కారు చవక

ఐదేళ్ల క్రితం నేను హైదరాబాదు వెళ్లినప్పటి సంగతిది. అప్పటికి ఆ నగరంలో అడుగు పెట్టి ఐదేళ్లు దాటింది. 1999 – 2004 మధ్య కాలంలో హైదరాబాదులో భారీగా రోడ్లు విస్తరించారని పత్రికలు, స్నేహితుల ద్వారా వినుండటం వల్ల ట్రాఫిక్ సమస్యల్లేని నగర ప్రయాణాన్ని గురించి కలలుగంటూ ఆ ఊర్లో దిగిన నేను బేగంపేట విమానాశ్రయం బయటికొచ్చేసరికి కఠోర వాస్తవంలోకొచ్చిపడ్డాను. నేనెరిగిన నాటితో పోలిస్తే రోడ్లు వెడల్పైన మాట నిజమే. కానీ ట్రాఫిక్ సమస్యలు దానికి రెండు మూడు రెట్లు పెరిగినట్లనిపించాయి. ఆ ఐదేళ్లలో హైదరాబాదు జనాభా రెట్టింపైతే కాలేదు. మరి ఇంత ట్రాఫిక్ ఎక్కడ నుండొచ్చింది? సమాధానం కోసం తలబాదుకునే పనేమీ రాలేదు. ఎటు చూస్తే అటు మెరిసిపోతూ కనిపిస్తున్న రంగు రంగుల, రక రకాల కార్లు ఆ గుట్టు అడక్కుండానే విప్పేశాయి. తొంభయ్యో దశకం చివర్లో హైదరాబాదులో విరివిగా నా కళ్లబడ్డ కార్లు ముచ్చటగా మూడు రకాలే: మారుతి, అంబాసిడర్, అప్పుడప్పుడే వస్తున్న హుండాయ్. ఐదేళ్లలో ఎంత మార్పు? అమెరికన్, జపనీస్, కొరియన్, జెర్మన్, ఇటాలియన్, పేర్లోనే భారతీయత జోడించుకున్న టాటా ఇండికా మరియు ఇండిగో. ఇక పాత కాపులు అంబాసిడర్, మారుతీ ఉండనే ఉన్నాయి. మొత్తమ్మీద, ద్విచక్ర వాహనాలకు సమానంగా కనిపిస్తున్న కార్ల సంఖ్య.

* * * * * * * *

దిగువ మధ్యతరగతి భారతీయుల కోసం రూపొందించబడ్డ టాటా నానో త్వరలో రోడ్లెక్కనుందన్న వార్త నిన్న ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారుగా పేరుబడ్డ నానో గురించిన విశేషాలు ప్రచురించని ప్రముఖ వెబ్ సైట్, దిన పత్రిక లేవంటే అతిశయోక్తి కాదు. లక్ష రూపాయలకే (నేటి మారక విలువ ప్రకారం రమారమి రెండు వేల డాలర్లకే) ఓ ‘పీపుల్స్ కార్’ అందించాలని రతన్ టాటా కన్న కల, దాన్ని సాకారం చేసుకోటానికి ఆయన ఆరేళ్ల కృషిని పొగడని వారు లేరు. ప్రధానంగా భారతీయులనే దృష్టిలో పెట్టుకుని తయారు చేసినా, అన్నీ సక్రమంగా జరిగితే ఈ బుల్లి కారుని ఐరోపా, అమెరికా మార్కెట్లలోనూ ప్రవేశ పెట్టే ఆలోచనున్నట్లు రతన్ టాటా వెల్లడించటం నిన్నటి వార్తకి కొసమెరుపు.       

లాభ నష్టాలతో సంబంధం లేకుండా, కార్లంటే మోజున్న భారతీయ మధ్య తరగతికి ఓ కారు వారయ్యే భాగ్యం కల్పించాలన్నదే తన సంకల్పమన్నది ఆయన అనేక సందర్భాల్లో చెప్పిన మాట. ద్విచక్ర వాహనాల కన్నా కొంత మాత్రమే అధిక మొత్తానికి సొంతమయ్యే టాటా నానో వల్ల రహదారి ప్రమాదాలు తగ్గుతాయన్నది కూడా అప్పుడెప్పుడో ఆయనే చెప్పిన మాట. ఆ మాటల్లో వాస్తవం ఎంతున్నా, ద్విచక్ర వాహనదారులని వల్లో వేసుకునే మార్కెటింగ్ ఉపాయమూ అందులో దాగుంది. రతన్ టాటా కల, దాన్నాయన సాకారం చేసుకున్న తీరు వినటానికి బాగానే ఉన్నాయి. టాటా నానోని పారిశ్రామికంగా మనదేశం సాధించిన అభివృద్ధికి చిహ్నంగా చూపే వాళ్లూ కొందరున్నారు. ఐతే ఈ పొగడ్తల హోరులో అందరూ అంతగా దృష్టి పెట్టని విషయాలు కొన్నున్నాయి.     

ఓ ఆటో రిక్షా కన్నా తక్కువ ఖరీదుకే వస్తున్న చవక కారులో నాణ్యతా ప్రమాణాలేపాటివి? రహదారి ప్రమాదాలు తట్టుకోగల భద్రతా ప్రమాణాలు ఉన్నాయా? వచ్చే రెండు మూడేళ్లలో నానోకి పోటీగా పలు ఇతర కంపెనీల నుండి కూడా కుప్పలు తెప్పలుగా బుల్లి బుల్లి కార్లు రంగ ప్రవేశం చేయబోతున్న తరుణంలో వాటి భద్రతకి సంబంధించిన ఈ ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవి. ఇవి నగర ప్రయాణానికి మాత్రమే అనువైనవిగా వాటిని తయారు చేసే సంస్థలు చెప్పొచ్చుగాక. కొనుగోలుదారులు వాటినేసుకుని హైవేలెక్కరని నమ్మకం మాత్రం లేదు. ఒకటో రెండో తప్పిస్తే – మిగతా భారతీయ హైవేల సొబగులు అందరికీ తెలిసినవే. ఈ బుల్లి కార్లు ఆ రోడ్లని తట్టుకోగలవా?     

రెండవది – ఈ కార్ల మన్నిక గురించిన ప్రశ్న. మనదేశంలో ఒక కారు సగటు వాడకం పది సంవత్సరాలకి తక్కువుండదు. సొంతదారులు మారితే మారొచ్చు, కారు మాత్రం దశాబ్దమన్నా ఉపయోగంలో ఉంటుంది. నానో వంటి బుల్లి కార్ల రాకతో ఈ పరిస్థితిలో మార్పులు రావటం తధ్యం. సెకండ్ హ్యాండ్ కార్ల వాడకం క్రమేణా కనుమరుగైపోవచ్చు. సరే, సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసేవారి బ్రతుకులు బజార్న పడతాయన్నది ఇక్కడ సమస్య కాదు. దాన్ని మించినది – ఈ పాడు పడ్డ కార్లన్నీ ఎక్కడికి పోతాయన్నది. ఏడాదికి పాతిక లక్షలకి తక్కువ కాకుండా బుల్లి కార్ల మార్కెట్ ఉంటుందనేది ఓ ప్రాధమిక అంచనా. మన దేశంలో వాడేసిన కార్లని రీసైకిల్ చేసే విధానం ఉన్నట్లు నేను వినలేదు. అన్ని విషయాల్లో లాగానే ఈ విషయంలోనూ ప్రభుత్వం తరపున స్పష్టమైన నిబంధనలూ, వాటిని అమలు చేసే చొరవా, సత్తా ఉన్నాయన్నది అనుమానమే.    

మూడవది – ఈ కార్ల వల్ల పెరగనున్న వాయు కాలుష్యం. వీటిని ఏ స్థాయి ఎమిషన్ కంట్రోల్ ప్రమాణాలను అందుకునేలా తయారు చేస్తారో ఎవరికీ తెలిసినట్లు లేదు. తూతూ మంత్రంగా – ఉండటానికి మనదేశంలో వాహనాలకి సంబంధించిన స్మాగ్ చెక్ నియమాలు కొన్నున్నాయి కానీ అవెంత గొప్పగా అమలవుతాయో అందరికీ తెలిసిందే. లక్షల సంఖలో రోడ్లెక్కనున్న ఈ బుడత కార్లు ఇప్పటికే ఉన్న కాలుష్యానికి ఉడతా భక్తిగా తమ వంతూ జోడిస్తే ఇక నగర వాసులకి నరకమే (ఇప్పటికే అందులో ఉండకపోతే).  

చివరిది – ఈ బుల్లి కార్లు భారత దేశ ఇంధన బిల్లుకి పెట్టబోతున్న భారీ చిల్లు. దేశీయావసరాలకి తొంభై శాతం దాకా ఇంధనం దిగుమతి చేసుకుంటూ విదేశీ మారక ద్రవ్యంలో అత్యధిక శాతం దానికే ఖర్చు పెట్టే దేశంలో ఇటువంటి బుల్లి కార్ల నిర్మాణానికి ఎడా పెడా అనుమతులిచ్చేయటం కేంద్ర ప్రభుత్వాల హ్రస్వ దృష్టికి నిలువెత్తు దర్పణం. వీటి రాకతో రెండింతలవబోతున్న ఇంధన డిమాండుని దేశం ఎలా ఎదుర్కోబోతుంది? ప్రత్యామ్నాయ ఇంధనాల వైపుగా మనవాళ్లు చూపు సారిస్తున్న ఆనవాళ్లూ లేవు. కనీసం ప్రజా రవాణా సదుపాయాలని మెరుగు పరచటం, బస్సులు, రైళ్ల వంటి మాస్ ట్రాన్సిట్ సౌకర్యాల వాడకాన్ని ప్రోత్సహించటం, ఇంధన వాడకం తగ్గించటం మీద ప్రజల్లో అవగాహన కల్పించటం .. ఇత్యాది చర్యలనైనా ప్రభుత్వాలు చేపట్టకపోవటం శోచనీయం.   

* * * * * * * *

కొన్నేళ్లలో నేను మళ్లీ హైదరాబాదొచ్చినప్పుడు – శంషాబాదు విమానాశ్రయం నుండి ఇంటికెళ్లే దారిలో – రోడ్ల మీద జనాలకి బదులు బిలబిలలాడుతూ కార్లే కనిపిస్తే వింత లేదు. బిక్కుబిక్కుమంటూ వెళ్తున్న ఒకటో రెండో మోటారు సైకిళ్లపై ఆక్సిజన్ మాస్కులు తొడుక్కున్న చోదకులని చూసి ఆశ్చర్యపోనవసరం లేదు. ఎక్కడబడితే అక్కడ రోడ్ల పక్కన పారేసిన తుప్పు పట్టిన బుల్లి కార్లని చూస్తూ నోరు తెరవాల్సిన పనీ లేదు. ఉన్నదల్లా ఒకటే ప్రశ్న – ఆ అధివాస్తవిక దృశ్యాలు జీర్ణించుకునే శక్తి నాకుందా? 

11 స్పందనలు to “కారు చవక”


 1. 1 కన్నగాడు 6:29 సా. వద్ద మార్చి 24, 2009

  మీరన్నది నిజమే నిన్న ఏదో భారతీయ టివి చానల్ లో చూసా ఖర్చు తగ్గించడానికి ఎడమ వైపు అద్దాన్ని తొలగించారట, ఒక్కసారి మీ పక్కనున్న తెల్లవాడికి చెప్పండి వాడు పడీ పడీ నవ్వకపోతే అప్పుదు చెప్పండీ! ఇంకానయం స్టీరింగు తీసేసాడు కాదు:)

 2. 2 అసంఖ్య 7:14 సా. వద్ద మార్చి 24, 2009

  ఒక వేళ ఈకారు నిజంగా మార్కెట్లో విజయం సాధిస్తే, ఎన్నో ప్రశ్నలకి మనం సమాధానం వెతుక్కోవాల్సివస్తుంది. మీరన్నట్టుగా, ముందు ట్రాఫిక్ సమస్య. కాలుష్యం, వ్యర్ధాలరీసైక్లింగ్.
  సేఫ్టీ గురించి అంతగా పట్టించుకోనక్కరలేదు (రోడ్లపరిస్థితులు, ట్రాఫిక్కే పెద్ద భద్రతా పరికరాలు).

  అసలు జనాలు “మొబిలిటీ” అవసరంలేని విధంగా వ్యాపారాలని/వస్తువులని కనుగొంటే బావుంటుంది.

 3. 3 చిలమకూరు విజయమోహన్ 7:33 సా. వద్ద మార్చి 24, 2009

  ఇప్పటికే ఆటోలు,7సీటర్లతో ట్రాఫిక్ సమస్య ఎక్కువయ్యింది ఇక ఈ నానోలతో ఇక నాన్నోయ్, బాబోయ్ అనే పరిస్థితే తప్పేటట్లు లేదు.

 4. 4 కె.మహేష్ కుమార్ 9:30 సా. వద్ద మార్చి 24, 2009

  Planning in general urban planning in particular మనోళ్ళకు చేతగాని పనుల్లో ఒకటి. ఇక్కడా విత్తుముందా చెట్టుముందా లాంటి సమస్యలొస్తాయి. గ్లోబలైజేషన్ కు ద్వారాలు తెరుస్తున్నప్పుడు వచ్చే 20 సంవత్సరాలలో ఇన్ని మౌళికావసరాలుంటాయనే కనీస ప్రణాళిక లేకుండా బార్లా తెరిచేసాం. కొంత అవగాహన ఉన్నా, మన సహజమైన ఆలసత్వం రెడ్ టేపిజంతో ఇప్పటి పరిస్థితికి కారణమయ్యాం.ఇప్పుడు నానో వచ్చినా మరెన్ని చిన్నకార్లొచ్చినా రోడ్లు బాగుపడాలంటే మరో 20 సంవత్సరాలు కావాలి. అప్పటికి రోడ్ల కెపాసిటీకి 30 రెట్లు అధికంగా కార్లు పెరుగుతాయేమో! మనమింతే. ఎప్పుడూ ఓ ముప్పై సంవత్సరాల వెనకే.

 5. 5 సుజాత 12:29 ఉద. వద్ద మార్చి 25, 2009

  అవును, ముఖ్యంగా హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య ఇప్పట్లో కాదు కదా, ఎప్పటికీ తీరనిది.వర్షాకాలం వస్తే మరీ అధ్వాన్నం! ఒక్కోసారి గంటలతరబడి ట్రాఫిక్ లో చిక్కుకునే ఓపిక లేక కారొదిలేసి బైక్ తీసుకెళ్ళే పరిస్థితి ఉంది. నానో గురించి ఈ దృక్కోణంలోనే ఆలోచించాలి.

 6. 6 చైతన్య 12:59 ఉద. వద్ద మార్చి 25, 2009

  ఆమధ్య ఒకరోజు ఒక ఫ్రెండ్ కారు(ఆల్టో) మీద… కొంచం బలంగా చేయేస్తే… కారుకి చొట్ట పడినంత పనైంది. ఆహా ఈ కారు ఇంత గట్టిదా అనుకున్నాను. మరి ఇంత చవకగా వచ్చే నానో కారు ఇంకెంత గట్టిదో చూడాలి మరి!
  ఇలాంటి కార్లు జనాలకి ఎలాంటి భద్రతా కలిగిస్తాయో ఏమో! ఒక సైకిల్ వచ్చి గుద్దినా కారు నుజ్జు నుజ్జు అయిపోద్దేమో 😀
  భద్రతా సంగతి పక్కన పెడితే… ఇప్పటికే హైదరాబాద్ రోడ్ల మీద డ్రైవ్ చేయాలంటే తాతలు దిగొస్తున్నారు… ఇక ఈ నానోలు వచ్చాయంటే ముత్తాతలు… వాళ్ళ తాతలు కుడా దిగొస్తారు! ఇక ఈ హైదరాబాద్ ట్రాఫిక్ ని ఆ దేవుడు కుడా బాగు చేయలేడు!

  @కన్నగాడు
  హ హ హ్హ… స్టీరింగ్ ఏం ఖర్మ… బ్రేకులు కుడా తీసేయగలరు… 😀

 7. 7 rayraj 3:28 ఉద. వద్ద మార్చి 26, 2009

  “ఐరోపా, అమెరికా మార్కెట్లలోనూ ప్రవేశ పెట్టే ఆలోచనున్నట్లు రతన్ టాటా వెల్లడించటం నిన్నటి వార్తకి కొస ’మెరుపు’ ” – క్షమించాలి! అక్కడ ఈ కారు ప్రవేశపెడతారన్న భయంతోనే ముందునుంచే “ఉరుముతున్నారు”.

  టాటా మాటల్లోని మార్కెటింగ్ శ్లేషలు అర్ధం చేసుకున్నందుకు అభినందనలు.

  “ఓ ఆటో రిక్షా కన్నా తక్కువ ఖరీదుకే” : ఆటో రిక్షాలే వీటితో రీప్లేస్ ఔతాయేమో! ఆటో కంటే కారు సురక్షతిమే – కనీసం నాలుగు చక్రాలుంటాయి.తడవకుండాను వెళ్ళచ్చు. మిగితా భయాలు వద్దు.ఆటోలకి ఓ బారతీయ నాణ్యత ఉంది!అలాగే ఈ కార్లకీ!(అమెరికాతో,ఐరోపాతో పోల్చుకోము. ఆ కార్లని కొనటానికి పోల్చుకోదగ్గ జీతాలు ఇంకా మాకు లేవు)

  కాలుష్యం : దీని గురించి భారతదేశంలో కంటే ముందు అభివృద్ధి దేశాలలోనే పని జరగాలి.ప్రపంచ కాలుష్యాన్ని తగ్గించటానికి “ఒక్కసారిగా” కార్లు వాడటం మానేయండి. ప్లీజ్!
  ఇన్నాళ్ళు అనుభవించారుగా! కాస్త మేం కొనుక్కోగలిగే కారుల్లో , ఆటోల్లో మేం తిరుగుతాం.మీ కాలుష్యం ఆపేస్తే, మా కాలుష్యం పెరిగినా అంతగా తేడా రాదు. లెక్కలు చెబ్తున్నాయి.(ఎమిషన్ స్టాండర్డ్స్ పెంచుతూపోతే, కారు చవకదవ్వదేమో!)

  విదేశి మారకం: ఓ పక్క ఐరోపాలో, అమెరికాలో అమ్ముతారంటూ , మరో పక్క అదే కరెన్సీలో పెట్రోలు కొనుక్కోలేం అంటారే!అమ్మిన దాంట్లో డబ్బు తెచ్చి, ఇక్కడి కట్టమని టాటాకు చెప్తే సరి! లేకపోతే “నానో ఇండియాలో వద్దు” అని అప్పుడే చెబ్దాం. లాభం లేకపోతే,వాళ్ళే మానేస్తారు.అంతేగాని, ముందే పర్మిషన్ ఇవ్వద్దు అనటమేమిటి? దాన్నే లైసన్స్ రాజ్ లో తప్పుగా చెప్పారు. లైనన్స్ రాజ్ వల్లే – ఆంత్రప్రెన్యూరియల్ ఇన్నోవేషన్ ఆగిపోయింది అని ఏడ్చిపోయారు – మర్చిపోయారా!?

  రీసైకిలింగ్ : యస్! దిస్ కెన్ బి ది న్యూ ప్రాబ్లెం. (ఒక్క కార్లలోనే కాదు – ఇండియాలో చాలా “రీసైక్లింగ్” మార్కెట్ ఉంది). దీని గురించి మాత్రం – గవర్నమెంట్ కంటే ముందు ఓ ఆంత్రప్రెన్యూరియల్ ఐడియా రావాలి.సమర్ధులు ఆలోచిస్తే మంచిదే! ఇప్పటికి ఇండియాలో రీసైక్లింగ్ /వేస్ట్ మేనాజ్మెంట్ లోఉన్నట్టుగా కేవలం ఒకే ఒక్క గ్రూపు తెలుసు.పేరు చెప్పను.ఔత్సాహిక ఎన్నారై ఎంటర్ ప్రెన్యూరులు కలసి రండి! ఇట్స్ ఏ హ్యూజ్ మార్కెట్!అండ్ యూ కెన్ టాక్ లైక్ టాటా – యాజ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఏ ఫేవర్!

  ప్రభుత్వం వల్ల దేశం బావుంటుంది అని మీలాంటి వాళ్ళు చెప్పటం బాధాకరం. కొత్త ఆలోచన్లతో కదం తొక్కే తరతరాల యువతవల్ల అమెరికా అలా ఉంది; ఓ భారత యువత! ఆలోచించు ఇక నిద్రలెమ్మని చెబితే బావుంటుందేమోగా!

  ఇంకా చెప్పాలనుంది – నా బ్లోగులో చెప్తాను; హోప్ యూ అండర్ స్టాండ్ వాట్ ఐ వాంట్ టు కన్వే. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్: 50 ఏళ్ళ క్రితం ఇలాంటి ఓ మార్కెటింగ్ స్టంట్ జరిగింది ట.కారు పేరు గుర్తులేదు(ఐ హావ్ నో ఫాన్సీ.ఇలా క్రింది నుంచీ మళ్ళీ అప్ మార్కెట్ కే కారు అమ్మబడిందిట.అప్పుడు మీరనుకున్న భయాలు ఉండవు.కారు కొనేవాడు, మిగితావి కొనాల్సి వచ్చి, అవీ కొంటాడు.

  కొసమెరుపు ఏంటో చెప్పనా – లక్ష రూపాయల కారు, లక్ష కార్ల వరికేనట.(అందులో నిజానికి లక్షకొనుక్కునే వాళ్ళు ఎంతమంది!?)

 8. 8 అబ్రకదబ్ర 12:50 సా. వద్ద మార్చి 26, 2009

  @రేరాజ్:

  >> “అక్కడ ఈ కారు ప్రవేశపెడతారన్న భయంతోనే ముందునుంచే ఉరుముతున్నారు”

  ఆ ఉరిమిందెవరో తెలిస్తే చెప్పగలరు. ఐరోపా సంగతేమో కానీ, అమెరికన్ మార్కెట్లో జపనీస్, జర్మన్ కార్లదే హవా అన్న సంగతి మీకు తెలీనిది కాదనుకుంటాను. నానో బాగుంటే దాన్నీ ఆదరించేవాళ్లే ఉంటారు కానీ ఉరిమేవాళ్లెవరూ లేరిక్కడ.

  >> “విదేశి మారకం”

  ఈ విషయం గురించి మీర్రాసిందంతా నవ్వులాటకి రాసినట్లుంది 🙂 కాబట్టి దీని గురించి నేను వివరించబోవట్లేదు.

  >> “ఎమిషన్ స్టాండర్డ్స్ పెంచుతూపోతే, కారు చవకదవ్వదేమో”

  చవకవ్వాల్సిన అవసరం లేదేమో.

  >> “అమెరికాతో,ఐరోపాతో పోల్చుకోము. ఆ కార్లని కొనటానికి పోల్చుకోదగ్గ జీతాలు ఇంకా మాకు లేవు”
  >> “కాలుష్యం : దీని గురించి భారతదేశంలో కంటే ముందు అభివృద్ధి దేశాలలోనే పని జరగాలి”
  >> “మీ కాలుష్యం ఆపేస్తే, మా కాలుష్యం పెరిగినా అంతగా తేడా రాదు”

  ‘మీ, ‘మా’ ఏమిటి? ఎవరితోనో పోల్చి నేనీ వ్యాసం రాయలేదు. నా టపాలో అటువంటి ప్రస్తావనెక్కడన్నా కనిపించిందా? ఇతరులతో పోల్చుకుని మనని ఎక్కువో తక్కువో చేసి చూపటం నాకలవాటు లేని పని. అసలు మీరీ వ్యాఖ్యే పెద్ద దురభిప్రాయంతో రాసినట్లుంది కానీ నే రాసిన వాటిలో నిజాల గురించి ఆలోచించినట్లు లేదు. వేరే వాళ్లు వెధవ పనులు చేస్తే మనమూ చెయ్యాలనా మీ ఉద్దేశం?

  >> “లెక్కలు చెబ్తున్నాయి”

  లెక్కలదేముంది, ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్లకి చూపించే సర్వేలెప్పుడూ ఉంటాయి. ఉదాహరణకి, ఓ లెక్క ప్రకారం అమెరికాలో వాహనాల ద్వారా విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలకన్నా భవనాల (వాటిలో వాడే వివిధ విద్యుత్ ఉపకరణాల) నుండి విడుదలయ్యేది ఎక్కువ. 38 శాతం కార్బన్ డయాక్సైడ్ వీటినుండే వస్తుంది. ఈ లెక్కని ఎవరికి అనుకూలంగా వాళ్లు వాడుకోవచ్చు.

  >> “ప్రభుత్వం వల్ల దేశం బావుంటుంది అని మీలాంటి వాళ్ళు చెప్పటం బాధాకరం”

  ప్రభుత్వం వల్ల ‘మాత్రమే’ దేశం బాగుంటుందని నేననలేదు. దేశం బాగోటానికి ప్రభుత్వం చెయ్యాల్సిన కొన్ని
  పనులని గుర్తు చేశానంతే.

 9. 9 a2zdreams 2:14 సా. వద్ద మార్చి 26, 2009

  @ ఇతరులతో పోల్చుకుని మనని ఎక్కువో తక్కువో చేసి చూపటం నాకలవాటు లేని పని.

  good point !

 10. 10 rayraj 3:43 ఉద. వద్ద మార్చి 27, 2009

  దురభిప్రాయం ఏమీ లేదు.అంతా సదభిప్రాయమే.
  I think you missed the whole point.
  Except the point of Recycling, all the rest are problems which already exist and would continue to aggrevate even in the absence of Nano.Pollution would still increase – auto.seven seaters will be used instead, which are dangerous than a car.The typical image of the target customer as created by Ratan Tata is :a motorist with wife and two kids all on one bike going in heavy traffic.The safety standards you mentioned are not his concern!It comes at a later stage.There is no doubt a market segment and a prodcut requirement like this exists.Indica and Indigo replaced the entire rental car market of Ambassador and Fiat though it was targeted at the individual Indians.The Auto rikshaw needed a replacedment for long.Thus,Nano is supposedly an answer for the very problems you mentioned;and like all solutions, its relatively better solution;We can not talk abt the best straight away.Indian market can not afford it.

  Essentially,all the points might be related to goverance;but all of these have to face a counter argument, which are/were valid; In fact, they were taken as valid to change our economic policies at some point.We might fail in killing the monopolistic situations created by oil companies however Petrol is definitely not an angle to preach ascitism to the indian masses.

  If Pollution was so much of a concern, why can’t the developed nations insist on using electric cars.Subsidize and sell the reva priced approx Rs4lakhs as a Rs1lakh car! An innovation is always to fulfill a requirement of a market segment.Its success depends on lots of other factors too.

  I think that was long enough.And if you now read my earlier comments, you can surely get away from the దురభిప్రాయ angle and look at the point i am making.I said the points though look valid are not essentially the points concerning Nano.Recycling is a valid point and not necessisarily a govt issue;Its another market opportunity – precisely raising out of Nano.In fact, recylcing/waste management is the thing for the indian market, which was not being looked at by enterpreneuers…

  The “mee maa” language is the psyche of the first timer and i feel its valid; you can’t preach ascitism to the poor fellow;I stood for them;It looks like it aroused a different feeling unintended and could have been avoided.Yet, i am not apolegitic about it.Hope you understand.

  Some time after we subside,i will try to rearrange the thoughts,put it in better language and try to make point.Nano is an answer to most of the points raised by you.It does not create those problems.Every solution will inturn bring new problems.Recylcing is surely one of them – which can be seen as another opportunity.

  Wish you Happy Ugadi

 11. 11 అబ్రకదబ్ర 9:38 ఉద. వద్ద మార్చి 27, 2009

  @రేరాజ్:

  మొత్తమ్మీద, నేనన్న కొన్ని సమస్యలకి నానో పరిష్కారమంటారు. మీ వివరణ చదివాక అదీ నిజమే కావచ్చనిపిస్తుంది. ఆటోలకి నానోలు ప్రత్యామ్నాయమైతే బాగానే ఉంటుంది. అలాగే స్కూటర్లు, బైకుల మీద వెళ్లే కుటుంబాలకీ.

  ఆటోలకీ, బైకులకీ, వాటి కాలుష్యానికీ, ప్రమాదాలకీ సరైన సమాధానం మరింత మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ అనేది నా అభిప్రాయం. అది ప్రభుత్వాల చేతిలో పని అనేది కూడా నా అభిప్రాయం. ‘ప్రభుత్వాలెటూ ఆ పని చెయ్యవు కాబట్టి ఉన్నంతలో చిన్న కార్లే మెరుగు’ అనేది మీ నమ్మకం. మీది ప్రాక్టికల్, నాది ఐడియల్ 😉

  ఈ విషయమ్మీద మీ టపా గురించి ఎదురు చూస్తున్నాను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: