పొదుపు మంత్రం పఠిస్తూ వాయు విహంగానికి బదులు వందిమాగధ సమేతంగా ధూమశకటంలో దేశాటనకి బయలుదేరిన రాహుల కుమారుల వారి రైలు డబ్బాలపై ఇద్దరు ఆకతాయి పోరగాళ్లు రాళ్లుచ్చుక్కొడితే ఐదు కిటికీల అద్దాలు బద్దలైపోయాయట. ఆ పిలగాళ్లెవరో దేవులాడుకు రమ్మని ప్రభుత్వం భక్షక భటుల్నీ, వారి జాగిలాల్నీ మరియు ఫోరెన్సిక్ నిపుణుల్నీ రంగంలోకి దించిందట! కిటికీ అద్దాల ఖర్చూ, కేసు దర్యాప్తు ఖర్చూ కలిసి తడిసి మోపెడైనట్లుంది. కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడటం అంటే ఏంటో అర్ధంగాని మందభాగ్యులెవరన్నా ఉంటే అది ఇదేనని ఉదాహరణగా చెప్పొచ్చిక. అయ్యవారు ఎప్పట్లా విమానంలోనే విహారానికేగుంటే ఎక్కువ పొదుపయ్యుండేది కాదూ?
* * * *
వారం రోజులుగా కేంద్ర ప్రభుత్వాధినేతలు పొదుపు కథలు పొడుస్తున్నారు. మహారాస్ట్ర ఎన్నికల సందర్భంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమే ఇదంతా అని యధావిధిగా ప్రతిపక్షాలు తమ ధోరణిలో తాము విసుర్లేస్తున్నాయి. వారి విమర్శలెలా ఉన్నా – మేడమ్ పిలుపునందుకున్న కాంగీయులు రెచ్చిపోయి బలినీ, శిబినీ మరిపించేలా విచ్చలవిడి త్యాగాలు చేసేస్తూ ప్రజల్ని మురిపిస్తున్నారు. అయితే వీళ్లందరూ కషాయాన్ని ఇష్టంగానే మింగుతున్నారనుకుంటే పొరపాటు పడ్డట్లే. సాక్షాత్తూ సోనియామ్మే విమానాల్లో సాధారణ తరగతిలో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నా, అక్కడక్కడా శశి ధరూర్ వంటి సాహసికులు తెగించి ‘అదొక పశువుల చావడి’ అని చీదరించేసుకుంటూ బయటపడిపోతున్నారు. మొత్తానికి, టీవీ ఛానళ్లకు మాత్రం కొన్నాళ్లకు సరిపడా సరుకు దొరికింది. అన్నాళ్లూ అమాయక వీక్షకులకు మేతే మేత, మోతే మోత.
ఈ సందర్భంగా, ఓ బాధ్యతాయుతుడైన భారత పౌరుడిగా, ఈ మహత్తర పొదుపు పధకానికి నేనూ ఐదారేడు సమిధలు ఆహుతివ్వదలచుకున్నాను. నావి ఉచిత సలహాలే కాబట్టి, పొదుపు వ్రత భంగం కలక్కుండా నిక్షేపంగా చదవొచ్చు, నచ్చితే పాటించొచ్చు.
1. ఆర్ధిక మాంద్యం దెబ్బకి బడా బడా కంపెనీలు ఉద్యోగస్తుల సంఖ్యని తగ్గించుకుంటున్నాయి. ప్రభుత్వమూ ఆ ఒరవడిని అందిపుచ్చుకోవాలి. మనకి ఐదొందల నలభై రెండు మంది పార్లమెంటు సభ్యులెందుకు? వారిలో సగం మందిని లే-ఆఫ్ చేసెయ్యాలి. అలా చేస్తే – వాళ్లకిచ్చే జీత భత్యాలు, వాళ్ల భద్రతకయ్యే దుబారా , వ్యక్తిగత సిబ్బందికయ్యే అదనపు ఖర్చు, ఎంపీ ల్యాడ్స్ వగైరా పేర్లతో ఒక్కొక్కరికీ మంజూరయ్యే కోట్ల రూపాయల నిధుల మొత్తం, టెలిఫోన్, వసతి, ప్రయాణాలు వగైరా సదుపాయాల పేరుతో అయ్యే వృధా ఖర్చు, ఇతరత్రా ఖర్చులు కలిసి ఒక్కో ఎంపీకీ అధమం ఏడాదికి పాతిక కోట్ల చొప్పున లే-ఆఫ్ ఐన అందరికీ కలిపి టోకున ఆరు వేల ఏడొందల కోట్ల రూపాయల పైచిలుకు ఆదా – ఒక్క దెబ్బతో! ఇవి కాక, వీళ్లకి పెన్షన్ల పేరుతో పెట్టే దండగమారి ఖర్చూ మిగులుతుంది. వీటన్నిట్నీ మించి, రెండొందల డెబ్భై స్థానాలు తక్కువవటం వల్ల ఎన్నికల వ్యయమూ కొన్ని వందల కోట్లు అదనంగా ఆదా. పార్లమెంటుతో సరిపెట్టకుండా, అన్ని రాష్ట్రాల శాసన సభల్లోనూ ఇలాగే పింక్ స్లిప్లు పంచాలి. ఎటూ హై-కమాండే అన్ని విషయాలూ చూసుకుంటుంది కాబట్టి, అప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందర్నీ ఊడబెరికితే మరింత సొమ్మాదా.
2. కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ పేరుతో రెండు చట్ట సభలెందుకు? రెంటినీ మెర్జ్ చేయాలి. అలాగే రాష్ట్రాల్లో విధాన సభ, విధాన మండలి మెర్జ్ చేసి పారేయాలి. మెర్జర్ సమయంలో అదనంగా ఉన్నారనుకున్నవారిని తీసేయాలి.
3. విమానాలకు బదులు రైళ్లలో ప్రయాణాలు చేసే ఆలోచన బాగానే ఉన్నా, అంతకన్నా చవకైన ప్రత్యామ్నాయాలు వాడే విషయం తీక్షణంగా పరిశీలించాలి. ప్రభుత్వ విధుల కోసం కార్లు, జీపుల వంటి పెట్రోలు ఆధారిత వాహనాల వాడకాన్ని నిషేధించాలి. ఎద్దుల బండ్లు, జట్కాలు, సైకిలు రిక్షాల వాడకాన్ని ప్రోత్సహించాలి. దేశంలో ఉన్న వేలాది మంది చట్ట సభల సభ్యులు పెట్రోలు వాడకం మానేస్తే అటు డబ్బూ ఆదా, ఇటు కాలుష్యమూ తగ్గుతుంది.
4. చట్ట సభల్లో మైకుల వాడకాన్ని నిషేధించాలి. బిల్లులపై చర్చలు రద్దు చేసి, చేతులు పైకెత్తటం/ఎత్తక పోవటం ద్వారా సభ్యులు బిల్లులపై వోటింగ్లో పాల్గొనేలా నియమావళి రూపొందించాలి. అప్పుడు కరెంట్ ఖర్చు పొదుపు. మైకులు కొనే పన్లేదు. ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి బల్లలు విరగవు, వాటికి రిపేర్లూ అవసరం పడవు. అన్నిట్నీ మించి – ఆ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు చూసి భావి భారత పౌరులు చెడిపోయే అవకాశం ఉండదు.
5. చట్ట సభల పని దినాలు తగ్గించే అవకాశాలు పరిశీలించాలి. వివిధ చట్ట సభల సమావేశాల్లో వాళ్లు చేసే పనికీ, రాబట్టే ఫలితానికీ – ఏడాదికి మూడో నాలుగో రోజులే సమావేశాలు జరిగినా మస్తుగా సరిపోతుందని ఒక అంచనా. కాబట్టి ఏడాదికి వారం రోజుల పాటే చట్ట సభలు సమావేశపరచాలి. పనిలేని రోజుల్లో సభ్యుల అపార అనుభవాన్ని వృధా చెయ్యకుండా, ఒలింపిక్స్లో స్వర్ణపతకాలు లక్ష్యంగా కుస్తీ, మల్లయుద్ధం, బాక్సింగ్, పోల్ వాల్ట్ వంటి క్రీడల్లో మెరికల్లాంటి ఆటగాళ్లను తీర్చిదిద్దటానికి వాడుకుంటే ఉభయతారకం.
6. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల విధానం ప్రకారం, చట్టసభల సభ్యులు మరణించిన సందర్భాల్లో ఉప ఎన్నికల పేరుతో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి చివరాఖరికి చేస్తున్న పని మృత సభ్యుడి కుటుంబం నుండే ఒకరిని ఆ స్థానానికి ఎన్నిక చెయ్యటమే. ఆ మాత్రానికి ఎన్నికలెందుకు – అనవసరపు ఖర్చు. చట్ట సభల సభ్యులు మరణిస్తే తిరిగి ఎన్నికలు జరపకుండా, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఆ స్థానాన్ని భర్తీ చేసేలా ఎన్నికల చట్టాన్ని సవరించాలి. ఐదేళ్లకొకసారి అధికార, ప్రతిపక్ష పార్టీల్ని అటూఇటూ చేసే అలవాటున్న తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఎన్నికలతో పనిలేకుండా ఐదేళ్లకోమారు ఆటోమేటిక్ అధికారమార్పిడిని చట్టబద్ధం చెయ్యాలి. అసలు – వీలైతే ఎన్నికల పద్ధతినే రద్దు చేసి దేశవ్యాప్తంగా చట్టసభల సీట్లని వేలం పాట ద్వారా నింపే పద్ధతి అమల్లోకి తేవాలి. ఎవరు ఎక్కువ మొత్తం చెల్లిస్తే వారినే పార్లమెంటు, అసెంబ్లీ సభ్యులుగా ఎంపిక చెయ్యాలి. ఆ రకంగా ప్రభుత్వ బొక్కసమూ నిండుతుంది, ఎన్నికల రణరంగాలుండవు, మద్యం ఏరులై పారటమూ ఉండదు. పనిలో పనిగా ఎన్నికల సంఘాన్ని రద్దు చేసి వేలాది ఉద్యోగాలకు కోత పెట్టి మరింత ఆదా చేయొచ్చు.
7. రబ్బరు స్టాంపులుగా, అలంకార ప్రాయాలుగా, పాతతరం నాయకుల పునరావాస కేంద్రాలుగా మారిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ పదవుల్ని రద్దు చేయాలి. రాష్ట్రపతి భవన్, వివిధ రాష్ట్రాల్లోని రాజ్ భవన్లని వచ్చినకాడికి తెగనమ్మి ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాల్లో జమచేయాలి.
8. చివరగా – జీతాల్లో కోత పెట్టుకునేందుకు కాంగీయులు ముందుకు రావటం ముదావహం. అదే ఊపులో, వివిధ కాంట్రాక్టుల్లో తమ వాటా ఆమ్యామ్యాలకూ పది శాతం స్వచ్ఛందంగా కోత పెట్టుకుంటే ప్రభుత్వానికి లెక్కలేనంత ఆదా అవుతుంది.
అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేసైనా, పై ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి తెస్తే దేశానికయ్యే ఆదా లక్షల కోట్లలోనే. ఎందుకాలస్యం?
first point excellent………
but how is it possible ? “వీటన్నిట్నీ మించి, రెండొందల డెబ్భై స్థానాలు తక్కువవటం వల్ల ఎన్నికల వ్యయమూ కొన్ని వందల కోట్లు అదనంగా ఆదా.”
for every village u should maintain booth.right?
Point 6 offers a solution 😉 ఎన్నికలే ఎత్తేస్తే సరి.
Good catch though.
hahhahhaha…..excellent……….తెలుగు మీద మంచి ఫట్టుతో……..కుమ్మేస్తున్నారు.
ముదావహం అనే పదానికి copyrights తీసుకున్నావా మరి ఉష గారి నుండి ..
good post
మీ సూచనలు కేక. ముందు వీళ్ళకు సెక్యురిటీ పీకేయాలి 🙂
పొదుపు అంటే, ఏ ఒక రూపాయో రెండు రూపాయలనో మాట్టాడాలి కానీ, ఇలా కోట్ల రూపాయలు ఆదా చేసే పథకాలు చెబితే ఏట్టాగమ్మా?
7″. రబ్బరు స్టాంపులుగా, అలంకార ప్రాయాలుగా, పాతతరం నాయకుల పునరావాస కేంద్రాలుగా మారిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ పదవుల్ని రద్దు చేయాలి. రాష్ట్రపతి భవన్, వివిధ రాష్ట్రాల్లోని రాజ్ భవన్లని వచ్చినకాడికి తెగనమ్మి ఆ సొమ్ము ప్రభుత్వ ఖజానాల్లో జమచేయాలి”.
అసలు ప్రభుత్వమే రద్దు చేసేసి పూర్వంలా ప్రతి పల్లె ,పల్లెలసముదాయమో స్వతంత్ర రాజ్యం లా చేసేస్కుని “బార్టర్ ” సిస్టం లోకి వెళ్ళిపోతే బాగుంటుంది..అప్పుడు అన్ని వృత్తులు ప్రోత్సహించబడి ఆర్ధిక సుస్థిరత కలుగుతుందేమో (బ్రిటిష్ వాళ్ళు రాక పూర్వ పరిస్థితిలోకి )..ఈ దిశగా రాజ్యంగా సవరణ కోరితే బాగుంటుంది ..
బ్రిటీష్ వాళ్లు రాక పూర్వం మన దేశంలో ప్రతిపల్లె ఒక రాజ్యమని మీకెవరు చెప్పారు ? ఆ కాలంలో ఉన్న భారతీయ రాజ్యాలు యూరోపులో ఉన్న రాజ్యాల కంటే భూవిస్తీర్ణంలోను, జనాభాలోను చాలా పెద్దవి. ఉదాహరణకి నిజామ్ రాజ్యం UK కంటే పెద్దది. సిరాజుద్దౌలా పరిపాలిస్తున్న బెంగాల్ రాజ్యం జర్మనీ కంటే పెద్దది. మైసూర్ మహారాజావారి రాజ్యం ఇటలీ కంటే పెద్దది. మహారాష్ట్ర పీష్వాల రాజ్యం కూదా జర్మనీ కంటే పెద్దది.
తాడేపల్లిగారూ, ఈ పాపం/పుణ్యం మన విద్యావిధానానిది. చిన్నప్పుడు ప్రాధమికస్థాయి పాఠ్య పుస్తకాలలో మ్న రాజ్యం బ్రిటిష్ పాలనకు మునుపు వేల కొద్దీ చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని నేను కూడా చదువుకున్నాను.
రాజకీయ నాయకులకు అసలు ఎకానమీ క్లాస్ అయినా సరే – విమానాల్లో వెళ్ళనివ్వ కూడదు. వాళ్ళ వాళ్ళ నియోజక వర్గాలకు – ట్రైన్ లోనే పొమ్మనాలి. మీరన్నట్టు రాజకీయ నాయకుల రక్షణ ని తీసేసి, పోలీసుల్నీ, రక్షక భటుల్నీ, వీధుల్లో, జనం మధ్యకు తీసుకు రావాలి. అప్పటికయినా – ఎన్నికలు ప్రతీ 8 సం || లకోసారి నిర్వహించాలి. For MPs – పార్లమెంటు సెషన్ కి రానివాళ్ళకి జీతం కట్ చెయాలి. వచ్చినా ప్రశ్నలు లేనివాళ్ళకీ, జీతం కట్ చెయ్యొచ్చు.
రాహుల్ గాంధీ రైలు ప్రయాణం – సెక్యూరిటీ ప్రాబ్లంస్ – సాటి ప్రయాణీకులకి కలిగిన అసౌకర్యాన్ని దృష్టి లో ఉంచుకుని, ఆయనని ఎక్కడికీ తిరగనీయకూడదు. వెళ్తే, మారువేషం వేసుకొని వెళ్ళాలి లేకపోతే, సొంత కారు లో పోవాలి. అంతే !
ఇంతకంటే సింపుల్ పని ఇంకోటుంది. అప్పుడెప్పుడో పార్లమెంట్ మీద దాడికి దిగితే పట్టుకుని ఇంటల్లుడిలా చూసుకుంటున్నామే అఫ్జల్ గురు. వాడిని అర్జంటుగా విడుదల చేసేసి అప్పుడు నీ పనికి అనవసరంగా అడ్డొచ్చాం, సారీ ఏమీ అనుకోమాక. ఈసారి దాన్ని పూర్తి చేసి మీ ఊరెళ్ళిపో అని చెప్పి పంపేస్తే సరి. వాడి ఖర్చులు కలిసొస్తాయి, వాడు పని పూర్తి చేస్తే ఇంత పెద్ద ప్రజాస్వామ్య నాటకానికి అయ్యే ఖర్చులు తప్పుతాయి.
అదరగొట్టారు. మీరు సూచించిన వాటిలో ఏ వొక్కటి అమలుచేసినా చాలు భారతీయులంతా ఏడుతరాలపాటు కాలుమీదకాలేసుకు బ్రతికెయ్యొచ్చు. చైతన్యకృష్ణ చెప్పిన ఐడియా మరీబావుంది.
సుజాతగారూ ఈ విషయం తెలీదా
. రాహుల్ కి సొంత కారూ ఇల్లూ రెండూ లేవట( ఇండియాలో ). అందుకే పాపం ఇల్లాలిని తెచ్చుకోలేదట ( ఇండియాకి )
Point 1&6 are excellent.
అబ్బో మన రాజ్యాంగాన్ని మించే పెద్ద పుస్తకం తయారవుతుందేమో మొత్తం అందరి సూత్రాలు కలిపి పుస్తకం అచ్చేస్తే… సరే వుడతా శక్తి
ఇంకోటి..
మొత్తం నాయకులందరి మెనూ పిజ్జా పెట్టెయ్యాలి.. రెండిందాల లాభం ఈ 100rs కిలో పప్పులు వుప్పులు కొనక్కర్లేదు,…ఇన్ని రకాలు గా వండనక్కరలేదు రెండో వుపయోగం వరుస పెట్టి ఒక రెండు నెలలు పిజ్జా లు తింటె వాళ్ళందరు ఎంత వుపయోగమో మన అందరికి కదా..
బాగున్నాయి సూచనలు. అసలు మొత్తం రాజకీయులందరికీ భద్రతను తీసిపారెయ్యాలి. దాంతో బోలెడంత ఆదా. దానికంటే ఎక్కువగా లేటరల్ ప్రయోజనాలు కొన్నున్నాయి. తమను కాపాడే పోలీసులు పక్కన లేకపోతే ఈళ్ళు ఇళ్ళల్లోనే పడిచస్తారు. ఈ ప్రయాణ ఖర్చులుండవు. మనకు ఇబ్బందులుండవు. ఒకవేళ బయటికొస్తే ఏ నక్సలైట్ల బారినపడో చస్తారు. ఇహనసలు గొడవే ఉండదు. ‘సచ్చినాడు సచ్చినట్టే, ఆ స్థానానికి ఎన్నికలుండవు, తూచ్’ అని మీరు అన్నారు కాబట్టి ఇంకా మిగులు!
LOL 🙂
నాకయితే ఈ పోస్ట్ ఎంత నచ్చిందంటే వాక్యల్లో ఇచ్చిన పొదుపు సూత్రాలతో సహా నా ఉహల్లో అమలు పరిచి కొత్త బంగారు లోకాన్ని ఊహించుకుంటున్నాను 🙂
all points are superb..!
మీరు మరీనూ…ఒకేసారి ఇన్ని జోకులా!