రూపాయికి తక్కువైతే భిక్షం స్వీకరించకూడదని తమిళనాడు యాచక సంఘం (తనాయాసం) నిర్ణయం. భిక్షగాళ్ల సంక్షేమ బోర్డునొకదాన్ని ఏర్పాటు చెయ్యాల్సిందిగా డిమాండ్. తమని యధేచ్చగా అడుక్కోనివ్వని అధికారులపై తీవ్ర నిరసన. తమ సమస్యల పరిష్కారానికై త్వరలో ముఖ్యమంత్రి కరుణానిధిని కలుస్తామని ప్రకటన – వార్త
* * * *
ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా యాచకాన్నీ ఓ వృత్తిగా, చతుష్షష్ఠి కళల్లో ఒకటిగా గుర్తించారు మన ఘన పూర్వీకులు. లోక కల్యాణం పేరుతో సాక్షాత్తూ దేవదేవుళ్లనే యాచకావతారాలెత్తించిన జాతి మనది. ‘అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు’ అన్నారే కానీ ‘అమ్మ పెట్టదు, సంపాదించుకోనివ్వదు’ అన్నారా? అదీ – అడుక్కోటానికి మన పెద్దలిచ్చిన విలువ. అంతెందుకు, అసలు మన ఆదిదేవుడే భిక్షువు. ఆయనే యాచకుల కుల గురువు. అయినా అనాదిగా యాచక మహరాజులకి ఈ పుణ్యభూమిలో దక్కుతుంది ఛీత్కారాలు, చెప్పుదెబ్బలే. ఇన్నాళ్లకి, ఈ అన్యాయం ఇంకెన్నాళ్లంటూ ఎలుగెత్తి నినదిస్తున్నారు తమిళనాటి యాచక తంబీలు. తమిళనాడంటేనే కళలకు కాణాచి. అందుమూలాన, అతి పురాతన కళాత్మక వృత్తుల్లో ఒకటైన యాయవారాన్ని వ్యవస్థీకృతం చెయ్యటం, యాచకులకి ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసుకోవటం ఇత్యాది విషయాల్లో ఆ రాష్ట్రమే మిగతా దేశానికి మార్గనిర్దేశకత్వం నెరపటం ఎంతైనా సహజం, సమంజసం, సముచితం.
మనది ప్రజాస్వామ్య దేశం. మన నాయకుల్ని కొట్టాల్సింది నోట్లతో, లేదా వోట్లతో. తనాయాసం వద్ద నోట్లెటూ పూజ్యం. ఇక మిగిలింది వోట్లే. కాబట్టి, తమ కలలీడేరాలంటే, కరుణానిధిని కలవబోయేముందు తనాయాసం పెద్దలు చెయ్యాల్సిన పనొకటుంది. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాలవారీగా దేబిరించే వృత్తిలో బతుకులీడుస్తున్నవారి సంఖ్య ఎంతో, వారిపై ఆధారపడ్డవారి సంఖ్య ఎంతో, వాళ్లందరి ఓట్లూ కలిపి ఓల్‌సేల్ టోటల్ మొత్తం ఎన్నోలెక్కలేసి ఓ జాబితా తయారు చెయ్యాలి. పనిలో పనిగా, వీళ్లలో ఓట్లులేనివారి జాబితా కూడా ఒకటి తయారు చేసి ఎన్నికల సంఘానికి అందజేయాలి, వాళ్లకీ త్వరలో ఓటు హక్కు సంపాదించుకునే దిశలో పావులు కదపాలి. ఎన్ని ఓట్లు చేతిలో ఉంటే అంత బలం. ఆంప్రయాసం, కయాసం, కేయాసం వంటి పొరుగు రాష్ట్రాల యాచక సంఘాల తోడ్పాటూ తీసుకుంటే మంచిది. వీలైతే దీన్నో దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దాలి.
ఇది పొత్తుల యుగం. ఎన్నికల వైతరణి ఈదటానికీ, అధికారంలోకి రావటానికీ, ప్రభుత్వాలేర్పాటు చేయటానికీ రాజకీయ పక్షాలకి పొత్తులెంత అత్యవసరమో, ఆ ప్రభుత్వాల మెడలు వంచటానికి మనకీ పొత్తులు అంతవసరం అని ప్రజలు ఎంత త్వరగా గ్రహిస్తే వారికి అంత మంచిది. ప్రభుత్వాన్ని కదిలించటానికి తమ బలం చాలకపోతే తనాయాసం పరిశీలించాల్సిన మార్గమొకటుంది. అదేమంటే – వృత్తులు వేరైనా, తమతో భావసారూప్యత కల ఇతరుల మద్దతు సంపాదించాలి. ఆ ఇతరులకి ఆల్రెడీ సంఘాలుంటే వాటితో ఓ అవగాహనకి రావాలి. సంఘాలు లేనివారిని ఉన్నపళాన ఏర్పాటు చేసుకొమ్మని ప్రోత్సహించాలి, ఉత్తేజపరచాలి.
ఈ సందర్భంగా తనాయాసం దృష్టి సారించాల్సిన, ఏర్పాటు చేయించి తీరాల్సిన అతి ముఖ్యమైన సంఘాలు కనీసం రెండున్నాయి. అవి: బకించేపెవాసం (బల్ల కింద చేతులు పెట్టేవారి సంఘం), డొవచేవాసం (డొనేషన్లు వసూలు చేసేవారి సంఘం). వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, గొంది గొందినా వెలసిన వృత్తివిద్యా కళాశాలలు మరియు కార్పొరేట్ పాఠశాలల్లోనూ వాకబు చేస్తే ఈ రెండు సంఘాల్లో సభ్యత్వం స్వీకరించటానికి అర్హులైన లక్షలాదిమంది లభిస్తారు. తనాయాసం వారు చేయాల్సిందల్లా సంఘటితమైతే ఉండే సౌలభ్యాలనూ, ఓటు హక్కుతో తాము చేయగలిగే అద్భుతాలనూ వారికి ఓపికగా వివరించటమే. అందిస్తే అల్లుకుపోవటం వారికెటూ అలవాటే కాబట్టి ఇది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఇలా ఇతర సంఘాలను కూడదీసి మహా ముష్టి కూటమి (మముకూ) ఏర్పాటు చెయ్యటం వల్ల తనాయాసానికి మరో ఉపయోగం కూడా ఉంది. ఇది పైరవీల యుగం కూడా. చేతులు తడపనిదే ఏ పనీ కాని కాలం. ఏ పని చెయ్యాలన్నా తనాయాసానికి నిధుల సమస్య పెద్ద అడ్డంకి. ఇలాంటి సందర్భాల్లో మముకూలో ధనబలమున్న ఇతర సంఘాలు ఆదుకునే అవకాశం ఉంది.
పైరవీల ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆ విషయమ్మీద ఓ చిన్న సూచనతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ప్రభుత్వంతో పనులు చేయించాలంటే పలుకుబడీ, పరపతీ ఉన్న రాజకీయ పక్షాల్లో తమ బాధలు సానుభూతితో అర్ధం చేసుకోగలిగేవారిని పట్టుకోవటం ముఖ్యం. తనాయాసం పెద్దలకి ఈ విషయంలో పెద్దగా సమస్యలు ఎదురవకపోవచ్చు. వాళ్లు సంప్రదించాల్సిందల్లా ఓతివాసం (ఓట్లు తిరిపమెత్తేవారి సంఘం) నాయకులని మాత్రమే. బిచ్చమెత్తటంలో ఉన్న సాధక బాధకాలు ఓతివాసం సభ్యులకి తెలిసినంత బాగా మరెవరికీ తెలియదు. తనాయాసానికి వోతివాసం నైతిక మద్దతు పుష్కలంగా లభించే అవకాశం ఉంది.
ఇంకెందుకాలస్యం? తనాయాసం పెద్దలారా, పదండి ముందుకు. పని చూపించమని పోరాడకండి, పని చేసే పని లేకుండా చెయ్యరేమని నిలదీయండి. అడుక్కుతినటం అనాయాసం అనేవారి నడ్డి విరగ్గొట్టండి. పనిదొంగల స్వర్గధామంగా దేశాన్ని మార్చేదాకా విశ్రమించకండి. చెయ్యండి భావసారూప్య శక్తుల ఏకీకరణం. పట్టండి ప్రభుత్వాల భరతం. ఎత్తండి ధర్మభిక్షం. పొందండి మీ హక్కుల కబళం.
సెటైర్ బాగుంది. వ్యగ్యం పండింది.
సారూ…వాళ్ళు మరో విషయం మరచి పొయేరు. డూటీ అవర్స్ కానీ సమయంలో ధర్మం చెసే వాళ్ళు డబల్ ది అమౌంట్ ధర్మం చేయాలని కూడా కండిషన్ పెట్టాలి. వీళ్ళకి ఈ ఐడియా బహుశా పోకిరీ సినీమా చూసి వచ్చిందేమో!!
🙂
అయ్యా ! వ్యంగ్యమే అయినా అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో స్థిరపడిన అడుక్కోడం , గురించి బహు చిత్రంగా చక్కగా చెప్పారు. అభినందనలు.
ఈ వోట్ల బ్యాంకు రాజకీయాలున్నంత కాలం ,సామాజిక భాద్యతలను మరచిన ప్రభుత్వాలున్నంత కాలం ,మానవ వనరుల్ని సామాజిక చింతనతో జాతి పురోగమనానికి వినియోగించుకొనే దృక్పధంలో పయనించనంతకాలం ,బడుగు జీవితాలలో వెలుగులు నింపాలని తెచ్చిన అప్పుల సొత్తులు రాజకీయుల జేబుల్లో నిండుతున్నంతకాలం ….. ఇదేమీ వైపరీత్యం కాదు. రేపు చతుషష్టి కళలలో ఒకరైన చోర కళాకారులు కూడా , తమ వృత్తికై సామాజిక న్యాయం కోరుతూ కనీసం రోజుకో దొంగతనం చేసుకోనిచ్చే న్యాయపరమైన వెసులుబాటునివ్వాలని వుద్యమించడంలో ఎక్కువ కాలం పట్టదేమో . ….
నూతక్కి రాఘవేంద్ర రావు
ఔరా!!
🙂 బాగుంది.
చితక్కొట్టేసారు! ఈ మముకూ కాన్సెప్టు గొప్పగా ఉంది.
మముకూ సభ్యులకూ ఓతివాసులకూ తేడా అల్లా.., ఈ రెండో రకం జనం అడుక్కోడం కాగానే తిరిపెమిచ్చినవాడి చేతికి బొచ్చెనిచ్చేసి మళ్ళీ ఐదేళ్ళ దాకా కనబడరు. మముకేయులు అలాక్కాదు -ఏప్..ప్పుడూ అడుక్కుంటూనే ఉంటారు.
🙂
One of the most scintillating pieces in the Telugu blogs in recent times! BRavo!!