తావీజు మహిమ

రాష్ట్రంలో సకాలంలో వర్షాలు మొదలవటం తన జెరూసలేం యాత్రా ఫలితమేననీ, గతంలో మాదిరిగానే మరో ఐదేళ్లు రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుందనీ ముఖ్యమంత్రిగారు సెలవిచ్చారు. ఈ సందర్భంగా, ఐదేళ్ల క్రితం తాను తొలిసారి ముఖ్యమంత్రైనప్పుడు కూడా ఇదే విధంగా జెరూసలేం వెళ్లొచ్చాననిన్నీ, అప్పుడూ ఇలాగే వర్షాలు కురిశాయనిన్నీ ఆయన అఖిలాంధ్ర ప్రజలకు వార్తాపత్రికాముఖంగా గుర్తు చేశారు. జెరూసలేం వెళ్లొచ్చిన వెంటనే దైవవాక్కు ఫలిస్తుందని ఆయన కడు సంబరంగా చెప్పారు.

తస్సదియ్యా, అదన్న మాట విషయం.  ఈ సంగతి తెలీకనే చంద్రబాబూ, చిరంజీవీ అమాయకంగా తిరుపతి నుండి ఎన్నికల ప్రచారం మొదలెట్టి చావుదెబ్బ తిన్నారు. వచ్చే ఎన్నికల్లోనన్నా జెరూసలేం నుండి ప్రచారం మొదలెడితేనే తెదేపాకీ, ప్రరాపాకీ జయం.

‘మీ దేవుడికి అంత సత్తా ఉంటే ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో కరువు కాటకాలెందుకున్నాయి’ అంటూ వీహేచ్‌పీ వాళ్లు అతి తెలివి వొలకబోస్తూ ముఖ్యమంత్రినేవేవో ప్రశ్నలేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం – దేవుడు మీవాడా, మావాడా అన్నది కాదు, ఆయనకా సత్తా ఉందా లేదా అన్నదీ కాదు – ప్రార్ధన చేసిందెవరన్నదే. దేవుడు కొందరివాడే. ముఖ్యమంత్రి మాత్రం అందరివాడూ. అందుకే ఆయన మనమెవరం అడక్కున్నా పిల్లాజెల్లా సమేతంగా అంతదూరమెళ్లి మనకోసం ముడుపులు కట్టొచ్చాడు. ఇది అభినందించాల్సిన విషయమే కానీ ఆక్షేపించాల్సిన విషయం కాదని వీహెచ్‌పీ వాళ్లు తెలుసుకోవాలి, మత రాజకీయాలు చేయటం మానాలి.

ఓ పక్క వర్షాలు సకాలంలో ఎందుకు పడ్డాయో అంత క్షుణ్ణంగా ముఖ్యమంత్రిగారు విశదపరుస్తుండగానే, మరో పక్క వాతావరణ విభాగం వారు రుతుపవనాలు నాలుగు రోజులు ముందుగానే ఎందుకొచ్చేశాయో వివరిస్తూ కట్టు కధనాలు కొన్నిట్ని పత్రికలకు విడుదల చేశారు. ప్రజలు దద్దమ్మలు, వాళ్లని వెర్రివాళ్లని చెయ్యటం అతి సులువని ఈ శాఖవారి పిచ్చి నమ్మకం. దేవుడినడిగి వర్షాలూ, వరాలూ కురిపించే ముఖ్యమంత్రివర్యులుండగా వాతావరణ విభాగం దండగ. ప్రజల సొమ్ము వృధా. ఈ శాఖని అర్జంటుగా రద్దు చేసి పారేయాలి. పన్లోపనిగా సివిల్ సర్వెంట్స్ అందర్నీ పీకి పారేసి వాళ్ల స్థానంలో సోది చెప్పేవాళ్లనీ, చిలక జోస్యగాళ్లనీ, పూజార్లనీ, పాస్టర్లనీ, బాబాలనీ, ముల్లాలనీ నియమించాలి. ఇకనుండీ ప్రభుత్వోద్యోగాలకి అభ్యర్ధుల దైవభక్తిని పరీక్షించటం తప్పనిసరి చేయాలి. రాష్ట్ర సౌభాగ్యం కోసం నిరంతరం యజ్ఞయాగాదులు చేయించటానికి ఓ ప్రత్యేక శాఖని ఏర్పాటు చేసి – అవసరమైతే రాష్ట్రంలో ఉన్న దేవాలయాల భూములన్నీ తెగనమ్మైనా – దానికి నిధుల లోటు లేకుండా చూడాలి. అప్పటికీ నిధులు సరిపోకపోతే ప్రజలనుండి ప్రత్యేకంగా హుండీ పన్ను వసూలు చేయాలి. మంత్రులంతా నెలకోసారన్నా జెరూసలేం, మక్కా, కాశీ తదితర పుణ్యక్షేత్రాలు దర్శించి అన్ని మతాల దేవుళ్లతోనూ అనునిత్యం టచ్‌లో ఉంటే రాష్ట్రానికి అన్ని విధాలుగానూ మంచిది. ఆ రకమైన ప్రయాణాలకి అందుబాటులో ఉండేలా ప్రతి మంత్రికీ ప్రత్యేక విమానాన్నొకదాన్ని కేటాయించాలి.

* * * *

ముఖ్యమంత్రి అయ్యీ కాకుండానే కుటుంబసమేతంగా తీర్ధయాత్రలకెళ్లి మొక్కు తీర్చుకునొచ్చారు రెడ్డిగారు. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఆయన నమ్మకాలు, ఆయనిష్టం. ఐతే, యాత్రా స్పెషల్ ‘ప్రత్యేక విమానం’ సంగతేమిటి? దానికైన ఖర్చు ఎవడబ్బ సొమ్ము? సింహాసనం ఎక్కటం ఆలస్యం, ప్రజల సొమ్ముతో పండగలు చేసుకోటం మళ్లీ మొదలైపోయిందనేదానికిది శాంపిలా? ఈపాటి దుర్వినియోగం ఈ రోజుల్లో సాధారణమే కాబట్టి ఇది ఆక్షేపించాల్సిన విషయమే కాదని సరిపెట్టుకుందాం. కానీ, సాక్షాత్తూ రాష్ట్రాన్నేలే దొర ఓ సాధారణ మత ప్రచారకుడిలా జెరూసలేం గొప్పదనం, మహిమల గురించి ఊదరగొట్టటమేంటి? సరే. అవీ నోరుజారిన మాటలే అనుకుందాం. వాటినీ వదిలేద్దాం.

అసలైన సమస్య – ఓ రాష్ట్రాధినేత పాలన పగ్గాలు దేవుడి చేతిలో పెట్టినట్లు మాట్లాడటం. అంతా దేవుడే చూసుకుంటే ఇక ఎన్నికలు, పాలనా వ్యవస్థ, రాజ్యాంగం, వగైరా, వగైరా అన్నీ ఎందుకు? ‘ఎవరితోనో పిచ్చాపాటీగా అన్న మాటలు, వాటిని పట్టించుకోనవసరం లేదు’ అని తేలిగ్గా వదిలేసే వీల్లేదు. ఎందుకంటే – కొందరు అధికారులతో ఆయనీ వ్యాఖ్యలు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ అధికారిక ప్రకటనలో పేర్కొందట. ఎంత పారదర్శకత! వేలాది కోట్ల రూపాయల ప్రజాధనంతో ముడిపడున్న ప్రభుత్వ ప్రాజెక్టుల విషయాల్లో మాత్రం అలవిమాలిన గోప్యత.

తన ప్రార్ధన వల్లే వర్షాలు పడ్డాయని ముఖ్యమంత్రి నిజంగా నమ్ముండొచ్చు. అది ఆయన వ్యక్తిగత వ్యవహారం. ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలందరిపై రుద్దటం ఏ మేరకి సమంజసం? పనికిమాలిన విషయాలకు అవసరానికి మించిన ప్రచారం కల్పించటం ప్రజల్ని ఓ పద్ధతి ప్రకారం బురిడీ కొట్టించే వ్యూహం. అడ్డూ ఆపూ లేని అవినీతికి తెగబడితే క్రమంగా ప్రజలకి అవినీతి ఓ సమస్యే కాకుండా పోతుందన్నది ఈ ముఖ్యమంత్రి గడచిన ఐదేళ్లలో విజయవంతంగా అమలు చేసి చూపిన విషయం. ఇప్పుడిక వంతు దేవుడిది. దైవభక్తిలో మునిగి తేలే అమాయక వోటర్లపై రెడ్డిగారు విసురుతున్న మాయ వలే ఇది. తాను స్వయానా దేవదూతననే ఇమేజ్ కోసం ఆయన వేస్తున్న ఎత్తులివి. ఇవి ఫలిస్తే, వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో అన్ని పార్టీల మ్యానిఫెస్టోల్లోనూ ఉండేది దేవుడు, పుణ్యం, తావీజులు, యాగాలు, జంతుబలులు, తీర్ధయాత్రలు, మొక్కులే – ప్రజల నిజమైన సమస్యలు మాత్రం కాదు.

మతాన్నీ, దేవుడినీ రాజకీయాలనుండి దూరంగా పెట్టి తీరాలనే దేశవ్యాప్త శాసనం చేస్తే కానీ ఇలాంటి అడ్డగోలు ఎత్తుగడలకి తెరపడదు. కానీ – ఉన్నదన్నీ గోడమీద పిల్లులేనైతే – పిల్లి మెడలో గంట కట్టేదెవరు?

 

10 స్పందనలు to “తావీజు మహిమ”


 1. 1 వేమన 5:07 సా. వద్ద జూన్ 1, 2009

  ఇంకా నయం…ఇందిరమ్మ కురిపించింది అనలేదు.. అక్కదికి సంతొషించాల్సిందే !
  కాలం కలిసొస్తే అతి తెలివి ఐడియాలు కూడా బాగా వర్కవుట్ అవుతాయి అని మొన్నటి ఎలెక్షన్లతో తెలుసుకున్నారు మన రెడ్డిగారు…అందుకే ఈ పైత్యం.

 2. 2 chavakiran 6:20 సా. వద్ద జూన్ 1, 2009

  మరి బ్లాక్ డెత్ రోజుల్లో ఆ దేవుడేం చేశాడో కనుక్కున్నారా ?

 3. 3 ప్రదీప్ 8:05 సా. వద్ద జూన్ 1, 2009

  వినేవాడు వెధవ ఐతే … ఇలాంటివి ఎన్నైనా చెపుతారు మన శిలువ వేసుకున్న రెడ్డి గారు

 4. 4 వేణూ శ్రీకాంత్ 8:46 సా. వద్ద జూన్ 1, 2009

  మరి మొన్నటి ఎలక్షన్ లో అన్నీ కలిసి రావడం తావీజ్ మహిమ కాక ఇంకేముంది అని రెడ్డి గారు ఫిక్స్ అయిపోయి ఉంటారు.

 5. 5 Marthanda 9:09 సా. వద్ద జూన్ 1, 2009

  చంద్రబాబు కూడా అలిపిరి ఘటన తరువాత వెయ్యి మంది పోలీసుల్ని పెట్టించుకుని మళ్ళీ తిరుపతి వెళ్ళాడు. సొమ్ము ప్రజలది, సోకు రాజకీయ నాయకులది అయినట్టు వీళ్ళు పోలీసులకి law & order పరిరక్షణ పేరుతో ప్రజల సొమ్ముతో జీతాలిచ్చి పర్సనల్ సెక్యూరిటీకి వినియోగించుకుంటారు.

 6. 6 cbrao 9:12 సా. వద్ద జూన్ 1, 2009

  “పిల్లి మెడలో గంట కట్టేదెవరు?” కమ్యూనిస్ట్ లు?

 7. 7 చివుకుల కృష్ణమోహన్‌ 10:03 సా. వద్ద జూన్ 1, 2009

  అల్లుడుగారు ప్రతీఊరిలో క్రైస్తవసువార్త సభలు నిర్వహించిమరీ ఓట్లు వెయ్యమని అడిగారు. సాయం చేసినవాళ్ల అప్పు తీర్చేయ్యాలిగా. ఒక్క ఆ ముక్కతో ఎన్ని లాభాలున్నాయో చూసారా? వరుణయాగాలు చేసినా పడలేదు – మేఘమధనాలు వృధా – జెరూసలేం మాత్రమే వానల్ని కురిపిస్తుంది – అని ఒక ముఖ్యమంత్రి అంటే దాని తరువాత ఫలితాలు ఆలోచించడం అంత కష్టమేమీ కాదు. పర్లేదులెండి – భారతదేశంలో హిందుత్వం అంటే మతతత్వం – మరేమి మాట్లాడినా సెక్యులరిజమే..

 8. 9 కుమార్ 5:24 సా. వద్ద జూన్ 2, 2009

  రెడ్డిగారు కొంచం మన ప్రక్క రాస్ట్రాల వారి మీద కూడా దయ చూపించాలి.

  http://cosmos.bcst.yahoo.com/up/player/popup/?rn=3906861&cl=13776623&ch=4226714&src=news

 9. 10 బిందు 5:41 ఉద. వద్ద జూన్ 30, 2009

  మరి కడప రెడ్డి గారు అదేదో ముఖ్యమంత్రి కాకముందు జెరూసలం వెళ్లి , వర్షాలు కురిపించి రాయలసీమ రాతనలసిమగా మార్చి వుండవచ్చుగా ? అంటే అధికారం ఇస్తే కానీ ప్రార్ధనలు చేయరా?
  మరి ప్రార్దనలకే వర్షాలు పడితే , ప్రస్తుతం రైతులకి ఫ్రీ కరెంటు ఇవ్వవలసిన అవసరమేమిటో ప్రజలకు చెప్పాలి?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: