అస్తమయం

ఆంధ్ర ప్రదేశ్‌లో రెండే రకాల ప్రజలున్నారు – రాజశేఖర రెడ్డిని గాఢంగా అభిమానించేవాళ్లు, రాజశేఖర రెడ్డిని తీవ్రంగా ద్వేషించేవాళ్లు. ఆయన్ని పట్టించుకోని వాళ్లు మాత్రం లేరు. అభిమానుల దృష్టిలో ఆయన – పేదల పాలిట పెన్నిధి, నమ్ముకున్నవారి కోసం ఎంతకైనా తెగించేవాడు, రైతుజన బాంధవుడు. వ్యతిరేకుల దృష్టిలో ఆయనే – కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు, అవినీతికి కొత్త అర్ధాలు చూపినవాడు, అధికారాన్ని యధేచ్చగా దుర్వినియోగం చేసినవాడు. ఇవన్నీ ఆయన విషయంలో ఎంతో కొంత నిజాలే. ఒక వ్యక్తిలో భిన్న కోణాలుండటం అసాధారణం కాదు. మంచీ చెడూ రెండూ ఒకే వ్యక్తిలో శిఖరాగ్రాల్ని తాకటం మాత్రం అసాధారణమే. రాజశేఖరరెడ్డిని ఇష్టపడేవాళ్లూ, పడనివాళ్లూ కూడా ఆయన ఇక లేడన్న వార్త తెలిసినప్పుడు ఒక్కసారన్నా ‘అయ్యో’ అనుకుని ఉంటారనటంలో అతిశయోక్తి లేదు.

రాజశేఖరరెడ్డి లేని దెబ్బ అందరికన్నా ఎక్కువగా తగిలేది కాంగ్రెసు పార్టీకే. ఆ పార్టీపై ఆయన వేసిన ముద్ర అటువంటిది. తెలుగుదేశం ఆవిర్భావానంతరం కళతప్పి కుదేలైన రాష్ట్ర కాంగ్రెసు శాఖకి ఒంటి చేత్తో పూర్వ వైభవం తెచ్చిపెట్టిన ఘనత నిస్సందేహంగా రాజశేఖరరెడ్డిదే. అది ఒక్కరోజులో సాధ్యపడలేదు. దాదాపు పదేళ్ల పోరాట ఫలితమది. ఏనాటికన్నా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న కోరిక ఆయన్నా దిశలో నడిపిందనేది వాస్తవమే. అయినా – కీచులాటలతో కునారిల్లుతున్న కాంగ్రెసుని ఏకతాటిపైకి తెచ్చి, యాభై నాలుగేళ్ల వయసులో మండే ఎండల్లో పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి, చంద్రబాబు చాణక్యాన్ని దీటుగా ఎదుర్కొని పార్టీకి జవసత్వాలు చేకూర్చటానికి కేవలం పదవీ కాంక్ష సరిపోదు. అంతకు మించిన స్థిరచిత్తమూ, స్థితప్రజ్ఞతా అవసరం. అవి పుష్కలంగా ఉండబట్టే పదేళ్ల తెలుగుదేశం పాలనకి తెర దించగలిగాడాయన.

ముఖ్యమంత్రయ్యాక ఐదేళ్లలో రాజశేఖరరెడ్డిపై కురిసిన పూలెన్నో, పడ్డ రాళ్లూ అన్నే. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఒక ప్రాంతీయ పార్టీని నడిపిన తీరులో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే అయ్యి నడపటం మాత్రం అద్భుతం. స్వతంత్రానంతరం అరవై మూడేళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో బహుశా ఏ రాష్ట్ర స్థాయి నేతా సాధించని ఘనత ఇది. కిట్టని వారు అలవిమాలిన రాజీవ్ భజనే అధిష్టానం దగ్గర ఆయన హల్‌చల్ నడిపించిందంటారు. రాజీవ్ భజన రాష్ట్రంలో వోట్లు రాల్చిపెట్టదనీ, వోట్లూ సీట్లూ లేకపోతే ఎంత భజన చేసినా అధిష్టానం ఆయన్ని పట్టించుకోదనీ మాత్రం వాళ్లు మర్చిపోతారు. ఏదేమైనా రాష్ట్ర కాంగ్రెస్‌లో పీవీ నరసింహారావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, జలగం వెంగళరావు వంటి ఉద్ధండులకు సైతం తప్పని అసమ్మతి పోటుని ఆయన విజయవంతంగా తప్పించుకుని పార్టీని సొంత జాగీరులా ఏలాడన్నది మాత్రం నిజం. ఈ విషయంలో అధిష్టానంతో ఆయనకేవో రహస్య ఒప్పందాలున్నాయనీ, ముప్పై మందికి పైగా ఎంపీల బలమున్నా మంత్రి పదవులనుండి నిధుల మంజూరు దాకా రాష్ట్ర వాటా విషయంలో కేంద్రాన్ని పట్టుబట్టకపోవటం వెనక అదే మతలబనీ గుసగుసలున్నాయి. వాటిలో నిజానిజాలెన్నున్నా, రాజశేఖరరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌లో రెండవ నెంబరు నేత లేకుండా చేసిపోవటం ఆ పార్టీని తీవ్ర గందరగోళంలోకి నెట్టే విషయమే. ఆయన అస్తమయంతో కాంగ్రెస్ మార్కు కంగాళీ రాజకీయాలు మళ్లీ మొదలవచ్చు.

మొండివాడు రాజుకన్నా బలవంతుడనేది నానుడి. అయితే ఎంతటి మొండివాడైనా రాజశేఖరరెడ్డి ముందు దిగదుడుపే. ఎందుకంటే ఆయన జగమొండి. ఆయన్ని దశాబ్దాలపాటు కాంగ్రెసులో నిత్య అసమ్మతివాదిగా చేసి అధికార పీఠానికి ఆమడ దూరంలోనే నిలబెట్టేసింది ఆ గుణమే. అనుకోని రీతిలో అధికారానికి తెచ్చిందీ, ఊహించని విధంగా పునరధికార ప్రాప్తి కలిగించింది సైతం ఆ గుణమే. అధికారమున్నా లేకున్నా ఆయన తత్వం ఆయనదే, ఆయన దర్పం ఆయనదే. చివరికా మొండితనమే, వాతావరణాన్ని లెక్కచేయకుండా బయల్దేరేలా ప్రేరేపించి, ఆయన ప్రాణాలు తీసిందన్నది విషాదకర వాస్తవం. రాష్ట్ర నేతల్లో రామారావుని తలదన్నే మొండి మొనగాడు ఎవడన్నా ఉన్నాడా అంటే రాజశేఖర రెడ్డి ఉన్నాడనేది సమాధానం. రాష్ట్రవ్యాప్త ప్రజాభిమానం విషయంలోనూ రామారావుతో సరితూగగలిగే నేత ఆయనొక్కడే కావచ్చు. మరి రామారావులా ఆయనా చరిత్రలో నిలిచిపోతాడా? అది ఏదోనాడు చరిత్రే సమాధానం చెప్పే ప్రశ్న. ప్రస్తుతానికైతే, రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి వదిలివెళ్లిన శూన్యాన్ని భర్తీ చేసేదెవరన్నది మరింత ముఖ్యమైన ప్రశ్న. దీనికీ చరిత్రే సమాధానం చెబుతుంది. వేచి చూద్దాం.

10 స్పందనలు to “అస్తమయం”


  1. 1 chaithanya MS 2:35 సా. వద్ద సెప్టెంబర్ 3, 2009

    ఖచ్చితంగా గుర్తుంటాడు. కాకపోతే రామారావులా కాదు.

  2. 2 prasad 2:49 సా. వద్ద సెప్టెంబర్ 3, 2009

    ఎమో.. ఇప్పటి తరం వై. ఎస్. నే ఎక్కువ గుర్తుకు పెట్టుకొవచ్చు.

  3. 3 సుజాత 7:25 సా. వద్ద సెప్టెంబర్ 3, 2009

    కుమ్ములాటల్తో నిత్యం కుంపటిలా కుములుతూ ఉండే కాంగ్రెస్ ని ఒక్కతాటిపై నడిపించడం ఆయన విజయం! అసమ్మతిని కాలి బొటనవేలి కింద తొక్కి పెట్టి,వెన్నులో వణుకు పుట్టించే చిరునవ్వుతోనే అందర్నీ జయించాడు.రెండో నెంబర్ లేకుండా పోడానికిదే కారణం. ఆయన దరిదాపుల్లోకి రావడానికే ఎవరికీ సాహసం లేకపోయింది. జేసీ దివాకర్ రెడ్డిని తొక్కి పెట్టీన విధం చూస్తే ఒక పక్క దివాకర్ మీద జాలీ, ఆయన నిస్సహాయత్వానికి నవ్వూ వస్తాయి.పోటీ అవుతాడనుకున్న మైసూరా రెడ్డి బయటికి పోయే పరిస్థితులు సృష్టించాడు. ఇక ఎదురేముంది? మిగిలిన వాళ్ళంతా డమ్మీలేగా కాంగ్రెస్ లో?

    నిన్న “అయ్యో”అనిపించిన క్షణం మాత్రం మీడియా ముందు మైసూరా రెడ్డి కన్నీళ్ళు పెట్టుకున్న దృశ్యం! అది కెమెరా కోసం పెట్టుకున్నది కాదని స్పష్టంగా తెలిసింది.(చెరువు మీద అలిగిన సామెతగా తెలుగు దేశంలో చేరాడు కానీ పాపం ఆయన మనసంతా కాంగ్రెస్ లోనే ఉందనుకోండి ఆనాటినుంచీ)

  4. 5 గీతాచార్య 11:11 సా. వద్ద సెప్టెంబర్ 3, 2009

    హ్మ్. బాగా వ్రాశారు. చరిత్రలో నిలిచే నాయకుడే.

  5. 6 hateweb 3:07 ఉద. వద్ద సెప్టెంబర్ 4, 2009

    మీడియా సృష్టిస్తున్న మహనీయుడు వై.స్. ప్రజలపరంగా జాతిపరంగా ఏ ప్రాధాన్యమూ లేదు.

  6. 7 vinay chakravarthi 10:02 సా. వద్ద సెప్టెంబర్ 6, 2009

    excellent comment by hateweb……..

    everyone scold hime till last week now he became almost god to everyone.

  7. 9 suresh reddy 6:06 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2009

    అబ్రకదబ్ర గారు
    Corrupt CM అని ఈనాడు చదివి తెలుసుకొన్నారా?

    • 10 అబ్రకదబ్ర 8:40 ఉద. వద్ద సెప్టెంబర్ 16, 2009

      @సురేష్:

      వాస్తవాలు కళ్లెదురుగా ఉన్నాయి. పత్రికల్లో చదివితేనే తెలిసేవి కావు. పోనీ ఆయన కరప్ట్ కాదని మీరు సాక్షిలో చదివి తెలుసుకున్నారా? ఈనాడు సరే, జాతీయ మీడియా సైతం వైఎస్‌కి ఎందుకు వ్యతిరేకంగా ఉంది? డెవిల్స్ అడ్వొకేట్ కార్యక్రమంలో కరణ్ థాపర్ సూటిగా సంధించిన ప్రశ్నలకి వైఎస్ నీళ్లెందుకు నమిలాడు? సమాధానాలు చెప్పలేక తలెందుకు వేలాడేశాడు? అసెంబ్లీలో ఎదుటివారి బలహీనలతలపై ఎదురుదాడి చేస్తూ ప్రజల దృష్టి మళ్లించేవాడు. ఆ పప్పులు అందరి దగ్గరా, అన్ని వేళలా ఉడకవు కదా.

      ప్రమాదంలో పోయాడు కాబట్టి పైకెవరూ మాట్లాట్టం లేదు. పోయినోళ్లందరూ మంచోళ్లనాలనే పాత సిద్ధాంతం ఉండనే ఉంది కదా. నిజాలు మాట్లాడుకోవాలంటే – ఆయన వల్ల కాంగ్రెస్ బాగు పడిందే కానీ రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసిపారేశాడు. జలయజ్ఞం కోసం నలభై మూడువేల కోట్లు ఆవిరైపోయాయి, పనులు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు పక్క రాష్ట్రాలు తన్నుకుపోయాయి. రాజధానిలో రియల్ దందా. సీమలో ఫ్యాక్షనిస్టుల పడగ. ప్రత్యర్ధి పార్టీ నాయకుల ఊచకోత. సెజ్‌ల కోసం అడ్డూ ఆపూ లేని భూసంతర్పణలు. ప్రభుత్వాఫీసుల్లో పట్టపగ్గాల్లేని అవినీతి. ఎటు చూస్తే అటు కుంభకోణాలు. అలవిమాలిన రాజీవ్ భజన. ఆయన ఉచిత వరాల వల్ల లాభపడ్డ కొత్త బిచ్చగాళ్ల వర్గం దృష్టిలో ఆయన హీరో కావచ్చు. పేదల్ని ప్రభుత్వ దయమీద బతికేవాళ్లుగా, అడుక్కు తినేవాళ్లుగా మార్చటమా అభివృద్ధి? రైతు బాంధవుడినంటాడు, రైతుల ఆత్మహత్యల్ని ఆపలేడు (మూడు వారాల క్రితం శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్‌లో ఆంధ్ర ప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యల గురించో పెద్ద ఆర్టికిల్ వచ్చింది. ‘ఆ రెండు పత్రికలు’ అంటూ నోరు చేసుకునే అవకాశం లేదిక్కడ). ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలటం, వర్షాలు సకాలంలో పడటంతో మొన్నటి ఎన్నికల్లో ఒకటిన్నర శాతం తేడాతో గట్టెక్కాడు. లేకుంటే ఏమయ్యుండేదో ఊహించటం తేలికే.

      ఒకవైపు సత్యం లాంటి సంస్థల్ని బురదలోకి లాగి నాశనం చేసేశాడు. అదే సమయంలో, ఐదేళ్ల క్రితం ఐపు లేని పుత్రరత్నం ఉన్నట్టుండి బిలియనీర్ వ్యాపారవేత్త అవతారమెత్తాడు. ఆయన అధికార దుర్వినియోగానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ‘నమ్ముకున్నవారిని మోసం చెయ్యడు’ అంటారు. అంటే ఆయన పార్టీవాళ్లు తప్ప మిగతా వాళ్లు ప్రజలు కారా? అదేమంటే ప్రతిదాన్నీ పాత ప్రభుత్వమ్మీదకి నెత్ట్టటం, మీరు చేస్తే మేము చెయ్యకూడదా అంటూ నిస్సిగ్గుగా సమర్ధించుకోటం! వెన్నుపోటు పొడిచావంటూ ప్రతిపక్ష నేతని ఎద్దేవా చెయ్యటం, వెకిలి నవ్వులు నవ్వటం. జనాలకి ఉపయోగ పడే పనులేనా ఇవి? చంద్రబాబు ఎవడిని ఏ పోటు పొడిస్తే మనకేంటి? పదిహేనేళ్ల తర్వాత కూడా దాన్నే పట్టుకు వేలాడుతూ ఎన్‌టీఆర్ అభిమానుల వోట్లు సంపాదించాలనే కొద్ది బుద్ధులు. క్రిస్టియన్లకి రిజర్వేషన్లు, ముస్లిములకి మంద పెళ్లిళ్లు అంటూ మతాల వారీగా విభజన రాజకీయాలు! ఒకటా రెండా?

      రాజశేఖరరెడ్డికి అంతులేని పట్టుదల ఉంది. దాన్ని సరైన పద్ధతిలో వాడుంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండుండేది. ఆయన చేసిందల్లా విచ్చలవిడి అధికార దుర్వినియోగం. అంతే. నక్సలైట్ ఉద్యమాన్ని నామరూపాల్లేకుండా చెయ్యటం మాత్రం ఆయన ఘనత.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: