ఇటీవలి కాలంలో నేను చదివిన కాల్పనిక సాహిత్యం చాలా తక్కువ. గత పదేళ్లలో నే చదివిన సమకాలీన రచయితల పూర్తిస్థాయి నవలల సంఖ్య పదికి మించదు. ఐదొందల పేజీలకు మించిన నవల నేను ముట్టుకో(లే)ను. అసలు – ఎంత పెద్ద కథైనా రెండొందల పేజీల్లోపే చెప్పేయొచ్చు అన్న అభిప్రాయం, ఎలా ఏర్పడిందో గానీ, ఒకటేర్పడింది నాకు. వేలాది పేజీలకు పైగా సా….గే అట్లాస్ ష్రగ్డ్ తరహా నవలలంటే నాకు చిరాకు (ఐయన్ రాండ్ అభిమానులు కత్తులు నూరుతున్న శబ్దాలేనా అవి?) నా వరకూ – నూట యాభై పేజీల్లో ముగిసిపోయే అల్కెమిస్ట్ వంటివైతే మూడ్నాలుగు సిట్టింగుల్లో చదివెయ్యటం వీజీ. మొత్తానికి, ఒక నవల కొనాలా వద్దా అనేదానికి దాని పేరు ప్రఖ్యాతులకన్నా, దాని సైజు నాకు అతి ముఖ్యం. అయితే సమకాలీన నవలా సాహిత్యం నేనంతగా చదవక పోవటానికి ఇది ఒక కారణం మాత్రమే. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్, జాన్ స్టెయిన్బెక్ తరం మహారచయితల కలాల నుండి జాలువారిన గాధలు ఆకర్షించిన స్థాయిలో ఈ కాలపు థ్రిల్లర్ రచనలు నన్ను ఆకట్టుకోక పోవటం మరో కారణం. ఇంకో కారణమూ ఉంది. అది – చరిత్ర పుస్తకాల మీదకి గాలి మళ్లటం.
ఆ గాలి అడపాదడపా వెనక్కీ మళ్లుతుంది. ఈ సారది డాన్ బ్రౌన్ తాజా రచన ‘ది లాస్ట్ సింబల్’ మీదకి వీచింది. నిన్ననే విడుదలయిందా పుస్తకం. రాబర్ట్ లాంగ్డన్ ప్రధాన పాత్రగా వచ్చిన అతని గత రెండు పుస్తకాల్లో నేను చదివింది డావించీ కోడ్ ఒక్కటే. అదీ సగం పైన చదివి, ఆ తర్వాత విసుగొచ్చి, వదిలేశాను. హోలీ గ్రెయిల్ గురించి ఆకాశమంత రాగం తీసి ఆఖర్లో ఉసూరుమనించబోతున్నాడన్న అంచనా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఆ పుస్తకమ్మీద ఆసక్తి పోయింది. ఆ నవలాధారిత సినిమా చూశాక నా అంచనా నిజమయింది. ఏంజెల్స్ & డీమన్స్ పుస్తకం చదవలేదు కానీ సినిమా చూశాను. ఈ సినిమా నచ్చింది (పుస్తకాల్లో కూడా, చాలా మంది దృష్టిలో డావించీ కోడ్ కన్నా ఏంజెల్స్ & డీమన్స్ ఉత్తమం). సరే, ఎందుకో ఈ సారి లాస్ట్ సింబల్ విడుదలైన రోజే కొనాలనిపించింది. కొనేశాను, ఓ వంద పేజీల దాకా చదివేశాను (మొత్తం ఐదొందల పది పేజీలు – నా ‘హద్దు’కి కొంత అటే). ఇప్పటిదాకా ఆసక్తికరంగానే ఉంది, ఇకముందెలా ఉంటుందో చూడాలి.
(స్పాయిలర్ అలర్ట్: పుస్తకం చదవాలనుకునేవారు ఇక్కడితో ఆపేయండి)
గత రెండు పుస్తకాల్లో మాదిరిగానే ఈసారీ డాన్ బ్రౌన్ వాటికన్ చీకటి రహస్యాల మీద పడతాడనుకున్నాను కానీ ఇంకా ఆ సూచనలేవీ కనపడలేదు. ఈ సారి కథ వాషింగ్టన్ డీసీ చుట్టూ తిరుగుతుంది. కాపిటల్ హిల్ చుట్టుపక్కలే కథంతా నడుస్తుంది. ఆ పరిసరాలు పరిచయం ఉన్నవారికి ఈ పుస్తకం విపరీతంగా నచ్చే అవకాశం ఉంది. ఒక్కోటీ నాలుగైదు పేజీలకు మించని చిన్న చిన్న చాప్టర్లు, చిక్కటి కథనంతో ఉత్కంఠ చక్కగానే పండుతుంది. షరా మామూలుగా ఇందులోనూ ఓ సీక్రెట్ బ్రదర్హుడ్ ఉంది. చూడబోతే, ఈ విడత అమెరికన్ ప్రభుత్వ రహస్యాలపై బాణమెక్కుపెట్టినట్లున్నాడు బ్రౌన్ గురుడు. ఫ్రీమేసనరీ ప్రాక్టీసెస్ గురించిన చర్చలూ, రచ్చలూ ఈ కథకి కేంద్రం. మొత్తమ్మీద – గతంలో ఇతర రచయితలు వాడుకుని వదిలేసిన ఒకానొక వివాదాస్పద అంశానికి తనదైన శైలిలో చిలవలూ పలవలూ జోడించి ‘ఇవన్నీ నిఝంగా నిజాలే’ అని అమాయక పాఠకుల్ని నమ్మించే ప్రయత్నం ఇంతకు ముందు రెండు సార్లకి మల్లే ఇప్పుడూ సఫలమయ్యే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. అయితే, డావించీ కోడ్ స్థాయిలో ఈ పుస్తకం వివాదాస్పదం కాకపోవచ్చు. కాన్స్పిరసీ థియొరిస్టులకీ, వాళ్ల వ్యతిరేకులకీ మాత్రం కొన్నాళ్లు పాటు పండగే. హిస్టరీ వంటి ఛానెళ్లలో అప్పుడే ఫ్రీమేసన్స్ గురించిన కార్యక్రమాలు మొదలైపోయాయి. ఈ పుస్తకాధారిత సినిమా పనులు కూడా త్వరలో మొదలవుతాయి – మళ్లీ టామ్ హ్యాంక్స్, రాన్ హొవార్డ్ కలయికలో. ‘అంత కష్టపడి ఏం చదువుతాం? శుభ్రంగా సినిమా వచ్చాక చూసేద్దాం’ అనుకునే రకమా మీరు? మామూలుగానైతే, నేనూ అంతే.
మీరు గమనించారో లేదో డాను భ్రౌనుడు రాసిన నవలలన్నిట్లో (మొత్తం ఐదేగా!) హీరో/హీరోయిన్ మొదటి ఐదు పేజీల్లోనే వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిపోయి ఒకరోజులో (మహా…..వుంటే రెండురోజులు) పని చక్కబెట్టుకొని రావడంతో ముగుస్తాయి. ఇది కూడా అంతేనా?
ఇదీ అంతే
“పుస్తకాల్లో కూడా, చాలా మంది దృష్టిలో డావించీ కోడ్ కన్నా ఏంజెల్స్ & డీమన్స్ ఉత్తమం”
అదేంటి, నాకు తెలిసినంత వరకు డావిన్సీ కోడ్ సినిమానే బాగుంటుంది, చాలా మందికి(నాకు తెలిసిన అందరికీ) డావిన్సీ కోడే నచ్చిందే!
లేదండీ బాబూ…డావించీ కోడ్ కన్నా ఏంజెల్స్ & డీమన్స్ ఉత్తమం
@కన్నగాడు:
డావించీ కోడ్ సృష్టించిన వివాదం కారణంగా అది అంత పాపులర్ అయ్యిందే కానీ, ఏంజెల్స్ & డీమన్స్ కథలో ఉన్న పట్టు ‘కోడ్’ లో లేదు – అని నా అభిప్రాయం.
నా జీవితంలో Dan Frown (No typo. ఆణ్ణి చూస్తే నాకు వచ్చేది అదే) అంత కామెడీ రైతర్ని చూళ్ళే. DVC కన్నా DVS కర్ణే నయం. But for the technique, plot, and suspense element A&D is his best novel. The Fountainhead, AS, కొన్ని క్లాసిక్కులతో పోలిస్తే ఆడివన్నీ థూ నా బొడ్డే. కాకపోతే కాస్త కాలక్షేపం మాత్రం బానే అందిస్తాడూ. కానీ అదెప్పుడూ ఒకేలా ఉంటే చదవగలగటం మహ బోరు.
యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల బావుంటుంది అభిలాష కంటే
అదే హలో ఐ లవ్ యు సినిమా ని అసలు చూడలేము అభిలాష సినిమా చూస్తే బావుంటుంది
ఇప్పుడే నవల డౌన్లోడ్ చేశా…చదివి చెబుతా.