జజ్జనకరి జనారే

రాష్ట్ర కాంగిరేసు శాఖలో రాజకీయ కాక రాజుకుంది. వినాయక నిమజ్జనం ముందరేసిన ముసురు విజయదశమికి ముసలం రూపుదాల్చింది. దీపావళి నాటికిది దిక్కులు పిక్కటిల్లేలా పేలుతుందో లేక తుస్సుమంటుందో వేచి చూడాల్సిన విషయం. ఈ పరిణామాలెటు దారితీసినా, ప్రజానీకానికి మాత్రం పండగల సందర్భంగా కావలసినంత కాలక్షేపం. కాంగిరేసులో ఈ స్థాయి సందడి చూసి ఎన్నేళ్లయిందో. ప్రజలేనాడో మర్చిపోయిన ముఖాలెన్నో ఇన్నేళ్లకి మళ్లీ గజ్జె కట్టి జనాభీష్టం పేరుతో జజ్జనకరి జనారే అంటూ రెచ్చిపోయి చిందులేస్తుంటే చూట్టానికి రెండు కళ్లూ చాలటం లేదు. జగనన్నకి పట్టాభిషేకం చెయ్యాల్సిందేనంటూ బల ప్రదర్శనలు, బస్సు దహనాలు, బ్యానర్ల చింపుళ్లు, బెదిరింపులు, బుజ్జగింపులు, భజనలు .. అబ్బో ఒకటా రెండా. దిష్టిబొమ్మల దహనాలు, రాస్తారోకోలు సైతం జరుగుతున్నాయి. మొత్తమ్మీద – అటూఇటూగా మనవాళ్లకి తెలిసిన నిరసన ప్రక్రియలన్నీ రంగంలోకి దిగిపోయాయి. మిగిలింది బందులొక్కటే. రేపోమాపో అవీ మొదలవచ్చు. కొందరు భజంత్రీగాళ్లు అధినేత్రి ఫోటోకి అవమానం జరిగిన ప్రదేశాల్లో గోపంచకంతో శుద్ధి చేయటం, శాంతులు జరిపించటం వంటి చిత్ర విచిత్రమైన ఆలోచనల్ని అమల్లో పెడుతున్నట్లు ఇప్పుడిప్పుడే వచ్చిన వార్త. మత పార్టీగా ముద్రపడ్డ ఒకానొక జాతీయ పార్టీ కూడా ఇంత శాస్త్రోక్తంగా నడపబడదేమో!

జగనన్నని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలన్నది ఎనిమిది కోట్ల ఆంధ్రుల ఏకైక ఆకాంక్ష. వాళ్లకి ఏ ఇతర ఆశలూ, ఆశయాలూ, సమస్యలూ లేనే లేవు. జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రవుతాడోనని ఎదురు చూడటం తప్ప వాళ్లకి వేరే పనీ పాటా కూడా లేదు. ఇది ‘సాక్షి’ సర్వేలు నిగ్గు తేల్చిన నిజం – జనం సొమ్ముతో పెట్టిన పత్రిక జనాభిప్రాయం విషయంలో నిక్కచ్చిగానే వ్యవహరిస్తుందనుకోవాలి. అన్ని కోట్లమంది కోరిక ఉన్నపళాన తీర్చటం కాంగిరేసు అధిష్టానం కర్తవ్యం. ఆ బాధ్యత మరచినందునే రాష్ట్రంలో ఈ అలజడి. దానివల్ల అక్కడక్కడా ప్రజలక్కలిగే ఇబ్బందుల గురించి మనం మాట్లాడరాదు. జగనన్నని ముఖ్యమంత్రిగా చూడాలంటే ఆ మాత్రం త్యాగాలకి రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉండాలి. అసలు, పక్షం రోజులుగా లక్షలాది మందికి లభిస్తున్న వినోదాన్ని గమనిస్తే కొన్ని వందల మందికే పరిమితమైన ఇబ్బందుల ప్రస్తావన ఎంత అనుచితమో అర్ధమవుతుంది. దశాబ్దమున్నరగా పండగ పూట టీవీల్లో ఎడతెరిపిలేని సినిమాలు, మధ్య మధ్యలో తారామణుల శుభాకాంక్షల రొటీన్ రొడ్డకొట్టుడు భాగవతాలకి మొహమ్మొత్తి విభిన్న కార్యక్రమాల కోసం మొహం వాచిపోయిన ప్రేక్షక సమూహానికి ఇన్ని హాస్య ప్రహసనాలు ఉచితంగా అందిస్తున్నందుకు కాంగీ కేతిగాళ్లకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.

జగనన్నని పీఠమెక్కించే మహాయజ్ఞానికి రాజమండ్రిలో రెండు బస్సమిధలు ఆహుతయ్యాయి. మరీ రెండు బస్సులేనా! ఎంత అవమానకరమైన విషయం? తెలుగువాడి పరువేం కావాలి? సెగ ఢిల్లీదాకా తగలాలంటే అధమం రెండొందల బశ్శకటాలన్నా తగలబడాల్సిందే. ఆర్టీసీకి అన్ని బస్సులు దానం చేసే సత్తా లేకుంటే జేసీ దివాకరుని బస్సుల్నైనా వాడాల్సిందే. తగ్గనే కూడదు. అవసరమైతే, భవిష్యత్తులో కాంగిరేసు కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం తగలబెట్టటానికి వీలుగా రాష్ట్రంలోని ప్రతి బస్సు డిపోలోనూ కనీసం నాలుగు బస్సుల్ని సదా సన్నద్ధంగా ఉంచేలా ఆర్టీసీ చట్టాన్ని సవరించాలి. ఈ మహోన్నత చర్యల్ని అడ్డుకునే పోలీసు భటుల్ని ఉద్యోగాల నుండి ఊడబెరకాలి. పనిలో పనిగా నిరసన మంత్రిత్వ శాఖనొకదాన్నేర్పాటు చెయ్యాలి. పిడకలు, దిష్టిబొమ్మలు, కిరోసిన్ డబ్బాలు వగైరా సామాగ్రికి అవసరమైన నిధులు దండిగా కేటాయించాలి. నిరసనల కోసం ప్రభుత్వ సొమ్ముతో కాంగిరేసు కార్యకర్తలకి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలి. ఇందిరమ్మ పధకంలో భాగంగా నిర్మాణమైన ఇళ్లలో కొన్నిట్ని నిరసనల్లో నిప్పెట్టటానికి విడిగా కేటాయించాలి. నిరసనల్లో భాగంగా తన్నుకున్న కార్యకర్తలకీ ఆరోగ్యశ్రీ కవరేజ్ కల్పించాలి.

పైదంతా చదివి ‘అయితే సందడంతా ఒక వర్గానిదేనా’ అంటే కానే కాదన్నది సమాధానం. మొదట్లో మౌనంగా ఉన్న వైరి వర్గీయుల గళాలూ క్రమంగా బలం పుంజుకున్నాయి. పైకి, వాళ్ల తరపున హడావిడి తక్కువే కనిపిస్తున్నా, నిజానికి హైకమాండ్ వద్ద పారుతుంది వాళ్ల పాచికలే. ఆయా వర్గాలు ఎవరి గొడవలో వాళ్లు మునిగితేలుతుంటే గప్‌చుప్‌గా తనపని తాను చేసుకుపోతున్నారు గడుసరి రోశయ్యామాత్యుల వారు. అలనాడు కేంద్రంలో పీవీ ఏకులా వచ్చి మేకైన రూపకం రాష్ట్రంలో రోశయ్య రూపంలో మళ్లీ రక్తి కట్టనుందేమో భవిష్యత్ చరిత్రే చెప్పాలి. ప్రస్తుతానికైతే అంతా గందరగోళం. ఈ గందరగోళంలో ఎటూ తేలని, తేల్చుకోని ముచ్చటైన మూడో వర్గమూ ఒకటుంది. ఎటో ఒకటు తేలితే ఎక్కడ మునుగుతామోనన్న భయం వీళ్లది. వీళ్ల సందడీ తక్కువేం లేదు. అధిష్టానానిదే తుది నిర్ణయం అనొకసారి, తమకి అనుకూలంగా ఆ నిర్ణయం లేకపోతే రాజీనామా చేస్తామనొకసారి, అలా అననే లేదని మరోసారి, ఆ అర్ధంలో అనలేదని ఇంకో సారి .. ఇలా గంటకో రకంగా మాట్లాడుతున్న ఈ గోపీ వర్గం నేతల మాటల్లో గూఢార్ధాలు అంతుపట్టక జుట్టు పీక్కుంటున్న అమాయకులు కొందరున్నారు. కాంగీయుల తీరే అంతని అర్ధం చేసుకోవటం ఏమంత కష్టం? ఏ ఇతర పార్టీలోనూ కనరాని వాక్కు స్వాతంత్రం కాంగిరేసు సొంతం. టీవీ కెమెరాల ముందు చిత్తమొచ్చినట్లు వాగి చిద్విలాసంగా నడిచిపోవటాన్నే వాక్‌-స్వాతంత్రం లేదా వాగు స్వాతంత్రం అందురని సీపీ బ్రౌన్ నిఘంటువువాచ. తసమదీయులు దాన్ని చిత్త చాంచల్యం అని ఈసడించొచ్చుగాక, అసమదీయులకి మాత్రం అదే అంతర్గత ప్రజాస్వామ్యం. ఏ ఎండకా గొడుగు పట్టటం సగటు కాంగీయుడి నైజం కాదు. ఏ పుట్టలో ఏ పాముందో, ఎటు పోయి ఎటొస్తుందో అనుకుంటూ ఏక కాలంలో అన్ని గొడుగులూ పట్టుకోటమే అతని గుణం. అదే కాంగిరేసు మార్కు రాజకీయం. ఆ తరహా రాజకీయ జాతరే ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తుంది. అనవసరపు ప్రశ్నల్తో బుర్ర బద్దలుకొట్టుకునే బదులు తిరునాళ్లు సాగినన్నాళ్లూ ఆనందించటం తెలివిగలవాడు చేసే పని. తలాతోకా లేని తెలుగు సినిమాలెన్నిట్నో పిచ్చి ప్రశ్నలెయ్యకుండా చూట్టంలా? ఇదీ అంతే.

23 స్పందనలు to “జజ్జనకరి జనారే”


 1. 2 Pradeep 2:33 సా. వద్ద సెప్టెంబర్ 29, 2009

  నిజమే … చాలా కాలం తర్వాత ఇల్లాంటివి చూస్తున్నాము …

 2. 3 కె.మహేష్ కుమార్ 9:33 సా. వద్ద సెప్టెంబర్ 29, 2009

  మొత్తానికి కాంగ్రెస్ సాధారణస్థితికి వచ్చి చేరిందన్నమాట!

 3. 5 VenkataRamana 11:06 సా. వద్ద సెప్టెంబర్ 29, 2009

  వ్రాసిన విధానం బాగుంది. కాంగెస్ వాళ్లకి అన్నీ అతికినట్లు సరిపోయాయి.

 4. 6 చైతన్య.ఎస్ 11:47 సా. వద్ద సెప్టెంబర్ 29, 2009

  నేను సైతం జగను కోసం బస్సునొక్కటి ఆహుతిచ్చాను ….

 5. 8 బ్లాగాగ్ని 12:00 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  >>ఆర్టీసీకి అన్ని బస్సులు దానం చేసే సత్తా లేకుంటే జేసీ దివాకరుని బస్సుల్నైనా వాడాల్సిందే
  🙂
  @ Chaitanya.S
  🙂 🙂

 6. 9 సుజాత 1:52 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  అబ్బ, కాంగ్రెస్ ని ఇలా కో స్టేటస్ లో అనగా పత్రికా భాషలో యధా పూర్వ స్థితిలో చూసి ఎన్నాళ్ళయిందో!

  అదిసరే, నాకో సందేహం! ఎవరైనా సరే తెలిస్తే చెప్పండి. అధిష్టానం…అదే హై కమాండ్ అంటే ఏమిటి? కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీనా? కేంద్రంలో ఉన్న ప్రభుత్వమా? పార్లమెంటరీ పార్టీ అయితే ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోడానికి మిగతా రాష్ట్రాల ఎం పీలకు అధికారం ఉంటుందా? ఉండదా? అధిష్టానం ఎక్కడ ఉండును? ఢిల్లీలోనా?

  అధిస్ఠానం లో ఎవరెవరు ఉందురు? ఒక రాష్ట్ర ముఖ్య మంత్రిని శాసన సభ్యులు ఎన్నుకుంటారా? ఎక్కడుంటుందో తెలీని అధిష్టానమా?

  అసలీ అధిష్టానం అనేది కాంగ్రెస్ కే పరిమితమా?

 7. 10 వెంకట గణేష్ వీరుభోట్ల 3:00 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  చాలా బాగా వ్యంగ్యంగా వ్రాసారు. బాగుంది.

 8. 11 gopalkoduri 3:55 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  బాగా రాశారు బాసు! వెటకార చమత్కారం చూసి చాలానాళ్ళయింది 🙂

 9. 12 చైతన్య కృష్ణ పాటూరు 7:02 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  ఎంటీవోడు పార్టీ పెట్టకముందు కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఎలా వుండేవో అనుకునే నాలాంటి వాళ్ళ కోసం పాత సీరియల్ కొత్త నటులతో మళ్ళీ ప్రసారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.

 10. 13 తాడేపల్లి 7:33 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  అధిష్ఠానం అంటే high command. That is the highest policy-making and decision-making body of a party. అధిష్ఠానమంటే కేంద్రప్రభుత్వం కాదు. ప్రతిపార్టీకి ఒక అధిష్ఠానం ఉంటుంది. లోక్ సత్తాకి, తెలుగుదేశం పార్టీతో సహా ! కాంగ్రెస్ కి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ మఱియు వర్కింగ్ కమిటీలు అధిష్ఠానం. తెలుగుదేశానికి టి.డి.పి పొలిట్ బ్యూరో అధిష్ఠానం.

 11. 14 చైతన్య.ఎస్ 8:07 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  అధిష్టానం జన్ పథ్- 10 లో ఉండును

  సోనియా, సోనియా-2(సోనియా మనుమరాలు), సోనియా-3(సోనియా ముని మనుమరాలు) … అప్పుడు , ఇప్పుడు, ఎఫ్ఫుడు వీళ్ళే అధిష్టానం లో ఉందురు

 12. 15 తాడేపల్లి 9:06 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  సి.ఎమ్.లుగా ఉన్నవాళ్ళకి ఇతరరాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఏ విధమైన అధికారమూ లేదు. అయితే వాళ్లు ఒక జాతీయపార్టీ యొక్క అధిష్ఠానంలో భాగమైనప్పుడు అధిష్ఠానం తరఫున అలా జోక్యం చేసుకోవచ్చు.

  రాజ్యాంగం ప్రకారం సి.ఎమ్.ని శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) అంతా కలిసి ఎన్నుకోవాలి. కానీ పార్టీ ప్రజాస్వామ్యంలో శా.స.లకి ఆ అవకాశం ఉండదు. అధిష్ఠానం ఎవరిని ఎన్నుకోమంటే వారిని ఎన్నుకోవాల్సి వస్తుంది. లేకపోతే పార్టీ వ్హిప్ ని ధిక్కరించిన నేరానికి పార్టీలోంచి వెళ్ళగొట్టడమే కాకుండా శా.స. పదవిని కూడా ఊడబీకి ఆ నియోజకవర్గానికి కొత్తగా ఎన్నికలు జఱిపిస్తారు. కనుక ఆ భయంతో శా.స.లు ఇష్టమున్నా లేకపోయినా అధిష్ఠానం చెప్పిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు.

 13. 17 అబ్రకదబ్ర 9:38 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  అలా చూస్తే, విప్‌లు అనుమతించటం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందనిపిస్తుంది. విప్‌ల అసలు ఉద్దేశం పార్టీల హక్కుల్ని కాపాడటం, వ్యతిరేక ధోరణుల్ని అరికట్టటం కావచ్చు.

  నిజానికి, మెజారిటీ శాసన సభ్యులు జగన్‌నే కోరుకుంటే రాజ్యాంగం ప్రకారం అతన్నే ముఖ్యమంత్రిని చెయ్యటం న్యాయం. (శాసన సభ్యులు కానివార్నీ ముఖ్యమంత్రిని చేసే వెసులుబాటు రాజ్యాంగం ఇచ్చింది వేరే కారణాలతో. అన్నిట్లా అదీ దుర్వినియోగమవుతుంది). కానీ వాళ్ల అసలు లక్ష్యాలు, ఉద్దేశాలు వేరే కాబట్టే ఆ ఆత్రాన్ని చీదరించుకోవాల్సొస్తుంది.

 14. 18 కన్నగాడు 9:55 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  నాకు రాజకీయ ఊహ తెలిసినప్పటీ నుండీ కాంగ్రెసు రాజకీయాల గురించి వినడమే గాని కన్నదిలేదు ఇప్పుడు ఆ మహద్బాగ్యం కలిగింది. 🙂
  మొన్నొకనాడు మా స్నేహితుడు రోశయ్య గురించి ఇలా అన్నాడు, “మీ సి.ఎమ్. పేరేంటి అంటే నారా చంద్రబాబునాయుడు అనో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అనో అంటే ఎంత బాగుంది, రోశయ్య.. రోశయ్య ఏందిరా అని”.

 15. 19 a2zdreams 10:00 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  2014లో చంద్రబాబుకు పోటీ ఇవ్వాలంటే జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యాలి. జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ కు 100% నష్టమే.

  జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే లాభమో నష్టమో తెలుసుకోవడం కోసమైనా జగన్ ను ముఖ్యమంత్రిగా చెయ్యాలి.

 16. 20 తాడేపల్లి 10:22 ఉద. వద్ద సెప్టెంబర్ 30, 2009

  జగన్ ని ముఖ్యమంత్రిని చెయ్యకపోతే ఒక్క ఆంధ్రరాష్టంలో మాత్రమే కాంగ్రెస్ చంకనాకిపోతుంది. చేస్తే దేశవ్యాప్తంగా చంకనాకిపోతుంది. ఆ వారసత్వ ప్రయోగాలు మేమూ చేస్తామని అన్ని రాష్ట్రాల్లోను స్థానిక కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమాలు ఊపందుకుంటాయి. అధిష్ఠానం దేశం మీద పట్టుకోల్పోతుంది. అదొక Bad precedent గా మారుతుంది. ఆ సంగతి కాంగ్రెస్ High Command కామందులకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు శాసనసభని రద్దు చెయ్యడానికీ, తెలుగుదేశాన్ని పీఠమెక్కించడానికీ సిద్ధమవుతారేమో గానీ జగన్ ని మాత్రం ఛస్తే రానివ్వరు.

 17. 21 sri 11:50 ఉద. వద్ద అక్టోబర్ 1, 2009

  మన జనాలు ఎంత ఎర్రి పప్పలు. వై.యెస్ ముఖ్యమంత్రిగా వున్న 5 సంవత్సరములలొనే 10000 వేల కొట్లు పైనె దిగ మింగిన వై.యెస్ జగన్ ను ఇప్పుడు ముఖ్యమంత్రిగా కావాలని అడుగుతున్నారంటె మన జనాలు ఎంత ఎర్రి పప్పలు.

  జనాలను మొసము చెయ్యవచ్చు నెమో కాని సర్వ వ్యాపకమైన భగవంతుని మొసము చెయ్యలేరు.

  అందుకె నెమొ, వై యెస్ జగన్ రెప్పపాటు కాలంలొ ముఖ్యమంత్రి కొడుకు టైటిల్ నుంచి ఒక సాధారణ యెం.పి టైటిల్ కి పడిపొయాడు.

  మచ్చుకు కొన్ని జగన్ చేసిన స్క్యాములు:

  Lanco Hills company got 100 acres prime land (10 crores per acre or more in value ) near hi-tech city and in turn invested in Sakshi news paper.
  Santa bio-tech got 250 acres prime land (acre 5 crores minimum) in return for investing in sakshi news paper.
  Matrix labs got 250 acres prime land (acre 5 crores minimum) in return for investing in sakshi news paper.

  Bramhani infrastructure & Indu infratech both got 200 acres near shamshabad airport(10 crores per acre) in return for investing in jagan cement factory.

  Dalmia cements got huge chunk of mines for investing in Jagan’s raghuram cements.

  Jagan was involved in many land settlements scams and fake APIIC notices to poor farmers.

  Jagan has stake in many Power projects that are all over India and are worth more than 50,000 crores.

  Gaali Janardhan reddy got hundreds of acres of Iron ores mines, worth more than 25,000 crores, and he pays govt only 100 or 150 crores for this ore as royalty fee. This guy even gifted rs 5 crores worth bullet proof bus to YSR and had stake in steel & cement factory of Jagan.

  Due to his father’s death, he is really afraid of loosing these huge assets that he looted using his father’s C.M position and hence he is craving to be the next C.M.

 18. 22 Srinivas Vangala 4:00 ఉద. వద్ద అక్టోబర్ 8, 2009

  Except Sakshi,who keeps telecasting the greatness of YSR and his son Jagan,all the other TV channels are busy with floods. Andhrajyothy slowly started planting seeds of discomfort in Jagan Camp by first publishing a story on how Rosayya is planning to sack Konda Surekha and Co, and followed it by publishing a story today that Income tax department served notices to Jagan owned companies and various investors.Sonia Gandhi does not encourage dynasty politics except in her case. If Rahul Gandhi is poised to become the PM of this grat nation in 2014 and screw it thoroughly,why can’t Jagan become the CM of AP and screw it faster?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: