ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 5

ఐదో అబద్ధం:

తెలంగాణవారిపై ఆంధ్రావారి వివక్ష.

ఇదీ నిజం:

రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల ధాటికి కుదేలైన బుల్లి దేశం అనతి కాలంలోనే అగ్రగామిగా మారిన వైనం మన కళ్లెదురే ఉంది. అదే సమయంలో స్వతంత్రం పొందిన మన దేశం ఎక్కడుంది? అమెరికా వాడు బాంబులేశాడని ఏడుస్తూ కూర్చోకుండా రెట్టించిన కసితో జపనీయులు ముందుకు దూసుకుపోతే, బ్రిటిషర్లూ మహమ్మదీయులూ కొల్లగొట్టిన సంపదల ఊసులాడుకుంటూ, తాతలు తాగిన సువాసనాభరిత నేతుల సొల్లు కబుర్లు చెప్పుకుంటూ భారతీయులం మాత్రం గొంగళి వేసిన చోటే ఆర్చుక్కూర్చునున్నాం. ఎందుకంటే – సెల్ఫ్ పిటీలో మన తలదన్నేవారు ప్రపంచంలోనే లేరు కాబట్టి. ఎదుటివాళ్ల సానుభూతి కోసం మనం పడని పాట్లుండవు. ‘చూశారా నాకేమయిందో, చూశారా నాకెంత అన్యాయం జరిగిందో’ అని గుండెలు బాదుకోటంలో ఉండే మజా సగటు భారతీయుడికి మరి దేనిలోనూ ఉండదు. ‘నేను కష్టపడి పైకొచ్చా’ అని రొమ్ము విరుచుకుని చెప్పుకోటంకన్నా ‘నన్ను వాడు తొక్కేశాడు’ అని గుడ్ల నీరు కుక్కుకోటమే ఎక్కువమందికి ప్రీతిపాత్రం. ఆ రకంగా రాలిపడే కడవలకొద్దీ జాలిని కరువుదీరా గ్రోలి బ్రేవుమని తేన్చితే అదో తృప్తి. దాని ముందు మిగిలిన ఇహ పర భోగాలన్నీ బలాదూర్.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా .. అన్ని రకాల వనరులూ, లెక్కలేనంత యువశక్తీ ఉన్నా మన దేశం కునారిల్లుతుండటానికి ఓ ముఖ్య కారణం – భావోద్వేగాలకిచ్చే విలువ మరి దేనికీ ఇవ్వని గుణం తరతరాలుగా మన జాతి జన్యువుల్లో జీర్ణించుకుపోవటం. ఈ గుణానికో కవల సోదరీ ఉంది: మన చేతగానితనానికి ఎవడిమీదనో పడి ఏడవటం. మన సినిమా కథల్లో నూటికి తొంభై సెంటిమెంటు చుట్టూనే తిరుగుతున్నా, వందలాది టీవీ ఛానళ్లలో లెక్కలేనన్ని గ్లిజరిన్ కన్నీళ్ల జీడిపాకం సీరియళ్లు నిరంతరాయంగా ప్రసారమౌతున్నా, పత్రికల్లో ఆదివారం అనుబంధాల కథలన్నీ ఏడుపుగొట్టు బాధా గాధలతోనే నిండిపోయినా, ఎన్నికల్లో ఓడిపోయిన లీడరుడు ఈవీఎంల మీద పడేడ్చినా, పరీక్ష తప్పిన పిల్లాడు పేపర్ ఔటాఫ్ సిలబస్ వచ్చిందనే పాట పాడినా .. వాటన్నిటికీ ఈ జంట గుణాలే కారణం. స్వలాభం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టబూనే రాబందుగాళ్ల, వాళ్ల వెనకుండే చిల్లరమల్లర బాజా భజంత్రీగాళ్ల చేతుల్లో ఇవే అల్లావుద్దీన్ అద్భుత దీపాలు. ఉద్యమాల ముసుగులో ఉపాధి కల్పన చేసుకునే రాజకీయ నిరుద్యోగులకి ఇవే ఉద్దీపకాలు.

నాకో స్నేహితుడున్నాడు. కరీంనగర్ వాస్తవ్యుడు, విద్యాధికుడు. మా పరిచయం పన్నెండేళ్ల క్రితం – హైదరాబాదులో ఉద్యోగాల వేటాడే రోజుల్లో. కొన్నాళ్ల వెదుకులాట తర్వాత, ఇద్దరికీ ఒకే సంస్థలో ఉద్యోగమొచ్చింది. ఆ సంస్థ అధిపతి కోస్తాంధ్రవాసి. కొన్నాళ్ల ట్రైనింగ్ తర్వాత ఆ సంస్థ మా ఇద్దర్నీ, మరి కొందర్నీ అమెరికా పంపింది. ఇక్కడికొచ్చాక కొన్నాళ్లకే నా మితృడి ఉద్యోగం ఊడింది. తర్వాత రమారమి ఆరు నెలలు అతను ఖాళీగానే ఉండాల్సొచ్చింది. అతను డీలాపడి ఉన్న సమయంలో, అదృష్టవశాత్తూ నేను పని చేస్తున్న చోట ఓ ఉద్యోగావకాశం రావటం, నేను ఇతన్ని రికమెండ్ చేసి ఆ స్థానంలో తీసుకునేలా చేయటం, అతనా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా పైకెదగటం జరిగిపోయాయి.

హైదరాబాదులో స్నేహం కుదిరిన నాడూ, అతనికి ఉద్యోగం విషయంలో సహాయం చేసిన నాడూ ఆంధ్రప్రదేశ్‌లో మా ప్రాంతాలు వేర్వేరనే ఆలోచన మా ఇద్దరికీ లేదు. మా కెరీర్లకి పునాదులేసిన సంస్థకీ ఆ తేడా తెలీదు. తెలంగాణ వేర్పాటోద్యమం గీసిన విభజన రేఖల పుణ్యాన, నా స్నేహితుడికి ఈ మధ్యనే తెలిసిందా తేడా. నెలన్నర కిందట, ఓ ఫంక్షన్ సందర్భంగా అతను నాతో అన్న మాట నాకు షాక్ తినిపించింది: ‘మీకు మేమంటే వివక్ష భై’.

తేరుకుని కాసేపాలోచించాక అనిపించింది – అతని విషయంలో నేను వివక్ష చూపటం నిజమే. ఉద్యోగార్ధులైన పరభాషా స్నేహితులు మరికొందరూ ఉన్నా ఆనాడు ఇతనికే సహాయం చెయ్యటానిక్కారణం – నా దృష్టిలో సాటి తెలుగువాడన్న ఆపేక్ష, ఆ పరభాషా మితృల దృష్టిలో తమపై వివక్ష. చూసే కోణం నుండే ఉంటుంది ఏదైనా. వివక్ష అనేమాట ఇతన్నుండి రావటమే విచిత్రం. నేనతనికి సాయం చేసినట్లే, అతనూ గత పదేళ్లలో కొందరు స్నేహితులకి సాయం చేసి ఉన్నాడు. వాళ్లందరూ తెలంగాణవాసులే కావటం నాకు తెలిసినంతవరకూ కాకతాళీయం. అనాలంటే దీన్నీ వివక్షే అనొచ్చు మరి. ఆ సంగతటుంచితే, నా స్నేహితుడికి తన ప్రాంతంపై మమకారముండటం తప్పుపట్టాల్సిన విషయం కాదు. అక్కడుండే సమస్యలపై ఆవేదన వ్యక్తం చెయ్యటమూ అర్ధం చేసుకోవాల్సిన విషయమే. ఆ సమస్యలకి పొరుగు ప్రాంతీయులు కారణమనటమే విడ్డూరం. అతని వితండవాదానికి విసిగిపోయి ‘తెలంగాణపై అంత ప్రేమున్నోడివి అమెరికాలో ఏం చేస్తున్నావు గురూ’ అంటే అతన్నుండొచ్చిన సమాధానం: ‘మీ ఆంధ్రావాళ్లు మా హైదరాబాదుపై పడి మాకు ఉద్యోగాలు రాకుండా చెయ్యబట్టి’!

వేర్పాటువాదులు వివక్షకి ఉదాహరణగా ప్రముఖంగా ప్రస్తావించే విషయాల్లో ఇదొకటి – తెలంగాణలో (అంటే హైదరాబాదులో) ఉద్యోగాలన్నీ ఆంధ్రావారే కొట్టేస్తున్నారనే వాదన. అదెంతవరకూ నిజం అనే విషయంలో లెక్కలు రకరకాలుగా వినిపిస్తుంటాయి. ఆ లెక్కలెలా ఉన్నా, ఆ వాదనలో అసలు నిజం లేదనలేం. అయితే దానికి వివక్ష అనే పదం వాడటం సమంజసమేనా? తమవారికి సహాయం చేసుకోవటం వ్యక్తులకీ, సమాజాలకీ సహజ లక్షణం. ప్రపంచవ్యాప్తంగా అది సర్వసాధారణం. ఆ గుణానికి పక్షపాతం అన్నది సరైన పదం. వివక్ష అనటం దాన్ని భూతద్దంలో చూపే ప్రయత్నం. మరి ఏది వివక్ష? పొట్టకూటికి రాజధానికి తరలొచ్చినవారిపై దోపిడీదార్లన్న ముద్రేయటం వివక్ష. దారినపోయేవాడిని ‘నువ్వు తెలంగాణవాడివా, ఆంధ్రావాడివా’ అన్న ప్రశ్నేయటం వివక్ష. ప్రాంతాల పేరుతో ‘భాగో, జాగో’ నినాదాలివ్వటం వివక్ష. ‘నరుకుతాం, నాలుకలు తెగ్గోస్తాం’ అనటం వివక్ష. ఇవన్నీ చేస్తుందెవరు?

పైన చెప్పుకున్న పక్షపాతం న్యాయమేనా అన్నది మంచి ప్రశ్న. దాన్ని నియంత్రించాలనే విషయంలో రెండో మాట లేదు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఓ రూపంలో అది బయటపడుతూనే ఉంటుందనేది సత్యం. కారణం – ముందే చెప్పుకున్నట్లు అది మానవులకి సహజ గుణం. తెలంగాణవారు సైతం దీనికి అతీతులేమీ కారు. చారిత్రక కారణాలతో చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ మొదట్నుండీ కొన్ని కోస్తా జిల్లాలవారు ముందుండటం కాదనలేని నిజం. అయితే గత యాభయ్యేళ్లలో ఈ విషయంలో వీరికీ, ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన ప్రాంతాలవారికీ మధ్య ఉన్న తేడా గణనీయంగా తగ్గుతుందనేదీ నిజం. ముందుగా పరుగు మొదలెట్టిన వాడు అగ్ర స్థానంలో ఉంటాడన్నదీ, ఆలస్యంగా పందెంలో చేరినవాడు అతన్నందుకోటానికి చెమటోడ్చాలనేదీ అర్ధం చేసుకోలేనంత పెద్ద విషయం కాదు.  అదే విషయం తెలంగాణ ప్రజలకి విడమర్చాల్సిన రాజకీయ నాయకత్వం ఆ పనిలో ఘోరంగా విఫలమవటమే కాక, తమ చేతగానిదనాన్ని కప్పిపుచ్చుకోటానికి ప్రయోగించిన అబద్ధమే ఈ వివక్ష.

ఈ నిఖార్సైన అబద్ధాన్ని వీళ్లెంత నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారంటే – ఈ మధ్యనో విదుషీమణి, మనుగడ కోసం పూటకో పార్టీ మార్చే మాజీ మహానటీమణి, తెలంగాణ అమ్మాయిననవటంతో చిత్రసీమలో తనని తొక్కేశారని తాజాగా వాపోయింది! రమారమి పాతికేళ్ల పాటు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి, వందలాది సినిమాల్లో నటించి, ఓ దశలో ‘లేడీ హీరో’గా పేరొందిన ఈ సుందరికి వయసు పైబడి అవకాశాలు సన్నగిల్లాక ఉన్నట్టుండి తాను తెలంగాణ పోరినన్న విషయం ఎరుకలోకి రావటమే వింతయితే, ఆ కారణంగా తనని సినీ రంగంలో అణగదొక్కేశారన్న దారుణాతిదారుణ నిజం ఈ రోజే సమజవటం అంతకు మించిన వింత. వేర్పాటువాదుల నాలుకల మీద నాట్యమాడే ఇలాంటి అబద్ధాలు కోకొల్లలు. ప్రత్యేకవాదం ఈ అవకాశవాదులకో తురుపుముక్క. విద్యాధికుడు, యుక్తాయుక్త విచక్షణున్నవాడు, ప్రపంచాన్ని చూసినవాడు అనుకున్న నా స్నేహితుడే ఈ మాయగాళ్ల బుట్టలో అంత తేలిగ్గా పడిపోతే ఇతరుల మాటేమిటి? (ఆ ప్రశ్నే ఈ టపాల పరంపరకి ప్రేరణ)

‘ఉద్యోగాలు, అవకాశాల సంగతొదిలెయ్. మా యాసపై మీ చులకన భావం సంగతేంటి?’ అనే ప్రశ్నేస్తారు వేర్పాటువాదులు. సినిమాల్లో రౌడీలుగా తెలంగాణవారినే చూపుతారన్నది దానికి మద్దతుగా వారు చూపే సిల్లీ ఉదాహరణ. అవే సినిమాల్లో రాయలసీమ యాస మాట్లాడే ఫ్యాక్షనిస్టు విలన్లూ, గోదావరి యాస మాట్లాడే కమెడియన్లూ, ఉగ్రవాదులుగా ముస్లిములూ సైతం స్టీరియోటైప్ చెయ్యబడ్డారనేది వీరు ఉద్దేశపూర్వకంగానే మర్చిపోతారు. సినిమాల్లో ఏదో చూపారని వేర్పడిపోతాం అంటే, మరి తమిళుల్ని హిందీ సినిమాల్లో ఏడిపించే మాటేమిటి? ఆ వంకతో వాళ్లూ దేశం నుండి విడిపోతామంటే? ఒకరి యాసని ఒకరు ఆటపట్టించుకోటం ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు, అది రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతం వారికో ప్రత్యేకమైన అలవాటూ కాదు. ఏం, సర్దార్జీ జోకులు చెప్పీ, వినీ పడి పడి నవ్వే తెలంగాణవాసులు ఎందర్లేరు? ఆ మాత్రానికి వాళ్లకి పంజాబీలంటే చులకనో, చిన్నచూపో అందామా?

‘తెలంగాణలో ఆంధ్రా భోజన హోటళ్లున్నాయి కానీ, ఆంధ్రాలో తెలంగాణ హోటళ్లు లేవేం’ అనేది మరో విచిత్రమైన వివక్షాభియోగం. ‘ఆంధ్రాలో ఉడుపి హోటళ్లున్నాయి కానీ ఉడుపిలో ఆంధ్రా హోటళ్లు లేవేం’, ‘తెలుగువారి సంగీతాన్ని కర్నాటక సంగీతం అనెందుకనాలి’, ‘హైదరాబాద్‌లో ఇరానీ చాయ్ పాపులర్ కానీ ఇరాన్‌లో హైదరాబాదీ బిర్యానీ పాపులర్ కాదేం’ .. ఇవన్నీ చొప్పదంటు ప్రశ్నలు. ఇలాంటి వెర్రి మొర్రి ప్రశ్నలతో జనాల్లో భావోద్వేగాలు రగిలించి లేని సమస్యలు పుట్టించే విద్యలో మన నాయకులు పండిపోయారంటే దానిక్కారణం – మొదటి రెండు పేరాల్లో వివరంగా చెప్పుకున్నాం.

ఇవన్నీ వివక్షలు కావు. అసలు వివక్షలు వేరే ఉన్నాయి. దేశమంతా ఉన్నాయవి – తెలంగాణతో సహా. తరతరాలుగా మన జాతిని పట్టి పీడిస్తున్న చీడ – అంటరానితనం.  అరవై మూడు పంద్రాగస్టులు వచ్చి పోయినా దాని అంతు చూడలేకపోయాం. అదే కాదు .. నిమ్న కులాలపై అగ్ర కులస్థుల పెత్తనం, పేదవారిపై ధనికుల దాష్టీకం, ఆడవారిపై మగవారి దారుణాలు, వితంతువులన్న కారణంతో ఈసడించటాలు, వెట్టిచాకిరి .. ఇవన్నీ లేనిదెక్కడ? ఆంధ్రావాళ్లో, మరొకళ్లో తెలంగాణవారిపై వివక్ష ప్రదర్శిస్తున్నారని గగ్గోలు పెట్టే పెద్దమనుషుల్లారా – తెలంగాణలో కొలువైన మాలపల్లెల మాటేమిటి? ముందు వాటిని రూపుమాపి ఆ తర్వాత వేరేవాళ్ల వివక్ష గురించి మాట్లాడండి. వింటున్నారా?

(సశేషం)

54 స్పందనలు to “ఒక ఉద్యమం, పది అబద్ధాలు – 5”


 1. 1 sarathsworld 6:43 సా. వద్ద జనవరి 22, 2010

  మాష్టారు…ఇరగదీసారు….

 2. 2 a2zdreams 7:18 సా. వద్ద జనవరి 22, 2010

  తల ఎప్పుడు నరుక్కుంటున్నావు అని కె.సి.ఆర్ మీద ఒత్తిడి పెరిగింది. కె.సి.ఆర్ తేడా మాట్లాడితే తెలంగాన ప్రజలే ఇరగదీసేటట్టు వుంది పరిస్థితి ఇప్పుడు.

 3. 4 కత్తి మహేష్ కుమార్ 8:30 సా. వద్ద జనవరి 22, 2010

  మీ స్నేహితుడి అవగాహనారాహిత్యమే మీ వ్యాసంలోనూ కనిపిస్తోంది. సైద్దాంతిక విబేధాన్ని వ్యక్తిగత మానవసంబంధాలలోకి తీసుకొచ్చి నిర్ణయాలుచెయ్యడమంత మూర్ఖత్వం ఒకటైతే ఒక వ్యక్తిగత అనుభవాన్ని సార్వజనిక సత్యంగా భ్రమింపజెయ్యాలనుకోవడం అంతకన్నా తెలియనితనం. మొత్తానికి మీ స్నేహితుడికి పర్సనల్ రిలేషన్ షిప్స్ విలువతెలీదు మీకు చరిత్ర తెలీదు. దొందుదొందే.

  • 5 అబ్రకదబ్ర 9:30 సా. వద్ద జనవరి 22, 2010

   I know more about my friend and his ‘సైద్ధాంతిక విభేదం/దృక్పధం’ than you do. Same goes for history knowledge.

   Just a gentle reminder: Next time, please watch your words. Your comments are welcome. Your rudeness is not.

  • 6 sravyav 10:57 సా. వద్ద జనవరి 22, 2010

   ఈ చరిత్ర చరిత్ర ఏమిటి ఈ హింస. ఈ రోజు జరిగేది రేపటికి చరిత్ర . మీకు ఇవాళ బతికే జనాల బాగు కావాలా లేకపోతే ఒక 50 సంవత్సరాల కిత్రం ఉన్న మనుషుల కతలు కావాలా? చరిత్ర అనేది ఇవాళ తీసుకొనే నిర్ణయాలు పలితాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకోవాటానికి పనికి రావాలి కాని వెనక మాతాతాలు నేతులు తాగారు ఇప్పుడు మీరు మా మూతలు వాసన చూడండి అని చెప్పటానికి కాదు .ఇప్పుడు ఈ విభజన తరవాత 30 లేదా 40 సంవత్సరాల ఆగి అప్పుడు ఉన్న తరం సమైక్య రాష్ట్రము కావాలంటే కాని మీ లాంటి వాళ్ళు ఒప్పుకోరేమో ఎందుకంటే అప్పుడు గాని అది చరిత్ర అవుతుంది కదా .

  • 8 sri 6:26 సా. వద్ద జనవరి 23, 2010

   Dear Maheshkumar,

   Its shame on the telangana area people like you to say that somebody suppressed you in a democracy for such a long time.

   Instead of blaming the others, why DON’T YOU ASK YOUR TELAANGANA POLITICIANS AS TO WHAT THE HELL DID THEY DO TO DEVELOP THE TELANGANA AREA OR WHAT THEY TRIED TO ALLEVIATE THE ISSUES RELATED TO TELANGANA?

   Shame on these hypocrite telangana supporters to cry foul on others for their very own failure to make their telangana politicians.

   PLEASE NOTE THAT I AM A TELANGANA BORN AND BROUGHT UP PERSON, BUT I AM DEAD AGAINST BLAMING OTHERS FOR THE BACKWARDNESS OF TELANGANA. I Would blame the people of telangana for the backwardness, since the people of telangana never ever raised their voice against their politicians with respect to telangana development. Even now, the people of telangana are falling in to the sentimental blackmail by KCR like fools who had not done anything for people after being in leader position for almost 10 years.

   Its high time you go to your room, close the door, calm your mind and then think about these issues that I told instead of following your politicians and their selfish motives.

   • 9 krishna 1:25 సా. వద్ద జనవరి 24, 2010

    mr. sri
    really thought provoking opinion.
    i agree with you and wish every educated person can think like you to avoid bitterness between brothers.
    my generation really dont know the history and all fuss abt “gentleman’s agreement ” etc but only concerned about developement. bcoz of the present situation “our state” is losing lot of revenue and already common man is paying the price in the name of bus fares and price rise etc.

 4. 10 Srinivasa Rao 8:39 సా. వద్ద జనవరి 22, 2010

  Glad to see your flow and focus on the topic
  Keep writing !
  -kalasapudi Srinivasa Rao

 5. 11 Srinivasa Rao 8:46 సా. వద్ద జనవరి 22, 2010

  Katti Mahesh kumar’s comments about the current essay is in the same mold as several elite communists. We all know what happend to communism !
  Kalasapudi Srinivasa Rao

 6. 12 SN 10:58 సా. వద్ద జనవరి 22, 2010

  సైద్ధాంతిక విబేధమా??? అసలది ఎక్కడుంది? అసలు సిద్ధాంతమే లేని ఉద్యమమాయె!
  నవంబర్ చివరిదాక లేని తెలంగాణా వేర్పాటు జ్వరం అకస్మాత్తుగా ఎందుకొచ్చింది. అసలెక్కడినుంచి వచ్చింది.? గుర్తింపుకోసం ప్రాకులాడే ఒక రాజకీయపెద్ద మనిషి బుర్రలోంచి కాదూ? అంతకుముందు నలభయి యేళ్ళక్రిందట అణగారిన తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ నిద్ర లేపడం లో స్వార్థమేమిటో ఇంకా అర్థం కావడం లేదా.? వేడివాదనలు, వాడి వాడి పదునయిన మాటల బాణాల వల్ల లేని సిద్ధాంతాలను ఆపాదించకండి.

  సిద్ధాంతాలెప్పుడు మనం ఎంచుకున్న ఆశయాల నిజాయితీ, చిత్తశుద్ధి పైనే ఆధారపడి ఏర్పడతాయి అన్న సంగతి మనం మరవకూడదు. లక్ష్యాన్నిచేరుకోగానే సరి కాదు. చేరుకొనే బాట మరీ ముఖ్యం. బందులతోను, హింసాత్మక చర్య ల తోను, జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తు తెలంగాణ సాధించుకుందామని అలోచన లోనే సిద్ధాంతాలేమిటో స్పష్టమౌతున్నాయి.

  నలుగురికి ఉపయోగపడి, చరిత్ర లో నిలచిపోయిన ఉద్యమాలు వందలకొద్దీ ఉన్నాయి
  చిత్తశుద్ధి లోపించి కేవలం స్వప్రయోజన స్వార్థంతో మొదలయిన ఉద్యమానికి ఒక సిద్ధాంతంఅంటూ ఉంటుందా?
  వేర్పాటు వాదమే సిద్ధాంతం…., ప్రజలను ఆవేశపూరితం గా రెచ్చగొట్టడమే ఊపిరి…ప్రజల, విద్యార్థుల వెర్రిబాగులతనమే ఉద్యమ బలం…ఇప్పటిదాక జరిగింది చూస్తుంటే ఇంతకుమించి, కనిపిస్తున్నదేమీ లేదు. ఎవడికి వాడే సిద్ధాంతకర్త గా ఊహించుకుంటూ, ఇంటికో జె, యేసి, ప్రారంభించేసారు.సినిమాలు ఆపెయ్యడం, సంక్రాంతి జరుపుకోకపోవడం, ఇంటిముందు తెలంగాణముగ్గులేసుకోవడం, వేళకాని వేళలో బతుకమ్మలనడం, ఉద్యమాన్ని నవ్వులపాలు ఇలాంటి చర్యలతో చేసుకున్నారు.

  దీనికో సరయిన నాయకత్వం అంటూ ఉందా?చెప్పండి.

  భగవంతుడా!!!! నాదేశాన్ని, నా ప్రజలని , ఈ రాజకీయ రాబందుల నుంచి రక్షించు, స్వంతంగా అలోచించి నిర్ణయాలు తీసుకొనే శక్తిని ప్రసాదించు

  • 13 కత్తి మహేష్ కుమార్ 11:13 సా. వద్ద జనవరి 22, 2010

   ఉద్దేశపూర్వకంగా తెలంగాణా ఉద్యమం అంటే కె.సి.ఆర్ ఉద్యమం అనే అపోహల్లో బ్రతుకుతున్న మీకు తెలంగాణా ఉద్యమ చరిత్ర చెప్పినా పెద్దగా లాభంలేదు. తెలంగాణా ఉద్యమం ఇప్పుడొక రాజకీయ ఉద్యమంకాదు. విద్యార్థి ఉద్యమం. ప్రజా ఉద్యమం.

   • 14 అబ్రకదబ్ర 2:22 ఉద. వద్ద జనవరి 23, 2010

    @మహేష్:

    >> “‘తెలంగాణా’ అన్నిపార్టీలకూ ఒక రాజకీయ అవసరమేతప్ప, నిబద్ధత వున్నట్లు ఎక్కడా అనిపించదు.సెంటిమెంటు పేరుచెప్పి, వీళ్ళు ఉద్యమాల్ని notional గా నడిపేస్తున్నారేతప్ప,ప్రజలస్థాయిలో తెలంగాణా ఉద్యమం విస్తృతంగా కనిపించడం లేదనేది ఎవరూ కాదనలేని నిజం.పైపెచ్చు ఈ రాజకీయ ప్రహసనాలతో ప్రజల్లో ఒకరకమైన నిరాసక్తత కనిపిస్తోంది”

    సరిగా పద్నాలుగు నెలల క్రితం ‘తెలంగాణ ఉద్యమం’ గురించిన మీ అభిప్రాయం అది. ఈ కొద్ది కాలంలో మీరు దాని చరిత్ర ఎంత ఔపోసన పట్టారు? ఆ పని అంతకు ముందెందుకు చెయ్యలేకపోయారు? ఏడాది కిందటిదాకా మీకు ‘ప్రజల్లో విస్తృతంగా కనిపించని’ ఉద్యమానికి ఎంత పెద్ద చరిత్ర ఉంది?

    ‘తప్పు తెలుసుకున్నాను’ అనో ‘నిజం నేర్చుకున్నాను’ అనో మరోటో చెప్పి తప్పుకోబోకండి. ఆ తెలివి అంతకు ముందేమైందన్నది ప్రశ్న. మీరు ఇప్పుడు నేర్చుకున్న నిజం రేపు తప్పని మళ్లీ ఒప్పుకోరా అన్నది మరో ప్రశ్న. నే నమ్మిన దాన్ని గట్టిగా చెప్పటం మూర్ఖత్వమైతే, మీలా రోజుకో రకం సిద్ధాంతం పట్టుకు వేలాడటాన్ని ఏమనాలన్నది అన్నిటికన్నా పెద్ద ప్రశ్న.

   • 15 sri 6:29 సా. వద్ద జనవరి 23, 2010

    Yes. It is KCR telangana movement, since when the state is formed, HE WILL BE THE IMMEDIATE CHIEF MINISTER.

    Can you guarantee that he will not be the C.M or can you guarantee me that he or his family doesnot hold any powerful position in the Telangana state after the state is formed?

    By the way, you donot have any say in what the politicians say after the state is formed, since you will be treated by your own KCR and politicians as a “Kooralo Karivepaku”.

    I BET THIS WILL HAPPEN. If not, then give some guarantee.

 7. 16 తెలంగాణా యోధుడు 11:23 సా. వద్ద జనవరి 22, 2010

  మీరు ఒక్క వ్యక్తిగత ఉదాహరణ చూపించి మాట్లాడు తున్నారు. అది కూడా ఎంత వరకు వాస్తవమో మీకే తెలియాలి.

  సెక్రెటేరియట్ లో తెలంగాణా ఉద్యోగుల వాటా ఎంత?
  హై కోర్టు లో తెలంగాణా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల వాటా ఎంత?
  తెలంగాణా మొత్తంలో ఎంతో మంది ఆంధ్రా వారు అక్రమంగా ఉద్యోగాల్లో కొనసాగు తున్నారని ప్రభుత్వ లెక్కలే చెప్పుతున్నాయి. ఇదంతా వివక్ష వలన కాదా? వీరిని ప్రతి రోజూ చూస్తూ కూడా తెలంగాణా ప్రజలు సహనంగా వారిని గురవిస్తూ వారితో సహజీవనం చేస్తున్నారు. మీలాంటి వారి రాతల వల్ల ఇక్కడి వాతావరణం మారిపోయే అవకాశం ఉంది.

  అసలు విడి పోదామంటే ఇంట బెంబేలెత్తి పోతున్నారంటేనే మీరు తెలంగాణాని ఎంతగా exploit చేస్తునారో అర్థమవుతుంది.

  • 17 కత్తి మహేష్ కుమార్ 3:56 ఉద. వద్ద జనవరి 23, 2010

   @అబ్రకదబ్ర: ఏ క్షణంలో అయితే తెలంగాణా ఉద్యమం విద్యార్థి ఉద్యమం అయ్యిందో కేసీఆర్ ను “తలెప్పుడు నరుక్కుంటావని” ప్రశ్నించడం మొదలయ్యిందో ఆ క్షణంలో తెలంగాణా ఉద్యమం…నిజమైన ఉద్యమం అయ్యింది.

   ఒకసారి ఓయూ క్యాంపస్ కొచ్చి చూడండి. రాజకీయ వంచనతో సహనం చచ్చిన విద్యార్థులతో మాట్లాడండి. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి. హైదరాబాద్ దాటి అటు కరీంనగరో ఇటు వరంగల్లో వెళ్ళి చూడండి. జనాలతో మాట్లాడండి. వాళ్ళ కళ్ళలో ఆశని-నిరాశని- కోపాన్నీ చూడండి. ఇవన్నీ చూశాకే ప్రజలస్థాయిలోకి ఉద్యమం వెళ్ళిందన్న నమ్మకం నాకు కలిగాయి. మీకు ఈ అభిప్రాయాలు ఎలాకలిగాయో నాకు తెలీదు.

   • 18 SN 6:53 ఉద. వద్ద జనవరి 23, 2010

    కాంపస్స్ లో మీకు ఉద్యమం కనబడుతోందా? రాజకీయ వంచనతో చచ్చిన సహనం కనబడుతోందా?
    కళ్ళల్లో ఆశ-నిరాశ లు కనబడుతున్నాయా.?

    హాస్యాస్పదం గాఉంది. కాస్త విజ్ఞతతో అలోచించిచూడండి.
    ఆత్మ తో చూడగలిగిన వారెవరికయినా, ఇప్పటిదాకా ఉద్యమాల పేరుతో జరిగిన వేలకోట్లనష్టం కనిపించేది. మంటగలిసిన తెలుగువారి ఆత్మగౌరవం కనిపించేది.ఇక్కడ ఉండలేక పక్కరాష్ట్రాలకి తరలి పోతున్న వేలకోట్ల విలువయిన పరిశ్రమలు కనిపించేవి. పరీక్షలు రాయక, రాయలేక విలువయిన విద్యా సంవత్సరం పోగొట్టుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు కనిపించేది.

    రాజకీయాల చదరంగంలో పావుల్లా కనబడ్డం లేదూ? నోటికాడి కూడు ఎవడో నిజ్జంగా దొంగిలించేసాడన్న దుగ్ధ ,మన డబ్బుతో పక్కవాడు పైకొచ్చేసారన్న పనికి మాలిన ఆవేశం, తప్ప మరేదయిన కనిపిస్తోందా? కొన్ని తీవ్రమయిన పదాలు పట్టుకొని పదే పదే ఉచ్చరించడం వల్ల ప్రతి గొడవ ఒక ఉద్యమం అయిపోదు. ఆ లెక్కన ప్రతి వీధి పంపు దగ్గర ఒక ఉద్యమం జరిగేది.

   • 19 వెంకటరమణ 11:09 ఉద. వద్ద జనవరి 23, 2010

    @మహేష్ : ప్రజల, విద్యార్ధుల భావోద్వేగాలను రెచ్చగొట్టినపుడు తర్కించే శక్తి పోతుందని మీకు తెలియదా ?. ఆ క్రమంలోనే ఇతర ప్రాంత ప్రజలపై, ముఖ్యంగా కోస్తా ప్రాంతం వారిపై అకారణ ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. తెలంగాణా ప్రజల ప్రధాన సమస్యలు అని చెప్తున్న నీటికోసం, ఉద్యోగాల కోసం కనీసం ప్రజల తరుపున నిలిచారా రాజకీయ నాయకులు? పల్లెల్లోకి వెళ్లిన ఉద్యమంతో , రాజకీయ నాయకులను నిలదీస్తే ,నీటి కోసం పోరాడితే చచ్చినట్లు ప్రాజెక్టులు కడతారు. దానికి ఇతర ప్రాంతాల ప్రజల మద్దతు కూడా ఉంటుంది. ఇక భాష గురించి వివక్ష అనే విషయానికి వస్తే, చదువుకొనే రోజుల్లో సరదాగా ఒక జిల్లా వారిని మరొకరు పరస్పరం ఎగతాళి చేసుకోవటం సాధారణం. ఆ తర్వాత కూడా వివక్ష చూపించే వాళ్ళు అతి స్వల్పం. రాజధానికి వలస వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది కూలి చేసుకొనేవారని, పేదవారని, భూస్వాములు కాదని మీకు తెలియదా? పరిపాలనా సౌలభ్యం కోసమైనా చిన్న రాష్ట్రాలు ఉండాలని అనిపిస్తే, ఆ ముక్కలవటం అన్నది అంతటితో ఆగదని మీకు అనిపించలేదా? ఇప్పుడు తెలంగాణా ప్రజలకు కలుగుతున్న కోపం, ద్వేషం ఒకవేళ తెలంగాణా వస్తే ఆ తర్వాత వివక్ష ని బూచిగా చూపి మళ్ళీ ఏ నీచుడో వేర్పాటు వాదం లేవనెత్తితే అవే ద్వేషం,కోపం అప్పుడు మళ్ళీ ప్రజలకు కలగవా?

   • 20 అబ్రకదబ్ర 1:20 సా. వద్ద జనవరి 23, 2010

    @మహేష్:

    ఈ ‘విద్యార్ధి శక్తి’ వగైరా భావజాల పదాల పడికట్టు ఆపండి. ఆ తరహా డైలాగులు సినిమాలకి బాగుంటాయి, వాడుకోండి 🙂 వాటి బలుపెంతో, వాపెంతో నాకు మహ బాగా తెలుసు. ఇరవయ్యేళ్ల క్రితం – ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండానే – దేశమంతా ఉవ్వెత్తున ఎగసిపడ్డ ఒకానొక విద్యార్ధి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని, అవెంత కంపు యవ్వారాలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడ్ని నేను. చక్కగా సెంట్రల్ యూనివర్శిటీలో చదువుకుని వచ్చారు కదా – ఓయూ లాంటి చోట్ల ఎలాంటివారు విద్యార్ధులుగా ఉంటారో, వాళ్ల యూనియన్లు ఎంత సొంపుగా నడుస్తాయో, వాళ్ల ‘ఉద్యమాలకి’ సొమ్మెలా సమకూరుతుందో, ఆయా ఉద్యమాలెంత నీతిగా నడుస్తాయో మీరెరగరనుకుంటాను.

    హైదరాబాదులో అరడజను పైగా వేరే యూనివర్సిటీలూ, వేలాది విద్యార్ధులతో నిండిన డజన్లకొద్దీ ఇతర కళాశాలలూ ఉండగా ఓయూలోనే ఈ రచ్చ అంతా జరగటానికి కారణం ఏమంటారు? విద్యార్ధుల బలమే లెక్కలోకి తీసుకుంటే ఈ గొడవలకి దూరంగా ఉన్నోళ్లనీ లెక్కేయండి మరి. ఎవరెక్కువ?

   • 21 sri 6:39 సా. వద్ద జనవరి 23, 2010

    As such sutdents in O.U have no responsibilities at all, and infact they live on parents for their livelihood.

    We donot need to give that much importance to the irresponsibile students, wh0o can fall prey to BEER AND BIRYANI.

    I agree that there may be some very few true and sincere students trying to see their places, developed, but they are not going to achieve anything, since the same problem of “ruling by the same selfish politicians” will happen even after telangana is formed.

    The moment those students start asking their politicians the questions on what developments their politicians had done to alleviate the problems in Telangana, things will start changing.

    The demanders & work extractors should be the people, not the politicians.

  • 22 sri 6:35 సా. వద్ద జనవరి 23, 2010

   Dear Mahesh and Telangana Yodhudu,

   Can you explain me as to what steps were taken and to what extent these steps were taken by your politicians to alleviate the jobs occupation by non-telanganites?

   Instead of fighting the problem of someone occupying telangana area jobs, POLITICIANS ARE WORKING ON THE SEPERATION OF THE STATE ISSUE.

   This is useless. People like you are getting dragged in to this by politicians to cover up their failures so far andd you are following them like a sheep without asking your politicians as to what they have done to solve the problem.

  • 23 Dada 6:28 ఉద. వద్ద ఫిబ్రవరి 27, 2010

   brother,

   secratariat jobs are not given based on a person’s native village.

   high court jobs are given as per government recruitment process.

   i read in some forum, a T candidate was crying that T people are shown “vivaksha” in IAS too….

   grow up!

 8. 24 SN 11:33 సా. వద్ద జనవరి 22, 2010

  “ఉద్దేశపూర్వకంగా తెలంగాణా ఉద్యమం అంటే కె.సి.ఆర్ ఉద్యమం అనే అపోహల్లో బ్రతుకుతున్న మీకు తెలంగాణా ఉద్యమ చరిత్ర చెప్పినా పెద్దగా లాభంలేదు.”

  yes asking the same..

  కె.సి.ఆర్ రాకముందు ఉద్యమం ఎటుపోయింది.? మత్తుమందేసుకొని పడుకుందా.. ఉద్యమాలెప్పుడు కాలిన కడుపుల్లోంచి, మండిన గుండెల్లోంచి వస్తాయి..మరి గత నలభయి ఏళ్ళుగా, ఎవరి గుండే మండలేదా?కడుపు కాలలేదా? మరి ఇప్పుడు వినిపిస్తామంటూన్న వైద్య గర్జనలు, విద్యార్థి గర్జనలు, మహిళాగర్జనలు అప్పుడేమయ్యాయి?

  మీరో సంగతి గమనించారా? తీరికున్నప్పుడూ, నేతలకి కావలసినప్పుడూ మాత్రమే తెలంగానం రాగం అందుకుంటోంది. తీరికున్నప్పుడూ భుజానేసుకొనే ఉద్యమాలకి సిద్ధాంతాలేముంటాయి? ఉబుసుపోక కోసం కాకపోతే… రోజు పేపర్ చదివే ఎవడికయినా అర్థమవుతుంది.. దానికి చరిత్ర తవ్వితియ్యాలా?

 9. 25 తెలుగోడు 12:26 ఉద. వద్ద జనవరి 23, 2010

  చాలా బాగా చెప్పారు.

  ఉద్యమం అనేది ఏమైనా తోకచుక్కా? 10 ఏళ్ళకో, 12 ఏళ్ళకో ఒకసారి వచ్చి, మళ్ళీ వెళ్ళిపోవడానికి. ఇలాంటి తోకచుక్కల చరిత్ర తెలుసుకోవాలా? ఎవడికివాడు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు… అనవసరంగా కెలికి, దానికో చరిత్ర, సిద్ధాంతాలు ఆపాదించడం పూర్తిగా హాస్యాస్పదం. వీధుల్లో దందా వసూళ్ళు చేసే ఎదవల్లాంటి వాళ్ళొచ్చి, ఉద్యమాల పేరు చెప్పి డబ్బు పోగేసుకుంటుంటే, చదువుండి, కుంచెం కూడా కామన్ సెన్స్ అనే పదార్థం లేకుండా, NRIs కూడా సపోర్ట్ చెయ్యడం, మన ఖర్మ.

  ఆంధ్రోళ్ళు ఉద్యోగాలు తన్నుకుపోతున్నారని, అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాము అని చెప్పుకోవడం… ఇంతకన్నా, ఆత్మవంచన మరోటి ఉండదు. మరి వాళ్ళు భాగో అన్నట్టే, అమెరికన్స్ కూడా భాగో అంటే… ఏడికెళ్ళిపోతారో?? ఎవడిమీద పడి ఏడుస్తారో??

 10. 26 Goutham 1:22 ఉద. వద్ద జనవరి 23, 2010

  అసలు ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల విలీనమే పెద్ద అబద్ధపు జెంటిల్ మెన్ అగ్రిమెంట్ పునాది మీద జరిగింది.
  అబద్ధపు హామీలిచ్చి వంచించారు.
  ముల్కీ నిబంధనలు పాటిస్తామని పాటించకపోవడం ఒక అబద్ధం.
  ప్రాతీయ డెవెలప్మెంట్ బోర్డ్ ఒక అబద్ధం.
  ఆరు సూత్రాల పధకం ఒక అబద్ధం.
  610 జీవో ఒక అబద్ధం.
  ఇన్ని అబద్ధాలను మోసాలను పక్కన పెట్టుకుని , నీళ్ళు నిధులు, ఉద్యోగాల పంపిణీలో తెలంగాణను అడుగడుగునా వంచిస్తూ
  “దోగే – దొంగ దొంగ ” అని అరిచినట్టు తెలంగాణా వాళ్ళనే అబద్ధాల కోర్లుగా, అన్యాయం చేసే వాళ్ళుగా, మూర్ఖులుగా చిత్రించడం
  మీకే చెల్లింది.
  తెలుగు దేశం పార్టీ తాము ప్రత్యెక తెలంగాణాకు అనుకూలం అని ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చినప్పుడు, మానిఫెస్టోలో పెట్టి నప్పుడు ,
  ప్రజా రాజ్యం పార్టీ సామాజిక తెలంగాణా అంటూ రాగాలు తీసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ తీ ఆర్ ఎస్ తో పొట్టు పెట్టుకుని తెలంగాణా పాత పాడినప్పుడు లేని సమైక్యతా ఉద్యమం ఇప్పుదేక్కదినుంచి వచ్చింది.
  మీ ఉద్యమమే పెద్ద అబద్ధం అనిపించడం లేదూ?
  తెలుగు దేశం ప్రజారాజ్యం, కాంగ్రెస్స్ పార్తీలన్నే అబద్ధాల కోర్లుగా మీకు ఎందుకు అనిపించడం లేదు.
  ఎందుకంటే మీరే అసలైన అబద్ధాల కోర్లు గనక.
  Shame Shame!

 11. 27 Goutham 1:34 ఉద. వద్ద జనవరి 23, 2010

  మరి కొన్ని అబద్ధాలు…
  పార్లమెంటులో తెలంగాణా పై ప్రధాన మంత్రి ప్రకటన ఒక అబద్ధం.
  అదే పార్లమెంటులో రాష్ట్ర పతి ప్రసంగం లో తెలంగాణా గురించిన హామీ ఒక అబద్ధం.
  తెలంగాణా పై ఏకాభిప్రాయ సాధనకు వేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఒక అబద్ధం.
  అన్ని పార్టీలను అభిప్రాయం అడిగి కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని ప్రకటించక పోవడం ఒక అబద్ధం
  అప్పటి ముఖ్య మంత్రి వై ఎస్ తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిసేవరకూ తెలంగాణా కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు అనుకూలం అని మాట్లాడి తెలంగాణా లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఆంధ్ర రాయలసీమాల్లో తెలంగాణా వస్తే హైదరాబాద్ కు వెళ్ళా లంటే మీకు వీసా కావాల్సి వస్తుంది, మీకు నీళ్ళు రావు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరికలు చేయడం అబద్ధం.
  మూడు వీటి గురించి వివరించండి.

  • 28 krishna 12:12 సా. వద్ద జనవరి 23, 2010

   గౌతమ్ గారు
   తెలంగాణా వేర్పాటు ఉద్యామాము కక్షా కార్పణ్యాల మధ్య జరగవలసిన అవసరం ఉందా? రాజకీయ పార్టీ ల అభిప్రాయాలను ప్రజలకి ఆపాదించవచ్చా? ఉద్యమము కంటే దాని తీరు తెన్నులు , ఆంధ్రా వారి మీద ఆరోపణలు ఎక్కువ బాధిస్తున్నాయి. మీ తాతగారు చేసిన మర్డర్ కి మిమ్మల్ని ఉరి తియ్యవచ్చా చెప్పండి?
   ప్రతి సమస్య కి హింస సమాధానము కాదు కదండి.

  • 29 Giridhar Duggirala 8:55 సా. వద్ద జనవరి 25, 2010

   మరి రోడ్లకి అడంగా గోడలు కట్టడం ఇవ్వన్ని చూస్తుంటే వీసాలూ కావాలేమో అనే అనిపిస్తుంది బ్రదరు

 12. 30 nuvvusetty brothers 2:34 ఉద. వద్ద జనవరి 23, 2010

  నాకు చేతకాక పక్కనవారి మీదపడి ఏడ్వడం అంటే ఏమిటో బాగా చెప్పారు,Super.

 13. 31 srivasuki 2:44 ఉద. వద్ద జనవరి 23, 2010

  mee andhari vaada, prathi vaadanalu vinna tarvatha nenu ee vishayam lo jokyam chesukodalacha ledu. Idi eppudu ekkada ela tegutundo evariki teleedu. bhavishaythlo jarigedi mana andhari manchiko cheduko kuda evariki teleedu. Just wait and see.

  Kani Okati mathram nijam Abrakadabra gari tapaalu mathram super. avi eppudu vedi vedi pakodilla vuntayi. avunantara kadantara?

  naaku oka chinna upakaram cheyyandi. neno oka blog create chesukunnanu, kani andulo telugu language lo ela type cheayaalo artham kavadam ledu. Naa pai dayunchi konchem cheppandi. naa blog peru “srivasuki.wordpress.com” pls help.

 14. 34 kumbh karan 2:44 ఉద. వద్ద జనవరి 23, 2010

  నాగార్జున సాగర్ జలాశయానికి ఊళ్ళకి ఊళ్ళు మునిగిపోయే నల్లగొండకు తాగడానికి నీళ్ళు లేకపోవడం అబద్దం. వరదలొస్తే మునిగిపోయే పాలమూరు జిల్లాలో నీళ్ళు లేక పొలాలు ఎండి పోవడం అబద్దం. పోచం పాడు ప్రాజెక్టుకి పాతిక సంవత్సరాలకి కూడా మోక్షం లేకపోయినా పోతిరెడ్డి పాడు పనులు చక చకా జరిగిపోవడం అబద్దం.

  నిజం ఏమిటంతే రాత్రికి రాత్రి మాట మార్చి సమైఖ్య రాగం అందుకొన్న సీమాంధ్ర నాయకుల నిబద్ధత ఒక్కటే.

  • 35 కుంభకర్ణుడి మొగుడు 6:10 ఉద. వద్ద జనవరి 23, 2010

   నాయనా కుంభకర్ణా,

   పేరు చాలా చక్కగా పెట్టుకున్నావు, నువ్వు నిద్రలో చాలా విషయాలు గమనించలా. నల్గొండలో ఫ్లోరైడ్ కష్టాలు మన చిన్నప్పుడు నుంచీ వింటున్నాం. ఎవడు తీర్చాలి సమస్యని? అక్కడి ఎంపీనా లేక ఎమ్మెల్యేనా? లేదా ముఖ్యమంత్రి చెన్నారెడ్డిదా లేక ప్రధానమంత్రి వీవీదా?

   నీకు తెలియని విషయం మరొకటుంది. జంటనగరాలకు కృష్ణా నది నీళ్ళు ప్లాన్ వేసి, పైపులు వేసి మనందరి కళ్ళ ముందే తీసుకొచ్చేసారు. అదెలా సాధ్యమైంది? హైదరాబాదు ఆంధ్రాప్రాంతమనా? హైదరాబాదులో నాయకులు కేవలం ఆంధ్రావాళ్ళేనా? లేక హైదరాబాదులో కృష్ణా నీళ్ళు తాగేది కేవలం ఆంధ్రావాళ్ళేనా?

   నువ్వెంత మూర్ఖంగా మాట్లాడుతున్నావో, మీ చేతగాని నాయకులు మీ సామాన్యప్రజల్ని ఎంతగా ఆడుకుంటున్నారో చెప్పటానికి ఇదొక్క ఉదాహరణ చాలు, కుంభకర్ణా…ఇంక నిద్ర లేచి పనిచూసుకో..

   అదే నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఇంకా ఎన్ని వేషాలేస్తున్నా గుడ్లప్పగించి చూడటం, సారీ కుంభకర్ణుడివి కదా గుడ్లుమూసి పడుకోవటం తప్ప నీలాంటి వాళ్ళు చేసేదేమైనా ఉందా?

 15. 36 ప్రవీణ్ గార్లపాటి 2:56 ఉద. వద్ద జనవరి 23, 2010

  బాగుంది. తె.వాదుల అడ్డగోలు వాదనలని సమర్థవంతంగా తిప్పికొట్టారు.

  వివరాలు, అంకెలు చెప్పి, చరిత్ర గురించి మాట్లాడే తె.వాదుల అభిప్రాయాలని గౌరవించచ్చు కానీ సినిమాల్లో మా యాసని అగౌరవపరిచారు వగయిరా అడ్డగోలు కారణాలని చూపి విడిపోవాలనే వారిని చూస్తే వింతగా అనిపిస్తుంది.

 16. 37 manu 4:57 ఉద. వద్ద జనవరి 23, 2010

  andari vadanallo konta nijam lekapoledu. self-pity manaki puttukato vachina vidya. anduke rajakiya nayakulu tega aadukuntaru manato.Udyogala vishayaniki vaste, andhra vallu telanganaki valasa ravadam tappaite telangana vallu migata pradesalaki valasa povadam anta kante pedda tappu. enta sepatiki hyderabad udyogalu ani tannukovadam tapite a udyogalu okka telangana valla valle raledu “telugu”valla vachinayanna sangati marchipotunnaru.aina andhra vallu udyogalu lakkuntunnaru anadam tappu. Evadiki talent,intellect, kastapade gunam untundo vadini evadu vadulukodu, vadidi america aina africa aina.

  inka kcr sangati antara, delhi lo inta kaalam central post lo unnapudu telangana gurtukuraleda ataniki?paiga a madhye nizam lani tega pogidadu. mari atani drustilo rajakarla udyamaniki e viluvundo?post poyi khaliga undi identity kasta taggina tarvata gurtochinda telangana udyamam?

  ika pro n con telangana vaadulaki oka chinna manavi. e udyamam purely based on political interest. telangana prajalani bakralu chesi mabhyapetti facts daachi consequences ni bhutaddam loninchi chupistunnaru kabatte vallaki support vastondi. ante tapite Ou students kani telangana prajaneekam kani indulo manchi chedulu bareeju vesukoni support ivvatledu. The people who r participating r only catering 2 their emotion. BTW OU lo udyamam lo participate chese students, most of them are 25+, enrolling themselves only to avail hostel facility with minimum expenditure or non-boarders who lobbied into OU via the so-called student federation leaders. mahesh garu, don’t take me wrong but once you seperate these from the real students you’ll find very few taking place in telanagana movement they only are true fighters for telangana movement.

 17. 38 Goutham 5:11 సా. వద్ద జనవరి 23, 2010

  .

  కృష్ణ గారూ
  ముందు కోట్లాది తెలంగాణా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను … తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల నుంచి విముక్తి పొందేందుకు… తమ రాష్ట్రం తమకు కావాలన్న వారి బలమైన కోరికను వేర్పాటు ఉద్యమంగా సంబోధించడం మానండి.

  మన రాజకీయ పార్టీలకు స్థిరమైన అభిప్రాయాలు ఎక్కడున్నాయండీ?
  ఇచ్చిన మాటకు , చేసిన వాగ్దానానికి కట్టుబడి వుండే నిజాయితీ వాటికి వుంటే ఆంద్ర ప్రదేశ్ పరిస్థితి ఇట్లా ఎందుకు వుండేది?
  అధికార , ప్రతిపక్ష పార్టీ లు ఆంద్ర లో ఒకరకంగా, తెలంగాణలో ఒకరకంగా మాట్లాడుతూ ఇంత దుర్మార్గంగా , బాధ్యతా రహితంగా… అన్ని ప్రజాస్వామిక విలువలను గాలికి వదిలేసి నాటకాలాడుతుంటే – పరిస్థితి అంతకంతకూ ఇంకా ఇంకా విషపూరితం కాకుండా ఎలా వుంటుంది ??

  అసలు సమస్యను గాలికి వదిలేసి, ఎవరో అత్యుత్సాహంతో వాగిన గాలి మాటలను పట్టుకు కూర్చుంటే సమస్య ఇంకా కుళ్ళి పోతుంది.
  సామరస్యం ఇంకా దెబ్బ తింటుంది తప్ప మరో ప్రయోజనం వుండదు.

  ఈ మనస్సు చివుక్కు మనిపించే మాటలు , నిందలు, ఆరోపణలు, అవహేళనలు రెండు వైపులా వున్నాయి.

  వాటిని కాసేపు పక్కన పెట్టి అసలు సమస్య సత్వర పరిష్కారం గురించి ఇకనైనా ఆలోచిద్దాం.

  హింసను ఎవరూ కోరుకోరు.
  శాంతి యుత పరిష్కారానికి వీల్లేకుండా అన్ని దారులూ మూసినప్పుడే , అణచివేత చర్యలకు పాల్పడినప్పుడే
  హింసకు అంకురార్పణ జరుగుతుంది.
  తలుపులు మూసి చితక బాదుతున్నప్పుడు పారిపోయే అవకాశం లేని పిల్లి కూడా హింసా మార్గం అనుసరిస్తుంది కదా.
  మనిషి పరిస్థితీ అంతే.

  ఇవన్నీ ఎందుకు తెలంగాణా ఆంధ్ర లు విడి విడి రాష్ట్రాలు గా ఏర్పడితే ఇండియా – పాకిస్తాన్ ల విభజనల ఏవో అనర్ధాలు జరుగుతాయన్నట్టు ఎందుకు ఇంత దుష్ప్రచారం చేసి సమస్యను సాగ దీస్తున్నారో …
  ఈ బలవంతపు , రౌడీయిజపు సమైక్యత వల్ల ఎవరికి ఏం లాభమో …
  ఈ విషాద మరణాలు, హింసా, బందులు, ఇబ్బందులు పిల్లల చదువులు దెబ్బ తినడాలు ఇంకా ఎంత కాలమో ఏమి అర్ధం కావడం లేదు.

  తెలుగు వాళ్ళని వాళ్ళ మూర్ఖత్వాన్ని, మొన్దిపట్టుదలని చూసి యావద్దేశం, యావత్ దేశ రాజకీయ పార్టీలు …నాయకులు అంటా నవ్వుకుంటున్నారు.

  .

 18. 40 gaddeswarup 5:12 సా. వద్ద జనవరి 23, 2010

  అబ్రకదబ్ర
  The only blog I have been following consistently on this topic is Kuffir’s. He is from Telangana and is not from one of the privileged castes. You may find his posts interesting. See in particular his comments in
  https://www.blogger.com/comment.g?blogID=14756769&postID=227604507982944277

 19. 41 రవి 8:44 సా. వద్ద జనవరి 23, 2010

  మీ టపాలో మొదటి పేరాగ్రాఫు తప్ప, మిగిలిన టపాతో ఏకీభవిస్తున్నాను. ఆ పేరా గౌణం (ప్రాస్తావికం) కాబట్టి చర్చించడానికి ఏమీ లేదు.

  “యాస”, “సినిమాల్లో విలన్లుగా చిత్రీకరణ” ఈ విషయాలకొస్తే, రాయలసీమ వాసులు కూడా ఆరోపించవచ్చు.అయితే అవన్నీ సిల్లీ కారణాలు.

 20. 42 చదువరి 11:26 సా. వద్ద జనవరి 23, 2010

  “ఈ మనస్సు చివుక్కు మనిపించే మాటలు , నిందలు, ఆరోపణలు, అవహేళనలు రెండు వైపులా వున్నాయి.” – లేవు! రెండు వైపులా కాదు, ఒకే వైపు ఉన్నాయి; తె.వాదులు మాత్రమే ఇలాంటివాటికి పాల్పడ్డారు. నోటికొచ్చినవన్నీ మాట్టాడారు. అలా మాట్టాడి, జనాల్లో భావోద్యోగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని ప్రయత్నించారు. ఇతరులు అన్నవన్నీ కూడా తె.వాదుల అతివాగుడుకు స్పందనలే – అదీ చాలా తక్కువ మోతాదులో!

  “ఈ బలవంతపు , రౌడీయిజపు సమైక్యత వల్ల ఎవరికి ఏం లాభమో …” రౌడీయిజపు సమైక్యతా? గూండాయిజపు, దార్కారీ తె.వాదాన్ని ఏమంటారు? గాంధీగిరీయా? భలే!

  “ఈ విషాద మరణాలు, హింసా, బందులు, ఇబ్బందులు పిల్లల చదువులు దెబ్బ తినడాలు ఇంకా ఎంత కాలమో ఏమి అర్ధం కావడం లేదు.” – అంతా తె.వాదుల చేతుల్లోనే ఉంది. తె.వాదులే ఈ హింసకు కారణం. మొదటి నుంచీ వాళ్ళ మాటల్లో హింస ఉంది. కోస్తా సీమల జనులు మనకు శత్రువులన్నట్టుగా చిత్రిస్తూ వచ్చారు. దోపిడీదార్లంటూ దూషించి ప్ర్జల మధ్య లేనిపోని వైషమ్యాలను పెంచేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చారు. తె.వాదులు నోళ్ళు మూసుకుని కూచ్చుంటే ఒక్క నెల రోజుల్లో అంతా సద్దుమణుగుతుంది. హింస ఆగుతుంది.

  “తెలుగు వాళ్ళని వాళ్ళ మూర్ఖత్వాన్ని, మొన్దిపట్టుదలని చూసి యావద్దేశం, యావత్ దేశ రాజకీయ పార్టీలు …నాయకులు అంటా నవ్వుకుంటున్నారు.” – అవున్నిజమే, కానీ నిజం తెలిసి కాదు! మూర్ఖత్వం, మొండి పట్టుదల చూపిస్తున్నది కేవలం కొద్ది మంది తె.వాదులు మాత్రమేనని వాళ్ళకు తెలీదు మరి.

 21. 43 pannaga 1:21 ఉద. వద్ద జనవరి 24, 2010

  కొట్టుకు చావకండర్రా !
  రాష్ట్రం విడిపోయాక మరీ ఇండియా, పాకిస్తాన్ లా మొహం మొహం చూసుకోలేని పరిస్థితి తెచ్చుకొంటారా ఏమిటి ?

 22. 44 Goutham 10:22 ఉద. వద్ద జనవరి 24, 2010

  చదువరి గారూ,
  అసలు సమస్య గురించి చర్చించే ఉద్దేశం మీకు లేదని స్పష్టమవుతోంది.
  జెంటిల్ అగ్రిమెంట్, ఆరుసూత్రాల పధకం, 610 జీవో , నీళ్ళు ఉద్యోగాల విషయంలో తెలంగాణాకు జరిగిన అన్యాయాలు, రాజకీయ పార్టీల తెలంగాణా స్టాండు, వాటి మోసపూరిత మానిఫెస్టోలు , అబ్ధపు వాగ్దానాలు , రెండు నాల్కల ధోరణి , ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రోశయ్య కమిటీ వగైరా వగైరాలను, తెలంగాణా ప్రజల ఆకాంక్షను మీరు ఏమాత్రం పట్టించుకోరని, కేవలం ఉప సమస్యలే మీకు ప్రధానమని, వాటి ఆధారంగా తెలంగాణా ఉద్యమం పై బురద జల్లడమే మీ లక్ష్యమని స్పష్ట మవుతోంది. అలాంటప్పుడు ఈ వాద ప్రతివాదాల వల్ల చిల్లి గవ్వ ప్రయోజనం వుండదు. మీ దారి మీది మా దారి మాది.

  • 45 అబ్రకదబ్ర 11:26 ఉద. వద్ద జనవరి 24, 2010

   @గౌతమ్మూ:

   మీ మొదటి కామెంట్లో ఈ ముక్కడిగారు:

   >> “తెలుగు దేశం ప్రజారాజ్యం, కాంగ్రెస్స్ పార్తీలన్నే అబద్ధాల కోర్లుగా మీకు ఎందుకు అనిపించడం లేదు”

   మాట మార్చింది నేను కాదు. నన్నెందుకడుగుతారు? నేనేమీ ఆయా పార్టీల నాయకుడినో, కనీసం కార్యకర్తనో కాను. వెళ్లి వాళ్లనడగండి.

   ఇక అగ్రిమెంట్ల గురించి ….

   నేనీ టపాలో వివక్షారోపణల గురించి అంత వివరంగా రాస్తే – నే రాసిన దాంట్లో తప్పులేమన్నా ఉంటే ఎత్తి చూపే ప్రయత్నం మీ ఇన్ని వ్యాఖ్యల్లో ఒక్కసారీ చెయ్యకపోగా .. మీరు పదే పదే చేస్తున్నది అగ్రిమెంట్ల గురించీ ప్రశిస్తూ చర్చని పక్కదారి పట్టించే యత్నం.

   అగ్రిమెంట్లనేవి రెండు చేతుల చప్పట్లు. ఏ ఒప్పందంలోనూ హామీలన్నీ ఒకవైపు నుండి రెండోవైపుకే కుమ్మబడవు. తొందరెందుకు .. నా తూణీరంలో ఇంకా ఐదు బాణాలు మిగిలే ఉన్నాయి. వివరంగా ఒప్పందాలు, నిబంధనల గురించీ ముచ్చటించుకుందాం. అందాకా ఓపిక పట్టండి. ఐతే ఒక విన్నపం: తీరా ఆ వివరాలన్నీ చదివాక అప్పుడు వాటి గురించి వదిలేసి మరి దేని మీదకో దృష్టి మళ్లించకూడదు మీరు 🙂

   • 46 krishna 1:07 సా. వద్ద జనవరి 24, 2010

    అబ్రకదబ్ర గరు నెను కుద “సీమంధ్రా”(ఇది నా వోఋడ్ కాదు)కి
    చెందిన వాదినె.మీ బ్లాగ్ ఈ మధ్యనే follow అవుతున్నాను. చాల బాగున్నాయి కాని యీ బ్లాగు పరంపర లొ మాత్రము నాకు మీ ఆరొపనలు కొంచం తీవ్రము గ వున్నయి అనిపిస్తుంది. ఇది నా అవివెకం అయిథె క్షమించగలరు. it can be little bit toned down, is nt it?

   • 47 అబ్రకదబ్ర 1:42 సా. వద్ద జనవరి 24, 2010

    @Krishna:

    మీరడిగిన దాంట్లో తప్పేమీ లేదు లెండి. ముందస్తు క్షమాపణలనవసరం 🙂

    నేను ఆంధ్రప్రదేశ్‌కి చెందినవాడిని – సీమాంధ్రకో, మరే ఒక్క ప్రాంతానికో కాదు.

    నావి ఆరోపణలు కావు, వేర్పాటువాదుల అసత్యపూరిత నిందారోపణలకి సమాధానాలు. నా టపాలు కటువుగా ఉన్నయంటారా? ‘నరుకుతాం, చంపుతాం’ లాంటి మాటలతో పోలిస్తే నా వాక్యాల్లో పరుషదనమెంత?

   • 48 krishna 2:20 సా. వద్ద జనవరి 24, 2010

    నరుకుతాము , చంపుతాము అని అంటున్న రాజకీయ నాయకుల మాటలు పట్టించుకోకండి. వారి భాష లొ మనము మట్లాడనక్కరలెదు అనుకుంటాను.sri గారికి పెట్టిన జవాబు చూడగలరు. మీ reply కోసము చూస్తున్నాను.

   • 49 అబ్రకదబ్ర 4:36 సా. వద్ద జనవరి 24, 2010

    వాళ్ల భాషలో మాట్లాడేంత దిగజారుడుతనం నాకు లేదు, రాదు. నా భాష సూటిగా, ధాటిగా ఉంటుందే తప్ప లేకిగా కాదు. గమనించగలరు.

    ప్లస్ – నా దాడి తెలంగాణ వారి మీద కాదు, వేర్పాటువాదుల మీద. ఈ టపాలన్నీ అటువంటి తీవ్రవాదుల్ని ఉద్దేశించినవే. ‘జై ఆంధ్రా’ అంటూ అడ్డగోలు వాదాలు మొదలెట్టే వాళ్ల మీదా ఇదే రకంగా విరుచుకు పడతా నేను.

  • 50 krishna 1:55 సా. వద్ద జనవరి 24, 2010

   గౌతము గారు
   నాకు ఈ విషయము మీద అవగాహన తక్కువ. కాబట్టి తప్పు గ మాటలాడితె క్షమించ గలరు.
   “బలవంతపు సమైక్యత ” అర్దం లెక ఆవిర్భవము నాకు తెలిసి హైదెరబద్ కి సంబందించినదే. అక్కడ మొత్తము స్టేట్ కి చెందిన వారు వున్నారు. ఆ ప్రాంతము మన అందరిది అని అందరి అభిప్రాయము. సడెన్ గా అది మనది కాదు అంటె కలిగిన షాక్ ఈ “బలవంతపు సమైక్యత “.
   ఇప్పటి వరకు ఏర్పడ్డా ప్రతి చిన్న రాష్ట్రము వేరే రాజధాని పొందాయి తప్ప వున్న రాష్ట్ర రాజధాని ని పొందలెదు.
   ఈ ప్రతేక్యత వల్లనే ఇక్కడ ఇంత ఇబ్బంది. చిన్న రాష్ట్రము గ తెలంగాణ అభివ్రుద్ది పొందితె ఎవరికి ఇబ్బంది వుండదు.
   ఇంత కోప తాపాలు , కక్షలు వుండవు.
   రాజదాని విషయమై అందరి ఏకాభిప్రాయము శాంతి పూర్వకము గ , త్వరగ రాగలదని అశిశ్తున్నాను.

 23. 51 lokesh 2:22 ఉద. వద్ద జనవరి 25, 2010

  telangana nayakulu very rich. telangana prajalu manchivalle
  telangana samasyalaku telangana nayakulu javabu cheppali.
  ippudu fight cheyyalisinadi , andhra valla mmeeda kadu .telangana nayakula meeda. mariyu, cenrtel &state governments pyna.telangana vadulu telusukovali.

 24. 52 zulu 4:12 ఉద. వద్ద జనవరి 25, 2010

  నాకు ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి, తెలంగాణా వాదులు ఏమన్నా తీర్చగలరని ఆసిస్తూ.
  Q1> ప్రతి ఒక్కరు మోసం చేసారు మోసం చేసారు మోసం చేసారు అని అరుస్తున్నరే, మీలో ఏ ఒక్కరైనా వీటి మీద మీ నాయకులని నిలదీసిన ఉద్యమ ధాఖలాలు ఏమన్న ఉంటే ఆ లింక్ లు ఇవ్వగలరని మనవి. తెలంగాణా వస్తే మా జీవితాలు బాగు పడతాయి అని అరుస్తున్న వాల్లందరికి ఒక చిన్న మనవి. ఒక బ్రిడ్జి కత్తలంటే ఎన్ని అనుమతులు కావాలి, పైన రాష్ట్రాలతో ఎంతగా కొట్లడాలో ఎవరికన్నా ఎరుకేనా?
  Q2> ఆంద్రా, తెలంగాణా కలిసినప్పుదు, ఎవో నిభందనలు, రాతలు, కోతలు చేసుకున్నారు అని ఇప్పుడు అరుస్తున్న నాయకులు ఎవరన్నా ఇంతకు ముందు వీటి గురించి అరిచిన ధాకలాలు ఉంటే చూపించగలరని మనవి.
  (Contd)

 25. 53 suresh 2:15 ఉద. వద్ద జనవరి 26, 2010

  ఎందుకైనా మంచిది, ఒక సారి తెలంగాణా వుద్యమ నాయకులెవరో తెలుసుకుందాం. ముందు ముందు ఈ నాయకుల అవసరం రావొచ్చు.
  ఖ్.ఛ్.ఋ& ఫామిలి ,జానా రెడ్డి, కేశవరావ్,విజయశాంతి,గద్దర్,మంద మాదిగ,ప్రొ.జయశంకర్ ,ఓ విద్యార్థి నాయకుడు, ఇతరత్రా.,

  చివరి ఇద్దరి గురించి నాకు పెద్దగా తెలీదు. కాని మిగతావారి చరిత్ర ఒక్క సారి చూడండి! ఒక్కటి మాత్రం నిజం! తెలంగాణా ఏర్పడితే మొ(డాష్)గుడిసి పోవడం ఖాయం!

 26. 54 suresh 2:16 ఉద. వద్ద జనవరి 26, 2010

  ఎందుకైనా మంచిది, ఒక సారి తెలంగాణా వుద్యమ నాయకులెవరో తెలుసుకుందాం. ముందు ముందు ఈ నాయకుల అవసరం రావొచ్చు.
  K.C.R& ఫామిలి ,జానా రెడ్డి, కేశవరావ్,విజయశాంతి,గద్దర్,మంద మాదిగ,ప్రొ.జయశంకర్ ,ఓ విద్యార్థి నాయకుడు, ఇతరత్రా.,

  చివరి ఇద్దరి గురించి నాకు పెద్దగా తెలీదు. కాని మిగతావారి చరిత్ర ఒక్క సారి చూడండి! ఒక్కటి మాత్రం నిజం! తెలంగాణా ఏర్పడితే మొ(డాష్)గుడిసి పోవడం ఖాయం!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: