ఆత్రగాడు

‘ఎప్పటికైనా నేనే సిఎమ్. ముఖ్యమంత్రి కాకుండా నన్నెవ్వరూ ఆపలేరు’. ఇది మొన్న జగన్మోహనుల వారు కడప జిల్లాలో (కొత్త పేర్లెన్నొచ్చినా నాకు మాత్రం అది కడప జిల్లానే) వందిమాగధుల సమక్షంలో ప్రకటించిన తన మనోభీష్టం. అతని అంతరంగంలో అది కాక వేరేదేదో ఉంటుందని రాష్ట్ర ప్రజానీకం ఎటూ అనుకోలేదు కాబట్టి ఈ ప్రకటన విస్తుగొలిపేదేమీ కాదు. ఆ మాటకొస్తే చంద్రబాబుకీ చిరంజీవికీ సైతం మనసులో మాట అదే కదా. ఐనప్పటికీ, ‘ఈ సారి మా పార్టీదే అధికారం’ అని గంభీరంగా ప్రకటనలివ్వటం తప్ప తమ అసలు కోరిక వాళ్లెప్పుడన్నా ఇలా బట్టబయలు చేశారా? జగన్‌ది ముంత దాచే బదులు కుండ బద్దలు కొట్టయినా కుంభస్థలం పగలగొట్టాలనే స్వభావం కాబోలు. కానీ ఇలా మనసులో ఉన్నవన్నీ బయటేసేస్తే రాజకీయాల్లో ఎదగటం సాధ్యమేనా?

రెండు నెలలుగా జగన్ వెళ్లగక్కుతున్న ఆక్రోశం ఆటబొమ్మని లాక్కున్న సావాసగాడిపై చిన్నపిల్లాడు చూపించే ఉక్రోషాన్ని తలపిస్తుంది. అతనితో సహా మనమంతా ఆంధ్రప్రదేశ్‌లో కాక ఏదో నలుపు-తెలుపు జానపద చిత్రంలోనో, ఏ చందమామ కథలోనో ఉన్నామన్న భ్రమలో జగన్ ఉన్నట్లున్నాడు. నీతిమంతుడైన మహారాజు అకాల మరణం పొందితే గోతికాడ నక్కలా పొంచి ఉన్న దుష్ట సేనాని రాజుగారి ఏకైక కుమారుడిని కాకులు దూరని కారడవులకి పారదోలి సింహాసనం చేజిక్కించుకున్నప్పుడు – ఆ దెబ్బ తిన్న రాకుమారుడు చేసే శపథాన్ని పోలి లేదూ జగన్మోహనుడి పొలి కేక? ఇప్పుడవునో కాదో కానీ ఒకప్పుడు బాలకృష్ణకి వీరాభిమాని కదా, ఆయన ఫ్యాక్షన్ సినిమాలు ఒకటికి పదిసార్లు చూసి తనున్నదీ ఓ ఫ్యాక్షన్ కథలోనేనన్న భ్రాంతిలోకి జారుకున్నాడేమో. లేకపోతే ఈ తొడగొట్టటాలు, సెకండాఫ్‌లో వచ్చి భరతం పడతానంటూ మంగమ్మ శపథాలూ ఏమిటి!

అయితే అదృష్టవశాత్తూ మనం ఆంధ్రప్రదేశ్ వాసులమే కానీ ఏ కథలోనూ పాత్రలం కాము. జగన్ తండ్రి నీతిమంతుడైన మహరాజూ కాదు, రోశయ్యామాత్యుడు దుష్ట సేనానీ కాడు. అంతకు మించి – రాష్ట్రం వారెవ్వరి గుత్తసొత్తూ, వారసత్వ సంపదా కాదు. అలా అని జగన్ అనుకుంటే అది అతని అమాయకత్వం. వైఎస్ గతించిన వారంలోపే జరిగిన టెక్కలి ఉప ఎన్నికలో సానుభూతి ప్రభంజనమేమీ వీచలేదన్న సత్యాన్ని గ్రహించకుండా, తండ్రి ఇమేజ్‌పై లేనిపోని అపోహలతో రెచ్చిపోయి వీరంగం వేసి తన రాజకీయ భవితకి ఇప్పటికే చేసుకోగలిగినంత చేటు చేసుకున్నా రాజకీయవేత్తగా తన తాహతేమిటో జగన్‌కి ఇంకా అర్ధమయినట్లు లేదు. కాబట్టే ఒకదాని వెంబడి ఒకటిగా ఈ తప్పటడుగులు. మొన్నటి శపథం తనకి చేసే మేలేమిటో అతనికే ఎరుక. జగన్ పై అధిష్టానానికి ఇప్పటికే ఓ అంచనా వచ్చేసిన నేపధ్యంలో ఈ వాచాలత సాధించేదేమన్నా ఉంటే అది అతని బాటలో మరిన్ని ముళ్లు పరవటమే. బోనస్‌గా, ఇలా బయటపడి మాట్లాడటం వల్ల ప్రజల్లో అతని పదవీకాంక్షపై అనుమానాలు మొదలవటం; ఆల్రెడీ అనుమానాలున్నవారికి నమ్మకాలు బలపడటం. అతనికది ఏ రకంగానూ మేలు చేసే పరిణామం కాదు. పార్టీలకి అతీతంగా రాహుల్ గాంధీని ఎక్కువమంది ప్రజలు ఇష్టపడటానికి ప్రధాని పదవిపై అతను మోజు లేనట్లు కనిపించటమూ ఒక కారణం. ఉదాహరణలు చూసీ నేర్చుకోలేకపోవటం జగన్ అమాయకత్వం కాదు, అవివేకం.

‘ప్రజలు కోరుకుంటున్నారు’ అనేది కూడా మొన్న జగన్ అన్నమాట. ప్రజలంతా తనవెనకే ఉన్నారని అతనంటే నమ్మేసే వెంగళప్పలు మరీ ఎక్కువ మంది లేరు. మన ఇక్ష్వాకులనాటి ఎన్నికల పద్ధతి దయవల్ల, రాష్ట్రంలో కాంగ్రెస్సయినా, తెదేపా అయినా అధికారంలోకొచ్చేది సగం కన్నా తక్కువ వోటర్ల మద్దతుతోనే. అలా అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలూ, ముఖ్యమంత్రులూ చేసే పనులన్నిటికీ ప్రజామోదం ఉందని చెప్పుకోవటం స్వోత్కర్షే తప్ప మరోటి కాదు. వైఎస్ ఐదేళ్లపాటు చెలరేగిపోయింది అధికారబలంతోనూ, అధిష్టానం అనుగ్రహంతోనే తప్ప ప్రజాబలంతో కాదు. ఇప్పుడదే అధికారమూ, అనుగ్రహమూ అండగా ఉండగా రోశయ్యని తానేమీ చెయ్యలేనని జగన్ గ్రహించలేకపోవటం వింత. జగన్ చర్యల్నీ, చేష్టల్నీ రోశయ్య వంటి ఘటికుడు ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. నోరెత్తి మాట్లాడకున్నా తను చెయ్యాలనుకున్నవి చేసేస్తాడు. ఇప్పటికే రోశయ్య ఆ పనిలో ఉన్నట్లు రెండు మూడు వారాలుగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తాజాగా రేగుతున్న గాలి దుమారం వెనక స్వపక్షంలో జగన్ వ్యతిరేకుల హస్తం లేదనుకోగలమా?

తల్లిదండ్రుల పరపతిపై ఆధారపడకుండా కష్టపడి స్వశక్తితో పైకిరావటానికి ఇష్టపడే యువతరం అద్భుతాలు సాధిస్తున్న కాలమిది. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవాలనుకుంటున్న జగన్ రేపు ముఖ్యమంత్రయినా రాష్ట్రాన్ని ఉద్ధరించేదేమిటి? ఈ రకంగా కాయలమ్ముకోవటం రాష్ట్రంలో కొత్తేమీ కాదు. అయితే తండ్రి పోగా ఖాళీ అయిన ముఖ్యమంత్రి పీఠమ్మీద కొడుక్కే హక్కున్నట్లు వితండవాదన చెయ్యటం మాత్రం కొత్తే. అసలు – లేచిందే లేడికి పరుగన్నట్లు, రాజకీయాల్లోకొచ్చి ఆర్నెల్లయిందో లేదో అప్పుడే ఎకాఎకీ ముఖ్యమంత్రై పోవాలనే ఆత్రం అతనికెందుకు? ఉట్టికెగరగలడని రుజువవ్వక ముందే ఆకాశానికెగరాలనే తొందరెందుకు? సమాధానం అందరికీ తెలిసిందే. తండ్రి జమానాలో తమ కుటుంబమూ తమ భజన బృందమూ యధేచ్చగా సాగించిన దోపిడీ ఇకముందూ కొనసాగాలన్నా, అంతకన్నా ముఖ్యంగా ఆ అక్రమాల చిట్టా చీకట్లోనే చిరకాలం మిగిలిపోవాలన్నా తనకి అధికారం దఖలు పడటమే ఏకైక మార్గం. పైకెన్ని కబుర్లు వల్లె వేసినా, ‘మా నాన్న ఆశయ సాధన కోసం నేను ముఖ్యమంత్రిని కావటం అవశ్యం’ అన్న మాటకి అసలర్ధం వైఎస్ సగంలో వదిలి పోయిన స్వకార్యాలు పూర్తిగా చక్కబెట్టుకోవటం. సరే – ఆశయం ఏదైనా దాన్ని సాధించటానికి పట్టు విడుపులుండాలి, ఓపికుండాలి. కుందేలై గెంతువారు కుదేలయే తీరుతారని సినీకవి ఉవాచ. తండ్రిలా ఆవేశంతోనే అన్నీ సాధించొచ్చనుకుంటే అతనికి ఇక ఎవరూ చెప్పగలిగేదేమీ లేదు. ఆ ఆవేశమే తండ్రిని పాతికేళ్లు పదవీభాగ్యానికి దూరం చేసిందని జగన్ గుర్తెరగటం మంచిది. లేకపోతే – చరిత్ర చర్విత చర్వణమే.

17 స్పందనలు to “ఆత్రగాడు”


 1. 2 చిలమకూరు విజయమోహన్ 4:57 సా. వద్ద నవంబర్ 12, 2009

  బాగా చెప్పారు.

 2. 3 భవాని 8:16 సా. వద్ద నవంబర్ 12, 2009

  బాగా చెప్పారు. కానీ, ఎప్పటికైనా వాళ్ళ దోపిడి గురించి బయటపడుతుందా? వాళ్ళు శిక్షింపబడతారా?

 3. 4 chandu 8:22 సా. వద్ద నవంబర్ 12, 2009

  మీరు చెప్పింది చాల వరకు సబబు. కాని మరి మన జగనన్న ఫ్యాన్స్ మరియు జగనన్న సేన కి మాత్రం జగన్ ఒక్కడే పార్టిని నడపగలడు అన్న ఫీలింగు ఎందుకో…ఒకసారి ఈ కింద బ్లాగు చుడండి అర్ధం అవుతుంది వారి ఆవేదన.
  http://www.jagankosam.com….

 4. 5 గీతాచార్య 9:40 సా. వద్ద నవంబర్ 12, 2009

  జగన్ వాచాలత సరే. మరి రాచొల్ గాంధీ సంగతేంటి? దేశాన్ని విభజించిన గొప్ప మా కుటుంబానిదే అన్న మాట. ఈ భారసులందరూ అందరే.

  పూర్తిగా చదవకుండానే “జగన్ పై అధిష్టానానికి ఇప్పటికే ఓ అంచనా వచ్చేసిన నేపధ్యంలో ఈ వాచాలత సాధించేదేమన్నా” అక్కడాగి వ్రాసిన వ్యాఖ్య ఇది.

  అసలు వ్యాఖ్య మళ్ళా వచ్చి వ్రాస్తాను.

 5. 6 రవి చంద్ర 2:55 ఉద. వద్ద నవంబర్ 13, 2009

  జగన్ మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తే బాగుంటుంది.

 6. 7 Chandrachood 4:14 ఉద. వద్ద నవంబర్ 13, 2009

  వ్యాసంలో మిగతా అంసాలన్నీ బావున్నై. కానీ ఓ విషయం. నాయుడు గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు. ఆయన్నీ, నిన్నమొన్నటి రాజకీయ పిల్లకాకులూ, మరుగుజ్జులూ అయిన చిరంజీవి, జగన్‍లనీ ఒకే గాటన కట్టడం బాగాలేదు. అనేక విషయాల్లో నాయుడి పాలనే చాలా మెఱుగు.

 7. 9 jatardamal 4:22 ఉద. వద్ద నవంబర్ 13, 2009

  mandala pandula janthuvula jaathi manadi anduke ilantivi jarigedi …

 8. 10 jatardamal 7:35 ఉద. వద్ద నవంబర్ 13, 2009

  ఎంత చెట్టుకు అంత గాలి .. ఈ సామెత తెలీదు అనుకుంట జగన్ కి ?
  మన లాంటి సిగ్గు మాలిన వాళ్ళను ( ప్రజలని ) చూస్తే ఎవడికైనా ఇలానే వుంటుంది …

 9. 11 sri 8:45 ఉద. వద్ద నవంబర్ 13, 2009

  జగన్ తను నమ్మిన దెవుడిపై ప్రమాణము చేసి “నేను నా తండ్రి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, తండ్రి పదవిని అద్దుపెట్టుకొని ఏ లబ్ది పొందలేదు మరియు దుర్వినియొగము చెయ్యలెదు” అని చెప్పమనండి జన సమక్షములొ.

  జగన్ చెప్పిన మరు క్షణమె ముఖ్యమంత్రి అవుతాడు. లేదా ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడు. ఆంతె కాదు. జగన్ తను ఇంతవరకు తిన్న ప్రజల సొమ్ము తిరిగి గవర్నమెంటుకు ఇచ్చెయ్యాలి. లెదా తన తండ్రి లాగే కుక్క చావు(చనిపొయిన వారి గురించి ఇలా మాట్లడ కూడదు, కాని నిస్స్వార్ధముగా ప్రజలకు సెవ చెస్తాను అని దైవ సాక్షి గా ప్రమానము చెసి ముఖ్యమంత్రి కుర్చి లో కుర్చొని దొచుకొనె వాళ్ళను యెమి అన్నా తప్పు లేదు) చస్తాడు.

  అమాంతం ముఖ్యమంత్రి అయిపొవాలి అన్న వీడి ఆత్రం ఎందుకంటె వీడు దొచుకున్నది బయటికి రాకుండా చెయ్యాలంటె ముఖ్యమంత్రి గా తప్ప వేరే దారి లెదు. అంత దోచుకున్నాడు మరి.

  ఈటువంటి వాళ్ళకు కుక్క చావు ఒక్కటె సరైన శిక్ష, మరియు వెరె వాళ్ళకు వార్నింగ్.

 10. 12 కొత్తపాళీ 6:08 ఉద. వద్ద నవంబర్ 14, 2009

  “తల్లిదండ్రుల పరపతిపై ఆధారపడకుండా కష్టపడి స్వశక్తితో పైకిరావటానికి ఇష్టపడే యువతరం అద్భుతాలు సాధిస్తున్న కాలమిది.”
  చాలా బాగా రాశారు. అది అవివేకం కాదు, కండబలంతోనే అధికారం హస్తగతం చేసుకోగలమనే ఒక తప్పుడు ధీమా. దానికితోడు, ప్రత్యక్షంగా ప్రజలతోగాని రాజకీయులతోగాని అనుభవం లేకపోవడంతో చుట్టూ ఉన్న రక్షణవలయం కల్పించిన ఒక మాయావరణానికి లొంగి, తన శక్తిని ఉన్నదానికంటే ఎక్కువగా అంచనా వేసుకోడం.

  “తండ్రిలా ఆవేశంతోనే అన్నీ సాధించొచ్చనుకుంటే…”
  ఈ వాక్యం మీరెలా రాశారో నాకు అర్ధం కాలేదు. వయ్యెస్సార్ వ్యూహ రచనలో సామాన్యమైన బుర్రకాదు. ఎక్కడ రంకెలు వెయ్యాలో, ఎక్కడ భుజబలం ప్రదర్శించాలో, ఎక్కడ శాంతంగా ఉండాలో (ఉన్నట్టు కనిపించాలో) చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు.
  Clicky Web Analytics

  • 13 అబ్రకదబ్ర 10:27 ఉద. వద్ద నవంబర్ 14, 2009

   @కొత్తపాళీ:

   >> “వయ్యెస్సార్ వ్యూహ రచనలో సామాన్యమైన బుర్రకాదు”

   నిజమే, కానీ ఆ పరిణితి సాధించటానికి వైఎస్‌కి ఇరవయ్యేళ్లు పట్టింది. మొదట్లో ఆయన మంత్రమూ ఆవేశమే కదా.

 11. 14 Ramana Reddy 10:18 సా. వద్ద నవంబర్ 15, 2009

  వ్యూహాత్మకంగా చూస్తే జగన్ ప్రకటన అతని రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు లాంటిదే.

 12. 16 రామ 11:36 సా. వద్ద డిసెంబర్ 12, 2009

  జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ పొలికేకలు వేసిన కొండా సురేఖ లాంటి వాళ్ళ తోకలు అంత కురచగా కత్తిరించబడిన తరవాత కూడా, అదే నినాదాన్ని పట్టుకు వేళ్ళాడే కాంగీయులు, వై ఎస్ మరణం తో వచ్చిన సానుభూతి (?) ని ఇంకా గుర్తు ఉంచుకునే ప్రజలు పెద్దగా లేరు అని నా నమ్మకం. ఆ విషయాన్ని గుర్తెరగకుండా జగన్ ఏమైనా మాట్లాడితే అది పెద్ద కామెడీ కిందే కనిపిస్తుంది తప్ప ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోరు.
  “గాలి” కి గాలి తియ్యడం పూర్తి అయ్యాక, (వాళ్ళ కారణాలు ఏమైనా సరే) “అధిష్టానం” రాబోయేది తన మీదకే అని గ్రహించి వాచాలత కట్టిపెడితే జగన్ ఆ ఎం పీ కింద అయినా మిగులుతాడు.

 13. 17 రహంతుల్లా 12:28 ఉద. వద్ద డిసెంబర్ 26, 2009

  ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు
  ఏర్పడిన సంవత్సరం ↓ జిల్లా ↓ జిల్లాకేంద్రం ↓ జనాభా (2001) ↓ వైశాల్యం (km²) ↓ జనసాంధ్రత (/km²) ↓ జిల్లావెబ్ సైట్ ↓
  1905 అదిలాబాద్ జిల్లా అదిలాబాద్ 2,479,347 16,105 154 http://adilabad. nic.in/
  1881 అనంతపూర్ జిల్లా అనంతపూర్ 3,639,304 19,130 190 http://anantapur. nic.in/
  1911 చిత్తూరు జిల్లా చిత్తూరు 3,735,202 15,152 247 http://chittoor. nic.in/
  1802 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ 4,872,622 10,807 451 http://eastgodavari .nic.in/
  1794 గుంటూరు జిల్లా గుంటూరు 4,405,521 11,391 387 http://guntur. nic.in/
  1978 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 3,686,460 217 16,988 http://hyderabad. nic.in/
  1910 కడప జిల్లా కడప 2,573,481 15,359 168 http://kadapa. nic.in/
  1905 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 3,477,079 11,823 294 http://karimnagar. nic.in/
  1953 ఖమ్మం జిల్లా ఖమ్మం 2,565,412 16,029 160 http://khammam. nic.in/
  1925 కృష్ణా జిల్లా మచిలీపట్నం 4,218,416 8,727 483 http://krishna. nic.in/
  1949 కర్నూలు జిల్లా కర్నూలు 3,512,266 17,658 199 http://kurnool. nic.in/
  1870 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 3,506,876 18,432 190 http://mahabubnagar .nic.in/
  1956 మెదక్ జిల్లా సంగారెడ్డి 2,662,296 9,699 274 http://medak. nic.in/
  1953 నల్గొండ జిల్లా నల్గొండ 3,238,449 14,240 227 http://nalgonda. nic.in/
  1906 నెల్లూరు జిల్లా నెల్లూరు 2,659,661 13,076 203 http://nellore. nic.in/
  1876 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 2,342,803 7,956 294 http://nizamabad. nic.in/
  1970 ప్రకాశం జిల్లా ఒంగోలు 3,054,941 17,626 173 http://prakasam. nic.in/
  1978 రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ 3,506,670 7,493 468 http://rangareddy. nic.in/
  1950 శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 2,528,491 5,837 433 http://srikakulam. nic.in/
  1950 విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 3,789,823 11,161 340 http://visakhapatna m.nic.in/
  1979 విజయనగరం జిల్లా విజయనగరం 2,245,103 6,539 343 http://vizianagaram .nic.in/
  1905 వరంగల్ జిల్లా వరంగల్ 3,231,174 12,846 252 http://warangal. nic.in/
  1926 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు 3,796,144 7,742 490 http://wgodavari. nic.in/
  విశేషాలు

  * అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు : మాల్టా,గ్రెనెడా,ఆండొర్రా,బహ్రైన్,బ్రూనే,కేప్వర్ద్,సైప్రస్,డొమినికా,ఫిజీ,గాంబియా,జమైకా,కువైట్,లెబనాన్,లక్సెంబర్గ్,మారిషస్,పోర్టోరికో,కతార్,సీషెల్స్,సింగపూర్,స్వాజీలాండ్,టాంగో.ట్రినిడాడ్,టుబాగో,వనౌటూ.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: