జూన్, 2009ను భద్రపఱచుటెల్గూ స్టోరీ

కథలు చదవటం మొదలెట్టేనాటికి నాకింకా ఊహ కూడా సరిగా తెలియదు. చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి లాంటి పిల్లల పుస్తకాలే కాకుండా విపుల, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రపత్రిక, ఈనాడు ఆదివారం సంచిక, వనిత, మహిళ, విజయ మాస పత్రిక .. ఇలా కనపడ్డ కథల పుస్తకాన్నల్లా నమిలేయాల్సిందే. భోజనం చేసేటప్పుడూ చేతిలో ఏదో ఓ పుస్తకం ఉండాల్సిందే – అది అంతకుముందే చదివిందైనా సరే. చిన్నప్పుడు రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి గ్రంధాలనీ వాటిలోని మంత్రతంత్రాల కథల కోసమే మళ్లీమళ్లీ చదివేవాడిని. కథలంటే అంతిష్టముండేది ఒకప్పుడు. కొన్నేళ్లుగా అదెటుపోయిందో తెలీదు. గత పదేళ్లలో నేను పూర్తిగా చదివిన కథలు పదుల్లోనే. మొదలెట్టి మధ్యలోనే ఆపేసినవెన్నో. వైవిధ్యం లేకపోవటం, తెలుగుదనం కొరవడటం తెలుగు కథలపై నాకాసక్తి పోగొట్టిన కారణాలు.

తెలుగుదనం కొరవడటం అంటే మన పండగలూ పబ్బాల గురించీ, పల్లెటూర్ల మట్టి వాసన గురించీ ఇప్పుడొచ్చే కథల్లో ఉండటం లేదని కాదు. ఆ రకం తెలుగుదనం వద్దన్నంత ఉంటుంది – ప్రతి మూడో కథలోనూ అదే కదా. నేననేది తెలుగు కథలో కరువైపోతున్న తెలుగు గురించి. టీవీ యాంకరమ్మలకి తీసిపోని వంకర భాష నిండిన తెలుగు కథలెన్నో. పాత్రౌచిత్యం అని సరి పెట్టుకోటానికి లేదు – సంభాషణలే కాకుండా ఆయా పాత్రల ఆలోచనలూ, పరిసరాల వర్ణనలూ సైతం ఆంగ్లంలోనే సాగుతాయి! మచ్చుకి, ఈ మధ్య నేను చదివిన ఒకానొక తెలుగు కథలోంచి రెండు మూడు పేరాలు యధాతధంగా ఇస్తున్నాను. ఓ ప్రముఖ ఫౌండేషన్ వారి కథా సంకలనంలో కనపడ్డ మొట్టమొదటి కథ ఇది. ఆరంభమే ఎంత కమ్మటి తెలుగులో ఉందో కాంచి తరించండి.

ఆ రోజు రాత్రి 7.30 గంటలకు డాక్టర్ మిత్రా, డాక్టర్ పరీనా వాళ్ల బేస్‌మెంటులో పెద్ద ఆర్భాటంగా పిల్లల కోసం పార్టీ ఎరేంజ్ చేశారు. ఆరున్నర అడుగుల ఎత్తు ఉన్న పైన్ క్రిస్‌మస్ “ట్రీ”, దానికి చిన్నవీ, పెద్దవీ అందమైన కలర్‌ఫుల్ బాల్స్ చక్కగా హేంగ్ చేసి, పైన క్రిస్‌మస్ గార్లండ్ వేసి, ఆకులన్నింటికీ నీలిరంగు లైట్లు అమర్చారు.

గెస్టులందరూ ఒకరొకరే వచ్చి …. కార్లు పార్క్ చేసి “వావ్, వావ్, గ్రేట్ …. భలే ఉందే …. లేండ్‌స్కేపింగు అబ్బా …. లుకెట్ దిస్ డెకరేషన్, వాచ్ దిస్ రీత్, ఆ స్నోమేన్ చూడండి ఎంత బాగుందో” అని మాట్లాడుకుంటూ మిత్రాగారి ఇంట్లోకి అడుగు పెట్టారు.

“పిల్లలందర్నీ బేస్‌మెంటులోకి వెళ్లమనండి” చెప్పింది పరీనా. పిల్లలందరూ క్రిస్‌మస్ కుక్కీలు తీసుకుని కింది కెళ్లిపోయారు. పెద్ద వాళ్లందరూ లివింగ్ రూమ్‌లో కొందరూ, ఫామిలీ రూమ్‌లో మరికొందరూ, ఫార్మల్ డైనింగ్ రూమ్‌లోనూ, కిచెన్‌లో బ్రేక్‌ఫాస్టు టేబిల్ దగ్గర కొందరు కూర్చుని, సాఫ్ట్ డ్రింక్స్, వైన్, చీజ్ అండ్ క్రాకర్స్, వెజ్జీ సమోసా, మినీ దోసెలూ, గారెలూ, జీడిపప్పు పకోడీలూ తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఇదో నాలుగే పేజీల బుల్లి కథ. నిజానికందులో కథంటూ ఏమీ లేదు. సదరు ఫౌండేషన్ వారు ఏవో మొహమాటాలకి పోయి అచ్చేసుండొచ్చు. వాళ్ల మొహమాటం అర్ధం చేసుకోదగ్గదే కానీ, ఓ తెలుగు కథని ఇంకొంత మెరుగైన తెలుగులో రాయటానికి రచయిత్రి మరీ అంత మొహమాటపడటమెందుకో నాకర్ధమవలేదు. ఆ రెండో పేరాని ‘అతిధులంతా క్రిస్‌మస్ అలంకారాలు మెచ్చుకుంటూ లోపలికొచ్చారు‘ అనో, మరోలాగనో ఒక్క ముక్కలో చెప్పేయొచ్చు. భాష సంగతటుంచితే – చిట్టి పొట్టి కథల్లో సైతం అనవసర వర్ణనలతో పేజీలు నింపటమ్మీదనే కథకుల దృష్టి! ఈ మధ్యకాలంలో నా కళ్లబడ్డ ఇలాంటి సరుకెంతో. భాష విషయంలో మడికట్టుకోనవసరం లేదు. ఐతే, అవసరమైనంతమేరకే అన్య భాష వాడాలి కానీ అక్కడక్కడా తెలుగు పదాలిరికించేసి అదే తెలుగు కథ అనేస్తే ఎలా?

ఇక మన కథల్లో వస్తు వైవిధ్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తెలుగు కథ అనగానే ఫలానా రకం ఇతివృత్తాలు మాత్రమే ఉండాలని ఎవరో గిరిగీసినట్లుంటాయి ఎక్కువ శాతం. మొగుడూ పెళ్లాల మురిపాలు లేదా కలహాలు, ప్రేమికుల విరహాలు, తరాల అంతరాల గూర్చిన చర్చాగోష్టులు, ముసలి తల్లిదండ్రులని పట్టించుకోని పిల్లలపై విసుర్లు, అమ్మలక్కల కబుర్లు, ఉమ్మడి కుటుంబాల్లో వెల్లివిరిసే ఆప్యాయతలూ చుట్టుముట్టే చికాకులూ, పల్లెలకీ పట్టణాలకీ/విదేశానికీ స్వదేశానికీ/బాల్యానికీ ప్రస్తుతానికీ పోలికలతో ఠావులు నింపే నాస్టాల్జియా వ్యాసాలు, ఇవన్నీ కాకపోతే కాస్త భావుకతకి మరి కాస్త స్త్రీవాదమో మరే వాదమో అద్ది సమాజ రీతులని ప్రశ్నించే విప్లవ ఘీంకారాలు. వీటికి తోడుగా –  సమకాలీన సాంఘిక సమస్యలపై వచ్చే సీజనల్ కధలు – అంటే వరకట్న చావులు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, విదేశీ ఉద్యోగాల మోజు, వగైరా. పైకి విభిన్న వర్గాలకు చెందిన కథల్లా ఉన్నా, స్థూలంగా చూస్తే అవన్నీ వచ్చేది ఒకే మూస నుండి. ఆ మహా మూస పేరు, నీతి కథలు. ఈ తరహా కథలన్నిట్లోనూ ప్రముఖంగా ఉండేది భావోద్వేగాలు, చివర్లో చిన్నదో పెద్దదో ఓ సందేశం. కథల్లో సందేశాలు మంచిదే. కానీ కథలన్నిటి ధ్యేయమూ సందేశాలివ్వటమేనా? ఇచ్చినా మరీ అంత కొట్టొచ్చినట్లుండాలా? కథకుల వ్యక్తిగత అభిప్రాయాలు, అనుభవాలు పాఠకులపై రుద్దే ప్రయత్నాలే ఇవన్నీ. ఇదేనా సాహిత్యం? ఇందులో ఊహలకి స్థానమేది? సందేశాల కోసం కాక రస స్పందన కోసమే కథలు చదివేవాళ్లూ అనేకులుంటారు. నీతులు చెప్పే మోజులో వాళ్లని నేటి తరం కథా రచయితలు/త్రులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లనిపిస్తుంది. తెలుగు కథలకి పాఠకాదరణ తగ్గటానికి అదీ ఓ కారణం కావచ్చు.

అధిక శాతం కథకులు తమ జీవితానుభవాలని కథలుగా మార్చటంలో చూపే ఆసక్తి పూర్తి స్థాయి కల్పనాధారిత సాహితీ సృజనపై పెట్టక పోవటం తెలుగు కథలకు పెద్ద లోటు. అనుభవాల నుండి కథలల్లటం తప్పు కాదు. ఐతే అదో ప్రక్రియ మాత్రమే. అదే ఎక్కువమంది కథకులెరిగిన ఏకైక ప్రక్రియగా మిగలటమే నేటి తెలుగు కథల్లో భిన్నత్వలేమికి కారణం. మరోరకమైన కథ దుర్భిణీ వేసి వెదుక్కుంటే కానీ దొరకని పరిస్థితి. కొత్తగా ఏ కథ చదవబోయినా ఇంతకుముందెక్కడో చదివేసిన భావన. మొదటి పేజీ చదవగానే చివర్లో ఏమవబోతుందో తెలిసిపోవటం. నావరకూ నేను చదవబోయిన చాలా కథలు మధ్యలోనే ఆపేయటానికి ప్రధాన కారణమిదే. మన కథకులకి రాయటానికి ఈ అరిగిపోయిన రొడ్డకొట్టుడు ఆలోచనలు తప్ప వేరేవి రావా? మూసలోనే రాయాలనుకున్నా ఇంకా బోలెడు మూసలుంటాయి కదా. మనదగ్గర వాటికీ కరువొచ్చిందా? భయానకం, అనుమానాస్పదం, గూఢచర్యం, అపరాధ పరిశోధన, అధివాస్తవికత, సైన్స్ ఫిక్షన్, చారిత్రకం, జానపదం, సోషియో ఫ్యాంటసీ, సాహసం, కుట్ర కోణాలు, రహస్య ఛేదనలు, ట్విస్ట్ ఎండింగ్ .. ఇలాంటి విభాగాల్లో తెలుగు కథలు రాసేవాళ్లెవరన్నా ఉన్నారా అసలు? వీటిలోనూ సందేశాలివ్వొచ్చు. రెండు మూడు వర్గాల లక్షణాలు కలగలిపి కొత్త రకం సృష్టించొచ్చు. చెయ్యాలే కానీ ప్రయోగాలకి అంతమే లేదు. ప్రయత్నించేవారేరీ?

ప్రయత్నించేవారు అసలుకే లేరనటం సరికాకపోవచ్చు. వారికి దక్కే గుర్తింపెంత అన్నది ఆలోచించాల్సిన విషయం. కొంత కాలంగా నేను గమనించిన కథా రచన పోటీల్లో బహుమతులు పొందిన కథలన్నీ పైన చెప్పిన మహా మూసలోనివే! అటువంటివే పోటీకొస్తున్నాయి కాబట్టి వాటికే బహుమతులొస్తున్నాయా? వాటికే బహుమతులొస్తున్నాయి కాబట్టి అంతా అటువంటివే రాస్తున్నారా? ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నంత క్లిష్టమైన ప్రశ్న. సమాధానమేది? సమస్య ఎక్కడుంది – కథకుల్లోనా, విమర్శకుల్లోనా, ప్రచురణకర్తల్లోనా, పోటీల నిర్వాహకుల్లోనా? అది నాకు తెలీదు. తెలిసిందొకటే – పాఠకుల్లో మాత్రం కాదు.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.