ఆందోళనా పథం

లక్ష్యం ఎంత ఉన్నతమైనదైనా, ఆశయం ఎంత ఉదాత్తమైనదైనా దాని సాధనకి ఎంచుకునే మార్గం సైతం అంత ఉన్నతంగానూ ఉండాలని ఏనాడో మహాత్ముడు చెప్పిన సుద్దు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదేంటి? మొన్నటిదాకా హైదరాబాదులో వేర్పాటువాదం పేరిట సాగిన పెను విధ్వంసం. రెండు రోజుల నుండీ, సోనియామ్మ పుట్టిన రోజు కానుక పేరుతో కేంద్రం పెట్టిన చిచ్చు దరిమిలా సమైక్యవాద నినాదంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మొదలైన వినాశనం. ఆర్టీసీ బస్సుల దహనం. బందులు, హర్తాళ్లు. చస్తామనే బెదిరింపులు. ప్రభుత్వాస్తుల విధ్వంసం.

ఎవరిదీ పాపం కట్టుకున్న పుణ్యం? నిస్సందేహంగా కాంగ్రెస్ అధిష్టానానిదే. రెండు వారాల కిందటివరకూ చచ్చిన పాములా పడున్న మనిషొకడు పది రోజులు నిరాహార దీక్ష నాటకమాడితే, అతని వందిమాగధులో వందమంది బస్సులు తగలెడితే, అదే అదనుగా కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు పూర్తిగా తన చేతిలోకి తెచ్చుకునే దురాలోచనతో ఏకంగా రాష్ట్ర విభజనకే జెండా ఊపితే .. అది ప్రజల్లోకి పంపే సందేశం ఏమిటి? ‘పనులవ్వాలంటే పంబ రేగ్గొట్టాల్సిందే, ప్రభుత్వాస్తులు తగలబెట్టాల్సిందే’ అని కాదా?

ఈ తప్పుడు సందేశం రాత్రికి రాత్రే రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా బలంగా అల్లుకుపోయింది. ఎంత బలంగానంటే, తెల్లవారే లోపు పదికి పైగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు వాదనలు వినిపించేంత! రాష్ట్రంలో అగ్గి రాజేసి, ఆ సెగలతో ఢిల్లీ జనపథంలో తీరి కూర్చుని డిసెంబరు చలి కాచుకుంటున్న అధిష్టానం అండ్ కో మాత్రం తామెంత ప్రమాదకర ధోరణికి అంటుకట్టారో గ్రహించినట్లు అనిపించటం లేదు. బహుశా, గ్రహించినా వాళ్లకేమీ ఫరకు లేదేమో. వాళ్లకు కావలసంది విభజించి పాలించే వెసులుబాటు. దానికోసం అవసరమైతే ఎన్ని రాష్ట్రాలైనా విడగొట్టటానికి వాళ్లు తయార్.

ప్రజల్లో భావావేశాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ పక్షాలకీ, వాటి అధినేతలకీ రాష్ట్రం ఇప్పుడు అట్టుడుకుతున్న వైనం చూసైనా బుద్ధొస్తుందనుకోవటం బొత్తిగా అమాయకత్వం. వచ్చేవేమన్నా ఉంటే అవి – చిచ్చులు పెట్టటానికి మరిన్ని ఐడియాలు, ఎంత సులువుగా విద్వేషాలు ఎగదోయొచ్చనేదానిపై అంచనాలు.

అసలింత రచ్చకీ నారు పోసిన దోషి బీజేపీ. ఎనభైల చివర్లో తమ ప్రాబల్యం పెంచుకోటానికి దేశాన్ని మత ప్రాతిపదికన నిట్టనిలువునా చీల్చిన పార్టీయే, హైదరాబాదులో తమకున్న అంతో ఇంతో ఉనికిని విస్తరించుకునే కపటాలోచనతో ఏ నాడో సద్దుమణిగిపోయిన ప్రత్యేక తెలంగాణవాదాన్ని పిలక పట్టుకు పైకి లాగింది. ‘ఒక వోటు, రెండు రాష్ట్రాలు’ నినాదంతో తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి 1998 సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని చూసింది. ఆ ఎన్నికల అనంతరం (అప్పట్లో) సమైక్యవాద టీడీపీ దోస్తీ కేంద్రంలో తన ప్రభుత్వ మనుగడకి ప్రాణాధారమై తాత్కాలికంగా తెలంగాణ అజెండాని పక్కనబెట్టినా, చంద్రబాబు జమానాలో పదవి దక్కక ‘కింకర్తవ్యం’ అనుకున్న కేసీయారుకి మంత్రదండంలా దొరికింది నాడు బీజేపీ మూలన పడేసిన వేర్పాటు నినాదమే. అలా – రాష్ట్రం నేడు రావణకాష్టంలా రగలటానికి నాడు రాముడి పార్టీ మొదలెట్టి మధ్యలో వదిలేసిన అశ్వమేధం సగం కారణం. ప్రాంతీయ విద్వేషాలు ముదిరి నరమేధానికే దారితీస్తే దానికి మొదట నిందించాల్సింది వాళ్లనే. వాళ్లు రాజేసిన నెగళ్లకు స్వీయ ప్రయోజన పరిరక్షణాభిలాషతో శక్తిమేరా ఆజ్యమూది రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిన పాపంలో సింహ భాగం తెరాస, కాంగ్రెస్ పార్టీలది; కొంత భాగం తెదేపాది.

తమ సంకుచిత రాజకీయాలకెంత ‘ప్రజల ఆకాంక్ష’ ముసుగు తొడిగినా వీటి వెనకుండేదెప్పుడూ స్వార్ధ ప్రయోజనాలే. ప్రజల కోరికే ప్రామాణికమైతే మరి మెజారిటీ కాశ్మీరీల అభీష్టం మన్నించి ఆ రాష్ట్రాన్ని దేశం నుండి విడగొట్టరేం – అలా చేస్తే తమకొచ్చే పొలిటికల్ మైలేజీ పూజ్యం కనుక. వేర్పాటువాదం ఏ రూపంలో ఉన్నా మొదట్లోనే అణచేయటం కేంద్రం కర్తవ్యం కావాలి. రాష్ట్రాల్ని విడదీయటం వల్ల సాధారణ ప్రజలకు ఒరిగేది సున్నా. అయినా ఎక్కడికక్కడ ప్రత్యేక రాష్ట్ర వాదనలు పుట్టుకొస్తున్నాయంటే, దానిక్కారణం పార్టీలు జన హితం కన్నా తమ ప్రయోజనాలే మిన్న అనుకోవటం. మొత్తమ్మీద, పార్టీల కుర్చీలాటలో బలిపశువులెప్పుడూ సాధారణ ప్రజలే. ఇప్పుడు వారితో వారి ఆస్థులనే తగులబెట్టించి తమ ప్రయోజనాలు తీర్చుకునే కొత్త ధోరణి మొదలయింది. మంటలంటించి మజా చేసుకునే వీళ్ల పాపాలకు లేదు నిష్కృతి; తేలిగ్గా భావావేశాలకు లోనై విచక్షణ మరిచే ప్రజలున్నంత కాలం భారతావనికీ లేదు పురోగతి.

24 స్పందనలు to “ఆందోళనా పథం”


  1. 1 a2zdreams 7:47 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    తెలంగాణ ప్రజలను ఇదిగో తెలంగాణ, అదిగో తెలంగాణ అని మోసం చేయడం తప్పు. సమైక్య నినాదంతో ఎన్నికలలోకి గెలిచి తీర్మానం పెడితే కాంగ్రెస్ తప్పు అనడంలో అర్ధం వుంది.అందరి మాట తెలంగాణకు వ్యతిరేకం కానప్పుడు తీర్మానం పెడతానంటే కాంగ్రెస్ తప్పేమిటి ?

    మీ లాంటి మేధావులు కూడా ఏకపక్షంగా మాట్లాడితే వాదించడానికి ఏముంటుంది సార్?

    విమర్శించడమే మనిషి ధ్యేయం కాకూడదు సార్. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత “తెలంగాణ వస్తే” అంటూ వై.యస్ చేసిన వ్యాఖ్యలను విమర్శించిన మీరు “తెలంగాణ కు వ్యతిరేకం కాదు” అని ఎన్నికలలో గెలిచి రాజీ నామాలు చేస్తున్న నాయకుల వైపు మాట్లాడటం ఆశ్చర్యంగా వుంది.

    ఈ ఎపిసోడ్ తెలంగాణ అంశానికి ముగింపు పలికే విధంగా సాగుతుందని, అదే విధంగా ఎండ్ అవ్వాలని నా ఆశ.

  2. 2 అబ్రకదబ్ర 8:09 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    @డ్రీమ్స్:

    ప్లేటు ఫిరాయింపుల్లో ఆరితేరినవారు, గోడ మీది పిల్లులు వేర్పాటువాదుల్లోనూ ఉన్నారు. అక్కడ నిలదీయగుండా ఇక్కడ నిలదీయటంలో అర్ధమేంటి?

    నేనిప్పుడు సమైక్యాంధ్ర కోరుకుంటున్న ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. రాజీనామాలు చేసిన నేతల పక్షాన కాదు. నా వాదనెప్పుడూ సమైక్యతే – ఆ విషయం మీకు తెలుసనుకుంటాను. రాష్ట్రం విడిపోయినా వాళ్ల ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలో ఈ ఆంధ్రా/సీమ నేతలకు బహు బాగా తెలుసు. నిజానికి, విడిపోతే వాళ్లకీ పండగే – ఎక్కువ పదవులు దొరుకుతాయి కాబట్టి. రాజీనామాలు ప్రజల తీవ్ర ఒత్తిడితో జరిగాయే తప్ప నేతల ఇష్టంతో కాదు. ఇక్కడ ప్రతిఫలిస్తుంది ప్రజాభిప్రాయమే కానీ వాళ్ల స్వీయాభిప్రాయాలు కాదు.

    ఆ నాడు నేను విమర్శించింది వైఎస్ మాట మార్చటాన్ని. ఈ రోజు చంద్రబాబు పిల్లిమొగ్గలేయటాన్నీ అదే రకంగా విమర్శిస్తాను. దానర్ధం నేను ప్రత్యేకవాదానికి సమర్ధకుడిని అని కాదు.

    అసలైనా ఈ టపా తమ ప్రయోజనాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీల కుత్సితాల గురించీ, ప్రోత్సహిస్తున్న విధ్వంసకర ధోరణుల గురించీ మాత్రమే. మీలాంటి, నాలాంటి వారి వ్యక్తిగత దృక్కోణాలకీ, వాదాలకీ మద్దతుగానో, వ్యతిరేకంగానో కాదు. కాబట్టి ఈ టపా వరకూ చర్చ ఆ కోణంలోనే చేద్దాం.

    బైదవే, నేను మేధావిని కాను 🙂 ప్లస్ నేను పెద్దగా వాదించటం లేదు. టపాలో నా అభిప్రాయం చెప్పేసి, వ్యాఖ్యాతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నానే తప్ప నా టపా మీద జరిగే చర్చలో నేను పాల్గొనటం లేదు – గమనించారా?

  3. 3 సాయికిరణ్ 8:11 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    a2z గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

  4. 4 కత్తి మహేష్ కుమార్ 8:28 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    కాశ్మీర్ వేర్పాటువాదానికీ తెలంగాణాకూ లంకెగలపడం హాస్యాస్పదంగా ఉంది. భారతదేశంలాంటి పెద్ద దేశంలో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా చూసుకుంటే కనీసం 50 రాష్ట్రాలుండాలి. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట ఒక ఏమోషనల్ అంశాన్ని తీసుకుని విభజించగాలేనిది, ప్రాంతీయత ఆధారంగా రాష్ట్రాన్ని విభజించాలనే కోరికని చులకనచేస్తే ఎలా?

    కె.సి.ఆర్ కోరుకునే తెలంగాణా కాదు. కొన్ని దశాబ్ధాలుగా తెలంగాణా ప్రజలు కోరుకునే తెలంగాణా గురించి ఆలోచించండి.

    • 5 అబ్రకదబ్ర 1:48 సా. వద్ద డిసెంబర్ 13, 2009

      @మహేష్:

      పరిపాలనా సౌలభ్యం కోసమేనైతే ముందు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్, బెంగాల్ వగైరా పెద్ద రాష్ట్రాలని విడగొట్టమనండి. ఆంధ్రప్రదేశే దొరికిందా ప్రయోగాలు చెయ్యటానికి? అదీ మెజారిటీ ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా. పెట్టమనండి ప్లెబిసైట్. తెలంగాణలో సైతం ఎన్ని సమైక్య గొంతుకలు వినిపిస్తాయో తెలుస్తుంది మీకు. ఆ ఊసెత్తరేం? తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి విలువిస్తున్నాం అనేవారు అంతకు రెండు రెట్లున్న మిగతా తెలుగు ప్రజల ఆకాంక్షలకి ఇచ్చే విలువ ఇదా?

      దేశంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు బోలెడున్నాయి. వీటి ఊసెత్తకుండా ఆంధ్రప్రదేశ్‌ని చీల్చాలని నిర్ణయించటం తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనే అని మీరనుకుంటున్నారంటే – అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఇంకోటి లేదు. నేను కాశ్మీరుకీ, తెలంగాణకీ పెట్టిన పోలిక సైతం కామెడీలో దీని ముందు దిగదుడుపే.

      • 6 కత్తి మహేష్ కుమార్ 7:43 సా. వద్ద డిసెంబర్ 13, 2009

        బ్లాక్ మెయిల్ కు లొంగు రాష్ట్రాన్నివ్వడాన్ని వ్యతిరేకించాల్సిందే. అది ప్రాసెస్ కి సంబంధించిన విషయం. భారతప్రభుత్వం SRC చేత ఒక శాస్త్రీయమైన పద్దతిలో రాష్ట్రవిభజన చేపట్టి ఉండాల్సింది. నా మద్దత్తు, ఘొర్ఖ్హాలాండ్, పూర్వాంచల్ రాశ్ఝ్ట్రాలకు కూడా ఉంది. I am all for small states.

  5. 7 Praveen Sarma 8:33 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    వేర్పాటువాదం అంటే దేశం నుంచి వేరుపడాలనుకోవడం. రాష్ట్రం నుంచి వేరుపడాలనుకోవడం విభజనవాదం. తెలంగాణా, బోడోలాండ్ విభనవాద డిమాండ్లు. అవి వేర్పాటువాద డిమాండ్లు కావు.

  6. 8 sravyav 8:34 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    మీరు A to Z గారికి ఇచ్చిన సమాధానం చాలా బాగుంది నిజం ఈ రాజకీనాయలకు రాష్ట్రం విడిపోయినా వాళ్ల ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఈ మెత్తం ఎపిసోడ్ లో నాకు కనువిప్పు కలిగింది మాత్రం ఈనాడు గురించి. నాకు తెలుగు చదవటం తెలిసిన దగ్గర నుంచి ఒక్క రోజు కూడా వదల కుండా చదివిన పేపర్ ఇవాళా ఆ పేపర్ న్యూస్ ప్రొజెక్ట్ చేసే తీరు చాల ఆశ్చర్యం గా ఉంది. ఇక TV9 సంగతి తెలిసిందే హైదరాబాద్ లో మురుగులో పంది పొర్లినా బ్రేకింగ్ న్యూస్ గాని ఇక వేరే ప్రాంతం లో ఏమి జరిగిన వీళ్ళకు ముఖ్యం కాదు. ఇంకా అన్నిటికన్నా ఆశ్చర్యం గా ఉన్న విషయం కెసిఆర్ నిరాహారదీక్ష జరిగిన తీరు గురించి వేరే దేశాలలో ఉన్న వాళ్లకు కూడా తెలిస్తుంది కాని మన న్యూస్ చానల్స్ కి గాని ప్రింట్ మీడియా కి గాని ఏమి తెలియకపోవటం. దీని వెనక ఉన్న పెద్ద హస్తలేవరివో అన్న విషయం మీద ఉదాసీనం గా ఉండటం , కెసిఆర్ ఆరోగ్యం గురించి జనాలను ఒక టెన్షన్ కి గురిచేయటం లో పెద్ద పాత్ర వహించటం వీటికి సమాధానాలు తెలియాలంటే కొంచెం కాలం ఆగాలేమో .

  7. 9 viswamitra 9:05 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    రాష్ట్ర విభజ నిర్నయం తీసుకోడానికి ముండు మేడం సోనియా అడిగిన ప్రశ్న రెండు చోట్లా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అనిట. అవీ వారి లెక్కలు.

  8. 10 suresh reddy 9:13 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    ఈయన గారికి తెదేపా తప్పు కొంత భాగమే కనపడ్డము లో ఆశ్చర్యమేమీ లేదు

  9. 11 Praveen Sarma 9:56 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    చంద్రబాబుని విమర్శించి కూడా అతనిలాగే బిహేవ్ చేసేవాళ్ళ సంగతి ఏమిటి? తెలంగాణా వస్తే హైదరాబాద్ తమకి చెందకుండా పోతుందని బాధ. హైదరాబాద్ ని అభివృద్ధి చెయ్యడం వల్ల రాష్ట్రంలో 70% ఉన్న పల్లెటూరి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉండదు అని వాళ్ళకి తెలియదా? చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధికి ఎక్కువ ఖర్చు పెట్టి మిగిలిన ప్రాంతాలని నిర్లక్ష్యం చేశాడనే కదా చంద్రబాబుకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కి వోటేశారు. ఇప్పుడు అదే చంద్రబాబులాగ హైదరాబాద్ యశస్సు రాష్ట్రాన్ని యశోవంతం చేస్తుందని నమ్మడం ఏమిటి? అంత నిజాయితీ లేకపోతే చంద్రబాబు నాయుడికే మళ్ళీ అధికారం ఇవ్వొచ్చు కదా. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో రాష్ట్రం మొత్తాన్నీ దివాలా తియ్యించేస్తాడు. చంద్రబాబుని వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ అన్నారు. అతను హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టిందే వరల్డ్ బ్యాంక్ అప్పులతో. వరల్డ్ బ్యాంక్ అప్పులు వద్దు కానీ వరల్డ్ బ్యాంక్ అప్పులతో కట్టిన హైటెక్ సిటీ మాత్రం కావాలి! చంద్రబాబు గడ్డి తింటే తప్పు, అతను తిన్న గడ్డి మనమే తింటే ఒప్పు. అది మన కోస్తా ఆంధ్ర అర్బన్ హైక్లాస్ వాళ్ళ మనస్తత్వం.

    • 12 అబ్రకదబ్ర 10:09 సా. వద్ద డిసెంబర్ 12, 2009

      @ప్రవీణ్:

      నా ఈ సమాధానం మీకు అర్ధమవదని తెలుసు. అయినా రాస్తున్నాను చదువుకోండి.

      వెనకబడింది తెలంగాణ ప్రాంతమే కానీ హైదరాబాదూ, దాని పరిసరాలూ కాదు కదా. పైగా హైదరాబాదులో తెలంగాణేతరులే ఎక్కువ. తెలంగాణని నిజంగా అభివృద్ధి చెయ్యాలనే చిత్తశుద్ధే ఉంటే ప్రత్యేకవాదులు ఆల్రెడీ అభివృద్ధి చెందేసిన, తెలంగాణేతరులతో నిండిపోయిన హైదరాబాదుని వదిలేసి మెజారిటీ తెలంగాణవాసులుండే నిజంగా వెనకబడ్డ జిల్లాల్ని తీసేసుకుని అభివృద్ధి చేసి చూపించొచ్చు కదా. ‘మీక్కావలసింది హైదరాబాదే’ అని సమైక్యవాదుల్ని ఆడిపోసుకునే ప్రత్యేకవాదులకి నిజంగా కావలసిందీ హైదరాబాదే – వెనకబడ్డ తెలంగాణ జిల్లాలు కాదు. హైదరాబాదు గురించి మీరు నన్నడిగిన ప్రశ్న ప్రత్యేకవాదుల్నీ అడిగండి మరి. ఇక్కడెందుకు గోల చెయ్యటం?

      రాష్ట్ర విభజన గురించిన చర్చ కాదిది అని అంత స్పష్టంగా నా పై కామెంట్‌లో చెప్పిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడితే నా నుండి ఇలాంటి స్పందనే వస్తుంది.

      • 13 Praveen Sarma 11:25 సా. వద్ద డిసెంబర్ 12, 2009

        టైటిల్ “ఆందోళనా పథం”. కోస్తా ఆంధ్రలో ఆందోళనలు చేస్తున్నది సాధారణ ప్రజలు కాదు. ఆర్థికంగా ముందున్న ఎలైట్ క్లాస్ కి ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలు. ప్రత్యేక తెలంగాణా వస్తే కోస్తా ఆంధ్రలోని మిడిల్ క్లాస్ వ్యాపారులకీ, రైతులకీ, కూలీలకీ వచ్చే నష్టం ఏమీ లేదు కానీ బంద్ ల పేరుతో షాపులు తెరవొద్దంటే నష్టమే. హైదరాబాద్ సెట్లర్స్ విషయం నాకు తెలిసినదే. 1983 టైమ్ లో కూడా హైదరాబాద్ లో కోస్తా ఆంధ్రవాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. అప్పట్లో మేము వరంగల్/కాజీపేటలో ఉండేవాళ్ళం. హైదరాబాద్ రాజధాని కావడం వల్లే అది అంత అభివృద్ధి చెందింది. లేకపోతే హైదరాబాద్/సికందరాబాద్/మల్కాజగిరి కూడా వరంగల్/హనుమకొండ/కాజీపేటల లాగ ఉండేవి.

  10. 14 satya 10:56 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    ఏ దేశ చరిత్ర చుసినా ఏముంది గర్వకారణం ..నరజాతి సమస్థం పరపీడణ పరాయణం…

    కాబట్టి అన్నలు అక్కలు ఊరికే సమైఖ్య , తెలంగాణ అని కొట్టు కోక దేశాభివ్రుద్దికి తోత్పడండి..

    జై తెలుగుతల్లి…
    జై సమైఖ్యాంధ్ర

  11. 16 ఏకాంతపు దిలీప్ 11:09 సా. వద్ద డిసెంబర్ 12, 2009

    @అబ్రకదబ్ర
    మీరు ప్రజారాజ్యం పార్టీని భాగస్థులని చేయడం మరిచిపోయినట్టున్నారు. అందుకే ఇక్కడ అపోహలు తలెత్తాయని అర్ధం చేసుకుని చిన్న పార్టీ అని చిన్న చూపు చూడకుండా త్వరగా కొంతలో కొంత భాగాన్ని ఇచ్చెయ్యండి. ప్రజారాజ్యం ఎప్పుడూ సమైక్య ఆంధ్ర ప్రదేష్ అనలేదు, వాళ్ళు తెలంగానాకి వ్యతిరేకం అనలేదు. ఇస్తే సమర్ధిస్తాం అన్నారు, తీర్మానం పెడితే మద్ధతిస్తాము అన్నారు. ఇప్పుడు అందరిలాగానే తలోమాట అంటున్నారు. మిగిలిన పార్టీల తీరుతెన్నులకి, దాని వ్యవహారానికే ఏ మాత్రం తేడా లేదు. కాబట్టి, దయచేసి ఆలోచించి ప్రజాస్వామ్యయుతంగా దానికి రావాల్సిన భాగాన్ని దానికి ఇచ్చెయ్యండి.

  12. 17 సుజాత 12:04 ఉద. వద్ద డిసెంబర్ 13, 2009

    “అన్నదమ్ముల్లా విడిపోవడం” “సామరస్యంగా విడిపోవడం” ..ఈ మాటలేమిటో అర్థం కావడం లేదు. అసలు విడిపోవడం సామరస్యం లేకేగదా! మళ్ళీ అందులో సామరస్యంగా విడిపోవడం, సౌభ్రాతృత్వంతో విడిపోవడం, సౌహార్దృ భావనలతో విడిపోవడం! ఈ మాటల వెనక కుట్ర ఎవరికి అర్థం కాదనుకుంటున్నారో మరి!

    సమైక్య వాదులు ఈ స్థాయిలో ఉద్యమిస్తారని నేను కూడా ఊహించనే లేదు. అయితే హింస కు తావు లేకుండా వీళ్ళ ఉద్యమం కొనసాగాలి. ఇంకొకరిని వేలెత్తి చూపిస్తున్నపుడు వీరూ అదే దారిలో నడవటం మంచిది కాదు.

    ఈ వేర్పాటువాదుల్ని సమర్థిస్తూ ఉత్తరాంధ్ర వాళ్ళు. ఎందుకంటే అభివృద్ధి సమస్య అంటూ ఉంటే దానికి పరిష్కారం ఒక్కటే అని వీరి భావన. వేరుపడిపోవడం. తర్వాత అభివృద్ధి ఎలా సాధిస్తారో ఒక్కరి దగ్గరా పక్కా కార్యాచరణ ప్రణాళిక లేకుండానే ఈ వాదనలు!

    కాకపోతే ఈ దెబ్బతో తెలంగాణా అభివృద్ధి ఖాయం!

    అల్టిమేట్ రిజల్ట్….రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మట్టిలో కలవడం!

    హెలికాప్టర్ ఎక్కి ఏం పని చేశావయ్యా రాజేశేఖర్ రెడ్డీ! అందర్నీ అయోమయంలో పడేశావు కదా!

  13. 18 రవి చంద్ర 12:23 ఉద. వద్ద డిసెంబర్ 13, 2009

    ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారు. ఈ పాపం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్రాల పునర్విభజన కోసం ఎస్సార్సీ ఉన్నప్పుడు దాని ప్రకారమే అంతా జరుగుతుందని కేంద్రం ప్రకటించి ఉంటే ఇంత రాద్దాంతం జరిగి ఉండేది కాదేమోనని నా అభిప్రాయం. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఇన్ని ఆందోళలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా విభజన కార్యక్రమంలో ముందు కెళ్ళదలుచుకుంటే అది ఆ పార్టీకి ఖచ్చితంగా ఆత్మహత్యాసదృశమే. వచ్చే ఎలక్షన్లలో ఎటూ అధికారంలోకి రాలేదని నా అభిప్రాయం. కాకపోతే ఈ చర్యల వల్ల ఇంకా దారుణంగా ఓడిపోతుందనేది మాత్రం సత్యం.

    • 19 Praveen Sarma 12:51 ఉద. వద్ద డిసెంబర్ 13, 2009

      మేమేమీ సమైక్యాంధ్రని కోరుకోవడం లేదు. ఇక్కడ రోడ్డు మీద గూండాలని చూసిన తరువాతే అందరూ షాపులు మూశారు, గూండాలు వెళ్ళిపోయిన తరువాత షాపులు తెరిచారు. బలవంతపు బంద్ లు చెయ్యించే గూండాల కోసం మేము తెలంగాణా మీద ద్వేషం పెంచుకుంటామా?

      • 20 సహదేవ్ 3:04 ఉద. వద్ద డిసెంబర్ 13, 2009

        46 సంవత్సరాల నా తెలంగాణా జీవితంల నాకెప్పుడు అవకాశం రాలేదన్న భావం కలగలే.

        మహరాష్ట్రానుండి వచ్చి మరి మన ఎం.ల్.ఏ లు మునిసిపల్ చైర్మన్లు అయినప్పుడు కూడ నాకెమనిపియ్యలే.

        ఒక్క రాజకీయ నాయకుడి వాగ్ధానంల తప్ప. ఆ నాయకుడు ఏ రంగు చొక్క వెనుకునుంచి మాట్లాడినా నమ్మి మోసపొయింది మనమే. ఆఖరికి రంగురంగుల చొక్కలెసుకున్న అన్నల తోనిగూడ.

        మన చేతకాని తనాన్ని వేరేవాడి తప్పుగా వేలెత్తిచూపే (మన లాంటి) వాళ్ళున్నంతకాలం …… మన బతుకులిం…

  14. 21 viswamitra 4:57 ఉద. వద్ద డిసెంబర్ 13, 2009

    @ ప్రవీణ్
    నీ వ్యాఖ్యలు అన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. నువ్వు వ్యాఖలు రాసినప్పుడు నీ పేరు రాయనక్కర్లేదు. మేము సులువుగా తెలుసుకోగలం ఏ పేరుతో రాసినాసరే. బ్లాగుల్లో తెలంగాణా పై ద్వేషం పెంచుకోమని ఎవ్వరూ అనలేదు. తెలంగాణా సిద్ధాంతాన్ని అక్కడి నాయకుల తీరుని విమర్శించారుతప్ప తెలంగాణా ప్రజలని నిందించలేదు.

  15. 22 సహదేవ్ 7:54 సా. వద్ద డిసెంబర్ 13, 2009

    మీ కందరికి ఓ చిన్న ప్రశ్న.

    మీరు పుట్టినవూరు దాటకుడా (అంటే వలస వెళ్ళకుండా) ఈ స్తాయికి ఎల ఎదిగారొ చెప్పండి?

    ఇంతపెద్ద పెద్ద మాటలంటున్న మీలో 100% మంది ఎదో ఓక పనిమీద ప్రతిరోజు వలసవెళ్ళు తుంటారు. కాలేజికి, ఉద్యోగానికి, వ్యాపారానికి ప్రొద్దున్న వెళ్ళి రాత్రికి వస్తారు. ఇలా కొందరు వారానికి, మరికొందరు మరింత ఎక్కువ సమయానికి. అంతే.

    వలస అనేది మానవ సహజం. మన పూర్వికులు అదే చేయక పోతె మనం కూడా జంతువుల్లా అడవుల్లొనే వుండెవాళ్ళం.

    వాటికి మనల రాజకీయనాయకులు లేరు, పాపం!

  16. 23 gaddeswarup 3:03 సా. వద్ద డిసెంబర్ 14, 2009

    From the Wikipedia article on Telangana :
    “The States Reorganization Commission (SRC) was not in favour of merging the Telangana region with the then Andhra state. Para 382 of States Reorganization Commission Report (SRC) said “..opinion in Andhra is overwhelmingly in favour of the larger unit, public opinion in Telangana has still to crystallize itself. Important leaders of public opinion in Andhra themselves seem to appreciate that the unification of Telangana with Andhra, though desirable, should be based on a voluntary and willing association of the people and that it is primarily for the people of Telangana to take a decision about their future…”. The concerns of Telanganas were manifold . The region had a less developed economy than Andhra, but with a larger revenue base (mostly because it taxed rather than prohibited alcoholic beverages), which Telanganas feared might be diverted for use in Andhra. They also feared that planned dam projects on the Krishna and Godavari rivers would not benefit Telangana proportionately even though Telanganas controlled the headwaters of the rivers. Telanganas feared too that the people of Andhra would have the advantage in jobs, particularly in government and education. Para 386 of States Reorganization Commission Report (SRC) said “After taking all these factors into consideration we have come to the conclusions that it will be in the interests of Andhra as well as Telangana area is to constitute into a separate State, which may be known as the Hyderabad State with provision for its unification with Andhra after the general elections likely to be held in or about 1961 if by a two thirds majority the legislature of the residency Hyderabad State expresses itself in favor of such unification.”

    The central government decided to ignore the SRC recommendations and established unified Andhra Pradesh on November 1, 1956. However, a “Gentlemen’s agreement” provided reassurances to the Telangana people as well to Andhra people in terms of power sharing as well as administrative domicile rules and distribution of expenses of various regions. This agreement is known as Gentlemen’s agreement of Andhra Pradesh (1956).”
    It seems to me that the clauses of Gentlemen’s agreement of Andhra Pradesh (1956) or later agreements have not been implemented and that is the root of the problem.

  17. 24 krishna 6:17 సా. వద్ద జనవరి 26, 2010

    సహదేవ్ అన్న..
    నిజ్జన్ చెప్పినవ్ అన్న
    మాములు ప్రజలు విడి పోవటం కోరుకోవటం లేదు .. ఎక్కడున్నా ఏయ్ రాష్ట్రము లో ఉన్న ప్రశాంత జీవన్ కోరుకుంటున్నారు

    కెసిఆర్ ఉపవాసం చెస్తెయ్ చెయ్యని ఆటను చాచిన తరువాత తెలగాణ వస్తుందని కదా నిరాహారదీక్ష మొదలు పెట్టినాడు .. మరి అట్లాంటి వాళ్ళకు సలిన్ ఎక్కించి మరి నిరాహారదీక్ష చేస్తున్నాడు అని చూపిన్చతమెందుకు?
    అదే సమయం లో ఎవరో రోడ్డెక్కి నారని తెలంగాణా ఇస్తాం అని చిదంబరం ఎందుకు చెప్పాలి?
    పోలీసులని కాని రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ కాని పంపించి తెరాస వాళ్ళ మక్కెలు ఇరగ తన్నోచు కదా అందుకే కదా గవర్నమెంట్ ఉండేది?
    అంతే కాని ప్రజల అఆస్తులు నాశనం అవుతుంటే ఎ కెసిఆర్ గాడికి తెలంగాణా ముఖ్యమంత్రి అవుదామని ఉంది. ముష్టి ముండాకొడుకు ..
    హైదరాబాద్ లో మీరు తగుల పెడుతుంది తెలంగాణా వాళ్ళ పన్నులతో కొన్న బస్సులు వగైరా అని వాళ్ళకు తెలియవా?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: