టెల్గూ స్టోరీ

కథలు చదవటం మొదలెట్టేనాటికి నాకింకా ఊహ కూడా సరిగా తెలియదు. చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి లాంటి పిల్లల పుస్తకాలే కాకుండా విపుల, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రపత్రిక, ఈనాడు ఆదివారం సంచిక, వనిత, మహిళ, విజయ మాస పత్రిక .. ఇలా కనపడ్డ కథల పుస్తకాన్నల్లా నమిలేయాల్సిందే. భోజనం చేసేటప్పుడూ చేతిలో ఏదో ఓ పుస్తకం ఉండాల్సిందే – అది అంతకుముందే చదివిందైనా సరే. చిన్నప్పుడు రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి గ్రంధాలనీ వాటిలోని మంత్రతంత్రాల కథల కోసమే మళ్లీమళ్లీ చదివేవాడిని. కథలంటే అంతిష్టముండేది ఒకప్పుడు. కొన్నేళ్లుగా అదెటుపోయిందో తెలీదు. గత పదేళ్లలో నేను పూర్తిగా చదివిన కథలు పదుల్లోనే. మొదలెట్టి మధ్యలోనే ఆపేసినవెన్నో. వైవిధ్యం లేకపోవటం, తెలుగుదనం కొరవడటం తెలుగు కథలపై నాకాసక్తి పోగొట్టిన కారణాలు.

తెలుగుదనం కొరవడటం అంటే మన పండగలూ పబ్బాల గురించీ, పల్లెటూర్ల మట్టి వాసన గురించీ ఇప్పుడొచ్చే కథల్లో ఉండటం లేదని కాదు. ఆ రకం తెలుగుదనం వద్దన్నంత ఉంటుంది – ప్రతి మూడో కథలోనూ అదే కదా. నేననేది తెలుగు కథలో కరువైపోతున్న తెలుగు గురించి. టీవీ యాంకరమ్మలకి తీసిపోని వంకర భాష నిండిన తెలుగు కథలెన్నో. పాత్రౌచిత్యం అని సరి పెట్టుకోటానికి లేదు – సంభాషణలే కాకుండా ఆయా పాత్రల ఆలోచనలూ, పరిసరాల వర్ణనలూ సైతం ఆంగ్లంలోనే సాగుతాయి! మచ్చుకి, ఈ మధ్య నేను చదివిన ఒకానొక తెలుగు కథలోంచి రెండు మూడు పేరాలు యధాతధంగా ఇస్తున్నాను. ఓ ప్రముఖ ఫౌండేషన్ వారి కథా సంకలనంలో కనపడ్డ మొట్టమొదటి కథ ఇది. ఆరంభమే ఎంత కమ్మటి తెలుగులో ఉందో కాంచి తరించండి.

ఆ రోజు రాత్రి 7.30 గంటలకు డాక్టర్ మిత్రా, డాక్టర్ పరీనా వాళ్ల బేస్‌మెంటులో పెద్ద ఆర్భాటంగా పిల్లల కోసం పార్టీ ఎరేంజ్ చేశారు. ఆరున్నర అడుగుల ఎత్తు ఉన్న పైన్ క్రిస్‌మస్ “ట్రీ”, దానికి చిన్నవీ, పెద్దవీ అందమైన కలర్‌ఫుల్ బాల్స్ చక్కగా హేంగ్ చేసి, పైన క్రిస్‌మస్ గార్లండ్ వేసి, ఆకులన్నింటికీ నీలిరంగు లైట్లు అమర్చారు.

గెస్టులందరూ ఒకరొకరే వచ్చి …. కార్లు పార్క్ చేసి “వావ్, వావ్, గ్రేట్ …. భలే ఉందే …. లేండ్‌స్కేపింగు అబ్బా …. లుకెట్ దిస్ డెకరేషన్, వాచ్ దిస్ రీత్, ఆ స్నోమేన్ చూడండి ఎంత బాగుందో” అని మాట్లాడుకుంటూ మిత్రాగారి ఇంట్లోకి అడుగు పెట్టారు.

“పిల్లలందర్నీ బేస్‌మెంటులోకి వెళ్లమనండి” చెప్పింది పరీనా. పిల్లలందరూ క్రిస్‌మస్ కుక్కీలు తీసుకుని కింది కెళ్లిపోయారు. పెద్ద వాళ్లందరూ లివింగ్ రూమ్‌లో కొందరూ, ఫామిలీ రూమ్‌లో మరికొందరూ, ఫార్మల్ డైనింగ్ రూమ్‌లోనూ, కిచెన్‌లో బ్రేక్‌ఫాస్టు టేబిల్ దగ్గర కొందరు కూర్చుని, సాఫ్ట్ డ్రింక్స్, వైన్, చీజ్ అండ్ క్రాకర్స్, వెజ్జీ సమోసా, మినీ దోసెలూ, గారెలూ, జీడిపప్పు పకోడీలూ తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఇదో నాలుగే పేజీల బుల్లి కథ. నిజానికందులో కథంటూ ఏమీ లేదు. సదరు ఫౌండేషన్ వారు ఏవో మొహమాటాలకి పోయి అచ్చేసుండొచ్చు. వాళ్ల మొహమాటం అర్ధం చేసుకోదగ్గదే కానీ, ఓ తెలుగు కథని ఇంకొంత మెరుగైన తెలుగులో రాయటానికి రచయిత్రి మరీ అంత మొహమాటపడటమెందుకో నాకర్ధమవలేదు. ఆ రెండో పేరాని ‘అతిధులంతా క్రిస్‌మస్ అలంకారాలు మెచ్చుకుంటూ లోపలికొచ్చారు‘ అనో, మరోలాగనో ఒక్క ముక్కలో చెప్పేయొచ్చు. భాష సంగతటుంచితే – చిట్టి పొట్టి కథల్లో సైతం అనవసర వర్ణనలతో పేజీలు నింపటమ్మీదనే కథకుల దృష్టి! ఈ మధ్యకాలంలో నా కళ్లబడ్డ ఇలాంటి సరుకెంతో. భాష విషయంలో మడికట్టుకోనవసరం లేదు. ఐతే, అవసరమైనంతమేరకే అన్య భాష వాడాలి కానీ అక్కడక్కడా తెలుగు పదాలిరికించేసి అదే తెలుగు కథ అనేస్తే ఎలా?

ఇక మన కథల్లో వస్తు వైవిధ్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తెలుగు కథ అనగానే ఫలానా రకం ఇతివృత్తాలు మాత్రమే ఉండాలని ఎవరో గిరిగీసినట్లుంటాయి ఎక్కువ శాతం. మొగుడూ పెళ్లాల మురిపాలు లేదా కలహాలు, ప్రేమికుల విరహాలు, తరాల అంతరాల గూర్చిన చర్చాగోష్టులు, ముసలి తల్లిదండ్రులని పట్టించుకోని పిల్లలపై విసుర్లు, అమ్మలక్కల కబుర్లు, ఉమ్మడి కుటుంబాల్లో వెల్లివిరిసే ఆప్యాయతలూ చుట్టుముట్టే చికాకులూ, పల్లెలకీ పట్టణాలకీ/విదేశానికీ స్వదేశానికీ/బాల్యానికీ ప్రస్తుతానికీ పోలికలతో ఠావులు నింపే నాస్టాల్జియా వ్యాసాలు, ఇవన్నీ కాకపోతే కాస్త భావుకతకి మరి కాస్త స్త్రీవాదమో మరే వాదమో అద్ది సమాజ రీతులని ప్రశ్నించే విప్లవ ఘీంకారాలు. వీటికి తోడుగా –  సమకాలీన సాంఘిక సమస్యలపై వచ్చే సీజనల్ కధలు – అంటే వరకట్న చావులు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, విదేశీ ఉద్యోగాల మోజు, వగైరా. పైకి విభిన్న వర్గాలకు చెందిన కథల్లా ఉన్నా, స్థూలంగా చూస్తే అవన్నీ వచ్చేది ఒకే మూస నుండి. ఆ మహా మూస పేరు, నీతి కథలు. ఈ తరహా కథలన్నిట్లోనూ ప్రముఖంగా ఉండేది భావోద్వేగాలు, చివర్లో చిన్నదో పెద్దదో ఓ సందేశం. కథల్లో సందేశాలు మంచిదే. కానీ కథలన్నిటి ధ్యేయమూ సందేశాలివ్వటమేనా? ఇచ్చినా మరీ అంత కొట్టొచ్చినట్లుండాలా? కథకుల వ్యక్తిగత అభిప్రాయాలు, అనుభవాలు పాఠకులపై రుద్దే ప్రయత్నాలే ఇవన్నీ. ఇదేనా సాహిత్యం? ఇందులో ఊహలకి స్థానమేది? సందేశాల కోసం కాక రస స్పందన కోసమే కథలు చదివేవాళ్లూ అనేకులుంటారు. నీతులు చెప్పే మోజులో వాళ్లని నేటి తరం కథా రచయితలు/త్రులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లనిపిస్తుంది. తెలుగు కథలకి పాఠకాదరణ తగ్గటానికి అదీ ఓ కారణం కావచ్చు.

అధిక శాతం కథకులు తమ జీవితానుభవాలని కథలుగా మార్చటంలో చూపే ఆసక్తి పూర్తి స్థాయి కల్పనాధారిత సాహితీ సృజనపై పెట్టక పోవటం తెలుగు కథలకు పెద్ద లోటు. అనుభవాల నుండి కథలల్లటం తప్పు కాదు. ఐతే అదో ప్రక్రియ మాత్రమే. అదే ఎక్కువమంది కథకులెరిగిన ఏకైక ప్రక్రియగా మిగలటమే నేటి తెలుగు కథల్లో భిన్నత్వలేమికి కారణం. మరోరకమైన కథ దుర్భిణీ వేసి వెదుక్కుంటే కానీ దొరకని పరిస్థితి. కొత్తగా ఏ కథ చదవబోయినా ఇంతకుముందెక్కడో చదివేసిన భావన. మొదటి పేజీ చదవగానే చివర్లో ఏమవబోతుందో తెలిసిపోవటం. నావరకూ నేను చదవబోయిన చాలా కథలు మధ్యలోనే ఆపేయటానికి ప్రధాన కారణమిదే. మన కథకులకి రాయటానికి ఈ అరిగిపోయిన రొడ్డకొట్టుడు ఆలోచనలు తప్ప వేరేవి రావా? మూసలోనే రాయాలనుకున్నా ఇంకా బోలెడు మూసలుంటాయి కదా. మనదగ్గర వాటికీ కరువొచ్చిందా? భయానకం, అనుమానాస్పదం, గూఢచర్యం, అపరాధ పరిశోధన, అధివాస్తవికత, సైన్స్ ఫిక్షన్, చారిత్రకం, జానపదం, సోషియో ఫ్యాంటసీ, సాహసం, కుట్ర కోణాలు, రహస్య ఛేదనలు, ట్విస్ట్ ఎండింగ్ .. ఇలాంటి విభాగాల్లో తెలుగు కథలు రాసేవాళ్లెవరన్నా ఉన్నారా అసలు? వీటిలోనూ సందేశాలివ్వొచ్చు. రెండు మూడు వర్గాల లక్షణాలు కలగలిపి కొత్త రకం సృష్టించొచ్చు. చెయ్యాలే కానీ ప్రయోగాలకి అంతమే లేదు. ప్రయత్నించేవారేరీ?

ప్రయత్నించేవారు అసలుకే లేరనటం సరికాకపోవచ్చు. వారికి దక్కే గుర్తింపెంత అన్నది ఆలోచించాల్సిన విషయం. కొంత కాలంగా నేను గమనించిన కథా రచన పోటీల్లో బహుమతులు పొందిన కథలన్నీ పైన చెప్పిన మహా మూసలోనివే! అటువంటివే పోటీకొస్తున్నాయి కాబట్టి వాటికే బహుమతులొస్తున్నాయా? వాటికే బహుమతులొస్తున్నాయి కాబట్టి అంతా అటువంటివే రాస్తున్నారా? ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నంత క్లిష్టమైన ప్రశ్న. సమాధానమేది? సమస్య ఎక్కడుంది – కథకుల్లోనా, విమర్శకుల్లోనా, ప్రచురణకర్తల్లోనా, పోటీల నిర్వాహకుల్లోనా? అది నాకు తెలీదు. తెలిసిందొకటే – పాఠకుల్లో మాత్రం కాదు.

29 స్పందనలు to “టెల్గూ స్టోరీ”


 1. 1 జీడిపప్పు 5:55 సా. వద్ద జూన్ 10, 2009

  ఉన్నది ఉన్నట్టు చెప్పారు అబ్రకదబ్ర గారు. కథల పోటీలకు ఎన్ని మంచికథలు వచ్చినా తమకు తెలిసినవాళ్ళకో, బాకారాయుళ్ళకో బహుమతి ఇచ్చేయడం పరిపాటయింది. ఇక “పైకి విభిన్న వర్గాలకు చెందిన కథల్లా ఉన్నా, స్థూలంగా చూస్తే అవన్నీ వచ్చేది ఒకే మూస నుండి.” అన్నది అక్షర సత్యం. ఈ కథలనే “పరమ చెత్త కథలు” అనవచ్చు.

  అన్నట్టు ఈ “టెల్గూ కథ” ఎక్కడ దొరుకుతుంది? 🙂

 2. 2 sbmurali2007 7:35 సా. వద్ద జూన్ 10, 2009

  అబ్రకదబ్ర గారూ,
  నేనూ ఒక amateur కథా రచయిత్రి నవటం చేత మీ వ్యాసాన్ని శ్రధ్ధగా చదివాను. మీరు రాసింది ఇంకా నయం. నాలుగేళ్ళ కింద ఒక ప్రథమ బహుమతి పొందిన నవల చదివాను. అందులో నాయికని వర్ణిస్తూ రచయిత్రి, “హెయిర్ బాత్ తీసుకున్న ఆమె హెయిర్ సిల్క్ లా మెరుస్తుంది,” అని చదివి చాలా ఆశ్చర్యపోయాను. మెరవటానికి ఇంగ్లీషులో ఈవిడకి సరైన పదం దొరకలేదెందుకా అని 😉
  వస్తు వైవిధ్యమున్న కథలు బహుమతుల మాట అటుంచండి, ప్రచురణకి కూడా నోచుకోవు.
  ఉదాహరణకి
  నేను అగ్ర దేశాల నూనె దాహాన్ని గురించి “ఓటమి” అనే కథను రాసి పోటీకి పంపాను. సాధారణ ప్రచురణకి కూడా తీసుకోబడలేదు. పెళ్ళీ, దాని సాంఘిక అవసరం గురించి రాసిన “పవిత్ర బంధం”, ఆడ వాళ్ళ బహువిధ పాత్రాభినయం గురించి రాసిన “నేనెవరిని”సాధారణ ప్రచురణకి తీసుకోబడ్డాయి.
  సంగీతం గురించి రాసిన “రాగ సుధా రస పానము”
  మతానికీ దేశ భక్తికీ వున్న సంబంధాన్ని ప్రశ్నిస్తూ రాసిన “ఎల్లలు”, సంతాన లేమిని గురించి రాసిన “ఆకాశనికి గుంజలు”, మాదక ద్రవ్యాల గురించి రాసిన “విష వలయం”, అన్నీ కన్సొలేషన్ బహుమతులే పొందాయి. కథల్లో పిల్లల స్వార్ధాన్ని, పెద్దల త్యాగాన్నీ అతిగా రాయటం తో విసుగెత్తి నేను “ఎడబాటు”, “కన్నవారి కలలు” కథలు రాసి నా మంట చల్లార్చుకున్నాను 🙂
  దీనివల్ల ఈ మధ్య నేను, బహుమతులు పొందాలంటే విధిగా ఈ కింది వాటి గురించే రాయాలేమో నన్న conclusion కొచ్చాను.
  అ)అమెరికాలో వుండే వారు అనుభవించే “మాతృ దేశ వియోగం.” ఈ భావన కేవలం మగవారికీ, అమెరికాలో వుండే వారికీ వుంటుందనీ, విదేశాల్లో నివసించే ఆడ వారికి “అత్తగారి బారినించి తప్పించుకోవటం” ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి home sickness, పుట్టిన ఊరి మీద ప్రేమా వుండవని గమనించ ప్రార్థన.
  ఆ)పెద్దలు చేసిన త్యాగాలని పిల్లలు గుర్తించకుండా స్వార్ధంతో వారిని నిరాదరించటం. ఇదీ కేవలం మగవారికీ వారి తల్లి తండ్రులకీ మాత్రమే వుండే సమస్య.
  ఇ)రైతుల సమస్యలు. నిజానికి అందరమూ ఆలోచించవలిసింది ఈ సమస్యని గురించే. ఈ కథల మీద నాకెటువంటి వ్యతిరేకతా లేదు.
  ఈ) ఏదో ఒక వర్గానికి చెందిన “వాదం”.

  నేను మీకు నాణేనికి రెండో వైపు చూపించటానికి ప్రయత్నిస్తున్నాను. ఒక్కసారి నా బ్లాగ్
  http://www.sbmurali2007.wordpress.com లో నా కథలు చూడండి. వాటికి వచ్చే ఆదరణ, ప్రోత్సాహం ఎంతుందో గమనించండి. తెలుగులో వైవిధ్యమున్న కథలు ఎందుకు రావటంలేదో, కథలు రాసే వాళ్ళు ఎంత నిరుత్సాహమైన వాతావరణంలో రాస్తున్నారో మీకర్ధం అవుతుంది.
  ఇక్కడ నా వుద్దేశ్యం నేనేదో అందరికంటే గొప్ప దాన్ననీ, మిగతా రచయితా/రచయిత్రుల కంటే మెరుగైందాన్ననీ కాదు. వస్తు వైవిధ్యమున్న కథలు రాసినంత మాత్రాన వాటికి పెద్దగా ఆదరణా, గుర్తింపూ రావు. అలాటప్పుడూ, trust me, it is a frustrating affair. But still I continue to write, because that is what I like.

  శారద

 3. 3 కె.మహేష్ కుమార్ 7:36 సా. వద్ద జూన్ 10, 2009

  “Our Mythology, our Mythic selves are much more than the idea of the stories that are/were told to us. We are the very stories that we tell ourselves. And always have been. From the time we were born. From the time that Human beings started to imagine.” అంటాడు ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్.

  ఉదాహరణకు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి మిట్టూరోడి కథలు తీసుకోండి. అవి అభిప్రాయాలూ కావు,సందేశాలూ కావు,యిజాలూకావు కేవలం అనుభవాలు. తనచుట్టూ తాను చూసిన జీవితం. వ్యక్తులు. ఘటనలు. చిత్రాలు. చికాకులు. ఆటలు. ఆర్భాటాలూ. వంటలూ. వడ్డింపులూ. దుఃఖాలూ.దౌష్ట్యాలూ. సంతోషాలు. వీటిని “వ్యక్తిగత సొద” అని కొట్టెయ్యలేము. ఆ వ్యక్తిగత అనుభవంలో ఒక యూనివర్సాలిటీ కనిపిస్తుంది.మనల్ని మనం గుర్తించుకోగలిగిన క్షణాలు మనకు కనిపిస్తాయి…ఇక్కడే వస్తుంది తేడా అంతా.

  ఈ కథకుడు పత్రికలో బహుమతి కోసమో, యిజాల బాసుల మెప్పుకోసమో కథ రాయలేదు. రాసింది కనీసం అచ్చేసుకుంటారన్న ధ్యాస కూడా లేకుండా రాశాడు. ఆ “సొంతరికం” ఈ మధ్యకాలంలో తక్కువయ్యింది. కథ రాసేముందే ఎవరికోసం కథ రాస్తున్నాడో, ఎవర్ని మెప్పించడానికి కథ రాస్తున్నాడో కథకుడికి తెలిసిపోతే కథలో వ్యక్తిత్వం ఏముంటుంది? కనీసం తను నమ్మింది,తను ఇష్టపడేది, తను చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా చెప్పే వెసులుబాటు ఎక్కడ మిగిలింది?

  ఇంకా చాలా చెప్పాలి… కానీ అవి నాటపా కోసం దాచేసుకుంటున్నాను.

 4. 4 kalpanarentala 8:14 సా. వద్ద జూన్ 10, 2009

  పాఠకుల్లో లేదు అని అంత తేలికగా చెప్పేశారు కాని, మీ బాధలొ వాళ్ళ పాత్ర కూడా వుంది. మహెష్ లాగానే నేను కూడా నా మిగతా అభిప్రాయాల్ని మరోచోట చర్చిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇంతకన్నా వివరంగా రాయతం లేదు.

  మీరు పైన చెప్పిన వుదాహరణ గురించి మాత్రం ఒక మాట. ఆ కధ అమెరికా తెలుగు కధగా నాకు తోచింది. ఇక్కడ వాతావరణాన్ని చెప్పటానికి చాల సార్లు తప్పక ఇంగ్లిష్ పదాలు వాడాల్సి వస్తుంది. కానీ మరీ వక్యాలు వాక్యాలు రాస్తె చదవటం కష్టమేననుకోండి.

  anyhow, కధా విమర్శ మీద చాల మంచి చర్చలు లేవనెత్తుతున్నందుకు అభినందనలు.

  kalpana rentala

 5. 5 Vamsi M Maganti 10:14 సా. వద్ద జూన్ 10, 2009

  ఫిబ్రవరిలో ఆచార్య వేమూరి గారి మాటలు విన్నాక కూడా మీకు ఇంతలావు అనుమానం వచ్చిందంటే , నెమ్మదిగా మీ బుర్ర పాదరసంలా పనిచేస్తోందన్నమాట.

  కొంచెం కిడ్డింగే కానీ మీరు చెప్పిన వర్డ్స్ కి చాలా ఇంపార్టన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మన లాంగ్వేజ్ ఏం బాగుపడుతుంది? మన స్టొరీస్ ఏమయిపోతాయి? మన రైటర్స్ ఏమయిపోతారు, మనకు ఆ స్టొరీస్ పబ్లిష్ చేయించి ఇచ్చేవాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అయితే మీరు అనుకున్నట్టు అవర్ పీపుల్ అంత మైండ్ లేని వాళ్ళు కారండీ. చక్కగా మీకు అన్ని ఫీలింగ్స్ కనపడేలా రైట్ చేసే రైటర్స్ కూడా ఉన్నారు. మీ కంఫర్టబిలిటికి ఏమాత్రం పెయిన్ కలిగించకుండా చాలా బుక్స్ రైట్ చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో అన్నీ ఆ టైప్ బుక్సే.. ఇలాటివి ఇంకా మీకు అన్ క్నోన్ అంటే నాకు చాలా ఇర్రిటేటింగా వుంది….., ఇక ఫౌండేషన్ సంగతి అంటారా డోంట్ ఆస్క్. అమెరికా-లో-కామెడీ చాలా హై అండీ. అది మీరు ఇంకా అబ్సర్వ్ చేసారో లేదో అని నాకు ఈ టైంలో అనిపిస్తోంది. ఓకె చలో విల్ మీట్ లేటర్.

 6. 6 saipraveen 11:25 సా. వద్ద జూన్ 10, 2009

  మీ టపా ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నను. కథలను వ్రాయడం ఎలాగో తెలుసుకున్నాను. నేను, నిన్న నా బ్లాగులో ఒక కథను రాశాను. దాంట్లో నేను చేసిన తప్పులను నేను కనుగొన్నాను. వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇకమీదట కథలు వ్రాయడానికి ముందు మీరు తెలిపిన విషయాలన్నింటిని గుర్తుపెట్టుకుంటాను. ధన్యవాదములు.

 7. 7 cbrao 11:40 సా. వద్ద జూన్ 10, 2009

  తెలుగు కధలలో వైవిధ్యం కావాలంటారు. అమెరికా నేపధ్యం ఉన్న కధలో ఇంగ్లీష్ పదాలు వాడితే, తెలుగు పదాలు వాడలేదంటారు. సమయం, సందర్భాన్ని బట్టి రాసే శైలిలో తేడా వుండగలదు. అవొక ప్రక్రియలో రాయబడిన కధలని అర్ధం చేసుకోవాలి. తెలుగు వారు తెలుగు నేపధ్యానికి దూరంగా జీవిస్తున్న సమయంలో మార్పు తప్పదేమో.

 8. 8 సుజాత 11:48 సా. వద్ద జూన్ 10, 2009

  అబ్రకదబ్ర,
  మీతో ప్రతి అక్షరం కాకపోయినా కొంత వరకూ ఏకీభవిస్తున్నాను.అయితే మీరు కథలు కేవలం కథలుగా ఊహల్లోంచి ఊడిపడాలంటారా ఏమిటి? రస స్పందన జీవితంలోంచి సృష్టించబడ్డ కథల్లోంచి పొందలేరా? కుటుంబరావు గారు రాసిన సాహిత్యమంతా జీవితంలోంచి వచ్చిందే! ఆయన కథలు ఉత్తమసాహిత్యం కాదా? ఆయన కథలు చదివితే అత్యుత్తమస్థాయి రస స్పందన కలుగుతుందే మరి! తెలుగు కథల్లో మీకు భిన్నత్వం గోచరించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది!మీరు కేవలం మీకు అందుబాటులో ఉన్న ఆన్లైన్ పత్రికలు మాత్రమే కాక కాస్త బయట అచ్చయ్యే కథల మీద కూడా ఒక చూపేయాలి.

  ఈ అధివాస్తవిక కథల గురించి! ఈ ధోరణిలో , అస్పష్ట భావ ప్రకటనతో వచ్చే కథలతో ఒక సమస్య ఉందండీ! ఆ కథ అర్థం కాకపోయినా, ఆ మాట బైటికి అన్నా జనం మనల్ని మేథావులు కాదనేసుకుంటారు. అందువల్ల రాజుగారి కొత్త బట్టలు టైపులో ‘అద్భుతం అపూర్వం’ అని మెచ్చేసుకుంటే ఒక పనైపోయినట్లే! ఉత్తమ కథ టాగు లభ్యం!

  మహేష్,
  నామిని రాతల్ని చీల్చి చెండాడేసిన వాళ్ళూ ఉన్నారబ్బా! ఆయన రాతల్లోని పరిమళాన్ని ఆఘ్రాణించడం చేతకాక జలుబు చేసి కూచున్న క్రిటిక్సు, సొంత గొడవ అనీ, లోతు లేదనీ, తెలుగు మీద పట్టు లేదనీ తెగ విమర్శించేశారట.ఆయనే రాశారు నాకోసారి! ఇలాంటి అనుభవాలు ఇక్కడ
  ఆయనకు కోకొల్లలు కాబట్టే ఆయన కనీసం హైదరాబాదు వైపు తొంగి చూడ్డానికి కూడా ఇష్టపడరు. రాయకపోడానికి కూడా ఇలాంటి కసి ఏదో ఉండి ఉంటుందని నా నమ్మకం, లేదా అనుమానం!

  ఈ సొంతరికంతో రాస్తుంటే నాస్టాల్జియాలు తప్ప మరోటి రాయడం రాదని కొట్టిపడేస్తున్నారుగా మరి!

 9. 9 నేస్తం 12:20 ఉద. వద్ద జూన్ 11, 2009

  కొన్ని కధలు ప్రతి వాక్యం వదలకుండా చదవాలనిపిస్తుంది,మరి కొన్ని పేరాగ్రాఫ్ లు సైతం పక్కకు నెట్టేసి ప్రక్కన పడేయాలనిపిస్తుంది.. ముఖ్యం గా ఇలాంటి వర్ణనలు ఎక్కువగా రచయిత్రులు రాసినవి చదివాను.. ఆమే గులాభీ రంగు చీర మీద అదే రంగు జూకాలు పెట్టుకుని, ఒంటి పేట గొలుసు వేసుకుని, జుట్టు వదిలేసి, సైడు ఒక గులాభీ పెట్టుకుని ఇలా సాగిపోతుంది కొందరి నవలలు.. వెంటనే పేజీ తిప్పి పడేస్తాను.. కాని సాద్యమైనంత వరకు మనం చక్కని ఇంట్లో వాడే తెలుగు పదాలతో కధ రాసినట్లైతే పాఠకులను ఇట్టే ఆకర్షించగలం.. అందువల్ల కధలో పాత్రలు మన ఇంట్లో మనుషుల్లా మనసుకు అనిపిస్తుంది

 10. 10 Bhaavana 6:40 ఉద. వద్ద జూన్ 11, 2009

  రచయత జీవితానుభవం నుంచే కదండి రచనలు వచ్చేది, పూర్తి కల్పానాధారిత రచనలు వచ్చాయి కదా పెద్ద ఇంపాలా కారులు బ్రహ్మాండమైన వ్యక్తిత్వాలు గట్ర గట్రా.. మీరు చెప్పినట్లు వర్గీకరణ చేస్తే ఎవరి కధ లు ఐనా ఎదో ఒక వర్గం లోకి రావలసిందే కదా.. కోకు గారైనా , చలం ఐనా, శ్రీ శ్రీ ఐనా. ప్రేక్షకులు మంచి సినిమాలు తీస్తే చూడమా అంటారు నిర్మాతలు ప్రేక్షకులు చూస్తే తీయమా అంటారు.. ఈ సమస్య ప్రతి రంగం లోను వున్నట్లు వుంది

 11. 11 rayraj 7:36 ఉద. వద్ద జూన్ 11, 2009

  ప్రతి రంగంలో కాదు, ప్రతి సమయంలోనూ ,ఈ ప్రశ్న ఇలాగే ఉంది.ఉంటుంది.

  అబ్రకదబ్రాగారూ, మీ వ్యాసంతో ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా “పాఠకులు తప్పు కాదు” అన్నదాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కాకపోతే, మీరు చెప్పిన ఉదాహరణలోని ఇంగ్లీషు వాడకం మాత్రం, నాకు కొంతమటుకు సమంజసంగానే ఉంది. పత్రికలో అచ్చేసేవారు కొంచెం మార్పుచేర్పులు చేసుంటే, నిజానికి మరీ ఇంత ఆక్షేపణీయంగా ఉండేది కాదు. వాడుక భాషలో కధలు రాయాలి అంటే అంతే మరి; మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడుతున్నారుగా!

  రచయిత కధలో సందేశాన్ని, తనదైన ఓ అభిప్రాయాన్ని చెప్పాలనుకోవటం కూడా ఓ సహజమైన విషయమే.ప్రతిసారి అది నీతికధలా చిరాకు పెట్టింది(బోరు కొట్టింది 😉 )అనిపిస్తే పాఠకుడికి ఆ సందేశం, అభిప్రాయం అంతగా నచ్చట్లేదేమో! లేకపోతే, రాసిన తీరే నచ్చట్లేదో! ఏది ఏమైన, మనసు కోరుకుంటున్నది ఇంగ్లీషు జీవనం;ఆలోచిస్తున్నది, జీవిస్తున్నది ఇంగ్లీషు జీవితం.ఇక తెలుగులో సాహిత్యం “పుడుతుంది” అనుకోవటం ప్స్..:( సాహిత్యం పుట్టడానికి కావాల్సిన ఆలోచనలు, “సాహిత్యం”లో పుట్టవు అని నేను చెప్పి, అందుకనే తెలుగులో ముందు “ఆలోచనలు” పెంచండి అని నేను చెబ్తే మీరేమో అర్ధం చేసుకోరు.ఔనౌను అనరు!

 12. 12 కామేశ్వర రావు 10:44 ఉద. వద్ద జూన్ 11, 2009

  అబ్రకదబ్రగారు,

  మీరిచ్చిన ఉదాహరణలో ప్రతి పదమూ తెలుగేనండీ, కాదంటారేవిటి! అది అమెరికా కథ అవ్వాల్సిన అవసరం లేదు. మన తెలుగునాట జరిగిందనుకున్నా అదే సహజమైన సంభాషణ అవుతుంది. భాష నిరంతరం మారుతూనే ఉంటుంది కదా. అలా మారుతున్న తెలుగు ప్రస్తుత స్వరూపం ఇది. మీరూ నేను కాదంటే మాత్రం ఏం లాభం. నా మాట మీద నమ్మకం లేకపోతే, ఈ లంకెలో వ్యాఖ్యలు చదవండి: http://poddu.net/?p=2988cpage=1#comment-6301

  అన్నట్టు నేనోసారి ఓ పత్రిక్కి పంపిన నా కథకి వచ్చిన రివ్యూ కామెంట్లలో ఒకటేవిటో తెలుసా, ఇందులో మరీ తెలుగుపదాలెక్కువున్నాయి, ఈ కాలానికి తగ్గట్టు కొన్ని ఇంగ్లీషు పదాలు వాడితే బావుంటుందని. అదేవీ అమెరికా తెలుగువాళ్ళ గురించిన కథ కాదు కూడాను. నేను మార్చనన్నాను. (అయినా ఆ కథ ప్రచురించారనుకోండి అది వేరే సంగతి)

 13. 13 radhika 11:43 ఉద. వద్ద జూన్ 11, 2009

  అమెరికాలో జరుగుతున్న కధ చెపుతూ వచ్చిన అతిధులు కొంత మంది వసారాలోను,కొంత మంది చావిట్లో ను,మరికొంత మంది మిద్దె మీద కూర్చున్నారు అంటే చదవడానికి మీకెలా వుంటుంది? అబ్రకదబ్ర గారూ ఇది ఆక్షేపణ కాదు తెలియకే అడుగుతున్నాను.బేస్మెంటు ని బేస్మెంట్ అనక,క్రిస్మస్ ట్రీ ని క్రిస్మస్ ట్రీ అనక ఏమనాలి?ఒక రకమైన సాంపదాయాన్ని అవలంభిస్తూ దానికి తెలుగుదనం తెస్తాను అంటే ఎలా?ఎక్కడో మీరే అన్నట్టున్నారు[ఎవరన్నారో గుర్తులేదు] ఇడ్లీ ఇడ్లీయే వైట్ రైస్ కేక్ కాదు అని.అది ఇక్కడ వర్తించదా?

 14. 14 చిలకపాటి శ్రీనివాస్ 12:10 సా. వద్ద జూన్ 11, 2009

  ఎప్పుడయినా ఎక్కడయినా సాధారణమైనవే ఎక్కువ కనపడుతుంటాయి కదా! అన్నీ లేక ఎక్కువ భాగం కొత్తగానో గొప్పగానో ఉండాలనుకోవడం అత్యాశే!

  రచయితల్లో భాషను అధ్యయనం చేయడం తగ్గడం మాత్రం నిర్వివాదాంశం. అయితే ఒక ప్రశ్న – ఇప్పటి కుర్రకారు మీద రాసే కథలో సంభాషణల్లో ఇంగ్లీషు ఎక్కువగా దొర్లకపోవడం అసహజం కాదా?

  కథల్లో ఏదో చెప్పేయాలన్న దుగ్ధ కొత్త రచయితల్లో ఉండడం తప్పేమీ కాదు గానీ ఎప్పట్నుంచో రాస్తున్నవాళ్ళు కూడా ఏదో నీతో, సందేశమో, పరిష్కారమో ఉండడం అత్యవసరమనుకోవడం మన దురదృష్టం. తామేదో గొప్పవాళ్ళమన్న అభిప్రాయం ముందుగా వాళ్ళలో తొలగాలనుకుంటాను. చిత్రవిచిత్రవిన్యాసాలు పాఠకుల్ని ఆకర్షించగలవేమో కానీ చివరికి నిజాయితీ ఒక్కటే ఆకట్టుకుని కట్టిపడేసేది.

  వస్తువైవిధ్యం లేదనడం నేనంగీకరించను. అందరికే అదే జీవితం వస్తువు. కథ కొత్తగా చెప్పడానికి తగిన కాల్పనిక శక్తి కొరవడిందని మాత్రం అనుకుంటాను.

 15. 15 అబ్రకదబ్ర 1:42 సా. వద్ద జూన్ 11, 2009

  @జీడిపప్పు:

  మీ కోరిక మీద, ఆ కథ పిడిఎఫ్ చేసి కింద లంకించాను. చదువుకోండి. కథ, రాసినవారి, అచ్చేసినవారి పేర్లు మాత్రం దాచిపెడుతున్నాను.

  ఇక్కడ నొక్కండి.

  చదివాక, అందులో ‘నానమ్మ’ ఎవరో కనిపెడితే మీకు పది కిలోల రత్నాలు బహూకరిస్తాను.

  అన్నట్లు, అందులో నేను చేసిన అచ్చుతప్పులేమీ లేవు. అంతా ఉన్నదున్నట్లే దించాను. గందరగోళమేదన్నా అనిపిస్తే ఆ గొప్పదనం అసలు ప్రతిదేనని గమనించ మనవి.

  @శారద:

  నేననుకున్నది నిజమేనన్నమాట. నాది పరిశీలన మాత్రమే, మీది స్వీయానుభవం. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  @మహేష్,కల్పన:

  ఎటూ చర్చ మొదలయింది కదా. మీ మీ టపాలు త్వరగా వెలువరిస్తే ఇదే ఊపులో అందరూ చదివేస్తారు 🙂

  @సుజాత,భావన

  కథలన్నీ ఊహల్లోనుండే ఊడిపడాలనటం లేదు. అన్నీ ఒకే మూసలో ఉంటే ఎలా అంటున్నాను, మరి కొన్ని మూసల్నీ వాడుకోమంటున్నాను. అంతే. జీవితానుభవాలతో కథలల్లటం తప్పనీ అనటం లేదు (ఆ విషయం నా టపాలో స్పష్టంగానే ఉంది కదా). పరిధి పెరగాలని మాత్రమే అంటున్నాను.

  తెలుగు కథల్లో భిన్నత్వం లేదని నేను ఘంటాపధంగా చెప్పటం లేదు. అటువంటివాటికి గుర్తింపెంత? వచ్చిన కథలన్నీ చదువుతూ కూర్చోలేం కదా. ఏవో పోటీల్లో గెలిచినవో, ప్రముఖ పత్రికల్లోనో, సంకలనాల్లోనో అచ్చైనవో అంటే బాగుంటాయి కాబోలనుకుని చదువుతాం. వాటి పరిస్థితి నేను టపాలో చెప్పినట్లుంది. ఒకే మూసకి అలవాటు పడటానికి కారణాలేంటనేది ఆరా తీసే ఉద్దేశంతో రాశానీ టపా. ఒకసారి నేను పైన జీడిపప్పుకి ఇచ్చిన లంకెలో కధ చదివి చెప్పండి. అది ఏ మూసలోనూ చేరనిదే కానీ అందులో ఏముందో నాకర్ధమవలేదు.

  @రాధిక,సీబీరావు:

  ‘భాష విషయంలో మడికట్టుకోనవసరం లేదు’ అనే నా వాక్యాన్ని మీరు చదివినట్లు లేరు 🙂

  ‘హ్యాంగ్ చేశారు’ –> ‘తగిలించారు’
  ‘ఎరేంజ్ చేశారు’ –> ‘ఏర్పాటు చేశారు’
  ‘కలర్‌ఫుల్ బాల్స్’ -> ‘రంగురంగుల బంతులు’
  ‘క్రిస్‌మస్ ట్రీ’ –> ‘క్రిస్‌మస్ చెట్టు’
  ‘గెస్టులందరూ’ –> ‘అతిధులందరూ’

  ఏమంత కష్టమంటారు పై తెలుగు మాటలు వాడటం?

  అవసరం మేరా ఆంగ్ల వాడకం ఆక్షేపణీయం కాదు కానీ అందుబాటులో ఉన్న తెలుగు పదాలూ వాడకపోతే ఎలా?

  ఆంగ్ల వాడకం తప్పనప్పుడు ప్రత్యామ్నాయమేమన్నా ఉందేమో చూదాలి కదా ముందు. నేనో ఉదాహరణ ఇచ్చాను, ‘అతిధులంతా క్రిస్‌మస్ అలంకారాలు మెచ్చుకుంటూ లోపలికొచ్చారు’ అంటూ. అసలు అంత వివరంగా పేరు పేరునా దేన్నైనా వర్ణించాల్సిన అవసరం ఉందా లేదా కధకులు ముందు నిర్ణయించుకోవాలి. కధకి ఉపయోగం లేని వర్ణనలు, వాటికోసం ఆ స్థాయిలో ఆంగ్ల వాడకం ఎందుకు? చిట్టికధలకి అవసరమైనది క్లుప్తత. దాన్ని హరించే వాతావరణ నివేదికలు, భోజన పదార్ధాల జాబితాలు, వగైరా వివరాలు ఎందుకు?

  ఓ పల్లెటూరి తెలుగు కుటుంబం గురించి ఆంగ్ల కథొకటి రాసి అందులో సహజత్వం కోసం సంభాషణలన్నీ తెలుగులో రాసేస్తే ఎలా ఉంటుంది?

  @నేస్తం,రేరాజ్,శ్రీనివాసరావు,కామేశ్వరరావు,సాయిప్రవీణ్,వంశీ:

  ధన్యవాదాలు.

 16. 16 chavakiran 8:08 సా. వద్ద జూన్ 11, 2009

  >>ఓ పల్లెటూరి తెలుగు కుటుంబం గురించి ఆంగ్ల కథొకటి రాసి అందులో సహజత్వం >>కోసం సంభాషణలన్నీ తెలుగులో రాసేస్తే ఎలా ఉంటుంది?

  iraga comparision

 17. 17 అరుణ పప్పు 10:06 సా. వద్ద జూన్ 11, 2009

  సిక్ విమర్శలే వినిపిస్తూ కనిపిస్తూ ఉన్న చోట మీ విమర్శ సహేతుకంగా అనిపించింది.
  వంశీ గారూ,
  భలే బావుంది మీ భాష. చలో, సీయూ ఎగైన్!!!

 18. 18 కె.మహేష్ కుమార్ 10:20 సా. వద్ద జూన్ 11, 2009

  Let me come up with a outrageous proposition.. ఇజాలూ, అభిప్రాయాలూ,ఆదర్శాలతో సంబంధం లేకుండా కేవలం “రసస్పందన” కలిగించే సాహిత్యం కేవలం బూతుసాహిత్యమే!

 19. 19 laxmi 10:24 సా. వద్ద జూన్ 11, 2009

  నాకు ఆ కథయొక్క సారాంశం నిజంగా ఏమీ అర్థం కాలేదండీ :(. అదేదో హొటెల్ కి వెళ్ళి మెనూ కార్డ్ చదివినట్టుగా అనిపించింది(అమెరికా లో అన్ని రకాల ఐటెంస్ ఉంటాయి అని ఇప్పుడే తెలిసింది). అది అసలు కథ, అందులోనూ తెలుగు కథ, చివరి పారా లో ఏమి చెప్పారో ఒక్క ముక్క అర్థం ఐతే ఒట్టు.

  ఈ కథ చదివిన తర్వాత ముందు నా మీద, తర్వాత నా ముందు తరం వారి మీద బోల్డంత జాలి వేసింది. వారికి ఇంతకన్నా మంచి సాహిత్యం దొరకదా చదవటానికి అని…ప్చ్

 20. 20 నేస్తం 2:06 ఉద. వద్ద జూన్ 12, 2009

  లక్ష్మి గారి కామెంట్ చదివిన తరువాత కూడా ఈ కధ చదవడం కేవలం నా తప్పేగాని రాసిన రచయిత్రిది ,లింక్ అడిగిన జీడిపప్పు గారిది ,లింకు ఇచ్చిన అబ్రకదబ్ర గారిది యేమాత్రం కాదని ఒప్పుకుంటున్నాను …. 🙂 అసలెవరన్నా ఈ కధ చదివి ఎవరికన్నా కధ లో విషయం ఇది అని చెప్పినట్లయితే వారికి రత్నాలేం ఖర్మ వజ్రాలు ఇవ్వచ్చు

 21. 21 సుజాత 2:29 ఉద. వద్ద జూన్ 12, 2009

  నాకూ ఆ టెల్గూ స్టొరీ,ఏమిటో, ఎందుకు రాశారో అంతుపట్టలేదు .ముక్కల ఇంగ్లీషు సంభాషణలు తప్ప! అయితే వజ్రాలో, రత్నాలో దక్కే ఛాన్స్ లేదన్నమాట!. అసలు అందుకే అబ్రకదబ్ర ధైర్యంగా పది కిలోలు ప్రామిస్ చేశారన్నమాట.

 22. 22 సుజాత 2:32 ఉద. వద్ద జూన్ 12, 2009

  మహేష్ కుమార్ గారు,
  “రస స్పందన”అంటే ఏమిటో 8 మార్కులకు వివరించుము!

 23. 23 rayraj 10:04 ఉద. వద్ద జూన్ 12, 2009

  @రాధికగారూ : ఆ వాక్యం నాది. దాని మీద కాపీరైటు నాది :p

 24. 24 malathi 10:31 ఉద. వద్ద జూన్ 12, 2009

  ఈవిషయంమీద ఇతోధికంగా చర్చ రావడం బాగుంది.
  అబ్రకదబ్ర, మీరు అమెరికాకథ కాకుండా ఆంధ్రాకథే ఉదాహరణకి తీసుకుని వుంటే, (అవీ వున్నాయిలెండి కోకొల్లలు), పైవ్యాఖ్యలలో కొన్ని తగ్గివుండేవి. తెలుగుదేశంలో తెలుగునేలమీద జరుగుతున్నవిషయాలు రాస్తున్నప్పుడు కూడా “మా ఫాదర్ బర్త్ డేకి, హాండ్ స్టిక్ గిఫ్టుగా ఇచ్చేను”లాటివి ఎందుకు రాస్తున్నారు అని నాసందేహం.
  రాధికా, నువ్వు అమెరికాలో వుండి చక్కని తెలుగుదనం వుట్టిపడే కవితలు రాస్తున్నావు కదా. మాఅమ్మాయి I am coming home అని నాకు ఫోను చేస్తే, ఆమాట మరోస్నేహితురాలికి చెప్పినప్పుడు నేను మాఅమ్మాయి ఇంటికి వస్తానంది అని చెప్తాను. అదీ ఈటపాలో ఎత్తి చూపుతున్న తేడా అనుకుంటా.

 25. 25 గీతాచార్య 11:53 ఉద. వద్ద జూన్ 12, 2009

  @సుజాత గారు,

  ప్రశ్న ’నాగార్జునా యూనివర్సిటీదా? లేక వేరేదైనా యూనివర్సిటీదా?’

  చెప్పిన చో సమాధానము మేమీయగలము.

 26. 26 Rama 2:06 సా. వద్ద జూన్ 12, 2009

  మొదట్లో ఈ పోస్ట్ చదివి మన తెలుగు కథల్లో వైవిధ్యం లేకపోతం ఏంటి చెప్మా అనుకున్నా !

  ఆ టెల్గూ స్టొరీ చదివాక, వెక్కి వెక్కి ఏడవాలనిపించింది ! మొత్తం ఇంగ్లిపీసు లోనో, మొత్తం తెలుగు లోనో రాయొచ్చు కదా ! ఆ శోష చదివే సరికి, నిజం గానే నాకు చిరాకేసింది ! అప్పుడు మీ పోస్ట్ చదివితే, మీ బాధ ఏంటో బాగా అర్థం అయ్యింది !

  అసలు ఆ కథ కి, అర్థం పర్థం ఉందా ?( అంటే నీతి అని కాదు నా భావం ) పిజ్జాలు తిన్నాము, ఆ సామగ్రి ఏంటో అదే రెండు పేజీలు ఉంటుందేమో ! నేను ఈ మధ్య చదూతోన్న ( నేను ఈ మధ్య మీ లాగే, చదివేదే బహు తక్కువ ! ) కొన్ని తెలుగు కథలు బానే ఉంటున్నాయి !

  ఈ మధ్యే నా టైం బాగోక, ఈనాడు ఆదివారం లో, ఇలాంటిదే సస్పెన్స్ థ్రిల్లెర్ కథా రాజమొకటి కనపడింది ! ఒకే ఒక్క లైన్ జోక్(?) ని , కథ టైపు లో రాసారు ! సస్పెన్స్ వీదాక, నాకేమయ్యింది మొత్తం చదివి తరించాను అనుకున్నా ! మీరూ చదివి ఆనందించండి !

  ఈ కథలెలా ఉన్నాయి అంటే, చంటబ్బాయి సినిమాలో, పత్రిక ఎడిటర్ శ్రీలక్ష్మితో, ” ఇది మినీ కథా ? చారు ఎలా కాచాలో, ఒక పాత్ర చేత చెప్పించి, దాన్ని మినీ కథా అంటావా ? ” అన్నట్టు ఉన్నాయి ! 😀

 27. 27 కుమార్ 1:24 ఉద. వద్ద జూన్ 13, 2009

  తానొక సరికొత్త కథ చెబుతా నన్నాడు రెడ్డి. అది నీతరం గాదు పొమ్మన్నారా మిత్రులిద్దరు.

  “ఎందుకంటే..” వివరణ ప్రారంభించాడు రాధాపతి. “లోకంలో చెప్పడాని కింకా కథలేమి మిగిలి లేవు. నువ్వే కథ చెప్పాలనుకున్నా, దాన్ని ఇంతకు ముందెవరో చెప్పే వుంటారు. ఆ చెప్పడం గూడా బహుశా నీ కంటే బాగానే చెప్పి వుండవచ్చు…”

  ఈ రెండు పంక్తుల్తో ఆ కథ మొదలైంది. దానితో పాటుగా మొదలైంది మనలో కుతూహలం. ఇది 1965 లో మధురాంతకం రాజారంగారు వ్రాసిన “నిషిద్ధాక్షరి” అన్న కథ మొదలు. చూసారా, 45 సంత్సరాల నాటి కథ ఇప్పటికీ మనలో ఎంత కుతూహలాన్ని, చదవాలన్న ఉత్సహాన్ని కలగజేస్తోందో.

  భాష వక్రించకుండా మనలో కుతూహలాన్ని, చదవాలన్న ఉత్సహాన్ని కలగజేసే ఏ కథాంశమైనా కథకునికి / పాఠకునికి మంచి కథ వస్తువులే అని నా అభిప్రాయం.

 28. 28 కొత్తపాళీ 5:04 ఉద. వద్ద జూన్ 13, 2009

  I am absent for hardly two days and you guys and gals all have gala time! This is soooo unfair.
  There have been a few writers in the past decade who tried new paths. No guarantee you would like them. Dr. V. Chandrasekhara Rao, Kaseebhatla Venugopal, Adepu Lakshmipathi, et al. Bhadrudu’s stories are also, I feel, are outside the standard mold.
  Bhagavantham (a journalist) story that appeared in 2007 “Loya chivari rahasyam” is very unusual kind of story. There’s a discussion of this in a recent eemaata issue.
  Chandra (Kanneganti Chandrasekhar) poet ans story writer based in US wrote some very good (and rather unusual) stories in teh recent years. Several of them appeared in telugu naadi and eemaata.
  So, in short, yes – there are writers who are trying to tread different paths.
  Yet, I also agree, searching for them is like searching for a needle .. no not in a hay stack (that would be cliche!) but more like in a dung heap 🙂

 29. 29 KumarN 10:21 ఉద. వద్ద జూన్ 13, 2009

  పాళీ గారితో ఏకీభవిస్తాను. నేను ఈమాట క్రమం తప్పకుండా చదివే రోజుల్లో, కన్నెగంటి చంద్రశేఖర్ గారి కథల కోసం చూసేవాణ్ణి. సరిగ్గా గుర్తు లేదు కాని, వేణుగోపాల్, భద్రుడు గార్ల కొన్ని కథలు కూడా నన్ను ఆసక్తిగా చదివేలా చేసాయి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: