అనంతరం

‘కాబోయే ముఖ్యమంత్రెవరు?’, ప్రస్తుతం అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ‘తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపట్టిన రోశయ్యనే ఎందుకు కొనసాగించకూడదు?’, కొందరి సందేహం. నలభయ్యేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నవాడు, మొదట్నుండీ కాంగ్రెసునే అంటిపెట్టుకుని ఉన్నవాడు, ఆర్ధిక మంత్రిగా అపార అనుభవమున్నవాడు .. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో ఆయనకన్నా అర్హుడెవడు? అయితే, తనకా బాధ్యతలు మోయాలనే ఉద్దేశమూ, మోసే ఓపికా లేవని రోశయ్యే స్పష్టం చేశాడు కాబట్టి జాబితాలోంచి ఆయన పేరు కొట్టేయొచ్చు. ఎంతయినా రోశయ్యామాత్యుడు ఘటికుడు. తన తాహతేంటో ఎరిగిన వాడు కాబట్టే ఏ వర్గంలోనూ చేరకుండా తామరాకు మీద నీటిబొట్టులా నెట్టుకొస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడల్లా ముఖ్యమంత్రి ఎవరనేదానితో సంబంధం లేకుండా మంత్రి పదవి చేజిక్కించుకుంటున్న ఘనుడు. ఉట్టికెగరబోయి ఉన్నదీ పారబోసుకునే మూర్ఖత్వం ఆయనకు లేదు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే ఉద్దేశం లేదని ముందుగానే స్పష్టం చెయ్యటంలో ఆయన చతురత మళ్లీ బయటపడింది. ఆయన ఉద్దేశంలో ‘ఉద్దేశం’ అంటే ‘అవకాశం’ అని అర్ధం చేసుకోవాలి.

రాష్ట్ర కాంగ్రెస్‌కి వైఎస్ ఏకఛత్రాధిపత్య ఏలుబడి చేసిన చేటేమిటో ఇకపై బయటపడనుంది. ఆయన వారసుడెవరనేదానిపై కొన్నాళ్ల ఉత్కంఠ తప్పకపోవచ్చు. ఐదారేళ్లుగా కాంగ్రెస్‌లో కనుమరుగైన కుమ్ములాటలు మళ్లీ మొదలవచ్చు. ఇన్నాళ్లూ ఇష్టంగానో అయిష్టంగానో సహజ లక్షణాలు అవతలపెట్టి స్తబ్దుగా కాలం గడుపుతున్న కాంగిరేసు కేతిగాళ్లిక ‘హైహై నాయకీ’ అనుకుంటూ హై కమాండ్ ప్రాపకం కోసం విజృంభించి వేసే వీరంగాలూ, చేసే చెక్క భజనలతో రాజధానంతా ఇకపై సందడే సందడి. ఆ మేరకి రాష్ట్ర ప్రజలకి కొన్నాళ్లపాటు కావలసినంత కాలక్షేపం మేత. వైఎస్ నిష్క్రమణం ప్రతిపక్షాలకి, ప్రత్యేకించి తెలుగుదేశానికి ఎనలేని ఎడతెరిపి. ఆయన మొదలెట్టిన ఆపరేషన్ ఆకర్ష ఇకపై ఆగిపోయే అవకాశాలే ఎక్కువ. ఇదే అదనుగా, ప్రజారాజ్యం జెండా పీకించే ఆపరేషన్ స్వగృహని తెలుగుదేశం రెట్టించిన ఉత్సాహంతో అమలు చేయొచ్చు. ఏతావాతా, కాంగ్రెస్ నష్టం తెలుగుదేశానికి లాభం, ప్రజారాజ్యానికి ప్రాణ సంకటం.

భావి ముఖ్యమంత్రెవరనే విషయంలోకి మళ్లీ వస్తే, ఆ విషయంలో ఆశావహులు అప్పుడే పావులు కదుపుతున్న సూచనలు అగుపిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లయితే డి.శ్రీనివాస్, ఎస్.జైపాల్ రెడ్డి, డి.పురందేశ్వరి (పత్రికల వారు ఈవిడ పేరు ‘పురంధరేశ్వరి’గా ఎందుకు రాస్తారో నాకెప్పుడూ అర్ధం కాదు), వై.ఎస్.జగన్. వెనుకబడిన వర్గాల నాయకుడిగా డి.శ్రీనివాస్ తనని తాను చిత్రీకరించుకుంటూ అధిష్టానం ఆశీస్సులకోసం ప్రయత్నిస్తున్నాడని వినికిడి. అయితే నాలుగు నెలలనాటి ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిగా ఆయన అవకాశాలు మృగ్యమే కావచ్చు. పైగా ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేరూ అంతంతమాత్రమే. జైపాల్ రెడ్డికి మంచి పేరే ఉన్నా, ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనకున్న అనుభవం అంతంతమాత్రమే. రాష్ట్రంలోని కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు తట్టుకుని నిలబడగలిగే చాకచక్యం ఆయనకుందన్నది అనుమానాస్పదం. ఇక మిగిలింది పురందేశ్వరి, జగన్.

ఎన్‌టీఆర్ కుమార్తెని ముఖ్యమంత్రిని చెయ్యటం ద్వారా చంద్రబాబుకీ, తెలుగుదేశానికీ చెక్ చెప్పొచ్చనేది కొందరి వ్యూహం అంటున్నారు. అది ఎంతవరకూ ఫలిస్తుందో ఎవరికీ తెలియదు. పురందేశ్వరిని ముఖ్యమంత్రిని చెయ్యటమంటే రాష్ట్రంలో రెండు బలమైన పక్షాల పగ్గాలూ ఒకే సామాజికవర్గం, అందునా ఒకే కుటుంబం చేతిలో పెట్టటమే. కాంగ్రెస్‌ని సొంత ఆస్తిలా భావించే ఒక వర్గం దీనికి ఒప్పుకోవటం కల్ల. కాబట్టి పురందేశ్వరి ముఖ్యమంత్రి కావటమూ కల్లే.

జగన్‌కి పట్టాభిషేకం చెయ్యాలనేది వైఎస్ వర్గీయుల పట్టుదల. అతనికి అనుభవం అసలే లేదన్నవి అప్పుడే వినబడుతున్న గొణుగుళ్లు. ఆ గొణుగుళ్లు లెక్కచెయ్యకుండా అతనికి పగ్గాలిస్తే అవి మరింత ఎక్కువయ్యే అవకాశాలే బోలెడు. కొత్తగా రాజకీయాల్లోకొచ్చిన వ్యక్తి, తండ్రి పేరు అడ్డుపెట్టుకుని ఎన్నాళ్లు పీఠం కిందకి నీళ్లు రాకుండా కాపాడుకోగలుగుతాడన్నది ఊహకందని విషయం. ఐదేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని సమర్ధంగా అడ్డుకుని యూపీఏకి మళ్లీ కీలక బలాన్నందించే నేతని ముఖ్యమంత్రిని చెయ్యటం సోనియా కర్తవ్యం. మరి ఇప్పుడే జగన్‌ని ముఖ్యమంత్రిని చేసి, అతను సమర్ధత నిరూపించుకోలేక చతికిలబడిపోయి ఐదేళ్ల తర్వాత అధికారాన్ని భద్రంగా తెలుగుదేశానికి అందిస్తే ఎలా? దీనికి ఒకటే పరిష్కారం. ప్రస్తుతానికి ఎవరో ఒక డమ్మీని ముఖ్యమంత్రి పీఠంపై ప్రతిష్టించటం, జగన్‌కి మూడు నాలుగేళ్ల అనుభవం రానిచ్చి, ఎన్నికలు ఏడాదో ఏడాదిన్నరో ఉండగా అతన్ని ముఖ్యమంత్రిని చెయ్యటం. అలాగయితే అతను క్లీన్ ఇమేజ్‌తో వస్తాడు, పైగా తండ్రి పేరూ తోడవుతుంది కాబట్టి ఎన్నికల్లో అంతో ఇంతో లాభం చేకూరే అవకాశాలుంటాయి.

ఇవన్నీ కాలక్షేపానికి చేసే ఊహాగానాలు. అధినేత్రి మదిలో ఏముందో ఎవరికెరుక? చూద్దాం, కాబోయే ముఖ్యమంత్రెవరో.

20 స్పందనలు to “అనంతరం”


 1. 1 budugoy 12:49 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

  మీ విశ్లేషణ స్పష్టంగా ఉంది. జగన్‌కి ప్రస్తుతం రాహుల్‌కిచ్చిన ట్రీట్‌మెంట్ ఇస్తే ముందర జగన్ పైకొచ్చే అవకాశాలుంటాయి. లేకపోతే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది తంతు అవుతుంది. జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకన్నా సాక్షి, ఇతర ఆస్థులమీద దృష్టిపెట్టి, ఆర్థికంగా బలోపేతమయ్యి ఇంకో మూడేళ్ళకి తెర మీదకి రావడం ఉత్తమం. ఈ నాలుగేళ్ళు సెంటరులో మన్‌మోహన్‌లా, ఇక్కడ రోషయ్యను కొనసాగించాలి.

 2. 2 సుజాత 2:29 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

  “‘ఉద్దేశం’ అంటే ‘అవకాశం’ అని అర్ధం చేసుకోవాలి.”

  లాభం లేదు. మీరు ఏదో ఒక డైలీకి ఫీచర్ రాయకపోతే నేనొప్పుకోను తెలుగోడు గారూ!

  నిన్న కొంతమంది చిరంజీవి మద్దతుకోసం వెళ్ళినపుడే అప్పుడే కుమ్ములాటలు మొదలయ్యాయని మనం అర్థం చేసుకోవాలి.

  డి.శ్రీనివాస్ పబ్లిగ్గానే “జగన్ కంటే అనుభవజ్ఞులు చాలా మందున్నారు(ముఖ్యంగా నేను) అని చెప్పుకుంటున్నా అవకాశాలు మాత్రం లేవనేది స్పష్టం!

  ఇక కాంగ్రెస్ ముక్కలు కాకుండా ఉండాలంటే జగన్ కి పగ్గాలివ్వక తప్పదు. అనుభవం కొద్దిరోజుల్లో సంపాదించడం కష్టమేమీ కాదు. రాజారెడ్డి పెంపకంలో పెరిగిన జగన్ పైకి అసమర్థుడిలా కనపడ్డా నాన్న లక్షణాలను పుణికి పుచ్చుకునే ఉంటాడని నా నమ్మకం.

  మీరు చెప్పిన అయిడియా కూడా బాగానే ఉంది కానీ అప్పటిదాకా జగన్ అనుచరులు ఆగరు.

  • 3 అబ్రకదబ్ర 2:53 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

   రౌలింగమ్మ ఏడు రాసింది కాబట్టి నేనీ సిరీస్‌లో అధమం ఎనిమిది రాసే పనిలో ఉన్నా. ఇంకా ‘అయోమయం’, ‘అర్ధంతరం’, ‘అప్రస్తుతం’, ‘అంతర్గతం’ మరియు ‘అచంచలం’ బాకీ ఉన్నాయి. అవయ్యాక్కానీ ఫీచర్లకి టయిమ్ లేదు.

 3. 4 నరేంద్ర భాస్కర్ S.P. 2:36 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

  దాదాపు ఇటువంటి ప్రత్యామ్న్యాయం ప్రస్తుతపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి (రోశయ్య) ని ముఖ్యమంత్రి గా నియమించి, ఉప ముఖ్యమంత్రిగా జగన్ ను నియమించ వచ్చు, ఇలా చేస్తే, అనుభవం కోసం అనే పేరుతో జగన్ కు కొంత సమయం దొరుకుతుంది,రోశయ్య రుబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి గానే గాక, జగన్ మీద రాజకీయ చెక్ గానూ పని చేస్తారు. రాజశేఖరుని అభిమానులూ మరియు పైరవీకారులూ సంతోషిస్తారు మరియు భరొసాగా భావిస్తారు. పోతూ పోతూ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్స్ పార్టీ కి మరియు తన కుటుంబానికీ గొప్ప సేవ చేసి వెళ్ళారు, యధావిధిగా దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి నాయకుల లిస్ట్ లో ఒక పేరు పెరిగింది(వారు ప్రకటించుకునే విధంగా) ఇక రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఎక్కడైనా ప్రాణత్యాగం (చాలా పెద్ద మాటే,, కానీ ఇదే వాడతారు) గురించి చాలా మాట్లాడ్తరు మళ్ళీ దానికీ విలువ ఉంటుంది. ఇదీ నా ఆభిప్రాయం.

  దయచేసి ఇది http://mynoice.blogspot.com/2009/09/blog-post.html చదవండి
  ధన్యవాదాలు

 4. 5 చైతన్య కృష్ణ పాటూరు 2:37 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

  ఆపరేషన్ ఆకర్ష తగ్గుముఖం పడుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్ పదవిలోకి వస్తే(ఇది జరిగే అవకాశమే ఎక్కువ) అప్పుడు కూడా మంత్రాంగం నడిపేది, షాడో సీయమ్ గా ఉండేది కేవీపీనే. ఉత్సవ విగ్రహం మారినా మూలవిరాట్టు సేమ్ కదా. కాబట్టి తెర వెనుక కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతాయి. జనాకర్షక నేతను పోగొట్టుకున్నారు కాబట్టి సొంత బలం పట్ల నమ్మకం తక్కువుంటుంది కాబట్టి ప్రతిపక్షాలను బలహీనపరచటానికి ముందు కంటే ఎక్కువగానే ప్రయత్నించ వచ్చు. కాకపోతే తెర ముందు సీన్ కాస్త వీక్ అవుతుంది. అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దూకుడుగా వెళ్ళే ముఖ్యమంత్రి లేరు కాబట్టి, వాటి మీద ఒంటికాలి మీద లేవటానికి రోశయ్య తదితరుల మీద ఆధారపడాలి.

 5. 6 bonagiri 2:51 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

  చిరంజీవిని కాంగ్రెసు పార్టీలోకి చేర్చుకుని అంటే ప్రజారాజ్యాన్ని కాంగ్రెసులో కలిపేసి చిరంజీవికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఎలా వుంటుంది?
  కాంగ్రెసుకి గ్లామరు వస్తుంది, కీచులాటలు ఉండవు.

 6. 8 Praveen 2:53 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

  రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రం విషయంలో వరల్డ్ బ్యాంక్ జోక్యం తగ్గింది (ఓ స్థాయి వరకైనా). ఈ క్రెడిట్ రోశయ్యదే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చాలా విషయాలలో రోశయ్య సలహాలతోనే నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకే రోశయ్యే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను.

  • 9 kamal 4:15 ఉద. వద్ద నవంబర్ 15, 2009

   వరల్డ్ బ్యాంక్ జ్యోక్యం తగ్గితే..! చంద్రబాబు హయాం లో 54 వేల కోట్లు అప్పున్న రాష్ట్రం..! మరిప్పుడు ఒక లక్షా 60 వేల కోట్లకు ఎలా చేరిదబ్బా..?..

 7. 10 కన్నగాడు 2:55 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

  జగన్ ని ముఖ్యమంత్రిగా చేసి జాతీయ పార్టీలో ప్రాంతీయంగా కుటుంబపాలన తేవడం ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డు మీద ఇంకో పోటు పొడిచినట్టే. మన చక్రవర్తి శ్రీ శ్రీ శ్రీ గాంధీ కుటుంబానికి కప్పం కడుతూ మన రాజు వై.ఎస్ కుటుంబం భిక్షంగా పాలించిదురు అని ఊహించడానికే పరమ చెత్తగా ఉంది. కాంగ్రెస్ మనుగడ కొనసాగాలంటే జగన్ కి కాకుండా ఒక సమర్దుడికి ఇవ్వడం మంచిది.
  నా అభిప్రాయం ప్రకారం రోశయ్యే ప్రస్తుతానికి ఉత్తమ ఐచ్చికం.

  • 11 అబ్రకదబ్ర 11:28 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

   @కన్నగాడు:

   నిజమే. జగన్‌ని గద్దెనెక్కించటమంటే పెనం మీంచి సరాసరి పొయ్యిలో పడటమే. రాష్ట్రంలో అవినీతి రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుందిక. వేరేవాళ్లు గద్దెనెక్కితే ఉన్నపళాన బాగుపడుతుందని కాదు, రోశయ్యయితే అంతో ఇంతో మెరుగవుతుందనో చిన్న ఆశ. సింహాసనాన్ని ఎవరు ‘డెకరేట్ చేసినా’ శ్రీమాన్ నెహ్రూ వారస సంతతికి కప్పం కడుతూ బతుకీడ్చక మాత్రం తప్పదు.అందుకే – ఈ కప్పాలు కట్టే కాంగిరేసు సామంతుల కన్నా స్వతంత్రంగా ఉండే ప్రాంతీయ పార్టీ రాజులే మెరుగు. ఆ మిగులు సొమ్ముతోనన్నా అన్నో ఇన్నో పనులు జరుగుతాయి. ప్రాంతీయ పార్టీలు కాంగిరేసులా కిక్కిరిసి ఉండవు కాబట్టి ఆశావహులూ, వాళ్ల జీతభత్యాలూ .. మొత్తమ్మీద మెయింటెనెన్స్ ఖర్చులూ తక్కువే. అదో అదనపు ఆదా.

   • 12 Praveen 8:43 సా. వద్ద సెప్టెంబర్ 4, 2009

    మన రాష్ట్రాన్ని వరల్డ్ బ్యాంక్ కి ఇతర ముఖ్యమంత్రుల కంటే దారుణంగా తాకట్టు పెట్టింది ప్రాంతీయ పార్టీ అయిన తెలుగు దేశం నాయకుడే. చంద్రబాబు చేసిన అప్పులు తీర్చడానికి మన మనవళ్ళూ, మనవరాళ్ళ కాలం కూడా సరిపోదు.

 8. 13 hateweb 3:02 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

  పురందరేశ్వరే కరెక్టు
  పురందేశ్వరి అనే పేరు హిందూమతంలో లేదు.
  ఒక అక్షరం తగ్గినా తగ్గినట్టే అనుకుంటున్న కాలమ్ స్పేస్ కక్కుర్తి జర్నలిస్టుల మూలంగా ఈ మధ్య చాలా పదాలకి ఈ గతి పట్టింది.

 9. 16 bonagiri 3:10 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

  కన్నగాడు గారు

  మీతో ఏకీభవిస్తున్నాను.

  (గాడు గారు అనడం అంత బాలేదనుకుంటా)

 10. 18 అబ్రకదబ్ర 9:26 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

  @pandit:

  ఇక్కడ చూడండి. ఇది ఆవిడ అధికారిక వెబ్ సైట్. http://www.daggubati.in. అక్కడంతా ‘Purandeswari’ గానే ఉంది.

  అర్ధం లేని పేరు పెట్టేంత పిచ్చివాడు కాడనుకుంటా ఎన్‌టీఆర్.

 11. 20 గిరి 10:29 సా. వద్ద సెప్టెంబర్ 5, 2009

  ముఖ్యమంత్రి చనిపోతే, ఆయన కొడుకుకో /భార్యకో ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినట్లు – అదే ప్రమాదంలో మరణించిన ఐ.పి.యెస్. కొడుక్కో కూతురుకో లేక భార్యకో ఐ.పి.యెస్. పొజిషన్, ఐ.ఏ.యెస్. కొడుక్కో కూతురుకో లేక భార్యకో ఐ.ఏ.యెస్ పొజిషన్ ఇస్తే బాగుంటుంది. అది ధర్మంగా కూడా కనిపిస్తోంది.
  ఆ సందర్భం లోనే చనిపోయిన పైలెట్ల సంతానాన్ని పైలెట్ల గా నియమిస్తే చాలా బాగుంటుంది.
  మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలకు ఉపయోగించే హెలికాఫ్టర్లను తోలే బాధ్యతను ఈ పైలెట్లకే అప్పగిస్తే ఇంకా బాగుంటుంది.
  ఇవన్నీ చేసేందుకు అవసరమైన(అవసరమైతేనే) రాజ్యాంగ సవరణలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.

  – గిరి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: