పరీక్ష కాలం

భారతీయుల సివిక్ సెన్స్ తరాల క్రితమే గంగలో కలిసింది. ఈ పుణ్యభూమిలో ఎవడి గోల వాడిదే. పక్కోడి బాధ పట్టించుకునే తీరికా, ఓపికా, ఆసక్తీ, అవసరమూ ఎవరికీ ఉండవు. రైళ్లలోనూ బస్సుల్లోనూ బీడీలూ సిగరెట్లూ కాల్చేవాళ్లూ, లైబ్రరీలూ ఆసుపత్రుల్లో సెల్లులో చెవులు చిల్లులు పడేలా సొల్లు చెప్పేవాళ్లూ, సినిమా హాళ్లూ రైల్వే కౌంటర్లలో లైన్లో ఉండటం నామోషీ అనుకునేవాళ్లూ, ఇంట్లో చెత్త వీధుల్లోనూ వీలైతే గోడ మీదుగా వెనకింట్లోనూ దర్జాగా పారబోసేవాళ్లూ .. తమాషా ఏమిటంటే, తమదాకా వచ్చినప్పుడు పక్కవాడి తప్పులెంచేవాళ్లే కానీ తామూ ఆ తానులో ముక్కలమేనన్నది మర్చిపోతుంటారు వీళ్లు; ఎవడికి వాడు ‘వాడు చెయ్యగా లేంది నే చేస్తే తప్పా’ అని దబాయించేవాళ్లే.

* * * * * * * *

గుంటూరులో మా దగ్గరి బంధువులు చాలామంది ఉన్నారు. వాళ్లలో ఒక కుటుంబం నగర శివార్లలో సత్యనారాయణ పురం అనే కాలనీలో నివాసముంటుంది. లయోలా పబ్లిక్ స్కూల్ వెనుక ఉంటుందీ కాలనీ. కాలనీ చివర్లో చిన్న కొండ, దాని మీద శివాలయం, కొండ మొదట్లో చిన్న కోనేరు (లాంటి నీళ్ల గుంట), అందులో తిరుగాడే బాతులు …. నగర రణగొణ ధ్వనులు, కాలుష్యానికి దూరంగా చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండేదీ కాలనీ. ఐతే, ఇది పదేళ్ల క్రితం నేను చూసినప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి కాస్త భిన్నం. చూడటానికైతే ఈ కాలనీ అప్పటంత ఆహ్లాదకరంగానూ ఉంది కానీ ఈ మధ్య కాలనీ వాసులకో బెడద వచ్చి పడింది – శబ్ద కాలుష్యం.

వీళ్ల కాలనీకి పక్కనే మరో కాలనీ ఉంది. అందులో ఓ లూధరన్ చర్చ్ ఉంది. ఆంధ్ర దేశంలో అన్ని ప్రొటెస్టంట్ చర్చ్‌లలోనూ చేసినట్లే ఇక్కడ కూడా మైకుల ద్వారా ప్రభువు వాక్కుని అదిరిపోయే స్థాయిలో ఇష్టమున్నోళ్లకీ, లేనోళ్లకీ సరిసమానంగా చేరవేస్తుంటారు. మొదట్లో ఇది ఆదివారం ఉదయాలకు మాత్రమే పరిమితమయ్యేది కాబట్టి ఇరుగు పొరుగులు పట్టించుకునేవాళ్లు కారు. నాలుగేళ్లుగా ఇది నానాటి గొడవగా పరిణమించింది. గట్టిగా చెబుదామంటే ఇది సెక్యులరిజానికి సంబంధించిన వ్యవహారమాయె! అందుకని సత్యనారాయణపుర వాసులు లోలోపల గొణుక్కోటం తప్పించి మరేమీ చెయ్యలేక మిన్నకున్నారు.

రెండేళ్ల క్రితం వీళ్ల కాలనీ సమీపంలోనే ఓ సాయిబాబా మందిరం వెలసింది. హైటెక్ హంగులతో కొంగ్రొత్తగా కట్టబడ్డ ఈ మందిరం వచ్చీ రావటంతోనే లూధరన్ చర్చ్‌వారి బాకా మైకులు సిగ్గుపడేలా డాల్బీ సిస్టమ్‌లో సాయి భజనల ఉచిత ప్రసారాలు మొదలు పెట్టింది. ఆరు నెలలు తిరిగే సరికి చర్చ్ వారు కూడా డాల్బీకి అప్‌గ్రేడ్ ఐపోయారు. ఇక చూస్కోండి – ఆ పక్క ప్రభువు పాటలు, ఈ పక్క సాయి భజనలతో కాలనీ వాసులకి ఇహలోకంలోనే రోజూ స్వర్గ దర్శనం, టన్నులకొద్దీ పుణ్యం. వీళ్లిద్దరి హంగామా చూసి ‘పుణ్యమంతా ఆ రెండు గుళ్లే పంచేస్తే ఇహ మన పరువేం గాను?’ అనుకున్నారు స్థానిక శివాలయం వాళ్లు. వీళ్లదసలే ఆ ప్రాంతంలో ఓల్డెస్ట్ గుడి. నిన్నా మొన్నా వచ్చిన కుర్ర గుడులు పుణ్యం పంపకంలో మునిగి తేల్తుంటే తాము చేతులు ముడుచుకుని కూర్చోవటం శివాలయం వారికి చిన్నతనంగా అనిపించింది. ఇంకేముంది, వీళ్లూ రంగంలోకి దిగిపోయారు. అనతికాలంలోనే శివాలయానా డాల్బీ సిస్టమ్ వెలసింది. ఆ నాటి నుండీ సత్యనారాయణపురానికి మూడు దిక్కుల నుండీ ముట్టడి మొదలైంది (నాలుగో దిక్కున వందల ఎకరాల్లో విస్తరించిన లయోలా పబ్లిక్ స్కూల్ చైనా వాల్‌లా అడ్డుపడటంతో బ్రతికి పోయారు కానీ లేకపోతే అక్కడా ఏ మసీదో కట్టి అట్నుండీ అల్లా పిలుపులతో అదరగొట్టేసే వాళ్లు)

ఇక మా బంధువుల దగ్గరికొద్దాం. మిగతా కాలంలో ఎలాగో ఓపిక పట్టినా, మార్చి నెల మొదలయ్యేసరికి వీళ్ల సహనం ఆవిరైపోయింది. వాళ్ల అబ్బాయికి డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు మొదలయ్యాయి మరి. వాడికి చదువుకునే వీల్లేకుండా ఈ గుళ్లన్నీ వంతులేసుకుని మరీ మోత మోగిస్తున్నాయాయె. పోయినేడాదీ అంతకు ముందేడూ ‘ఇప్పుడు పోతే సెప్టెంబర్లో చూసుకోవచ్చులే’ అన్న ధీమాతో ఈ మైకుల గోల మధ్యలోనే ఎలాగోలా నెట్టుకొచ్చాడు వాడు. ఆఖరి సంవత్సరం ‘సెప్టెంబర్’ వెసులుబాటు లేక అసలే గాభరాగా ఉంటే పులి మీద పుట్రలా ఈ ఏడు శివాలయమోళ్లూ పోటీలోకి దూకారు. మిగిలిన గుళ్లతో పోలిస్తే శివాలయం వీళ్లింటికి బాగా దగ్గరగా ఉండటంతో ఈసారి వీడి పరిస్థితి ఏకంగా పొయ్యిలో పడ్డట్లయింది. వాడి టెన్షన్ చూడలేక ఇంట్లో పెద్దాళ్లంతా పదండి ముందుకు, పదండి తోసుకు అనుకుంటూ కట్ట కట్టుకుని శివాలయం దగ్గరికెళ్లి ‘పరీక్షలయ్యే దాకా మైక్ పెట్టకండి’ అని విన్నవించుకుంటే పూజారి గారు ‘హేఁవిటండీ మా మీద పడతారు? ఆ కిరస్తానీ వాడికి చెప్పే ధైర్యం లేదు గానీ. ముందు మైకు పెట్టింది వాడు. వాడిని తీసేమనండి మొదట ..’ అని కసురుకున్నారు.

ఎంత బ్రతిమిలాడినా ఆయన వరమియ్యకపోవటంతో ‘పోనీ అట్నుండే నరుక్కొద్దాం’ అనుకుని వీళ్లంతా అట్నుండటే పొలోమంటూ చర్చ్‌కెళ్లారు. సంగతి విని అక్కడున్న వాళ్లంతా వీళ్లమీద గఁయ్యిమని లేచారు, ‘సాయిబాబా గుడి, శివాలయం వాళ్లూ మైకులు పెట్టొచ్చు కానీ మేం పెట్ట కూడదా? దళితులమని చిన్న చూపా?’ అంటూ. సమస్య ఈ కోణంలోకి మళ్లుతుందని ఊహించని మా వాళ్లు కంగు తిని వాళ్లకో దండం పెట్టి వెనక్కొచ్చేశారు. వస్తూ వస్తూ సాయిబాబా గుడి దగ్గరా ఓ రాయేద్దామని ప్రయత్నిస్తే వీళ్ల మొర కాస్త ఆలకించి ‘మైకులు పూర్తిగా తీసెయ్యం కానీ వాల్యూమ్ బాగా తగ్గిస్తాం’ అని హామీ ఇచ్చారు. ఈ గుడ్డిలో మెల్ల హామీకే మా వాళ్లు ఉబ్బి తబ్బిబ్బౌతూ ఇంటికి తిరిగొస్తే, వచ్చీ రాగానే విన వచ్చిన వార్త ఆ కూస్తి ఆనందాన్నీ మింగేసింది. ఏముంది – ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడున్న వాటికిక పార్టీల భజంత్రీలూ తోడు. పరీక్షల కాలంలో పిల్లల గోడు వినేవాడొకడూ లేడు.

 

 

10 స్పందనలు to “పరీక్ష కాలం”


 1. 1 ramudu 7:33 సా. వద్ద మార్చి 3, 2009

  idi manaki paata samasye. gramallo, chinna pattanalalo idi yeppati nuncho ilaage nadusondi. nadumkatti deenni aapevaade ledu. oka vela yevarina chesina vaadi noru moose vallu yekkuva.

 2. 2 సుజాత 2:55 ఉద. వద్ద మార్చి 4, 2009

  ఇలాంటి చిన్న విషయాలను సీరియస్ గా తీసుకోవడం మానేసి అయిదేళ్లయింది. మా కాలనీ వెనకాలే రెండు మసీదులు. వాటి పక్కనే ఉన్న బస్తీ లో ఒక చిన్న మైసమ్మ గుడి. ప్రతి రోజూ పొద్దున్న నాలుగున్నరకు మసీదులో ప్రార్థన అనంతరం చిన్న పిల్లలకు మదర్సా నిర్వహించబడుతుంది. ఆరున్నర వరకూ! శుక్రవారం రోజంతా!

  మైసమ్మ గుడిలో మంగళవారమంతా పాటలు! ఎవరినీ ఏమీ అనడానికి లేదు.

 3. 3 చైతన్య క్రిష్ణ పాటూరు 11:52 ఉద. వద్ద మార్చి 4, 2009

  ఈ దేశంలో ప్రార్థనా స్థలాల దగ్గర ఉన్నంత గోల మార్కెట్ల దగ్గర కూడ ఉండదు. మా ఇంటి పక్కనే మసీదు ఉంది. ఎండాకాలం మేడ మీద పడుకున్నామంటే చాలు, పొద్దున్నే(ఆ సమయం నాకు అర్థరాత్రి క్రింద లెక్క) నమాజు పిలుపుకి ఉలిక్కిపడి లేవాల్సిందే. ఆదయ్యాక, కాసేపటికి టీవీలో మా తాతయ్య చూసే ప్రోగ్రాంలో చిన్నజియ్యర్ గారి కీచుగోంతుకి మా బిల్డింగ్ అంతా లేచి కూర్చోవాల్సిందే. ఎవరినేమంటాం. అవి తప్పించుకుని బెంగుళూరు వస్తే ఇక్కడ రూమ్ పక్కన చర్చి గొడవ. ఇటు వంటి వాటిని మీద అత్యున్నత న్యాయస్థానం ఆంక్షలు విధించిందని కూడా విన్నాను. కానీ ఎవరూ ఏమని అడగలేరు. మతంతో పని మరి. పిల్లి మెడలో గంట కట్టేదెవరు.

 4. 4 కన్నగాడు 12:40 సా. వద్ద మార్చి 4, 2009

  మీ అందరితో పొలిస్తే నా పరిస్థితి కొంచెం నయమే, వరంగల్ లో మేముండేది చర్చి వెనకాలే, మేము ఆ ఏరియాకి వెళ్లిన కొత్తలో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా గాల్లోనే దైవదర్శన కార్యక్రమం ఉండేది కాని ఆ తర్వాత ఎందువల్లో ఆ చర్చి పైన ఉన్న మైకు తీసేసి కేవలం చర్చిలో మాత్రమే వినబడేటట్లుగా మార్పులు చేసుకున్నారు.

 5. 5 sri 5:40 సా. వద్ద మార్చి 4, 2009

  నేను హిందువును, నేను క్రిస్టియన్ను, నెను ముస్లిమ్ను అన్న స్ఠితి అన్నిటి కంటె దౌర్భాగ్యపు స్ఠితి. ఇక్కడ, అహంకారము తప్ప దైవత్వపు ఆనవాలు మాచ్చుకు కూడ కనిపించదు. భగవంతుడు అంటే ఏమిటో పూర్తిగా అనుభవపూర్వకంగా తెలిసిన ఆందరు మహత్ములు “నేను అన్న అహంకారమును వదిలినప్పుడె సర్వ వ్యాపకమైన భగవంతుని స్థితిని అందుకొవడానికి ఆస్కరము వుంటుంది” అని నొక్కి చెప్పారు. మరి వీళ్ళు చెస్తున్నది ఏమిటొ వెరేగా మీకు చెప్పనక్కరలేధు.

 6. 6 bonagiri 5:40 ఉద. వద్ద మార్చి 5, 2009

  మీ కాలనీకి ఒక అసోసియేషన్ లేదా?
  ఉంటే దాని మెంబర్సంతా కలిసి ఒత్తిడి తీసుకువస్తే ఈ గోల ఆగదా?
  నేను గత పదేళ్ళుగా డిల్లిలో ఉండి ఈ మధ్యే బెంగుళూరు వచ్చాను.
  డిల్లీలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు చాలా ఏక్టివ్ గా పని చేస్తాయి.
  ప్రభుత్వం కూడా చాలా మద్దతు ఇస్తుంది.

  అసొసియేషన్ వల్ల కూడా కాకపోతే అన్ని మతాల వాళ్ళు కలిసి ఈ గోల ఆపితే కాని మేము ఏ ఆలయానికి రానే రాము అని గాంధి గిరి చెస్తే సరి.

 7. 7 అబ్రకదబ్ర 10:20 ఉద. వద్ద మార్చి 5, 2009

  @బోనగిరి:

  ముందుగా – అది మా కాలనీ కాదు 😉

  వాళ్లకి అసోసియేషన్లున్నాయో లేవో తెలీదు. ఉన్నా పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు. ఇటువంటి ప్రదేశాల్లో జనాలు ఎవరికి వారేగా ఉంటారు. తనదాకా వచ్చినప్పుడు కానీ దేన్నీ పట్టించుకోరు. ఎవరి రాజకీయాలు, ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి.

  @శ్రీ:

  మీరు చెప్పింది ఈ టపాకి ప్రత్యేకంగా సంబంధించింది కాదు కానీ బాగుంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: