నా గురించి అంతగా తెలీనివారు, ఆసక్తున్నవారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఏ విందు సమావేశంలోనో మీరు నాకెదురైతే, ‘ఫలానా కూర కారంగా ఉందా’ అని మాత్రం నన్నడక్కండి. ఆ విషయంలో నా అభిప్రాయమ్మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే ఆనక తీరుబడిగా కళ్ల నీళ్లు పెట్టుకోవలసి రావచ్చు. టామ్ హార్నెస్ అనబడే నా తెల్ల తోలు సహోద్యోగికి ఈ మధ్యనే ఆ అనుభవమయింది – ఓ భారతీయ రెస్టారంట్లో.
‘Is it spicy?’. ఎర్రెర్రగా, చూడగానే నోరూరిస్తున్న పండు మిరపకాయ పచ్చడి చూపిస్తూ అతనడిగిన ప్రశ్న.
‘Nope. Not at all’, నా సమాధానం.
మరుసటి సన్నివేశంలో టామ్ హార్నెస్ కాస్తా టామ్ ఫర్నేస్గా మారిపోయి పొగలు, సెగలు కక్కుతున్నాడు. సంగతేమిటని ఆరా తీసిన మరో సహోద్యోగి, నా గురించి కాస్త ఎక్కువ తెలిసినవాడు, టామ్కేసి జాలిగా చూస్తూ చెప్పాడు:
‘Man, you asked the wrong guy’
* * * * * * * *
పండు మిరప పంటకి ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో పుట్టి పెరగటం వల్ల కావచ్చు, గొడ్డు కారం పంచదారలా అనిపించటం నాకు మామూలు విషయం. మిరపకాయ కనిపిస్తే నోరూరడం నా సహజ గుణం. నా దృష్టిలో కారం కలవని వంటకం వంటకమే కాదు. నా వరకూ, పంచ భక్ష్య పరమాన్నాలైనా పచ్చడన్నం ముందు బలాదూరే. ఆంధ్రాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా – ఆవకాయో, అల్లం పచ్చడో, అధమం గన్ పౌడర్ అనబడే కారప్పొడో లేనిదే ఏ పూటా నాకు ముద్ద దిగదు. సమయానికి పచ్చళ్లేవీ అందుబాట్లో లేకపోతే నాలుగైదు పచ్చి మిరపకాయలన్నా పళ్లెంలో పడాల్సిందే. పెరుగన్నంలో పచ్చి మిరపకాయ నంజుకోవటం నాకతి ప్రీతిపాత్రం. మొత్తమ్మీద చెప్పొచ్చేదేమంటే, కారం ఘాటు నాకు పెద్ద విషయం కాదు. ఈ విషయంలో నన్ను మించినవాడు ఇప్పటిదాకా ఒకే ఒక్కడు తగిలాడు. అతనో ఆర్మేనియా దేశస్థుడు. మా పల్నాడు లాగానే అతని ప్రాంతమూ ఘాటదిరిపోయే పండు మిర్చి పంటకి పేరెన్నికగన్నదట. ఓ సారి మా ఇద్దరికీ మధ్య హోరాహోరీగా జరిగిన ఘాటు తినే పోటీలో చివరాఖరికి నేనోడిపోయాను. అతనొక్కడ్నీ తీసేస్తే, అలాంటి పోటీల్లో నాకు ఎదురే లేకుండా లేదనుకోండి (పోటీలంటే ఏవో నిజం పందాలనుకునేరు. ఇవి ఇళ్లలోనో, రెస్టారంట్లలోనో జరిగే స్నేహపూర్వక పోటీలు మాత్రమే)
పై సొంతడబ్బాని సంక్షిప్తీకరించి ఒక్క ముక్కలో చెప్పాలంటే – కారం విషయంలో నేనో ఎక్స్ట్రీమిస్టుని. తీపి విషయంలో మరో ఎక్ట్రీమిస్టుని. మిరపకాయలు కనిపిస్తే నా నోరూరటం ఎంత ఆటోమేటిక్‌గా జరిగిపోతుందో, స్వీట్లు కళ్లబడితే కడుపులో దేవటం అంతే సహజంగా జరిగిపోతుంది. జిలేబీ, లడ్డు, కేక్, ఇతరత్రా సవాలక్ష స్వీట్లలో నాకు నచ్చేదంటూ ఏదీ లేదు. పైపెచ్చు అవి చూస్తేనే వెగటేస్తుంది – తినకుండానే. నాకధికారం ఉంటే తీపిని సమాజం నుండి బహిష్కరిస్తాను. అవకాశం ఉంటే దాన్నీ సృష్టి నుండే వెలి వేస్తాను. స్వీట్లనేవి సైతానుకి ప్రతి రూపాలని నా నమ్మకం. అమెరికా వచ్చాక ఆ నమ్మకం మరింత బలపడిపోయింది. ఇక్కడ ఎక్కడ చూసినా స్వీట్లేనాయె! బ్రేక్‌ఫాస్ట్‌కీ స్వీట్లే తినేవాళ్లని ఏమనాలి? ఆ డోనట్లేమిటో, వాటికి ఆల్రెడీ ఉన్న తీపి చాలనట్లు పైన అంత మందాన పంచదార పాకం లేపనంలా పూయటమేంటో, వీళ్లవి లొట్టలేసుకుంటూ ఆవురావురుమని ఆరగించటమేంటో! డోనట్ల వ్యాపారం చెయ్యటానికి చైన్లకి చైన్లే ఉన్నాయి కదా, వాళ్లలో ఒక్కరన్నా నాలాంటోళ్ల కోసం హాలోపినో డోనట్లు చెయ్యకపోతారా అని ఇన్నేళ్లుగా ఆశగా ఎదురుచూపులు చూస్తున్నా – ఒక్కరికన్నా ఆ ఆలోచనొస్తే ఒట్టు.
పచ్చళ్లలంటే ఇష్టమని చెప్పాను కదా. పికిల్ అన్న మాట వినిపిస్తేనే నా నోరూరిపోతుందన్నమాట. ఆంధ్రావాళ్లు పచ్చగడ్డితో సహా కనపడ్డ ప్రతిదానితోనూ అలవోకగా పచ్చళ్లు పట్టి పారేస్తారన్నది పెద్ద రహస్యం కాదు కదా. వాటన్నిట్లో దేని టేస్టు దానిదే ఐనా నా వరకూ పచ్చళ్లలో కింగ్ అల్లం పచ్చడి (లోకో భిన్న రుచిః కాబట్టి, ముందు వాక్యంతో మీరు ఏకీభవించాలనేం లేదు). అల్లం అంటే అలాంటిలాంటి అల్లాటప్పా అల్లం కాదు, మాఁవిడల్లం. అల్లప్పచ్చడి తర్వాతి స్థానం ఆవకాయది. మామిడికాయతో పలు రకాల పచ్చళ్లు పట్టినా వాటిలో ఆవకాయ రుచి మరి దేనికీ రాదు (దీంతో మాత్రం మీరంతా ఏకీభవించి తీరాల్సిందే). మామిడికాయతో ఆవకాయైనా, మరే కాయైనా పడితే గిడితే తెలుగిళ్లలోనే పట్టాలని నాకు అనుభవపూర్వకంగా రుజువైన రోజొకటుంది.
నేను బ్యాచిలర్‌గా ఉన్న రోజుల్లో ఓ సారి .. నాకో కొత్త రూమ్మేటుడు లభించాడు (‘దాపురించాడు’ అనటం సమంజసం. ఎందుకనేదీ చివర్లో అర్ధమవుద్ది). అతను గుజరాతీయుడు. ఇండియా నుండి ఆవాళే వచ్చి దిగాడు. అతను పెట్టెలు తెరిచి సామాన్లొక్కోటే బయటికి తీస్తుండగా నా కళ్లబడిందది – ఎర్రగా మెరిసిపోతూ ఓ పచ్చడి సీసా. ఇంకేముంది, నా నోరు నయాగరా జలపాతమయింది. అప్పటికి నా దగ్గరున్న పచ్చళ్ల స్టాక్ ఐపోయి చాన్నాళ్లే అయింది. రోజుకి ముప్పూటలా అవే తింటే ఐపోకేం చేస్తాయి? నాకేమో రామోజీగారి పచ్చళ్లతో సహా మరే ఇతర వ్యాపార పచ్చళ్లూ రుచించవాయె. ఎంతైనా ఇంటి పచ్చళ్ల రుచే వేరు. సో, రూమ్మేటుడు పెట్టె తెరవగానే నా కళ్లు మిరుమిట్లుగొలిపాయి. పౌరాణిక సినిమాల్లో దేవుళ్ల తలకాయల వెనకుండే వెలుగులాంటిదేదో ఆ పచ్చడి సీసా చుట్టూ ఆవరించి కనిపించింది. చూస్తుండగానే అది విశ్వరూపం ధరించినట్లు అలా అలా పెరిగిపోతూ గదినంతా ఆక్రమించింది. ఆ దృశ్యాన్ని ఎలివేట్ చేస్తూ నేపధ్యంలో మంద్ర స్థాయిలో సంగీతం సైతం వినిపించింది. అవి గుడి గంటలా, చర్చ్ బెల్సా? ఏమో. ఏవైతేనేం, ఎదురుగా అభయ హస్తంతో భారీ పరిమాణంలో పచ్చడి సీసా. ఆ క్షణమే ఆ కొంగ్రొత్త రూమ్మేటుడికి నా అనుంగు మిత్రుడిగా పదోన్నతి లభించింది.
నయాగరా వరదల్లో మా ఇల్లు కొట్టుకుపోకముందే రూమ్మేటుడు విషయం గ్రహించాడు. ఆ రాత్రి సపర్ సమయంలో పచ్చడి ఆఫర్ చేశాడు. నవనవలాడే మామిడి పచ్చడి-ట. చూట్టానికది ఆంధ్రా స్టైల్ ఆవకాయలా అగుపడలేదు. ఆ ఘుమఘుమలాడే వాసనా లేదు. అయితే ఆకారమేదైతేనేం, వాసన లేకుంటేనేం, పచ్చడన్నాక పచ్చడే. మొత్తానికి, మ్యాంగో పికిల్ అన్నమాట వినగానే నయాగరా మరింత ఉధృతరూపం దాల్చింది. ఆలస్యం చెయ్యకుండా, ఆబగా ఆ పచ్చడేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని ఎర్రెర్రటి ముద్దొకటి తీసుకుని నోట్లో పెట్టుకున్నాను. నా కళ్లు అరమోడ్పులవుతుండగా, నాలుక మీది రుచి గ్రంధులు ఉత్తేజితమై పనిలోకి దిగాయి. న్యూరల్ నెట్వర్క్ ఆఘమేఘాల మీద గుజరాతీ ఆవకాయ రుచిని క్రోడీకరించి మెదడుకి చేరేసింది. మరుక్షణం ..
కెవ్వ్ .. ఆ నీరవ నిశ్శబ్ద నిశీధిలో, ప్రశాంతతకు ఆలవాలమైన మా కమ్యూనిటీ పేరు ప్రతిష్టల్ని పటాపంచలు చేస్తూ ప్రతిధ్వనించిందో పెను కేక. నయ వంచన .. నయా వంచన. పచ్చడి పేరిట పచ్చి దగా. అనుంగు మిత్రుడు ఆగర్భ శత్రువైన క్షణం.
అది పచ్చడా! థూ. పేరు వినీ, రంగు చూసీ దారుణాతిదారుణంగా మోసపోయాను. మ్యాంగో జామ్లా ఉందది – తట్టుకోలేనంత తియ్యగా. యాక్క్. రెండు గ్లాసులు నీళ్లు తాగితే తప్ప వికారం తగ్గలేదు.
అప్పట్నుండీ గుజరాతీ పచ్చళ్లంటే నాకు అదుర్స్.
హమ్మో! మీ కడుపులోని ప్రేగులకు ప్రత్యేక లైనింగ్ ఏమైనా వేసాడా ఆభగవంతుడు.
పచ్చళ్ళకి పేటెంటంటూ ఉంటే ఖచ్చితంగా అది తెలుగువాళ్ళదే! వేడన్నంలో ఆవకాయ ( ఫేట్ అని నెయ్యి మానేసాం – అదీ కిలిపితే…అంతే సంగతులు..) రుచి దేనికొస్తుంది చెప్పండి? నాకు జయదేవ్ అనే ఓ మళయాళీ ఫ్రెండొకడున్నాడు. మీ గుల్టీస్ అందరూ ఈ కారం ఎలా తింటారో? అంటూ ప్రశ్నార్థకం ఫేసు పెడితే, వాడికోసారి వేడన్నంలో ఆవకాయా + కాస్త నెయ్యీ దట్టించి ఓ రెండు ముద్దలిచ్చాను. అంతే క్షణంలో వాడు ఆవకార్గా మారిపోయాడు.
మీ తెలుగోళ్ళ టేస్టే టేస్టు. భలే ఉందంటూ ఆవకాయ పేరు చెబితే చాలు నాన్-స్టాప్ గా రొట్టలేస్తాడు. ఇప్పటికీ వాడు ఏడాదికి సరపడా ఆవకాయని ఆంధ్రానుండి దిగుమతి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక వాళ్ళావిడనీ ఆవకార్గా మార్చేసాడు. వాళ్ళకిద్దరమ్మాయిలు. వాళ్ళ ఫేవరేట్ ఏమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉండాలి.
అవియల్ ఫేమిలీ కాస్తా ఆవకాయ్ ఫేమిలీ అయ్యింది.
ప్రతీ యేటా వాళ్ళింట్లో ఆవకాయ వ్రతకల్పం జరుగుతుంది.
చూడ్డానికొచ్చిన వారందరికీ ఆవకాయ వ్రత మహత్యం కథ చెప్పి ఓ రెండు ముద్దలు మహా ప్రసాదం పంచిపెడతారు.
గురూగారూ HABANERO CHILI PEPPER అనే మిరపకాయొకటి దొరుకుద్ది. చూడ్డానికి భలేగుంటుంది ముద్దుగా, నారింజ రంగులో మెరిసిపొతూ. ఓ సారి వాటినో రెండింటినేదన్నా పచ్చట్లో వేసి తిన్న తరువాత చెప్పండి కారం గురించి.
హ హ హ ఈ విషయం లో మీకు నేను తోడున్నా 🙂
ఆహా! ఆద్యంతం పడిపడి నవ్వుకున్న .చాల బాగుంది .పచ్చడి తినని మనిషే మనిషి కాదు నా ద్రుష్టి లో ,ఎక్కడికెళ్ళిన నా కళ్ళు పండుమిరపకాయలాటి పచ్చళ్ళ కోసం వెదుకుతాయి,ప్రతిరోజూ పచ్చడి లేనిది గడవదు .
పోయి పోయి గుజరాతి పచ్చళ్ళతోనే పెట్టుకున్నారా ..నేనూ ఓమారు తిన్నా..థాయ్ వంటకాలు కూడా చూడటానికి ఎర్రెర్రగా కారంలో ముంచి తీసినట్లుగా కనబడతాయి కాని నోట్లో పెట్టుకుంటే తియ్యగా ,తేనె పాకం..కాని నేను మీలా అదిరి బెదిరి పోలేదు.. తీపి అంటే ఇష్టం లేదు కాని కారం అంటే మాత్రం భయం.. 🙂
hammayya naa lanti vallu inka bhoomi meeda unnaranna mata. nenaite…halapeno peppers to mirchi bajji .adiripotundi…veelaite try chesi chudandi
అంతా బాగుంది కానీ అల్లప్పచ్చడికి కింగ్ ప్లేసే కొంచం…కింగ్ ఆవకాయకదా:-)
People give me all sorts of looks – When a waiter asks me for Spice levels on the scale of 1 to 10 and I say “11” )
Ravi,
I tried it and loved it too!
మన కారం తినాలంటే గుజరాతీయులే కాదు. ఉత్తరాది వాళ్ళంతా కళ్ళనీళ్ళు పెట్టుకోవాల్సిందే…మీసం లేని మొగోళ్ళు…. 🙂
నేను చిన్నప్పుడు ఒక కలగనేదాన్ని.పటిక బెల్లం ఇల్లు,పంచదార పాకం ఫౌంటైన్,బెల్లం జీడి పరుపు ఇలా వుండేది నాలోకం.నాకే గనుక అధికారం వుంటే మిమ్మల్ని అలాంటి లోకానికి యావజ్జీవ శిక్షకి పంపిస్తాను. లేకపోతే స్వీట్ ని సృష్టిలోంచి వెలేసేస్తానంటారా?మనలో మన మాట.నేను పచ్చళ్ళు,కారాలు కూడా చాలా బాగా తింటాను.నేను ఎక్కువ పచ్చళ్ళు తినబట్టే మా అబ్బాయి కాస్త ఛాయ తక్కువ పుట్టాడని మావారి అభిప్రాయం 🙂 పచ్చళ్ళ పేరు చెప్పి ఊరించినందుకు మీకు శిక్ష ఏమిటంటే అర్జంటుగా[మరీ అర్జంటుగా కాదు పచ్చళ్ళ సీజన్ వచ్చాకా] నాకో కేజీ జీడావకాయ,రెండు కేజీల కొత్తావకాయ ని జరిమానా గా పంపించండి.
ఇదసలు బొత్తిగా బాగలేదు. మీకు కారమైతే ఎంత ఇష్టమైతే మాత్రం స్వీట్సుని/స్వీటర్సుని ఇలా అవమానించేలా రాతలు రాయటం నాకస్సలు నచ్చలేదు. ఇందుకు మీరు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే. ((స్వీట్సు) ఏమీ లేకపోతే చక్కెర పలుకులు తిని ప్రశాంతతను పొందే వంశం మాది).
మీ పచ్చడి పురాణం బాగుంది. రోజు ఎన్ని కూరలు తిన్నా..ఇంట్లో ఈరోజు ఫలానా పచ్చడి చేసాను అంటే చాలు ఆ మాట వినగానే నోరు నయాగరా కాదుగాని గోదావరి ప్రవాహమే. జీవితంలో మొదటిసారి దానిని చూసిన అనుభూతి, ఒకేసారి అబగా తినేయాలన్న కోరిక. అసలు ఆంధ్రా అంటేనే ఆవకాయ..ఆవకాయ అంటేనే ఆంధ్రా..పచ్చళ్ళో ఇదే ఎప్పటికి రారాజు. మీరేమనుకున్నా సరే. మా నాన్నగార్కి మీలాగే అల్లం పచ్చడి కావాలంటారు. నా మటుకు కొబ్బరి పచ్చడి, కొత్తిమీర నిమ్మరస కారం పచ్చడి అంటే ప్రియం. మా కోనసీమలో ఒకప్పుడు డొక్కా సీతమ్మ అనే బ్రాహ్మణ ముసలావిడ ఉండేది. ఆవిడ గరిక గడ్డితో చేసే పచ్చడి బాగా ఫేమస్. ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఇంటికి వచ్చిన కుల మతాలకు అతీతంగా భోజనం పెట్టేది. అదిగో అలా ఆవిడ వంట రుచి చూసినా ఎంతోమంది చెప్పిన విషయం అది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆమే జ్ఞాపకార్థం గోదావరి నది మీదున్న గన్నవరం అడ్వికేట్ కి డొక్క సీతమ్మ అడ్వికేట్ అని పేరు పెట్టారు. అదండీ మన ఆంధ్రా పచ్చళ్ళ గొప్పతనం.
ఎప్పటిలానే, ఈ పోస్ట్ కూడా బాగా రాశారు. Jalapeno డోనట్లు మీలాంటి వాళ్ళకి కేకులు. మామూలు జనాల గావుకేకలు.
ఇంతకీ, Union City లోని MyThai restaurant లో తిన్నారా? అక్కడి ‘wall of flame’ మీద మీ ఫుటొ కానీ ఉందా? 🙂
మీ టపాలోని ప్రతి అక్షరంతో ఏకీభవిస్తా! తీపి విషయంలో నేను కూడా మీలాగే ఎక్స్ట్రీమిస్స్టునే! నాకు ఏ స్వీటు అయినా చేత్తో పట్టుకోవాలన్నా చిరాకే!
గుజరాత్ వాళ్లవే కాదు..బీహారు, అస్సాం, బెంగాలు..ఎవరి పచ్చళ్లు చూసినా తియ్యగా లేహ్యంలా ఉంటాయి..ఒక్కసారి వాటిని రుచి చూసామా మన పచ్చళ్లంటే మనకు అపరిమితమయిన ప్రేమ పుట్టుకొస్తుంది. హాస్టలులో ఉండగా మెస్సులో ఆంధ్రా వాళ్లమంతా ఒక టేబుల్ దగ్గర కూర్చునేవాళ్లం. ఇంటినుండి సీసాలు సీసాలు పచ్చళ్లు..ఎన్ని తెచ్చినా వారంలో ఖతం…మిగతా అందరూ ఆశ్చర్యంగా అంతంత పచ్చళ్లు ఎలా తింటారు మీరు అని బుగ్గలు నొక్కుకునేవాళ్ళు. ఓ అస్సామీ ఫ్రెండు మేమంతా వద్దంటున్నా ఓ రోజు మన ఆవకాయ రుచి చూసింది..ఇక తన మొహం చూడాలి..ఎర్రగా కందిపోయి…ముక్కుపుటాలు ఎగరవేస్తూ వగరుస్తూ గంటసేపు నానా బాధలు పడింది… ఆ దెబ్బకి మెస్సులో మా టేబులు వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడేది!
భలే వాళ్ళే..మీరు నాతో ఈ పోటీలో ఓడిపోతారని నా నమ్మకం.
నా గుంటూరు మిత్రుడితో ఓ సారి పోటీ పడి హాబ్బెనోరో పెప్పర్స్ వరుసగా ఏడో, ఎనిమిదో లాగించానో సారి.( మర్నాడు ఓ రెండు పుస్తకాలు బాత్ రూం లోనే ఫినిష్ చేసాననుకోండి:-). మా ఇంటికెవ్వరు వచ్చినా కళ్ళ నీళ్ళు పెట్టుకుని పోతారు.
అలాగే నాకీ గుజరాత్ పచ్చళ్ళ గురించి తెలీక, ఓ సారి ఇండియన్ స్టోర్స్ లోంచి తెచ్చా.. ఓర్నాయనో, అవి మనుషులు తినేవి కాదు.. పక్షులకి, సాధు జంతువులకి పెట్టేవి.
మీరు స్వీట్ ప్రియుల మనోభావాలు దెబ్బతీశారు. అర్జంటుగా క్షమాపణ చెప్పి ఒక కిలో స్వీట్లు పరిహారంగా ఇవ్వాలి 🙂
విజయ్ మోహన్ గారి ప్రశ్నే నాదికూడాను (:-?
కారం గురించి చెప్పి అదరగొట్టేశారుగా! నిన్ననే రోజూ రోటి పచ్చళ్ళ కోసం ప్రతీరోజూ కూరలు వెతుక్కోవలసి వస్తోందని, పండు మిరపకాయలు, ఉప్పు, చింతపండు కలిపి ఒక పెద్ద సీసా నిండా రుబ్బి పెట్టాను, కావలసినప్పుడు కాస్త మెంతిపొడీ, ఇంగువా వేసి తిరగమాత పెట్టుకోవచ్చని!! అస్సలు ఊరగాయలంటే – తెలుగు వారి ఇళ్ళలోనే కదా తినాలి! మాకు మటుకు ఎన్ని ఊరగాయలున్నా, మళ్ళీ రోటి పచ్చడి కావాలండోయ్! వాటికి చచ్చినా మిక్సీ వాడము. ఇంటికి వెళ్ళాక అర్జెంటుగా పచ్చిమిరపకాయల కారం చేసుకొని తినాలి. అన్నట్లు అప్పుడెప్పుడో – నేను రాసిన ఆవకాయ పురాణం లంకె క్రింద ఇస్తున్నాను. వీలుంటే చదివి ఆవకాయ ప్రాశస్త్యాన్ని మరోసారి గుర్తు చేసుకోండి.
http://virajaaji.blogspot.com/2008/10/blog-post_23.html
నేను గుజరాత్ లో మూడేళ్ళకుపైగా “తీపి” కష్టాలు పడ్డాను.
వాళ్ళు కూరల్లో కూడా పంచదారో బెల్లమో వేసి చేస్తారు.
ఒకసారి “పాలీతానా” వెళ్ళినప్పుడు వాళ్ళ కూరలేమీ తినలేక కఢీ (చల్ల పులుసు లేదా మజ్జిగ పులుసు) వెయ్యమని అడిగాను.
అందులో కూడా పంచదార వేసి చచ్చారు.
ఇంటినుంచి వెళ్ళినప్పుడు నాలుగైదు సీసాలలో ఊరగాయలు పట్టుకుని వెళ్ళేవాళ్ళం.
ఎన్నోసార్లు బ్రెడ్డులో ఆవకాయని జాం లా రాసుకుని తిన్నాం.
హ హ టైటిల్ నుండీ అదరగొట్టేశారు 🙂
కానీ చాలా విషయాల్లో మీ అభిప్రాయాలను బేషరతుగా ఖండిస్తున్నా…
ముందుగా పచ్చళ్ళలో రారాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవకాయే.. అల్లప్పచ్చడి కేవలం పెసరట్టుకు మాత్రమే మారాజు అంతే. పచ్చళ్ళకు కానే కాదు.
హన్నా స్వీట్లను అంతమాట అంటారా.. రాధిక గారు చెప్పినట్లు మీకు స్వీట్లు తప్ప మరోటి దొరకని లోకంలో ఉంచి శిక్షించేస్తాం జాగ్రత్త…
హేంటో నేను గుంటూరు లో సెటిల్ అయినా కారం ఓ మోస్తరుగా మాత్రమే అలవాటు (ఇప్పుడు అర్జంట్ గా గుంటూరు నుండి బహిష్కరణ విధిస్తారో ఏమో) నా మటుకు నాకు ఊరగాయలకన్నా రోటి పచ్చళ్ళు అంటేనే అమితమైన ప్రేమ.
ఇక్కడో ఇంతపొడుగు కామెంటు రాద్దామని మొదలుపెట్టాను,అయినా అదేమో పెద్ద టపా అయ్యేలా అనిపించి(కుళ్ళు పుట్టి అనుకున్నా తప్పులేదు)ఆ టపా యేదో మనమే రాసుకుంటే పోలా అని ఆపేసా 🙂
ఈ విషయంలో నేను కూడా మీలానే.. (ఎంతైనా ఒకే జిల్లా వాళ్ళం కదా 🙂 )
నాకు కారం పడినట్లు స్వీట్ పడదు.. కొరియాకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి ఆవకాయ, పండుమిరపకాయ, గోంగూర అన్నీ తీసుకువెళ్ళా.. పండుమిరపకాయ తిన్న మా కొరియన్ కొలీగ్ అప్పటినుండి నన్ను ఇండియన్ ఫుడ్ రుచి చూపించమని ఎప్పుడూ అడగలేదు 🙂 అయినా, ఆ పచ్చడి కి తమిళుళు, మలయాళీళు కూడా గుడ్ల నీళ్ళు కక్కున్నారు 😉
అలాగే అక్కడ ఉన్నంతకాలం, నేనూ అక్కడ వంటకాల్లో, పచ్చి మిరపకాయలు నంచుకుని తినేదాన్ని!!
నాకు మాత్రం ఆవకాయ ఫేవరేట్.. ఎంతగా అంటే, టి.వి/సినిమా లో ఎప్పుడైనా ఆవకాయని చూపిస్తుంటే, అప్పటికప్పుడు అన్నం లో ఆవకాయ కలుపుకుని తినాలనిపించేంతగా..
Abba…. ee tapa chaduvutunte naku urgent ga vedi vedi annam lo avakaya kalupukuni tinalani vundi… andulo omlete kuda vutne keka… nenu omlete priyuralini… 🙂
chala funny ga express chesaru gujrathi pachadi experience… nijanga pachadi ante mana telugu vallade… ee North side pratidaniki sweet enduku add chesetaro ardam kadu….
తెలుగోడు గారూ,
ఈ ప్రత్యుత్తరం మీ ఈ టపాకు కాదు. మీ బ్లాగ్ చాలా సార్లు చూసినా ఎప్పుడూ కామెంటలేదు. కానీ, మీరు వ్రాస్తున్న సీరీస్, “ఒక ఉద్యమం పది అబద్దాలు” మాత్రం అదిరింది…! మీరు వ్రాసిన భావజాలం కొత్తది కాకపోయినా, మీరు విడమరిచే తీరు, భాష మీద మీరు చూపించే ఆధిపత్యం తెగ నచ్చాయి నాకు.
మీ “ఒక ఉద్యమం, పది అబద్దాలు – 7,8,9,10″ కొరకు ఆత్రంగా వేచి ఉన్నా! ప్రతీ రోజూ, మీ వ్యాసం ఒక్కో భాగం మా office లో సాటి తెలుగు వారికి పంపుతున్నా. మా office అంతా మీ అభిమానులయ్యారంటే నమ్మండి!
మీరు ఒక్కో సమస్యను విశ్లేషించే శైలి చాలా బాగుందండీ.. కొన్ని కొన్ని విశేషణాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా, “మన తాతలు తాగిన సువాసనా భరిత నేతులు”, “సింహాసనం కామెడీ”, చెప్పాలంటే చాలా ఉన్నాయి.
ఏ పనీ చెయ్యకుండా, అదనీ ఇదనీ వాదించే వారికంటే, మీలాగా, ఇలా educate చెయ్యడం నాకు చాలా నచ్చింది… మా ఆఫిస్ లొ కొందరు మీకు శత్రువులు కూడా అయ్యారండోయ్.. అదే మన తెలంగాణా సోదరులు! … కానీ బాధాకరమ ఏమంటే, ఏది ఎలా ఉన్నా, రెండు ప్రాంతాల మధ్య తీరని ఒక విద్వేషం రగిలింది అని మాత్రం ఘంటా పథంగా చెప్పగలను!…కనీసం, ఇప్పటికైనా ప్రజానీకం కళ్లు తెరిచి ఇలా జరగడం వల్ల ఏమి కోల్పోతున్నాం, ఎవరు లాభపడుతున్నారు అనే విషయం గ్రహిస్తే మేలు..
మీ తదుపరి టపాల కొరకు వేచి ఉన్న మీ అభిమాని!
ikkada “hot breads” ane desi bakery lo Jalapeno Biscuits dorkutayi try cheyyandi karam karam ga baguntayi
కారం తో కాళ్ళ నీళ్ళు రావడం ఏమో కానీ, మీ టపా చదువుతుంటే నవ్వాపుకోలేక కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నై .. విరగాతీత .. ౫ నక్షత్రాలు ఇచ్చేసా
మీ బ్లాగ్ గురించి సుజాత గారి బ్లాగ్ లో చూసాను .. ఇప్పటికే చాల టపాలు చదివి మీ బ్లాగ్ ఫ్యాన్ అయ్యాను 🙂 ఇది న మొదటి కామెంట్
—-
“టామ్ హార్నెస్ కాస్తా టామ్ ఫర్నేస్గా మారిపోయి పొగలు, సెగలు కక్కుతున్నాడు”
“నా నోరు నయాగరా జలపాతమయింది”
కేక !!!
మహేష్
ఠాఠ్! ఎంత కారం ఇష్టమైతే స్వీట్లనే ఎద్దేవా చేస్తారా ఇక్కడ. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తమిళనాడు ఆపక్క కర్ణాటక ఇంకో పక్క మహరాష్ట్ర అందరు అర్రులు చాచే తిరుపతి లడ్డు స్వీటు కాదా, ఏదైనా గుడికెల్తే ప్రసాదాల్లో స్వీట్లది కాదూ సింహభాగం. ప్రపంచంలో 7% మందికి చక్కెర వ్యాధి ఉంది, కారం వ్యాధి ఉన్న వాళ్లని ఒక్కరిని చుపించండి బస్తీ మే సవాల్. ఎండలో ఎక్కువ సేపు తిరిగితే చక్కెర వస్తది కాని చలిలో కాని వర్షంలో కాని తిరిగితే కారం వస్తుందా! ఎనీ డౌట్స్.
కారం విషయంలో నన్ను గెల్చే వాళ్ళు ఇంతవరకూ నాకు కనపడలేదు.
ఇప్పడివరకూ ఎంచక్కా మీ పోస్ట్‌లు చదివేదాన్ని. అనవసరంగా నన్ను మీ శత్రువుని చేసేసుకోకండి. అసలేమనుకున్తున్నారు మీరు? తీపిని వెలివేస్తారా? హన్నా.
పోనీలే కదా నాక్కూడా పచ్చళ్ళు ఇష్టం అని చెప్తామనుకుంటుంటే. ఇకపోతే, పచ్చళ్ళల్లో నన్నడిగితే గోంగురదే కింగ్ స్థానం. అఫ్ కోర్సు అల్లానికి queen పోసిషన్ ఇచ్చేయోచ్చు. మామిడికాయతో పెట్టె అన్ని రకాలు నాకిష్టమే
చూడబోతే ఉద్యమాల గురించి రాస్తున్న వరస టపాల కన్నా ఈ మిరపకాయ టపానే ఎక్కువ కాంట్రవర్సీ సృష్టించినట్టుందే! ఇంతమంది తసమదీయులు తయారౌతారని ఊహించలేదు 😀
ఇంకా కొన్ని మర్చిపోయారు. మజ్జిగలో వాముమిరపకాయ, పులుసుల్లో సాంబారు కారము, కారంచేడు ప్రాంతాల గోంగూర పచ్చడి. సాంబారు కారం ఎందుకుపేరొచ్చిందో తెలియదు. మాప్రాంతాలలో (రేపల్లె, తెనాలి, బాపట్ల, చాల క్రిష్నా జిల్లా ప్రాంతాలలో) ఇది కూరల్లో ముఖ్యంగా పులుసులలో వాడుతాము. ఇడ్లీలలో చాలా బాగుంటుంది. మిరపకాయల్లో వేడేకాదు, రుచులు తేడాలు ఉన్నయ్యి. మాదొడ్లో ఏడెనిమిది రకాలు ఉన్నయ్యి. నాకు మెక్సికో మిరపకాయలు బాగుండవు. గుంటూరు కొరివికారప్పచ్చడి నేతితో చిన్నప్పుడు బాగుండేది. ఇప్పుడు ఆవకాయే ఇష్టం. అల్లం, మామిడల్లం ఉప్మా, దొసెలలో నంజుకోటానికే వాడుతాను. అరవైదేల్లు దాటిన తరువాత అప్పుడప్పుడూ పొట్ట గొడవ చేస్తూంది. కాని సాంబారుకారము ఆవకాయ లేకుండా ఉండలేను. ఒక వైద్యుడు చెప్పాడు; మరీ పేచీ పెట్టితే ముందు కొంచెం పెరుగు తిని తరువాత పచ్చళ్ళు తినమని.
నోట్లో నీళ్ళు వూరుతున్నయి మీ టపా , ఇంకా దాని మీద కామెంట్స్ చూసి. ఇక్కడ రాసే మీరు, మీ followers అభిరుచి superb.
మీ టాం హార్నేస్ లాగా మా స్నేహితుల నుండి నేను చదువుకొనే చోట్ల చాలా సార్లు అసూయా ద్వేషాలను ఎదుర్కున్నా. ( మంచి అసూయా-ద్వేషాలన్నమాట 🙂 ). ఆవకాయలో పెద్ద కారం ఉండదండీ బాబు. పండు మిరపగాయ పచ్చడి ఉంటుందీ ….. అదిరిపోద్ది. నా ఫేవరెట్స్ మాత్రం పండు మిరపగాయ, టమోటా, గోంగూర ఆ తర్వాతే ఆవకాయ, అల్లం పచ్చళ్ళు.
‘భలే రాశారే!’ అని నవ్వుకుంటూ గబగబా చదువుతుంటే ఒక్కసారిగా గుండె కలుక్కుమంది.. నా ప్రియమిత్రులని సైతాను ప్రతిరూపాలని ఎంత నిర్దయగా అనేశారండి!! తీపినీ, కారాన్నీ రెండు కళ్ళుగా చూసుకునే మాలాంటి సమైఖ్యవాదులకి మీలాంటి కారపువాదుల అభియోగాలు చాలా మనఃక్లేశాన్ని కలిగిస్తున్నాయండి :)))
ఇక విషయానికొస్తే అల్లం పచ్చడి విషయంలో నా ఓటు మీకే! ఇంట్లో అమ్మ డైనింగ్ టేబుల్ మీద బుజ్జి బుజ్జి జాడీల్లో 2,3 పచ్చళ్ళు పెట్టి ఉంచేది.. అందులో అల్లం పచ్చడి తప్పనిసరి.. ఇక అటెళ్తూ కొంచెం, ఇటెళ్తూ కొంచెం నాలిక్కి రాసుకుని వెళ్ళేదాన్ని.. సగం పైగా పచ్చడి అలానే అయిపోయేది.. ఇంక మా ఇంట్లో రోజూ రోటి పచ్చడి తప్పకుండా ఉండేది.. పొద్దున్న రోటి పచ్చడి, రాత్రికి ఊరగాయ పచ్చడి… ప్చ్.. ఆ రోజులే వేరు!!
Me a chillier fellow