ముఖ్యమంత్రి మాయమయ్యాడు – ఆందోళనకరమైన వార్త. ఎందుకూ ఆందోళన? ఆయన తప్పిపోవటమా? అది తప్పకుండా ఆవేదన చెందాల్సిన విషయమే. మాయమైన ఇన్ని గంటల తర్వాత కూడా ఆయనేమయ్యాడో కనుక్కోలేని అసహాయత – అదీ ఆందోళన చెందాల్సిన అసలు విషయం. ఉపగ్రహ సహిత ఆధునాతన పరికరాలు, అత్యున్నత సాంకేతిక విజ్ఞానం, యుద్ధ విమానాలు, వేలాది మంది బలగాలు .. ఇన్ని కలిసీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆచూకీ పట్టుకోలేకపోవటం అటుంచితే, అసలు ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురయిందో, అత్యవసరంగా ఎక్కడన్నా దిగిందో కూడా కనుక్కోలేకపోవటం ఆక్షేపణీయ విషయం. చంద్రయానం గురించి చంకలు గుద్దుకుంటున్న దేశంలో అంతర్ధానమైన ముఖ్యమంత్రి ఆచూకీ కనిపెట్టటానికి చెంచుల సహాయం తీసుకోవటం దేనికి దర్పణం?
ముఖ్యమంత్రిని వెదికే క్రమంలో – పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అధికారులకు ఆదేశాలిస్తూ, అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ వినియోగించుకుంటూ సీనియర్ మంత్రి రోశయ్య నిద్రాహారాల్లేకుండా కష్టపడుతున్న తీరు ఆయనంటే కిట్టనివారైనా మెచ్చుకు తీరాల్సిందే. ఇంత కష్టపడేవాళ్లుండగా ఈ పరిస్థితెలా వచ్చింది? విలేకరుల సమావేశంలో రోశయ్యామాత్యుల పక్కన మైనం బొమ్మలా కూర్చునున్న రాష్ట్ర హోమ్ మంత్రిణి సబితా ఇంద్రారెడ్డిని ఒకసారి పరికిస్తే దానికి సమాధానం ఇట్టే దొరుకుతుంది. హోమ్ శాఖ వంటి కీలక శాఖని డమ్మీల చేతిలో పెట్టటంలో ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది. మన ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి బాధ్యతా రాహిత్యాలు లేనిదెక్కడ? ఐదేళ్లలో ముఖ్యమంత్రి అలవాటు చేసిన ఉదాసీనతే ఆయన్నీ విషమ పరిస్థితిలోకి నెట్టిందా?
జీపీఎస్ వంటి సాధనాలు సాధారణ జన బాహుళ్యానికీ విరివిగా అందుబాట్లోకొస్తున్న రోజులివి. ముఖ్యమంత్రి వంటి అత్యున్నత స్థాయి ప్రభుత్వాధినేత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ఎక్కడన్నా దిగిపోతే దాన్ని ట్రాక్ చెయ్యటానికి విశ్వసనీయంగా ఆధారపడదగ్గ సదుపాయాలే లేవంటే నమ్మలేని విషయం! ఆయన హెలికాప్టర్లో శాటిలైట్ ఫోన్ ఉందా లేదా అన్న విషయంలోనూ సందిగ్దత. ఆ హెలికాప్టర్ ప్రయాణార్హమైనదా కాదా అన్న విషయంలోనూ అయోమయం. సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రత విషయంలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటించటం అనేదుండదా?
వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల నల్లమల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ దిగిపోయి ఉండవచ్చంటున్నారు. శాటిలైట్ల సహాయంతో వారాల ముందే వాతావరణ నివేదికలు తెప్పించుకునే సౌలభ్యమున్న ఈ రోజుల్లో ముఖ్యమంత్రి ప్రయాణించబోతున్న మార్గంలో వాతావరణం ఎలా ఉన్నదీ, అత్యవసరంగా దారి మళ్లించాల్సి వస్తే ఎటు వెళ్లాల్సిందీ, ఏం చెయ్యాల్సిందీ ముందే నిర్ణయించే పద్ధతి అమల్లో లేకపోవటం వింత. ‘ఆకస్మిక తనిఖీలకు బయల్దేరినప్పుడు ముందస్తుగానే అలాంటి ఏర్పాట్లు చేసుకోటం సాధ్య పడదు’ అనే వాదనిక్కడ చెల్లదు. మనసుంటే మార్గముండదా? అసలు – ఎటువంటి వాతావరణంలో హెలికాప్టర్లు నడపొచ్చు, ఎటువంటప్పుడు నడపకూడదు అనే విషయంలో మన పైలట్లకు కఠినమైన మార్గదర్శకాలేమీ ఉండవా? ఉన్నా ముఖ్యమంత్రి ఒత్తిడితో వాటిని లెక్కచేయకుండా బయల్దేరి వెళ్లారా? అదే నిజమైతే – ఇది మరో పెద్ద ఉదాహరణ, మన వ్యవస్థ ఎలా పని చేస్తుందనేదానికి. ఎవరి పని వారిని సరిగా చేయనిస్తే ఇక్కడిదాకా వచ్చుండేది కాదా? అమెరికన్ ప్రెసిడెంట్ సైతం – స్వీయ రక్షణ విషయంలో – పాటించి తీరాల్సిన ప్రొటోకాల్స్ ఉంటాయి. ఆ వృత్తిలో అనుభవజ్ఞులు రూపొందించిన మార్గదర్శకాల ఆధారంగా ఏర్పరచిన నియమాలవి. ప్రెసిడెంట్ ఎవరనేదానితో, ఆయన ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా అవి అమలౌతాయి. మన విషయానికొస్తే – ఇక్కడ పై స్థాయిల్లో ఉండేవారి ఇష్టారాజ్యమే అంతా. నియమాలెన్నున్నా అమలుకు నోచుకోవు. పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఆ చూట్టం – ఇదే మొదటిసారి కాదు. ఇదే ఆఖరన్న నమ్మకమూ లేదు.
ఈ ఉదంతం రేకెత్తిస్తున్న ప్రశ్నలు ఇంకెన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడవన్నీ అప్రస్తుతం. ప్రస్తుతం మనమంతా కోరుకోవాల్సింది – ముఖ్యమంత్రి క్షేమంగా తిరిగి రావాలనీ, ఈ అనుభవాన్ని ఓ గుణపాఠంగా తీసుకుని తన భద్రత చూసుకునే విభాగంతో సహా మిగిలిన అన్ని ప్రభుత్వ విభాగాలనూ, శాఖలనూ సమర్ధుల చేతిలో పెట్టాలనీ. ప్రభుత్వమే చేతులెత్తేసి ముఖ్యమంత్రి ఆచూకీ చెప్పండంటూ ప్రజల్నడుగుతుంటే – మనం అంతకన్నా చెయ్యగలిగిందేముంది?
రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగా వ్యతిరేకించే నాకు కూడా ఈ వార్తలు టెన్షన్ కలిగిస్తున్నాయి. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన తరువాత కూడా హెలీకాప్టర్ మాయమవ్వడం పెద్ద జోక్. అయితే మాయమైన మనిషులు కనిపించకపోవడం జోక్ కాదు. అడవిలో ఉన్న మనుషులని శాటిలైట్ ద్వారా పట్టడం సాధ్యం కాదు. అందుకే జార్ఖండ్, ఒరిస్సా లాంటి ప్రాంతాలలో మావోయిస్టులు పోలీసులకి దొరకడం లేదు. ఒకవేళ శాటిలైట్ ద్వారా మనుషల్ని పట్టడానికి ప్రయత్నిస్తే ఏనుగులు, ఎలుగుబంట్లని కూడా మనుషులుగా చూపిస్తాయి శాటిలైట్ సిగ్నల్స్.
http://teluguwebmedia.net లో మరింత సమాచారం చూడండి.
boss fate always depends on team he is heading.As he built his team with spine less fellows like sabita and yadav,he got tste of their decision making inability and unable to act on time.
ఆయన ఇక దాదాపు గా లేడన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన సమర్థత గురించి మాట్లాడ్డం అంత న్యాయంగా తోచకపోయినా మైకు రోశయ్య చేతిలో పెట్టి నోరు మూసుక్కూచున్న చేవెళ్ల చెల్లెలిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. సాక్షాత్తూ హోమ్ శాఖ మంత్రిణి! ఆమెకు బదులుగా ఇటువంటి సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతుంటే సమర్థత కంటే రాఖీలకే విలువెక్కువని తోస్తోంది.
ఉదయం తొమ్మిదిన్నర్కు మాయమైన హెలికాప్టర్ గురించి ప్రభుత్వం దగ్గర సరైన సమాచారం సాయంత్రం నాలుగింటిదాకా లేదంటే, మీడియా సృష్టిస్తున్న వార్తలను ప్రభుత్వం కూడా నమ్మి కూచుందంటే, సాయంత్రం నాలుగింటి వరకూ ఒక నిర్ధారణకు రాలేకపోయిందంటే ఏం జరుగుతోందసలు?
ఏదేమైనా హెలికాప్టర్ క్రాష్ అయిందన్న వార్త రానే వచ్చింది. అందులోని వారెవరూ క్షేమంగా బయట పడే అవకాశాలు మృగ్యం! రాజశేఖర్ శకం ముగిసి జగన్ రంగ ప్రవేశం చేసినట్లే అనుకుంటా!
అబ్రకదబ్ర, ఈ సమయంలో ఆయన సమర్థత గురించి మాట్లాడ్డం న్యాయంగా లేదన్నది మిమ్మల్ని ఉద్దేశించింది కాదు, అది నేను కూడా ఎత్తి చూపాను! ఆ అభిప్రాయమే అది!
అర్ధమయింది (స్మైలీ పెట్టటం అంత బాగోదిప్పుడు). ఇప్పుడే కన్ఫర్మేషన్ చూస్తున్నాను NDTVలో. నిన్నగాక మొన్న చంద్రబాబుని ‘నువ్వు ఫినిష్’ అన్న మనిషి ఈ రోజు లేడు! అంతా మాయ.
Ok, it is announced…..he is no more!
ఆయన ఆత్మకు, మిగిలిన నలుగురు ఆత్మలకు శాంతి కలగాలి!
ఇందాకే బ్లాగుల్లో ఒకచోట చదివాను..”మరణం ఒక యాక్సిడెంట్” అని! ఎంత నిజం!
60 యేళ్ళకు రిటైరైపోతానని ప్రకటించాడు. అయ్యుంటే బహుశా ఇది జరక్కపోయేది.
చదువరి,
మీ sense of humour మెచ్చుకోదగింది! కానీ జోకులేయడానికి కొన్నీ సమయలుంటై
I am in Vizag now. RTC halted all of the bus services in Srikakulam district except non-stop busses.
@అబ్రకదబ్ర”నిన్నగాక మొన్న చంద్రబాబుని ‘నువ్వు ఫినిష్’ అన్న మనిషి ఈ రోజు లేడు! అంతా మాయ.”
నిజానికి వైయస్ అన్నమాట “That party was finished”
Thank you for correcting.