పది, పదిహేనేళ్ల క్రితం దాకా కోస్తాంధ్ర జిల్లాల పల్లెటూర్లలో – పంటల పనులు లేనప్పుడు – నాటకాల సీజన్ ఒకటి నడుస్తుండేది. ఇప్పుడున్నన్ని రకాల టీవీ ఛానెళ్లు లేకముందు, దూరదర్శన్ ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోతున్న రోజలవి. టూరింగ్ టాకీసులు సైతం లేని పల్లెటూర్ల పామర జనాలకి – అంతో ఇంతో పండిత జనాలకీ – అయ్యదు నాటకాలే దిక్కూ, మొక్కూ. వీటి పుణ్యాన ఊర్లో వారందరికీ కొన్నాళ్లపాటు కాస్తంత కలాపోసన చేసే భాగ్యమూ, కావలసినంత కాలక్షేపమూ నిక్షేపంగా లభిస్తుండేవి.
నాటకాలనగానే – ‘గయోపాఖ్యానం’, ‘సత్య హరిశ్చంద్ర’ టైపు అజరామర పౌరాణిక పద్య నాటకాలనుకుంటే పప్పులో లోతుగా కాలు దించినట్లే. ఆ తరహా అసలు సిసలు తెలుగు నాటకాలకి పప్పులుడికి అప్పటికే దశాబ్దాలయింది. రవీంద్ర భారతిలోనో, పరిషత్తు పోటీల్లోనో తప్ప పల్లెటూర్లలో అటువంటి పురాతన సనాతన నాటకాలకి ఆదరణ ఎప్పుడో కరువైపోయింది. మనం ముచ్చటించుకుంటుంది వాటి గురించి కాదు, అల్ట్రా మోడర్న్ ఆంధ్రా నాటకాల గురించి.
పేరుకి నాటకాలే కానీ ఇవి తెలుగు సినిమాలని తలదన్నేలా ఉండేవి. పేర్లు కూడా ‘ఘరానా రౌడీ’, ‘అల్లరి బుల్లెమ్మ’ .. ఇలా సమకాలీన వీర మాస్ సూపర్ డూపర్ హిట్ పిక్చర్స్‌కి అనుకరణే. ఒక్క పేర్లేం ఖర్మ, ఆ నాటకాల్లో కథలూ మక్కీకి మక్కీ అలాగే ఉండేవి. విమర్శకులు దీన్ని కాపీ కొట్టటమనీ, సమర్ధకులు దీన్నే ప్రేరణ పొందటమనీ అందురు. పేరేదన్నది ముఖ్యం కాదు, తోచిన రీతిలో వాళ్లు చేస్తున్న కళాసేవే ముఖ్యం.టూరింగ్ టాకీసుల్లేని పల్లెటూరి జనాలకు స్టేజి మీదనే అన్ని రకాల సినిమాలూ ఫ్రీగా చూపించేసి పుణ్యం కట్టేసుకుంటుండేవాళ్లు సదరు నాటకాల దర్శకేంద్రులు. వాటిలో హంగులకూ లోటుండేది కాదు. భీభత్సకరమైన ఫైట్స్ ఉండేవి. భారీ బడ్జెట్ నాటకాల్లోనైతే ఎఫెక్ట్ కోసం స్టేజి మీదకి పాత జీపులూ, కార్లూ లాక్కొచ్చి వాటిని తుక్కు రేగ్గొట్టటం చేసేవాళ్లు! ఇంకా – పాటలూ, వాటికి డాన్సులూ కూడా ఉండేవి. నిజానికి, ప్రత్యేకించి ప్రచారం చేసుకోకపోయినా, ఈ నాటకాలన్నీ పూర్తి స్థాయి మ్యూజికల్స్ – మాటల కంటే పాటలే ఎక్కువుండేవి కాబట్టి.
సినిమాల్లాగానే రెండున్నర, మూడు గంటలుండే ఈ నాటకాల్లో పాటలు మాత్రం అధమపక్షం ఇరవయ్యన్నా ఉండి తీరాల్సిందే. ఓ నాటకంలో ఎన్ని పాటలుంటాయనేదానికి ఓ చిన్న లెక్కుంది. ఆ నాటకంలో ఎన్ని పాత్రలుంటే కనీసం అన్ని పాటలన్నమాట. ఒక పాత్రకి మినిమమ్ వన్ సాంగ్ గ్యారంటీ. హీరో గారికి మాత్రం ఎక్కువ పాటలు. ఆయన హీరో కాబట్టి కాదు – ఆ వేషాన్ని ఎక్కువ ధరకి కొన్నాడు కాబట్టి!
కొనటం ఏమిటని ఆశ్చర్యపోకండి. మొదటి పేరాలోనే చెప్పినట్లు, ఈ నాటకాలు లోకల్ నాటకాలరాయుళ్ల కళా జిల తీర్చేందుకూ ఉద్దేశించినవి మరి. అలాంటి దురద బాధితులు పది మందో, పాతికమందో కలిసి తాహతుకు తగ్గట్లుగా చందాలేసుకుని నాటకానికి ఉమ్మడి నిర్మాతలుగా మారతారన్న మాట. సహజంగానే వాళ్లలో ఎక్కువ చేతి చమురు వదిలించుకున్నవాడిని కథానాయకుడి పాత్ర వరిస్తుంది. మరి కథానాయికో? ఊళ్లలో ఆడాళ్లు నాటకాలాడటానికి ముందుకు రారు – లేదా పనికి రారు – కాబట్టి ఈ ఒక్క పాత్ర కోసం మాత్రం ఏ నాటక పరిషత్తు నుండో ఒక నటీమణిని తీసుకొస్తారు (డేజా-వూ .. ఈ కాన్సెప్ట్ బాగా పరిచయమున్నదే కానీ ఎక్కడ చూసిందీ గుర్తుకు రావటం లేదా? చివరి పేరా దాకా ఓపిక పట్టండి). ఆ చుక్క పక్కన ఎక్కువ పాటల్లో చిందులేసే అదృష్టం కావాలంటే ఆ మాత్రం కర్సెట్టాల్సిందే.
ఆ ఇలాకాలో పాపులర్ నటీమణి ఎవరన్నా ఈరోయిన్‌గా నటించటానికి వస్తుందంటే ఈరో పాత్రకి ఉన్నపళాన డిమాండ్ పెరుగుతుంది. అవసరమైతే కథని అప్పటికప్పుడు ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగన్ లవ్ స్టోరీగానైనా మార్చిపారేసి మరింతమంది కథానాయకులకి అవకాశం కల్పిస్తారు (ఇలాంటి నాటకాల కోసం రాత్రికి రాత్రే కథలొండే జమాజెట్టీ రచయితలు ప్రత్యేకంగా ఉంటారు). అద్దె నటీమణికి చెల్లించే మొత్తాన్ని బట్టి, హీరోగార్లు పెట్టిన పెట్టుబడిని బట్టీ వాన పాటలు కూడా ఉంటే ఉండొచ్చు. అవును .. స్టేజి మీదనే వాన .. తగ్గేది లేదు. పాటల్లో స్టెప్పులూ, అదిరిపోయే లైటింగ్ ఎఫెక్టులూ మామూలే. అన్నట్టు – పాటలన్నీ తాజా హిట్ సినీ గీతాలేనని మళ్లీ విడిగా మనవి చేయనక్కర్లేదనుకుంటా.
అయితే అందరికీ ఈరోయిన్ పక్కన డాన్సాడే చాన్సుండదు కదా. కథ ఒప్పుకోదు. అదొప్పుకున్నా దర్శక నిర్మాతలొప్పుకోరు. ఆళ్లొప్పుకున్నా ఈరో ఒప్పుకోనేకోడు. ఈరోయిన్ పక్కన అందరూ ఆడిపాడేత్తే ఈరోకీ ఆళ్లకీ తేడా ఏంది? ఈరో ఇమేజ్ ఏంగావాలె? ఎక్కువ డబ్బులిచ్చినోళ్లకే ఆ అవకాశం అన్నమాట. మరి మిగతా వాళ్ల గతేంటి? వాళ్ల పాత్రని బట్టి వాళ్లకీ – సోలో, గ్రూప్, ట్రాజెడీ, సెంటిమెంట్ – ఏదో ఓ పాట పడేస్తారు. ముష్టివాడి పాత్రకీ తగ్గ పాటొకటుంటుందన్నమాట. పాటలో ఏదో ఓ ముక్కలో ఈరోయిన్‌తో స్టెప్పేసే అవకాశం కల్పిస్తారు. ట్రాజెడీ, సెంటిమెంట్ సాంగుల్లో స్టెప్పులేంటని అడక్కూడదు. ఐతే ఒకటి – ఈరోయిన్ యొక్క గుండెనొప్పి గుమ్మడి నాన్నకి సాధారణంగా ఒకట్రెండు బోనస్ సోలో సాంగ్సుంటాయి. పాపం ఈయనకి ఈరోయిన్‌తో డ్యూయెట్టేసుకునే అవకాశం లేదు కాబట్టి కొంత ఎగస్ట్రా కాంపెన్సేషన్ అన్నమాట. కొన్ని పాత్రలైతే కథకి సంబంధం లేకుండా కేవలం పాటల్లోనే ఇలా మెరిసి అలా వెళ్లిపోతుంటాయి (మళ్లీ డేజా-వూ?)
ఇలా .. రాసుకుంటూ పోతే అంతు లేనన్ని విశేషాలీ నాటకాల్లో. ఒక్క ముక్కలో – నేడొస్తున్న మాస్ మసాలా తెలుగు సినిమాలకి ఏ మాత్రం తగ్గని స్థాయిలో పదిహేనిరవయ్యేళ్ల క్రితమే ఆంధ్ర పల్లెటూర్లలో నడిచే నాటకాలుండేవి. వీటిలో నటనా ప్రతిభకి, సాంకేతికంగానైనా మరే రకంగానైనా నాణ్యతకి తావు లేదు. వాటికి మెరుగుపెట్టుకోవాలనే ఆసక్తీ, అగత్యమూ కూడా ఉండవు. ఉన్నదల్లా – ఏదో చెయ్యాలనే, ఊరి జనాలతో జేజేలు కొట్టించుకోవాలనే ఉత్సాహం. ప్రేక్షకులూ ఆ ఉత్సాహాన్ని అర్ధం చేసుకునేవారు, ప్రదర్శన ఎలా ఉన్నా చప్పట్లూ ఈలలతో వెన్ను తట్టేవాళ్లు (ఇష్ష్ .. వాళ్లకి గత్యంతరం లేదన్నది వేరే సంగతి. పైకనేస్తే ఎలా?)
ప్రస్తుతానికొస్తే, పైదంతా గతం. కాలక్రమేణా – వెల్లువలా వచ్చి పడ్డ టీవీ ఛానెళ్ల దెబ్బకి ఇలాంటి నాటకాలు కనుమరుగైపోయాయి. నాటి నాటకాలరాయుళ్లలో అధికులు వృత్తి విరమణ చేశారు. పట్టు వదలని కొందరు విక్రమార్కులూ, వినాయక్‌లూ మాత్రం తెలుగు సినీ సీమలో కథకులుగానూ, దర్శకులుగానూ కుదురుకున్నారు. నాటక రంగంలో తాము చేసిన ప్రయోగాలు మరింత భారీ స్థాయిలో – సూమో ఫైట్లు, బొంబాయి భామల దిగుమతి, ఐటమ్ డాన్సెస్, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, పెట్టుబడితో వస్తే కథానాయకులుగా ఛాన్సివ్వటం, హీరోగారికి నచ్చేదాకా స్క్రిప్టు తిరగరాయటం, పక్క భాషా సినిమాల నుండి ప్రేరణ పొందటం .. వగైరా – చలనచిత్ర రంగంలోనూ ప్రవేశ పెట్టి తెలుగు సినీమతల్లికి ఇతోధికంగా సేవలందిస్తూ క్రియేటివ్ దర్శకులుగా నజరానాలందుకుంటున్నారు. తమ కళాఖండాలతో తెలుగు సినీ వెలుగుల్ని శక్తిమేరా నలుదిక్కులా విరజిమ్ముతున్నారు. నాటి నాటక ప్రేక్షకమ్మన్యులూ వారి సంతతీ నేటి సినీ వీక్షకావతారాలెత్తి అలవాటుగా ఆయా చిత్రరాజాలు చూసి మురుస్తూ, ఈలలూ చప్పట్లతో అభినందిస్తూ ప్రోత్సహిస్తూ జన్మ సార్ధకం చేసుకుని తరిస్తున్నారు.
అయ్యా, అదీ సంగతి. వారే వీరు, వీరే వారు. తరాలు మారాయి. ప్రేక్షకుల తలరాతలో?
సూపరో సూపరు …..
విషయం ఆసక్తి కరం. రికార్డింగు డేన్సుల గురించి తెల్సుగానీ ఈ రంగం గురించి ఎక్కడా వినలేదు. కథనమూ వ్యంగ్యమూ కొంచెం కుంటు పడ్డాయి, మీ స్థాయికి తగినట్టు లేవు.
అలాక్కూడా కాలేనివారు బ్లాగర్లు అయ్యారు.
చాలా చిన్నప్పటి విశేషాలు గుర్తు చేశారు. కానీ ఈ టైపు నాటకాల గురించి చాలా తక్కువమందికే తెలుసనుకుంటాను, ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి. అందువల్ల ఆయా నాటకాల్లో ఏం చేసిన వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో ఏం చేస్తున్నారో అర్థం కాదు.! పైగా మీరు చెప్పిన నాటకాలు తిరణాల సీజన్లోకదా ఆడేవారు. నేనొక నాటకం చూశా…రావిపాడు పండగప్పుడు….”రాముడు-రంగడు” అని! రాముడు భీముడు సినిమా కాన్సెప్టే!
పిడకల వేట: నరసరావుపేట్రియాట్స్ బ్లాగులో రికార్డింగ్ డాన్సుల గురించి, కళాకారిణుల గిరుంచి పోస్టుతాను త్వరలో! రనగస్థలి గురించి, ఇతర సాంఘిక నాటకాల గురించి మరో పోస్టు..కాస్త లేటవుతుంది. పేట వెళ్ళాలి, ఇంటర్వ్యూలు చేయాలి, ఫొటోలు తీసుకోవాలి మరి!
నిజమే నిజమే. నేనిక్కడ చాలా మందిని కలిసాను.
అబ్బో – ఇలాంటి ఫెసిలిటీ ఆ రోజుల్లోనే ఉన్నట్టు తెలీదు మేస్టారూ
బావుంది చురక, ఇంకొంచెం గట్టిగా చేస్తే ఇంకా మజా వచ్చేదేమో… 🙂
:)) హ హ :)) ఆ నాటకాలున్నాయని తెలీదుగానీ…కానీ ఉన్నాయి…. ఉండుంటాయి :))
నవ్వుకొని కామెంట్లు చూస్తూ “అలాక్కూడా కాలేనివారు బ్లాగర్లు అయ్యారు.” అని చూసి పగలబడి పొర్లిపొర్లి ..:))
ప్రేక్షకుల తలరాతలో?
మారవూ, మారవూ… (ఆగదూ ఆగదూ పాట బాణీలో పాడుకోవాలని మనవి.)
ఊళ్లలో నాటకాల గురించి కొత్త విషయం తెలిసింది.
@ శరత్ : బాగా నవ్వించారు. కిందటి జన్మలో నాటకాల్లో పాత్రలు రాక, ఈ జన్మలో బ్లాగర్లు కూడా కానివాళ్ల, కాలేనివాళ్ల సంగతేంటి? వాళ్లు కామెంటేటర్లవుతున్నారనుకుంటా.
శరత్ కామెంట్ బాగా నవ్వించింది.
బాగా గుర్తు చేసారు . 🙂 . మా ఊర్లో, పక్క ఊళ్ళల్లో కూడా ఇలాంటి నాటకాలు వేసేవారు . నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు, మా ఊర్లో వేసిన నాటకానికి , చదువు రాని ఒకరిద్దరికి నేను వాళ్ళ పోర్షన్ చదివి వినిపిస్తుంటే వాళ్ళు కంఠతా పట్టేవాళ్ళు . 🙂
మా ఊర్లో ఇప్పటికీ ఈ నాటకాలు వేస్తూ ఉంటారు. హీరోయిన్లను మామూలుగా ఒంగోలు లేదా గుంటూరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుంటారు.
నేను గమనించిన ఇంకో విశేషం. నాటకంలో రేప్ సీన్లుంటే హీరో కన్నా విలన్ ఎక్కువగా ముట్టజెప్పాల్సి ఉంటుంది. 🙂
హ హ చాలా విషయాలు తెలిసాయి,చిన్నపుడు మా అమ్మమ్మ గారి ఊరెళ్ళినపుడు మా వీధి చివర చింతామణి సుబ్బి శెట్టి నాటకం వేస్తుంటే వెళతా అని గొడవచేస్తే ఒక్కటి ఇచ్చి నిద్రపుచ్చేసారు.. అలా ఒక్క నాటకం కూడా చూడలేదు నేను 😦
బాగుంది 🙂 చాలా కొత్త విషయాలు తెలిసాయి.