స్టార్‌బక్స్

కాఫీ షాపు గురించీ వ్యాసం! పంది మీద ఒకటికి రెండు రాసినప్పుడు దీని మీదెందుకు రాయకూడదు? అందునా నా అభిమాన కాఫీ అంగడి. నావరకూ స్టార్‌బక్స్ అమ్మేది కాఫీ మాత్రమే కాదు, అంతకన్నా విలువైన ఎక్స్‌పీరియెన్స్. అందుకే కప్పు కాఫీ విలువ గ్యాలను పెట్రోలుకన్నా ఎక్కువున్నా ఫర్వా ఉందనిపించదు. కాఫీ తాగటం, తాగకపోవటం అనేది వేరే విషయం – కేవలం అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించటానికన్నా నేను తరచూ వెళుతుంటాను. స్పీకర్లనుండి మంద్రమైన సంగీతం వినిపిస్తుండగా – ఓ చేత కాఫీ కప్పు, ఒళ్లో ల్యాప్‌టాపుతో ఆఫీసు పనితో కుస్తీలు పట్టే డిజిటల్ నోమాడ్స్ దగ్గర్నుండి నెత్తిన ఫెల్ట్ హ్యాట్, చేతిలో వార్తా పత్రికతో తాజా రాజకీయాలు ముచ్చటించే సీనియర్ సిటిజెన్స్ దాకా; ఓ మూల టేబుల్ దగ్గర దీక్షగా పరీక్షలకి తయారవుతున్న కుర్రాడి నుండి మరో మూల సోఫాలో బిజీ బిజీగా ఉద్యోగార్ధినెవరినో ఇంటర్వ్యూ చేసేస్తున్న హెచ్ఆర్ ఉద్యోగి దాకా .. ఇన్ని రకాల మనుషుల్ని అంత దగ్గరగా గమనించే అవకాశం మరెక్కడా ఉండకపోవచ్చు. అతిధులని సాదరంగా పలకరించటంలో మెక్‌డొనాల్డ్స్ వంటి ఫాస్ట్‌ఫుడ్ చైన్లలో పనిచేసే వారికీ, స్టార్‌బక్స్ బరిస్టాలకీ కొట్టొచ్చినట్లు కనిపించే తేడా నన్నా షాపుకి మరింత కట్టిపడేసింది. ఒకట్రెండు పీట్స్ కాఫీ ప్రదేశాలు కూడా నాకు నచ్చుతాయి కానీ, మొత్తమ్మీద స్టార్‌బక్స్‌దే ప్రధమ స్థానం.

స్టార్‌బక్స్‌తో నా పరిచయం అమెరికా వచ్చిన మర్నాడే జరిగింది. కాఫీ అమ్మటానికి అంత పెద్ద గొలుసు దుకాణం ఉంటుందనేది అంతకు ముందు నా ఊహకందని విషయం. గొలుసులు, చైన్లే కాక – అసలు కాఫీలో అన్ని రకాలుంటాయనేదీ ఊహకందని విషయమే. అప్పటికి – అంటే పది, పదకొండేళ్ల కిందన్న మాట – నాకు తెలిసి కాఫీ అంటే కాఫీయే. అందుకే, నా మేనేజరయ్య తొలిసారిగా నన్ను స్టార్‌బక్స్‌కి తీసుకెళ్లి ‘ఏం కాఫీ తాగుతావు?’ అంటే ముందు తెల్లమొహమేశా. తర్వాత మొహం చిట్లించా, ఆ తర్వాత అతికించా. చివరాఖరికి నోరెలాగో పెగల్చి సిల్లీగా ‘కాఫీ’ అన్నా – అంతకన్నా ఏమనాలో అంతు పట్టక, ‘ఏం కాఫీ ఏంటి? కాఫీలో రకాలు కూడా ఉంటాయా’ అని లోలోన గొణుక్కుంటూ.

కౌంటర్ వెనక దవడలు నొప్పెట్టేలా ఆ చెవి నుండి ఈ చెవి దాకా నోరు సాగదీసి నవ్వుతున్న సర్వర్ సుందరమ్మతో ‘కాఫీ ఆఫ్ ద డే’ అన్జెబుతూ ‘ఇది ఓకేనా’ అన్నట్టు నాకేసి చూశాడు మదీయ మేనేజరయ్య. సుందరమ్మ కూడా నాకేసే తేరిపార చూస్తుండగా, బుర్ర బరబరా బరుక్కుందామన్న కోరిక బలవంతాన తొక్కిపడుతూ ‘ఓకోకే’ అన్నట్టు ఆంధ్రా స్టయిల్లో అడ్డదిడ్డంగా తలాడించేశా. ఆ విధంగా సుందరమ్మనీ, మేనేజరయ్యనీ ఏక కాలంలో కన్‌ఫ్యూజ్ చేసిపారేశాక తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకుని ‘ఇట్రా’ అన్నట్టు తల నిట్ట నిలువుగా ఊపి అంగీకారం వ్యక్తం చేశాను – కాఫీ ఆఫ్ ద డే అంటే ఈ రోజు తాజాగా కాచిన కాఫీ కాబోలు, ఆ ముక్క ముందే చెప్పకపోతే నిన్నా మొన్నటి పాచి కాఫీ నా మొహాన కొడతారేమో అనుకుంటూ. ‘అందుకే మేనేజరయ్య ఏం కాఫీ అనడిగుంటాడు’ అని మరుక్షణంలో వెలిగింది. అవ్విధంబున జ్ఞానోదయంబైన వెన్వెంటనే, మేనేజరయ్యింకా సుందరమ్మతో మాట్లాడుతుండటం గమనించి రహస్యంగా భుజాలు కూడా తట్టేసుకున్నా – నా తెలివితేటలకి మురిసిపోతూ. పనిలో పనిగా, పాచి కాఫీ బారి నుండి కాచి కాపాడిన మేనేజరయ్యని అభిమానంగా మనసులోనే ఆశీర్వదించేశా, కృతజ్ఞతా భావం గుండెలో నిండి పొంగి పొర్లి వరదలై పారుతుండగా.

రెండే నిమిషాల్లో చేతిలో వచ్చి వాలింది – నా తొట్టతొలి స్టార్‌బక్స్ కాఫీ కప్పు. పింగాణి కప్పు కాదు, ముందెన్నడూ చూసెరగని పేపర్ కాగితక్కప్పు …. దాని మూతిని మూసేస్తూ తెలతెల్లటి ప్లాస్టిక్ లిడ్‌తో సహా. లోపల్నుండి లీకవుతున్న వెచ్చటి ఆవిర్లు, అవి మోసుకొస్తున్న కమ్మని కాఫీ సువాసనలు. రెండ్రోజుల నుండీ కాఫీ కోసం మొహం ఫుట్‌బాల్ సైజులో (కొబ్బరికాయ షేపు అమెరికన్ ఫుట్‌బాల్ కాదు, పుచ్చకాయ టైపు సాకర్ ఫుట్‌బాల్) వాచిపోయుండటంతో, కప్పు చేతికందటం ఆలస్యం ఆబగా ఓ గుక్క గొంతులో ఒంపేసుకుని మరుక్షణం బిక్క మొహమేశాన్నేను. యాక్క్.. ఛ్ఛేదు, వ్విషం! కాఫీ ఇమ్మంటే డికాషనిస్తారా.. దారుణాతిదారుణం, దగదగా, మోసం, కుట్ర, విదేశీ హస్తం, ఎట్‌సెటరా, ఎట్‌సెటరా, ఎట్‌సెటరా.

అదీ, అమెరికాలో నా తొలి కాఫే సేవనానుభవం. అప్పటికి కాఫీ అంటే నాక్కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. చక్కటి కాఫీ అంటే – తాజాగా పితికిన, చిక్కటి జలరహిత పాలతోనే కలపాలి; నిన్నటిదో మొన్నటిదో డికాషన్ వేడిచేసి కలపకూడదు; అటు మరీ చేదుగానూ ఇటు మరీ తీపిగానూ ఉండరాదు .. ఇలాంటివి. ఇన్స్టంట్ కాఫీ అనేది అసలు కాఫీయే కాదు; ఎవరన్నా గెస్టులకి ఇన్స్టంట్ కాఫీ ఇచ్చారంటే వాళ్ల రాక సదరు హోస్టుకి ఇష్టం లేదు – వగైరా అభిప్రాయాలూ ఉండేవి (టీయో, మజ్జిగో, మంచినీరో ఇచ్చారంటే పరిస్థితి మరీ దారుణం అన్నమాట. ‘మీ మొహానికిది చాలు. పుచ్చుకుని వెంటనే దయచెయ్యండి’ అని దానర్ధం). ‘టీ పీనా ఉత్తరాది ఆర్య లక్షణం హై, కాఫీ పీనా దక్షిణాది ద్రవిడ గుణం హై’ తరహా నమ్మకాలూ కొన్నున్నాయి కానీ వాటి జోలికి లోతుగా వెళ్లటం మంచిది కాదు కాబట్టి వదిలేద్దాం. మొత్తమ్మీద, ఇవన్నీ ఎప్పటి అభిప్రాయాలో. ఇప్పుడు వాటిలో కొన్ని లేవనుకోండి. అప్పటికీ ఇప్పటికీ ఉన్న బలహీనత మాత్రం ఒకటుంది – ఎవరు కాఫీ ఆఫర్ చేసినా కాదనలేకపోవటం. అంతకు మించిన బలహీనతా ఒకటుంది. వాళ్లిచ్చిన కాఫీ ఏ మాత్రం నచ్చకపోయినా మొహమ్మీదనే చెప్పేయటం. అలా బద్దలు కొట్టిన కుండలెన్నో, చిన్నబుచ్చుకున్న స్నేహితులెందరో. తమ కాఫీని విమర్శించేటప్పుడు నా కళ్లలో పైశాచిక ఆనందమేదో తాండవిస్తుందనీ, అసలు కాఫీ ఎలా ఉన్నా విమర్శించి తీరాలన్న ముందస్తు నిర్ణయంతోనే వాళ్ల వాళ్ల ఇళ్లకొస్తాననీ .. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు నా చెవిన పడకపోలేదు. దేవుడంటూ ఉంటే గింటే కాఫీ గింజల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఇథియోపియన్ మేకల రూపంలోనే ఉంటాడన్నది నా ప్రగాఢ విశ్వాసం – కాబట్టి కాఫీ అంటే నాకెంతిష్టమో మీరు ఈజీగా ఊహించేసుకోవచ్చు. అందుకే, ఎవరేమనుకున్నా దాని రుచి దగ్గర రాజీ పడే ప్రసక్తే లేదు.

కాఫీ విషయంలో అంత కఠినాత్ముడినైన నన్ను మెప్పించటానికి స్టార్‌బక్స్‌కి రమారమి రెండేళ్లు పట్టింది. ఆ డికాషన్ అనుభవం తర్వాత ఎవరేం చెప్పినా అందులో అడుగు పెట్టటానికి ససేమిరా అంటూ మొండికేశాన్నేను. ఆ తొలి అనుభవంతో అసలు అమెరికన్లకి కాఫీ పెట్టటమే రాదన్న నమ్మకమూ నాలో ప్రబలింది. చెత్త కాఫీ తాగటం కన్నా తాగకుండా ఉండటం మేలన్న ఉద్దేశంతో రెండేళ్ల పాటు కాఫీకి దూరంగా ఉండిపోయాను. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్లో స్టార్‌బక్స్‌లోకి అడుగు పెట్టాల్సి రావటం, కాఫీలో నా ఇష్టాయిష్టాలెరిగిన ఓ మితృడి సలహాతో ఓ కాఫీ లాతే ప్రయత్నించటం, అది నచ్చటం, ‘ఫర్వాలేదే, వీళ్లకీ కాఫీ కాచటం వచ్చు’ అనుకుని అడపాదడపా స్టార్‌బక్స్‌లో అదే రకం కాఫీ తాగటం మొదలెట్టటం, మెల్లిగా ఇతర రకాలూ ప్రయత్నించటం .. కొన్నేళ్లు గడిచేసరికి కాఫీ అంటే స్టార్‌బక్సే అనుకునే స్థితికి రావటం .. ఇలా వరసగా జరిగిపోయాయి. ఆ క్రమంలో కాఫీలో ఎన్నొందల రకాలుంటాయో, వాటి చరిత్రలేమిటో, ప్రపంచంలో ఏటా ఎంత పెద్ద మొత్తంలో కాఫీ అమ్మకాలు సాగుతాయో, ఏఏ దేశాల కాఫీల్లో తేడాలేంటో .. ఇత్యాది వివరాలూ తెలుసుకున్నాను. అయితే ఇప్పటికీ కోల్డ్ కాఫీ కాన్సెప్ట్ ఏమిటో నాకర్ధం అవదనుకోండి. ఫ్రపూచినో లాంటివి కాఫీల్లో చెడబుట్టాయన్న అభిప్రాయం నాలో నరనరానా నిండిపోయింది. వాటి గురించి తర్వాతెప్పుడన్నా మాట్లాడుకుందాం.

ఇన్నేళ్ల తర్వాత, దారి పక్కన కనబడే ఏ స్టార్‌బక్స్ షాపు చూసినా నాటి నా డికాషన్ అనుభవం మదిలో మెదిలి నవ్వొస్తుంది. వెంటనే – ముప్పై ఎనిమిదేళ్ల క్రితం సియాటిల్‌లో కాఫీ గింజలమ్మే చిన్న షాపుగా ప్రారంభించి ప్రస్తుతం యాభై దాకా దేశాల్లో పదహారు వేలకి పైగా షాపులతో విస్తరించి ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారంతో కాఫీ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజులా వెలుగుతున్న స్టార్‌బక్స్ ప్రస్థానం గుర్తొచ్చి ‘వీళ్లకా కాఫీ కలపటం రాదనుకుంది’ అనిపించి ఆ నవ్వు పది రెట్లవుతుంది. నాటి పొరపాటుకి ప్రాయశ్చిత్తంగానో ఏమో, నా ప్రమేయం లేకుండానే కాళ్లా స్టార్‌బక్స్‌కేసి దారి తీస్తాయి. కాసేపటి తర్వాత కౌంటర్ ముందు నా గొంతు ధ్వనిస్తుంది:  ‘డబల్ టాల్ నో ఫాట్ ఎక్స్‌ట్రా హాట్ లాతే, ప్లీజ్’.

కొసమెరుపు: మీలో ఉన్న స్టార్‌బక్స్ అభిమానుల మెదళ్లకు కాస్త మేత. స్టార్‌బక్స్‌లో లభించే కప్పుల సైజులు ఎన్ని? వాటి పేర్లేమిటి? (తొందరపడకండి. మెనూలో కనపడని సైజూ ఒకటుంది)

26 స్పందనలు to “స్టార్‌బక్స్”


 1. 1 వేమన 7:55 సా. వద్ద నవంబర్ 10, 2009

  ఫిల్టర్ కాఫీకి అతి దగ్గర టేస్టు ఉండేట్టు కస్టమయిజ్ చేయించడం నేర్చుకున్నా మొన్నే . Dopio with little steam milk/foam, పాలు మరీ ఎక్కువా తక్కువా కాకుండా ఉండేలా 🙂

 2. 2 Brahmanandam Gorti 8:47 సా. వద్ద నవంబర్ 10, 2009

  స్టార్‌బక్స్ లో తాజో చాయ్ అనబడే టీ దొరుకుతుంది. రుచిలో అది నిజంగా “వహ్ తాజ్”!

  (ఇండియాలో కాఫీ కర్నాటకాలోనే తాగాలి. చెన్నై కాఫీ వాసన మిన్న – రుచి సున్న!
  హైదరాబాద్ ఇరానీ చాయ్ ముందు అన్నీ బలాదూరే!)

 3. 3 మేధ 9:12 సా. వద్ద నవంబర్ 10, 2009

  >>టీ పీనా ఉత్తరాది ఆర్య లక్షణం హై, కాఫీ పీనా దక్షిణాది ద్రవిడ గుణం హై’ తరహా నమ్మకాలూ కొన్నున్నాయి

  నేను కాఫీలు గట్రా తాగను కానీ, ఈ నమ్మకం మాత్రం చాలా ఎక్కువ 🙂

 4. 4 మంచు పల్లకీ 10:16 సా. వద్ద నవంబర్ 10, 2009

  I guess..Starbucks is struggling to show sales growth because of heavy competition..
  Here in in northeast, DD is more famous than Starbucks.. but DD coffee sucks..

 5. 5 Imok. Urok. 10:17 సా. వద్ద నవంబర్ 10, 2009

  “అన్యాయం. అక్రమం. బే ఏరియా లో ఉంటూ, మీ వోటు Peets కాఫీ కి కాకుండా, Starbucks కి వేస్తారా” అని ఆక్రోశం వెలిబుచ్చబోయి, మీరు మళ్ళీ ఇంకో కుండ పగలకొడతారేమోనన్న అనుమానంతో, “బాగా రాశారు” అని మాత్రమే చెప్తున్నాను.

 6. 6 SRRao 1:56 ఉద. వద్ద నవంబర్ 11, 2009

  అబ్రద కబ్ర గారూ !
  మీ కాఫీ పురాణం బాగుంది.

 7. 7 Vamshee 2:35 ఉద. వద్ద నవంబర్ 11, 2009

  um yes yes… the days of that first cup at Starbucks!

  Honestly, Starbucks makes good espresso but NOT regular coffee. Starbucks regular coffee is too ..um .. acidic.. harsh…Even the 7/11 coffee is much smoother than theirs….or a well made Nescafe instant cup[yes, there is technique to making Nescafe cup as well; and yes, I’m pushing the envelop here :)].

  Regular coffee that I actually liked came from “Seattle’s Best”. … very smooth indeed. So naturally, Starbucks bought that company 🙂

  My regular brew used to be a tall double shot latte with just half the portion of milk… in a sense the doppio of vemana, but by calling it a latte I got the right amount of milk…at my Starbucks I didn’t even have to order it. By the time I came to the cash counter in a line, my cup used to be waiting. Any new cashier used to find it really annoying. But I trained them well (“nope this wont do…I said no foam…repeat it”)- needless to say, the girls and I had a love hate relationship. 😉

  Speaking of “tall” – the sizes at Starbucks are 4 – Venti, Grande, Tall, Short; the “Short” is intentionally not advertised. 🙂

  Yes, Tajo Chai is good… wah taj indeed when there is no real chai… but nothing beats good coffee and Hyderabadi chai 🙂

  -v

 8. 8 budugoy 2:41 ఉద. వద్ద నవంబర్ 11, 2009

  మీ వ్యాసం అంతా బాగుంది ఒక్క ఫ్రపుచీనోను తిట్టడం తప్ప. try a light sandwich for lunch with a big frapuccino for dessert on a hot summer day. you will know why frapuccino is necessary. నేనూ ఏడేళ్ళు స్టార్‌బక్ష్ అడిక్ట్‌నే. ఇన్‌ఫాక్ట్ ప్రవాస జీవితం ముగించి ఇండియా వచ్చాక నేను మిస్ అయ్యేది మూడే మూడు విషయాలు. స్టార్‌బక్స్, క్లీన్ సరౌండింగ్స్, అమెరికన్ బ్రేక్‌ఫాస్ట్స్ (ఎవరేమైనా అనుకోనీ, నాకు ఇడ్లీ వడలు దోశలంటే అసయ్యం). స్మాల్, టాల్, గ్రాండె, వెంటి కాక ఇంకా సైజులేమున్నాయబ్బా?? 😕

 9. 9 Indian Minerva 5:25 ఉద. వద్ద నవంబర్ 11, 2009

  Is there anything called “bucket” size? 🙂

 10. 10 budugoy 6:24 ఉద. వద్ద నవంబర్ 11, 2009

  yea vamshee. agree with u on that. seattles best coffees brew is awesome. I once had a cup on flight and was shocked that flights can offer such a great coffee. upon enquiry with hostess, she told its just sbc. i thought i was the only one who went to into so many details of coffee.. u beat me hands down.

 11. 11 వెంకటరమణ 6:56 ఉద. వద్ద నవంబర్ 11, 2009

  అబ్రకదబ్ర గారు మీ కాఫీ అనుభవాలు బాగున్నాయి. 🙂 . ఈ టపా ద్వారా స్టార్ బక్స్ గురించి, అన్ని రకాల కాఫీలు ఉంటాయనీ ఇప్పుడే తెలిసింది.

 12. 12 నిషిగంధ 7:00 ఉద. వద్ద నవంబర్ 11, 2009

  మీ మొదటి పరదేశంలో కాఫీ అనుభవం బావుంది 🙂
  నాకసలు కాఫీలో పాలూ, పంచదార వేయకుడా ఇచ్చేసి మనల్నే కలుపుకోమనడం చాలారోజుల వరకూ అస్సలు నచ్చలేదు.. పని మనది, డబ్బులు వాడికి అన్నట్లు అనిపించేది!

  నాక్కూడా స్టార్ బక్స్ కంటే సియాటిల్స్ బెస్ట్ ఇష్టం.. కాకపోతే ‘మీ ఊరొచ్చా..మీ వీధికొచ్చా…’ టైప్ లో స్టార్ బక్స్ ప్రతిచోటా కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ వెళ్ళేది దానికే! మీరు చెప్పినట్టే నేను కూడా మొదట్లో అక్కడి వాతావరణం చూసి ఎంత ఫాసినేట్ అయిపోయేదాన్నో! 🙂

 13. 13 Chaithanya MS 8:11 ఉద. వద్ద నవంబర్ 11, 2009

  *ఎవరన్నా గెస్టులకి ఇన్స్టంట్ కాఫీ ఇచ్చారంటే వాళ్ల రాక సదరు హోస్టుకి ఇష్టం లేదు*

  ఇప్పటికీ నాఅభిప్రాయం అదే.దాన్నిచూస్తేనే కడుపులో దేవడం తాలూకు లక్షణాలు మొహంలో కనిపిచ్చేస్తాయి.

 14. 14 భావన 8:50 ఉద. వద్ద నవంబర్ 11, 2009

  బాగున్నాయి కాఫీ అనుభవాలు. మాకు ఈ నార్త్ ఈస్ట్ లో Dunkin Donuts ఎక్కువ స్టార్ బక్స్ కంటే.. కాని కాఫీ బాగోదు. వాడికి 100 చెప్పాలి ఆ ఆ అంత పాలొద్దు అరె అరె ఎందుకంత పంచదార తగ్గించు కాసిని కాఫీ పారబోసి డికాషన్ పోసుకో అంటు దాదాపు గా మనం కాఫీ కలుపుకున్నంత పని అవుతుంది కాని మాకు వీధికి ఒకటి అదే ఇక్కడ. స్టార్ బక్స్ కాఫీ నాకు కావలసినంత వేడి గా వుండదు అది కంప్లైంట్ నాకు, ఈ మధ్య న బిజినెస్స్ చెయ్యటం లేదు మూసేస్తారు అని రూమర్స్ వచ్చాయి. ఏది ఏమైనా మీ కాఫీ మీద బలమైన అభిప్రాయాలకు మాత్రం బెదురు చూపులు మీ కాఫీ అనుభవాలకు కిస కిస లు (నవ్వులన్నమాట)

 15. 15 అబ్రకదబ్ర 1:18 సా. వద్ద నవంబర్ 11, 2009

  @మేధ,SRRao,వెంకటరమణ,చైతన్య,భావన:

  ధన్యవాదాలు.

  @వేమన:

  Doppio ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఈ సారి చూడాలి.

  @బ్రహ్మానందం:

  నాకు టీ ఇష్టం ఉండదు కాబట్టి ఇరానీ చాయ్ మీద నో కామెంట్స్ 😉 ఐతే నాకు నచ్చే టీ కూడా ఒకటుంది – అది మీరన్న తాజో చాయ్. పీట్స్ వాళ్ల మసాలా చాయ్ కూడా ఇంచు మించు దీనిలాగే ఉంటుంది (అన్నట్లు, పీట్స్ లో మన డార్జిలింగ్ మరియు అస్సాం టీలు కూడా దొరుకుతాయి)

  @మంచుపల్లకి:

  డోనట్స్ దుకాణాల్లో దొరికే కాఫీ అలాగే ఉంటుంది మరి 😀

  రిసెషన్ దెబ్బ స్టార్‌బక్స్ మీద కొంత పడినట్లుంది. గొందికో షాపు తెరవటమూ ఓ కారణం కావచ్చు. పైగా మెక్‌డొనాల్డ్స్ చవకగా కాఫీ అమ్మటం మొదలెట్టింది కదా. అయితే నేను తరచూ వెళ్లే స్టార్‌బక్స్ అంగళ్లు మాత్రం కస్టమర్లతో కళకళలాడుతూనే ఉన్నాయి.

  @నేనోకే.నువ్వోకే:

  కాఫీ మాత్రమే కాక స్టార్‌బక్స్ experience నచ్చుతుందన్నాను కదా 🙂 పీట్స్ కాఫీ బాగుంటాయి కానీ వాతావరణం కొంత డల్‌గా ఉంటుంది. వాళ్ల గరుడ బ్రాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. లాతే వంటివి ఓకే కానీ రెగ్యులర్ కాఫీ నాకు మరీ చేదనిపిస్తుంది. ( మీకు తెలుసా? స్టార్‌బక్స్ తొలినాళ్లలో ‘మన’ పీట్స్ నుండే కాఫీ గింజలు కొనుగోలు చేసేది. ఇది 1971 నాటి మాట. స్టార్‌బక్స్ లా ముందు చూపు లేక ఈమధ్య కాలం దాకా గింజలు మాత్రమే అమ్మే వ్యాపారంలోనే ఉండి పీట్స్ వాళ్లు వెనకబడిపోయారు. లేకపోతే ఈవ్యాసం నేను పీట్స్ గురించి రాసుండేవాడినేమో 🙂 )

  నాకు బాగా నచ్చే ‘ఒకట్రెండు పీట్స్ ప్రదేశాల్లో’ ఒకటి హాఫ్ మూన్ బేలో ఉంది, రెండోది SFO ఫిషర్‌మన్స్ వార్ఫ్ దగ్గర Boudins లో ఉంది. మీరూ ఇక్కడే అంటున్నారు కాబట్టి వీలైతే వాటిలో ట్రై చెయ్యండి.

  @వంశీ:

  కాలిఫోర్నియాలో SBC బోర్డర్స్ బుక్ షాప్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. బోర్డర్స్‌లో రెగ్యులర్ కాఫీ మాత్రమే ప్రయత్నించాను. బాగున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో ఒక SBC బూత్ చూసినట్లు గుర్తు.

  @బుడుగోయ్:

  ఫ్రపూచినో పిల్లకాయల డ్రింక్ 😉 (As I read it, it was an accidental invention at a Starbucks location in Santa Monica, intended to please a bunch of school kids) టీనేజర్స్ దాన్నే ఎక్కువగా ఇష్టపడటం గమనించాను.

  Btw, small = tall. ఆ నాలుగో రకం పేరు పైన వంశీ చెప్పారు: షార్ట్ (ఉరఫ్ kids)

  @ఇండియన్ మినర్వా:

  బకెట్ సైజ్! ఉంటే మీరదే కొనేట్లున్నారు రోజుకి రెండుమార్లు 🙂

  @నిషిగంధ:

  ‘మీ ఊరొచ్చా, మీ ఇంటికొచ్చా’ 😀 స్టార్‌బక్స్ చెవినబడితే కాపీరైట్లు కొనేస్కుంటారేమో!

 16. 16 నేస్తం 6:59 సా. వద్ద నవంబర్ 11, 2009

  >>> కాఫీ తాగటం, తాగకపోవటం అనేది వేరే విషయం – కేవలం అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించటానికన్నా నేను తరచూ వెళుతుంటాను
  నాకు కాఫీ,టీ అలవాటు లేదు కాని కాస్తున్నపుడు వచ్చిన స్మెల్ భలే ఇష్టం..ఇదిగో మీలాగే కాఫీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకునే ప్రతి ఒక్కరినీ చూడటం అంటే మరీ ఇష్టం ..నేనలా చూస్తుంటే బ్రహ్మానందం లా ఆ చూడటం ఏమిటీ అని ఒకసారి మా ఆయన అదేదో పేరుతెలియని కాఫీ బలవంతం గా తాగించేసారు ..చేదుగా ఉన్న కషాయాన్ని అంత ఇష్టంగా ఎలా తాగుతారు బాబు అందరూ అనిపించింది..
  >>>ఎవరన్నా గెస్టులకి ఇన్స్టంట్ కాఫీ ఇచ్చారంటే వాళ్ల రాక సదరు హోస్టుకి ఇష్టం లేదు
  మరి మా అత్తగారు ఉన్న అన్ని రోజులు బ్రూ ఇన్స్టంట్ కాఫీనే ఇచ్చా ..కొంపదీసి విషయం తెలిసిపోతుంది అంటారా 🙂

 17. 17 మంచుపల్లకీ 7:05 సా. వద్ద నవంబర్ 11, 2009

  @ నేస్తం ..కంగారుపడకండి.. తెలియకపొయినా చెప్పడానికి మేము వున్నాం కదా 🙂

 18. 18 వేణూ శ్రీకాంత్ 12:14 ఉద. వద్ద నవంబర్ 12, 2009

  బాగుందండీ స్టార్ బక్స్ కథ కమామిషు, చాలా విషయాలు చెప్పారు. మీ డికాషన్ ఎక్పీరియన్స్ నవ్వుతెప్పించింది కానీ అది రెండేళ్ళు దూరంగా ఉంచిందా 🙂 నా మొదటి పరిచయం లోనే క్రీమర్ మరియూ పంచదార సరిపడా కలుపుకోవడంతో రుచి బాగానే ఉందనిపించింది. నాకు కూడా స్టార్‍బక్స్ ఏంబియన్స్ చాలా నచ్చుతుంది, మ్యూజిక్ మరీ ప్రత్యేకం. అక్కడి లాటే మన కాఫీ రుచికి దగ్గరగా ఉంటుంది కానీ ఏదో లోటు.

 19. 19 సుజాత 7:37 సా. వద్ద నవంబర్ 12, 2009

  నేస్తం, మీ అత్తగారెక్కడ ఉంటారు? బ్రూ ఇన్ స్టంట్ ఇచ్చిన వాళ్లని నేనైతే క్షమించను మరి!

 20. 20 సుజాత 7:47 సా. వద్ద నవంబర్ 12, 2009

  టల్సా నుంచి కన్సాస్ వెళ్ళేదారిలో నా మొదటి స్టార్ బక్స్ కాఫీ కూడా మీ కాఫీ లాంటిదే! యాక్ ఛీ,!పైగా నాకసలు నాలుక కాలిపోయే వేడి ఉండాలి కాఫీ! స్టార్ బక్స్ లో అది కుదర్దు.

  తినగ తినగ టైపులో ఇలాంటి రక రకాల కాఫీలు ఇష్టపడటం అలవాటవుతుందేమో అనుకున్నాను!

  ఇక్కడ కూడా బరిస్టా లో కాఫీ తాగడం నాకసలు నచ్చదు. పక్కనే సబ్ వే లో సబ్బు తిని, స్నాపిల్ తాగుతా కావాలంటే!

  కాఫీ అంటే మా ఇంట్లో నేను కలిపే ఫిల్టర్ కాఫీయే నాకు! ఏ దేశమేగినా ఎందు కాలిడినా సరే!ఫిల్టర్ కాఫీకి దగ్గర ఉండేలా కస్టమైజ్ చేయించారంటే మీరూ ఇదే పార్టీ అన్నమాట.

  శంషా బాదు ఎయిర్ పోర్ట్ లో ఉంది స్టార్ బక్స్! కానీ అది విదేశాలకు వెళ్ళేవాళ్ళకు మాత్రమే అందుబాటులో ఉంది. డొక్కు డొమెస్టిక్ ప్రయాణీకులకు కాదట.

  భావన, నిషి 🙂

 21. 22 గీతాచార్య 9:55 సా. వద్ద నవంబర్ 12, 2009

  కాఫీ తాగనోడు కాఫిరై పుట్టున్ 😀

 22. 23 krishna 1:20 సా. వద్ద జనవరి 18, 2010

  Aithe meeru America telugu varu Anna vaaranna maata

 23. 24 krishna 1:29 సా. వద్ద జనవరి 18, 2010

  Sujatha Gaaru,

  Baaga chepparu..

  Naaku starbucks ni choosthe costly Anipisthundhi kaani polekunda undalekapothunaa..

  Adento America lo dieting gurinchi matladithe.. first starbucks ni aadi posukuntaaru.. ademanna balavanthangaa coffee notlu poyadhu kadha manam 2.99$$ petti konukkokapthe asalu daani vaipu choodakapothe..:)

 24. 25 వాసు 12:48 సా. వద్ద ఆగస్ట్ 21, 2010

  ఇది చదువుతుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది. నేను టీకి ఆమడ దూరం. కాఫీ లేకపోతె రోజు గడవదు.

  స్టార్ బక్స్ కి నేను వచ్చిన వారం లోనే ఫ్యాన్ ని అయిపోయాను.
  మొదట్లో కారమేల్ మాకియాటో తాగేవాడిని. ఇంకేం కలుపుకో అక్కర్లేదని. తరువాతా వనీలా లాటే. మామూలు లాటే లో అయితే మళ్ళీ పంచదారా కలుపుకోవాలి కదండీ మరి . అప్పుడప్పుడు మామూలు లాటే కూడా తాగుతా.

  నేను పీట్స్ అవీ ట్రై చేశా కానీ నాకెందుకో స్టార్ బక్స్ అంటే మహా యిష్టం.

  అన్నట్టు ఈ మధ్య ఫ్రీ వై ఫై కూడా ఇస్తున్న్నారు.

  ఇంకోటి స్టార్ బక్స్ పీట్స్ నించి పుట్టిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

 25. 26 Srikanth 9:37 సా. వద్ద ఆగస్ట్ 22, 2010

  same experience coffee to ikkada kakapote McDonalds lo.

  star bucks CHAI naa favorite.
  short cut ga regular coffee teesukuni ,
  sagam vaalla munde paarabosi andulo paalu,
  panchadara kalupukuni coffe taagatam tappatla
  migata chotla.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: