తారల-తో-రణం

తెలుగు రాజకీయాల్లో సినీ తారల సందడి అరవైల నుండీ ఉన్నదే. కోన ప్రభాకర రావు, కొంగర జగ్గయ్య వంటి వారు సినీ రంగానికీ రాజకీయాలకీ మొదటి తరం వారధులైతే, ఆంధ్ర రాజకీయాలకి పూర్తి స్థాయిలో సినీ సొబగులద్దిన సారధి మాత్రం ఎన్టీవోడే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సినీవాలాల కోలాహలం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. పాతికేళ్లుగా – కమ్యూనిస్టులని మినహాయిస్తే – ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో పోటీ చేయించటం దగ్గరనుండి ఎన్నికల వేళ ప్రచార రంగంలో దూకించటం వరకూ సినీ తారల పేరు ప్రఖ్యాతులు వాడుకోజూడని రాజకీయ పక్షం రాష్ట్రంలో లేదు. పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా ఈ విషయంలో ఏ పార్టీ తాహతు దానిది. సహజంగానే, అన్నిట్లోకీ తారాబలం ఎక్కువున్న పార్టీ తెలుగుదేశం. గడచిన ఐదేళ్లలో కాంగ్రెస్ కూడా కొంత సినీ గ్లామర్ సంతరించుకున్నప్పటికీ, ఈ విషయంలో ఇప్పటికీ తెలుగుదేశానిదే ముందంజ.

ఏడెనిమిది నెలల క్రితం అవతరించిన మరో ‘సినీ పార్టీ’ ప్రజారాజ్యం ఆశ్చర్యకరంగా సినిమా గ్లామర్ విషయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ తర్వాత మూడో స్థానంలో ఉంది. ఇప్పటికైతే ఆ పార్టీకున్న ఏకైక గ్లామర్ కేంద్రం చిరంజీవి, ఆయన తర్వాత ఎంతో కొంత ఆయన సోదరులు – అంతే! 1982లో రామారావు వెంట కదలిన స్థాయిలో కాకపోయినా, నేడు చిరంజీవి వెంట చెప్పుకోదగ్గ శాతంలో పరిశ్రమ వర్గాలు నడవకపోవటం విచిత్రమే. ‘నాకు పరిశ్రమలో శత్రువుల్లేరు’ అని చిరంజీవి తరచూ చెప్పుకుంటారు. శత్రువులతో పాటు ఆయనకి నిజమైన మిత్రులూ లేరనుకోవాలేమో.

ఇరవయ్యేడేళ్ల క్రితం – అగ్ర నటుడిగా తన ప్రభ తారాస్థాయిలో వెలుగుతుండగానే – సినిమాలకి స్వస్తి చెప్పి రామారావు రాజకీయాల్లోకొచ్చినప్పుడు ఆయన చిత్తశుద్ధిపై ఎవరికీ అనుమానాల్లేవు. అప్పటి రోజులటువంటివి, ఆయన గుణగణాలటువంటివి. వీటికి తోడుగా, పురాణ పాత్రల దన్నుతో ఆయన ప్రోది చేసుకున్న దేవుడి ఇమేజ్ ఉండనే ఉంది. మరి ఇప్పుడో – రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న నటీనటుల ఏకైక ధ్యేయం తమనుద్ధరించటమే అన్న నమ్మకం ఎందరు వోటర్లకుందనేది అనుమానమే. రాజకీయాలనేవి నేటి తరం నటీ నటులకి పునరావాస కేంద్రాలన్నది అధిక శాతం ప్రజల నిశ్చితాభిప్రాయం. రామారావు వారసులకీ ఇది వర్తించే సూత్రమే; ఇక ఇతరుల సంగతి సరే సరి. ఐతే, వాళ్లేదో పొడిచేస్తారన్న ఆశల్లేకపోయినా, రౌడీలు, గూండాలకన్నా సినీ తారలు మెరుగు అన్న భావనే ఎక్కువ మందిలో ఉంది.

ఈ సారి ఎన్నికల సీజన్లో తారల హడావిడి ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో ఉంది. బాలకృష్ణ, విజయశాంతి, రోజా, కృష్ణంరాజు, శ్రీహరి, రాజశేఖర్, జీవిత, జయసుధ, రవళి, నరేష్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తారకరత్న, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్, బాబూ మోహన్ .. ఇలా ఈ జాబితా కొండవీటి చాంతాడంత. వీళ్లలో ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నవారు కొందరు, ఎన్నికల వేళ తమ అభిమాన పార్టీ ప్రచారానికే పరిమితమయ్యేవారు మరి కొందరు. అయితే అలనాడు ఎన్‌టీఆర్, పోయినేడు చిరంజీవి స్థాయిలో సంచలనాత్మక రాజకీయారంగేట్రాలు వీళ్లెవరూ చేయలేకపోయారు. చిరంజీవి రాజకీయ ప్రవేశంతో సంచలనమైతే సృష్టించారే కానీ రామారావు లాగా పోలింగ్ నాడు ప్రభంజనం సృష్టించగలగుతారో లేదో అన్నది తెలిసేది మరో రెండు నెలల తర్వాతే. ప్రస్తుతానికైతే ప్రజలకి ఎన్నికలయ్యేదాకా టికెట్ కొని చూసే పని లేకుండా తారాజుల, తారాణుల ఉచిత దర్శన భాగ్యం. పైగా ఈ మధ్య పరస్పర విమర్శల్లో భాగంగా సినీ తారల చీకటి జీవిత రహస్యాలు బట్టబయలు చేసుకునే కొంగ్రొత్త పద్ధతులు పుట్టుకొచ్చాయి కూడాను. ఆ వారా, అటువంటి మసాలా వివరాలంటే చెవులు కోసుకునే ప్రేక్షక, పాఠక, వోటరు దేవుళ్లకి అంతో ఇంతో అదనపు ఆనందం.

తెలుగు రాజకీయ యవనికపై తాజాగా తళుక్కుమన్న మరో తార – ఎన్‌టీఆర్ జూనియర్. తెలుగుదేశం పార్టీ  తురుపుముక్కగా ప్రయోగించిన ఈ ‘బుడ్డోడు’ రంగ ప్రవేశం చేసి వారం తిరగకుండానే సూపర్ హిట్ అనిపించుకున్నాడన్నది ఐదు రోజులుగా ప్రసార మాధ్యమాల్లో హోరెత్తుతున్న కధనాల సారాంశం. తాత పేరు, పోలికలు ఉన్నా పాత ఎన్‌టీవోడితో జూనియర్‌ని పోల్చటం తొందరపాటే. ఐతే, తొణుకూ బెణుకూ లేకుండా ప్రసంగించటంలో ఈ బుడతడు ‘సీనియర్ బ్యాచ్’ బాలకృష్ణ, చిరంజీవిలకన్నా ఎక్కువ మార్కులే కొట్టేస్తున్నాడు. బాబాయిలా తొడ కొట్టటం, మెగాస్టార్‌లా మీసాలు మెలెయ్యటం, ముఖ్యమంత్రిలా ముద్దులు విసరటం వంటి పైత్యాలకి పోకుండా చెప్పదలచుకుంది సూటిగా, స్పష్టంగా చెబుతూ శ్రోతలని ఆకట్టుకుంటున్నాడనీ, ఇప్పటిదాకా డీలా పడున్న తెదెపా శ్రేణులు ఇతని రాకతో ఉత్తేజితమయ్యాయనీ, ఎదిరి పక్షాలు కలవరపాటుకి గురయ్యాయనీ వార్తలు. రెండు రోజులుగా కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల్లో అన్ని స్థాయిల్లోని నేతల దాడికీ ఎన్‌టీఆర్ జూనియర్ ఏకైక కేంద్రమయ్యాడంటే అతని రాక వాళ్లలో అనుకోని కలకలం రేపిందనుకోవాలి.  ‘సినీ తారల సభలకి వాళ్లని చూట్టానికే వస్తారు కానీ ఓట్లెయ్యరు’ అంటూ బింకం ప్రదర్శిస్తున్నా కాంగ్రెస్‌లో ఉలికిపాటు స్పష్టంగానే కనిపిస్తుంది. ఓ పక్క సినీ మంత్రాలకు చింతకాయలు రాలవంటూనే మరో పక్క కృష్ణ, మహేష్, నాగార్జున వంటి ప్రముఖ నటులని నయానో భయానో కాంగ్రెస్‌వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయటం ఏ పుట్టలో ఏ పాముందోనన్న భయంతోనే అన్నది నిర్వివాదాంశం.

ఎన్‌టీఆర్ జూనియర్ ఎదుటి పక్షాల్లో రేపుతున్న గుబులు మాట అటుంచితే – పట్టుమని పది రోజుల ప్రత్యక్ష రాజకీయానుభవం లేని ఈ పాతికేళ్ల కుర్రోడిని అప్పుడే తెదెపా భావి నేతగా అభివర్ణించే బాకారాయుళ్ళు తమ్ముళ్ల పార్టీలో కొందరు పుట్టుకొచ్చారు. ఇప్పటికైతే తెదెపా దృష్టంతా ఏదోలా వైయస్‌ని గద్దె దింపటమ్మీదనే ఉండటంతో దీన్నెవరూ పట్టించుకోవటం లేదు కానీ, భవిష్యత్తులో బాబాయ్-అబ్బాయ్ ల మధ్య ఆధిపత్య పోరాటానికి ఇది నాందిగా మారితే ఆశ్చర్యం లేదు. అదే జరిగితే, నేటి బంగారు కొండే రేపు తెదెపాకి గుదిబండగా మారొచ్చు.

14 స్పందనలు to “తారల-తో-రణం”


 1. 1 teresa 3:22 సా. వద్ద మార్చి 17, 2009

  లోక్‌సత్తా పార్టీ లో తారలున్నారా?

 2. 2 అసంఖ్య 6:23 సా. వద్ద మార్చి 17, 2009

  అందరి నిర్ణయాల్నీ ప్రజలమీదకే తోస్తారు కూడా!

  మీరెందుకు పార్టీ పెట్టారు? ప్రజలు పెట్టమన్నారు.
  మీరెందుకు పార్టీ మారారు? ప్రజలు మారమన్నారు.
  ….

  మీరెందుకు ఓడిపోయారు? ప్రజలు ఓడి… అదేనండీ, ప్రతిపక్షాలు కుట్రపన్నాయి 🙂

 3. 3 కె.మహేష్ కుమార్ 8:00 సా. వద్ద మార్చి 17, 2009

  @teresa:లోక్ సత్తా వల్ల తారలకి ఒరిగేదేమీ లేదు. కాబట్టి, ఆదర్శాలు వల్లేవేసే ఈ పార్టీ వైపు మొగ్గుచూపడం కష్టమే!

 4. 4 అబ్రకదబ్ర 9:49 సా. వద్ద మార్చి 17, 2009

  @అసంఖ్య:

  అనగనగనగనగా అప్పుడెప్పుడో ఓ పెద్దాయనకి భీకరమైన అనుమానమొకటొచ్చిందట. ‘సినిమా పత్రికలన్నిట్లోనూ రామారావు, జమున, నాగేస్సర్రావు, తదితరులు అని రాస్తారు కదా. ఈ ‘తదితరులు’ అనేవాడెవడో చాలా ఫేమస్ లాగున్నాడే. వీడు లేని సినిమా లేదు’ అని. చిరంజీవి ప్రతిదానికీ ‘ప్రజలు చెప్పారు, ప్రజలు రమ్మన్నారు’ అంటుంటే గుర్తొచ్చింది. ఈ ‘ప్రజలు’ అనేవాడెవడో మరి 🙂

 5. 5 సుజాత 9:58 సా. వద్ద మార్చి 17, 2009

  @teresa,
  లోక్ సత్తాలో ఉన్న ఒకే ఒక తార ఆ పార్టీ జెండా మీద ఉన్నదే!:-)

  జూనియర్ రాముడికి లభిస్తున్న ఆదరణ వల్ల తెలుగుదేశానికి ఓట్లు బాగా పడతాయని,చంద్రబాబు బాగానే సంతోషిస్తున్నాడు. అతడే భావి నేత అని భావిస్తున్న తెలుగు తమ్ముళ్లకు నిరాశే! ఎందుకంటే ఎవరిని ఎంత వరకు ఉపయోగించుకోవాలో బాబు గారికి బానే తెలుసు. ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే మళ్ళీ జూనియర్ రాముడిని పక్కన పెట్టడం, పట్టించుకోకపోడం ఖాయం!

 6. 6 పారదర్శి 10:47 సా. వద్ద మార్చి 17, 2009

  మెగా స్టార్ పార్టీలో ఇప్పటికే ముగ్గురు తారలున్నారు. కొత్తగా వెరే సినీనటులొచ్చినా వీరి ముందు వారు వెలవెల పోక తప్పదు కాబట్టి ‘ప్రజారాజ్యంలో చేరే నటులకు పెద్ద బలముండదు. వారివలన పార్టీ కి అదనంగా వచ్చే గ్లామర్ లేదని ముగ్గురు సోదరులు భావిస్తారనే కారణం వల్ల కావచ్చు; వెరే తారలెవరూ ప్రజారాజ్యం పార్టీలో చేరినట్లు లేదు. ప్రజారాజ్యానికి కావలసైనది తారల గ్లామర్ కాక వేరే విధంగా ప్రజలను ఆకర్షించే వ్యక్తులు. తారాబలంలోనే కాదు ప్రజాకర్షణలో కూడా ప్రజారాజ్యం తెలుగుదేశం, కాంగ్రెస్ తర్వాత మూడో స్థానంలో ఉంది.

 7. 7 మార్తాండ 11:26 సా. వద్ద మార్చి 17, 2009

  మహేష్ గారి వ్రాసారు: >>@teresa:లోక్ సత్తా వల్ల తారలకి ఒరిగేదేమీ లేదు. కాబట్టి, ఆదర్శాలు వల్లేవేసే ఈ పార్టీ వైపు మొగ్గుచూపడం కష్టమే!>>
  ఆదర్శాలు వల్లించేవాళ్ళని సత్తెకాలపు సత్తెయ్యలంటూ వెక్కిరించే కల్చర్ లెస్ బ్రూట్స్ ఉన్న కుళ్ళు కంపు దేశం మనది.

 8. 8 అబ్రకదబ్ర 11:34 సా. వద్ద మార్చి 17, 2009

  @తెరెసా:

  జ్యోతిక, విక్రమ్ చేరారు. వాళ్లే ఎందుకో మీకొక్కరికే అర్ధమవుతుంది 😉

 9. 9 కె.మహేష్ కుమార్ 12:55 ఉద. వద్ద మార్చి 18, 2009

  @మార్తాండ: రాజకీయాల్ని కాస్త ప్రజల తరఫునుంచీ realistic perspective లో అర్థం చేసుకుంటే, వారికి కావలసింది “మాకేమిస్తారు?” అన్న తాత్కాలిక అవసరాల ఆపూర్తేతప్ప, “విధానాలలో మార్పుద్వారా ప్రజాస్వామ్యం సుస్తిరంగా,అర్థవంతంగా ఉంటుందా?” అనే సైద్ధాంతిక చర్చ కాదు.

  ఈ పరిస్థితిని cash చేసుకోవలనుకునే అన్ని ప్రధానపార్టీలూ తాత్కాలిక అవసరాలకై హామీలిస్తుంటే, లోక్ సత్తా (ఇప్పటికి చాలా వరకూ)కేవలం సైద్ధాంతిక చర్చలలో కాలయాపన చేస్తోంది. ఈ రెండు విధానాలకూ సమానమైన గౌరవం ఇస్తేతప్ప ప్రజలకు నిజమైన మేలు జరగదు.కాబట్టి,అవసరాలను address చేస్తూనే మార్పు గురించి ఆలోచించమని చెప్పాలి. ఈ రెంటిమధ్యా కావలసిన సమన్వయం అటు ప్రధాస్రవంతి పార్టీల్లోనూ ఇటు లోక్ సత్తాలోనూ లోపించింది. కాబట్టే అన్ని పార్టీలతో పాటూ లోక్ సత్తా డౌన్! డౌన్!!

 10. 10 బోనగిరి అప్పారావు 2:18 ఉద. వద్ద మార్చి 18, 2009

  కుర్రాడిలో మిగతావాళ్ళకంటే కాస్తో కూస్తో నిజాయితీ కనపడుతోంది.
  పైగా తనకోసం ఏమీ అడగడంలేదు.
  అందుకే ప్రజలు ఆదరిస్తున్నారు.

 11. 11 సుజాత 4:43 ఉద. వద్ద మార్చి 18, 2009

  మహేష్ కుమార్ గారూ,
  మీకు సంయమనం మరీ ఎక్కువండీ!

 12. 12 teresa 8:03 ఉద. వద్ద మార్చి 18, 2009

  @అబ్రకదబ్ర- 🙂 ఔను,వాళ్ళిద్దరూ మసాలా దోశ తింటం చూశాను కూడానూ..

 13. 13 krishna rao jallipalli 8:47 ఉద. వద్ద మార్చి 18, 2009

  ఐతే, వాళ్లేదో పొడిచేస్తారన్న ఆశల్లేకపోయినా, రౌడీలు, గూండాలకన్నా సినీ తారలు మెరుగు అన్న భావనే ఎక్కువ మందిలో ఉంది…..నిజ్జంగా నిజం. కాని ఈ రౌడీ, గూండా, ప్లాట్ఫారం నా కొడుకులకే కదా ఈ రోజుల్లో విలువా మరియు శిలా విగ్రహాలు.

 14. 14 చైతన్య 1:00 ఉద. వద్ద మార్చి 19, 2009

  మంత్రాలకి చింతకాయలు రాలతాయా… తారల్ని చూసి వోట్లు వేస్తారా!?… నటనకి, రాజకీయలకి ఎంత దగ్గరి సంబంధం ఉంటే మాత్రం!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: