సామాజిక న్యాయం

 

సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు మా ఒక్కరికే ఉంది, ఇతరులకి లేదు‘ – చిరంజీవి

* * * * * * * *

ప్రాధమిక విద్యాభ్యాసం చేసే రోజుల్లో – నాకింకా పదేళ్ల లోపే అప్పటికి – స్నేహితులందరం మా బడి వెనకున్న విశాలమైన తోటలో రేగు పళ్ల ‘పికింగ్’ కెళ్లేవాళ్లం. మాకో అలిఖిత నియమముండేది – పైరేట్స్ కోడ్ లాంటిదన్నమాట: ‘ఒక రేగు చెట్టుని ఎవడు మొదట చూస్తే ఆ చెట్టుపై ఆ పూటకి సర్వ హక్కులూ వాడివే, దాని మీద చెయ్యేసే హక్కు వేరెవరికీ లేదు’. కోడ్ అయితే వినటానికి వీజీగానే ఉంది కానీ ఫలానా చెట్టుని ఎవరు ముందు చూశారనే విషయమ్మీద గొడవలు జరిగేవి. సహజంగానే ఆ ఫలానా చెట్టు అక్కడున్న చెట్లన్నిట్లోకీ ఎక్కువ పండ్లతో నిండిందన్నమాట. ఈ గొడవ చొక్కాలు చించుకునే దాకా వెళ్లేది. అటువంటి పదుల కొద్దీ దొమ్మీలు, కొట్లాటల అనంతరం ఐదో తరగతి విజయవంతంగా పూర్తి చేసి హైస్కూల్ ప్రాంగణంలో అడుగు పెట్టాం మేమంతా – రేగు పళ్ల పికింగ్ హాబీ సహితంగా. వయసు పెరిగే కొద్దీ పంచుకోటంలో ఉన్న ఆనందం మెల్లిగా అందరికీ తెలిసింది. ఎప్పుడయిందో కానీ, ‘పైరేట్స్ కోడ్’ దానంతటదే రద్దైపోయింది. మార్క్స్, మావో ఎవరో తెలీకుండానే అందరమూ అసలు సిసలు కమ్యూనిస్టులుగా మారిపోయాం. మొదటగా చూసిందెవరైనా, పండ్లున్న చెట్టు అందరిదీ అనే భావన అందర్లోనూ ఏర్పడింది. హైస్కూలు రోజులైపోయే సరికి మా పికింగ్ సెషన్స్ కొట్లాటల్లేకుండా అత్యంత సుహృద్భావ వాతావరణంలో ముగుస్తుండేవి.

* * * * * * * *

ఐదేళ్లకో సారి మొక్కుబడిగా ఓట్లేయటం తప్పించి రాజకీయ నాయకులని, వాళ్ల మాటల్నీ, చేతల్నీ పట్టించుకోవటం అధిక శాతం ఓటర్లెప్పుడో మానేశారు. ఈ నాయకుల వల్ల తమకు ఒరిగేదేమీ లేదని రాష్ట్రంలో అధికుల భావన. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించి వెండితెర వేల్పు చిరంజీవి రాజకీయారంగేట్రం చెయ్యటంతో ఎన్నో ముఖాలు ఆయన కేసి ఆశగా చూశాయి. తెరపై ధీర గంభీరమైన పాత్రలెన్నో ధరించి ప్రతినాయకుల పీచమణిచిన చిరంజీవి రాజకీయాల్లో కనుమరుగైపోతున్న గాంభీర్యాన్ని, లుప్తమౌతున్న విలువలను తిరిగి పాదుకొలుపుతాడని ఆశించిన వాళ్లూ ఉన్నారు. ఐతే పార్టీ పెట్టి ఇన్నాళ్లైనా ఓ విధానమంటూ లేకపోవటం, ఓ వంక పొత్తుల కోసం ఆరాటం, మరో వంక ఒంటరి పోరాటంపై మేకపోతు గాంభీర్యం, ఓ వైపు మార్పు జపం, మరో వైపు కుటుంబ పాలన దిశగా పయనం, ఒక వైపు శుద్ధ రాజకీయాలపై వాగాడంబరం, మరొక వైపు పక్క పార్టీల నుండి ఫిరాయింపుదార్లకు గాలం .. ఇవన్నీ చూస్తూ ఆశలు ఆవిరైపోయినోళ్లెందరో. ఇదంతా ఒకెత్తైతే, కొద్ది కాలంగా చిరంజీవిలోని మరో ఊహించని కోణమూ బయట పడుతుంది.

రాష్ట్ర రాజకీయాల్లో విదూషకులు ఇప్పటికే లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. వీళ్ల పుణ్యాన కొన్నేళ్లుగా రాజకీయాలంటే సాధారణ ప్రజలకి నవ్వులాటైపోయింది. సినిమాల్లో హాస్య పాత్రలు పెద్దగా పోషించని లోటు ఇప్పుడు తీర్చుకోవాలనుకున్నారో ఏమో, కొత్తగా చిరంజీవి కూడా హాస్య బాణాలు సంధించటం మొదలు పెట్టారు. ఆయన తూణీరం నుండి వెలువడిన తాజా హాస్య గుళిక: ‘సామాజిక న్యాయం అనే మాటకి మేమే గుత్త హక్కుదారులం’. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పదాన్ని తిరుపతి సభ ద్వారా తామే చెలామణిలోకి తెచ్చాం కాబట్టి దాన్ని ఇతరులెవరూ వాడటానికి వీల్లేదన్నది ఆయన వాదన! దానిపై తాము హోల్‌సేల్ హక్కులు కొనుక్కున్నంతనే సామాజిక న్యాయమేదో ఉన్న పళాన ఊడి పీడిత తాడిత జనాల నెత్తి మీద పడిపోతుందనే వెర్రిబాగుల వాళ్లెవరో మరి. ఇకనుండీ నాయకుల నోట వెలువడే మాటలకీ కాపీ హక్కులు, పేటెంట్లు తీసుకునే పద్ధతి అమల్లోకొస్తుందేమో.

సినిమా వాళ్లకొక చిత్రమైన అలవాటుంది: ఓ పక్క పరాయి భాషలో హిట్టయిన సినిమాలని చిత్తమొచ్చినట్లు కాపీ కొట్టేసి సొమ్ములు చేసుకుంటూ, మరో పక్క తమ సినిమాలు పైరసీ భూతం దెబ్బకి నష్టపోతున్నాయని గగ్గోలు పెట్టటం. ప్రేక్షకులు దద్దమ్మలని వీళ్ల నమ్మకం. చిరంజీవి ధోరణి సగటు సినిమా జీవి మూసకి భిన్నంగా లేదు. ఉత్తరాదిన బహుజన సమాజ్ పార్టీ పుణ్యాన ప్రసిద్ధి పొందిన నినాదాన్ని తెలుగులోకి తర్జుమా చేసేసి తనకలవాటైన సినీ బాణీలో ‘ఆంధ్రా-సీడెడ్-నైజాం, అన్ని ఏరియాలూ మావే’ అనటం చూస్తే వచ్చేది నవ్వు కాక మరేమిటి? లెక్క ప్రకారం దీనిపై దేశ వ్యాప్త హక్కులు బిఎస్పీ దగ్గరుండాలి కదా. రేపో మాపో ఈ సంగతి మాయావతి చెవిన పడి ఆవిడ అభ్యంతర పెడితే ఈయన సామాజిక న్యాయ జపం మానుకుంటాడా?

చిరంజీవి ధోరణి చిన్నపిల్లల తరహాలో ఉంది. ఒక్క చిరంజీవనేమిటి, నేటి రాజకీయ నాయకులంతా ఇంతే. పిల్లలైతే ఏదో నాటికి ఎదుగుతారు. మరి ఈ పొలిటికల్ పిల్లులో?

10 స్పందనలు to “సామాజిక న్యాయం”


 1. 1 Vamsi M Maganti 5:50 సా. వద్ద ఫిబ్రవరి 25, 2009

  బాగున్నది…:)…

  బానిసల నెత్తురు విశ్వాసమను జ్వాలచే ఉడికింపుము,బలహీనమయిన పిచ్చుకను గరుత్మంతుడితో పోరాడించుము అని బెజవాడ గోపాల రెడ్డిగారనుకుంటా, ఏదో రచనలో అంటారు…మరి ప్రస్తుత పరిస్థితుల్లో, రాజకీయాల్లో – నెత్తురేమిటో, విశ్వాసం ఏమిటో, జ్వాలలెక్కడివో, ఎవడు వెలిగిస్తాడో, పిచ్చుకలెవరో, గరుత్మంతుడెవరో, ఎలా పోరాడాలో మీకు తెలిసిన ఎడల అందరితో పంచుకోమని మనవి…

 2. 2 krishna 8:29 సా. వద్ద ఫిబ్రవరి 25, 2009

  “పిల్లలైతే ఏదో నాటికి ఎదుగుతారు. మరి ఈ పొలిటికల్ పిల్లులో?” రోజు రోజు కూ దిగజారతారు. కొందరు రాజకీయలలో చేరిన కొద్ది రోజులకు, మరికొందరు చేరి చేరక ముందే, అంతే తేడా! ప్రతోడూ, తాము ఒక్కళ్లమే, ప్రతివ్రతలం, అని చేప్పుకొనే వాళ్లె.

 3. 3 కె.మహేష్ కుమార్ 10:18 సా. వద్ద ఫిబ్రవరి 25, 2009

  చిరంజివి రాజకీయరంగ ప్రవేశం కొన్ని ఆశల్ని చిగురింపజేసినా, విధానాల లేమి,ఆలొచనల్లో లేనిస్పష్టతా తనను మిగతాపార్టీలకన్నా వెనకనే ఉంచేసాయి. దీన్నెప్పుడు అర్థం చేసుకుంటాడో తెలీదు. కాబట్టి ఈ ఎన్నికల్లో నామ మాత్రపు సీట్లు గెలిచి అటు సినీరంగానికీ ఇటు రాజకీయ రంగానికీ మధ్య రెంటికీ చెడ్డ రేవడిగా మారటం ఖాయం.

 4. 4 rayraj 11:05 సా. వద్ద ఫిబ్రవరి 25, 2009

  “ఓ పక్క పరాయి భాషలో హిట్టయిన సినిమాలని చిత్తమొచ్చినట్లు కాపీ కొట్టేసి సొమ్ములు చేసుకుంటూ, మరో పక్క తమ సినిమాలు పైరసీ భూతం దెబ్బకి నష్టపోతున్నాయని గగ్గోలు పెట్టటం. ప్రేక్షకులు దద్దమ్మలని వీళ్ల నమ్మకం.” – “బహు జన” ప్రియంగా చెప్పారండి -కరెస్టు.

 5. 5 రవి 11:36 సా. వద్ద ఫిబ్రవరి 25, 2009

  చిరంజీవి కి తను ఎంచుకునే సినిమాల మీదే (ఈ మధ్య వచ్చిన కొన్ని చెత్త సినిమాల విషయంలో) ఓ స్పష్టత లేదు. రక్తదానం టాగ్ లైన్ ఒక్కటుంది చెప్పుకోడానికి. రాజకీయాలు మొత్తం కామెడీగా తయారవడంతో జనాలు ఆశగా చూస్తున్నారు తప్పితే, చిరంజీవి ఏదో రకంగా ఉద్ధరిస్తాడని ఆశించటం వెర్రితనమే అవుతుంది.

 6. 6 సుజాత 2:47 ఉద. వద్ద ఫిబ్రవరి 26, 2009

  చిరంజీవి మీద ఎవరికీ ఆశల్లేవండీ!(బహుశా చిరంజీవి కి కూడా)! మాటల్లో పేలవత్వం, భావాల్లో అస్పష్టత, అరవింద్ పక్కనుంటే గానీ నిర్ణయాలుతీసుకోలేకపోవడం,……….ఆయన ఏం మాట్లాడితే ఏమిలెండి? సరదాగా కాసిన్ని రోజులు కామెడీ ఎంజాయ్ చెయ్యండి.

 7. 7 సిరిసిరిమువ్వ 4:48 ఉద. వద్ద ఫిబ్రవరి 26, 2009

  హ్హ..హ్హ..హ్హ. చిరంజీవిని వినటం కన్నా పవన్ కల్యాణ్‌ని వినటం కాస్తలో కాస్త బాగుంది.

 8. 8 bhavani 8:04 ఉద. వద్ద ఫిబ్రవరి 26, 2009

  చిరంజీవి సినిమాల నుండి తప్పించుకోగలిగానని సంతోషించే లోపలే అతను పాత్రలో ‘జీవించే’ సినిమా చూడాల్సి వస్తుందేమోనని భయపడి చస్తున్నాను. ఇక్కడ చెప్పినట్లు అంత భాగ్యమూ కలగకపోతే ఇప్పటికే అలవాటయిపోయిన షాక్ లతో ఏదో గడిపేస్తాను .

 9. 9 దూర్వాసుల పద్మనాభం 12:02 సా. వద్ద ఫిబ్రవరి 26, 2009

  “సెక్యులరిజం” “సామాజిక న్యాయం”
  వీటి అర్ధాలు అవసరాన్ని బట్టి మారుతాయి. ఇంతకీ సామాజిక న్యాయం అని రాత్రి, పగలు గగ్గోలు పెడుతున్న వాళ్ళకేనా తెలుసా అంటే ఏమిటో?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: