ఆగస్ట్, 2009ను భద్రపఱచురిజర్వేషాలు

దళిత క్రిస్టియన్లకూ రిజర్వేషన్లు కల్పించే దిశలో రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసన సభ తీర్మానం ఆమోదించటంతో రిజర్వేషన్ల తేనె తుట్టె మళ్లీ కదిలింది. రిజర్వేషన్లు వోటు సాధనాలుగా మారిపోయి దశాబ్దాలయింది. వాటి పేరుతో కులాల మధ్య కుమ్ములాటలు జరగటమూ సాధారణమైపోయింది. ఇప్పుడా గోదా లోకి మతాలనూ చేర్చిన ఘనత ముఖ్యమంత్రికి చెందుతుంది. ఉద్యమాలేమీ నడవకున్నా ఉన్న పళాన ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి కారణమేమిటో ఆయనకే ఎరుక. పోయిన టెర్మ్‌లో ఇలాగే అయాచితంగా ముస్లిములకి రిజర్వేషన్ వరం ప్రకటించి భంగపడ్డ చరిత్ర ఆయనది. ఇప్పుడీ వరం వెనక మతలబు – రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జంట నగరాల్లోని లక్షలాది క్రిస్టియన్ల వోట్లు కొల్లగొట్టటం కావచ్చు. ప్రధాన ప్రతిపక్షం సైతం ఈ విషయంలో వ్యతిరేకించలేని పరిస్థితి. వోటు బ్యాంకు రాజకీయాల యుగం కదా – ఇష్టమున్నా లేకున్నా వంతపాడక తప్పని గతి తెదేపాది. రేపెప్పుడో తెదేపా ఇంతకు మించిన దివాలాకోరు ప్రతిపాదనతో ముందుకు రావచ్చు, దానికి కాంగ్రెస్ తందానా అనొచ్చు. మతాధార రిజర్వేషన్లకు రాజ్యాంగం ఒప్పుకోదని ఇద్దరికీ తెలుసు. దాన్ని మార్చటం తమ పరిధిలోది కాదనీ తెలుసు. అయినా ఆగేది లేదు! ప్రజలకు పంగనామాలు పెట్టే కళలో ఇరు పక్షాలూ దొందూ దొందే. వోట్ల రాజకీయాలకొచ్చేసరికి ప్రరాపా కూడా ఆ తానులో ముక్కేనని తేలిపోయింది. ఇక భాజపా పంధా అందరికీ తెలిసిందే. హిందువుల్ని ఉద్ధరిస్తున్నట్లు కనిపించటానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోని పక్షం కాబట్టి వీళ్ల స్పందన దానికి తగ్గట్లుగానే ఉంది. ఉన్నంతలో పద్ధతిగా మాట్లాడింది లోక్‌సత్తా ఒక్కటే.

కులాలు హిందూ మతానికి ప్రత్యేకించినవైనప్పుడు కులాధారిత రిజర్వేషన్లు ఇతర మతాలకు వర్తింపజేయటం మతిలేని పని అనేది కొందరి వాదన. దళితులు క్రైస్తవంలోకి మారినా కుల వివక్ష తగ్గటం లేదు కాబట్టి రిజర్వేషన్ సదుపాయం ఆ మతస్తులకీ వర్తింపజేయాలనేది మరి కొందరి ప్రతివాదన. అటు క్రైస్తవం లోకి మారటం వల్ల వచ్చే లాభాలకి ఇటు రిజర్వేషన్లూ తోడైతే హిందూత్వం నుండి వలసలు మరింత పెరిగిపోతాయనే ఆందోళన హైందవ సంస్థలది. వీరి ఆందోళనలోనూ కొంత నిజముంది. ఈ రెండు రకాల వాదనల హోరులోనూ మూడో వర్గం రోదన ఎవరికీ వినిపించకుండా పోతుంది. ‘అసలు కులాధారిత రిజర్వేషన్లే దండగ’ అనే వాదన అది. ఇందులోనూ నిజమే ఉంది. రిజర్వేషన్లంటూ ఇస్తే వాటిని కులమతాలతో సంబంధం లేకుండా కుటుంబాల ఆర్ధిక స్థితిగతులని బట్టి ఇవ్వాలనే ప్రతిపాదన ఎప్పటినుండో ఉంది. వాటిని పట్టించుకుంటున్న పాపాన మాత్రం ఏ ప్రభుత్వమూ పోలేదు. ఎలా పోతుంది? అలా చేస్తే వోటు బ్యాంకులేం కావాలి? మెడలో గంటలు కట్టుకోమని పిల్లుల్నే అడిగితే ప్రయోజనం కల్ల.

అర్ధరాత్రి స్వతంత్రం వచ్చి అరవై మూడేళ్లయింది. ఈ మధ్య కాలంలో జనాభా రెట్టింపయింది. జనరాజకీయాలు విభజన రాజకీయాలయ్యాయి. రిజర్వేషన్లు వోట్ల సంపాదనకు దొడ్డిదారులుగా రాజకీయుల మంత్రాంగాల్లో సుస్థిర స్థానం సాధించుకున్నాయి. వాళ్ల పుణ్యాన – ఒక ఉద్దేశంతో మొదలైన కోటాలు పక్కదారి పట్టి వెర్రితలలేసి శాఖోపశాఖలుగా విస్తరించాయి. అనుభవిస్తున్నవారికి ఒరిగిందేమన్నా ఉందా అంటే – ఉన్నదల్లా కాకి లెక్కలే. అదే సమయంలో, రిజర్వేషన్ల దెబ్బతో అవకాశాలు కోల్పోయి అణగారిపోయిన అగ్రవర్ణాల పేదల లెక్కలు మాత్రం ఎవరూ తీసిన దాఖలా లేదు. రిజర్వేషన్ల కారణంగా పైకెదుగుదున్న ప్రతి పది మందికీ, అవే రిజర్వేషన్లు అడ్డు పడి కుదేలైపోయిన మరో పది మంది తయారవుతుంటే – వీటి పరమార్ధం ఎంతవరకూ నెరవేరిందన్నది ప్రశ్నార్ధకం. ఇప్పటికే దేశంలో మెజారిటీ జనాభా ఏదో ఒక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పరిస్థితుంది. ఇక మతాలనూ ఈ గొడుగు కిందకి పట్టుకొస్తే మిగిలిన వారి పరిస్థితేంటి? మరో పక్క – రిజర్వేషన్ల శాతం ఇంతకు మించకూడదన్న సుప్రీం కోర్టు హుకుం కారణంగా, కిక్కిరిసిన బస్సులో సీట్ల కోసం కొట్లాడుకునే ప్రయాణీకుల్ని తలపిస్తున్నాయి కోటాల్లో ఎవరి వంతు ఎంత అనే విషయంలో ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్న లబ్దిదారీ వర్గాలు. ఈ వర్గాలకి ఇప్పుడు వివిధ మతాల్లోని వెనకబడ్డ వర్గాలూ తోడైతే జరగబోయే జాతర ఊహకందదు.

రిజర్వేషన్ల వల్ల వెనకబడ్డవర్గాలకి ఒరిగిందేమన్నా ఉందో లేదో తెలీదు కానీ పెరిగింది మాత్రం మరింత వివక్ష, లబ్దిదార్లంటే అనేక మంది అగ్ర కులస్తులకు ఎనలేని చులకన. ఐతే – కొన్ని సార్లీ అగ్రవర్ణాల ఆక్రోశం రిజర్వేషన్ల వల్ల నిజంగానే ఎవరికీ ఉపయోగం లేదనా, లేక తమకి దక్కనిది పక్కవాడికి దక్కుతుందన్న అక్కసుతోనా అన్నది అంతుపట్టదు. ఓ పక్క కోటాల వల్ల తమ సొమ్మేదో పోతుందనుకునే వీళ్లు మరో పక్క అవకాశమొస్తే తామూ అలాంటి తాయిలాలందుకోటానికి సిద్ధంగా ఉంటారు. ప్రభుత్వాలు చేసే వివిధ రుణ మాఫీలు ఇలాంటి వాటికి పెద్ద ఉదాహరణ. ఈ మధ్య జరిగిన వ్యవసాయ రుణ మాఫీని దర్జాగా దుర్వినియోగం చేసేసిన అగ్రవర్ణ అధికాదాయ రైతులెందరో! అవకాశముంటే అనాయాసంగా అందలమెక్కటానికి అందరూ సిద్ధమే. మన తీరే అంత. కులమతాలకతీతంగా – అప్పనంగా వచ్చి పడే ముల్లె కోసం అర్రులు చాచటం సగటు భారతీయుడి బలహీనత. అధికారుల నుండి బంట్రోతులదాకా మామూలైపోయిన మామూళ్ల స్వీకరణ, ఆదాయప్పన్ను ఎగవేత, వోటుకు నోటు, డొనేషన్లు, కుంభకోణాలు .. ఇలా ఈ మనస్తత్వానికి తార్కాణాలెన్నో. ప్రభుత్వాలు దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నాలే – ఉచిత కరెంటు, రెండ్రూపాయల బియ్యం, అడ్డగోలు రిజర్వేషన్ల వంటి ప్రలోభాలు. మన బలహీనత ఆసరాగా పార్టీలాడే రాజకీయ చదరంగంలో పావులం మనమే. వ్యక్తిగత స్వార్ధాలకు సంఘ హితాన్ని బలిపెడుతున్న పాపులమూ మనమే. మనం మారందే, మన దేశాన్ని ఏ దేవుడూ కాపాడలేడు.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,194

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.