మన సినిమా – 2/2

మొదటి భాగంలో ‘లోపం ఎక్కడ’ అని ఒకటికి రెండు సార్లు అనుకున్నాం. సమాధానం చాలా తేలిక: నిబద్ధత లేమి. దీన్ని మన దర్శకనిర్మాతలు రకరకాలుగా కప్పిపుచ్చుకుంటారు – నిపుణుల కొరత, సమయాభావం, మార్కెట్ పరిమితులు, వగైరా, వగైరా. ‘పురుటి నొప్పుల ఊసొద్దు, బిడ్డని కని చూపెట్టు’ అనే అర్ధంలో ఆంగ్ల వాడుకొకటుంది. వంకలు చెప్పేవాళ్లు విజేతలవరు. నాణ్యత విషయంలో రాజీపడకూడదనే ఆలోచన ముఖ్యం. అదున్నప్పుడు ఫలితాలు వద్దన్నా వస్తాయి. ఇది గ్రాఫిక్స్ ఒక్కదానికే వర్తించే విషయం కాదు. కథల ఎంపిక దగ్గరే ఇది మొదలవాలి.

కథలనగానే మన దర్శకుల ముఖాల్లో ఎక్కడలేని నిర్వేదమూ కనిపిస్తుంది. ఎవర్ని కదిల్చినా ‘కథల కొరత సార్, కథకుల కొరత సార్’ .. ఈ మాటలే రాల్తాయి. ‘టెన్ కమాండ్‌మెంట్స్’, ‘ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్’ లాంటి అజరామర చిత్రాలు తీసిన హాలీవుడ్ దర్శకుడు సిసిల్ బి. డిమిల్‌ని కథల కొరత గురించెవరన్నా అడిగితే నవ్వేసి తన జేబులో ఉండే బుల్లి బైబిల్ని చూపిస్తూ ‘నాక్కావలసిన కథలన్నీ ఇందులో ఉన్నాయి’ అనేవాడట. మనకి బైబిల్‌ని తలదన్నే వారసత్వ సంపదుంది. మహాభారతంలో పాత్రల ఆధారంగా మణిరత్నం ‘దళపతి’ తీసి విజయం సాధించలేదా? ఆ మాటకొస్తే – కథల కోసం పురాణాల్లోనే వెదకనక్కర్లేదు. మన చుట్టూనే ఉన్నాయి – చూసే ఓపికుంటే. సరిగా తీస్తే – భావోద్వేగాల కథలు కళ్లు తుడుచుకుంటూ, కర్చీఫులు తడిపేస్తూ చూసే జనాలు మనకి కోకొల్లలు. నిజ జీవిత విజయ గాధల స్ఫూర్తితో హృదయాన్ని కదిలించే సినిమాలు తీయటం హాలీవుడ్‌కి వెన్నతో పెట్టిన విద్య. మనవాళ్లూ అలాంటివి తీయకపోలేదు. ఒకప్పుడు ఉషాకిరణ్ మూవీస్ అలాంటి సినిమాలే తీసి అలవోకగా విజయాలు కొల్లగొడుతుండేది. మరి ఇప్పుడేమయింది? పోనీ, నిజగాధల్ని సినిమాలుగా మార్చే నేర్పూ, ఓర్పూ లేదనుకుందాం. సమకాలీన సాహిత్యాన్ని – అంటే నవలల్ని – సినిమా సరుకుగా వాడుకోవచ్చు కదా. తెలుగులో ఇవి పూర్తిగా కనుమరుగైపోయాయి. మన గురించి మనవాడు రాసిన ‘క్యు & ఎ’ సత్తాని విదేశీయులు గుర్తించి దానితో ఫక్తు వ్యాపారాత్మక సినిమా తీసి అంతర్జాతీయంగా అవార్డులూ రివార్డులూ కొల్లగొట్టారు. కథల కొరత గురించి మాట్లాడే దర్శక నిర్మాతలు సిగ్గుపడాల్సిన విషయమిది.

అసలు – సినిమా కథలు మనవే కానవసరం లేదు. ప్రేక్షకులకి సంబంధించినంతవరకూ ఓ సినిమాకి మూలకథ ఎక్కడిదన్న విషయం అనవసరం. ప్రపంచంలో కథలకెప్పుడూ లోటు లేదు, రాదు. విదేశీ సాహిత్యం నుండి ఆలోచనలు అరువు తెచ్చుకోవటం అనాదిగా ఉన్నదే. దాన్ని మనకి తగ్గట్లుగా మలచుకోవటమే ముఖ్యం. అలనాటి ‘పెద్దమనుషులు’ దీనికో మంచి ఉదాహరణ. అంతెందుకు – నేటి ఫ్యాక్షన్ పగ-ప్రతీకారాల కథలన్నిటికీ ఆధారం ఎప్పుడో నూట యాభయ్యేళ్ల క్రితం అలగ్జాండర్ డ్యూమాస్ రాసిన ‘కౌంట్ ఆఫ్ మాంటెక్రిస్తో’ కాదూ? ఆ ఐడియాకి మార్పులూ చేర్పులూ చేసి తొంభైల మొదట్లో ముకుల్ ఆనంద్ అమితాబ్‌తో ‘హమ్’ తీస్తే, ఆ తర్వాత మూడేళ్లకి సురేష్ కృష్ణ దానికే మరికొన్ని మెరుగులద్ది తమిళంలో ‘బాషా’ తీయటం, మరో నాలుగేళ్లకి ‘సమరసింహారెడ్డి’తో అలాంటి ఇతివృత్తాలు తెలుగులోకి రంగప్రవేశం చెయ్యటం – అప్పట్నుండీ మనవాళ్లు అదే కథాంశాన్ని నమ్ముకుని కుప్పలుతెప్పలుగా సినిమాలు తీయటం జరుగుతుంది. కాబట్టి సమస్య కథల కొరత కాదు, కథకుల కొరతా కాదు. ఒక రకం కథ విజయవంతమైతే ఏళ్లపాటు దాన్నే పట్టుకు వేలాడే దర్శకనిర్మాతల బలహీనతే అసలు సమస్య. ఇదే తెలుగు సినిమా కథల్లో వైవిధ్యం లోపించిన కారణం. కథకులకి చట్రాలు బిగించి మాకిలాంటి కథలే కావాలంటూ బిగుసుకుని కూర్చుంటే కొరత రాకేమవుతుంది?

కొత్త రకం కథలు ప్రయత్నించటానికి ఎందుకంత భయం? నలిగిన దారిలోనే నడవటం శ్రేయస్కరం అనుకుంటూ పాత చింతకాయ పచ్చడినే నమ్ముకునే దర్శక నిర్మాతలు కోకొల్లలు. మరి ఈ పాత పచ్చడి అమ్ముడుపోతుందా అంటే లేదనేదానికి ఏఏటికాయేడు రెండో వారంలోనే తిరిగొచ్చే డబ్బాల సంఖ్య పెరిగిపోతుండటం నిదర్శనం. రిస్క్ సమానమే ఐనప్పుడు కొత్త దారి ప్రయత్నించటానికి మొహమాటమెందుకు? పక్కనే తమిళ రంగం అలాంటి ప్రయోగాలు చేస్తూ విజయవంతమైన సినిమాలు తీస్తుంటే ఇంకా అనుమానమెందుకు? తెలుగులో సైతం ఒకరిద్దరు చిన్న నిర్మాతలు తెగించి అలాంటి సినిమాలు తీసి సఫలమౌతున్నప్పుడు అలాంటివారికి స్ఫూర్తిగా నిలవాల్సిన భారీ నిర్మాతలు మాత్రం పాత సీసాలో మురిగిపోయిన సారా పోసి అమ్మాలనుకోవటం శోచనీయం.

భారీ నిర్మాతనెవరినైనా ఇదే ప్రశ్న అడిగితే వెంటనే వచ్చే సమాధానం: ‘కోట్లతో ముడిపడ్డ వ్యవహారం. అంత డబ్బుతో జూదం ఎలా చేస్తాం?’. మన సినిమాలు ఇలా అఘోరించటానికి అసలు కారణం ఇదే – జూదగాళ్లు నిర్మాతల అవతారమెత్తటం. సరిగా చేస్తే ఇదీ సరైన వ్యాపారమే. లాభాలు లేకపోయినా కనీసం అసలుకి గ్యారంటీ ఇచ్చే వ్యాపారం. వ్యాపారస్తుడికి తను ఉత్పత్తి చేసే వస్తువు ఏ ఏ వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తుందీ ఓ అంచనా ఉంటుంది. మరి మన సినిమావాళ్లు చేసేదేంటి? సినిమా తీస్తే ఎనిమిది కోట్ల ఆంధ్రుల్నీ అలరించాలన్న లక్ష్యంతోనే తీస్తారు. అదెలా సాధ్యం? ప్రేక్షకుల్ని క్లాస్-మాస్ అంటూ రెండు వర్గాలుగా విభజించటం సరి కాదు. నిజానికి అంతకన్నా ఎక్కువ వర్గాలే ఉన్నాయి వాళ్లలో. వాటిలో తమ టార్గెట్ ఏ వర్గమో (లేక వర్గాలో) ముందుగానే నిర్ణయించుకుని సినిమా తీయటం ఒక పద్ధతి. అందరికీ నచ్చేలా తీయాలనుకుంటూ కథలో అనవసరమైన హుంగులూ ఆర్భాటాలూ చొప్పించేసి చివరికి అదెవరికీ నచ్చకుండా చేసి అసలుకే ఎసరు తెచ్చుకోవటం మరో పద్ధతి. చిన్న పిల్లలకోసం ప్రత్యేకించిన సినిమాలు తెలుగులో వచ్చి ఎన్నేళ్లయింది? పిల్లల కోసం ఓ మంచి సినిమా తీస్తే వాళ్ల కోసం పెద్దలూ సినిమా హాళ్లకు బయల్దేరక తప్పదు. ఒక్క దెబ్బకి రెండు మూడు పిట్టలు. అతి తేలికైన వ్యాపార సూత్రమిది. రాంగోపాల్‌వర్మ లాంటి తెలివిగల తెలుగోడు ఆ కిటుకు ఎప్పుడో గ్రహించటమే కాకుండా ఓ రకంగా ఒంటి చేత్తో దాన్ని హిందీ వాళ్లకీ వంటబట్టించాడు. అతని సినిమాల్లో భిన్నత్వం ఎంత అనేది కాసేపు అవతల పెడదాం. లక్ష్యిత ప్రేక్షక వర్గం ఏదనేదీ ముందుగానే నిర్ణయించుకుని, సరైన ప్లానింగ్‌తో, ఖర్చులు అదుపులో ఉంచుకుంటూ ఓ పద్ధతి ప్రకారం సినిమాలు తీసుకుంటూ పోతే జయాపజయాలకతీతంగా లాభాలే కానీ నష్టాలుండవనేది అతను గ్రహించిన విషయం. దీన్నతను హాలీవుడ్‌ని బాగా పరిశీలించి నేర్చుకుని ఉండొచ్చు.

హాలీవుడ్ ప్రస్తావన (మళ్లీ) వచ్చింది కాబట్టి ఇక్కడో ఆసక్తికరమైన విషయం. అమెరికా ఆర్ధిక రంగం కుదేలైన ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా వ్యాపార రంగాలు గిజగిజలాడుతుంటే, హాలీవుడ్ మాత్రం పచ్చగా కళకళలాడుతుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో హాలీవుడ్ మేజర్ స్టుడియోలు విడుదల చేసిన సినిమాలు అర్జించిన ఆదాయం పోయినేడాది అదే కాలంతో పోలిస్తే అరవై శాతం అధికం! ఆర్ధిక మాంద్యం కారణంగా ప్రజలు ఇతర ఖరీదైన వినోద ప్రదర్శనలకు (నాటకాలు, అమ్యూజ్‌మెంట్ పార్క్స్, వగైరా) బదులు చవకలో ఐపోతుందని సినిమాలు చూడటం వైపు మొగ్గు చూపటం దీనికి ప్రధాన కారణం. స్టుడియోలు కూడా ఈ పరిస్థితిని ముందే అంచనా వేసి ఈ నిరాశాపూరితమైన వాతావరణంలో ప్రేక్షకులకి ఆహ్లాదం పంచే, భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించే కథలతో సినిమాలు తీసి విడుదల చెయ్యటం ద్వారా సొమ్ము చేసుకుంటున్నాయి. అదీ, ప్లానింగ్ అంటే. అదొక్కటే కాదు – సమ్మర్ సెలవుల్లో విద్యార్ధుల్ని దృష్టిలో పెట్టుకుని, క్రిస్మస్ సెలవుల్లో కుటుంబ కథా చిత్రాలు .. ఇలా సీజన్‌కి ఒక రకం సినిమాలు విడుదల చెయ్యటం హాలీవుడ్ రివాజు. ఏ తరహా ప్రేక్షకులకి ఎప్పుడు సినిమాలు ఎక్కువగా చూసే తీరుబడి ఉంటుందనేదానిపై ఆధారపడి చేసుకునే ప్లానింగ్ అది. మనవాళ్లలో లోపించింది అదే. అమెరికన్ ప్రేక్షకులకోసం ఉద్దేశించిన పద్ధతుల్ని మనవాళ్లు అలాగే కాపీ కొట్టేయనవసరం లేదు. మనకీ ప్రణాళికలుండటం ముఖ్యం. మరి మనవాళ్ల పద్ధతో – గుడ్డెద్దు చేలో పడ్డట్లు సినిమాలు తియ్యటం, ఎప్పుడు పూర్తైతే అప్పుడు విడుదల చెయ్యటం, ఆపై తూర్పు తిరిగి దండం పెట్టటం. కోట్లాది రూపాయలతో, కొన్ని వేల జీవితాలతో ముడిపడ్డ వ్యాపారం చేసే పద్ధతి ఇదా? దానిక్కారణం ఏంటంటే పాతుకుపోయిన స్టార్ సిస్టమ్ అని చెబుతారు. హీరోలూ, హీరోయిన్లూ గీసిన గీత నిర్మాత జవదాటలేడంటారు. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టే నిర్మాత అంత బలహీనుడన్నమాట. అంటే మనం సినిమాలు తీసే పద్ధతిలోనే మౌలికమైన లోపం ఉంది. అప్పుడు మార్చాల్సింది దాన్నే.

మన సినీ పరిశ్రమ నేటికీ ఓ సంఘటిత రంగంగా రూపొందకపోవటం అసలు సమస్య. దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి ప్రత్యక్షంగానో (దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రదర్శనదారులు) పరోక్షంగానో (ధియేటర్లలో దుకాణదారులు, పార్కింగ్ వ్యాపారం, పబ్లిసిటీ రంగం) ఉపాధి కలిగిస్తున్నా, ప్రభుత్వాలకి పన్నుల రూపేణా ఇతోధికంగా ఆదాయం సమకూర్చిపెడుతున్నా సినిమా నిర్మాణం అనేది ఇప్పటికీ చాలావరకూ కిరాణా వ్యాపారంలాగానే జరగటం దీని వెనకున్న అనేక రకాల సమస్యలకీ కారణం. అందినకాడికి అప్పులు తీసుకొచ్చి, నటీనటుల అందుబాటుని బట్టి సినిమా చుట్టేసి, చేసిన అప్పులపై చక్రవడ్డీలు పెరిగిపోతాయన్న భయంతో – సినిమా పూర్తవగానే వచ్చినకాడికి అమ్మేసుకుందాం అనుకునే పరిస్థితిలో నిర్మాతలుంటే ప్రణాళికలకి తావెక్కడ? ఈ పరిస్థితి పోవాలంటే – ఒక సినిమా ఫట్ అంటే పత్తా లేకుండా పోయే నిర్మాతల స్థానంలో జయాపజయాలకి అతీతంగా సినిమాలు తీసే సత్తా కలిగిన నిర్మాణసంస్థలు ఆవిర్భవించాలి; మనకి మళ్లీ స్టుడియో సంస్కృతి రావాలి.

హాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్నట్లు మొదట్లో మనకీ స్టుడియోల సారధ్యంలోనే సినీ నిర్మాణం జరుగుతుండేది. ఆ కాలంలో గొప్ప గొప్ప సినిమాలు చాలానే వచ్చాయి. ఎప్పుడైతే ఎవరుబడితే వాళ్లు నిర్మాతల అవతారాలెత్తి సొంతగా సినిమాలు తీయటం మొదలు పెట్టారో, ఎప్పుడైతే స్టుడియోలు కనుమరుగైపోయాయో అప్పుడే మన సినిమాలూ అధోముఖం పట్టటం మొదలయింది. హిందీ సినిమాలు ఈ మధ్య మెరుగుపడటానికి, అక్కడ మళ్లీ మొలకెత్తుతున్న స్టుడియో సంస్కృతికీ సంబంధముంది – గమనించండి. అన్నట్టు, స్టుడియోలంటే – నా ఉద్దేశంలో రామోజీ ఫిల్మ్ సిటీ, రామానాయుడు స్టుడియోల వంటి సదుపాయాలు సమకూర్చే ప్రాంతాలు కాదు – యూటీవీ మోషన్ పిక్చర్స్‌లా కార్పొరేట్ సరళిలో సినీ నిర్మాణం గావించే సంస్థలు. తెలుగులో ఇప్పుడూ కొన్ని బడా నిర్మాణ సంస్థలున్నాయి, కానీ వాటి పరమార్ధం – ప్రధానంగా – తమ తమ వారసులకి ఉపాధి కల్పనే కాబట్టి వాటివల్ల అంతగా ఉపయోగం లేదు. మనకి అసలు సిసలు స్టుడియో సంస్కృతి రావాలి . నిర్మాత అనేవాడు పెట్టుబడి పెట్టేవాడిలా కాక జెర్రీ బ్రూకమయిర్ లా ఓ ఉద్యోగిగా ఉండాలి. స్టుడియోల్లో – కథల కోసం నిరంతరం అన్వేషిస్తుండే విభాగాలుండాలి. ఈ పద్ధతిలోనైతే – స్టుడియో అంటూ పెట్టాక అది నడవటం కోసం వరుసగా సినిమాలు తీస్తూనే ఉండాలి కాబట్టి – ఒక్కో స్టుడియో ఏడాదికి పదో ఇరవయ్యో సినిమాలు తీయొచ్చు. వాటిలో కొన్ని సినిమాలు ఫ్లాపైనా, కొన్ని హిట్టయ్యే అవకాశముంటుంది. రిస్క్ తక్కువ. ఆ రకంగా దర్శకులు కొత్త రకం కథాంశాలని తెరకెక్కించే, ప్రయోగాలు చేసే అవకాశమూ ఎక్కువుంటుంది. వ్యాపారానికి ఇప్పట్లా ఫైనాన్షియర్ల దగ్గరికి అప్పుల కోసం పరిగెత్తకుండా బ్యాంకు రుణాలు పొందే సదుపాయమూ ఉంటుంది. సొంతగా సినిమాలు తీసే నిర్మాతకన్నా స్టుడియోకి అందుబాట్లో ఉండే నిధులు ఎక్కువ కాబట్టి అందులో కొంత కొత్తరకం సాంకేతిక వనరుల సృష్టికోసం ఉపయోగించే వెసులుబాటూ ఉంటుంది. హాలీవుడ్‌లోలా నాలుగైదు ‘మేజర్ స్టుడియోస్’ మనకీ ఏర్పడితే వాళ్లందరూ ఉమ్మడిగా మనకవసరమయ్యే టెక్నాలజీ సృష్టి, నాలెడ్జ్ పూల్ ఏర్పాటు, నిపుణుల తర్ఫీదు వంటి విషయాలకోసం కృషి చెయ్యనూవచ్చు.

రాసుకుంటూ పోతే ఇంకా బోలెడుంది. ఇప్పటికే పెద్దదైపోయింది కాబట్టి ఇక్కడితో ఆపేస్తాను. సారాంశమేంటంటే – హాలీవుడ్ అనేది ఒక ప్రూవెన్ ఫార్ములా. అప్పుడప్పుడూ వాళ్ల కథలు, సాంకేతిక హంగులు ఎలాగూ మనకి చేతనైన రీతిలో కాపీ కొట్టేస్తున్నాం. ఆ కొట్టేదేదో వాళ్ల సినీ నిర్మాణ శైలిని, వ్యాపార పద్ధతుల్ని కూడా కాపీ కొడితే పోయేదేమీ లేదు. గుడ్డిగా వాళ్లని అనుకరించమని నా సూచన కాదు. మనవైన మార్పు చేర్పులుండాల్సిందే. ఎలాగైనా – ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్మాణ పద్ధతులు పోయి సినీ నిర్మాణాన్ని నిజమైన వ్యాపారంలా చెయ్యగలిగిననాడే మనకి మంచి సినిమాలొస్తాయి. ఒకరిద్దరు వ్యక్తులు పెట్టుబడి పెట్టి నిర్మాతలుగా ఉండే పద్ధతి పోయి నిఖార్సైన నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో సినిమాలు రూపొందే రోజులు రావాలి. అప్పుడు సూపర్‌స్టార్ల దయాదాక్షిణ్యాలపై ఆధార పడటం మానేసి స్టుడియోలే స్టార్లని సృష్టించగలుగుతాయి. అయితే మీలో కొందరనుకోవచ్చు: ‘ఇదంతా జరిగే పనేనా? పిల్లి మెడలో గంట కట్టేదెవరు?’. నాకూ తెలీదు. తెలిసిందొకటే. మనవాళ్లు చెయ్యకపోతే ఈ పనీ త్వరలో మనకోసం హాలీవుడ్ బడా స్టుడియోలే చేసిపెడతాయి. ఇప్పటికే వార్నర్ బ్రదర్స్, ఫాక్స్, యూనివర్సల్ వంటి సంస్థలు మన భాషల్లో చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉన్నాయి. ప్రపంచంలో అతి పెద్ద సినిమా మార్కెట్లలో ఒకదాన్ని వదులుకోటానికి వాళ్లైతే సిద్ధంగా లేరు. మరి మనవాళ్లో?

(సమాప్తం)

గమనిక:
1. చిత్రరంగం యావత్తూ స్టుడియోల నియంతృత్వంలోకి వెళ్లిపోతే వచ్చే సమస్యలూ కొన్నున్నాయి. వాటి గురించి విపులంగా మరెప్పుడైనా చర్చిద్దాం.
2. ముందుగా అనుకున్న రెండు భాగాలకు కొనసాగింపుగా, సినిమా చిత్రీకరణ పద్ధతుల గురించి నేను త్వరలో రాయబోతున్న మూడవ భాగం నవతరంగంలో మాత్రమే ప్రచురితమవుతుంది. అది నా బ్లాగులో ఉండదు.

8 స్పందనలు to “మన సినిమా – 2/2”


 1. 1 కన్నగాడు 2:06 సా. వద్ద ఆగస్ట్ 19, 2009

  ఎవరో ఒకరు వచ్చి మొత్తం పరిశ్రమనే హైజాక్ చేసి చేతులు కాలే వరకు ఇంతే, ఆ తర్వాత వీళ్లు మారుతారనుకునేరు అప్పుడు అన్యాయం జరిగింది మొర్రో అని ధర్నాలు, ప్రభుత్వానికి విన్నపాలు మొదలెడుతారు కాని కొత్తపుంతలు తొక్కుతారన్న నమ్మకం లేదు.

 2. 2 a2zdreams 2:40 సా. వద్ద ఆగస్ట్ 19, 2009

  ఆలోచింప జేసే పోస్ట్. బాగుంది. నిర్మాణ సంస్థలు మీరు చెప్పిన సౌకర్యాలు కల్పిస్తే మంచి సినిమాలు రావడానికి అవకాశం వుంది.

 3. 3 Sai Brahmanandam 3:44 సా. వద్ద ఆగస్ట్ 19, 2009

  ఇండియాని కుటుంబ పాలన ఎలా పట్టి పీడిస్తోందో, అలాగే తెలుగు సినీ రంగానికీ కుటుంబ వ్యాపార జాడ్యం దాపురించింది. ఓ నాలుగు కుటుంబాల వ్యాపార సాధనంగా మారి ప్రజల్ని పీక్కుతింటోంది. ఈ పరిస్థితి ఇప్పట్లో బాగుపడే సూచనలు లేవు. సుశాంత్, అల్లు అర్జున్ వంటి వాళ్ళు సినీ కుటుంబ నేపథ్యం నుండి కాక మామూలు కుటుంబాలనుండి వస్తే మనగలిగేవారా? ఏ నిర్మాతయినా వీళ్ళని హీరోలుగా పెట్టి సినిమా తీసే సాహసం చేసేవాడా? ఇదొక్కటీ చాలు తెలుగు సినీ రంగ పరిస్థితిని చెప్పడానికి. గతంలో రాజీవ్ గాంధీ భారత దేశ ప్రధాని కావడాని ఏం అర్హతులున్నాయో, వీరికీ నటులుగా చెలామణీ అవ్వడానికవే అర్హతలున్నాయి. ఇది మన దురదృష్టం. అంతే! హాలీవుడ్ లాంటి పరిస్థితి వచ్చే సూచనలే లేవు. ఎవరైనా ప్రయత్నించినా ఈ కుటుంబ గోడలు చీల్చుకొని బయటకు రాలేవు.

 4. 4 జీడిపప్పు 5:11 సా. వద్ద ఆగస్ట్ 19, 2009

  One of the finest articles about Telugu movies.

  “మనవాళ్లు చెయ్యకపోతే ఈ పనీ త్వరలో మనకోసం హాలీవుడ్ బడా స్టుడియోలే చేసిపెడతాయి.”

  Eagerly waiting for that great moment 🙂

 5. 5 rayraj 12:53 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2009

  “మనవాళ్లు చెయ్యకపోతే ఈ పనీ త్వరలో మనకోసం హాలీవుడ్ బడా స్టుడియోలే చేసిపెడతాయి.”
  బాగా చెప్పారు.

  “ప్రపంచంలో అతి పెద్ద సినిమా మార్కెట్లలో ఒకదాన్ని వదులుకోటానికి వాళ్లైతే సిద్ధంగా లేరు. మరి మనవాళ్లో?”
  ఏముంది? ఆ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తారు.మన నిర్మాతలు వారి కింద వ్యాపారవేత్తలుగా సామంతులై లాభపడతారు.

  ఇందులో, స్టాటింగ్‌లో కొన్నివిషయాలు పూర్తిగా ఏకీభవించాను. బిజినస్ మోడల్స్ గురించి చాలా చర్చ జరగాలి. మీరు “గమనిక” వేసేసారు గాబట్టి వదిలేద్దాం.

 6. 6 vinay chakravarthi 11:43 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

  gud analysis but oka side maatramae alochinchaaru……….

  alane meeru graphics meeda raasina daani i read some where…..

  meeku technology side emina idea vunda……..na doubt……
  perceptual concept teliste meeru anta easy ga aapost raasae vaaru kaadu………….

  example……

  manam oka konda meeda nilabadina scene graphics add cheyataaniki and meeru choopinchina scene ki chaala difference vuntundi……..

  modati daanlo adi graphic ani easy ga mana eye findout chestundi……
  rendo daanilo eye ki anta time dorakadu……….

  ee perceptual ane concept video compression ki basic……..

  nenu daani meeda nae work chesedi so naaku meedi correct anipinchaledu………..

  • 7 అబ్రకదబ్ర 11:08 ఉద. వద్ద ఆగస్ట్ 21, 2009

   @vijay chakravarthi:

   I’m not a professional, but I certainly know the abc’s 🙂 I’m an aspiring movie maker with a bit of experience in script writing, camera operation, lighting, editing (FCP, PremierePro, Vegas) and CGI (primarily using Maya). Please look forward for my upcoming essay on filming techniques in Navatarangam. This will be part 3 of the current essay, which will only appear in NT.

 7. 8 vinay chakravarthi 3:37 ఉద. వద్ద ఆగస్ట్ 24, 2009

  abraka dabra gaaru i expected same ans…..
  camera work ani kaadu nenu cheppedi….

  ok i will be back 2 u after reading ur upcoming post……..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: