కూల్ స్టఫ్

మా ఆఫీసులో ఓ ఉత్తర భారతీయ కుర్రాడున్నాడు. ఇకనుండీ అతన్ని ఉభాకు అందాం. ఐదారేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా అమెరికా వచ్చాడు. అతన్ని చూస్తే అలా అనిపించడనుకోండి. అమెరికాలోనే పుట్టి పెరిగినవాడిలా అనిపిస్తాడు – వేష భాషలు, అలవాట్లు, వగైరా, వగైరా. సరే, వాటివల్ల నాకొచ్చిన సమస్యలు పెద్దగా లేవు. ఒక తంటా మాత్రం ఉంది. అతను పేర్లని ఖూనీ చేసే పద్ధతి.

మా ఆఫీసులోనే మరొక దక్షిణ భారతీయ చిన్నది కూడా ఉన్నది. ఆమెని దభాచి అనక్కర్లేదు. శుభ్రంగా పేరుతోనే పిలుద్దాం. పేరు సౌజన్య. సౌజన్య చాలాకాలంగానే ఇక్కడ పని చేస్తుంది. ఆమెతో పెద్దగా పరిచయం లేకపోయినా, ఆమె గురించి మన ఉభాకు బాగానే ఎరుగుదుడు.

నిన్న ఉభాకుకి సౌజన్యతో ఏదో పని పడింది. ఆమె కనిపించకపోతే వచ్చి నన్నడిగాడు, ‘వేరీజ్ సావ్‌హాన్యా?’ అని.

సావ్‌హాన్యా ఎవరో ఒక పట్టాన అర్ధమవలేదు నాకు. రెండు మూడు సార్లు రకరకాలుగా ప్రయత్నించి ఇక తప్పక స్పెల్లింగ్ చెప్పాడు ఉభాకు. నవ్వు, ఏడుపు, చిరాకు, అసహ్యం, కోపం ఇత్యాది భావాలన్నీ ఏకకాలంలో ముంచెత్తాయి నన్ను. పాతికేళ్లొచ్చేదాకా ఇండియాలో పెరిగినవాడికి saujanya ని పలకటమెలాగో తెలీదంటే నమ్మేదెలా?

‘జె’ని ‘హెచ్’లా పలకటం అనేది లాటినో పేర్లకి వర్తించే విషయం. స్టైల్ పేరుతో తెలిసీ తెలియకుండా ఇతర భాషలకీ ఆ నియమాలు వర్తింపజేస్తూ ముచ్చటైన పేర్లనిలా ఖూనీ చెయ్యటం ఉభాకు లాంటివాళ్ల పైత్యం. ఇటువంటి పైత్యకారులు పలురకాలు. తమ పరభాషా పాండిత్యాన్నిలా పోజులు కొట్టటానికి వాడే వాళ్లొక రకం. అవసరమున్నా లేకున్నా వాక్యానికో అరడజను ‘కూల్’, ‘స్టఫ్’ లాంటి పదాలు కూరేవాళ్లు ఇంకో రకం. ‘ట్రెండీ’ అంటూ నల్లవారి చేష్టలు అనుకరించేవాళ్లు మరో రకం. మాతృభాషలో మాట్లాడటం నామోషీ అనుకునేవాళ్లూ, ఆంగ్లంలో చించేస్తే మేధావిగా పరిగణించబడతాం అనుకునేవాళ్ళూ వేరే రకం. ఎందుకో ఏమిటో తెలియకుండా ఏదో గొప్ప కాబోలు అనుకుంటూ ఏదేదో చేసేసేవాళ్లు అదో రకం – అంటే, జల్సాలో పవన్ కల్యాణ్ చే గువేరా బొమ్మ ప్రదర్శించటం లాంటిదన్నమాట.  ‘డిఫరెంట్’గా ఉండాలని వీళ్ల తాపత్రయం. ఈ పిచ్చికో అందమైన పేరూ ఉంది: being cool.

చల్లగా ఉండటం అనేది తప్పు పట్టాల్సిన విషయమేమీ కాదు. ఇదో కొత్త వింతా కాదు. అది నేను హైస్కూల్లో ఉన్నప్పుడూ, అంతకు ముందూ, అంతకు ముందుకి ముందూ కూడా ఉంది. అయితే అందులో అంతో ఇంతో భారతీయ ఆత్మ తొంగి చూసేది. మన ‘హిప్ వర్డ్స్’, మన స్టైల్స్ మన సొంత బుర్రల్లోనుండే పుట్టేవి. పాశ్చాత్య ప్రభావం ఎంతో కొంతున్నా, వాటికి మనవైన మార్పు చేర్పులు జోడించబడేవి. తొంభైల్లో ప్రపంచీకరణకి గేట్లు తెరుచుకున్నాక, పాశ్చాత్యీకరణ వేగం ఊపందుకున్నాక మెల్లిగా చల్లగా ఉండటంలోనూ మనదైన ముద్రంటూ లేకుండా పోవటం మొదలయింది. ఇక్కడా అనుకరణలే. ఇందులోనూ భావ దారిద్ర్యమే! ఈ ధోరణికి వెల్లువలా వచ్చి పడుతున్న టెలివిజన్ ఛానెళ్లూ, వాటిలో యాంకరమ్మలు పోయే వయ్యారాలూ, తిరిగే వంకర్లూ, పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకున్న ఇతివృత్తాలతో రూపొందించి మన మొహాన పారేసే కుప్పల కొద్దీ కార్యక్రమాలూ, అరువు కథలతో సినిమాలు తీసి మన మీదొదిలే నవతరం ‘క్రియేటివ్’ దర్శక శిఖామణులూ, నటనాభినివేశం శూన్యమైనా వాచాలత్వంతో నెట్టుకొచ్చే వివిధ ‘ఉడ్’ల నటరత్నాలూ నటీమణులూ టీవీల్లో దంచేసే సంకర భాషా, వాళ్ల వంకర పోకడలూ … ఇత్యాదివెన్నో కారణాలు కావచ్చు. ఇంటర్నెట్ వాడకం పెరగటం, అమెరికన్ యాస, పద్ధతులు గుడ్డిగా అనుకరించటమే గొప్ప అనుకునే తత్వం యువతలో పెరగటమూ మరో కారణం.

నెపం నెట్టటానికి లెక్కలేనన్ని వంకలు దొరుకుతాయి వెదికితే. వాటిలో ఎన్ని సరైనవి అనేది కాదు ప్రశ్న. మన బంగారం సరైనదేనా అన్నదే ప్రశ్న. వీటన్నిటి మధ్యలోనూ భారతీయత పోగొట్టుకోకుండా నెట్టుకొస్తున్న యువతరం లేదా అంటే భేషుగ్గా ఉన్నది అన్నది సమాధానం. వాళ్ల సంఖ్య రాన్రానూ తగ్గిపోతుందన్నది మాత్రం విచారకరమైన నిజం. సవాలక్ష సమస్యలుండగా దీని గురించి బాధపడటం దండగ అనుకునేవాళ్లుండొచ్చు. అయితే ఈ బుల్లి పరిశీలన రేకెత్తే మౌలికమైన సందేహమొకటుంది. పైకి పనికిమాలినవిగా కనిపించే ఇంత చిన్న విషయాల్లోనే ఓ సొంత శైలంటూ లేని తరం నుండి దేశం ఆశించగలిగే గొప్ప విశేషాలేమిటి?

ఇలాంటి సందేహాలకొచ్చే అనుబంధ ప్రశ్నలు బోలెడు. సమాజపు పోకడల గురించిన ఈ తరహా ప్రశ్నావళి అంతమయ్యేది ఒకే ప్రశ్నతో: లోపం ఎక్కడ? ‘Being Cool’ అంటే ఒకరిని చూసి వాతలు పెట్టుకోవటమే కానక్కర్లేదన్నపాటి తెలివి పిల్లలకి నేర్పలేని తల్లిదండ్రుల్లోనా? చదువునో వ్యాపార వస్తువుగా; బళ్లనీ, కళాశాలల్నీ విదేశాల కోసం హై-టెక్ ఉద్యోగుల్ని ఉత్పత్తి చేసే కార్ఖానాలుగా మార్చేసిన విద్యావ్యవస్థలోనా?

12 స్పందనలు to “కూల్ స్టఫ్”


  1. 2 కత్తి మహేష్ కుమార్ 11:30 సా. వద్ద జూలై 14, 2009

    “పైకి పనికిమాలినవిగా కనిపించే ఇంత చిన్న విషయాల్లోనే ఓ సొంత శైలంటూ లేని తరం నుండి దేశం ఆశించగలిగే గొప్ప విశేషాలేమిటి?”

    మీకు గుర్తుండే ఉంటుంది నా టపాకు స్పందనగా “తెలుగులో సంస్కృతంలో ఆలోచించటం ఏమిటి?” అని విస్తుపోయారు. దానికి సమాధానం మీదగ్గరే ఉంది చూడండి. సంస్కృతి,భాష,వర్గ పరమైన అణచివేత ఎప్పుడూ ఉంది. అది వివిధ రూపాల్లో ఉంటుంది. మీరు చెప్పింది ఒకరకమైతే నేను అక్కడ చెప్పింది మరొక రకం. రేరాజు చెప్పిందే చెప్పినట్టుండేదీ మరో రకం.

    వీటన్నిటినీ మార్చలేకపోయినా కనీసం అర్థం చేసుకోవడం అవసరం. దాన్నే cultural studies అంటారు లెండి. subconscious లెవల్లో మీరూ అదే చేస్తున్నారు. కానివ్వండి.

  2. 3 sujata 5:28 ఉద. వద్ద జూలై 15, 2009

    మీరు గభుక్కున ఫీలయిపోయారు. మీ ఉభాకు ఏ రాష్ట్రం వాడు ? నా ముగుడుగారు (ఈయన కూడా ఉభాకు) పొరపాట్న నన్ను పేరుపెట్టి పిలిస్తే, ‘సుహాత’ అనే పిలుస్తారు ! (హ సైలెంటు – అనగా సు ఆతా) నేనేమో, ‘ముజే కుచ్ నహీ ఆతా’ అనుకుంటూ పలుకుతాను. మా ఇంట్లో వాళ్ళూ, చుట్టాలూ కూడా అలానే పిలవడం నాకలవాటు. కొన్ని ఉ.భా రాష్ట్రాలవారూ, తెలుగు వాళ్ళూ, తమిళులూ, కన్నడిగులే ‘జా’ పలుకుతారు. మళయాళీలయితే సుజాదా అని పిలుస్తారు. ఏంచేస్తాం ? పేరులోనేమున్నది లాగా – పిలుపులోనేమున్నది ? అనుకుని, ఎవరెట్లా పిలిచినా పలకాల్సిందే !

  3. 5 అబ్రకదబ్ర 8:16 ఉద. వద్ద జూలై 15, 2009

    @sujata:

    మా ఉభాకు ‘గుహరాతీ’ వాడు. కాబట్టి అతన్ని క్షమించే ప్రసక్తి లేదు 🙂 మలయాళీలు, తమిళులది స్టైల్ కాదు. వాళ్ల పద్ధతే అది. కాబట్టి అర్ధం చేసుకోవచ్చు.

    ఇండియాలో ‘జ’ పలకని రాష్ట్రాలున్నాయా! ఐతే మన జాతీయ గీతమెలా పాడతారు వాళ్లు?

  4. 6 Arun 9:34 ఉద. వద్ద జూలై 15, 2009

    @అబ్రకదబ్ర : మంచి ప్రశ్న 🙂

  5. 7 సుజాత 10:15 ఉద. వద్ద జూలై 15, 2009

    అదేమిటి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు అమెరికాలో కూడా తయారయ్యారా? నేను ఇక్కడే అనుకుంటున్నా!ఇలాంటి ‘కూల్ మాటలు వినీ వినే చెవులు చిల్లులుపడ్డాయి స్వామీ మాకిక్కడ!

    సుజాతా,
    మీ పాత్రో గారు “ఉభాకు” ఎలా అవుతారు “తూభాకు”అవ్వాలి గానీ! వాళ్ళకు జా పలకదని మీకు పెళ్ళికి ముందు తెలీదా? వాళ్లకు “ష”కూడా పలకదనుకుంటాను కదా! వీటి గురించి మీరొక పోస్టు టపాయించండి.మేము కుసింత నవ్వేసుకుంటాము.

  6. 8 చంద్ర మోహన్ 10:22 ఉద. వద్ద జూలై 15, 2009

    వింధ్యకు ఉత్తరాన ఉన్నవారందరినీ ఉత్తర భారతీయులనడం మనకు అలవాటైపోయింది గానీ, గుజరాతీయులను పశ్చిమ భారతీయులనాలేమో నిజానికి. ఉభాకు ఐనా పభాకు ఐనా భారతీయ పేర్లను అలా పలకడం ’కూల్’ ఏమో కానీ వినడానికి చాలా ’హాట్’ గా ఉంది.

    జ- పలకని భారతీయ భాష ఉన్నట్లు నాకు తెలియదు, ’య’ ను ’జ’ గా పలికేవారున్నారుగానీ (ఒరియా వారు, కొందరు బెంగాలీలు).

    • 9 sujata 11:40 సా. వద్ద జూలై 15, 2009

      జ అస్సలే పలకరని కాదు. నాలాంటి పేరు కాంబినేషన్ లో ఆ జ వినిపించదు. స్పష్టమైన, గ్రాంధికమైన భాష మాట్లాడే వాళ్ళు / గలిగే వాళ్ళ ఉచ్చారణ కీ, మామూలుగా మాటాడేవాళ్ళ ఉచ్చారణ కూ తేడా ఉంటుందేమో! జ పలకలేని వారు జాతీయగీతం పాడడం వేస్టు. తుభాకు లు పలుకుతారు గానీ మనంత స్పష్టంగా కాదు. అలవాట్లో పొరపాటు ! అయినా గుజ్జూ ఉభాకూ ది స్టైలే ! నిన్న నాకో కొరియరొచ్చింది. ఆ హేండ్సం తలుపు తీయగానే ‘సుహాతా ?!’ అన్నాడు. అదుర్ష్ట వశాత్తూ ఇంగ్లీషే పీకేడు. తెలుగోడిగారి టపా నే గుర్తొచ్చింది. 😀

  7. 11 దభాకు 3:23 సా. వద్ద జూలై 17, 2009

    ఆహా ! ఎంత చల్లని పోస్టు !

  8. 12 Dhanaraj Manmadha 1:36 సా. వద్ద జూలై 23, 2009

    హ ని య లాగా పలకటం కూడా లాటినోనే అనుకుంటా…?

    ఉదా… రొనాల్డిన్యో.

    మరీ అతి గ్రాంధికం, కూడా ఈ తరహాకే వస్తుంది ఆబ్రకదబ్ర గారూ.. హహహ. క్లూల్ పోస్ట్ ;-).


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: