విదూషకులు

తెలుగునాట ఈ మధ్య కాలం దాకా కథానాయకుల ప్రేక్షకాదరణకి వాళ్ల సినిమాల శతదినోత్సవ కేంద్రాల సంఖ్య గీటురాయిగా ఉండేది. అదే ఒరవడిలో – రాజకీయ నాయకుల ప్రజాదరణకి నిలువెత్తు నిదర్శనంగా వాళ్ల పీనుగులు తోడు తీసుకెళ్లిన ప్రాణాల సంఖ్య ఉదహరించే కొంగ్రొత్త సంప్రదాయం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. దానికి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా, నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో చావులన్నీ వైఎస్ ఖాతాలోకే చేరుతున్నాయి. దివంగతులైన నాయకుల్ని తదనంతర కాలంలో తలచుకున్నప్పుడు, బతికుండగా ఆయా నాయకులు చేసిన ఘనకార్యాలు గుర్తుకు రావటం సహజం. వైఎస్ విషయంలో ఆయనకి తోడుగా తద్దినాలు పెట్టించుకునేవారి సంఖ్య మాత్రమే గుర్తొచ్చేలా చెయ్యాలన్నది ఆయన వీరాభిమానుల దూరాలోచన కావచ్చు. భవిష్యత్తులో రాష్ట్రమంతటా ఏర్పాటు చెయ్యబోయే ఆయన విగ్రహాల కిందుండే శిలాఫలకాల్లో ఈ సంఖ్య కూడా ప్రముఖంగా అగుపడేలా చెక్కిస్తే బాగుంటుంది. మొత్తమ్మీద – నాయకులు పోయినప్పుడు జరిగే అల్లర్లూ, ఆస్థి నష్టమూ వాళ్ల ప్రజాదరణకి కొలబద్దగా తీసుకునే ధోరణితో పోలిస్తే ఇది మంచి మార్పే.

మార్పు మరొకటీ ఉంది. నిజానికి ఇది మార్పు కాదు, కొన్నేళ్లుగా దుప్పటి కప్పేసి బబ్బోబెట్టిన కాంగీయుల నిజ నైజం ఇప్పుడు నిద్ర లేచి వళ్లు విరుచుకుంటుందంతే. వైఎస్ పోగానే, రాష్ట్ర ప్రజానీకం అంచనాలు నిజం చేస్తూ, అనుకున్నట్లుగానే కాంగిరేసు కేతిగాళ్ల కోలాహలం మొదలయింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఆశావహులంతా రెక్కలు కట్టుకు ఢిల్లీలో వాలి జనపధంలో బారులు తీరి ఎవరి పిండి కొద్దీ వారు లాబీయింగ్ నడుపుకుంటున్నారు. పిండి పెద్దగా లేనివారూ, ఉన్నా పిసికే ఓపిక లేనివారూ ఎవరి లెక్కలు వాళ్లేసుకుని ఏదో ఓ వర్గంలో చేరిపోయారు. ఏ వర్గంలోనూ చేరని గోపీలూ కొందరున్నారు. వాళ్ల లెక్కలూ వాళ్లకున్నాయి మరి! ఈ సందర్భంగా వీళ్లందరూ వాడుతున్న పదజాలాన్నీ, వారి మాటల వెనకున్న గూఢార్ధాల్నీ సాధారణ ప్రజానీకం అర్ధం చేసుకోలేక సతమతమౌతుంది. ఆయా నిగూఢార్ధాల గుట్టు విప్పుతూ వాటి యదార్ధ ప్రతిపదార్ధాలతో ప్రత్యేక నిఘంటువునొకదాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకి, ‘ముఖ్యమంత్రయ్యే ఉద్దేశం లేదు’ అంటే ‘ఉద్దేశముంది కానీ, ఆ అవకాశమే లేదు’ అని మొన్ననే చెప్పుకున్నాం. అలాంటివే మచ్చుకి మరో ఐదు:

సీనియర్లెందరో ఉన్నారు = సీనియర్ మోస్టుని నేనే
అతనికి అనుభవం లేదు = నాకు శానా బోలెడుంది
అంతా అధిష్టానమే చూసుకుంటుంది = ఎవడు సీయమ్మైతే నాకేంది, నా పదవి నాకిస్తే చాలు
నేను రేసులో లేను = నాకూ రేసులో ఉండాలనే ఉంది కానీ .. ప్చ్
జగన్ కోసం రాజీనామా చేస్తా = ఛా ఊకో .. ఎవుడి కోసమో నేనెందుకు రాజీనామా చేస్తా?

చివరి ఉదాహరణ మాట వరసకన్నది కాదు. అది నిజమేననేదానికి ఇదిగిదిగో తిరుగులేని రుజువు. ‘జగనన్న’ని ముఖ్యమంత్రిని చెయ్యకపోతే మంత్రులుగా పునఃప్రమాణం చెయ్యంగాక చెయ్యం అని ఏడుగురు మంత్రులు భీష్మించారట. తీరా చూస్తే – వీళ్లు ఏడుగురూ మిగతా మంత్రులకన్నా ముందే రాజ్‌భవన్ చేరుకుని తమవంతు ప్రమాణ స్వీకారం కోసం చేతులు నులుముకుంటూ, చెమటలు తుడుచుకుంటూ (కాంగీయుల మెడల్లో కండువాలెందుకో తెలిసిందా?) ఎదురు చూశారని ఆ ఒకటో పత్రిక అందించిన ఉప్పు. చెరువు మీద అలిగితే ఒరిగేదేమీ లేదని వీళ్లకి వేరెవరో చెప్పాలా? కారణాలేవైనా, రాకుమారుడి ఏడు చేపలూ ఎండలేదు; సోనియామ్మ దగ్గర పప్పులు ఉడకలేదు. రాజీనామా చేస్తామంటున్న మరికొందరు ఎమ్మెల్యేల బెదిరింపులూ తాటాకు చప్పుళ్లేనని ఈ దెబ్బతో హైకమాండ్‌కి అర్ధమైపోయుంటుందనటంలో అనుమానం లేదు. ఏదేమైనా, కేతిగాళ్ల కామెడీకిది పరాకాష్ట. ఈ హాస్య ప్రహసనానికి తోడుగా ‘జగన్‌ని ముఖ్యమంత్రిని చెయ్యకపోతే మానవబాంబులుగా మారతాం, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం’ అంటూ తొడలు కొడుతున్న చిల్లరమల్లర సీమ నేతల కారు కూతలు పేపర్లో చదివి కామెడీ సినిమాల్లో పారడీ ఫ్యాక్షనిస్టుల పాత్రలు మదిలో మెదిలి పగలబడి నవ్వుకుంటుండగా నా బుర్రలో ఓ ఐడియా తళుక్కుమంది. కేంద్ర ప్రభుత్వం ఏటేటా ఇచ్చే సినిమా అవార్డుల్లో తెలుగువారికి స్థానం దక్కటం లేదని మన సినీప్రియుల ఆవేదన. రాజకీయ నటీనటులకీ దేశవ్యాప్త అవార్డుల పంపకం మొదలెడితే విదూషకుల విభాగంలో మన రాష్ట్ర కాంగీయులకి ఎదురే ఉండకపోవచ్చు. సినిమాల్లో సాధించలేనిది ఇక్కడ సాధించొచ్చు. ఏమంటారు?

13 Responses to “విదూషకులు”


 1. 1 చిలమకూరు విజయమోహన్ 7:11 సా. వద్ద సెప్టెంబర్ 8, 2009

  నిజమే కదా అని అంటాం!అంతే కదా మరి

 2. 2 సాయికిరణ్ కుమార్ కొండముది 8:47 సా. వద్ద సెప్టెంబర్ 8, 2009

  Wonderful Sattire. ‘కేతిగాళ్ళు’ వీళ్ళనే మేం ‘సత్రకాయలు’ అంటాం. కాంగ్రెస్ లో దాదాపు అన్నీ ఇవే బాపతు.

 3. 4 సుజాత 9:35 సా. వద్ద సెప్టెంబర్ 8, 2009

  మీ నిర్వచనాలు బాగున్నాయి!ఇప్పుడే తొమ్మిదో టీవీలో చూశా, వాళ్ళు నిర్వహించిన పోల్ లో 62 శాతం మంది జగనే సీ ఎం కావాలని కోరుతున్నారట. సోనియా కూడా జగన్ సీ ఎం అయితేనే తనకు “మంచిది” అనుకుంటుందేమో!

  నిజంగా కాంగ్రెస్ పార్టీ అంత కుమ్ములాటల గుంపు ఇంకోటి లేదండీ బాబూ! ]
  అన్నట్లు మీ సీరీస్ లో నాలుగోది ఇది కాకూడదే! “అ” తో మొదలవ్వాలిగా!

 4. 5 చదువరి 9:44 సా. వద్ద సెప్టెంబర్ 8, 2009

  రాచపీనుగ ఒంటరిగా పోదంట. వెళ్తూవెళ్తూ తీసుకుపోవడం సంగతి సరే.., వెళ్ళాక ఇంకా తీసుకుపోతూనే ఉంది.

  ఇవ్వాళ్టిపేపర్లో కూడా నలుగురు ఇదే ఖాతాలో చచ్చిపోయారు (చచ్చిపోయింది పేపర్లోనే మరి). వాళ్ళలో అమ్మానాన్నలు, భార్యాపిల్లల కంటే వయ్యెస్సే ఎక్కువనుకుని ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు ముగ్గురు. నాలుగో వ్యక్తి వయ్యెస్ మీద దిగులుతో చచ్చిపోయాడంట.

  ఇప్పటి అముఖ్యమంత్రి తరవాత, ముఖ్యమంత్రి ఎవరొచ్చినా ఈ రాచపీనుగ వెనకాల పోతున్నవాళ్ళకి, ఎక్సుగ్రేషియా కింద పీనుక్కు లక్షో రెండో ఇస్తారని ఆశ ఉన్నట్టుంది.. ఎగబడి మరీ చచ్చిపోతన్నారు. తలా లక్షిచ్చినా మొత్తమ్మీద మూణ్ణాలుగు కోట్లు, అంతేగా!

  ప్రజల సున్నితమైన భావోద్వేగాల గురించి రాసాను, మిత్రులకు కోపమొస్తుందేమో!

 5. 6 శివ బండారు 10:57 సా. వద్ద సెప్టెంబర్ 8, 2009

  సహజ మరణాలని కూడా ఈ లిస్ట్లో వేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది.

 6. 7 సుజాత 1:40 ఉద. వద్ద సెప్టెంబర్ 9, 2009

  శివ గారు,
  మీరు కరక్టు! మామూలుగా పోయిన వాళ్ళను కూడా ఈ లిస్టులో కలిపినట్లున్నారు!

  వై యెస్ మరణం వల్ల “నిజంగా” వచ్చిన హార్ట్ అటాక్ రామ లింగ రాజు దే అనుకుంటా!:-))

 7. 8 Indian Minerva 2:16 ఉద. వద్ద సెప్టెంబర్ 9, 2009

  వై యెస్ మరణం వల్ల “నిజంగా” వచ్చిన హార్ట్ అటాక్ రామ లింగ రాజు దే అనుకుంటా!:-))

  :))))))))))))))
  Excellent!!!

 8. 9 Indian Minerva 2:26 ఉద. వద్ద సెప్టెంబర్ 9, 2009

  అసలు రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిగా ఎందుకు చెయ్యకూడదు? పదవి కొంచెం కొంచెం చిన్నదే as a startup, I thik its ok.
  ఆయనకాపాటికి అనుభవం?? వుంది.
  ఇంకాఏమైనా కావాలంటే ఇప్పుడు C.M. గా చేస్తే ఒరిగిపడే అనుభవంతో రేప్పొద్దున P.M. కావడానికి కూడా మార్గం “మరింత” సుగమమవుతుంది. ఆ విధంగా మనకి కేంద్రంలో రాజ కుటుంబపు ఆధ్వర్యమూ రాష్ట్రంలో అధ్యక్షమూనూ….

  • 10 గీతాచార్య 9:23 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2009

   Indian Minerva,

   మన రా’చొల్’ గాంధీ గారికి ఆ మాత్రం సత్తా లేదని ఎంతమొత్తుకున్నా వినరేం అధ్యక్షా…!

   భవిష్యత్ ప్రధాని, భవిష్యత్ ప్రధ్ని అనగా అనగా… ఏదో ఒక్క సారైనా తథాస్తు దేవతలు ఆ మాట అనకపోతారాని ఎదురుచూపులు.

 9. 11 Bhaavana 9:55 ఉద. వద్ద సెప్టెంబర్ 9, 2009

  “భవిష్యత్తులో రాష్ట్రమంతటా ఏర్పాటు చెయ్యబోయే ఆయన విగ్రహాల కిందుండే శిలాఫలకాల్లో ఈ సంఖ్య కూడా ప్రముఖంగా అగుపడేలా చెక్కిస్తే బాగుంటుంది.” మంచి ఆలోచన.
  ఏదో జిల్లా కు కూడా ఆయన పేరు పెట్టాలట కదా దాని తో పాటు మిగతా జిల్లాలకు ఆయన కోసం చనిపోయిన వారి పేర్లు పెడితే సరి…
  “రాజకీయ నటీనటులకీ దేశవ్యాప్త అవార్డుల పంపకం మొదలెడితే విదూషకుల విభాగంలో మన రాష్ట్ర కాంగీయులకి ఎదురే ఉండకపోవచ్చు. ” — మన లాలు లేడూ పోటి కీ…. మర్చి పోయినట్లు వున్నారు, టఫ్ కాంపిటీషన్ …

 10. 12 a2zdreams 10:11 ఉద. వద్ద సెప్టెంబర్ 9, 2009

  జర్నలిజం, వైద్యం, విద్య అనే మూడు వ్యాపారాలకు అండగా నిలిచే అధికారమే రాజకీయం అయినపుడు వై.యస్.జగన్ కు మించిన సమర్దుడు వుండడు. తండ్రికి మించిన తనయుడు కాగలడు.

  ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బ్రతకాలి, వై.యస్.ఆర్ ఆత్మకు శాంతి కలగాలి అంటే ప్రస్థుతం ముఖమంత్రిగా వై.యస్.జగన్ కి మించిన చాయిస్ మరొకటి లేదు.

 11. 13 వెంకటరమణ 11:45 సా. వద్ద సెప్టెంబర్ 11, 2009

  // సీనియర్లెందరో ఉన్నారు = సీనియర్ మోస్టుని నేనే
  అతనికి అనుభవం లేదు = నాకు శానా బోలెడుంది
  అంతా అధిష్టానమే చూసుకుంటుంది = ఎవడు సీయమ్మైతే నాకేంది, నా పదవి నాకిస్తే చాలు
  నేను రేసులో లేను = నాకూ రేసులో ఉండాలనే ఉంది కానీ .. ప్చ్
  జగన్ కోసం రాజీనామా చేస్తా = ఛా ఊకో .. ఎవుడి కోసమో నేనెందుకు రాజీనామా చేస్తా?

  🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 301,187

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: