స్లామ్‌డాగ్

మొత్తానికి భారతీయ సినీ ప్రియుల దశాబ్దాల కల నెరవేరింది – స్లమ్‌డాగ్ మిలియనైర్ చిత్రానికి గానూ ఇద్దరు భారతీయులకి మూడు ఆస్కార్ అవార్డుల రూపంలో. ఎనభయ్యో దశకం మొదట్లో ‘గాంధీ’కి గానూ భానూ అత్తయ, తొంభైల మొదట్లో సినీ రంగంలో జీవిత కాల సేవలకి గానూ సత్యజిత్ రే – వీళ్లిద్దరినీ తీసేస్తే నూరేళ్ల ఘన చరిత్ర గల మన సినీ పరిశ్రమలో ఆస్కార్ ప్రతిమని ఒడిసి పట్టిన వాళ్లు మరొక లేరు – నిన్నటి దాకా. ఇరాన్, స్వీడన్ వంటి ఉన్నాయా లేవా అనిపించే సినీ పరిశ్రమలతో పోలిస్తే ఏటా వందలాది సినిమాలు నిర్మించే మన చలన చిత్ర రంగం ఆస్కార్ల విషయంలో ఎంతో వెనకబడుంది.’ఆఁ, బోడి ఆస్కార్ ఎవడిక్కావాలి .. అది రానంత మాత్రాన మన సినిమాల గొప్పదనం తక్కువైనట్లా’, ‘అసలా అవార్డులు మన సినిమాల కోసం కాదు, అవొస్తే ఎంత రాకపోతే ఎంత’ తరహా వ్యాఖ్యానాలు, వెటకారాలు ఎన్నున్నా, ఆస్కార్ అందుకోటంలో ఉన్న మజాయే వేరు. పూర్తిగా మనవాళ్లే తీసిన సినిమాకి ఈ స్థాయిలో గుర్తింపొస్తే మరింత బాగుండేది. ఏది ఏమైనా ఇద్దరు భారతీయుల ప్రతిభకి ప్రపంచవ్యాప్త గుర్తింపు. అందరమూ కాసేపు అభిప్రాయ భేదాలు అవతల పెట్టి ‘జై హో’ అంటే పోయేదేమీ లేదు.

ఇంత ఘనత సాధించిన ఈ సినిమా గురించీ, దాని వెనకున్న వివాదాల గురించీ కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు. అయితే చాలామందికి తెలియని విషయం – విడుదల కోసం ఈ సినిమా పడ్డ పురిటి నొప్పులు. నిర్మాణానికి పెట్టుబడి పెట్టిన ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ వారి ‘వార్నర్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్’ విభాగం సినిమా పూర్తయే నాటికి మూతబడటంతో, ధియేటర్లకి పంపిణీ చేసేవారు కరువై స్లమ్‌డాగ్ మిలియనైర్ ఎకాఎకీ డివిడి రూపంలో విడుదలవటానికి సిద్ధమైపోయింది. చివరి నిమిషంలో మరో ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ట్వెంటీయెత్ సించరీ ఫాక్స్ వారి ‘ఫాక్స్ సెర్చ్ లైట్’ విభాగం ఆదుకోవటంతో బ్రతుకు జీవుడా అంటూ బయట పడి విడుదలయింది. అదే జరగక పోతే ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇందరి నోళ్లలో నానేదీ కాదు, ఆస్కార్లు కొల్లగొట్టేదీ కాదు (మెయిన్ స్ట్రీమ్ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు పొందటానికి అమెరికాలో ధియేటర్లలో తప్పకుండా విడుదలవాలనే నియమముంది)

ఇక, రెండు ఆస్కార్లతో అందరినీ మురిపించిన అల్లా రఖా రహమాన్‌కి ఆ రెండో ప్రతిమ దక్కటం వెనక కొద్దిపాటి అదృష్టముంది. అవార్డు సాధించిన ‘జై హో’ పాటని అనుకోకుండా ఆఖరి నిమిషంలో సినిమాలో చేర్చటం ఒక రకమైన అదృష్టమైతే (ఎంత హడావిడిగా చేర్చారంటే, ఆ పాటకి నృత్య రీతులు సమకూర్చిన లాంగినెస్ పేరు ఎండ్ క్రెడిట్స్‌లో చేర్చటం కూడా మర్చిపోయారు. ఆస్కార్ వేదికపై ఆ పొరపాటుకి క్షమాపణలు చెప్పటం ద్వారా దర్శకుడు డానీ బోయెల్ ఆ తప్పు దిద్దుకున్నాడు), అసలా పాట సుభాష్ ఘాయ్ ‘యువరాజ్’ సినిమా కోసం రికార్డు చేసినా, ఘాయ్ తన సినిమాలో ఆ పాట వద్దనుకోవటం, దాన్ని ఈ సినిమాలో వాడుకునేందుకు అనుమతివ్వటం మరో రకమైన అదృష్టం. మొత్తమ్మీద – ప్రతిభ ఒక్కటే సరిపోదు, ఎన్నో విషయాలు కలిసి రావాలి అనేదానికి ఇదో మంచి ఉదాహరణ (‘జై హో’ లేకపోయినా ‘ఓ సాయా’ కి అతనికే అవార్డొచ్చుండేది బహుశా). ఒకసారి నామినేషన్లంటూ వచ్చాక – ఆ రెండు విభాగాల్లోనూ తానే విజేతనని రహమాన్ ఎనలేని ధీమాతో ఉన్నాడనుకుంటాను. అవార్డులందుకున్న క్షణంలో ఇతరుల మాదిరిగా ఉద్విగ్నతకి లోనవకపోవటం, తొణక్కుండా మాట్లాడటం ఆ విషయాన్ని స్పష్టం చేసింది.

అవార్డు తధ్యం అనుకున్న కొన్ని విభాగాల్లోనే కాక, సినిమాటోగ్రఫీ వంటి ఊహించని విభాగాల్లోనూ ఈ సినిమా అవార్డు సాధించి సినీ పండితులని విస్మయానికి గురి చేసింది. మొత్తమ్మీద నామినేషన్లు పొందిన తొమ్మిది విభాగాల్లో ఒకే ఒకటి (సౌండ్ ఎడిటింగ్) చేజార్చుకుని తక్కిన ఎనిమిది విభాగాల్లోనూ పోటీదార్లను తోసి రాజని గతంలో ఇలా ఎనిమిది అవార్డులు కొల్లగొట్టిన ‘గాంధీ’, ‘గాన్ విత్ ది విండ్’, ‘మై ఫెయిర్ లేడీ’, ‘ఆన్ ది వాటర్ ఫ్రంట్’, ‘కాబరే’ (Cabaret), ‘అమడేయస్’ (Amadaus) వంటి కళాఖండాల సరసన సగర్వంగా చేరింది. ఎనభై ఒక్క సంవత్సరాల అకాడెమీ అవార్డుల చరిత్రలో ఇంతకన్నా ఎక్కువ అవార్డులు పొందిన చిత్రాలు మరో ఏడు మాత్రమే ఉన్నాయి. అవి – తొమ్మిది అవార్దులతో ‘జీజీ’ (Gigi), ‘ది లాస్ట్ ఎంపరర్’, ‘ది ఇంగ్లిష్ పేషెంట్’; పది అవార్డులతో ‘వెస్ట్ సైడ్ స్టోరీ’; పదకొండు అవార్డులతో అగ్ర పీఠాన ‘బెన్-హర్’, ‘టైటానిక్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్: రిటర్న్ ఆఫ్ ది కింగ్’.

చివరగా – ఆ మధ్య ‘కౌముది’లో గొల్లపూడి మారుతీరావు గారు ఈ సినిమాలో బుల్లి జమాలుడు ఒకానొక గుంటలోకి దూకే దృశ్యాన్ని గురించి ఎవరో చెప్పగా విని చీదరించుకుని ఈ సినిమా చూడనే చూడనని ఒట్టేసుకున్నానని రాశారు. ఒకవేళ ఆయన గనక ఒట్టు తీసి గట్టు మీద పెట్టాలనుకుని, అందుకు అనువైన సాకుల కోసం వెతుకుతుంటే నే రాసే తదుపరి వాక్యం ఉపయోగ పడొచ్చు. ఆ గుంటడు దూకిన గుంటలోని ఫలానా రొచ్చు పీనట్ బటర్ మరియు చాకొలెట్ మిశ్రమంతో తయారు చేయబడినది. అందువల్ల – అందులోకి దూకటానికి బాల జమాల పాత్రధారి ఏ మాత్రం మొహమాట పడి ఉండడనిన్నీ, దర్శకుడు టేకుల మీద టేకులు తీసినా ఆనందంగానే దూకి ఉండేవాడనిన్నీ, ఈ విషయం తెలీకనే గొల్లపూడి వారు ఈ సినిమాపై అలిగారనిన్నీ నేను గంట గణగణ బజాయించి మరీ చెప్పగలను.

22 స్పందనలు to “స్లామ్‌డాగ్”


 1. 1 Pradeep 4:40 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  ముందుగా రెహ్మాన్ కు శుభాకాంక్షలు.
  ఇక గొల్లపూడీ గారి గురించి మీరు రాసిన పంక్తులపై,
  సినిమాలలో చూపించేవి మేకప్పులేనని,
  గ్లిజరిన్ తో వచ్చే కన్నీళ్ళనీ ,
  (మహానటి సావిత్రి గారికి క్షమాపణలు)
  హీరో మానవాతీతుడు కాడనీ,
  గ్రాఫిక్సు నిజం కాదనీ అందరికీ తెలుసు.
  మరి అవి చూసి ఎందుకు ఏడుస్తాం? ఎందుకు ఆశ్చర్యాతిశయంతో కేరింతలు పెడతాం?
  అక్కడ అలా చూపించనవసరం లేకుండా
  ఏ మురికి గుంటలోనో పడి వచ్చినట్టు చూపించినా కధకు భంగం కలిగేది కాదు
  కొసమెరుపు: ఆ సన్నివేశం అసలు మూలమైన నవలలో లేదట!!!

 2. 2 అబ్రకదబ్ర 5:04 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  @ప్రదీప్:

  >> “ఇక గొల్లపూడీ గారి గురించి మీరు రాసిన పంక్తులపై”

  పొరబడ్డారు. నా ‘tone’ మీరు గ్రహించలేదు.

  >> “అక్కడ అలా చూపించనవసరం లేకుండా ఏ మురికి గుంటలోనో పడి వచ్చినట్టు చూపించినా కధకు భంగం కలిగేది కాదు”

  నిజమే. ఆ దృశ్యం నాకూ నచ్చలేదు. అదే మాట రెండు వారాల క్రితం మురికివాడ మిలియనైర్ లో కూడా రాశాను.

  > “ఆ సన్నివేశం అసలు మూలమైన నవలలో లేదట”

  అదొక్కటే కాదు, పుస్తకానికీ సినిమాకీ చాలా తేడాలున్నాయి. సినిమా ఇంకా నయం. ‘Q&A’ పుస్తకంలోని కొన్ని సన్నివేశాలు చదివితే మీకు మరింత జుగుప్స కలుగుతుంది.

 3. 3 Malakpet Rowdy 5:35 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  Very Informative post .. never bothered to read all this stuff before, Thanks!

 4. 4 జీడిపప్పు 5:37 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  ఈ సినిమాకు మహా అయితే 3-4 అవార్డులు రావాలి, కానీ 8 రావడానికి కారణాలు మనకు తెలిసిందే… who cares.. ARR got two. Way to go us.

 5. 5 cbrao 5:49 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  Slumdog కాస్తా Grand Slam dog అయ్యింది. దాన్ని స్ఫురిస్తూ మీ టపాకి స్లామ్‌డాగ్ అని పేరు పెట్టడం బాగుంది. మీకు వీలున్నప్పుడు ఆస్కార్ పురస్కారాలు కధా కమామిషూ గురించి ఒక చిన్న వ్యాసం రాస్తే బాగుండగలదు.

 6. 6 చిలమకూరు విజయమోహన్ 5:49 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  ముందుగా నేను కూడా జయహో చెప్తా రెహమాన్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చినందుకు.పూర్తిగా మనవాళ్లే తీసిన సినిమాకి ఈ స్థాయిలో గుర్తింపొస్తే మరింత బాగుండేది.అవును మరి .ఇన్నేళ్ళ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ వచ్చిందని చంకలు గుద్దుకుంటున్నామే ,ఇదే సినిమాను పూర్తిగా మనవాళ్ళే తీసివుండివుంటే అసలు ఆస్కార్ నామినేషను ఎన్నికయ్యేదా.చిత్రకథాంశాన్ని బట్టి ఆలోచిస్తే మనవాళ్ళు నామినేషన్ కు ఎంపికచేసేవారా ? ఒకవేళ చేసినా అక్కడ ఇన్నిఅవార్డులకు నోచుకొనేదా గుండెలమీద చేయివేసుకుని చెప్పండి ఎవరైనా .ఇన్నేళ్ళ భారతీయసినిమా చరిత్రలో ఇంతకన్నా గొప్పసినిమాలు రాలేదా ,ఇంతకన్నా మంచి సంగీతం రాలేదా . అలాగని రెహమాన్ గారి సంగీతాన్ని తక్కువ చేసి మాట్లాడడంకానీ, సినిమా గురించి తక్కువచేసి మాట్లాడడంకాదు.ఒక ఉత్పత్తి ని తయారుచేయడంకన్నా దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలోనే ఉంది.ఇప్పుడు ఆస్కార్ అవార్డుల విషయంలోనే కాదు మన నంది అవార్డుల విషయంలోనే ఆశ్రితపక్షపాతము,లాబీయింగ్ జరుగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి అందుకు ఆస్కార్ జ్యూరీ అతీతమైందేమీ కాదు ఇప్పటికే వినిపించాయి స్లమ్ డాగ్ మిలియనీర్ కు అవార్డులు రాకుండాచేయాలని చూసారని.

 7. 7 కె.మహేష్ కుమార్ 5:50 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  పేదరికాన్నీ,ఆకలినీ,చెత్తాచెదారాన్నీ చూసి జుగుప్స “కలగజేసుకోవడం” మన మధ్యతరగతి ప్రజలకున్న ఒకానొక అలవాట్లలో మొదటిది.మన భద్రలోకాల్లో మనముండాలనుకుంటామేగానీ, ఇక్కడ జమాల్ కు అమితాబ్ పైనున్న పిచ్చి అభిమానాన్ని అభినందించం.చిరంజీవి అభిమానంతో ఆత్మహత్యలు చేసుకునే అబిమానుల్ని చూసిన మనం, జమాల్ మలంలో దూకితే జుగుప్స కలిగించేసుకుంటాం…ఎందుకో!

 8. 8 bhavani 6:03 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  నిన్న అవార్డ్స్ accept చేస్తూ ఈ విషయాలు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యమనిపించింది.

 9. 9 Pradeep 6:08 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  నేను ఆ పుస్తకం చదవలేదండి. చదివే ప్రయత్నం చేస్తాను.
  నిజమే సుమా… నేను మీ టోన్ ను పూర్తిగా గ్రహించలేదు. గొల్లపూడివారికి మంచి కారణమే అందించారు.

  ఆ దృశ్యాన్ని చూస్తే అసహ్యం కలిగింది కానీ ఆ బాలుని అభిమానాన్ని పూర్తిగా ఎలివేట్ చెయ్యలేదని నా అభిప్రాయం

  ఇక, ఇక్కడ అసంధర్భం అనుకోపోతే అప్పుడెప్పుడో మీరు నా బ్లాగులో రాసిన కామెంటుపై ఒక పోష్టు రాసాను. మీరు అది చదివి ఉండకపోతే ఒకసారి చదివి మీ అభిప్రాయం తెలియజేయగలరు http://pradeepblog.miriyala.in/2009/02/blog-post.html

  @కత్తి గారు, మీరు చిరంజీవిమీద అభిమానంతో ఆత్మహత్య చేసుకున్నవాళ్ళను అభిమానిస్తారేమో… వారి అభిమానానికి హద్దులు లేవని పొగుడుతారేమో… కానీ నా దృష్టిలో “చావటానికి కారణం వెతుక్కునే పిరికివాళ్ళు”. నాకు వారిని చూసినా కలిగేది జుగుప్సే సానుభూతి కాదు.

 10. 10 కె.మహేష్ కుమార్ 6:14 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  @ప్రదీప్: ఆత్మహత్యకన్నా జమాల్ చేసింది జుగుప్సాకరమైన చర్య కాదని నా ఉద్దేశం.

 11. 11 Pradeep 6:38 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  @కత్తి మహేష్ గారు, ఆత్మహత్య అంత జుగుప్సాకరం కాకపోవచ్చు. కానీ జుగుప్సాకరమైనదే కదా.
  ఇక్కడ పెళ్ళీ పుస్తకం సినిమాలో నుంచి ఒక డైలాగు గుర్తుకొస్తోంది. ” మనసులో అభిమానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చూపించుకుంటామా? “.
  అభిమానానికి హద్దులు లేకపోవచ్చు. అది చూపించే విధానానికి …………

 12. 12 అబ్రకదబ్ర 6:39 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  @ఉమాశంకర్:

  >> “ఇదే సినిమాను పూర్తిగా మనవాళ్ళే తీసివుండివుంటే అసలు ఆస్కార్ నామినేషను ఎన్నికయ్యేదా”

  ఇదే ప్రశ్న మీరు మరోచోట కూడా లేవనెత్తారు. అక్కడా నేను క్రింది సమాధానం లాంటిదే రాశాను.

  ‘మనవాళ్లు తియ్యటం’ అనేదానికి మీ అర్ధం ఏమిటి? దీనికి దర్శకుడు డానీ బోయెల్ కాకుండా ఏ మణిరత్నం లాంటి భారతీయుడో ఉన్నా, సినిమా ఇలాగే ఉన్నట్లైతే అవార్డులు తప్పకుండా వచ్చుండేవని నా నమ్మకం. మెయిన్ స్ట్రీమ్ అమెరికన్ సినిమాగా విడుదలైన ఏ సినిమానైనా అవార్డులకి ఆస్కారం ఉన్నదని నమ్మకం కలిగితే ఆయా నిర్మాణ సంస్థలే దర్శకుడు, తారాగణం ఎవరనే వివక్ష లేకుండా ప్రచారం చేసుకుని అవార్డుల వాకిటిదాకా తీసుకెళతాయి. మీకా విషయంలో సందేహం అనవసరం. అవార్డుల వల్ల కలిగే వ్యాపార లాభం, నిర్మాణ సంస్థకొచ్చే పేరు ప్రతిస్టలు, పెరిగే పరపతి, ఇతరేతర కార్పొరేట్ లెక్కలు దీనికి కారణం.

  సరే, ‘ప్రచారం’ అన్న మాట చూసి చెత్త సరుకుని కూడా ప్రచారం హోరెత్తించి అవార్డులకి ఎంపిక చెయ్యొచ్చుగా అనుకోవద్దు. ఎనభయ్యేళ్ల అకాడెమీ అవార్డుల చరిత్రలో అవార్డులందుకున్న చిత్రాల్లో అత్యధికం ప్రేక్షకుల మన్ననలందుకున్నవే. చెత్త చిత్రాలని నామినేట్ చేయించుకోటానికి ఈ సంస్థలు సమయమూ, డబ్బూ వృధా చేసుకోవు.

  ఒకసారి నామినేట్ అయ్యాక అవార్డు రావటమనేది లాబీయింగ్‌తో జరిగేది కాదు. అకాడెమీలో ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్య సుమారు 6500 (అక్షరాలా ఆరు వేల ఐదు వందలు). వీళ్లంతా సినీ రంగంలో వివిధ శాఖల్లో నిపుణులు. వీళ్లంతా వోటింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటారు. అవార్డుల కోసం ఇన్ని వేల మందిని మభ్య పెట్టటం, మాయ చెయ్యటం అయ్యే పని కాదు.

  ఇక – ‘స్లమ్‌డాగ్’ ని భారతీయులే నిర్మించి ఉంటే దానికి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మాత్రం పోటీకి అవకాశముండేది. దాని నామినేషన్ కోసమూ లాబీయింగ్ జరగాల్సిందే, తప్పదు. ఇది పోటీ యుగం. మీ దగ్గరో గొప్ప వస్తువుందని మీరే అందరికీ చెప్పక పోతే దానంతటదే ఎలా తెలుస్తుంది?

 13. 13 వేణూ శ్రీకాంత్ 10:34 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  వావ్ చాలా కొత్త విషయాలు చెప్పారండీ.. టపా టైటిల్ కూడా బాగుంది. అచ్చు తప్పా కావాలనే పెట్టారా 🙂

 14. 14 అబ్రకదబ్ర 10:45 సా. వద్ద ఫిబ్రవరి 23, 2009

  @వేణు శ్రీకాంత్:

  అచ్చు తప్పు, అందునా నా టపాల శీర్షికల్లోనా!! నో వే. సిబి రావు గారు సరిగా ఊహించారు. చూడండి 🙂

 15. 15 bonagiri 12:23 ఉద. వద్ద ఫిబ్రవరి 24, 2009

  గొల్లపూడి మారుతీ రావు గారితో నేనూ ఏకీభవిస్తాను.
  ఇలాంటి సినిమాలు కావాలని భారతీయులని అవమానించడానికే తీస్తారేమోనని నా అనుమానం.
  పదేళ్ళ కిందట ఫైర్ సినిమా చూసాను. అందులోనూ అంతే. మనం టాయిలెట్లలో జంతువుల్లా కూర్చుంటామట.
  అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ బాపతు సినిమాలు చూడను అని.

  అరింధం చౌధరి అభిప్రాయాలు కూడా చదవండి.

  ఇంత కంటే మన లగాన్, చక్ దే ఇండియా, స్వదేశ్ మొదలైనవి ఉత్తమమైనవని నా అభిప్రాయం.
  ఆఖరుకి యండమూరి చిరంజీవి ల చాలెంజ్ కూడా ఈ సినిమా కంటే బెటరు.

 16. 16 సిరిసిరిమువ్వ 12:30 ఉద. వద్ద ఫిబ్రవరి 24, 2009

  మీ టపా టైటిలు బాగుంది.
  “ఆ రెండు విభాగాల్లోనూ తానే విజేతనని రహమాన్ ఎనలేని ధీమాతో ఉన్నాడనుకుంటాను. అవార్డులందుకున్న క్షణంలో ఇతరుల మాదిరిగా ఉద్విగ్నతకి లోనవకపోవటం, తొణక్కుండా మాట్లాడటం ఆ విషయాన్ని స్పష్టం చేసింది”, అవును నిన్న రెహమాన్‌ని చూస్తే నాకు కూడా అలానే అనిపించింది.

 17. 17 సుజాత 1:15 ఉద. వద్ద ఫిబ్రవరి 24, 2009

  అబ్రకదబ్ర,
  చాలా బాగా రాశారండి!ఎంతో చక్కగా విశ్లేషించారు ప్రతి అంశాన్నీ!

  అవార్డుల ప్రకటన అవగానే మా కాలనీలో స్వీట్లు పంచుకున్నాం. “సినిమా ఎవడు తీస్తే యేమి, భారతీయుల ప్రతిభని గుర్తించారు, అంతే చాలు” అన్నవాళ్ళే ఎక్కువ. ఇంతలో ఒక గుజరాతీ పటేలు గారు అననే అన్నాడు” సో, బానే ఖర్చు పెట్టారు మనోళ్ళు(లాబీయింగ్ కి)”! చప్పున చెంబెడు నీళ్ళు మొహాన్న చల్లినట్లు ఉస్సురనిపించింది. పైగా రసూల్, రహమాన్ ఇద్దరూ దక్షిణ భారతీయులు కావడం ఆయనకు మింగుడుపడటం లేదని ఆయనే ఒప్పుకున్నాడు.

  ఎంత లాబీయింగ్ నడిచినా అది అవార్డుల ప్రకటన వరకూ పని చేస్తుందా? అత్యున్నత ప్రతిభకు ఆస్కార్ కొలమానం కాదా?

  ఇక రొచ్చుగుంటలోకి దూకే సన్నివేశం లో కూడా జమాల్ వెర్రి అభిమానమే కనిపించింది తప్ప ఎంత ప్రయత్నించినా జుగుప్స కలిగించుకోలేకపోయాను.

  నాకైతే చాలా సంతోషంగా ఉంది.మన వాళ్ళు (పింకీ తో సహా) ఆస్కార్ వేదిక పైన జయహో అని నినదిస్తుంటే నా భారతీయ ఆత్మ వారితో గొంతు కలిపింది.

 18. 18 rayraj 5:08 ఉద. వద్ద ఫిబ్రవరి 24, 2009

  ఈ సినిమా మన సినిమా కాదు. కానీ మనవాళ్ళకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి కాబట్టి మహదానందం! అంతే! ఇక నించీ, మనవాళ్ళు ఓ సినిమా తీసారనుకోండి “అకెడెమీ అవార్డ్ విన్నర్ ఎ ర్ రెహ్మన్” సంగీతంలో అని చెప్పుకోవచ్చు! అది తలచుకుంటె పులకిస్తుంది.

  ఇన్ని రోజులు భారతీయులు ఆస్వాదించి, హిట్ చేసిన సంగీతం – అది ఎవరిదైనా కావచ్చు – అది చచ్చు సంగీతంమనే ధైర్యం ఇక ఎవరికి ఉండకూడదు.భారతీయుడు అభిరుచిని కించ పరిస్తే ఇక సహించవలసిన అవసరం లేదు.

  ఇంతవరకు ఇంట ఓడి, రచ్చ గెలిచిన టాలెంట్స్ వల్ల “భారతీయుల అభిరుచి లేనివారన్నారు. కానీ, వీరిని మనం మొట్టమొదటి నుంచి ఆదరించాం – ఈ స్థాయికి రాకముందునుంచి – కాబట్టి వీళ్ళు మన వాళ్ళు.

  “ఆఖరుకి యండమూరి చిరంజీవి ల చాలెంజ్ కూడా ఈ సినిమా కంటే బెటరు.” అన్నది ఎక్జాక్ట్ గా కాకపోయినా, అలా మన సినిమాలు, అభిరుచులు మంచివే! కానీ,మనల్ని మనమే కించ పరుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ అవసరం లేదు.ఏ ఆర్ రెహ్మాన్ నిస్సందహేంగా ఇంతకంటే మంచి సంగీతన్ని ఇచ్చాడు. సుభాష్ ఘాయ్ విసిరి పారేసిన ట్యూన్ ని వాళ్ళక్కిచ్చాడు. కానీ కొందరు మళ్ళా – చూశారా మనకి టేస్ట్ లేక పోతే వాళ్ళుపెట్టుకున్నారు అంటారు – అంత కంటే పిచ్చితనం లేదు.”తాల్” మ్యూజిక్ చాలా గొప్పగా చేసిన ఏ ఆర్ రెహ్మాన్ నుంచి, సుభాష్ ఘాయ్ ఇంకా ఎక్కువ ఆశించి వద్దనుంటాడు!లేదా సినిమాకి సరిపోక వద్దనుంటాడు!

  పోతే ఇన్ని అవార్డులు ఈ సినిమా కి రావటం అదృష్టమే! మీరు రాసిన లిస్ట్ లో కొన్ని సినిమాల సరసన ఇది నిలవదని నా అభిప్రాయం; కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కాబట్టి, ఈ మాత్రం తప్పులుంటాయి.ఒక్కో సంవత్సరం, ఒకటి మించి ఒకటిగా సినిమాలుంటే, తక్కిన సంవత్సరంలో అవార్డ్ సినిమాలకంటే ఈ నామినేషన్లే ఇంకా బావుంటాయి.అది అదృష్టం,అంతే! ఇట్స్ రిటన్.

  మురికి గుంట జుగుప్సాపరులందరికి ఒక మనవి : డానీ బోయల్ ఫిటిష్ అది.వాడు ముందు నుంచీ అంతే.మనం కూడా, ప్రేమికులు బురద పూసుకొని ప్రేమిస్తున్నట్టు సీనుతీస్తే ఆనందించామా!లేదు. ఎవడో తీసింది బావుందనిపించిన మనవాళ్ళు సినిమాలు తీస్తే,మనం అలాంటి పాటలు పట్టించుకోకుండా వదిలేసం. ఇది అంతే! ఈ సీనుకు మించి ఆ సినిమాలో ఇంకా తప్పులున్నాయి.అసలు డబ్బులిచ్చి లెట్రిన్ కి మనవాళ్ళెప్పుడెళ్లారు చెప్పండి!?అదే రెండు రూపాయిలకి మళ్ళా ఆ ఫొటో అమ్మేస్తాడు సలీం!సో అది అంత పెద్ద విషయం కాదు – అరుంధతి లో మన వాళ్ళు తీసిన హత్య సీనుకంటే జుగుప్సా కరమైనది కాదు. 😉 – అది, ఇది కూడా ఒకరకమైన జుకుప్స కోసం తీసిన సీన్లే కదా! కాకపోతే ఇక్కడ జమాల్ “ఎలాగైన సాధించే హీరో ఇజం ” ఉన్నవాడని నా ఫీలింగ్. అందుకని ఇది ఓకె!

  కాకపోతే “స్లమ్” అనేది మాత్రం మన ఇండియన్ సెన్సిబిలిటీ కాదు – ఒక వేళ మనం తీసే సినిమా అయితే హీరో వర్షిప్ వేరుగా ఉంటుంది – వందమందిమీదకెక్కి తొక్కుకుంటూ వెళ్ళి,మూసేయబోయే కౌంటర్లో చివర చేయి పెట్టి – వేలు చితక్కొట్టుకొని, టికెట్ సాధించి మిగిలిన మూక తరిమికొడుతుంటే, తప్పించుకొని ధియేటర్ లో దూరిన మెమరీ ఉంటుంది! 🙂 – లోపల దూరి, అమితాబ్ లాంటి జుట్టుని ఓ సారి ఇలా అనుకొని లోపల ఈలకొట్టి సినిమా చూసినట్టుంటుంది.
  సలీమ్, జమాల్ ని మన ఇండియన్ కాంట్రిబ్యూటర్స్ – అమితాబ్, శశి కపూర్ మోడల్ లోనే నడిపిస్తారు. కానీ అలా మధ్య మధ్య లో ఫారిన్ సెన్సిబిలిటీస్ తో ఉన్న సీన్లుంటాయ్ – ఎందుకంటే ఇది మన సినిమా కాదు కాబట్టి! నిజానికి సినిమాలో పెద్ద సలీం ద్వారా – “ఇప్పుడు ఇండియా వరళ్డ్ సెంటర్ స్టేజ్ లో ఉంది, అందులో మనమూ, మన స్లమ్ సెంటర్ స్టేజ్లో ఉంది ..చూడు ఇక్కడ బిళ్డింగ్ లెలా వచ్చాయో ” అన్న పంధాలో కొని డైలాగ్స్ ఉన్నాయి.మీరెవరూ పట్టించుకున్నట్టు లేదు.

  పాటపాడే ముందు “ప్రొఫెషనల్ హూ మే!” అన్నప్పుడు ;తాజ్ మహల్ దగ్గర “పుస్తాకాల్లో తప్పు రాస్తారు, నే చెప్పేదే అసలు చరిత్ర” అన్నప్పుడు; జమాల్ పాత్ర లో స్ట్రీట్ స్మార్ట్ నెస్ తెలీటం లేదు. నిజానికి మన యూకె బార్న్ పటేల్ అంతగా స్ట్రీట్ స్మార్ట్ గా కనిపించలేదేమో! నిజానికి వాడుకూడా “నేనే రభై ఆ వాషింగ్ మిషన్ గాడ్ని” అని లతికా ఇంట్లో దూరలేదు!(ష్యూర్ గా మన రవితేజ,అల్లు అర్జున్ ఐతే ఇంకా క్లియర్ గా ఆ స్ట్రీట్ స్మార్ట్ నెస్ తెచ్చేవాళ్ళు);

  ఎ లాట్ ఆఫ్ పీపల్ గాట్ దిస్ ఫిల్మ్ రాంగ్. కానీ ఈ సినిమా మంచి సినిమా యే – చిన్నతనంలోనే తను ఇష్టపడ్డ అమ్మాయి కోసం హీరో ఎలా తెగించుకొని వెళ్ళాడు అనేది సినిమా (అనవసరపు కిరోసిన్ బాంబులు లేకుండా మనం ఎలా తీసి ఉండవచ్చు అని చూపిస్తుంది :))

  కాకపోతే అవార్డ్ లు మాత్రం – స్లం వల్లే స్లామ్ – కానీ మిగిలిన స్లమ్ సినిమాలాంటి సినిమా కాదిది.

  కానీ ఈ అవార్డ్ ల వల్ల నాకు ఒక బాధ కూడా ఉంది. ఒక ఏ ఆర్ రెహ్మాన్ ని మళ్ళా అఫోర్డ్ చేయగల (పెట్టుకోగల) ప్రొడ్యూసర్లూ, డైరెక్టర్లూ ఇండియాలో లేనట్టే! ఇప్పటికే మహా అయితే ఓ నలుగురు మంచి డైరెక్టర్లు పెట్టుకోగలుగుతున్నారు. మణిరత్నం ఒక్కడూ తన ప్రతి సినిమా కి వాడుకో గలడేమో! ఇక మనకి రెహ్మాన్ లేడెమోనని నా భయం:( – ఫారిన్ కంపినూలు ఇక్కడ సిన్మాలు,మార్కెట్ వాడుకుంటె కొద్దిగా మనం ఇంకా రెహ్మాన్ ని వినచ్చు; కానీ కర్నాటిక్ క్లాసికల్ టచ్ లో చేసేవి చెయ్యడేమో అని ; పోన్లేండి, ఇక మనం వేరే రెహ్మాన్ లాంటి టాలెంట్ కోసం వెదుకుదాం. 🙂

  సారీ అబ్రకదబ్ర గారు, చాలా చోటు వాడేసాను.

 19. 19 కొత్తపాళీ 9:55 ఉద. వద్ద ఫిబ్రవరి 24, 2009

  good one, అబ్రకదబ్ర!
  “అచ్చు తప్పు, అందునా నా టపాల శీర్షికల్లోనా!! నో వే.” .. మీ ఆత్మవిశ్వాసం ముచ్చటేస్తోంది.

 20. 20 కన్నగాడు 11:58 ఉద. వద్ద ఫిబ్రవరి 24, 2009

  గొల్లపూడి గారి వ్యాఖ్యలకు నేనుకూడా వ్యతిరేకిస్తున్నాను.
  @అబ్రకదబ్ర గారు,
  “అచ్చు తప్పు, అందునా నా టపాల శీర్షికల్లోనా!! నో వే.” .. మీ ఆత్మవిశ్వాసం ముచ్చటేస్తోంది.
  మీ వెనక ఒక దూర్బిణి వస్తోంది జాగ్రత్త…:)

 21. 21 ఉమాశంకర్ 12:22 సా. వద్ద ఫిబ్రవరి 24, 2009

  అది నా వ్యాఖ్య కాదు చిలమకూరు విజయమోహన్ గారిది

 22. 22 వేణూ శ్రీకాంత్ 4:57 సా. వద్ద ఫిబ్రవరి 24, 2009

  అబ్రకదబ్ర గారు నేను రావు గారి కామెంట్ చదవక ముందే మీ ఉద్దేశ్యం అర్ధమైంది కానీ హాస్యమాడాను 🙂 కొ.పా గారు చెప్పినట్లు .. మీ ఆత్మవిశ్వాసం కేక.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: