ఫిబ్రవరి, 2010ను భద్రపఱచుఒక ఉద్యమం, పది అబద్ధాలు – 7

ఏడో అబద్ధం:

పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన.

ఇదీ నిజం:

చిన్నపిల్లల్లో ఓ చిరాకెత్తించే లక్షణం ఉంటుంది. ఎంతకీ తాము కోరుకుంది చేతికందిందా లేదా అనే తప్ప అవతలివారి సమస్యలు అర్ధం చేసుకునే శక్తి ఆ వయసులో వాళ్లకుండదు. ఉదాహరణకి, పుట్టినరోజుకి ఫలానా బొమ్మ కొనిపెడతా అని మీ బుడ్డోడికి ప్రమాణం చేశారనుకోండి. కానీ మీరెంత ప్రయత్నించినా ఆ బొమ్మ మార్కెట్లో దొరకలేదు. అందుకని అంతకన్నా విలువైనది మరొకటి కొనుక్కెళతారు. తీరా ఏమౌతుంది? మీ బుడ్డోడు ఆ బహుమతి దర్జాగా తీసుకుని దాచుకుంటాడు, ఆనక మీరు మాటిచ్చిన ఆట బొమ్మ తేనేలేదని ఆరున్నొక్క రాగం అందుకుంటాడు. అయితే, చాలా మంది పిల్లల విషయంలో, వాళ్లు పెద్దయ్యే కొద్దీ ఈ గుణం తగ్గిపోతుంది. కొందరిలో మాత్రం వయసుతో పాటే పెరిగి మూర్ఖత్వంగా మేటేస్తుంది. కొండొకచో అది ఏకంగా సంఘాన్నే కాటేస్తుంది.

1956 ఫిబ్రవరిలో కొంతమంది కాంగిరేసు పార్టీ పెద్దలు – వాళ్లలో కొందరు తెలంగాణ ప్రాంతీయులు, మిగిలినోళ్లు తెలంగాణేతరులు – నయా ఢిల్లీ హైదరాబాదు గెస్ట్ హౌస్‌లో గుమికూడి తలుపులు మూసుకుని ఒకళ్లనొకళ్లు కూసుకుని, ఉద్రేకాలు తగ్గాక ఏవో కోతలు కోసుకుని, వాటినో కాగితమ్ముక్క మీద రాసుకుని, ఆర్నెల్లు గడిచాక ఆగస్టులో తీరుబడిగా దాన్ని తీసుకుని లగెత్తుకెళ్లి లోక్‌సభ ముందుంచారు. వాళ్లలో అందరూ ఆచంట మల్లన్నలే కాబట్టి ఆ ఘనత మనకీ తెలిసేలా దానికి ‘పెద్దమనుషుల ఒప్పందం’ అనే దిట్టమైన పేరుపెట్టారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం అప్పటి ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడబోతున్న దరిమిలా, ‘ఆంధ్రరాష్ట్రంతో పోలిస్తే వెనకబడి ఉన్న తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం విద్య, ఉపాధి, నిధులు వగైరా విషయాల్లో ఆ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక మినహాయింపులు, కేటాయింపులు ఇవ్వాలి‘ అన్నది స్థూలంగా ఆ ఒప్పందం సారాంశం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ‘పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రరాష్ట్రంతో కలవటానికి ఒప్పుకుంది‘ అని వేర్పాటువాదులు వల్లెవేస్తారు. అదే సమయంలో, ఆ ఒప్పందానికి ముందే నాటి హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో అత్యధికులు విశాలాంధ్రకి మద్దతు తెలిపారన్న విషయం దాటేస్తారు. రెండు ప్రాంతాలూ ఏకమవటానికి రంగం సిద్ధమైపోయాకనే ఈ ఒప్పందం చేసుకోవటం జరిగిందన్నది అసలు వాస్తవం. ఏతావాతా, ఈ ఒప్పందం ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్ అవతరించి తీరేదన్నది నిజం. తాయిలాలు చూపి తెలంగాణని కలుపుకున్నారన్నది అబద్ధం.

ఇంతకీ, సదరు పెద్దమనుషుల ఒప్పందంలో అటు తెలంగాణ, ఇటు తెలంగాణేతర ప్రాంత ప్రజలకి భాగస్వామ్యం ఉందా అంటే లేనే లేదన్నది సమాధానం. దేశమ్మొత్తంలోనూ అంతర్గత ప్రజాస్వామ్యానికి నేడే కాక నెహ్రూ హయాములోనూ కాంగిరేసే కేరాఫ్ అడ్రస్. ఇద్దరు నాయకులుంటే మూడు ముఠాలు కట్టే చోద్యం ఆ పార్టీలోనే సాధ్యం. అయ్యదు పార్టీలో భిన్నవర్గాల ప్రయోజనాల పరిరక్షణార్ధం చేసుకున్న లాలూచీ ఒప్పందమే ఇది కానీ, ఇందులో విశాలాంధ్ర హితం ఊసు లేదు. అదే ఉంటే (అప్పట్లో) కాంగ్రెస్‌కి దీటుగా బలమున్న కమ్యూనిస్టు పార్టీ అభిప్రాయాలనీ పరిగణనలోకి తీసుకునేవాళ్లే కానీ ఇలా ఏకపక్ష ఒప్పందానికి తెగబడేవాళ్లు కాదు.

‘ఏకపక్ష’ అనటానికి బలమైన కారణమే ఉంది. అసలు – ఒప్పందం అంటే ఏంటి? రెండు పక్షాలు ఓ చోట కూర్చుని ఇద్దరి ప్రయోజనాలూ కాపాట్టానికి చేసుకునే ఒడంబడిక. ఇచ్చిపుచ్చుకోవటం ఏ ఒప్పందానికైనా మూలసూత్రం. కానీ ఈ పెద్దమనుషుల ఒప్పందం విషయంలో జరిగిందేమిటి? అందులో ఉందంతా ‘మీ ఇంటికొస్తే మాకేమిస్తారు, మా ఇంటికొస్తే మీరేం తెస్తారు‘ తరహా క్లాజులు. ఎంతకీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకి ఏం లాభం కలగాలనే లెక్కలే తప్ప, మిగతా ప్రాంతం గురించిన ఊసు లేదు. తెలంగాణ కోసం ప్రత్యేకమైన రీజినల్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, తెలంగాణ వారి కోసం తెలుగుని పక్కన పెట్టి ఉర్దూకి పెద్ద పీటెయ్యాలి, తెలంగాణవారికి ఇన్ని మంత్రి పదవులివ్వాలి – వాటిలోనూ ఫలానా ఫలానా శాఖలు తప్పకుండా వారికే ఇవ్వాలి, తెలంగాణ స్కూళ్లలో తెలంగాణవాళ్లే చదవాలి, తెలంగాణ ఉద్యోగాల్లో తెలంగాణవాళ్లే ఉండాలి, తెలంగాణ రెవిన్యూ మిగుళ్లు తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి, వగైరా, వగైరా. తెలంగాణ వెనకబడి ఉన్న కారణాన, ఆంధ్రా ప్రాంతంతో క్యాచప్ అవ్వాలంటే ఆ ప్రాంతానికి ఆ మాత్రం మినహాయింపు ఇవ్వాలన్నది న్యాయమైన డిమాండే. ఐతే తెలంగాణేతర ప్రాంతాలన్నీ ఏకరీతిన అభివృద్ధి సాధించాయా? వాటిలోనూ వెనకబడ్డ ప్రాంతాల్లేవా? వాటికి ఏ ప్రత్యేక ప్యాకేజీలూ ఎందుకివ్వలేదు? విశాలాంధ్ర హితం కోరుకునేవారు చెయ్యాల్సిన పనేనా అది? భాష ప్రాతిపదికన దేశంలోనే తొట్టతొలి రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యబూనుకున్నవారు ప్రాంతీయ అడ్డుగోడల్ని ఛేదించలేకపోవటం ఏమిటి? ప్రాంతాలవారీ అభివృద్ధికి రీజినల్ కమిటీలే శరణ్యమైతే అది ఒక్క తెలంగాణకే ఎందుకు వర్తించాలి? తెలంగాణ మిగులు నిధులు తెలంగాణపై ఖర్చు పెట్టి తీరాలన్న నియమం లాంటిది మిగిలిన వెనకబడ్డ ప్రాంతాలకూ ఎందుకు అమలు చెయ్యకూడదు?

మిగులు నిధుల ప్రస్తావనొచ్చింది కాబట్టి పనిలో పనిగా మరో అబద్ధ ప్రచారం పనీ పడదాం. ‘ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి హైదరాబాద్ రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో ఉండగా ఆంధ్రరాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంది. తెలంగాణ మిగులు దోచేసుకోవచ్చనే దుర్భుధ్దితోనే విశాలాంధ్ర పాటందుకున్నారు ఆంధ్రా ప్రాంత నాయకులు‘ – ఇది వేర్పాటువాదులు నిత్యం పఠించే చరిత్ర పాఠం. 1956లో హైదరాబాద్ స్టేట్ అటూ ఇటూగా ఆరు కోట్ల రూపాయల మిగులుతో ఉంది. ఆంధ్రరాష్ట్రం లోటులో ఉంది. అంతవరకూ నిజమే. ఐతే వెనకబడి ఉన్న తెలంగాణ ప్రాంతం మిగులు బడ్జెట్‌తో ఉండటం ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు చెయ్యాల్సిన నిధులు సరిగా వాడుకోకుండా మురగబెట్టటం వల్లనే ఆ మిగులొచ్చిందన్నది అసలు సంగతి. కానీ వేర్పాటువాదులు ఆ ముక్క ఒప్పుకోరు. ‘తెలంగాణ ప్రాంతం ఆల్రెడీ అభివృద్ధి చెందింది, దానికి సాక్ష్యమే నాటి మిగులు బడ్జెట్’ అని వితండవాదాలు చేస్తారు. అది అబద్ధం అని నిరూపించటానికి ఎక్కడెక్కడో వెదకక్కర్లేదు. ‘వెనకబడ్డ తెలంగాణ అభివృద్ధి కోసం‘ అన్న వాక్యమే పెద్దమనుషుల ఒప్పందానికి ప్రాతిపదిక. ‘తెలంగాణ మిగులు ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధికే ఉపయోగించాలి‘ అన్న వాక్యం కూడా ఆ ఒప్పందంలోనే స్పష్టాతిస్పష్టంగా ఉంది. ఇక ఆ మిగులు నిధుల కోసం ఆంధ్రా వాళ్లు అర్రులు చాచే అవకాశం ఏది?

ఇక్కడొస్తుంది – ‘పెద్దమనుషుల ఒప్పందం అమలెక్కడయింది?‘ అన్న ప్రశ్న వేర్పాటువాదుల నుండి. అందులో ప్రస్తావించిన పదవుల పందేరాలు, కమిటీలు, ఇతరేతర రాజకీయ ఉపాధి అవకాశాల గురించి పక్కన పెడదాం – వాటివల్ల ప్రజలకి నికరంగా ఒరిగేదేమీ లేదు కాబట్టి. ఒప్పందం ఉల్లంఘన అన్న నింద ప్రధానంగా రెండు విషయాల గురించి: 1. తెలంగాణ అభివృద్ధికి న్యాయంగా అవసరమైనన్ని నిధులు ఖర్చు పెట్టటం లేదు. 2. ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ తెలంగాణలో ఉపాధి అవకాశాలు తెలంగాణేతరులు తన్నుకు పోతున్నారు. ఈ రెండు కారణాలతోనే 1969లో మొదటి వేర్పాటు ఉద్యమం ప్రారంభమైంది అన్నది తెలంగాణ ప్రాంతీయులకి వేర్పాటువాదులు నూరిపోస్తున్న మరో అబద్ధం.

వాస్తవం ఏమిటంటే, 1956లో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందంలో కొన్ని క్లాజులకి కాలపరిమితి ఉంది. ముల్కీ నిబంధనలు, ఉర్దూ అమలు వగైరా విషయాల గురించి అందులో రాసుకున్నవి ఐదేళ్ల పాటు అమలు చేసి చూడాలనీ, ఆ తర్వాత అవసరమైతే మరో ఐదేళ్ల వరకూ పొడిగించవచ్చనీ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. ఇదొక తాత్కాలిక వెసులుబాటు మాత్రమే అన్న విషయమూ స్పష్టంగానే ఉంది. మొదటి ఐదేళ్లలో ఒప్పందానికి తూట్లు పడిన ఆరోపణలే లేవు – అప్పట్లో. రాజధానిలో ఉపాధి అవకాశాలు వెదుక్కుంటూ మిగతా ప్రాంతాల నుండి వలసలు అధికమయింది ఆ తర్వాత. అది తెలంగాణలో కొందరు నిరుద్యోగుల కడుపు మంటకి కారణమయింది. దాన్ని భూతంగా మార్చటానికి రాజకీయులు ఉండనే ఉన్నారు కాబట్టి 1969 జనవరిలో పుట్టిన కోతిపుండు చూస్తుండగానే బ్రహ్మరాక్షసయింది. ఇంతకీ, నాటి ఉద్యమ నినాదం ‘పెద్దమనుషుల ఒప్పందాన్ని కొనసాగించాలి‘ అన్న డిమాండే తప్ప ‘పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘించబడింది‘ అన్న నింద కాకపోవటం గుడ్డిలో మెల్ల. ఆమేరా ఆనాటి వేర్పాటువాదుల్లో అంతో ఇంతో నిజాయితీ ఉందనుకోవాలి. నిజానిజాలు ఇలా ఉండగా, ఆ ఒప్పందం ఉల్లంఘనే 1969 నాటి ఉద్యమానికి ప్రేరణ అన్నది నేటి వేర్పాటువాదులు ఓ పద్ధతి ప్రకారం చేసుకొస్తున్న ప్రచారం. ఇక్కడ జరిగిన ఉల్లంఘన ఏదన్నా ఉందా అంటే అది వేర్పాటువాదుల వైపునుండే. తాత్కాలిక ప్రాతిపదికన ఓ ఒప్పందానికి అంగీకరించి తర్వాత దాన్ని ఎల్లకాలమూ అమలు చెయ్యాలని పట్టుబట్టటమే అసలు సిసలు ఉల్లంఘన.

మిగులు నిధుల గురించీ, వాటి ఖర్చు గురించీ పైన మాట్లాడుకున్నాం. ‘తెలంగాణ మిగులు ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధికే కేటాయించాలి’ అన్న క్లాజుతో పాటు మరోటీ ఉందా ఒప్పందంలో. రాష్ట్ర ఉమ్మడి నిధుల్లో తెలంగాణ ప్రాంతానికి న్యాయంగా వచ్చే వాటాకి ఈ తెలంగాణ మిగులు నిధులు అదనం అన్న మాట. అంటే, ఉదాహరణకి, కోస్తాంధ్ర ప్రాంతం నుండి వచ్చిన నిధుల్లో మిగులేదన్నా ఉంటే అందులో తెలంగాణకి వాటా ఉంటుంది; అదే సమయంలో తెలంగాణ మిగులు నిధుల్లో పక్క ప్రాంతాలకి వాటా ఉండదన్న మాట. ఇప్పుడు చెప్పండి – ‘తెలంగాణ మిగులు నిధులపై ఆశతోనే ఆంధ్రావాళ్లు విశాలాంధ్ర ఏర్పాటు కోసం అర్రులు చాచారు‘ అన్న నిందలో నిజమెంతో. నిజానికి ఆ నింద వేస్తే గీస్తే తెలంగాణవారిపై తెలంగాణేతర్లు వెయ్యాలి. కాదా?

అయితే ఈ మిగులు నిధుల్లో తెలంగాణకి న్యాయంగా రావలసిన వాటా రావటం లేదని 1969 ఉద్యమం సందర్భంగా వేర్పాటువాదులు నానా రభస చేశారు. ఆ సంగతేమిటో చూడమంటూ ఆ ఏడాది ఏప్రిల్ మాసంలో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వశిష్ట భార్గవ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. 1956 నవంబర్ 1 నుండి 1968 మార్చ్ 31 వరకూ ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతం నుండి ఎంత రెవిన్యూ వచ్చింది, అందులో ఏ ప్రాంతానికి ఎంత వాటా దక్కిందీ తేల్చటం ఆ కమిటీ పని. ఆ పన్నెండేళ్లకి సంబంధించిన అన్ని రకాల జమాఖర్చుల వివరాలు సేకరించి, క్రోడీకరించి సదరు కమిటీ నిగ్గుదేల్చిన నిజమేమిటంటే: ‘ఆ పుష్కర కాలంలో తెలంగాణ మిగులు ఆదాయంలో అత్యధికం తెలంగాణ అభివృద్ధికే ఖర్చు చెయ్యటం జరిగింది. అందులో వాడకుండా ఉంచిన నిధులు అతి స్వల్పం. అంతే కాక, రాష్ట్ర ఉమ్మడి ఆదాయంలో (అనగా, తెలంగాణేతర ప్రాంతాల నుండి సమకూరిన ఆదాయం) నుండి తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులు తెలంగాణకి న్యాయంగా రావలసిన వాటా కన్నా ఎక్కువే’ (పై పుస్తకం పేజ్ 189 చూడండి).

పఠితలారా .. నిధుల్లో తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాకన్నా ఎక్కువే దక్కినా ఆ సంగతి వదిలేసి ఉద్యోగాల్లో తమకు దక్కాల్సినవాటిలో కొన్ని దక్కకుండా పోతున్నాయని గొడవ చేసే గుణాన్నిఏమంటారు? వ్యక్తులైనా, సమాజాలైనా మనుగడ సాగించాలంటే ఇచ్చిపుచ్చుకోవటం అత్యవసరం అని వీళ్లకెవరు నేర్పుతారు?

ఇదంతా చదివాక ‘అంత ఖర్చు పెడితే ఏదీ అభివృద్ధి తెలంగాణలో’ అనే చొప్పదంటు ప్రశ్న ఎవరో ఒకరు వేస్తారు. వాళ్లకి ముందస్తు సమాధానం ఇస్తున్నా. ఇది అభివృద్ధి గురించిన టపా కాదు, ఓ అసత్యం అంతు చూడటానికి ఉద్దేశించిన టపా. నిధులెంత ఖర్చుపెట్టినా వెనకబడే ఉన్న ప్రాంతాలు తెలంగాణతో సహా రాష్ట్రం మొత్తంలోనూ ఇంకా చాలా ఉన్నాయి. వాటికి కారణాలు వెదుకుతూ కూర్చునే ప్రదేశం ఇది కాదు.

(సశేషం)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.