ఏం పిల్లడో జైలుకొస్తవా

“రండి కదలి రండి నిదుర లెండి కలసి రండి
ఉప్పెనలా ఉరికి రండి ఉద్యమమై ఉబికి రండి
గనుల నుండి పనుల నుండి కణకణాగ్ని శిఖల నుండి
గత చరిత్ర పుటల నుండి మృతవీరుల చితుల నుండి
నివురుదీసి నిదుర లేచె ఈ నాటికి నిప్పురవ్వ ..”

“ఆగాగు. ఎవరా నిదుర లేచిన నిప్పురవ్వ?”

“ఇంకెవరు? తెలంగాణ గట్టుమీది సందమామయ్య .. మన కేసీయారన్న. కన్నాపరేషనయ్యాక ఉదయం ఐదింటికే లేస్తున్నాడు, మనల్నీ లెమ్మంటున్నాడు”

“అంత పొద్దున్నే లేచేం చేస్తాడు?”

“గాండ్రిస్తాడు, అచ్చు బెబ్బులిలా”

“సరే. మరి మనమెందుకు తోడుగా లేవటం?”

“జైలు కెళ్లటానికి”

“అదేంటి?”

“గాంధీజీ జనాలతో జైలుకెళ్లి స్వరాజ్యం తెచ్చినట్లు, మనల్ని జైలుకి తోలితే తెలంగాణ వస్తదని అన్నకి కలొచ్చిందట”

“!!”

* * * * 

‘ఐదారు నెలలుగా ఐపు లేడు. చప్పుడన్నా చెయ్యకుండా ఎక్కడ దాగున్నాడో’ అని దిగులు పెట్టుకున్న అఖిలాంధ్ర ప్రజానీకం ముఖారవిందాల్లో మందహాసాలు విరబూయిస్తూ వారం క్రితం రాష్ట్ర రాజకీయ యవనిక మీదకి పునరంగేట్రం చేశాడు కెప్టెన్ కేసీయార్. వారం రోజులుగా ఇందుగలడందులేడనకుండా ఎక్కడబడితే అక్కడ తానే అగుపిస్తూ తెగ సందడి చేస్తున్నాడు. అమ్మ కడుపు చల్లగా, రోజుకో కొత్త జోకు పేలుస్తూ రాష్ట్రం పొట్ట చెక్కలు చేస్తున్నాడు. నాగలి పట్టి నవ్వుల సాగు చేస్తున్నాడు. హాస్యం విరగ పండిస్తున్నాడు (నవ్వటమే ఎరగని మరో చందురుడు నిన్న పగలబడి నవ్విన అసలు కారణం – అదీ)

సదరు హాస్యవల్లరిలో భాగంగా, ‘కంటి ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం బాగుపడింది, పొద్దున్నే ఐదుగంటలకే లేచి పని చేస్తున్నా. తెలంగాణ ద్రోహులారా, కాచుకోండి. బస్తీ మే సవాల్’ అంటూ హూంకరించాడు దొరబాబు నిన్న విలేకరుల సమావేశంలో. ‘లేస్తే నే మనిషినే కాను’ అన్నాట్ట వెనకటికో లేజీ ఫెలో. లేచినా లేవకపోయినా కేసీయారుడి తడాఖా ఏమిటో ఆంధ్రులకి ఆల్రెడీ తెలుసు కాబట్టి శ్రీవారు ప్రాతఃకాలానే పడక దిగినా, మధ్యాహ్నం దాకా ముసుగు తన్నినా పెద్దగా ఫరకుండదు. అయినా, అయ్యవారు ఐదింటికే లేచిపోవాలని ముచ్చట పడుతున్నారు కాబట్టి అలాగే కానీమందాం. ఓ పక్క వరదలు, మరోపక్క కుర్చీ కోసం తన్నులాటల మధ్యలో చికాకుగా రోజుల్లాగిస్తున్న జనాభాకి దొరవారు అదనపు గంటలు పనిచేసి మరీ కామిక్ రిలీఫ్ కలిగిస్తానంటే వద్దనటమేల?

కంటికి చికిత్స చేస్తే ఒంటికి నయమవటమేంటని తెల్లమొహాలేసిన అజ్ఞానులకి సారువారి గురించి తెలిసింది సున్నా అనుకోవాలి. మన్లో మాట .. చిన్నప్పుడెవరో ఆయన తుంటిమీద తంతే మూతిపళ్లు రాలాయట. కాబట్టి ఆయనకి కన్నాపరేషన్ చేస్తే ఒళ్లూ బాగుపడుతుంది, బుర్రా డామేజవుతుంది (కేసీఆర్ బుర్ర కొత్తగా డామేజవటమేంటంటే నాదగ్గర సమాధానం లేదు). ఇప్పుడదే జరిగింది. అందుకే ఈ వింత పలవరింతలు. నిన్నటిదాకా వద్దన్న తెలుగు తల్లి నేడు ముద్దయ్యింది, పెంపుడు తల్లేమో ఉన్న పళాన పిన్నై చిన్నబోయింది. ‘కేసీయార్ సమైక్యబాట పట్టాడహో‘ అని కోడై కూసిన దుష్టాంధ్రా వలస దుర్మార్గుల ఆ రెండో పత్రిక రాతల్లో సద్విమర్శే దర్శనమిచ్చింది. అందుకే మొన్నామధ్య పడతిట్టిన పత్రికనే నిన్న పొగిడేశారు – కొత్తగా కొనుక్కున్న చలువ కళ్లద్దాలోనుండి చలచల్లగా చూస్తూ.

‘మార్పు మంచిదేగా’ అనుకుంటున్నారా? ఆగండాగండి. అయ్యవారికి మరో కొత్త ముఖం జతపడిందంతే. వారు మారిందేమీ లేదు. ఆ తిట్లూ, పిట్టలదొర ప్రగల్భాలూ ఎక్కడికీ పోలేదు. ‘జైల్ భరో చేస్తాం, ఢిల్లీ దద్దరిల్లజేస్తాం’ అన్న కోతలూ ఆ సమావేశంలోనే కోశారు వారు. ‘బెబ్బులిలా గర్జిస్తా, కాస్కోండి, మగతనం చాటండి’ వగైరా కారుకూతలు షరా మామూలే. ‘ఇచ్చుడో చచ్చుడో’ ఐపోయింది, ‘పంచుడో దంచుడో’ కూడా ఐపోయింది. పాడె కట్టటం, బొంద పెట్టటం ఐపోయాయి. ముష్టెత్తటాలూ, కూలీ పని చెయ్యటాలూ ఐపోయాయి. యజ్ఞ యాగాదులు సైతం రానూ వచ్చాయి, పోనూ పోయాయి. ఇప్పుడు జైళ్లు నింపితేనూ, పులి అరుపులు అరిస్తేనూ పన్లవుతాయన్న మహత్తర అవిడియా వచ్చింది కన్నాపరేషనైన మన్నుబుర్రకి. ఢిల్లీ దద్దరిల్ల చేస్తాడట, కేంద్రాన్ని గడగడలాడిస్తాడట – లింగులింగుమంటూ ఉన్న ఇద్దరు ఎంపీలతోనే! ఆ ఇద్దర్లోనూ ఒకావిడ ఏడు గుళ్ల పూజారిణి; అంటే అంత బిజీ పర్సన్ అని కాదు – ఎప్పుడెక్కడుంటుందో ఎవరికీ తెలీదని. అసలు ఇప్పుడామె ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలీదు. ఆవిడ తప్పిపోయిందని మెదక్ ఓటర్లు పోలీసులకి ఫిర్యాదిచ్చి ఐదు నెలలయింది, ఇంకా పత్తా తెలీదు. ఇక మిగిలిన ఏక్ నిరంజనుడు ఢిల్లీని ఎంత జోరుగా ఊపుతాడో చూడాలి.

ఇంతకీ – అయ్యవారు అయిదింటికే లేచి పని చేస్తున్నాడని విని ఆంధ్రా, సీమ వాసులు ఆనందభరితులవగా, ఆయన అనుయాయులు మాత్రం అదిరిపడ్డారు. ఈ ఊహించని ఉత్పాతానికి ప్రత్యేకవాదుల గుండెల్లో రాళ్లూ రప్పలూ పడ్డాయనీ, రైళ్లూ బస్సులూ పరిగెత్తాయనీ, ‘గురుడు పార్ట్ టైమ్ పని చేస్తేనే ఉద్యమానికి గుండు గొరిగించాడు. ఇప్పుడు ఎగేసుకుని ఓవర్ టైమ్ ఎగస్ట్రాలేస్తే తొందర్లో తెలంగాణ భవన్‌కి తాళాలే’ అంటూ వాళ్లు గొణుక్కుంటున్నారనీ అభిజ్ఞవర్గాల భోగట్టా. అసలు, రాష్ట్రంలో కేసీయార్ని మించిన సమైక్యవాది లేడని నాకెప్పట్నుండో అనుమానం. అదిప్పుడు బలపడింది. మొత్తానికి దొరబాబులో వరద కృష్ణమ్మని మించిన స్థాయిలో పరవళ్లు తొక్కుతున్న నవనవోత్సాహం చూస్తుంటే ఈ తడవ ప్రత్యేకవాదాన్ని ఎలాగైనా ఫినిష్ చెయ్యటానికి పూర్తి ప్రిపరేషన్‌తోనే వచ్చినట్లనిపిస్తుంది. విజయోస్తు.

24 స్పందనలు to “ఏం పిల్లడో జైలుకొస్తవా”


 1. 1 నేస్తం 5:46 సా. వద్ద అక్టోబర్ 15, 2009

  కె సి ఆర్ మద్యం,సిగరెట్స్ మానేస్తాడంట..ఒక్క సారిగా ఇన్ని జలక్ లా … అసలేం జరుగుతుంది ..ఎందుకు జరుగుతుంది ?:)

 2. 2 V.Rajanna 6:40 సా. వద్ద అక్టోబర్ 15, 2009

  ఆంధ్రా వాళ్ళను కిలకిల నవ్వించేలా, తెలంగాణా వాదులు ఖిన్నులయ్యేలా చాలా బాగుంది మీ సెటైర్.
  మా దౌర్భాగ్యం కొద్దీ తెలంగాణా ప్రజల ప్రత్యెక రాష్ట్ర ఆకాంక్షకి, అస్తిత్వ పోరాటానికి ఏకైక ప్రతినిధి అన్నంతగా వేల్లూనుకుపోయాడు కేసీఆర్..
  అతను ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని వెధవ వేషాలు వేస్తున్నా ప్రత్యామ్నాయ నాయకత్వం లేక తెలంగాణా ప్రజా తల్లడిల్లుతోంది. తన్లాడుతోంది. గతిలేక ఆ తోకనె వదలకుండా పట్టుకుని పజీత పాలవుతోంది.
  కాంగ్రెస్ లో వున్న తెలంగాణా వాదులకు స్వార్ధ మే పరమార్ధం అయిపొయింది. వాళ్లకు తమ ప్రయోజనాలకు ముప్పు వస్తున్నప్పుడు తప్ప తెలంగాణా పై గొంతు పెగలదు.
  ప్రత్యెక తెలంగాణాకు అనుకూలమే అని ప్రకటించిన టీడీపీ, ప్రజారాజ్యం, సీపీఐ పార్టీల లోని తెలంగాణా నేతల పరిస్థితీ అంతే. పోరాటం మాట అటుంచి కనీసం నినాదాలు చేసే ధైర్యం కూడా లేదు.
  ఇక కేసీఆర్ ను విభేదించి టీఆరెస్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళలో సగం మంది కేసీఆర్ కంటే మహా స్వార్ధ పరులు లేదంటే అసమర్ధులు. మిగతా సగం మంది నిజాయితీ పరులకు ఏమాత్రం అర్ధ బలం లేదు. వారు నిస్సహాయులు.

  తెలంగాణా ప్రజలకు 1969 లో 400 మందిని బలి తీసుకున్న ప్రత్యెక తెలంగాణా పోరాట అనుభవముంది మర్రి చెన్నా రెడ్డి ఆనాడు చేసిన ద్రోహం తాలూకు గుణ పాఠ ముంది. అందుకే ఆచి తూచి అడుగేస్తున్నారు. ఎవరినీ అంత సులువుగా, సంపూర్ణంగా నమ్మలేక పోతున్నారు.
  ఈ దగుల్భాజీ రాజకీయాల్లో అంతా దొంగలే అన్న నిరాశ, నిర్లిప్తత వారిని నిస్సహాయుల్ని చేస్తున్నాయి.
  అయితే వారి ఆకాంక్ష మాత్రం చల్లారలేదు, చల్లారదు.
  ….. నదీ జలాల పంపిణీలో జరిగిన, జరుగుతున్న అన్యాయం శ్రీశైలం, పోతిరెడ్డి పాడు వరదలతో బట్టబయలయింది. తెలంగాణా వాసులకు ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయం, తెలంగాణా విలీనమప్పుడు చేసుకున్న గత ఒప్పందాలను ఆంధ్ర పాలకులు ఎట్లా తుంగలో తోక్కుతున్నారో … ఫ్రీ జోన్ … తీర్పుతో మరోసారి బట్టబయలయింది.
  …. ఇట్లాగే నిప్పు మళ్ళీ మళ్ళీ రాజుకుంటూ ఏదో ఒక నాడు తెలంగాణా ప్రజల చిరకాల వాంఛ తప్పక నెరవేరుతుంది. ప్రత్యెక వాదనను ఫినిష్ చేయడం కెసేఎఆర్ లు, వైఎస్ ల వల్ల ఎన్నటికి సాధ్యం కాదు.
  తెలంగాణా వాదాన్ని ఫినిష్ చేయాలనుకున్న వాళ్ళే ఫినిష్ అయిపోతారు.
  ఇది తధ్యం .
  న్యాయం తెలంగాణా పక్షాన వుంది.

  జై తెలంగాణా !

  !

 3. 3 kcube 8:40 సా. వద్ద అక్టోబర్ 15, 2009

  అసలు ఈ కేతిగాడికి ఇంత పబ్లిసిటీ అవసరమా? వాడిచ్చే టీలకి, బిస్కట్లకి ఆశపడి ఓవర్ కవరేజీ ఇస్తున్న మీడియాకు బుద్ధిలేకపోతే సరి. వాడు ఏది మానేస్తే మనకేంటి. ఊకదంపుడు విషయాలతో ప్రజల మెదళ్ళను తినకుండా వదిలేస్తే సరి. తొండలా తలూపుతూ నిజాంగిరీ చేసేవాడికి అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇలాంటి అవకాశవాద రాజకీయ తార్పుడుగాళ్ళను పట్టించుకోవడం మానేస్తేనే జనం బాగుపడతారు. బుల్లెట్లకు ఎదురునిలుస్తాడంట. వీడికి అవకాశం రాగానే అల్లుడ్ని, కొడుకుని, కూతురిని పదవులకోసం ముందుకు తెచ్చిన వాడు తెలంగాణాను బాగుచేస్తాడా. మరల ఈరోజు దొరనే అని చెప్తాడు. వీడి దొరతనంను ఎలా అంగీకరిస్తున్నారో తెలియడం లేదు. సామాజిక చైతన్యం కలిగిన తెలంగాణా ప్రజల ఓపికకు ఓ దణ్ణం.

 4. 4 కొత్తపాళీ 9:19 సా. వద్ద అక్టోబర్ 15, 2009

  hilarious.
  రాజన్న గారూ, సెటైరు కేవలం కేసీఆర్ మీద మాత్రమే, తెలంగాణా మీద కాదు.

 5. 5 TAMILAN 9:49 సా. వద్ద అక్టోబర్ 15, 2009

  ’గురుడు పార్ట్ టైమ్ పని చేస్తేనే ఉద్యమానికి గుండు గొరిగించాడు. ఇప్పుడు ఎగేసుకుని ఓవర్ టైమ్ ఎగస్ట్రాలేస్తే తొందర్లో తెలంగాణ భవన్‌కి తాళాలే’[:)]

 6. 6 తాడేపల్లి 9:50 సా. వద్ద అక్టోబర్ 15, 2009

  ప్రత్యేక తెలంగాణకి నేను వ్యతిరేకం కాదు. కానీ అది ఏర్పడే పరిస్థితులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. గ్యాస్, పెట్రోల్, బొగ్గుతో సహా ఆంధ్రా-తెలంగాణా ప్రజలు ఒకే వనరుల్ని పంచుకుని బతకాల్సిరావడం కూడా ఇందుకొక కారణం. అలా ఈ ఉద్యమం, ఈ ఆకాంక్ష కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మన తరంలో మాత్రం అది అవ్వదనిపిస్తోంది.

 7. 8 వేణూ శ్రీకాంత్ 11:19 సా. వద్ద అక్టోబర్ 15, 2009

  హ హ శీర్షికే అదరగొట్టారు 🙂 ఇక టపా సంగతి చెప్పాలా…

 8. 9 సుజాత 1:35 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

  రాజన్నగారు,
  మీకు ఖిన్నులవ్వాలింది రోజుకో మాట మాట్లాడి, పూటకో రకంగా ప్రవర్తిస్తున్న చంద్ర శేఖర్ రావుని చూసే గానీ సరదాగా రాసిన ఈ టపాను చూసి కాదు! తెలంగాణా ఇంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం అతడి మీద తెలంగాణా ప్రజలకు నమ్మకం కలిగేలా అతడు ఎప్పుడూ ప్రవరించకపోవడమే!

  న్యాయం తెలంగాణా పక్షాన ఉందని మీరనుకుంటే తెలంగాణా వస్తుంది. రానివ్వండి. దానికి కోస్తా జిల్లాల్లో వ్యతిరేకత ఉన్నా ప్రజాభిప్రాయానికి ఇక్కడ ఎప్పుడూ విలువ లేదు కాబట్టి ఎవరూ ఏం చేయలేరు.

  ఆయన ఏదో ఒరగబెడతాడని ఆశలు పెంచుకున్న తెలంగాణా ప్రజల సహనానికి నిజంగానే దణ్ణం పెట్టాలి.

  అబ్రకదబ్ర,
  కేసీ ఆర్ కామెడీలు మాకేం కొత్త కాదు! ఆయన మీద మీ సెటర్లూ కొత్త కాదు. రెండూ బాగానే ఉంటాయి.కానివ్వండి.

 9. 10 kcube 2:18 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

  ఉద్యమాలు ప్రజలగు౦డెల్లో౦చి రావాలి నిజంగా తెలంగాణా ప్రజలు ప్రత్యెక తెలంగాణా కావాలని కోరుకుంటే నాయకత్వ సమస్య అడ్డుపడదు. వీళ్ళ పదవీకా౦క్శను తీర్చుకునేందుకే ఉత్తుత్తి నినాదాల పోరాటాలు చేస్తూ ఎన్నికలప్పుడు విరాళాల పేరుతొ, సీట్ల పేరుతొ కోట్లు కూడబెట్టి, తెలంగాణా భూభాగాన్ని సెజ్ ల పేరుతోనూ, రియలెస్టేట్ దండాలు నడుపుకోవదానికి లైసెన్సుగా వాడుకుంటున్నారు. వీరిని మెడపెట్టి బయటకు గె౦టివేసిన నాడే నాటి తెలంగాణా స్ఫూర్తితో, నాటి నుండి నేటి వరకు తమ క్రొన్నెత్తురు ధారబోసిన అమాయక యువజనానికి నిజమైన నివాళినర్పి౦చగల౦, మరల ఉద్యమాన్ని ము౦దుకు నడిపి విజయం సాధించగలరు. ఈ మాయదారి ఎలచ్చన్ స్టంట్ గాళ్ళని నమ్మొద్దు బాబో నమ్మొద్దు.

 10. 11 VenkataRamana 2:30 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

  ‘నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుణ్ణి గుమ్మాని కురిదీస్తాడమ్మో నమ్మినోణ్ణి’ అనే మాటలు గుర్తొస్తున్నాయి కే.సి.ఆర్ ను చూస్తే

 11. 12 Gopal Koduri 3:10 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

  అబ్బ! కడుపు చక్కలయ్యేలా నవ్వాను, కేసీఆర్ సుఖీభవా! అబ్రకదబ్ర జిందాబాద్!! 🙂

 12. 13 V.Rajanna 3:34 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

  సుజాత గారూ,
  కేసీఆర్ ప్రవర్తన ఒక్కటే కాదండి….
  ఎన్నికలప్పుడు మాత్రమే మేము ప్రత్యేక తెలంగాణాకు అనుకూలం అని ప్రకటించి ఆతర్వాత దాని వూసు కూడా ఎత్తకుండా” క్రిమినల్ సైలెన్స్ ని” పాటించే టీడీపీ, ప్రజారాజ్యం, సీపీ ఐ , బీజేపీ నేతల ప్రవర్తన,
  మొదటినుంచీ తెలంగాణాను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతల ప్రవర్తన కూడా మేం ఖిన్నులయ్యేట్టే చేస్తోంది.
  టీఆర్ ఎస్ తో పొత్తుపెట్టుకుని తెలంగాణా అంశాన్ని “కామన్ మినిమం ప్రోగ్రాం” లో పెట్టి, రాష్ట్ర పతి చేత పార్లమెంట్ ఉభయసభల్లో చెప్పించి, ప్రణబ్ కమిటీని కూడా వేసి ఇన్ని నాటకాలాడి ఒక్క వై ఎస్ గట్టిగా వ్యతిరేకిన్చగానే ప్లేట్ ఫిరాయించిన కాంగ్రెస్ నేతలు మీకు ఉన్నతులుగానే కనిపిస్తున్నారా? తెలంగాణా అంశం పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు మీద సేటైర్లు రాయరేం?
  నిజంగా మీరు తెలంగాణా వాదం పట్ల సానుబూతితోనే కేసీఆర్ మీద సే టైర్లు రాస్తున్నారా?
  పైన ఒక మహాను భావుడు వాడిన భాష చూడండి. తెలంగాణా ప్రజలకు పెట్టిన దణ్ణం లో వ్యంగ్యం లేదూ. పోనీ తెలంగాణా ప్రజలు ఏం చేయాలో మీరే చెప్పండి.

  >>>> న్యాయం తెలంగాణా పక్షాన ఉందని మీరనుకుంటే తెలంగాణా వస్తుంది. రానివ్వండి. దానికి కోస్తా జిల్లాల్లో వ్యతిరేకత ఉన్నా ప్రజాభిప్రాయానికి ఇక్కడ ఎప్పుడూ విలువ లేదు కాబట్టి ఎవరూ ఏం చేయలేరు.<<<<

  మీరు రాసిన ఈ వాక్యాలు మరో సారి మీరే చదివి వివరంగా చెప్పండి.
  "న్యాయం తెలంగాణా పక్షాన ఉందని మీరనుకుంటే ….."మా సంగతి సరే మీరు ఏమనుకుంటున్నారో స్పష్టం చేయండి. న్యాయం తెలంగాణా పక్షాన లేదా ?
  "కోస్తా జిల్లాల్లో వ్యతిరేకత వున్నా, ప్రజాభిప్రాయానికి ఇక్కడ ఎప్పుడూ విలువ లేదు కాబట్టి ……"
  ఏం సూచిస్తున్నాయీ మాటలు.???
  తెలంగాణా నీళ్ళను, తెలంగాణా ఉద్యోగాలను, తెలంగాణా భూములను తేరగా అనుభవించే అవకాశాన్ని కోస్తా రాయలసీమ జిల్లాల వాళ్ళు ఎందుకు అంత సులువుగా వదులుకుంటారు.

  నిజమే మీరు అననట్టు "తెలంగాణా ప్రజాభిప్రాయానికి ఇక్కడ ఎప్పుడూ విలువ లేదు." తెలంగాణా ప్రజలది నిజాం కాలం నుంచీ అరణ్య రోదనే .
  అందుకే ఒకోసారి అనిపిస్తుంది ఇట్లాంటి నీతీ నిజాయితీ, న్యాయం ధర్మం లేని నికృష్ట రాజకీయాలకు నిజంగా కేసీఆర్ లాంటి వాడే సరైన "మొ…." సభ్యత అడ్డొస్తోంది సారీ.

 13. 14 సుజాత 6:21 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

  రాజన్న గారూ,మీ స్పందనకు ధన్యవాదాలు!

  సెటైర్లు ఎవరి మీదైనా రాయొచ్చు నవ్వుకోవడమే ఇక్కడ ప్రధానం కాబట్టి! కానీ మంత్రి పదవి రాలేదన్న ఒకే ఒక్క స్వార్థ పూరిత కారణంతో తెలుగు దేశాన్ని వీడిపోయి తెలంగాణా రాష్ట్ర సమితిని స్థాపించి ‘వేరే రాష్ట్రం” ఆశలు తెలంగాణా ప్రజలకు కల్పించిన చంద్ర శేఖర్ రావుకంటే తెలంగాణాకు జరిగిన అన్యాయానికి ఇతరులు ఎక్కువ బాధ్యత ఎందుకు తీసుకుంటారు? ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ తెలంగాణా పట్ల నిబద్ధత ఉన్న నాయకుడొక్కడూ ఇతర పార్టీల్లో లేరనీ, వారిదంతా ఎన్నికల స్టంటేననీ ఒప్పుకుంటాను. తెలంగాణాలో సీట్లకోసం చేసిన స్టంట్! మరి చంద్ర శేఖర్ రావు ది ఏ స్టంట్?

  ఎన్నికల ముందు రోజు ఒకరకంగా మాట్లాడతాడు, ఎన్నికల రోజు ఒకరకంగా, మర్నాడు మరో రకంగా, ఫలితాలొచ్చాక మరో రకంగా! ఏ రోజు ఒక్క మాట మీద నిలబడ్డారో చెప్పండి?

  ఏం సూచిస్తున్నాయీ మాటలు.???

  నా మాటలు సమైక్య వాదాన్ని సూచిస్తున్నాయి.నేను ఎప్పుడూ సమైక్యాంధ్ర వాదినే! కానీ తెలంగాణా ప్రజలంటే ద్వేషం లేదు. ఎవరి వాదాలు (నా సమైక్య వాదం నాకున్నట్లే)వాళ్లకుంటాయి కాబట్టి తెలంగాణా వాదుల వాదాన్ని నేను వ్యతిరేకించను.

  ఒక్క విషయమండీ! చైతన్యం రావలసింది తెలంగాణా ప్రజల్లో! నికృష్ట రాజకీయాలు మొదలుపెట్టిందే కె సి ఆర్ అయినపుడు ఆయన ఇక్కడేదో సాధిస్తాడని తెలంగాణా ప్రజలు అనుకున్నంత కాలం ఆయన తెలంగాణా రానివ్వడు.

  మీ హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో నిర్ణయించుకోవలసింది మీరే! కేసీ ఆర్ కాదు! ఇక్కడ సెటైర్ లోనూ అబ్రకదబ్ర చెప్పింది అదే! నిజాం కాలం నుంచీ అరణ్య రోదనే అని నిస్పృహ చెందకపోతే ఆనాటినుంచీ తెలంగాణా విముక్తి కోసం ప్రజలంతా కల్సి ఏం చేశాం,ఏం చేయగలిగాం అని ప్రశించుకోరేం?

  సెటైర్ కే సి ఆర్ మీదే కానీ తెలంగాణా మీద కాదు, తెలంగాణా ప్రజల మీద అంతకన్నా కాదు.

 14. 15 bonagiri 6:36 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

  కె సి ఆర్ కాంగ్రెస్ ఏజెంట్ అని నా అనుమానం.

 15. 16 Nutakki Raghavendra Rao 7:59 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

  Take it easy children…
  at least….
  దివ్వెల దీపోత్సవం మీ అందరి జీవితాల
  దివ్యకాంతి నింపాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ…
  ఆశీస్సులనందిస్తూ……మీ యందరి రాఘవేంద్ర

 16. 17 kcube 11:27 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

  రాజన్నగారికి మీ ప్రత్యుత్తరంలో నేను అన్న దన్నం మాటను వ్యంగ్యంగా తీసుకున్నారు. కానీ వాళ్ళ మోసకారితనాన్ని ఎండగట్టడానికే అలా అన్నాను. మా ఉత్తరాంధ్ర మీ మీ ప్రాంతాలన్నింటికంటే వెనకబడ్డది. మీకు హైదరాబాద్ కేంద్రంగా చాలా పరిశ్రమలైనా ఏర్పడ్డాయి. అక్కడికే పోయి మా వాళ్ళు వలస కూలీలుగా బ్రతుకుతున్నారు.ఐ.టీ.అభివృద్ది పేరుతో అక్కడే అన్ని కంపెనీలకు అవకాశమిచ్చారు. మరి విమానాశ్రయం, నౌకాశ్రయ కేంద్రం కూడా కలిగిన విశాఖ ప్రాంతం ఏమి నేరం చేసింది? ప్రాంతాల మద్య అసమానతలను రూపుమాపేందుకు ఒక్కడు కృషిచేయడు. ఎవడికి వాడు మన బలహీనతలనుపయోగించుకొని బిలియనీర్లవుతున్నారు. వీరి మోసాల్ని ఎండగట్టి ప్రజల చైతన్యంతొ ఏదైనా సాధించగలం. కోట్ల రూపాయలతో నిర్మించిన తెలంగాణా భవం వారి సొంత అడ్డాగా ఉపయోగించుకొని ఎలెక్షంస్ నాడు సీట్లు అమ్ముకునేందుకు వాడుకుంటున్నారు. అన్ని పార్టీలు మోసగిస్తున్నాయి కాబట్టే ప్రజలే ముందుకు రావాలి ఆ దిశగా ఉద్యమాన్ని నడిపేందుకు మేధావి వర్గం కృషిచేయాలి. లాబీయింగ్ ద్వారా కాంట్రాక్టులు పొందవచ్చుగానీ తెలంగాణా కాదు. మీ ఆవేదన తెలియక కాదు. సుదీర్ఘంగా జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాల స్ఫూర్తితో ఎందుకు ప్రజలు కదలడంలేదు. వారి సామాజిక చైతన్యం ఏమైంది. ఎన్నికల రాజకీయాల వెంట ఎందుకు పరుగులుపెడుతున్నారు. ఈ ఖాళీలకు ఆస్కారం ఎలా కలిగింది? కెరీరిజం వెనకే యువత వెల్లడానికి కారణాలేంటొ? వీటికి సమాధానాలను ఎవరైనా చెప్తారా?

 17. 18 అబ్రకదబ్ర 11:59 ఉద. వద్ద అక్టోబర్ 16, 2009

  @రాజన్న:

  >> “తెలంగాణా అంశం పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు మీద సేటైర్లు రాయరేం?”

  సెటైర్లతో కాదు, అంతకన్నా సూటిగానే విరుచుకుపడ్డాను – పోయిన ఏప్రిల్‌లో – తెలంగాణలో ఎన్నికలవగానే ఆంధ్రా, సీమ వాసుల్ని రెచ్చగొట్టిన వైఎస్‌మీద, ఆషాఢభూతం అంటూ. బహుశా మీరది చదివుండరు.

  >> “నిజంగా మీరు తెలంగాణా వాదం పట్ల సానుబూతితోనే కేసీఆర్ మీద సే టైర్లు రాస్తున్నారా?”

  తెలంగాణవాదం పట్ల సానుభూతితో రాయటం లేదు. వాళ్లకి నా సానుభూతితో ఒరిగేదేమీ ఉండదు. నేను రాస్తున్నది కేసీయార్ వేషాల మీద విసుగుతో.

 18. 19 V. Rajanna 1:08 ఉద. వద్ద అక్టోబర్ 18, 2009

  సుజాత గారూ, Kcube గారూ, అబ్రకదబ్ర గారూ,

  ఇవాళ తెలంగాణాకు సంబంధించినంత వరకూ… సమైక్య వాదం… అంటే ” అన్యాయం చేసేవాళ్ళూ – అన్యాయానికి గురయ్యే వాళ్ళూ కలసి మెలసి వుండాలనీ ; తెలంగాణా వనరుల, నీళ్ళ , ఉద్యోగాల దోపిడీ శాశ్వితంగా కొనసాగాలనీ ” వాదించడమే!!!

  సమైక్య వాదులు గా మీరు కేసీఆర్ మీద విసిరే రాయి తెలంగాణా ప్రజల ఆకాంక్షను దెబ్బతీసేందుకు కూడా ఉద్దేశించ బడిందని అనిపిస్తోంది.
  ఇప్పుడు సమైక్యవాదమంటేనే మాకు ఎలర్జీ .. !!!

  బాలగోపాల్ గారు తెలంగాణా ప్రజల సమస్యలపట్ల మెజారిటీ కోస్తా, రాయలసీమ ప్రజలకు అవగాహన లేదని ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ హరగోపాల్ వంటి తెలంగాణా మేధావుల చేత రాయలసీమ, కోస్తా ఆంధ్ర పట్టణాల్లో మనవ హక్కుల వేదిక తరఫున అనేక ఉపన్యాసాలు ఇప్పించారు. అంతటి ఔన్నత్యమ్ అందరినుంచీ ఆశించలేం అనుకోండి!

  అయినా ఇక్కడ రెండు మూడు అంశాలు ప్రస్తావించడం అవసరం అనుకుంటున్నాను.
  1) చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్టు 1969 లో విద్యార్ధులు ప్రారంభించిన ప్రత్యెక తెలంగాణా ఉద్యమంలో మధ్యలో ప్రవేశించి మర్రి చెన్నారెడ్డి మొత్తం ఉద్యమాన్ని హైజాక్ చేసాడు. అట్లాగే ఇటీవలి “తెలంగాణా జనసభ” వంటి సంఘాలు ఎన్జీవోలు, తెలంగాణా కళాకారులు రచయితలూ ప్రారంభించిన ఉద్యమంలో కేసీఆర్ కూడా అట్లాగే మధ్యలో ప్రవేశించి ఉద్యమం పై తన పట్టు బిగించాడు. ఇద్దరూ ఎంత స్వార్ధ పరులైనప్పటికీ వాగ్దాటిలో, రాజకీయ చతురతలో , సామాన్య ప్రజలను మెస్మరైస్ చేయడంలో దిట్టలు. అందుకే నిజాయితీ పరులైన అనేక మంది నేతలని వెనక్కి నెట్టి ఉద్యమాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అంతే తప్ప కేసీఆరే తెలంగాణా ఉద్యమాని ప్రారంభించారని చెప్పడం శుద్ధ తప్పు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వక పోవడం తోనే ఈ తెలంగాణా సమస్య అంతా వచ్చి పడ్డట్టు అతనికి ఓ మంత్రి పదవి పడేస్తే ఈ ప్రత్యెక తెలంగాణా గొడవే ఉండేది కాదన్నట్టు భావించడం, ప్రచారం చేయడం అవగాహనా రాహిత్యం లేదా ఒట్టి దగా, మోసం, కుట్ర, మూర్ఖత్వం, పిచ్చితనం. ప్రజల్లో ఆ ఆకాంక్షను కేసీఆర్ రగిలించలేదు. అతనే ఆ ఆకాంక్ష తో లబ్ది పొందాడు. ప్రత్యెక తెలంగాణా తెలంగాణా ప్రజల యాభై సంవత్సరాల ఆరని జ్వాల.

  2 ) ప్రత్యెక తెలంగాణా ఆకాంక్ష ఇంత బలంగా ప్రజల్లో ఉండటానికి కారణం కేవలం వెనుకబాటు తనం, అభివృద్ది లేమి కాదు, తెలంగాణా అస్తిత్వం మీద నిరంతరం జరుగుతున్న దాడి, తెలంగాణా వనరులను, నేలను, నీళ్ళను, ఉద్యోగాలను దోచుకుంటున్న దుర్మార్గం.

  3) తెలంగాణా ప్రజల హక్కుల్ని తెలంగాణా ప్రజలే కాపాడుకుంటారు, అందుకు వాళ్ళే పోరాడతారు. మీరు సానుభూతి తెలపడం సంఘీభావం ప్రకటించడం లేదా వ్యతిరేకించడం అనేది మీ ఇష్టం .

  4) ప్రజా ఉద్యమాలు ఎట్లా నడవాలో మేధావులు నిర్దేశించలేరు. కానీ ప్రజల్లో ఆకాంక్ష బలంగా ఉన్నంత కాలం ఉద్యమం ఎన్నటికీ మరణించదు. అంతిమ విజయం తెలంగానదే .

  5) ఉద్యమానికి కేసీఆర్ ఏదో ద్రోహం చేస్తాడని, దాంతో ప్రత్యెక తెలంగాణా ఊసే ఉండదని సమైక్య వాదులు భ్రమలు పెంచుకోవద్దు. ఇవాళ అతను ఎన్ని తప్పులు చేసినా ఉద్యమాన్ని గల్లీ నుంచి ధిల్లీ దాక తీసుకుపోయిన ఘనత అతనిదే. రేపు ద్రోహం చేస్తే తెలంగాణా ప్రజలు కచ్చితంగా ఊరుకోరు. ఉద్యమం అతనితో అన్తరిన్చదు. ఇది తధ్యం.

  చివరగా ఒక కాళోజీ కవిత :

  దోపిడి చేసే ప్రాంతేతరులను
  దూరం దాకా తన్ని తరుముతం
  ప్రాంతం వాడే దోపిడి చేస్తే
  ప్రాణంతోనే పాతర వేస్తం
  దోస్తుగ ఉండే వారితొ మేమును
  దోస్తే చేస్తం – ప్రాణమిస్తం
  ఎంతకు అంత అన్న ధోరణితో
  చింతమాని బ్రతుకును సాగిస్తం
  తెలంగాణమిది – తెలంగాణమిది
  తీరానికి దూరాన వున్నది
  ముంచే యత్నం చేస్తే తీరం
  మునుగును తానే – మునుగును తప్పక
  -కాళోజి

  • 20 కె.మహేష్ కుమార్ 3:10 ఉద. వద్ద అక్టోబర్ 18, 2009

   @రాజన్న: తెలంగాణా ఉద్యమం నిజంగానే ప్రజాఉద్యమమైననాడున ఎవరూ దాన్ని వ్యతిరేకించరు. తెలంగాణా ప్రస్తుతానికి ఒక లత్తుకోరు రాజకీయ నినాదం. కొందరు మాత్రమే లబ్ధిపొందడానికి ఆడుతున్న ఒక మతిలేని రాజకీయపు ఆట. కాబట్టి, దానికి ఇంతకన్నా “గౌరవం” ఎవరూ ఇవ్వలేరు.

 19. 21 తాడేపల్లి 3:15 ఉద. వద్ద అక్టోబర్ 18, 2009

  మౌనంగా కాలగర్భంలో కలిసిపోతున్న నినాదం గుఱించి మనలో మనకి వివాదమెందుకు ?

 20. 22 raman 9:10 ఉద. వద్ద అక్టోబర్ 18, 2009

  రాజన్న గారూ,

  ఇవాళ సమైక్యవాదులకు సంబంధించినంతవరకూ… తెలంగాణ వాదం.. అంటే తమ నాయకుల చేతగానితనానికి ఎవరిమీదనో పడి ఏడవటం, యాభయ్యేళ్లుగా ఉమ్మడి సొమ్ముతో రాజధానికి చేసిందంతా తామొక్కళ్లే దోచుకుపోవాలనుకోటం!!!!

  తెలంగాణవాదులుగా మీరు తెలంగాణేతరులమీదకి విసిరే రాళ్లు తెలంగాణతో ఏ సంబంధం లేని వాళ్లని కూడా నొప్పించాటానికి ఉద్దేశించినట్లు ఉన్నాయ్. అందుకే ఇప్పుడు తెలంగాణవాదమంటే మాకు అసహ్యం!!!!

  మాట్లాడితే తెలంగాణ చరిత్ర గొప్పదనం గురించెత్తుతారు. ఉత్తరాంధ్ర కాళింగులకి చరిత్ర లేదా? రాయల సీమకి చరిత్ర లేదా? ఎవరి చరిత్ర వాళ్లకి గొప్ప. తెలంగాణ సమస్యల పట్ల వేరేచోట్ల ఉపన్యాసాలు ఇప్పించటానికి మీకు మొన్నటిదాకా బాలగోపాల్ ఉన్నాడు. ఉత్తరాంధ్ర, రాయలసీమ సమస్యల గురించి తెలంగాణలో, ముఖ్యంగా రాజధానిలో గొంతు చించుకోటానికి ఎవరున్నారు? మీకుందా అంతటి ఔన్నత్యం?

  ‘కేసిఆర్ ద్రోహం చేస్తే పాతరేస్తం’ అన్నారే, ఆ పని తెలంగాణ ప్రజలు ఇప్పటికే రెండు ఎన్నికల్లో చేశారు. మీరది గమనించకుండా ఏదో ఊహాలోకంలో ఉన్నట్లున్నారు. కాళోజీ గారి కవితాలోకంలో బ్రతకటం కాకుండా బయటికొచ్చి వాస్తవాలు గమనించండి.

 21. 23 చదువరి 9:11 సా. వద్ద అక్టోబర్ 20, 2009

  “..అమ్మ కడుపు చల్లగా, రోజుకో కొత్త జోకు పేలుస్తూ..” – 🙂

 22. 24 ravigaru 3:06 ఉద. వద్ద అక్టోబర్ 21, 2009

  తెలంగాణా రాగానే అమాంతం అభివృద్ధి లోకి ఎలా దూసుకు పోతుంది?ఇన్నాళ్ళు జరిగింది అభివృద్ధి కాదా?చార్మినారు నిర్మాణానికి రాలేత్టిన కూలీలు ఆంధ్ర వాళ్ళు కాదా?తమ రాజధాని అని అక్కడనుంచి వలసొచ్చి ,అక్కడ అండి అండీ అని గౌరవానికి అలవాటు పడి ఇక్కడ రిక్షా వాడు కూడా ఎక్కడకి తోలుకు పోవాల ?అని ఏక వచనం లో మాట్లాడినా నోరుమూసుకుని హైదరాబాద్ ని నిర్మిస్తే ఇది మాదీ, దొబ్బెయ్యి బొంద పెడతా అంటే మల్లి ఏ విజయవాడ కో పోయి మళ్ళి రెడొచ్చే మొదలాడు చందాన నిర్మిస్తే అక్కడ మళ్ళి కోస్తా ఆంద్ర రాష్ట్రము కోసం మా ప్రాణాలు పణం గా పెడతా మంటూ ఇంకో వుద్యమం మొదలైతే శ్రీకాకుళం పొతే మళ్ళి చరిత్ర repeat అయితే యి కధకి అంతం లేదా? కాబట్టి వొకే ఇంట్లో వుండే కుటుంబసబ్యులకే బెధాభి ప్రయాలు తప్పవు కాబట్టి తెలుగు మాట్లాడే వళ్ళంతా వొకే రాష్ట్రము లో వుండాలి రాజన్న గారు జరా సోచాయించండి తండి దిమాక్ తోని .


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: