కథాయణం

‘రాసిన కథలు ముచ్చటగా మూడు, వాటిలో అచ్చైంది ఒకే ఒకటి. అప్పుడే కథ వెనక కథ పేరిట ఊదరగొట్టేటన్ని అనుభవాలు సమకూరాయా?’. ఈ టపా రాయబోయేముందు నన్ను నేను వేసుకున్న ప్రశ్నిది. అనుభవాలున్నా లేకున్నా నలుగురితో పంచుకోదగ్గ నాలుగైదు విషయాలైతే ఉన్నాయన్నది నాకొచ్చిన సమాధానం. అవేంటో చూద్దాం పదండి.

కొంత చరిత్ర, కొంత కల్పన కలగలిసిన కథొకటి రాయాలన్న ఆలోచన నాకెప్పట్నుండో ఉంది. అయితే కథలు రాసే సత్తా నాకు లేదేమోనన్న అనుమానంతో దాన్ని అమల్లో పెట్టే ప్రయత్నం చెయ్యలేదు. గడియారం రాశాక ‘ఫర్లేదు, నేనూ కథలు రాయగలను’ అన్న నమ్మకమొచ్చింది. దాంతో, రెండో కథగా నా పాత ఆలోచన బయటికి తీశాను. (‘గడియారం’తో నేర్చుకున్న విషయమొకటుంది – ‘కొత్తగా కథలు రాయటం మొదలెట్టేవారు కొత్తలో ఫస్ట్ పర్సన్ నేరేటివ్‌లో రాయటం మంచిది’ అని. అప్పుడైతే రచయిత పాత్రల్లో తొంగి చూసినా తప్పించుకోటం తేలిక. రెండో కథ ఆ పద్ధతిలో ప్రయత్నిద్దామని ముందే అనుకున్నాను) చరిత్రలో లెక్కలేనన్ని మిస్టరీలున్నాయి. వాటిలో ఒక ప్రముఖమైనదాన్ని తీసుకుని దాన్ని నాదైన శైలిలో పరిష్కరిస్తే ఎలా ఉంటుందన్న ఐడియా వచ్చింది మొదట. వెంటనే సింధు లోయ నాగరికత, అదెలా అంతమయిందనేదానిపై నెలకొన్న గందగోళం గుర్తొచ్చాయి. ఆ సివిలైజేషన్ అంతమవటానికి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కారణాలు కాక మరేదైనా క్రియేటివ్ కారణం చూపాలని బుర్ర బద్దలు కొట్టుకొంటుండగా, చప్పున ఈజిప్ట్ పిరమిడ్లు ఏలియన్స్ నిర్మించారనే వాదన గుర్తొచ్చింది. ఆ దిశలో ఆలోచించి బుర్రని ఇంకాస్త గట్టిగా బద్దలు కొట్టుకోగా వచ్చిన ఊహే – సింధు నాగరికతకి టైమ్ ట్రావెల్ అంశాన్ని జత చెయ్యటం. అలా ఆర్కియాలజీకి, చరిత్రకీ కొంత సైన్సు, మరి కొంత ఫిక్షన్ కలగలిపి ఓ కథాంశం రూపుదిద్దుకుంది.

కథాంశమైతే తట్టింది కానీ దానితో ముడిపడున్న సైన్సు సంగతులు ఎలా వివరించాలన్న విషయం దగ్గర పెద్ద చిక్కొచ్చి పడింది. కథలో సైన్సు మరీ ఎక్కువైపోతే అదో పాఠంలా తయారౌతుంది, తక్కువైతే అసలు కథే అర్ధం కాకుండా పోతుంది. రెండిటికీ బ్యాలన్స్ చెయ్యటం మొదటి సమస్య. ఆ  సైన్సు సంగతుల్ని తెలుగులో చెప్పటం రెండో సమస్య. తెలుగు కథలో ఆంగ్ల పదాలు మరీ ఎక్కువ దొర్లించటం నాకు ఇష్టం లేని పని. కానీ ‘సింగ్యులారిటీ’, ‘డార్క్ మ్యాటర్’ వంటి వాటిని తెలుగులో ఏమంటారో తెలీదు మరి! కొంతాలోచించాక ఒక వేళ వాటికి తెలుగులో పదాలున్నా ఆంగ్ల పదాలే వాడటం మేలన్న నిర్ణయానికొచ్చేశాను.

కథాంశం పైపైన అనుకున్నాక అందులో ప్రస్తావించబోతున్న సాంకేతిక, చారిత్రక సంగతుల గురించి అధ్యయనం మొదలెట్టాను. చేతికొచ్చినట్లు రాసి పారేస్తే వీపు చీరేయటానికి విమర్శకులు సిద్ధంగా ఉంటారు మరి. అయితే ఈ అధ్యయనానికి మరీ ఎక్కువ రోజులు పట్టలేదు. నేను రాయబోయేది కథే కానీ, పరిశోధనా పత్రం కాదు కదా. అవసరమైనంత సమాచారం సేకరించాక కథ రాయటం మొదలయింది. రెండే రోజుల్లో మొదటి డ్రాఫ్ట్ తయారయింది. హాలీవుడ్ సినిమా కథల్లో చాలా ‘వాట్ ఇఫ్’ అనే చిన్న ప్రశ్న ఆధారంగా మొలకెత్తుతాయి. అదే పంధాలో, ‘ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా అంతమయిందో కనుక్కుందామని వెళ్లిన టైమ్ ట్రావెలర్స్ ప్రమాదవశాత్తూ దాన్ని నాశనం చేసొస్తే?’ అన్న ప్రశ్నతో నాగరికథ పుట్టింది. అయితే కథంతా అతి సరళంగా ‘ఇదంతా నిజమేనహో’ అన్నట్లు రాసేస్తే సిల్లీగా ఉంటుంది కాబట్టి తాతయ్య చెప్పిన కథలా నాన్ లీనియర్ నేరేషన్‌లో చెప్పుకొచ్చాను. మనవడిని పాఠకుడి స్థానంలో కూర్చోబెట్టాను. తాతయ్య చెప్పింది కథా, నిజమా అన్న సందేహంతో మనవడిని చివరిదాకా వేధించి చివర్లో అతనికి సమాధానం దొరికేలా చెయ్యాలన్నది నా ప్లాన్. ఇది ‘చివరికేమవుతుందో’ అంటూ పాఠకులని కట్టిపడేసే ఎత్తుగడ. నేను మొదట అనుకున్న ప్రకారం – ‘అది కథే, నిజం కాదు’ అని మనవడు కనుక్కోవటంతో నాగరికథ ముగిసిపోతుంది. అయితే చివర్లో ఏదో ఒక ట్విస్ట్ పెట్టకపోతే నా చేతులు ఊరుకోవు కాబట్టి, ఆంధ్రజ్యోతికి పంపబోయే ముందు ఆఖరి నిమిషంలో క్లైమాక్సుకి ‘మమ్మీ రిటర్న్స్’ మలుపు జత చేసి పంపించేశాను. అది తప్పకుండా ఎంపికవుతుందన్న నమ్మకం ఉంది. అలాగే జరిగింది. కాకపోతే ‘నిడివి ఎక్కువయింది, ఒకింత తగ్గించండి’ అన్న ప్రత్యుత్తరం వచ్చింది. ఆ పని చెయ్యటానికి నాలుగైదు రోజులు పట్టింది. కుదించి పంపించాక అది అచ్చులో రావటానికి రమారమి మూడు నెలలు పట్టింది.

నాగరికథకి నా బ్లాగులో వచ్చిన స్పందన అటుంచితే, ఆంధ్రజ్యోతి పాఠకుల నుండి చాలా ఇ-మెయిళ్లొచ్చాయి. సాధారణ గృహిణుల నుండి సివిల్ సర్వెంట్స్ దాకా, విద్యార్ధుల నుండి అధ్యాపకుల దాకా పలురకాల వ్యక్తులు ఉన్నారు వారిలో. వాళ్ల ప్రతిస్పందన ఆసక్తికరంగా ఉంది. ‘ఇది నిజంగానే జరిగిందా’ అని అడిగిన వాళ్లు అందులో సగం మందున్నారు! ‘మీ తాతగారు నిజంగానే మీకీ కథ చెప్పారా’ అనడిగినోళ్లూ ఉన్నారు. ఇదో కల్పిత గాధ మాత్రమే అని నొక్కి వక్కాణిస్తూ బదులు పంపించాను వాళ్లకి. చివర్లో ప్రస్తావించిన ‘మమ్మీ రిటర్న్స్’ సినిమాకి అసలు కథతో సంబంధం ఏమిటో అర్ధం కాక తలలు బాదుకుంటూ ఆ చిక్కు ముడి విప్పమని నన్నడిగేసిన వాళ్లు మరో అరడజను మందున్నారు. దీనికి కొంత పొడుగాటి వివరణ ఇవ్వాల్సొచ్చింది. ఒక కుర్రాడైతే, నా పేరు చూసి తెలుగోడిని కాదనుకున్నాడో ఏమో, ‘మీకు తెలుగొచ్చా, ఈ కథ మీరే తెలుగులో రాశారా లేక ఆంగ్లంలో రాసి వేరెవరితోనన్నా అనువాదం చేయించారా’ అనడిగేశాడు.

మొత్తమ్మీద, ఇందరి స్పందన చూశాక నాకు అర్ధమైన విషయాలు కొన్నున్నాయి. ఒకటే కథ ఆన్‌లైన్ పాఠకుల కోసమైతే ఒక రకంగా, అచ్చులో చదివేవారికోసమైతే మరో రకంగా రాయాల్సుంటుందనేది వాటిలో మొదటిది. అచ్చయ్యే కథల్లో పాఠకుల అవగాహనా స్థాయిల్లో ఉండే తారతమ్యాలు దృష్టిలో ఉంచుకుని కొంత ఎక్కువ వివరణ ఇవ్వాల్సుంటుందనేది దాని భావం. నాగరికథ రాస్తున్నప్పుడు కొన్ని విషయాలు అనవసరంగా విపులీకరిస్తున్నానేమో అన్న అనుమానం తొలుస్తుందేది. అది అనవసరం కాదు, అవసరమే అని ఇప్పుడనిపిస్తుంది. ఈ తరహా కథలు భవిష్యత్తులో రాసేటప్పుడు సంబంధిత సమాచారం ఏ మోతాదులో రంగరించాలనేదాని మీద ఇప్పుడు కొంత అంచనా వచ్చింది. అలాగే, మరీ సటిల్‌గా హింట్స్ ఇచ్చేస్తే చాలామంది పట్టుకోలేకపోవచ్చు అని కూడా తెలిసొచ్చింది. అయితే ఈ రెండో విషయంలో మాత్రం నా ధోరణి మార్చుకునే ఉద్దేశం లేదు.

అవీ – నా పరిమిత అనుభవంతో నేను నేర్చుకున్న, నలుగురితో పంచుకోవాలనుకున్న సంగతులు. కథలు రాయాలనే ఆసక్తిగల వారికి ఇవి ఏ కొద్దిగా ఉపయోగపడినా సంతోషమే.

బైదవే, నా మూడు కథల్లోనూ ఎక్కువమందికి నచ్చింది ఈ నాగరికథ. నాకెక్కువగా నచ్చింది మాత్రం ఆరోప్రాణం. ఎందుకో మరి!

15 స్పందనలు to “కథాయణం”


 1. 1 వేణు 8:23 సా. వద్ద డిసెంబర్ 4, 2009

  మీరు ఈ ‘కథాయణం’లో పంచుకున్న సంగతులు బావున్నాయి. ఆలోచనాత్మకంగా ఉన్నాయి!

  రచయితకు ఎక్కువగా నచ్చిన కథా ; పాఠకులకు నచ్చిన కథా ఒకటి కాకపోవడం చాలా సహజమే కదా? 🙂

 2. 2 venkataramana 8:54 సా. వద్ద డిసెంబర్ 4, 2009

  నాగరికధ గురించి చెప్పుకుంటే , కల్పిత కధ అని తెలిసినా ఆసాంతం ఆసక్తి మిగిలి ఉంటుంది. ఆరోప్రాణం కధ , ఆ టపాలో చెప్పిన సినిమాల ప్రభావం లేని వారికి బాగా నచ్చుతుంది. కధన ప్రరంగా రెండూ బాగున్నాయి. నాకు నచ్చిన కధైతే నాగరికధ. ఆరోప్రాణం కధ చదువుతున్నప్పుడు సగంలోనే కిల్లర్ ఎవరనేది తెలిసిపోయింది. “కుక్కలు దయ్యాలను చూస్తే మొరుగుతాయంటారు. హంతకులను చూసినా మొరుగుతాయా ? .. అతనికి చెమట పట్టింది . గుండెదడ హెచ్చింది …..” ఇలా చదివినప్పుడే తెలిసిపోయింది. ఏదైతేనేం మంచి కధలు వ్రాస్తున్నారు. అభినందనలు.

 3. 3 సుజాత 9:33 సా. వద్ద డిసెంబర్ 4, 2009

  డార్క్ మాటర్,సింగ్యులారిటీ వంటి పదాలను అమ్మ నాలుక అనువాదంతో తెలుగులోకి దించి పాఠకులను అయోమయంలోకి నెట్టనందుకు ప్రత్యేకాభినందనలు!

 4. 4 teresa 9:38 సా. వద్ద డిసెంబర్ 4, 2009

  “అప్పుడే కథ వెనక కథ పేరిట … ”

  Good. Writers worse than you have bored us with such stuff. You write well.

 5. 6 chinni 9:44 సా. వద్ద డిసెంబర్ 4, 2009

  రాసే ‘రచయిత’ లో డిటెక్టివ్ మైండ్ మాత్రం స్పష్టంగా కనబడుతుంది .

 6. 7 mohanrazz 10:48 సా. వద్ద డిసెంబర్ 4, 2009

  అన్నిట్లోకీ నాకు బాగా నచ్చింది నాగరికథే. ఆరోప్రాణం చదువుతున్నపుడు కౌన్ సినిమా గుర్తొచ్చింది. గడియారం బాగుంది- అయితే “సెటప్” కి కొంత ఎక్కువ జాగా తీసుకున్నట్టనిపించింది. కానీ నాగరికథ లో అన్నీ సరిగ్గా కుదిరినట్టనిపించింది. అయినా పర్లేదు, “పల్లవి-అనుపల్లవి” కి “రోజా” కీ మధ్య మణిరత్నం కే పది సినిమాలున్నాయి.. 🙂

 7. 8 కన్నగాడు 8:44 ఉద. వద్ద డిసెంబర్ 5, 2009

  బహుశా ఆరోప్రాణం కథకు ఒకటికి రెండు సార్లు వెనక్కి తిరిగి కథాగమనం పట్టాల మీద ఉందో లేదో చూసుకోవాలి కాబట్టి ఆ కథతో ఎక్కువ సమయం గడిపి ఉంటారు అందుకే మీకు అంతగా నచ్చింది.

  మా దగ్గర డిసెంబరు వచ్చినా ఇంకా మంచు పడటం లేదెందుకా అనుకున్నా, ఇక్కడికొచ్చిందా!

 8. 9 nelabaludu 11:40 ఉద. వద్ద డిసెంబర్ 5, 2009

  బాగున్నాయండి మీ కథల సంగతులు.., మీ నుండి మరిన్ని కథలు రావాలని 😉

 9. 10 rayraj 5:29 ఉద. వద్ద డిసెంబర్ 7, 2009

  >>కథలో సైన్సు …రెండిటికీ బ్యాలన్స్ చెయ్యటం మొదటి సమస్య
  – ఇది సైన్సు ఫిక్షన్ సమస్య అనుకుందాం.
  >>ఆ సైన్సు సంగతుల్ని తెలుగులో చెప్పటం రెండో సమస్య
  – యస్. ఇదీ సమస్య.
  >>‘సింగ్యులారిటీ’, ‘డార్క్ మ్యాటర్’ వంటి వాటిని తెలుగులో ఏమంటారో తెలీదు మరి!
  -ఎలా తెలుస్తుంది? అసలు ఆలోచన, మెటీరియల్ అంతా ఇంగ్లీషులోనే ఉంటే! ఇదేమన్నా LCM, GCDలు కావుగా, కసాగు, గసాభాలలాగా ఎక్కువ మందికి అర్ధం గావటానికి! పైగా -ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న తెలుగు సాహిత్యాభిమానికి కూడా కసాగు, గసాభాలు తెలిసేవి కావు.అందుకే అవి ఆంగ్లంలోనే ఉండాలి.

  >>కొంతాలోచించాక ఒక వేళ వాటికి తెలుగులో పదాలున్నా ఆంగ్ల పదాలే వాడటం మేలన్న నిర్ణయానికొచ్చేశాను.
  – మంచిది. కానీ, దీనివల్ల ఒక్కోసారి వాక్యం మొత్తం ఇంగ్లీషుతోనే నిండుతుంది. (ఇప్పుడు క్రియేటివిటీ వాడి ఉదాహరణ మాత్రం ఇవ్వలేను. 🙂 )

  >>‘ఇది నిజంగానే జరిగిందా’ అని అడిగిన వాళ్లు అందులో సగం మందున్నారు! ‘మీ తాతగారు నిజంగానే మీకీ కథ చెప్పారా’ అనడిగినోళ్లూ ఉన్నారు. చివర్లో ప్రస్తావించిన ‘మమ్మీ రిటర్న్స్’ సినిమాకి అసలు కథతో సంబంధం ఏమిటో అర్ధం కాక తలలు బాదుకుంటూ ఆ చిక్కు ముడి విప్పమని నన్నడిగేసిన వాళ్లు మరో అరడజను మందున్నారు… ‘మీకు తెలుగొచ్చా, ఈ కథ మీరే తెలుగులో రాశారా లేక ఆంగ్లంలో రాసి వేరెవరితోనన్నా అనువాదం చేయించారా’ అనడిగేశాడు.
  – :)) :))
  >>పాఠకుల అవగాహనా స్థాయిల్లో ఉండే తారతమ్యాలు దృష్టిలో ఉంచుకుని………
  – మహానుభావ! ఇదే చెప్పేది. ఈ తారతమ్యాలని సవరించుకోటంలోనే చివరికి తెలుగు సినిమా స్థాయి ఇలా ఏడిచింది. కొన్ని కోట్ల రూపాయిల పెట్టుబడిలో, వ్యాపార లెక్కల్లో, ఈ “ఊహాజనిత సవరింపుల” వల్లే, కథ కంటే, టెక్నిక్‌కీ, భావోద్రేకాలకీ మాత్రమే స్థానం కలిపించారు. కథలు రెండే, మూడే పదే అంటూ లెక్కలు చెప్తున్నారు. దీనికే నేను చెప్పే పరిష్కారం – డబ్బుతో ముడిపడని ఈ సోషల్ మీడీయాలో,ఈ తారతమ్యాలని తగ్గించే ప్రయత్నం చేయవచ్చునని. దానికి కావాల్సిందల్లా, ఎక్కువ మంది తెలుగువాళ్ళు , ఒక్క సాహిత్యాన్నే కాకుండా, మిగిలిన విషయాల గురించి కూడా ఆలోచించడం, చర్చించడం, విశ్లేషించడం చెయ్యాలి. అంటే అర్ధం, మీరు ఏ స్థాయిలో ఇంగ్లీషులో ఉన్నారో, అదే స్థాయిలో ఇతరులతో,ఇంగ్లీషుపదాలతో ఆలోచనలు ముందుకు సాగనీయటం. అప్పుడు పుట్టే ఆలోచనలూ, ఆ ఆలోచనల్లో పుట్టే పదాలు కూడా తెలుగుగానే అందరం అంగీకరించగలుగుతాం. వాటిని చదువుతూ, కొందరైనా మంచి సాహిత్యం రాయగలగుతారు. అలా వృద్ధిచెందే సాహిత్యంతో, సాధారణ ప్రజల్లోనూ తారతమ్యాలు తగ్గుతూ వెళ్తాయి. కొంతమేరకు ఉత్కృష్టమైన విషయాలు కూడా సాదారణ విషయాలలా అర్ధం చేసుకోగలుగుతారు. అలాకాకపోతే, ఈ భాషలు సృష్టించే విభజన ఎక్కువైన కొద్దీ, ఆలోచనలు ఎదగని భాష నష్టపోతుంది.(మనుష్యలం ఎదిగే భాష వెంబడే వెళ్ళిపోతాము.)

  మీ కథాయణం మీద కూడా నా పిచ్చిగోలే రాస్తున్నాని చిరాకు పడకండి. ఇంతకంటే మంచి కథలు మీరు, మీతో పాటూ మరెందరో రాయాలని, ఇంతకంటే తెలివైన పాఠకులుంటేనే మీలాంటి వారందరికీ, ఆయా పాఠకులు మంచి పేరు తెచ్చిపెట్టగలరనేది నా ఆవేదన.మంచి పాఠకులని /ప్రేక్షకులని ఎలా తయారు చేసుకోవచ్చో మీకేమన్నా వేరే ఆలోచన ఉంటే చెప్పండి. వింటాను.

 10. 11 అబ్రకదబ్ర 5:00 సా. వద్ద డిసెంబర్ 7, 2009

  @వేణు,వెంకటరమణ,సుజాత,తెరెసా,చిన్ని,మోహన్‌రాజ్,కన్నగాడు,నెలబాలుడు:

  ధన్యవాదాలు.

  @రేరాజ్:

  ఊహించిన గోలే 😉 అయితే పిచ్చిగోలేమీ కాదు. రాయదగ్గ సందర్భమే.

  ప్రేక్షకుల సంగతేమో కానీ, విభిన్న కథలకు పాఠకులని తయారుచేసుకోవటం అంత కష్టమేమీ కాదని ‘నాగరికథ’తో నాకనిపించింది. మంచి కథలు రాస్తే ప్రచురించటానికి పత్రికలూ సిద్ధంగా ఉన్నాయని కూడా తెలిసింది. రికమెండేషన్లూ, ఫోన్ కాల్సూ, పత్రికాఫీసుల్లో పరిచయాలూ గట్రా లేకున్నా నా కథ అచ్చేయించుకోగలగటం దానికి రుజువు (సరే .. దీన్ని జెనరలైజ్ చెయ్యకూడదేమో కానీ నా అనుభవం మాత్రం అదే). ఆ తర్వాత దానికొచ్చిన స్పందన చూస్తే – కథ బాగుంటే అందులోని వస్తువు తమ అవగాహనా స్థాయికి మించి ఉన్నా ఒకటికి రెండుసార్లు చదివి మరీ అర్ధం చేసుకోటానికి ప్రయత్నించే పాఠకులెందరో ఉన్నారని నాకవగతమయింది. నాకొచ్చిన ఒకానొక మెయిల్లోని ఈ కింది వాక్యం చూడండి:

  ” .. u dont believe but in order to undersatnd i have read the story more than 20 times ..”

  ‘అవగాహనా స్థాయీ తారతమ్యాల’ ప్రస్తావనొచ్చింది కాబట్టి కొంత వివరణ. పాఠకులందరి స్థాయీ ఒకే విధంగా ఉండదన్నది నిర్వివాదాంశం – ముఖ్యంగా దిన పత్రికల్లో కథలు చదివే so called general mass readers. ఇప్పుడు రచయిత ముందు మూడు మార్గాలున్నాయి:

  ఒకటి – అధిక శాతం పాఠకులకి ఏవి తేలిగ్గా అర్ధమవుతాయో అవే చర్విత చర్వణంగా చెప్పుకుపోవటం. అంటే, భావోద్వేగ వరదల్లో వాళ్లని ముంచెత్తటం. ప్రస్తుతం తెలుగు కథలున్న దుస్థితికి కారణం ఈ ధోరణే.

  రెండు – విభిన్నత కోసం ప్రయత్నించేటప్పుడు ‘అర్ధమైనోళ్లకి అవుతుంది, కానోళ్లకి కాదు’ అనుకుంటూ మన ధోరణిలో మనం రాసుకుపోవటం. ఇది అన్నప్రాసన కూడా అవకుండానే ఆవకాయా, పండు మిరపకాయ పచ్చడీ కలిపి పెట్టటం లాంటిది. దీనివల్ల ఏ ఉపయోగమూ లేకపోగా, అంతో ఇంతో నష్టమే ఉంది. ఇలాంటివి నాలుగైదు చదివాక పాఠకులు కొత్తదనం అంటేనే బెంబేలెత్తిపోయే ప్రమాదం + ఆదరణ కరువవటంతో కొత్తదనాన్ని ప్రయత్నించాలనే ఆసక్తి రాసేవారిలోనూ, వేసేవారిలోనూ నశించిపోవటం.

  మూడు – అవసరమైన మేరా విపులీకరిస్తూ కొత్త విషయాలు, పద్ధతులు పరిచయం చేస్తూ పోవటం. ఇది మధ్యే మార్గం; నాకు తెలిసి కొత్త ధోరణులకి ఇదే గెలుపు సూత్రం.

  సటిల్ హింట్స్ గురించి ఈ టపాలో ఓ ముక్క రాశాను. ఉండీ లేనట్లుండే హింట్స్ సగటు పత్రికా పాఠకుడికి అర్ధం కాలేదని నాకర్ధమయినా, ఆ విషయంలో నా ధోరణి మార్చుకునే ఉద్దేశం లేదనీ రాశాను. దానికో కారణముంది. ఫలానా పాత్రధారి దొంగ చూపులు చూస్తే ఆ విషయం విచిత్రమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సహాయంతో ప్రేక్షకులకి చేరవేసే క్రీ.పూ. కాలపు అలవాటు మన దర్శకులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంత ‘బిగ్గరగా’ చెబితే తప్ప మన ప్రేక్షకులకి విషయం అర్ధమవదని వాళ్ల నమ్మకం. అది నిజమే కావచ్చు కానీ, మన ప్రేక్షకులని నలుపు-తెలుపు చిత్రాల జమానా నుండీ ఆ రకంగా ట్యూన్ చెయ్యటం వల్లనే వాళ్లిప్పటికీ అదే స్థాయిలో పడున్నారన్న విషయం దర్శకులు గ్రహించటం లేదు. పాఠకులైనా, ప్రేక్షకులైనా పసిపిల్లల్లాంటి వాళ్లు. చెప్పాల్సిన విధంగా చెబితే నేర్చుకోటానికి సదా సిద్ధంగా ఉంటారు. వాళ్లకి ఆ శక్తి లేదనే అపోహ నుండి దర్శకులు/రచయితలు బయట పడ్డనాడే మన సినిమాలకైనా, కథలకైనా విముక్తి. ఏమంటారు?

 11. 12 nEstam 11:39 సా. వద్ద డిసెంబర్ 7, 2009

  మీ నాగరి కధ కనీసం రెండు రోజులకోమారైనా చదువుతున్నా.టైం ట్రావెల్ లేకుండానే సిందునాగరికత రోజులకు వెళ్ళిపోయి మా ఆయన అరుపులకు ఈ లోకం లోకి వచ్చి పడుతున్నా.మళ్ళీ ఎప్పుడు మరొక కధ 🙂

 12. 13 వేణూ శ్రీకాంత్ 12:01 ఉద. వద్ద డిసెంబర్ 9, 2009

  మీ కథ వెనుక కథ బాగుంది. అందరిలా తొందరపెట్టను 🙂 నిదానంగా అయినా సరే మరో మంచి కథను అందిస్తారని ఎదురుచూస్తున్నాను.

 13. 15 cbrao 1:04 ఉద. వద్ద మే 3, 2010

  నాగరికత కధ వెనుక కథను చెప్పటంలో మీరు అనుసరించిన పంధా బాగుంది. శాస్త్రం – కల్పన జోడించి రాయటంలో ఉన్న ఇబ్బందులను వివరించటం లో సఫలమయ్యారు. ఈ కధ వెనుక మీరు పడ్డ శ్రమ కనిపిస్తుందీ కధలో. “మమ్మీ రిటర్న్స్” నేనూ చూడకపోవటంతో, నాగరికతకూ ఆ సినిమాకు ఏమిటి సంబంధం అనిపించింది. అసంభవాన్ని సంభవమేమో అన్న రీతిలో చెప్పిన కధనం ఆకట్టుకుంది. తెలుగునాడి, కధ 2010 లో ప్రచురణకు ఎంపిక కావటానికి దీటైనదే ఈ కధ. అందుకు అభినందనలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: