‘పుస్తకాలుంటాయో లేవో ఇక్కడ‘.
హడావిడిగా డాలర్ ట్రీలో అడుగు పెడుతూ అనుకున్నాను. డాలర్ ట్రీ – కేవలం ఒక డాలర్ విలువ చేసే వస్తువులు మాత్రమే అమ్మబడే షాపు. అక్కడో పుస్తకం – అంటే నోట్‌బుక్ లాంటిది కాదు, ఏదో ఓ సాహిత్యం అచ్చేసిన పుస్తకం – కొనాల్సిన అవసరం పడింది. అక్కడే ఎందుక్కొనాల్సొచ్చిందంటే ….
* * * *
‘ఆదివారం ఎలాగైనా వీలు చేసుకుని శాక్రమెంటో రావాలి. నీకో ప్రముఖ వ్యక్తిని పరిచయం చేస్తా’, నాలుగు రోజుల క్రితం ఓ మిత్రుడి ఫోన్‌కాల్. మిత్రుడి పేరు సహదేవుడు. తప్పకుండా వస్తానని మాటిస్తేకానీ వదల్లేదతను. అయితే, ఎంతడిగినా ఆ ప్రముఖుడెవరో చెప్పలేదు. ఆ ప్రముఖుడితో చిన్నపాటి ‘మీట్ & గ్రీట్’ కార్యక్రమం ఏర్పాటు చేశాననిన్నీ, మరో పదిహేనుమందిదాకా వస్తున్నారనిన్నీ మాత్రమే చెప్పాడు. సహదేవుడో సాహితీ పిపాసి. కాబట్టా ప్రముఖుడు ఆ రంగానికే చెందినోడయ్యుంటాడని నేనూహించటం సహజం.
ఈ రోజు – ఆడిన మాట ప్రకారం నూట యాభై మైళ్లు దాటొచ్చి – అరగంట ఆలస్యంగా – సభా స్థలంలో వాలాను. అదో భారతీయ రెస్టారంట్. అందులో ఓ మూలగా ఫలహారాలు చేస్తూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటుందో చిన్న సమూహం. సహదేవుడిని తీసేస్తే మిగిలినోళ్లంతా అపరిచితులు. వాళ్లలో ‘ప్రముఖుడు’ అనే పదానికి న్యాయం చేకూర్చగలిగేవాళ్లెవరూ కనపడలేదు. నాలో కొంత గందరగోళం. ప్రముఖుడు చెయ్యిచ్చాడేమో? అంత కష్టపెట్టి ఇంత దూరం రప్పించిన సహదేవుడిపై వళ్లు మండబోయి ఆగిపోయింది.
అపరిచితుల్లో కొందరు – మరో అరవయ్యేళ్ల పెద్ద అపరిచితుడికి శరపరంపరగా ప్రశ్నలేవేవో సంధిస్తున్నారు. ఆయన ఓపికగా, నెమ్మదిగా వాటికి సమాధానాలిస్తున్నాడు. ఒకట్రెండు ప్రశ్నలు విన్నాక వెలిగింది – ఆయనే సదరు ప్రముఖుడని. నా అంచనా తప్పుకాలేదు. ఆయనో సాహితేవేత్తే. అంతలో సహదేవుడు నన్ను చూసి చెయ్యూపాడు – రమ్మంటూ. తర్వాత, నేనా గోష్ఠిలో పీకల్లోతు మునగటానికి నాలుగే నిమిషాలు పట్టింది. నాలుగ్గంటల పాటు రసవత్తరంగా సాగిందది. ఎవరికి తోచిన ప్రశ్న వాళ్లు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన చిరునవ్వుతో బదులిస్తున్నాడు. ఆయన రాసిన పుస్తకాల గురించి, వాటిలో కొన్ని రేపిన వివాదాల గురించి, ఆయనెందుకు అజ్ఞాతంగా ఉండటాన్ని ఇష్టపడతాడనేదాని గురించి, ఆయన గురువుగారైన మరో మహారచయిత గురించి, సహ రచయితలు/త్రుల గురించి, వాళ్ల శైలి గురించి, రచయితలంతా ఏదో ఓ దశలో ఎదుర్కొనే writer’s block సమస్య గురించి, రెండేళ్లుగా తెలుగునాట పెరుగుతున్న పుస్తక పఠనాసక్తి గురించి .. ఇలా లెక్కలేనన్ని గురించిలు. నేనూ ఐదారేడెనిమిది గురించిలేశా.
మా ప్రశ్నలకి ఆయనిచ్చిన సమాధానాలో ఎత్తు. అభిజాత్యమూ, ఆత్మస్థుతీ, పరనిందా లేకుండా అవన్నీ చెప్పిన తీరు మరో ఎత్తు. ఆయనలో నన్నాకట్టుకున్న విషయం ఇంకొకటుంది. అది – నలభయ్యేళ్ల రచనా వ్యాసంగంలో నూట ఇరవై నవలలు, ఇరవై ఐదొందల పైచిలుకు కథలు రాసినా, ‘నేనో మహా రచయితని, నాకంతా తెలుసు’ అన్న భావం ఏమాత్రం కనపడకుండా తనకు తెలియని విషయాల గురించి ఆసక్తిగా మమ్మల్నడిగి తెలుసుకున్న పద్ధతి. అప్పటిదాకా ఆయనపై నాకున్న అభిప్రాయం ఆయనో ప్రముఖ రచయిత అని మాత్రమే. ఆ క్షణంలో నాకేర్పడ్డ అభిప్రాయం ఆయనో నిగర్వి, నిరాడంబరుడు, వెరసి నిఖార్సైన గౌరవనీయుడు అని.
నాలుగు గంటలు గమనించకుండానే కరిగిపోయాయి. ఒక్కొక్కరే వెళ్లిపోవటం మొదలు పెట్టారు. నేనూ వెళ్లటానికి నూట యాభై మైళ్లున్నాయి. వెళదామని లేవబోతుంటే వచ్చిందా ఆలోచన – ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలి.
నేను కలిసిన ప్రముఖులు లెక్కకు మిక్కిలిగా లేకున్నా, లెక్కించదగ్గందరున్నారు. ఎందుకోగానీ వాళ్లెవరిదగ్గరా ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు. మొదటిసారిగా ఈ రోజనిపించింది. కానీ ఎక్కడ చేయించాలి? ‘డాలర్ నోటు మీద చేయించుకోండి’, ఎవరో సలహా ఇచ్చారు. డబ్బు నోట్ల మీద రాయటం నాకిష్టముండదు. ఏదన్నా పుస్తకం మీదైతే బాగుంటుందనిపించింది. అప్పటికప్పుడు పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? స్థానికుడు కాబట్టి సహదేవుడినే అడిగేశా. అతను చిటికెలో తీర్చాడా సమస్య, ‘ఎదురుగానే డాలర్ షాపుంది. అందులో ఏమన్నా దొరుకుతాయేమో చూడు‘.
* * * *
చాలా పెద్ద షాపది. తినుబండారాల నుండి, ఆట బొమ్మలదాకా – ఒకే డాలర్‌కు లభ్యమయ్యే వేలాది వస్తువులు. వాటి మధ్యలో పుస్తకాల కోసం వెదకటం మొదలెట్టాను. ఎక్కువ శ్రమపడకుండానే – వెదకబోయిన తీగ సామెతలా – గ్రీటింగ్ కార్డులుండే విభాగంలో కనపడిందా పుస్తకం. ఎవరో కొనాలని తీసుకుని మనసు మార్చుకుని అక్కడ పడేసి పోయినట్లున్నారు. అది ప్రఖ్యాత ఆంగ్ల రచయిత Elmore Leonard రాసిన ’10 Rules of Writing’. ‘యురేకా’ అనుకోలేదు కానీ ఓ ప్రసిద్ధ రచయిత ఆటోగ్రాఫ్ తీసుకోటానికి అంతకన్నా అర్ధవంతమైన పుస్తకం దొరకదనిపించింది. వెంటనే దాన్నందుకుని కౌంటర్ దగ్గరికెళ్లాను.
లైన్లో నాముందు నలుగురున్నారు. నావంతు కోసం నిరీక్షిస్తూ పేజీలు తిరగెయ్యటం మొదలెట్టాను.
పుస్తకం విప్పుతూనే తగిలిన పేజీలో తాటికాయంత అక్షరాలతో రాసుంది, రచయితలు పాటించాల్సిన మొదటి నియమం: ‘Never open a book with weather’. ఆ పేజీలో ఉన్నదా ఏకవాక్యమే. దానికి వివరణ తర్వాతి పేజీలో ఉంది. అది క్లుప్తంగా: ప్రకృతి వర్ణనతో పుస్తకాన్నెప్పుడూ మొదలు పెట్టొద్దు. నీ పాత్రల అనుభూతులు వివరించటానికలా రాస్తే ఫరవాలేదు; ఊరికే ఠావులు నింపటానికో, పాండిత్యం ప్రదర్శించటానికో పరిసరాల వర్ణన మొదలెట్టావంటే మాత్రం పాఠకుడు నీ పుస్తకాన్ని మూసెయ్యటం ఖాయం.
పావు గంట క్రితం సరిగా ఇదే విషయం చెప్పాడాయన. ‘ఆకాశం అరుణ వర్ణ శోభితమై ఉంది, పక్షుల కుహుకుహూరావాలతో పల్లె మేల్కొంది’ లాంటి వర్ణనలు నేను చెయ్యను. పాఠకులు ఆ చెత్తంతా వదిలేసి అసలు విషయం వెదుక్కుంటూ పేజీ తిప్పేస్తారు.
ఎంత యాధృఛ్చికం! భూమ్మీద ఏ మూలనున్నా, ఇద్దరు గొప్ప రచయితలెప్పుడూ ఒకేలా ఆలోచిస్తారేమో.
* * * *
లైన్లో ఇంకో ఇద్దరున్నారు. ‘ఇంకెంత సేపో’ అనుకుంటూ విసుగ్గా పుస్తకం తిరగేస్తుంటే Elmore Leonard ఓ చోట చెబుతున్నాడు – తన పాత్రలని రచయిత దూరంగా ఉండి గమనించాలే కానీ వాటిలో దూరిపోకూడదని – ‘.. It’s my attempt to remain invisible, not distract the reader from the story ..’.
మరో కో-ఇన్సిడెన్స్!
గొప్పవారవ్వాలనీ, పేరు సంపాదించాలనీ అనుకోనివారుండరు. ఎంత పేరొచ్చినా అజ్ఞాతంగానే ఉండాలనుకోవటం మాత్రం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ఒకడీ ఆంధ్రుల ఆహ్లాద రచయిత. ఆయనెలా ఉంటాడో తెలుసుకోవాలనే కుతూహలం లేని తెలుగు పాఠకులు/రాళ్లు లేరప్పట్లో, ఇప్పటికీ. అది ఏ స్థాయిలో ఉండేదంటే – తొంభైల తొలినాళ్లలో – ‘ఫలానా ప్రముఖ రచయితని నేనే’ అని చెప్పుకుంటూ మోసాలు చేసే ఓ బడుద్ధాయి ప్రధానపాత్రగా ఏకంగా ఓ నవలే వెలువడింది. అలా అజ్ఞాతంగా మిగిలిపోటానికి కారణమేంటని గోష్ఠిలో ఒకరడిగారాయన్ని. ‘నా రచనలు చదివేవారికి ఆయా పాత్రలే మదిలో మెదలాలి కానీ నేను కాదు. అందుకే ..‘ అన్నది ఆయన సమాధానం.
ఆ చెప్పిన విధానమూ యధాలాపంగా ఉందే కానీ, ‘చూశారా, నేను మాత్రమే ఇలా ఉండగలను’ అని ఏ కోశానా తొణికిసలాడని గర్వం. తెలుగునాట రెండు తరాలని ఉర్రూతలూగించిన ఇద్దరు పాపులర్ రచయితల్లో ఈయనొకడని చెబితే నమ్మటం కష్టం. అంత పేరు ప్రఖ్యాతులుండీ ఇంత అణకువ ఎలా సాధ్యం? అసలు ఈయన ఆయనేనా?
అప్పుడొచ్చిందా అనుమానం. ‘ఈయన ఆయనేనా?‘. ముందు నవ్వొచ్చింది, వెంటనే మాయమయింది. అర నిమిషంలో అనుమానం గట్టిపడింది. ‘ఏమో? ఆ నవల్లోలా ఆయన పేరు చెప్పుకునే వేరే వ్యక్తి కావచ్చుగా?‘
అనుమానానికి తాత్కాలికంగా తెర దించుతూ అంతలో నా వంతొచ్చింది, ‘next customer, please‘ అన్న పిలుపుతో.
* * * *
పుస్తకం కొని పరుగులాంటి నడకతో వెనక్కొచ్చేసరికి దాదాపు మిగతా వాళ్లంతా వెళ్లిపోయారు. పుస్తకం ఆయన చేతికందించి ఆటోగ్రాఫ్ అడిగాను. నా అసలు పేరడిగి స్థలం, తేదీతో సహా ఆయన సంతకం చేసిచ్చాక తీసుకుని చూశాను. అనుమానం మటుమాయం. ఈయన ఆయనే. సాక్ష్యం కళ్లెదురుగానే ఉంది. అది – తెలుగు సాహితీ జగతిలో వేరెవరూ కాపీ కొట్టలేని సంతకం.
విశిష్ట వ్యక్తిత్వం గల ఈ Mr.Know-notని కనుక్కోలేకపోయను. తెలిసిన వాళ్ళు చెప్తారేమో ఎదురుచూస్తాను.
ఆంధ్రుల ఆహ్లాద రచయిత,తెలుగునాట రెండు తరాలని ఉర్రూతలూగించిన ఇద్దరు మహా రచయితల్లో ఒకరు, అజ్ఞాతంగా ఉండటానికిష్టపడే వ్యక్తి అంటే…. నా అంచనా ప్రకారం గౌ.మల్లాది వెంకట కృష్ణ మూర్తి. నా అంచనా కరెక్టేనా ?
అభినందనలు. మల్లాదివారి నవలల్లో మీకు బాగా నచ్చిన పుస్తకం?
వీలైతే మీకు నచ్చిన నవలపై ఒక సమీక్ష వ్రాయండి. మీరు వ్రాస్తే చదవాలని కుతూహలంగా వుంది. ఈమధ్యే ఇంకెవరో బ్లాగరు మందాకిని నవలపై ఒక టపా వ్రాశారు.
మల్లాదే ‘నో’ డౌట్!
ఏమిటా టైటిల్ కాపీ కొట్టారు అనుకున్నా ఇదా సంగతి.. బాగుంది… అదృష్టవంతులు…
నే చదివిన తొలు తెలుగు నవల వారిదే ’నత్తలొస్తున్నయ్ జాగ్రత్త’ అని. అప్పట్లో ఏడో తరగతి అయ్యాక వేసవి శలవల్లో అప్పటికే రోజుకో నవల నమిలి అవతల పారేసే మా పక్కింటి శారద ని ఆదర్శంగా చూపించి, అమ్మని సాధించి చెవిలో జోరీగ లా పోరి మరీ అనుమతి సంపాదించి ఎంతో అపురూపంగా రెండు సార్లు చదివాను.
Wow!!
That would have been an awe-some experience.
ఎంతైనా మీ బే ఏరియా వాళ్ళు అదృష్టవంతులు. చాలా అవకాశాలొస్తాయి మీకు.
మీ వ్యాసం మొదట్లోనే నాకు అనుమానమొచ్చింది, ఆయన అజ్ఞాతంగా ఉండడానికి ఇష్టపడతాడు అనగానే!. చివరకి ‘ఆహ్లాద రచయిత” అని డైరక్ట్ గా క్లూ ఇచ్చేసరికి రూఢీ అయిపోయింది.
కొద్ది రోజుల క్రితం, ఆంధ్రజ్యోతిలోనో ఎక్కడో ఆ ఇద్దరు పాపులర్ రచయితల్తో కలపి జంట ఇంటర్వ్యూ వచ్చింది చూసారా? బాగుండింది. ఆ ఇద్దరూ వాళ్ళ దారులు మొదట్లో ఎలా కలసి ఉన్నాయో, తరవత్తర్వాత ఎలా ఎవరి కంటూ వాళ్ళ మార్గంలో విడిపోయారో చెప్పినప్పుడు, నాకు భలే అనిపించింది. ముఖ్యంగా మల్లాది, ఆయన ఒకప్పటి ఫ్లాంబోయంట్ లైఫ్ స్టైల్, ఇప్పటి వెరీ స్పిరిట్యూల్ లైఫ్ స్టైల్లో ఉన్నప్పతి కాంట్రాస్ట్, నన్ను ఆశ్చర్య పరుస్తుంది. ఈ మధ్యన ఆయన రచనలు చదివితే(స్పిరిట్యువల్ వి), ఈయనేనా ఏకలింగ కథలు, డర్టీ జోక్స్ రాసిందీ అనిపిస్తుంది.
Anyway, I am really jealous..
KumarN
కాలం మల్లాదిలో ఎన్నో మార్పులు తెచ్చింది. హాస్య, శృంగారాలకు తన రచనలలో పెద్దపీట వేసే అప్పటి మల్లాదికి ఇప్పటి మల్లాదికి ఎంత తేడా? ఇప్పుడో,ఆధ్యాత్మిక ఆలోచనలలో మునిగిపోయారు. ఎంత పేరువచ్చినా, మల్లాది నిస్సందేహంగా నిగర్వి. నేను వారిని రెండే సార్లు కలిశాను.1)చిక్కడపల్లిలో వారి ఇంటి దగ్గర. 2)మా ఇంట జరిగిన రచయితల సమావేశానికొచ్చినప్పుడు, కార్టూనిస్ట్ నాని (ఇప్పుడు మన మధ్యలేరు, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు పురాణం వారి అబ్బాయి)వేసిన బొమ్మకు గొలుసుకథ చెప్పే కార్యక్రమంలో,మిగతా రచయితలతో కలిసి పాల్గొన్నారు.
ఒక మంచి రోజు మల్లాదితో గడిపారన్నమాట. వర్ణనల సంగతి కాదు కానీ కొన్ని సార్లు సోది ఎక్కువే అనిపిస్తుంది నాకు ఈయన రచనల్లో(కొన్ని నవలల్లో). ఇప్పుడు ఆధ్యాత్మిక ఆలోచనల్లో మునిగారని చదివాను, ఆ దిశగా ఏమీ రాయటం లేదేమో మరి!
@కుమార్,
ఆ ఇంటర్వ్యూ సాక్షి లో వచ్చింది.
maa abhimaana rachaitha …great.
మల్లాది వెంకట కృష్ణ మూర్తి.
ఏంటి? అధ్యాత్మికతలో ఉన్నారా!? దాని మీద రాస్తున్నారా!ఇది తెలీదండి.
చిన్ని విన్నపం:
తెలుగు గురించి జనాల అభిప్రాయాలని సర్వే చేసే ఉద్దేశ్యంలో ఓ ప్రైమరీ ట్రైల్ వేస్తున్నాం.
విజయ్ మాధవ్ అనే ఔత్సాహిక యువకుడు ఇందుకు సహాయంగా, ఇమ్మిడియట్ గా తన బ్లాగ్ లో ఈ సర్వే పెట్టారు. తెలు-గోడు పాఠకులందరికి, త్వరగా ఇక్కడ ఓ చిన్న ఆఫ్షన్ సెలెక్ట్ చేసి, పుణ్యం కట్టుకోమని మనవి.
http://vijayamadhava.blogspot.com/2009/05/rayray.html
నాకు మొదట్లో, యండమూరి మీద అభిమానం ఎక్కువున్నా, తర్వాత్తర్వాత మల్లాది గారికి తిరుగులేని అభిమాని అయిపోయాను. అయితే అప్పుడెప్పుడో కొన్నేళ్ళ క్రితం ఓ వెబ్ జైను లో ఈయన యండమూరి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఎందుకో మరి ఈ రోజు వరకు తెలియదు!
నాకు ఆయన నవలలన్నీ నచ్చినా, చాలా ఇష్టమైన నవల – అంకుల్ సామ్.
మీరు మల్లాదిగారి సమక్షాన్ని ఆనందించినందుకు సంతోషం. వాతావరణ వర్ణనతో కథ మొదలు పెట్టడం నవలల్లో చెల్లకపోవచ్చు గానీ చిన్నకథల్లో సమర్ధవంతంగా ఉపయోగిస్తే బాగా రాణిస్తుంది. నాకు బాగా గుర్తున్న కథ తుమ్మేటి రఘోత్తమరెడ్డి రాసిన చావు విందు.
అబ్రకదబ్ర, అసలు మీరు ఈ టపాయే ఒక మంచి కథ లాగా “పుస్తకాలుంటాయో లేవో ఇక్కడ” హడావిడిగా డాలర్ ట్రీలో అడుగు పెడుతూ అనుకున్నాను…అని మొదలెట్టారు. కథలు కూడా రాయకూడదూ! ఆన్ లైన్ పత్రికలున్నాయిగా ……..!
అదృష్టవంతులు మీరు. ఎన్నిసార్లు జీవించానో ఆయన పాత్రల్లో. అదిగోపులి అని ఒకసారి వెరపు, అమ్మో ఈ పులిహోరలో ఏ క్రిములున్నయోనని సంశయం, నవ్వి నవ్వి నవ్వలేక నవ్వు ఆపుకోలేక ఏడ్చిన వైనం ఇలా యెన్నని యెంచను. ఇకపోతే ప్రకృతిని విషయంలో కొంత క్రొత్తపాళీ గారిదే నా అభిప్రాయం, పైగా ఆ వర్ణనలు అదో బాణీ, అవి కూడా చదువరి మనసుని బట్టి ఆహ్లాదపరుస్తాయి కూడా. నిజానికి అటువంటి వర్ణనలున్న పంక్తులు నేను తిరిగి తిరిగి చదువుతాను.
రాజశేఖర చరితము, గోదావరీ తీర వర్ణనతోనే మొదలౌతుంది :). ఆ వర్ణన నాకు చాలా ఇష్టం 😉
గోదావరీ తీర వర్ణన కాదు, గోదావరి వర్ణన అనుకోండి 🙂
ఇక్కడ చాలా మంది వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవిస్తాను.. ప్రకృతి వర్ణన ఒకవిధంగా మనల్ని కధలో నిమగ్నమయ్యేట్లు చేస్తుంది.. అలా అని ప్రతి రెండు పేజీలకోసారి వర్ణిస్తే మాత్రం కష్టం! మల్లాది గారి పుస్తకాలలో ఏ రకమైన వర్ణనలుండకపోవడం వల్లనేనేమో నాకు ఆయనవి 3,4 పుస్తకాలు తప్ప నచ్చలేదు!? కానీ రచయితగా ఆయనంటే అభిమానం మాత్రం ఉంది 🙂
సుజాత గారి మాటే నాదీను, మీరు కధలు రాయడం మొదలుపెట్టొచ్చు.. నెరేషన్ చాలా బావుంది!
మల్లాది నవలా రచయితగా కంటే కథా రచయితగానే నాకు ఎక్కువ నచ్చుతారు. ఒకప్పుడు చందమామలో వ్రాసిన కథలనుండి, ఆంధ్రభూమి వారపత్రికలో కథాకళి అని వారం వారం వ్రాసిన కధలు, “మృత్యువాగదు” అన్న పేరుతో వచ్చిన కథా సంకలనం అన్నీ చదివించే రచనలే. బహుశ తనపేరుతో ఒక నవల వచ్చిన ఏకైక రచయిత మల్లాదే అనుకుంటాను.
అభినందనలు!
@అందరు వ్యాఖ్యాతలు:
ధన్యవాదాలు.
@వర్ణనలపై వ్యాఖ్యానించిన వారు:
ప్రకృతి వర్ణనల గురించి Leonard చెప్పింది అవి అసలొద్దని కాదు, అతిగా వాడొద్దని మాత్రమే – మరీ వాతావరణ నివేదికల్లా రాయొద్దని. నియమాలేంటో తెలుసుకుంటేనేగదా, దొరికిపోకుండా ఉల్లంఘించగలిగేది 🙂
@సుజాత,నిషిగంధ:
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ‘కొక్కొరోకో’, ‘శ్రీ ఏసుక్రీస్తుడు’, ‘మిస్టర్ నో’ – ఇవి మూడూ నా narrative skills పరీక్షించుకునేందుకు వేసిన ట్రయల్ రన్స్. నా తొలి కధ దాదాపు సిద్ధమైపోయింది. ఏకటానికంతా తయారుగా ఉండండి 🙂
మల్లాదిగారు అసలు ఎలా ఉంటారో తెలీదు. మీరు వారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారంటే అదృష్టవంతులే.. నాకు కూడా వారి రచనలంటే చాలా ఇష్టం.
చంద్రమోహన్ గారు,
కథాకళి అన్నది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది కొన్ని రోజులు, నాని గారి బొమ్మలతో.మృత్యువాగదు కూడా “అపరాధ పరిశోధన” (అపన) అనే ఓ మాగజైను లో మల్లాది వారు రాసిన కథల సంకలనం. అప్పట్లో అద్భుతమైన మాగజైను అది. అవన్నీ కాక బొమ్మరిల్లులోనూ సింగిల్ పేజీ కథలు రెగ్యులర్ గా రాసేవారాయన.
ఒక్కరూపాయి పత్రిక అంటూ ఉండాలని మల్లాది “స్రవంతి” అనే 30 పేజీల పత్రిక నడిపారు కొన్నాళ్ళు. పత్రిక చిన్నదే అయినా 3,4రోజుల పాటు చదువుకునే కంటెంట్ ఉండేది. అందులోనే తన అభిమాన రచయిత కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివ్ నవలలు “చావు తప్పితే చాలు” ” ప్రాక్టికల్ జోకర్” సీరియల్స్ గా వేశారు. ఆ నవలలు బయట దొరకవని తెలిసి మేము వాటిని దాచి బైండ్ చేయించాము కానీ జాగ్రత్త చేయలేదు.
సుజాత గారు,
నేనూ ఆ రెండు నవల్లు బైండు చేయించాను అప్పట్లో. వెన్నెల్లో గోదారి, యర్రంశెట్టి శాయి హాస్యనవల, అవి కూడా. జాగ్రత్త చేయలేదు.