అమెరికా వచ్చినవారు తప్పనిసరిగా చూడాలనుకునే ప్రదేశాలు కొన్నున్నాయి. నయాగరా, డిస్నీల్యాండ్, గ్రాండ్ కానియన్స్, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ వగైరా. నాకు మాత్రం హాలీవుడ్ లోని యూనివర్సల్ స్టుడియోస్ చూడాలని చిన్ననాటి నుండీ పెద్ద కోరిక. కేవలం యూనివర్సల్ స్టుడియోస్ చూడటానికే ఓ సారి అమెరికా వెళ్లాలని అప్పట్లోనే కఠోరంగా నిర్ణయించేసుకున్నా నేను. అయ్యదు నిర్ణయానికి కారకులు గొల్లపూడి మారుతీరావు గారు.
నా చిన్నప్పుడు ‘విజయచిత్ర’ అని ఒక సినిమా మాస పత్రిక వస్తుండేది – ‘చందమామ’ ప్రచురించే డాల్టన్ పబ్లికేషన్స్ వాళ్లది. 1950ల నుండి సుమారో నలభయ్యేళ్ల పాటు వెలువడి, 1996లోనో ఎప్పుడో మూత పడింది. ఇది తెలుగులో వచ్చే మిగతా సినీ వార, పక్ష, మాస పత్రికలకి భిన్నంగా ఉండేది. సినిమా ప్రారంభోత్సవాలు, షూటింగ్ విశేషాల వంటి సాధారణ విషయాలతో పాటు ప్రముఖ దర్శకుల, సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సినిమాల వివరాలు, సినిమా నిర్మాణంలో సాధకబాధకాలు మొదలైన వాటిని గురించి విజ్ఞానభరిత సమాచారం అందిస్తుండేదీ పత్రిక. విజయచిత్రలో రాండర్ గై వంటి రచయితలు హాలీవుడ్ క్లాసిక్స్ మీద ప్రచురించే వ్యాసాలు నాకు పదేళ్ల వయసులోనే హాలీవుడ్ సినిమాలపై ఆసక్తి కలిగించాయి (ఐతే, ఆయా క్లాసిక్స్ గురించి ఈ పుస్తకంలో చదవటమే కానీ, చూసే అవకాశాలు ఆ రోజుల్లో లేవు).
1984-87 మధ్య కాలంలో అనుకుంటా – సంవత్సరం సరిగా గుర్తు లేదు – గొల్లపూడి మారుతీరావు గారు అమెరికా పర్యటించి వచ్చారు. వచ్చాక, తన యాత్రా విశేషాలని ట్రావెలాగ్ రూపంలో ధారావాహికలా రెండు మూడు నెలలపాటు విజయచిత్రలో ప్రచురించారు. అందులో భాగంగా ఆయన రాసిన యూనివర్సల్ స్టుడియోస్ సందర్శనానుభావాలు నన్ను భలేగా ఆకర్షించాయి. థీమ్ పార్క్ అంటే ఏమిటో నాకు తెలీదప్పట్లో (నాకు తెలిసిందల్లా మా ఊరి నడిబొడ్డునున్న మునిసిపాలిటీ వారి పబ్లిక్ పార్కు మాత్రమే. పందిరాజములు తెగ హడావిడిగా తిరుగుతుండేవందులో). యూనివర్సల్ స్టుడియోస్ లో ప్రముఖ ఆకర్షణల గురించి ఆయన వర్ణిస్తూ రాసింది చదివితుంటే నాకు ఎప్పటికైనా అమెరికా వెళ్లి ఆ వింతలేవో చూసి తీరాలనిపించింది. తర్వాత కాలంలో ఆ ట్రావెలాగ్ ఎన్ని సార్లు చదివుంటానో. చదివిన ప్రతిసారీ నా నిర్ణయం మరింత బల పడేది.
ఆ కోరిక తీరటానికి పదిహేనేళ్లు పట్టింది. ఉద్యోగ రీత్యా అమెరికా వచ్చాక ఈ దేశంలో నేను చూసిన మొట్టమొదటి పర్యాటక స్థలం యూనివర్శల్ స్టుడియోస్. డ్రైవింగ్ సరిగా వచ్చీ రాక ముందే బే ఏరియా నుండి హాలీవుడ్ వరకూ – రమారమి ఆరొందల యాభై కిలో మీటర్లు – కారేసుకెళ్లి మరీ చూసొచ్చాను. మారుతీరావు గారు వర్ణించిన కొన్ని ఆకర్షణలు నేను చూసేనాటికి ఎత్తివేయబడి, వాటి స్థానంలో కొత్తవి చోటు చేసుకున్నాయి. స్టుడియో టూర్, స్పెషల్ ఎఫెక్ట్స్ స్టేజెస్ వంటి కొన్ని ‘నిత్యాకుపచ్చ’ ఆకర్షణలు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి. మొదటిసారిగా అవి చూస్తుంటే ఆయన వర్ణనే నా కళ్ల ముందు మెదిలింది. ఆ తర్వాత, గత పదేళ్లలో, మరో ఆరు సార్లు యూనివర్సల్ స్టుడియోస్ సందర్శించాను నేను (మారుతీరావు గారు నా పేరు చెప్పి యూనివర్సల్ వాళ్ల దగ్గర రిఫరల్ ఫీజు వసూలు చెయ్యొచ్చు). వెళ్లిన ప్రతిసారీ నాకు మొదటిసారి చూసినప్పటి అనుభూతే కలుగుతుంది.
మారుతీరావు గారి ‘ట్రావెలాగ్’ నన్ను మరో విధంగా కూడా ప్రభావితం చేసింది. అదే పర్యటనలో తను చూసిన న్యూయార్క్ బ్రాడ్వే నాటకాల గురించి ఆయన వివరంగా రాశారు. స్వయంగా నాటక రచయిత, ప్రయోక్త కావటంతో, మన నాటకాలను బ్రాడ్వే ప్రదర్శనలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యానాలు నన్ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘క్యాట్స్’ (Cats), ‘ఫాంటమ్ ఆఫ్ ది ఆప్రా’ (Phantom of the Opera) ప్రదర్శనల గురించీ, బ్రాడ్వే నాటకాల వైభవం గురించీ, సినిమాలకి తీసిపోని స్థాయిలో వాటిలో వాడే స్పెషల్ ఎఫెక్ట్స్ గురించీ ఆయన రాసింది చదివాక బ్రాడ్వే నాటకాలపై నాకూ అభిరుచి ఏర్పడింది. కాలక్రమంలో అది క్లాసిక్ ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి కలిగేందుకు దారితీసింది; పలు ఆంగ్ల నాటకాలకు, హాలీవుడ్ సినిమాలకు మూలాధారమైన కధలు, నవలలు చదివేలా ప్రోత్సహించింది. ఓ రకంగా, నేను నవతరంగంలో హాలీవుడ్ క్లాసిక్స్‌పై వ్యాసాలు రాయటం వెనుక రాండర్ గై, గొల్లపూడి వంటి వారి రచనల పరోక్ష ప్రభావం ఉంది.
* * * * * * * *
ఇదంతా ఇప్పుడు రాయటానికి నేపధ్యం – స్లమ్‌డాగ్ మిలియనైర్ సినిమాపై గొల్లపూడి మారుతీరావు గారు చేసిన వ్యాఖ్యలపై బ్లాగ్లోకంలో విమర్శలు చెలరేగటం. విమర్శించిన వాళ్లలో నేనూ ఉన్నాను. ఐతే, కొందరి విమర్శలు ఆయన సినీ పరిజ్ఞానాన్నే ప్రశ్నించే విధంగా ఉండటం ఆశ్చర్యకరం. కొన్నిసార్లు జగమెరిగిన బ్రాహ్మడికీ జంధ్యం తప్పదేమో! అందుకే – దశాబ్దాలుగా పలు దేశాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో సినిమాలు, నాటకాల గురించి ఆయన చాలా అధ్యయనం చేశారనేదానికి నేనెరిగిన ఉదాహరణలు, పనిలో పనిగా పాతికేళ్ల నాటి ఆయన యాత్రానుభవాలు నాపై వేసిన చెరగని ముద్రలూ అందరితోనూ పంచుకునే ప్రయత్నం ఇది.
గొల్లపూడి గారి పాండిత్యాన్ని గురించి చాలా మందికి తెలియకపోయినా,ఒక నటుడు రచయితగా వీరు అందరికీ పరిచయమే. అంతేకాక టీవీ లో “ప్రజావేదిక” అనే కార్యక్రమానికి వ్యాఖ్యాత/సంధానకర్థగా వ్యవహరిస్తూ సామాజిక విషయాలపై ఆయన చూపిన సంవేదన, జ్ఞానం ఆంధ్రప్రేక్షకులకు తెలిసిందే. ఇంత పాండిత్యమున్న ఈయన “అలా” రాశారు కాబట్టే దీనికి ఇంత స్పందన.
గొల్లపూడి మారుతీరావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం లో M.Sc Applied Mathematics చదువుకున్నారని ఎవరో చెప్పగా విన్నట్టు గుర్తు.
ఆయన (ఇంకో ఇద్దరితో కలిసి) వ్రాసిన “ఇడియట్” అనే గొలుసు కథ ని కొంత కొంత చదివాను.
Hope you don’t mind for this nitpicking … విజయచిత్ర మొదటి సంచిక 1966 లో వెలువడింది.
— శ్రీనివాస్
బాగుంది.
అంత పాత విషయాలు(1984-87) నాకైతే తెలీదు కానీ, నాకు తెలిసిన గొల్లపూడి కమెడియన్ కమ్ విలన్, ఆ తరువాత రచయిత అని తెలిసింది, ఆ తరువాత ఒకసారి అయన కాలమ్ వార్త దినపత్రికలో చదివింది మొదలు నేను దాదాపు ఇండియాలో ఉన్నన్నిరోజులు చదివాను. కౌముదిలో అయన వ్యాఖ్యలు మాత్రం విచారకరం, కనీసం సినిమా చూడకుండానే ఒక్క అన్నివేశం గూర్చి ‘విని’ ఆ సినిమా చస్తే చూడను, మరియు అది చెత్త సినిమా అని వ్యాఖ్యనించడం బాధాకరం.
ఇందాక రాయడం మరిచిపోయా, ఒక తెలుగువాడు(భారతీయుడు?) అన్నం తినకుండా వుంటాడేమో కాని సినిమా లేకుండా వుండలేడేమో? ఇద్దరు తెలుగు వాళ్లు కలిస్తే కుశలప్రశ్నల తరువాత వచ్చే మొదటి ప్రశ్న దాదాపుగా సినీరంగం గూర్చే, ఆ తరువాత దాదాపుగా రాజకీయం గురించే అని నా అభిప్రాయం, ఏమంటారు?
మారుతీరావు గారి ఆత్మకథ “అమ్మకడుపు చల్లగా” మీరంతా తప్పకుండా చదవాలి. ఆత్మకథ మరుతీరావు గారు తనదైన శైలిలో చాలా వైవిద్యంగా పొందుపరిచారు.
గొల్లపూడి మారుతీ రావు గారు ఈ మధ్య ‘ సాక్షి ‘ ఆదివారం సంచికలో మనస్సాక్షి అనే శీర్షిక క్రింద ఆయన గత స్మృతుల నుంచి ఎంచిన కొన్ని సంఘటనలు, ఇతర కళాకారుల ప్రదర్శనలు, అనుభవాలు వ్రాస్తున్నారు. శీర్షిక బాగుంది.
మీరన్న ‘ విజయచిత్ర ‘ నేనూ చదివే వాడిని. నిజం గానే చక్కని పత్రిక.
గొల్లపూడి గారు చలనచిత్ర విశ్లేషణలో ఎంతో అనుభవఙ్ఞులు. ముఖ్యంగా ఇతర దేశాల సినిమాల మీద చాలా అధ్యయనం చేశారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ కి మంచి రివ్యూలు వ్రాసి యున్నారు. సల్మాన్ రుష్డీ, తస్లీమా నస్రీన్ వ్రాసిన రచనలను చదవకుండానే ఎందరో ‘ మేధావులు ‘ చాలా వ్యాఖ్యలు చేసి మీడియాలో చర్చలు కూడా జరిపేశారు. స్లం డాగ్ మీద గొల్లపూడి గారు చేసిన వ్యాఖ్యలు అంత కృషి ఉన్న ఎవరైనా కలవర చెంది చేసే సాధారణమైన వ్యాఖ్యలే!
మీ ఙ్ఞాపకాలతో కూడిన వ్యాసం బాగుంది!
-వేదాంతం శ్రీపతి శర్మ
@అబ్రకదబ్రగారు & మిగతావారు: ఈ టపా ద్వారా ఎంతో సమాచారం లబించింది. ధన్యవాదాలు!
విజయచిత్ర – అప్పట్లో అందరి అభిమాన సిని పత్రిక. రావి కొండల రావు గారు దానికి ఎడిటర్ అనుకుంటా. KVR BHAKTA గారి ఫోటోలు చాలా బాగుండేవి . చందమామ లాగ విజయచిత్ర పాత సంచికలని కూడా NET లో పెడితే బావుంటుంది.
కృష్ణా రావు గారు,
మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. KVR భక్త ఫొటోల సంగతి! అవును కదా! మా ఇంట్లో కూడా చాలా రోజులు విజయచిత్ర పాత కాపీలు ఉండేవి. ప్రచురణ ఆగిపోయే దాకా వనిత, విజయచిత్ర, విజయ(విజయ బాపినీడు పత్రిక) ఇవన్నీ తెప్పించే వారు మా ఇంట్లో! విజయచిత్రలో నాగరాజా రావు అనే స్టాఫ్ ఫొటో గ్రాఫర్ కూడా ఉండేవారు. ఆయన కూడా మంచి ఫోటోలు తీసేవారు.
@కృష్ణారావు,సుజాత:
ఓ బుల్లి సవరణ – ఆయన కె.ఆర్.వి. భక్త, ‘కె.వి.ఆర్’ కాదు 🙂
@పరుచూరి శ్రీనివాస్:
తప్పు దిద్దినందుకు ధన్యవాదాలు.
@కృష్ణారావు:
నాకు తెలిసి, విజయచిత్ర ఎడిటర్ విశ్వం (విశ్వనాధ రెడ్డి – నాగిరెడ్డి గారబ్బాయి). రావికొండలరావు ఉప సంపాదకుడు కావచ్చు. పరుచూరి శ్రీనివాస్ గారు, తెలిస్తే చెప్పగలరు.
అబ్రకదబ్ర గారు: మీరు చెప్పింది కరక్టే. సంపాదకుడిగా “విశ్వం” అన్న పేరు మాత్రమే వుండేది, కానీ నడిపింది రావి కొండల్రావు గారు.
సుజాతగారు: ఆ పాత సినిమా సంచికలు మీరు జాగ్రత్త చేసుకుంటే ఈనాడు బోలెడు డబ్బులు చేసుకోగలిగేవారు 🙂
— శ్రీనివాస్
శ్రీనివాస్ గారు,
ఆ పాత సంచికల కాపీలు నా దగ్గర ఉండి ఉంటే ఎంత డబ్బిచ్చినా ఎవ్వరికీ ఒక్క కాపీ కూడా ఇచ్చేదాన్ని కాదు.
@సుజాత,శ్రీనివాస్:
ఆ సంచికలు – దాదాపు ముప్పయ్యేళ్లవీ – మా ఇంట్లో ఉన్నాయి 🙂 కొన్ని పాడైపోయాయి కానీ ఎక్కువ శాతం భద్రంగా ఉన్నాయి. వాటితో పాటే చాలా ‘వనిత’లు, కొన్ని ‘మహిళ’లు, యాభైల నాటి ‘కినిమా’ పత్రిక ప్రతులు వగైరాలతో ఓ బీరువాయే నిండిపోయింది. ఇంకా నలుపు-తెలుపు చిత్రాల కాలపు సినిమా పాటల పుస్తకాలు కూడా.
అబ్రకదబ్ర-గారు: నాకో మైల్ (sreeni at gmx dot de) పంపగలరా! 1950-54 మధ్యల్లో వచ్చిన 10-12 సినిమా పాటల పుస్తకాల కోసం వెతుకుతున్నాను.
— శ్రీనివాస్
అబ్రకదబ్ర,
“మీ ఇంట్లో” అంటే ఇండియాలోనే అనుకుంటున్నాను! మీరు ఇండియా ఎప్పుడొస్తున్నారో చెపితే మీకు రావి పాడు మొదట్లొనే ఘనస్వాగతం ఏర్పాటు చేస్తాను. ఆ పాత పుస్తకాల బీరువాని(బీరువా అక్కర్లేదు)నాకు దయ చేయిస్తే అంతకంటే భాగ్యం ఉండబోదు. కనీసం చదివి తిరిగి ఇచ్చెయ్యడానికైనా సరే! “మహిళ” లు కూడా ఉన్నాయా? ఎప్పుడో ఊహ తెలియని రోజుల్లో చూసిన జ్ఞ్ఞాపకం ! కినిమా సంగతి నాకసలు తెలీదు.
@అబ్రకదబ్ర: మొత్తానికి ఖజానా మీదగ్గరుందన్న మాట. సినిమాకు సంబంధించిన పత్రికల్లోని కంటెంట్‌ని నవతరంగం డిజిటైజ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఆ పత్రికల్ని నేను పొందొచ్చా!
మహేష్ కుమార్ గారు,
ముందు నేనడిగాను.
@మహేష్,సుజాత:
ముందు మీ ఇద్దర్లో ఎవరిక్కావాలో తేల్చుకోండి. లేకపోతే వేలం పెడదాం 😉
ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాను (ofcourse, షరా మామూలే .. తిరిగివ్వాలి – పువ్వుల్లో పెట్టక్కర్లేదు)
తిరిగివ్వాలి – పువ్వుల్లో పెట్టక్కర్లేద…. మంచి కండిషన్ పెట్టారు. లేకపోతె పువ్వులు దొరకడం లేదు (అదేదో సినిమాలో అన్నట్లు) అనే ప్రమాదం ఉంది మరి.
నేను గొల్లపూడి గారిని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది ఆ స్లం డాగ్ కాలమ్ తోనే
అప్పటి వరకు ఆయనవి ఏమీ చదవలేదు. ఇప్పుడు కూడా వారం వారం ఆ కాలమ్ మాత్రమె. ఆయన చెప్పింది ఒప్పుకున్నా, విభేదించినా , ఆయన ప్రభావం మాత్రం ప్రఘాడం గా ఉంటుంది ఏది చదివినా. ఆయనా ఇంటెన్సిటీ భలే నచ్చుతుంది నాకు. చరిత్ర (అంటే గత ౫౦ ఏళ్ళు అని చదవగలరు)లోంచి ఆయన చెప్పే ఉదాహరణలు భలే ఉంటాయి.
ఇక స్లం డాగ్ గురించి చెప్పింది కరెక్ట్ అనిపించింది నాకు.