సింహావలోకనం

ఏడాది – నేటికి నేనీ బ్లాగు మొదలు పెట్టి. గతేడాది ఏప్రిల్లో అనుకుంటా, ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ‘మనవాళ్లుత్త బ్లాగుడుకాయలోయ్’ పేరుతో ఓ ముఖచిత్ర కధనం వచ్చింది. అది చదివాక నాకూ తెలుగులో బ్లాగాలనిపించింది. అంతకు ముందు అడపాదడపా ఆంగ్లంలో ట్రావెల్ బ్లాగింగ్ చెయ్యటం తప్పిస్తే, తెలుగులో ఎప్పుడూ రాసిన అనుభవం లేదు. ఉన్నదల్లా తెలుగంటే అభిమానం, భాష మీద కుసింత పట్టు. ఆ రెంటినే రెక్కల్లా తొడుక్కుని ఏం రాయాలో, ఎందుకు రాయాలో తెలీకుండానే ఆవేశంగా తెలుగు బ్లాగ్గుంపులోకి దూకేశా. ఏడాది పాటు ఏకబిగిన రాసేస్తానని ఆనాడనుకోలేదు.

ఆంధ్రుడినవటం వల్లో, అన్నీ నేర్చుకోవాలనే తపన వల్లో – అన్నిటి మీదా చెయ్యి చేసుకోవటం, ఆరంభ శూరత్వం ప్రదర్శించటం నా నైజం. నాకాసక్తి లేనిది లేదు, అనుకున్నవన్నీ అభ్యాసం చేసే తీరికా లేదు. అయినా నెలకో కొత్త విషయమ్మీద దృష్టి పెట్టటం, నాలుగు రోజుల్లో మరోదాని మీదకి చూపు మరల్చటం అలవాటైన పన్లే. కాబట్టే – ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏడాదిగా ఏకాగ్రత కోల్పోకుండా ఓ పని చెయ్యటం చిరు వింతే!

తెలుగులో బ్లాగాలనుకున్నప్పుడు నేను మొదటగా నిశ్చయించుకుంది నాదనే శైలొకటి సాధించాలని. ఏడేళ్ల వయసులో యండమూరి ‘తులసిదళం’ నే చదివిన మొదటి ఫిక్షన్ పుస్తకం. నాటి నుండి పదిహేనేళ్ల క్రితందాకా వచ్చిన యండమూరి నవలలన్నీ వదలకుండా చదివాను. ఇతరుల్లో మల్లాది, మధుబాబు తప్పిస్తే మిగతావారి రచనలు పెద్దగా చదవలేదు. ప్రత్యేకించి – ఒకప్పుడు నామీద యండమూరి ప్రభావం అధికం (ఇప్పుడర్ధమవ్వాలి – నేను ‘అబ్రకదబ్ర’ ఎందుకయ్యానో. మరో కారణమూ ఉంది. ప్రస్తుతానికదో రహస్యం). కాలేజి రోజులదాకా కనపడ్డ కధల పుస్తకాలన్నీ తెగ చదివేవాడిని. పదేళ్లుగా ఫిక్షన్ మీద ఆసక్తి తగ్గిపోయి దాని స్థానే చరిత్రపై మోజు పెరిగింది. ఈ దశాబ్దంలో నే చదివిన కాల్పనిక సాహిత్యం – ఏ భాషలోనైనా – దాదాపు లేదు. సరే, మళ్లీ విషయంలోకొస్తే, నా అభిమాన రచయితల శైలి నాకలవడకుండా జాగ్రత్త పడాలనేది నాటి నా నిర్ణయం. ఎంతో కొంత సఫలమయ్యాననే అనుకుంటున్నాను.

మొదట్లో రాజకీయాల మీదనే రాసేవాడిని. పెద్ద పెద్ద విశ్లేషణలేమీ కావు; వార్తల్లో వినొచ్చిన విషయాలపై నా సొంతాభిప్రాయాలు. తర్వాతో స్నేహితుడి సూచనతో రూటు మార్చాను. రాజకీయాలతో పాటుగా ఇతర విషయాలపైనా రాయటం మొదలు పెట్టాను. కొత్త బిచ్చగాడిగా ఉన్నప్పుడు రెండ్రోజులకొకటి రాసి పడేసినా, మోజొదిలాక క్రమంగా వారానికో టపాకి స్థిరపడ్డాను. ఐతే – రెండ్రోజులకొకటిగా రాసినవన్నీ బుల్లి టపాలైతే, ఇప్పుడు రెండు పుటల వ్యాసాలు. ఆ రకంగా చూస్తే తగ్గింది తరచుదనమే కానీ టైపింగ్ కాదు. మొత్తానికి, దీనితో కలిపి నూట నాలుగయ్యాయి. వీటిలో చరిత్రకెక్కే రచనల్లేవు, చెత్త రాతలూ లేవు. సమయం వెచ్చించి ఇవి చదివినవారికేం ఒరిగిందో నాకు తెలీదు. రాసినందుకు నాకొరిగింది మాత్రం ఒకటే – తెలుగు మీద మరి కాస్త పెరిగిన పట్టు. అంతకన్నా నేనాశించిందేమీ లేదు కాబట్టి ఆల్ హ్యాపీస్.

మొదలెట్టిన నాడు ఏం రాయాలో ఎటూ తెలీదు కాబట్టి ఏం రాయకూడదనే విషయంలో కొన్ని నియమాలు పెట్టుకున్నాను. అవి – అచ్చుతప్పులుండకూడదు, సాగతీతలుండకూడదు, వ్యక్తిగత వివరాలు వెల్లడించకూడదు, ఎవర్నీ కించపరిచేలా రాయకూడదు, తోటి బ్లాగర్ల ప్రస్తావన తేకూడదు, వ్యాఖ్యాతలతో వాగ్యుద్ధాలకి దిగకూడదు. ఏడాదిగా వాటిని నిఖార్సుగానే పాటించానని నా నమ్మకం. ఇకముందూ అలాగే ఉండాలని నా నిర్ణయం.

ఏమి రాయకూడదనేదానికి ఆరు సూత్రాలైతే, సహ బ్లాగర్లతో అనవసర పరిచయాలు పెంచుకోకూడదనేది ఏడోది. వాటివల్ల మొహమాటాలేర్పడి నే రాయాలనుకున్నవి నిస్సంకోచంగా రాయలేకపోతానేమోనన్న అనుమానం దానిక్కారణం. ఇది నా అభిప్రాయం. అందరూ ఏకీభవించాలని లేదు. ఏదైతేనేం – ఈ ఏడాదిలో అనేకమంది బ్లాగర్లు, వ్యాఖ్యాతలు వారి టపాల ద్వారా, వ్యాఖ్యల ద్వారా తెలిసినా ఒకరిద్దిరిని మినహాయించి ఎవరితోనూ పరిచయం లేదు నాకు.

ఈ వత్సరంలో – బ్లాగు రాతలకే పరిమితం కాకుండా నవతరంగంలో హాలీవుడ్ సినిమాలపై వ్యాసాలు రాసే పనీ పెట్టుకున్నాను. నెలకొకటిగా ఏడు వ్యాసాలు రాశాక, గత నాలుగు నెలలుగా సమయాభావం వల్ల రాయలేకపోయాను. మళ్లీ మొదలెట్టాలి. ఫొటోగ్రఫీ నా హాబీల్లో ఒకటి. నేను తీసిన ఫొటోలతో ఒక ఆంగ్ల బ్లాగు రూపొందించే పనిలో ఉన్నాను. త్వరలోనే విడుదలవుతుందది. ఏడాదిన్నర క్రితం రాసి మూలన పడేసిన షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ దుమ్ము దులిపి సినిమాగా మలిచే ఆలోచనా ఒకటుంది. కుదిరితే ఈ వేసవిలో ఆ పని పట్టాలి. దాని కోసం ఇద్దరు నటులు కావాలి – ఎక్కడ దొరుకుతారో మరి! కొత్తగా కథన రంగంలోకీ దూకాను. నా తొలి కథ ఓ ప్రముఖ వెబ్ పత్రిక ద్వారా త్వరలో వెలుగు చూస్తుంది. స్పందనెలా ఉంటుందో చూడాలి. కొత్తా పాతా హాబీల మధ్యలో పెయింటింగ్ అలిగి అటకెక్కేసింది. రెండు నెలల క్రితం వారానికో చిత్రమన్నా గీసి తీరతానని ఒట్టేసుకున్నా. రెండు వారాల తర్వాత అది గట్టెక్కింది. ఎలాగోలా బ్రతిమిలాడి గట్టు దించాలి. పన్లో పనిగా స్టోర్‌రూమ్‌లో కునుకుదీస్తున్న కీబోర్డ్ బూజు దులపాలి. ఆ చేత్తోనే కొని మూలపడేసిన చరిత్ర పుస్తకాల దుమ్మూ దులపాలి. ఇంకా చెయ్యాలేకానీ బోల్డున్నాయి. రోజుకి ముప్పై గంటలుంటే బాగుండు.

చివరగా, ఏడాదిగా రోజుకి అధమం గంట – అంటే ఏడాదిలో పదిహేను పూర్తి రోజులు – ఇంటి గోల గాలికొదిలి బ్లాగ్లోకంలో నే మునిగినా సర్దుకుపోయి సహకరించిన సహధర్మచారిణికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలనున్నా, అటువంటివి మామధ్య నిషిద్ధం కాబట్టి చెప్పను. మీకు మాత్రం చెబుతాను. ఇన్నాళ్లుగా ఓపికగా నా రాతలు చదివిన, వ్యాఖ్యానించిన, విమర్శించిన, ప్రోత్సహించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.


22 స్పందనలు to “సింహావలోకనం”


 1. 1 జ్యోతి 6:45 సా. వద్ద మే 7, 2009

  వార్షికోత్సవ శుభాకాంక్షలు….

 2. 2 Sravya 7:34 సా. వద్ద మే 7, 2009

  అబ్రకదబ్ర గారు వార్షికోత్సవ శుభాకాంక్షలు ! 8 వ సూత్రం గా వాఖ్యల లో అచ్చుతప్పులుండకూడదు అని చేర్చకండి నా లాంటి వాళ్ళు చస్తారు :)మీ బ్లాగు యాత్ర అప్రతిహతం గా సాగాలని కోరుకుంటున్నాను

 3. 3 కె.మహేష్ కుమార్ 7:44 సా. వద్ద మే 7, 2009

  అభినందనలు. అటూఇటూగా బ్లాగుల్లో మనిద్ధరి వయసూ ఒకటే అన్నమాట! బాగుంది.

 4. 5 జీడిపప్పు 7:47 సా. వద్ద మే 7, 2009

  వార్షికోత్సవ శుభాకాంక్షలు !

 5. 6 bhavani 7:52 సా. వద్ద మే 7, 2009

  వార్షికోత్సవ శుభాకాంక్షలు అబ్రకదబ్రగారు.

 6. 7 వేణూ శ్రీకాంత్ 8:14 సా. వద్ద మే 7, 2009

  అభినందనలు అబ్రకదబ్ర గారు…

 7. 8 నేస్తం 8:15 సా. వద్ద మే 7, 2009

  సంవత్సరం పాటూ మనసును ఆకట్టుకునే పొస్ట్ లతో అందరిని అలరించారు.. అభినందనలు ,శుభాకాంక్షలు

 8. 10 laxmi 8:44 సా. వద్ద మే 7, 2009

  COngratulations Abrakadabra garu, you Sri Yesukristudu is my all time favourite. Keep going!!!

 9. 11 bonagiri 10:29 సా. వద్ద మే 7, 2009

  అభినందనలు.

  ఇంతకి సింహం ఎవరు??

  (సరదాగా..)

  HAPPY BLOG ANNIVERSARY…

 10. 14 మేధ 1:11 ఉద. వద్ద మే 8, 2009

  శుభాభినందనలు.. ఇలానే ముందుకు పోతూ ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్షా… :))

 11. 15 bujji 2:21 ఉద. వద్ద మే 8, 2009

  “తెలుగంటే అభిమానం, భాష మీద కుసింత పట్టు. ”

  కుసింత?? కూసింత??

 12. 17 కన్నగాడు 1:03 సా. వద్ద మే 8, 2009

  హార్దిక శుబాకాంక్షలు, మీరు అబ్రకదబ్ర అని ఎందుకు పెట్టుకున్నారో ఇప్పటి వరకు నిశ్చయంగా తెలియదు కాని(తుళసీదళమే కారణమనుకున్నా) నాకు మాత్రం గుర్తుకోచ్చేది తుళసీదళంలో అబ్రకదబ్ర పాత్రే!
  మీరిలాగే ఇంకా ఇంకా రాయాలని ఆశిస్తు…….

 13. 18 నాగన్న 9:53 ఉద. వద్ద మే 9, 2009

  శుభ ఆకాంక్షలు, అభినందనలు.

 14. 19 bollojubaba 7:27 ఉద. వద్ద మే 11, 2009

  అభినందనలు
  మీ ప్రోజెక్ట్లన్నీ సఫలం కావాలని ఆశిస్తున్నాను.
  అభినందనలతొ

 15. 20 కొత్తపాళీ 6:36 ఉద. వద్ద మే 12, 2009

  సంతోషం. శుభాకాంక్షులు. బ్లాగు-బ్లాగరి ఆరోగ్యానికి మంచి సూత్రాలు చెప్పారు.

 16. 21 Bhaavana 12:32 సా. వద్ద మే 13, 2009

  ఒకటవ వార్షికోత్సవం చేసుకుంటున్న మీకు శుభాకాంక్షలు. మీరు పెట్టుకున్న నియమాలు అందరికి ఆచరణ యోగ్యమైనవి కదా..


 1. 1 మీ టపాలో లంకె వేయడం ఎలా? « వీవెనుడి టెక్కునిక్కులు 10:10 సా. వద్ద మే 10, 2009 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: