీ భాష లో వ్రాయాలని మనవి.

  • 33 WitReal 9:24 ఉద. వద్ద మార్చి 5, 2010

   యొధా బెదరు, అటూ ఇటూ సూసుకోకుండా ముందుకు దూకెయ్యమాకు…బొక్కలిరుగుతయ్ జాగర్త…

   టి జి వెంకటెష్ & ఇతర రాయలసీమ జనాలు చాలా న్యయమైన పొరాటం సేత్తన్నారు.

   వాళ్ళ వాదనల్లా ఒకటే…చారిత్రక/సాంస్క్రుతిక/భాషా అవసరాల ద్రుష్ట్య అందరం ఇన్నాళ్ళు కలిసి వున్నాం. ఇకపై ఇలానే కలిసి ఉందాం. అలా కాని పక్షంలొ, మేము మళ్ళీ ఇంకోసారి మోస పొవటానికి సిద్ధంగా లేము.

   నాకు తెలుసు, నువ్వు మళ్ళీ “చూసారా సీమ జనాలకి తెలుసు, కోస్తా జనాలు భవిష్యత్తులో మోసం చేస్తారని” అని యెదవ లాజిక్కు తీస్తావు. కాని తంబి, మీ నమ్మక ద్రొహం సూసినాక, వాల్లకి మనుషులమీదే నమ్మకం పొయినాది!

   రాజధాని కాజేసిన్రు..మీ ప్రాంతాలన్ని అభివ్రుద్ది సేసుకున్రు…ఇప్పుడు అంతా మీదే అని ఆల్లని ఎల్లమంటున్రు..

   • 34 డల్లాస్ నాగేశ్వరరావు 1:51 సా. వద్ద మార్చి 5, 2010

    ప్రత్యేక రాయలసీమ కావాలనే వారి వాదన 100% న్యాయమైనదే అని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు అందరం కలిసే వున్నాం కదా అని రాష్ట్రాన్నంతా దోచిపేట్టి రాజధానిని అభివ్రుద్ధి పరచినా, చివరికి మిగిలింది చూస్తున్నాం కదా. అలాంటప్పుడు విడిపోవాల్సి వస్తే, మరొకసారి రాజధాని విజయవాడ లోనో, విసాఖపట్నం లోనో పెట్టి, సీమాంధ్రను దోచిపెట్టి ఆ కొత్త రాజధానిని అభివ్రుద్ధి చేసి, యింకొక 30 సంవత్సరాల తరువాత మీ రాయలసీమోళ్ళందరు దోపిడిగాళ్ళనో, ఫాక్షనిష్టులు అనో పొమ్మంటే, మాళ్ళీ వాళ్ళకు దిక్కేది? అందుకే, విడిపోవాల్సి వస్తే, ఎవరి వాటా ఎంటో తేలాల్సందే.
    (నేను రాయలసీమ వాడిని కాను)

  • 35 krishna 1:00 సా. వద్ద మార్చి 8, 2010

   నా ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు తెలంగాణ యోధుడు గారు?

 15. 36 krishna 12:40 ఉద. వద్ద మార్చి 5, 2010

  చాలా తెలియనితనం, తెలుసుకుందామన్న అభిలాష వల్లనేమో ఈ అనుమానాలు?!!అంతే తప్ప నా వాదనా పటిమ తో ఎదుటివారిని ఇబ్బండిపడదామని కాదులెండి!!నా కంత సీను లెదు అని నాకు తెలుసునండీ:-) నేను కూడా ఒక వెనుకబడిన ప్రాంతానికి చెందిన వాడినే…ఉత్తరాంద్రా!ఇప్పుడు ఎవరైనా మెము ప్రత్యేక తెలంగాణ అన్నాం గాని ప్రత్యేక ఉత్తరాంధ్రా వద్దనలేదు కదా, జై తెలంగాణ, జై ఉత్తరాంధ్రా అంటారేమొ??

 16. 37 Swathi 11:22 ఉద. వద్ద మార్చి 5, 2010

  Your analysis and explanation is too good.Please send all the posts in this series to “Sri Krishna” committe.You can send them as it is in telugu,they will translate it.Your voice should reach the right people.

 17. 38 తాడేపల్లి 9:41 సా. వద్ద మార్చి 5, 2010

  ప్రత్యేక రాయలసీమ అనేముంది, ప్రతి ప్రత్యేకవాదమూ చాలా కరెక్టుగానే అనిపిస్తుంది, నా ప్రత్యేక గుంటూరు రాష్ట్రవాదనతో సహా ! ఎవఱో పైవాళ్లొచ్చి మన చేతిలో ఏదో పరసువేది/ శమంతకమణి పెడతారనే ఆశ ఉన్నప్పుడు, మన బాధ్యతని ఎవడో మోస్తే బావుంటుందని మనం అనుకున్నప్పుడు.

  పక్షాంతరంలో ఒకవేళ ఆ “పైవాళ్ళు” లేనప్పుడు (అనుకోకుండా ఏ కారణం చేతనైనా Indian Union ఒకనాటి సోవియట్ యూనియన్ లా dissolve అయితే), లేదా వాళ్ళు ఇవ్వనప్పుడు మన ప్రాంతాల పరిస్థితి ఏంటి ? అని ఆలోచించుకోవాలి. అప్పుడు సమైక్యం యొక్క ఆవశ్యకత బోధపడుతుంది. భారత ఉపఖండంలోని జాతుల్లో జాతీయవాదం లోపించి చిన్నచిన్నరాజ్యాలుగా ఉండడం వల్లనే ఇవన్నీ ఒకటొకటిగా విదేశీయుల చేతుల్లోకి వెళ్ళాయనే చారిత్రిక గుణపాఠాన్ని మన పెద్దలు గ్రహించారు. అనేక చిన్న అధికారకేంద్రాలు కలిసి ఒక పెద్ద అధికారకేంద్రం ఏర్పడుతుంది. కనుక చిన్న అధికారకేంద్రాలు కూడా తమ స్థానిక స్థాయిలో బలంగా ఉండడం అవసరం. అందుకని స్వాతంత్ర్యం రాగానే పెద్దపెద్ద రాష్ట్రాల్ని, బలమైన రాష్ట్రాల్ని ఉద్దేశపూర్వకంగానే నిర్మించారు. ఇప్పుడు external threat లేదనే భ్రమలో ఈ బలాన్ని బలహీనతగా మార్చుకోవడానికి సాహసిస్తున్నారు, చిన్నరాష్ట్రాలనే నినాదాన్ని లేవదీసి. కానీ వీళ్ళు ఏ విధంగా ఆనాటి పెద్దల ఉద్దేశాల్ని ఈనాడు గ్రహించలేకపోతున్నారో, అలాగే ఒక రెండు తరాల తరువాత పుట్టుకొచ్చేవాళ్ళు కూడా ఈ చిన్నరాష్ట్రాల ప్రయోజనాన్ని కూడా మరచిపోతరు. అప్పుడు దేశానికి అధోగతి.

  సమైక్యం డబ్బులకి, అభివృద్ధికి సంబంధించిన కాన్సెప్టు కానే కాదు. ఈ కాలంలో ఎందుకిలా ప్రచారమవుతోందో అర్థం కాకుండా ఉంది. ఆ లెక్కన మనకి ఇండియా గవర్నమెంటు కూడా ఒక మేకచన్నులాంటి వ్యర్థవ్యవస్థ. ఎందుకంటే మనకి ఆ ప్రభుత్వం వల్ల ఆచరణాత్మకంగా ఒఱిగేది ఏమీ లేదు కనుక, అది మనమిచ్చే చందాలతోనే నడుస్తున్నది కనుక, మనం దానికిచ్చే డబ్బుల్నే అది తిరిగి మనకి మంజూరు చేస్తున్నది కనుక, కలిసున్నా, విడిపోయినా అందఱమూ అమెరికాకి ఉపగ్రహాలమే కనుక.

  సమైక్యం ఒక సౌకర్యమూ, ఒక భవిష్యద్ భద్రతా, ఒక బలం, ఇఱుగుపొఱుగున మన జాతికి ఒక ఉమ్మడి గౌరవమూ, ఆకారపుష్టి, గాంభీర్యమూను ! మాటల్లో చెబితే అర్థం కాని చాలా విషయాల్ని మనుషులు సైజు చూసి మాత్రమే గ్రహిస్తారు. మానవసహజమైన ఈ మానసిక కారణం చేతనైనా మనకి పెద్దపెద్ద రాజకీయస్వరూపాలు అవసరం.

 18. 39 డల్లాస్ నాగేశ్వరరావు 10:40 సా. వద్ద మార్చి 5, 2010

  LBS,
  ఖచ్చితంగా అంధ్రప్రదేశ్ ఒక్ఖటిగా వుండాల్సిందే. అలా జరగడానికి అవకాశం ఎంత? ఇవ్వాళ అంధ్రప్రదేశ్ భవిష్యత్ ఒఖ్ఖ వ్యక్తి చేతిలో వుండటం మన దౌర్భాగ్యం. అవసరమైతే ఎటువంటి చర్య తీసుకునైనా అంధ్రప్రదేశ్ ని సమైక్యంగా వుంచగలిగే దమ్మున్న నాయకుడేడీ?

  ఒకవేళ భారతదేశపు ఆశాకిరణం ’సోనియాగాంధీ’ రాష్ట్రాన్ని విభజించాల్సిందే అని తీర్మానించేసారనుకోండి… ఏమిటి కర్తవ్యం? ఘడియకోసారి అధిష్టానం జపం చేసే మన ప్రస్తుత ముఖ్యమంత్రి, అమ్మా మరి ఎప్పుడు ఖాళీ చెయ్యమంటారు అని తప్ప, వేరే ప్రశ్న అడిగే అవకాశమే లేదు. అవసరమైనప్పుడు అరిచే నాయకులకు బిస్కట్లు విసిరే విద్య బాగా తెలిసిన కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్ర నాయకులని సముదాయించే ఉపాయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడున్నంత ఉధ్రుతంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు అప్పుడు జరుగుతాయన్న నమ్మకం నాకు లేదు. కాబట్టి, విభజన నిర్ణయం జరిగాక (పాపం శమించుగాక), రాయలసీమ ప్రత్యేకం కావాలనడం తప్పంటారా?

 19. 40 తాడేపల్లి 2:55 ఉద. వద్ద మార్చి 6, 2010

  నా అభిప్రాయంలో మన అసలు సమస్యల్లా రాష్ట్రాలకి రాజ్యాంగరక్షణ లేకపోవడమే. రాష్ట్రాల అస్తిత్వానికి Sanctity లేకపోవడం. రాష్ట్రాల citizenship లేకపోవడం. ఇండియా నుంచి వేఱుపడతామని డిమాండు చేసేవారికి మరణశిక్ష వేయించే అధికారం ఉంది కేంద్రప్రభుత్వానికి. అలాగే రాష్ట్రాల్ని ముక్కలు చేయాలని డిమాండు చేసేవారిని కూడా అలాగే శిక్షించే అవకాశం ఉన్నప్పుడు ఈ వాదాలు మూలపడతాయి. అది లేనంతకాలం – ఱేపు తెలంగాణ ఇచ్చినా ఎల్లుండి ఇంకొకడు లేచి “ఉత్తర తెలంగాణ, దండకారణ్యరాష్టం” అని తన వంతు ఉద్యమాలతో దేశం మీద పడతాడు. ఈ పోకడకి ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయక తప్పదు.

  ఇహపోతే, ఒకవేళ తెలంగాణ ఇస్తే ? అని అడిగారు. ఇస్తే అది కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రకే కాదు, ఇండియా చరిత్రక్కూడా ఆఖరవుతుంది. ఈ రోజున ఆ సంగతి ఎవఱూ గుర్తించకపోయినా !

 20. 42 jajisarma 9:32 ఉద. వద్ద మార్చి 7, 2010

  మీ ఇష్టం వచ్చినట్లు తెలంగాణా ఉద్యమాన్ని విమర్శించటానికి, ప్రపంచమంతా మెచ్చుకున్న మన ప్రజాస్వామ్య వ్యవస్థకే మూలాధారమైన ఎన్నికల ప్రక్రియను విమర్శించి, చాలా తప్పుచేశారు. పోనీ మరో గోడులో దీనికేదైనా పరిష్కారం చూపించాలి సహస్రబ్లాగుల విక్రమార్కా, లేదా నీతల…… ఎందుకులే,”సర్వేజనాసుఖినోభవంతు కదా” మన పంధా (లేదా మనది గన్ను భారతమా, సోదరా?)

  • 43 అబ్రకదబ్ర 11:47 ఉద. వద్ద మార్చి 7, 2010

   మన ఎన్నికల వ్యవస్థని విమర్శించానా? ఎక్కడ? నేను విమర్శించింది అంత పెద్ద వ్యవస్థనీ నిర్వీర్వ్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న రాజకీయ నాయకుల్ని, వాళ్ల ఆటలు సాగనిస్తున్న మన (ప్రజల) బలహీనతనల్ని.

   అయినా – మీకు మన ఎన్నికల వ్యవస్థపై అంత ప్రేముంటే ఈ ప్రశ్నడగాల్సింది నన్ను కాదు. ఐదేళ్ల పాటు ఏదో పొడిచెయ్యమని ఎన్నిక చేసి పంపిస్తే, సాధించిందేమీ లేక పోయినా రోజుకో మారు రాజీనామా మాత్రం చేస్తూ ప్రజల మొహాన పగలబడి నవ్వుతున్న నాయకుల్ని. ఆ పని చెయ్యగలరా?

  • 44 Witreal 3:24 ఉద. వద్ద మార్చి 8, 2010

   ఉల్టె చోర్ కొత్వాల్ కొ డాంటా!

   హైదరాబాద్ ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థని విస్మరించిందీ, విమర్శించిందీ ఎవరు??

   తెలంగాణా లో పట్టుమని పది సీట్లు కూడా గెలవలేని అసమర్థులు, హైదరాబాదు మాదీ మాదీ అని అప్రజాస్వమ్యంగా ఏడుస్తున్నది ఎవరు???

   లొక్ సభ సీటు కి రాజీనామా చెస్తె మల్లీ గెలిచే ధైర్యం లెక, తోక ముడిచింది ఎవరు?

   ఎన్నికలలో గెలిపించిన ప్రజల క్షేమం పట్టించుకొకుండా ఎదవ రాజకీయలకి పాల్పడుతున్నది ఎవరు?

   అలాంటి ఎదవలని వెనకేసుకొస్తున్న జాజిశర్మ గారిమీద జాలితో!

 21. 45 jajisarma 5:13 ఉద. వద్ద మార్చి 8, 2010

  పుణ్యభూమి నాదేశం నమో నమామి.
  నాయనా అబ్రకదబ్ర! విత్రియలా!,
  అబ్రకదబ్రకి వ్రాసింది ఓ సారి చూచుకోవటం అలవాటు లేదు. సరే! నేను పుట్టింది మచీలిపట్నం. పెరిగింది బెజవాడలో, ఉద్యోగం వెలగబెట్టింది భాగ్యనగరంలో, ఇప్పుడుంటున్నది హస్తినాపురంలో. నాకు విశాలాంధ్ర అంటేనే మక్కువ. కాకపోతే, ఆవేశం ఎక్కువయి ప్రజాస్వామ్య ప్రక్రియని దుయ్యబట్టవద్దని మనవి. మనమంతా ఎదవలం (వెధవలకి, అలాగే వ్రాయలని విత్రియిలు, ఉవాచ, కదా!) కాబట్టే తురకలు, (తురుష్కులు అనాలి కాబోలు) తెల్లోళ్ళు, శతాబ్దాలు పాలించారు. మనవార్దు మెంబరెవరో మనకి తెలియదు, మన వీధిలో ఉండేవారెవరో కూడా తెలియని కూపస్థమండూక జీవితం మనది. ఎందుకు చక్కగా సాగిపోతున్న వ్యవస్థని చేజేతులా పాడుచేసుకోవాలి? అనేది ప్రశ్న. ఓ సారి మోంటేక్ అహ్లువాలియా, బ్యాంకర్ల సమావేశంలో, “మీరు ఎకానమీలోకి డబ్బు సరఫరా చెయ్యండి బాబూ!, అభివృద్ధి దానంతటదే వస్తుందన్నారు”. అలా ఆయన చెప్పినట్లు చేసి, మహబూబునగర్ జిల్లా, నారాయణపేటలో, మాసోదరుడొకరు, గణనీయమైన అభివృద్ధికి దోహదపడ్డారు. దాదాపు వంద గ్రామాలలో, కరువు లేకుండా, ఓ నాలుగేళ్ళు, చూచారు. ఎందుకు అన్యాయం అని , ఏమి తెలియకుండా అనేవారి మాటలకి ఆవేశంగా, అన్నిటిని, అందరిని తూలనాడవద్దు. అలాగే, భాగ్యనగరం లోని, ఏ బ్యాంకు ప్రధాన కార్యాలయమునకు, తెలంగాణావాదులను వెళ్ళమనండి. చాలు. తెలంగాణాలో అభివృద్ధి లేదు అనేవారి మాటలకు అర్ధం లేదని తెలుస్తుంది. అమ్మా! ఆంధ్రమాతా! ఇదే నా “తెలు-గోడు”

 22. 47 కొత్తపాళీ 2:52 సా. వద్ద మార్చి 8, 2010

  భావాలు మనోభావాల సంగతి పక్కన బెడితే, ఈ వ్యాసం చాలా బాగా రాశారు. అభినందనలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: