రాక్షస ర్యాగింగ్

వరంగల్‌లో ఎంసిఏ విద్యార్ధి ఉసురు తీసిన ర్యాగింగ్ భూతం – నేటి వార్త

ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలెన్నిసార్లు విన్నామో గుర్తు తెచ్చుకోండి. పన్లో పనిగా – ఫలానా కాలేజీ విద్యార్ధులు ఏదో అద్భుత సాంకేతికావిష్కరణ చేశారనో, ఓ కొత్త విషయం కనిపెట్టారనో ఎన్నిసార్లు విన్నామో కూడా గుర్తు చేసుకోండి.

* * * *

‘ర్యాగింగ్’ – ఈ మధ్య దీని దెబ్బకి ప్రాణాలు తీసుకున్న, తీసుకోబోయిన విద్యార్ధుల గురించి వార్తలు వినటం మామూలైపోయింది. తోటి విద్యార్ధి ఆత్మహత్యకి పాల్పడే స్థాయిలో వేధించగల విద్యార్ధుల సంఖ్య అంతకంతకీ పెరిగిపోవటం దేనికి సంకేతం? దీనికి ఆడా మగా తేడాల్లేవు కూడా. అబ్బాయిలతో సమానంగా, కొండొకచో వాళ్లని మించిపోయి, ర్యాగింగ్‌లో తడాఖా చూపించే అమ్మాయిల కధనాలూ ఈ మధ్య ఎక్కువయ్యాయి. విచారకరమైన విషయమేమిటంటే – ప్రేమికుల దాడులకి బలైన విద్యార్ధినులకి ఇచ్చే వారం పది రోజుల ప్రాముఖ్యత కూడా మన మీడియా వారు ఈ ర్యాగింగ్ హత్యలకి ఇవ్వకపోవటం. బాధితులకి మద్దతుగా ఏ విద్యార్ధి సంఘమూ రోడ్లెక్కదు, ర్యాగింగ్ నిషేధించాలంటూ ఉద్యమాలు చేయదు. ఉసురు తీసుకున్న విద్యార్ధుల మానసిక స్థితిపై ఆరోపణలు చేసి యాజమాన్యం చేతులు దులుపుకుంటుంది. ప్రజలూ పట్టించుకోరు. ఇంత నిర్లిప్తతకి కారణం? ఫ్యాక్షన్ హత్యల్లా ఇవీ సాధారణమైపోయాయా, లేక విద్యార్ధుల జీవితాల్లో అవీ ఓ భాగమే కాబట్టి పట్టించుకోనవసరం లేదనే ధోరణి అంతగా ప్రబలిందా?

ఇంటర్మీడియెట్ చదువుతుండగా మొదటి సారి విన్నాను ర్యాగింగ్ అనే మాట. నా హైస్కూలు సహాధ్యాయిల్లో కొందరు పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్‌లో చేరారు. ర్యాగింగ్ గురించి వాళ్లు కధలు కధలుగా చెబుతుండగా నోరు తెరుచుకుని వినటం మాత్రమే నావంతయింది. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్యా కళాశాలల్లో మాత్రమే అప్పట్లో ఈ ర్యాగింగ్ సంప్రదాయం ఉండేది. ఇప్పుడా చీడ ఇతర తరహా విద్యాలయాలకూ పాకినట్లు ఇటీవలి వార్తలు చదువుతుంటే తెలుస్తుంది. ఇంటర్ తర్వాత మరో ఆరేళ్ల చదువులు చదివినా – అవన్నీ భీకరమైన క్రమశిక్షణగల కళాశాలలు కావటం, ర్యాగింగ్ అన్న మాటే ప్రాంగణంలో వినబడగూడదనే కఠిన నిబంధనలుండటం వల్ల – అసలదెలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవంలోకి రాకుండానే నా చదువులైపోయాయి.

ప్రత్యక్ష అనుభవం నాకు లేకపోయినా, నా సన్నిహిత మిత్రులకు కావలసింత ఉండేది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదివినోళ్లు వీళ్లు. ఇంజనీరింగ్ మొదటేడాది తమ సీనియర్లు ర్యాగింగ్ పేరుతో పెట్టే చిత్రహింసలు చెప్పుకుని ఏడ్చినంత పని చేసినోళ్లే, రెండో ఏడాది చివరికొచ్చేసరికి తమ జూనియర్లని తామెంత సృజనాత్మక పద్ధతుల్లో ర్యాగ్ చేశారో చొక్కా గుండీలు విప్పుకుని మరీ గర్వంగా వివరించేవాళ్లు. వాళ్లని చూస్తుంటే వింతగా అనిపించేది. నిన్నటి బాధాసర్ప దష్టులే నేటి భక్షకులు! వాళ్లని తరచూ నేనో ప్రశ్న అడిగేవాడిని, ‘అసలీ ర్యాగింగ్ వల్ల ఉపయోగమేమిటి?’.

చిత్రవిచిత్రమైన సమాధానాలొచ్చేవి దానికి. ఎక్కువ మంది చెప్పేది మాత్రం ‘దాని వల్ల విద్యార్ధుల్లో కలుపుగోలుతనం, సీనియర్లతో అనుబంధం పెరుగుతాయి’. అన్నిట్లోకీ అర్ధరహితమైన జవాబు అదే అనిపించేది. బట్టలూడదీయించి గంతులేయించటం, బలవంతంగా మద్యం తాగించటం, చెప్పలేనంత జుగుప్సాకరమైన పనులు చేయమనటం .. ఇలాంటివాటివల్ల ఎవరిలోనైనా కలుపుగోలుదనం ఎలా పెరుగుతుందో నాకంతుపట్టని విషయం. ఒకే చోట చదువుకునేవాళ్లకి కాలక్రమేణా – అవసరాల్ని, అలవాట్లని బట్టి – వద్దన్నా పరిచయాలేడ్పడతాయి. దానికోసం ఇలాంటి కార్యక్రమాలెందుకు? ‘కొత్తగా కాలేజీల్లో అడుగు పెట్టేవారి బెరుకు పోగొట్టటానికి ర్యాగింగే సరైన మంత్రం’ అన్న వాళ్లు కొందరు. ‘దగ్గు మందేసుకుంటే వారంలో తగ్గుతుంది, వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది’ అని పాత జోకు. బెరుకు పోగొట్టటానికి ర్యాగింగ్ మందెయ్యటమూ అలాంటిదే. ఇలాంటి వాటివల్ల ఒరిగేదల్లా – సున్నిత మనస్కులు మరింత ముడుచుకుపోవటం, ఆత్మన్యూనతలోకి జారిపోవటం, అడపాదడపా ఆత్మహత్యలకి పాల్పడటం మాత్రమే.

నా ఈ మాటలకి అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్లుండొచ్చు. ‘ర్యాగింగ్ అంటే అలాంటి వికృత చేష్టలు మాత్రమే అని ఎందుకనుకోవాలి? అలాంటివి అక్కడక్కడా జరిగినంత మాత్రాన ఏకంగా ఆ సంస్కృతినే తప్పుబట్టటం భావ్యం కాదు’ అనేవాళ్లు చాలామందుంటారు. కానీ ర్యాగింగ్ అంటే ఎక్కువమందికి చప్పున స్ఫురించేది మాత్రం ఆ వికృత చేష్టలే. వార్తల్లోకెక్కే కేసులే ఇన్నుంటే, ఎక్కనివెన్ని? అంటే అవి ఏ మోతాదులో విస్తరించాయో అర్ధమవటం లేదూ?

ప్రధమ సంవత్సరం విద్యార్ధులకి ర్యాగింగ్‌తోనే మొదటి సెమిస్టరంతా గడచిపోవటం ఇంజనీరింగ్ కాలేజీల్లో సాధారణం. జూనియర్లకది అనధికారిక ప్రొబేషన్ పీరియడైతే, సీనియర్లకదే హనీమూన్ పీరియడ్. ఈ కాలంలో జూనియర్ల బాధలు వర్ణనాతీతం. జూనియర్ ముదిరి సీనియరయ్యాక తాను పడ్డ బాధలకి పది రెట్లు తన జూనియర్లని పెడితే కానీ చల్లారని మంట. ఆ క్రమంలో చదువు మీద పెట్టాల్సిన శ్రద్ధాసక్తులు, శక్తియుక్తులు కొత్త కొత్త రకాల ర్యాగింగ్ ప్రక్రియలు కనిపెట్టటం మీదకి మళ్లింపు. చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో జూనియర్లు సీనియర్ల పేరు వెనక ‘సర్’ లాంటి తోకలు తగిలించికానీ పిలవకూడదట! సీనియర్ల రికార్డులు తయారు చేసి పెట్టటం, అసైన్‌మెంట్లు చేసివ్వటం లాంటి పవళింపు సేవలూ జూనియర్ల బాధ్యతల్లో కొన్ని. ఇవన్నీ చిరాకు తెప్పించే, విసుగెత్తించే విషయాలే కానీ వీటిని ఓ స్థాయి వరకూ ఎలాగోలా సహించొచ్చు. అసలు సమస్య సీనియర్ల హద్దులు దాటిన చేష్టలతో. అటువంటివి చేసేవారి, చేయించేవారి మెదళ్లు ఏ దిశలో వికసిస్తాయో తేలిగ్గానే ఊహించొచ్చు. ఇలాంటి వాతావరణంలో సాగే  కళాశాల జీవితం వాళ్లకి ఏం నేర్పినా నేర్పకపోయినా అంతో ఇంతో నేర ప్రవృత్తి, కాసింత శాడిజమూ అలవర్చి పంపటం మాత్రం ఖాయం.

‘ఇబ్బందికర పరిస్థితుల్లో నెగ్గుకురావటమెలాగో విద్యార్ధులకి బోధపడుతుంది, వాళ్లలో వ్యక్తిత్వ వికాసానికిదో దారి’ అంటూ ర్యాగింగ్ పేరుతో సాగే వేధింపులని సమర్ధిస్తారు కొందరు. ఐతే, ప్రమాణాలపరంగా దేశవ్యాప్తంగా పేరుగడించిన కళాశాలల్లో ఎక్కడా ఇటువంటి వికృత రూపంలో ఉన్న ర్యాగింగ్ ఆనవాళ్లు లేకపోవటం గమనార్హం. అలాంటి చోట్ల విద్యార్ధుల వ్యక్తిత్వ వికాసానికి లోటేమీ రానప్పుడు, ర్యాగింగ్ పేరుతో మిగతాచోట్ల ఊడబొడిచేదేముంది – విద్యార్ధి దశలోనే యువతలో పెడ ధోరణులకు అంటుగట్టటం తప్ప?

7 Responses to “రాక్షస ర్యాగింగ్”


 1. 1 తాడేపల్లి 9:07 సా. వద్ద జూన్ 8, 2009

  ర్యాగింగుకి ఎక్కువగా బలయ్యేది మగపిల్లలు. కానీ మన మీడియా దృష్టిలో మగవాళ్ళకి ఏ సమస్యలూ లేవు. సమస్యలన్నీ ఆడవాళ్ళకే. ఆ రకంగా మనం కేవలం ఆడవాళ్ళ సమస్యలకి మాత్రమే స్పందించే విధంగా ప్రోగ్రామ్ చెయ్యబడ్డాం. ఆలస్యంగా నైనా మగవాణ్ణి కూడా ఒక మనిషిగా గుర్తించే సమాజం వస్తుందని ఆశిద్దాం.

 2. 2 నేస్తం 10:31 సా. వద్ద జూన్ 8, 2009

  ర్యగింగ్ వల్ల కలుపుగొలుతనం పెరుగుతుంది,ఈ మాటవిన్నపుడల్లా నవ్వాలో ఏడవాలో తెలియదు నాకు.. ఒక సారి మా ఇంటికి రాత్రి 9 గంటలకు ఒక అబ్బాయి వచ్చాడు ..మా తమ్ముడి పేరు సర్ అనే తొక తగిలించి మరీ వాకబు చేసాడు ..పలానా అబ్బాయి ఇల్లు ఇదేనా అండి అని.. అవును ఏం ? అన్నాను.. గుడ్ నైట్ చెప్పడానికి వచ్చాడంట .. మావాడు వాడి పేరు ,మా ఏరియా పేరు మాత్రమే చెప్పి అడ్రెస్స్ కనుక్కుని రాత్రికల్లా గుడ్ నైట్ చెప్పమని అన్నాడంట ..పాపం ఆ పిల్లాడు మద్యాహ్నం నుండి వెతుక్కుని వెతుక్కుని రాత్రికల్లా మా ఇంటికి చేరాడు అలసిపోయిన మొహం తో ..మా వాడేమో చక్కగా సినిమా కి చెక్కేసాడు … వెళ్ళేముందు అక్కా ఎవరన్నా నా గురించి వస్తే మళ్ళీ రేపు రమ్మను అని చెప్పి మరీ వెళ్ళాడు.. విషయం తెలుసుకున్న నేను ఆ ఫళంగా తిక్క వచ్చి మా పెదనాన్నను తీసుకొచ్చి వాడు చేసిన ఘనకార్యాన్ని చెప్పాను.. పెదనాన్న ఆ అబ్బాయితో మళ్ళా మావాడు నిన్నే కాకుండా ఇలా ఎవరినన్నా అంటే తిన్నం గా నాకొచ్చి చెప్పు బాబు వాడికి నేను చేస్తా ర్యాగింగు వెధవ నాటకాలు వేస్తున్నాడని బాగా తిట్టి పంపేసారు ..ఆ తరువాతా రాత్రి మా వాడి పని పట్టారని వేరే చెప్పనక్కరలేదు ..ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు ,కాలేజ్ యాజమాన్యం గట్టి చర్యలు తీసుకోవాలి ముందు ..

 3. 3 cbrao 12:06 ఉద. వద్ద జూన్ 9, 2009

  వ్యయ, ప్రయాసలు తప్ప రాగింగ్ వలన ఎలాంటి ప్రయోజనం లేదు. రాగింగ్ చేసేవారిపై కఠిన చర్యలు సరైనవే.

 4. 4 shyam 2:21 ఉద. వద్ద జూన్ 9, 2009

  మన ప్రతి సమస్యను ఎవరో లేదా ప్రభుత్వం తీర్చాలని భావించండం లోనే దోషం వుంది. మనలో తిరగబడే మనస్తత్వం నశించింది. జూనియర్స్ అంతా తిరగబడితే ఇది సమస్యే కాదు. అల్లాంటి మనస్తత్వం పిల్లలకు అలవాటు చెయాలి. Battle at Kruger National Park లాంటి videos పిల్లలకు చూపించాలి. – shyam

 5. 5 శేఖర్ పెద్దగోపు 2:26 ఉద. వద్ద జూన్ 9, 2009

  నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉండగా మా జూనియర్లు హాస్టల్ లో ఉండే వారిని చాలా ఏడిపించేవారు. పాపం అసలే కొత్త వాతావరణం..చుట్టుపక్కల ముష్కర మూకలు. ఒకసారి సెకండ్ ఇయర్ క్లాస్ టాపర్ ఒక జూనియర్ కి సైడ్ లాక్స్ పూర్తిగా కట్ చెయ్యమన్నాడు. వాడు చెయ్యనంటే వీడు బలవంతంగా ఒక వైపు సైడ్ లాక్ కట్ చేసాడు. ఆ జూనియర్ అదే రాత్రి కాంపస్ లోనే ఉన్న ప్రిన్సిపల్ ఇంటికి సరాసరి వెళ్ళాడు. తర్వాత రోజు ప్రిన్సిపల్ ఆ టాపర్ ఉన్న క్లాస్ కి వెళ్ళి వాడి ఫిల్ట్ పట్టుకుని అందరు చూస్తుండగా వీరబాదుడు బాదాడు. దెబ్బతో జనాలుకు “___” పడింది. ఆ తర్వాత నుండి జనాలందరూ ర్యాగింగ్ పేరెత్తితే ఒట్టు.

 6. 6 rayraj 4:22 ఉద. వద్ద జూన్ 9, 2009

  వరంగల్‌********** – నేటి వార్త
  ఈ ******** తెచ్చుకోండి. పన్లో పనిగా – ఫలానా కాలేజీ విద్యార్ధులు ఏదో అద్భుత సాంకేతికావిష్కరణ చేశారనో, ఓ కొత్త విషయం కనిపెట్టారనో ఎన్నిసార్లు విన్నామో కూడా గుర్తు చేసుకోండి.
  _________________

  ర్యాడికల్స్ జిందాబాద్;PDSU జిందాబాద్ ; అని గోడనిండా నింపినట్టు, ఆ పై వాక్యాలని మొత్తం రాష్ట్రం అంతా రాసేయ్యాలనిపించింది. చేయాలేను కానీ, ’అనిపించింది’ అని చెబ్దాం అనిపించి చెప్పాను🙂..కొత్తవిషయాలు కనుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళదేన్నన్న విషయం ఇలా బాగా చెప్పచ్చు. ఇంకొంచెం షార్ట్ లైన్ ఏమన్నా ట్రై చేస్తే, చూద్దాం అలా అంటించవచ్చేమో!
  __________________

  స్టూడెంట్స్ మాట్లడరేంటి చెప్మా!?
  ________________
  టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు కూడా మంచి రౌడీ కుర్రాళ్ళేట.మా బేచ్ లో రౌడీ లాంటి కుర్రాళ్ళు బానే పైకొచ్చారు కాబట్టి, అంత వ్యతిరేకత లేదుగానీ, కొత్త ఆవిష్కారాలు లేవన్న్దది మాత్రం చాలా చాలా పెయిన్ పాయింట్ నాకు.

 7. 7 అబ్రకదబ్ర 11:45 ఉద. వద్ద జూన్ 9, 2009

  @రేరాజ్:

  మీరీ టపా చదివితే ఆ మొదటి వాక్యం మీదనే మీ వ్యాఖ్య ఉంటుందనుకున్నాను. నా అంచనా తప్పు కాలేదు🙂 మీరన్నట్లు, బుల్లి నినాదాలు బోలెడవసరం.

  ధన్యవాదాలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 275,741

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: