జనవరి, 2010ను భద్రపఱచుఒక ఉద్యమం, పది అబద్ధాలు – 5

ఐదో అబద్ధం:

తెలంగాణవారిపై ఆంధ్రావారి వివక్ష.

ఇదీ నిజం:

రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల ధాటికి కుదేలైన బుల్లి దేశం అనతి కాలంలోనే అగ్రగామిగా మారిన వైనం మన కళ్లెదురే ఉంది. అదే సమయంలో స్వతంత్రం పొందిన మన దేశం ఎక్కడుంది? అమెరికా వాడు బాంబులేశాడని ఏడుస్తూ కూర్చోకుండా రెట్టించిన కసితో జపనీయులు ముందుకు దూసుకుపోతే, బ్రిటిషర్లూ మహమ్మదీయులూ కొల్లగొట్టిన సంపదల ఊసులాడుకుంటూ, తాతలు తాగిన సువాసనాభరిత నేతుల సొల్లు కబుర్లు చెప్పుకుంటూ భారతీయులం మాత్రం గొంగళి వేసిన చోటే ఆర్చుక్కూర్చునున్నాం. ఎందుకంటే – సెల్ఫ్ పిటీలో మన తలదన్నేవారు ప్రపంచంలోనే లేరు కాబట్టి. ఎదుటివాళ్ల సానుభూతి కోసం మనం పడని పాట్లుండవు. ‘చూశారా నాకేమయిందో, చూశారా నాకెంత అన్యాయం జరిగిందో’ అని గుండెలు బాదుకోటంలో ఉండే మజా సగటు భారతీయుడికి మరి దేనిలోనూ ఉండదు. ‘నేను కష్టపడి పైకొచ్చా’ అని రొమ్ము విరుచుకుని చెప్పుకోటంకన్నా ‘నన్ను వాడు తొక్కేశాడు’ అని గుడ్ల నీరు కుక్కుకోటమే ఎక్కువమందికి ప్రీతిపాత్రం. ఆ రకంగా రాలిపడే కడవలకొద్దీ జాలిని కరువుదీరా గ్రోలి బ్రేవుమని తేన్చితే అదో తృప్తి. దాని ముందు మిగిలిన ఇహ పర భోగాలన్నీ బలాదూర్.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా .. అన్ని రకాల వనరులూ, లెక్కలేనంత యువశక్తీ ఉన్నా మన దేశం కునారిల్లుతుండటానికి ఓ ముఖ్య కారణం – భావోద్వేగాలకిచ్చే విలువ మరి దేనికీ ఇవ్వని గుణం తరతరాలుగా మన జాతి జన్యువుల్లో జీర్ణించుకుపోవటం. ఈ గుణానికో కవల సోదరీ ఉంది: మన చేతగానితనానికి ఎవడిమీదనో పడి ఏడవటం. మన సినిమా కథల్లో నూటికి తొంభై సెంటిమెంటు చుట్టూనే తిరుగుతున్నా, వందలాది టీవీ ఛానళ్లలో లెక్కలేనన్ని గ్లిజరిన్ కన్నీళ్ల జీడిపాకం సీరియళ్లు నిరంతరాయంగా ప్రసారమౌతున్నా, పత్రికల్లో ఆదివారం అనుబంధాల కథలన్నీ ఏడుపుగొట్టు బాధా గాధలతోనే నిండిపోయినా, ఎన్నికల్లో ఓడిపోయిన లీడరుడు ఈవీఎంల మీద పడేడ్చినా, పరీక్ష తప్పిన పిల్లాడు పేపర్ ఔటాఫ్ సిలబస్ వచ్చిందనే పాట పాడినా .. వాటన్నిటికీ ఈ జంట గుణాలే కారణం. స్వలాభం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టబూనే రాబందుగాళ్ల, వాళ్ల వెనకుండే చిల్లరమల్లర బాజా భజంత్రీగాళ్ల చేతుల్లో ఇవే అల్లావుద్దీన్ అద్భుత దీపాలు. ఉద్యమాల ముసుగులో ఉపాధి కల్పన చేసుకునే రాజకీయ నిరుద్యోగులకి ఇవే ఉద్దీపకాలు.

నాకో స్నేహితుడున్నాడు. కరీంనగర్ వాస్తవ్యుడు, విద్యాధికుడు. మా పరిచయం పన్నెండేళ్ల క్రితం – హైదరాబాదులో ఉద్యోగాల వేటాడే రోజుల్లో. కొన్నాళ్ల వెదుకులాట తర్వాత, ఇద్దరికీ ఒకే సంస్థలో ఉద్యోగమొచ్చింది. ఆ సంస్థ అధిపతి కోస్తాంధ్రవాసి. కొన్నాళ్ల ట్రైనింగ్ తర్వాత ఆ సంస్థ మా ఇద్దర్నీ, మరి కొందర్నీ అమెరికా పంపింది. ఇక్కడికొచ్చాక కొన్నాళ్లకే నా మితృడి ఉద్యోగం ఊడింది. తర్వాత రమారమి ఆరు నెలలు అతను ఖాళీగానే ఉండాల్సొచ్చింది. అతను డీలాపడి ఉన్న సమయంలో, అదృష్టవశాత్తూ నేను పని చేస్తున్న చోట ఓ ఉద్యోగావకాశం రావటం, నేను ఇతన్ని రికమెండ్ చేసి ఆ స్థానంలో తీసుకునేలా చేయటం, అతనా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా పైకెదగటం జరిగిపోయాయి.

హైదరాబాదులో స్నేహం కుదిరిన నాడూ, అతనికి ఉద్యోగం విషయంలో సహాయం చేసిన నాడూ ఆంధ్రప్రదేశ్‌లో మా ప్రాంతాలు వేర్వేరనే ఆలోచన మా ఇద్దరికీ లేదు. మా కెరీర్లకి పునాదులేసిన సంస్థకీ ఆ తేడా తెలీదు. తెలంగాణ వేర్పాటోద్యమం గీసిన విభజన రేఖల పుణ్యాన, నా స్నేహితుడికి ఈ మధ్యనే తెలిసిందా తేడా. నెలన్నర కిందట, ఓ ఫంక్షన్ సందర్భంగా అతను నాతో అన్న మాట నాకు షాక్ తినిపించింది: ‘మీకు మేమంటే వివక్ష భై’.

తేరుకుని కాసేపాలోచించాక అనిపించింది – అతని విషయంలో నేను వివక్ష చూపటం నిజమే. ఉద్యోగార్ధులైన పరభాషా స్నేహితులు మరికొందరూ ఉన్నా ఆనాడు ఇతనికే సహాయం చెయ్యటానిక్కారణం – నా దృష్టిలో సాటి తెలుగువాడన్న ఆపేక్ష, ఆ పరభాషా మితృల దృష్టిలో తమపై వివక్ష. చూసే కోణం నుండే ఉంటుంది ఏదైనా. వివక్ష అనేమాట ఇతన్నుండి రావటమే విచిత్రం. నేనతనికి సాయం చేసినట్లే, అతనూ గత పదేళ్లలో కొందరు స్నేహితులకి సాయం చేసి ఉన్నాడు. వాళ్లందరూ తెలంగాణవాసులే కావటం నాకు తెలిసినంతవరకూ కాకతాళీయం. అనాలంటే దీన్నీ వివక్షే అనొచ్చు మరి. ఆ సంగతటుంచితే, నా స్నేహితుడికి తన ప్రాంతంపై మమకారముండటం తప్పుపట్టాల్సిన విషయం కాదు. అక్కడుండే సమస్యలపై ఆవేదన వ్యక్తం చెయ్యటమూ అర్ధం చేసుకోవాల్సిన విషయమే. ఆ సమస్యలకి పొరుగు ప్రాంతీయులు కారణమనటమే విడ్డూరం. అతని వితండవాదానికి విసిగిపోయి ‘తెలంగాణపై అంత ప్రేమున్నోడివి అమెరికాలో ఏం చేస్తున్నావు గురూ’ అంటే అతన్నుండొచ్చిన సమాధానం: ‘మీ ఆంధ్రావాళ్లు మా హైదరాబాదుపై పడి మాకు ఉద్యోగాలు రాకుండా చెయ్యబట్టి’!

వేర్పాటువాదులు వివక్షకి ఉదాహరణగా ప్రముఖంగా ప్రస్తావించే విషయాల్లో ఇదొకటి – తెలంగాణలో (అంటే హైదరాబాదులో) ఉద్యోగాలన్నీ ఆంధ్రావారే కొట్టేస్తున్నారనే వాదన. అదెంతవరకూ నిజం అనే విషయంలో లెక్కలు రకరకాలుగా వినిపిస్తుంటాయి. ఆ లెక్కలెలా ఉన్నా, ఆ వాదనలో అసలు నిజం లేదనలేం. అయితే దానికి వివక్ష అనే పదం వాడటం సమంజసమేనా? తమవారికి సహాయం చేసుకోవటం వ్యక్తులకీ, సమాజాలకీ సహజ లక్షణం. ప్రపంచవ్యాప్తంగా అది సర్వసాధారణం. ఆ గుణానికి పక్షపాతం అన్నది సరైన పదం. వివక్ష అనటం దాన్ని భూతద్దంలో చూపే ప్రయత్నం. మరి ఏది వివక్ష? పొట్టకూటికి రాజధానికి తరలొచ్చినవారిపై దోపిడీదార్లన్న ముద్రేయటం వివక్ష. దారినపోయేవాడిని ‘నువ్వు తెలంగాణవాడివా, ఆంధ్రావాడివా’ అన్న ప్రశ్నేయటం వివక్ష. ప్రాంతాల పేరుతో ‘భాగో, జాగో’ నినాదాలివ్వటం వివక్ష. ‘నరుకుతాం, నాలుకలు తెగ్గోస్తాం’ అనటం వివక్ష. ఇవన్నీ చేస్తుందెవరు?

పైన చెప్పుకున్న పక్షపాతం న్యాయమేనా అన్నది మంచి ప్రశ్న. దాన్ని నియంత్రించాలనే విషయంలో రెండో మాట లేదు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఓ రూపంలో అది బయటపడుతూనే ఉంటుందనేది సత్యం. కారణం – ముందే చెప్పుకున్నట్లు అది మానవులకి సహజ గుణం. తెలంగాణవారు సైతం దీనికి అతీతులేమీ కారు. చారిత్రక కారణాలతో చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ మొదట్నుండీ కొన్ని కోస్తా జిల్లాలవారు ముందుండటం కాదనలేని నిజం. అయితే గత యాభయ్యేళ్లలో ఈ విషయంలో వీరికీ, ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన ప్రాంతాలవారికీ మధ్య ఉన్న తేడా గణనీయంగా తగ్గుతుందనేదీ నిజం. ముందుగా పరుగు మొదలెట్టిన వాడు అగ్ర స్థానంలో ఉంటాడన్నదీ, ఆలస్యంగా పందెంలో చేరినవాడు అతన్నందుకోటానికి చెమటోడ్చాలనేదీ అర్ధం చేసుకోలేనంత పెద్ద విషయం కాదు.  అదే విషయం తెలంగాణ ప్రజలకి విడమర్చాల్సిన రాజకీయ నాయకత్వం ఆ పనిలో ఘోరంగా విఫలమవటమే కాక, తమ చేతగానిదనాన్ని కప్పిపుచ్చుకోటానికి ప్రయోగించిన అబద్ధమే ఈ వివక్ష.

ఈ నిఖార్సైన అబద్ధాన్ని వీళ్లెంత నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారంటే – ఈ మధ్యనో విదుషీమణి, మనుగడ కోసం పూటకో పార్టీ మార్చే మాజీ మహానటీమణి, తెలంగాణ అమ్మాయిననవటంతో చిత్రసీమలో తనని తొక్కేశారని తాజాగా వాపోయింది! రమారమి పాతికేళ్ల పాటు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి, వందలాది సినిమాల్లో నటించి, ఓ దశలో ‘లేడీ హీరో’గా పేరొందిన ఈ సుందరికి వయసు పైబడి అవకాశాలు సన్నగిల్లాక ఉన్నట్టుండి తాను తెలంగాణ పోరినన్న విషయం ఎరుకలోకి రావటమే వింతయితే, ఆ కారణంగా తనని సినీ రంగంలో అణగదొక్కేశారన్న దారుణాతిదారుణ నిజం ఈ రోజే సమజవటం అంతకు మించిన వింత. వేర్పాటువాదుల నాలుకల మీద నాట్యమాడే ఇలాంటి అబద్ధాలు కోకొల్లలు. ప్రత్యేకవాదం ఈ అవకాశవాదులకో తురుపుముక్క. విద్యాధికుడు, యుక్తాయుక్త విచక్షణున్నవాడు, ప్రపంచాన్ని చూసినవాడు అనుకున్న నా స్నేహితుడే ఈ మాయగాళ్ల బుట్టలో అంత తేలిగ్గా పడిపోతే ఇతరుల మాటేమిటి? (ఆ ప్రశ్నే ఈ టపాల పరంపరకి ప్రేరణ)

‘ఉద్యోగాలు, అవకాశాల సంగతొదిలెయ్. మా యాసపై మీ చులకన భావం సంగతేంటి?’ అనే ప్రశ్నేస్తారు వేర్పాటువాదులు. సినిమాల్లో రౌడీలుగా తెలంగాణవారినే చూపుతారన్నది దానికి మద్దతుగా వారు చూపే సిల్లీ ఉదాహరణ. అవే సినిమాల్లో రాయలసీమ యాస మాట్లాడే ఫ్యాక్షనిస్టు విలన్లూ, గోదావరి యాస మాట్లాడే కమెడియన్లూ, ఉగ్రవాదులుగా ముస్లిములూ సైతం స్టీరియోటైప్ చెయ్యబడ్డారనేది వీరు ఉద్దేశపూర్వకంగానే మర్చిపోతారు. సినిమాల్లో ఏదో చూపారని వేర్పడిపోతాం అంటే, మరి తమిళుల్ని హిందీ సినిమాల్లో ఏడిపించే మాటేమిటి? ఆ వంకతో వాళ్లూ దేశం నుండి విడిపోతామంటే? ఒకరి యాసని ఒకరు ఆటపట్టించుకోటం ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు, అది రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతం వారికో ప్రత్యేకమైన అలవాటూ కాదు. ఏం, సర్దార్జీ జోకులు చెప్పీ, వినీ పడి పడి నవ్వే తెలంగాణవాసులు ఎందర్లేరు? ఆ మాత్రానికి వాళ్లకి పంజాబీలంటే చులకనో, చిన్నచూపో అందామా?

‘తెలంగాణలో ఆంధ్రా భోజన హోటళ్లున్నాయి కానీ, ఆంధ్రాలో తెలంగాణ హోటళ్లు లేవేం’ అనేది మరో విచిత్రమైన వివక్షాభియోగం. ‘ఆంధ్రాలో ఉడుపి హోటళ్లున్నాయి కానీ ఉడుపిలో ఆంధ్రా హోటళ్లు లేవేం’, ‘తెలుగువారి సంగీతాన్ని కర్నాటక సంగీతం అనెందుకనాలి’, ‘హైదరాబాద్‌లో ఇరానీ చాయ్ పాపులర్ కానీ ఇరాన్‌లో హైదరాబాదీ బిర్యానీ పాపులర్ కాదేం’ .. ఇవన్నీ చొప్పదంటు ప్రశ్నలు. ఇలాంటి వెర్రి మొర్రి ప్రశ్నలతో జనాల్లో భావోద్వేగాలు రగిలించి లేని సమస్యలు పుట్టించే విద్యలో మన నాయకులు పండిపోయారంటే దానిక్కారణం – మొదటి రెండు పేరాల్లో వివరంగా చెప్పుకున్నాం.

ఇవన్నీ వివక్షలు కావు. అసలు వివక్షలు వేరే ఉన్నాయి. దేశమంతా ఉన్నాయవి – తెలంగాణతో సహా. తరతరాలుగా మన జాతిని పట్టి పీడిస్తున్న చీడ – అంటరానితనం.  అరవై మూడు పంద్రాగస్టులు వచ్చి పోయినా దాని అంతు చూడలేకపోయాం. అదే కాదు .. నిమ్న కులాలపై అగ్ర కులస్థుల పెత్తనం, పేదవారిపై ధనికుల దాష్టీకం, ఆడవారిపై మగవారి దారుణాలు, వితంతువులన్న కారణంతో ఈసడించటాలు, వెట్టిచాకిరి .. ఇవన్నీ లేనిదెక్కడ? ఆంధ్రావాళ్లో, మరొకళ్లో తెలంగాణవారిపై వివక్ష ప్రదర్శిస్తున్నారని గగ్గోలు పెట్టే పెద్దమనుషుల్లారా – తెలంగాణలో కొలువైన మాలపల్లెల మాటేమిటి? ముందు వాటిని రూపుమాపి ఆ తర్వాత వేరేవాళ్ల వివక్ష గురించి మాట్లాడండి. వింటున్నారా?

(సశేషం)


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,187

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.