టి-ట్వంటీ శతావధానం

‘ఎప్పుడో పడవల్లో ప్రయాణాలు చేసే రోజుల్లో కట్టిన రాగాలూ, పాడిన పాటలూ అవి. మరి ఇప్పుడో – బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జెట్లు అన్నీ వచ్చేశాయి. మన దైనందిన జీవితంలో ఎలాగైతే స్పీడొచ్చిందో, అలాగే సంగీతంలోనూ రావాలి ….’

– దాసు

* * * *

ఐదు రోజుల క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లంటే ఆవులించేవారికోసం ఒక రోజు మ్యాచ్‌లు పుట్టుకొచ్చి నిండా నలభయ్యేళ్లు కాలేదు, అప్పుడే వన్డేలు సైతం వీర బోర్ అనే తరం కోసం మూడు గంటల్లో ముగిసిపోయే ట్వెంటీ-ట్వెంటీలు రంగప్రవేశం చేశాయి. మరో పదేళ్లలో టి-టెన్ పోటీలూ రావని లేదు. ఇది వేగ యుగం. కలకాలం నిలవాలంటే కాలానికి తగ్గట్లు మారాల్సిందేననేది ఆటలకే కాక అవధానం వంటి సాహితీ ప్రక్రియలకీ వర్తించే విషయం. కొన్ని విషయాల్లో దాసు చెప్పింది పాటించటమే మేలు. శంకరశాస్త్రి కళ్లెర్రజేసినా సరే – తప్పదు, తప్పు లేదు.

ఆ దృష్టితో – ఏళ్లుగా ప్రాచుర్యంలో ఉన్న నియమాలు మార్చి కొత్తరకంగా ప్రయత్నించిన శతావధానమొకటి నిన్న సాయంత్రం బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మిల్పిటాస్ నగరంలో జరిగింది. అమెరికాలో ఇంతకుముందు డజన్లకొద్దీ అష్టావధానాలు జరిగినప్పటికీ, ఇక్కడ జరిగిన మొదటి శతావధానం ఇదే కావటం విశేషం. సాంప్రదాయకంగా – శతావధానానికి కనీసం మూడు రోజుల సమయం పడుతుంది. అమెరికా ఆంధ్రుల్లో అన్ని రోజులపాటు కూర్చుని శతావధానాలు చూసే ఓపిక, తీరిక ఉన్నవాళ్లెందరు? ఆ మాటకొస్తే అలాంటివారు ఈ కాలంలో తెలుగుదేశంలో సైతం ఎక్కువమంది ఉండకపోవచ్చు. బహుశా అందుకే ఈ ప్రక్రియని ఇంతవరకూ అమెరికాలో ఎవరూ ప్రదర్శించినట్లు లేరు. ఇన్నేళ్లకు, మహమ్మదు-కొండ సామెత స్ఫూర్తితో, బే ఏరియా వాస్తవ్యులు మల్లాది రఘు, గొర్తి సాయి బ్రహ్మానందం (ఈయన బ్లాగ్లోకంలో సుపరిచితులే) పూనుకుని ప్రముఖ అవధాని మేడసాని మోహన్ గారితో నాలుగు గంటల్లోనే ముగిసిపోయే శతావధానమొకటి చేయించ తలపెట్టారు. సరిగా నూరేళ్ల క్రితం, 1909లో, అవధానానికి ఆదిగురువులు తిరుపతి వేంకట కవులు ఇలా నాలుగ్గంటల్లో శతావధానం చేసినట్లు ఎప్పుడో విన్న/చదివిన గుర్తు. ఆ తర్వాత మరెవరన్నా ఇలాంటిది ప్రయత్నించిందీ లేనిదీ తెలియదు.

మూడు రోజుల కార్యక్రమాన్ని నాలుగ్గంటలకు కుదించటమే కాకుండా, సాధారణంగా అష్టావధానంలో మాత్రమే కనిపించే కొన్ని అంశాలు ఈ టి-20 శతావధానంలోనూ ప్రవేశపెట్టటం విశేషం. వందమంది పృచ్ఛకులు తలా ఒక ప్రశ్న అడగటం శతావధానంలో రివాజు. దానికి భిన్నంగా (పృచ్ఛకుల కొరత కారణం అనుకోవచ్చేమో) పాతిక మంది పృచ్ఛకులు ఒక్కొక్కరూ నాలుగేసి ప్రశ్నల చొప్పున – నిషేధాక్షరి, దత్తపది, సమస్యా పూరణం, న్యస్త్యాక్షరి, ఆశువు, వర్ణన, అప్రస్తుత ప్రసంగం – ఇలా ఏడు అంశాల్లో అవధానికి సవాళ్లు విసరటమూ, ఆయన అవలీలగా వాటినెదుర్కొని బంతిని బౌండరీ దాటించటమూ జరిగిపోయింది (ఎనిమిదో అంశం ‘ధారణ’ ప్రయోగాత్మకంగా కొద్దిసేపు చేసి ఆ తర్వాత సమయాభావం వల్ల ఎత్తేయటం జరిగింది)

ఇలాంటి ప్రయోగాలు మొదటిసారి చేసేటప్పుడు కొన్ని తప్పులు దొర్లటం సహజమే. ఇక్కడ చెప్పుకోవలసింత పెద్ద తప్పులు దొర్లలేదు కానీ – ఉపన్యాసాలు, పొగడ్తలు వగైరా ఊకదంపుడు కార్యక్రమాలేవీ లేకుండా అతి క్లుప్తమైన పరిచయాల అనంతరం ఎకాఎకీ అసలు కార్యక్రమంలోకే దిగిపోయినప్పటికీ – శతావధానం ముందుగా ప్రచారం చేసినట్లుగా నాలుగ్గంటలకు బదులు ఆరు గంటలపాటు కొనసాగటం, అది ఆదివారం రాత్రి కావటంతో ప్రేక్షకుల్లో చాలామంది చివరిదాకా ఉండకుండా వెళ్లిపోవటం జరిగింది. ఇక్కడ సమస్య బ్యాటింగ్ క్రీజ్‌లో ఉన్న అవధానిది కాదు – ఫీల్డింగ్ చేస్తున్న పృచ్ఛకుల జట్టుది. అవధానిగారి భీకరమైన ఫామ్ చూస్తే, పృచ్ఛకులు మరి కొంత వేగంగా బౌలింగ్ చేసుంటే ఆయన నాలుగ్గంటల్లోనే నూరు పద్యాలూ అల్లేసుండేవాడనిపించింది. నిర్వాహకులు ఈ విషయంలో దృష్టి పెడితే భవిష్యత్తులో నాలుగ్గంటల్లో శతావధానాలు ముగించటం సాధ్యమే.

పృచ్ఛకుల ప్రస్తావన వచ్చింది కాబట్టి వారిలో నన్నాకట్టుకున్న ఒక వ్యక్తి గురించి రెండు ముక్కలు. ఆయన పేరు మొహమ్మద్ ఇక్బాల్. బమ్మెర పోతన పద్యాలూ, రామాయణ, భారత ఘట్టాలు వర్ణించే శ్లోకాలూ ఆయన అలవోకగా చదివేసి మరీ అవధానికి ప్రశ్నలు సంధిస్తుంటే నాకు ఆనందం, ఆశ్చర్యం వేసింది. భారతీయత అనేది ఓ వర్గం గుత్త సొత్తైనట్లు తరచూ లెక్చర్లు దంచే నా మితృడొకడు ఈ శతావధానానికి రమ్మంటే ‘మగధీర’ సినిమాకెళ్లే పనుందంటూ మొహం చాటు చేసినప్పుడు కించిత్ బాధేసింది. ఇక్బాల్ గారిని చూసినప్పుడు – ఇలాంటివాళ్లున్నంతవరకూ మన సంస్కృతికొచ్చిన పెను ముప్పేమీ లేదనిపించింది.

పృచ్ఛకుల్లో ఇతరులూ ఇక్బాల్‌గారికి తీసిపోనివారే – నాలాంటి ఒకరిద్దరు తప్ప. నాకిచ్చిన అంశం దత్తపది. నాకొచ్చిన కొద్దిపాటి తెలుగుతో, చిన్ననాడెప్పుడో నేర్చుకున్న ఛందస్సులో నాకు గుర్తున్న వృత్తాల ఆధారంగా నాలుగు ప్రశ్నలు తయారు చేసుకుని నా వంతొచ్చినప్పుడు అవధాని గారికి విసిరాను. వాటిలో ఒకదానికి ఆయనల్లిన పద్యం, కింద – మీకోసం. ఆయనకి నాలుగు పదాలు, అంశం ఇచ్చి పూరించమన్నాను. మీకు అంశం, పద్యం ఇచ్చి ఆ నాలుగు పదాలేవో కనుక్కోమంటున్నాను. తేలికే, పట్టుకోండి (రెండవ, మూడవ పాదాలు పరిశీలిస్తే ఆ పదాలు ఎలాంటివయ్యుంటాయో ఓ ఐడియా వస్తుంది. వాటి ఆధారంగా మొదటి, నాలుగో పాదాల్లో దాగిన పదాలు పట్టేసేయొచ్చు)

ప్రశ్న
రారాజు సుయోధనుడిని కీర్తిస్తూ శార్దూలం

పూరణ
ధీధామోజస భావనా బలముతో దీవించు దుర్యోధన
శ్రీదుర్యత్త మహమ్మదుర్గతముగా చెన్నొంది విన్నొందగా
క్రోధోద్రేకముఁబైబిలాంచితముగా కూర్చెన్ కడున్ ఠీవితో
సాధించెన్ ‌గద ఆత్కురానుతుల్ రాజ్యశ్రీ వెలాయించుతో

దుర్యోధనుడిని తిట్టటానికి ఎవరికైనా సవాలక్ష కారణాలు దొరుకుతాయి. అతడిని పొగడమంటే అవధాని ఏ కారణం ఎంచుకుంటాడో చూద్దామన్న ఆసక్తి నాది. ఆయన సమాధానం పైది. దీనికి ప్రతిపదార్ధం నాకు తెలీదు కానీ స్థూలంగా భావం అర్ధమయింది. మీకెవరికన్నా ప్రతిపదార్ధం తెలిస్తే చెప్పగలరు.

8 స్పందనలు to “టి-ట్వంటీ శతావధానం”


 1. 1 saipraveen 7:06 సా. వద్ద ఆగస్ట్ 10, 2009

  మీరే నయం. మీకు స్థూలంగానైనా భావం అర్థమైనది, నాకైతే అసలు ఏమర్థమవలేదు. కాని, మా తెలుగు మాస్టారు చెప్పే ‘వ్యాజస్తుతి’ గుర్తుకు వచ్చింది. వ్యాజస్తుతి అంటే మీకు తెలిసేవుంటుంది, కాని నా ఆనందం కోరకు ఇక్కడ చెప్తున్నా. వ్యాజస్తుతి అంటే ఒక వ్యక్తిని పొగుడుతున్నట్లు తిట్టడం లేక తిట్టినట్టు పొగడడం. ఇహపోతే ఇక్బాల్ వంటి వారు వర్ధిల్లాలి. మీరు కూడా అవధానంలో పాల్గొనడం అభినందనీయము. నెనర్లు.

 2. 2 విశ్వామిత్ర 10:48 సా. వద్ద ఆగస్ట్ 10, 2009

  మీరు ఖండాంతరాలలో ఉంటూ కూడా శతావధానాన్ని అస్వాదిస్తున్నారంటే భలే సరదా అనిపించింది. ఈ సందర్భంలో ఒక వ్యక్తి మదిలో మెదిలి మళ్ళీ అయ్యో అనిపించింది!!

 3. 3 సాయి బ్రహ్మానందం 1:17 ఉద. వద్ద ఆగస్ట్ 11, 2009

  శతావధానంపై మీ సమీక్ష బాగుంది. ఆ రాతలో మీ సంతకం తెలుస్తూనే ఉంది.
  ముఖ్యంగా కొస మెరుపు. పదాలివ్వకుండా పద్యమిచ్చి కనుక్కోమనడం నచ్చింది.

  మీ స్నేహితుడి లాంటి వాళ్ళు అమెరికాలో చాలా మందున్నారు. సాహితీ సంస్కృతుల్ని తమ భుజస్కంధాలపై మోస్తున్నామని ప్రజల్ని మభ్య పెడుతూ ఇండియాలో బాకాకొట్టుకుంటున్న కొంతమంది కుహనా సాంస్కృతిక పెత్తందార్లు కూడా ఈ శతావధానాన్ని పక్కన బెట్టి “మగధీర” ని చూసి తరించడంలో మునిగి పోయారు. తెలుగు సంస్కృతిని రికార్డు బుక్కులెక్కించడంలో ఉన్న తహతహ, ఈ శతావధానాల మీదుండదు. ఒక తెలుగు వాడు;రెండు పార్టీలు;మూడు ముఠాలు. ఇదీ మన సంస్కృతి.

  ఇక్బాల్ గారి గురించి రాసారు కాబట్టి నా అనుభవం ఒకటి చెబుతాను.

  నాకు విప్రోలో పనిజేసేటప్పుడు ఖాన్ అనే ఒక మిత్రుడుండేవాడు. అతను రోజుకయిదు సార్లూ నమాజు చేసే వ్యక్తి. అతను చదవని పుస్తకం లేదు. కృష్ణ రాయబార పద్యాల దగ్గరనుండి, త్యాగరాజ కృతుల వరకూ ఇలా అడిగితే అలా అప్పజెప్పేసేవాడు. చందస్సంటారా? ఒకే పద్య భావాన్ని తీసుకొని అన్ని వృత్తాల్లోనూ అల్లేవాడు. అలాగే నేను ఆంధ్రా యూనివర్శిటీలో చదువుకునేటప్పుడు విజయకుమార్ అని ఒకతనుండేవాడు. అతను నర్శీపట్నం, చింతపల్లి దగ్గరుండే కొండ జాతికి చెందిన వాడని పరిచయం అయ్యాక తెలిసింది. చెబితే నమ్మరు. ఇతను ఖాన్ కంటే నాలుగాకులెక్కువ చదివాడు. కర్ణాటక సంగీతంలో ఏ పాటయినా సరే ఫ్లూట్ మీద జనరంజకంగా వాయించేవాడు. ఆశువుగా పద్యాలు అల్లేవాడు. ఆంధ్రాయూనివర్శిటీలో జోగారావు గారనే ఒక తెలుగు ప్రొఫుసరుండేవారు. ఆయన ఇతన్ని చూసి చేతులెత్తి నమస్కరించాడు. ఒకసారి అవధానం జరిగితే ఇతన్ని ఒక పృచ్ఛకుడిగా పిలిచారు. ఇలాంటివాళ్ళ విద్వత్తు ముందు నాలాంటి వాళ్ళెంత అనిపించిందప్పుడు.

  కళలకీ,కవిత్వానికీ కులంతోనూ, మతంతోనూ పని లేదు. ఎటొచ్చీ సమాజమే అందర్నీ ఆ బురదలోకి తోసేస్తుంది.

  సాయి బ్రహ్మానందం

 4. 5 గోపాల్ 7:25 ఉద. వద్ద ఆగస్ట్ 11, 2009

  చాలా బావుంది.. మీ మిత్రుడిలాంటి వాళ్ళు నాకూ తగిలారు. అప్పటివరకు చాలా కబుర్లు చెప్పి సమయం వచ్చినప్పుడు దాటవేసేస్తారు. ఇక్బాల్ లాంటి వారు కూడా ఎదురయ్యారు, మొదట్లో ఆశ్చర్యపోయినా సాయి బ్రహ్మానందం గారు చెప్పినట్టు “కళలకీ,కవిత్వానికీ కులంతోనూ, మతంతోనూ పని లేదు. ఎటొచ్చీ సమాజమే అందర్నీ ఆ బురదలోకి తోసేస్తుంది.”

 5. 6 వెంకటరమణ 10:59 సా. వద్ద ఆగస్ట్ 12, 2009

  బాగా వ్రాసారు. ఆ మధ్య ఎప్పుడో ఈనాడు-ఆదివారం సంచికలో ‘అవధానం’ గురించి వస్తే చదివి తెలుసుకున్నాను మొదటిసారి.
  మీరు ఇందులో పాల్గొనటం అభినందనీయం.
  కొన్ని వేల పద్యాలు కంఠతా వచ్చి, భాష మీద ఎంతో పట్టుంటే గానీ అవధానం చేయలేరట.
  ఒక సందేహం , ఎవరెవరు ఏ ప్రశ్న అడిగారో, వాటికి సమాధానాలు ఏమి చెప్పారో చివరలో ‘అవధాని’ చెబుతారంట కదా?

 6. 7 చదువరి 1:17 సా. వద్ద ఆగస్ట్ 13, 2009

  బావుంది. మా నాన్నకు అచ్చు నా పోలికలే అన్నట్టు, ఎప్పటి వాడికో మొన్నటి వాళ్ళతో, వాళ్ళ పుస్తకాలతో ముడిపెట్టి పద్యం చెప్పమన్నారు, చతురులే! మరి, మీ మిగతా ప్రశ్నల సంగతి కూడా చెప్పండి.

  ఈ పద్యానికి అర్థం కోసం ఎదురుచూసేవాళ్లలో నేనూ ఒకణ్ణి.

  అవధానంలో పాల్గొన్నారు, అదృష్టవంతులు! దాని రికార్డింగు ఉంటే, కాపీహక్కుల అభ్యంతరాలేమీ లేకపోతే, మాకూ అది వినే అదృష్టం కలిగించొచ్చు కదా!

  • 8 అబ్రకదబ్ర 8:51 సా. వద్ద ఆగస్ట్ 13, 2009

   @చదువరి:

   ప్రశ్న2
   ‘వెల్లుల్లి’, ‘కుమ్మరి’, ‘సమీక్ష’, ‘వాహనం’ పదాలతో తెలుగునాట విద్యార్ధినులపై ప్రేమోన్మాదుల ఆగడాలపై పద్యం.

   పూరణ 2
   ప్రేమ ఘాటు వెల్లుల్లిగా వెలయుచుండ
   ఎడల కుమ్మరి యువతుల హింసచేయ
   యువకుల సమీక్ష లేనట్టి వ్యూహమున్
   చెడుని దుష్టవాహనముల చిత్తమెక్క

   ప్రశ్న3
   ‘శ్రీకృష్ణ’, ‘రుక్మిణి’, ‘దుస్సల’, ‘భీష్ముడు’ పదాలతో శ్రీరామ జననంపై కందపద్యం

   పూరణ 3
   ఈ బంతిని అవధానిగారు సిక్సర్ కొట్టారు – I couldn’t catch. నాకు గుర్తున్నదల్లా, ‘భీష్ముడు’ అనే నాలుగో పదాన్ని ఆయన ‘భీష్మ’గా మార్చుకోవచ్చా అని అడిగితే నేను సరేనన్న సంగతి.

   ప్రశ్న4
   ‘చిరంజీవి’, ‘బాలకృష్ణ’, ‘నాగార్జున’, ‘వెంకటేష్’ లతో మతసామరస్యంపై తేటగీతి.

   పూరణ 4
   జీవులెల్లరున్ చిరంజీవిపతిని
   సామరస్యంబు బాలకృష్ణానలముగ
   అలరుగావుత సృష్టి నాగార్జునముగ
   వేంకటేశ వైభవముగ వెలయు జగతి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: