మురికివాడ మిలియనైర్

నాలుగేళ్ల నాటి సంగతి. నాతో పనిచేసే అమెరికన్ సహోద్యోగి – పేరు మిషెల్ – కొత్తగా ఒక ఇంటిని కొనుగోలు చేసింది. అందులో అప్పటికే ఒక ఆఫ్రికన్-అమెరికన్ కుటుంబం అద్దెకుంటుంది. వాళ్లు చెల్లించే అద్దె మరీ తక్కువ అని మిషెల్ అనుకోవటంతో, అద్దె కొంచెం పెంచుతూ తన ఏజెంట్ ద్వారా నోటీసు పంపించింది. వాళ్లు అద్దె పెంచటానికి ఒప్పుకోలేదు సరికదా, అప్పటి నుండీ అసలు అద్దె కట్టటమే మానేశారు. రెండు నెలలు చూశాక మిషెల్ ఇల్లు ఖాళీ చేయమంటూ వాళ్లకి నోటీసులు పంపించింది. బదులుగా – వారం తిరిగేలోపు ఈమెకి కోర్టు నోటీసులొచ్చాయి. ‘నల్ల జాతి వాళ్లం కాబట్టే మమ్మల్ని వెళ్లిపోమంటుంది’ అంటూ అద్దెకుండేవాళ్లు మిషెల్‌పై జాతి వివక్ష కేసు పెట్టారు! మాకందరికీ ఆమె కోర్టు నోటీసు చూపిస్తుంటే మేమందరమూ పగలబడి నవ్వటం. పై వారం ఆమె కోర్టుకెళ్లింది. జడ్జిగారు మిషెల్‌ని, అద్దెవాళ్లని మార్చి మార్చి చూసి మారు మాట్లాడకుండా కేసు కొట్టేశారు. తర్వాత రోజు ఆ విషయం చెబుతూ మిషెల్ నాతో ఓ మాటంది: ‘ఇలా ఉండబట్టే మేమింకా వెనకబడున్నాం’.

సంగతేమిటంటే, మిషెల్ కూడా నల్లజాతి కలువే. ఆమెనెప్పుడూ చూసుండకపోవటం వల్ల అద్దెవాళ్లకి ఆ విషయం తెలీదు. నిజానిజాలేమిటో తెలుసుకోకుండా వాళ్లలా ఆవేశ పడిపోవటం గురించి ఆవిడ ఆవేదనాభరిత విసురది. నిజమే, ఆత్మన్యూనత నిలువెల్లా కమ్మినోళ్లు చీమ చిటుక్కుమన్నా తమనెక్కిరిస్తుందనే అనుకుంటారు.

* * * *

నెలనాళ్లుగా ‘స్లమ్‌డాగ్ మిలియనైర్’ సినిమాని ఆడిపోసుకునే భారతీయులు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. మనలాంటి మామూలు జీవులే కాక సమాజంలో రకరకాల రంగాల్లో పేరొందిన ప్రముఖులూ వీళ్లలో ఉన్నారు. కధాంశం గురించి గొడవ చేసేవాళ్లు కొందరు, సినిమా పేరు గురించి అభ్యంతరపెట్టేవాళ్లు ఇంకొందరు, కొన్ని సన్నివేశాల గురించి చిర్రుబుర్రులాడేవాళ్లు మరికొందరు, ఇవేవీ కాకుండా ‘అసలు తెల్లోడెవడండీ మన దరిద్రాన్ని గురించి సినిమా తీయటానికి’ అనేవాళ్లు వేరే కొందరు. మొత్తమ్మీద – ఈ సినిమాలో భారతదేశాన్ని మురికి కూపంలా, వెనకబడ్డ దేశంలా చూపారనేది వీళ్ల ప్రధాన ఆరోపణ. మన పేదరికాన్ని ప్రపంచానికి చూపించి సొమ్ము చేసుకుంటున్నారనేది ఈ సినిమా దర్శక నిర్మాతలపై వీళ్ల కోపానిక్కారణం. దీని దర్శకుడు ఒక ఆంగ్లేయుడు కావటం ఆ అగ్గిలో ఆజ్యం పోసిన విషయం (ఆంగ్లేయుడు కాకుండా ఏ మణిరత్నం వంటి మనవాడో ఈ సినిమా తీసి దానికీ స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపొచ్చుంటే వీళ్లేమనుండేవాళ్లో అనేది ఆసక్తికరం). ఇంతకీ, దీనికాధారమైన పుస్తకం రాసిన వికాస్ స్వరూప్ అనబడే ‘మనవాడి’ మీద ఎవరూ విరుచుకుపడకపోవటం గమనార్హం. ఈయన పుస్తకం రాసి సొమ్ము చేసుకోగాలేనిది వాళ్లెవరో సినిమా తీసి చేసుకుంటే తప్పైపోయింది. మనవాడు రాస్తే ఇంపే. వేరే వాడు తీస్తేనే కంపు.

ఈ నిరసనకారుల్లో కొందరు దేశీయ సినీ ప్రముఖులూ ఉన్నారు. భారతీయ ప్రేక్షకుల బలహీనతలనూ, భావావేశాలనూ అందినకాడికి సొమ్ము చేసుకునే పనిలో దశాబ్దాలుగా అలుపన్నదే లేకుండా తలమునకలయ్యున్న వీళ్లు, పరాయి దేశస్థుడెవరో మన పేదరికాన్ని లోకానికి చూపించేసి తలవంపులు తెచ్చాడని గంగవెర్రులెత్తటం గమ్మత్తైన విషయం. నాకెందుకో – ‘అర్రెర్రె.. వాడెవడో ఈ కధతో సినిమా తీసి డబ్బులు దండుకుంటున్నాడు. ఈ అవిడియా మనకెందుకు రాలేదబ్బా’ అనేది వీళ్ల అసలు బాధ అనిపిస్తుంది. నిజంగా అంత బాధే ఉంటే వీళ్లందరూ కలిసి – కుప్పలు తెప్పలుగా కాకపోయినా – దేశం గర్వపడేలాంటిది, కనీసం ఒక్క అద్భుత చిత్రరాజాన్ని తీసి మన పరువు నిలబెట్టొచ్చుగదా. అది మాత్రం చెయ్యరు. వందలాది కోట్ల రూపాయలు తగలేసి ఏ ఏటికా ఏడు చెత్త చిత్రాలు తీసి మన ముఖాన కొట్టే వాళ్లకి ఇదో పెద్ద ఖర్చా? అన్నిటికన్నా చిత్రమైన విషయం – దీని గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్న మహానుభావుల్లో కొందరు అసలా సినిమాని చూసుండకపోవటం! తక్కినోళ్లని చూసి తనూ ఓ రాయేద్దామనుకునే మంద మనస్తత్వమే తప్ప సొంత బుర్ర ఉపయోగించే తీరికే లేదు వీళ్లకి.

సరే, ఇంత గొడవ రేపెట్టిన ఈ సినిమాలో ఏముందయ్యా అంటే, పెద్దగా చెప్పుకోటానికి ఏమీ లేదు. నా వరకూ నాకు – ఒకానొక గలీజు సన్నివేశం తీసేస్తే మిగతా సినిమా చాలా ఆసక్తికరంగా అనిపించింది. అలాగని ఇదేమీ చరిత్రలో నిలిచిపోయే సినిమా కాదు; ఈ ఏడాది వచ్చిన వాటిలో ఒక మంచి సినిమా. అంతే. ఇక, ఈ సినిమా చూసిన విదేశీయులు మన గురించి తక్కువగా అనుకుంటారంటే నేన్నమ్మను. మన మురికివాడల గురించి కళ్లకు కట్టినట్లుండే కార్యక్రమాలు నేషనల్ జియోగ్రఫిక్, హిస్టరీ వంటి ఛానెళ్లలో ఇంతకు ముందొచ్చాయి, ఇక ముందూ వస్తాయి. వాటివల్ల మునగని కొంపలు ఈ ఒక్క సినిమాతో మునగవు. దీని దెబ్బకి రేపు రోడ్లమీద అమెరికన్లు నన్నేదో చులకనగా చూస్తారనుకునే న్యూనతా భావం నాకు లేదు. ఒక వేళ వాళ్లలా చూసినా, who cares?

13 స్పందనలు to “మురికివాడ మిలియనైర్”


 1. 2 జీడిపప్పు 7:26 సా. వద్ద ఫిబ్రవరి 9, 2009

  నేను “ఫస్ట్ హాఫ్ ఒకట్రెండు సీన్ల మినహా ఉన్నది ఉన్నట్టు చూపించారు” అన్నాను నా పోస్టుల్లో. సెకండ్ గాఫ్ మాత్రం మాంఛి మసాలా సినిమా. ఈ సినిమా వల్ల మన దేశ పరువు పోయిందనో, మనము సిగ్గుపడాలి అనో అంటే.. వాళ్ళు అర్జెంటుగా ఒక చిన్న గ్లాస్ లొ నీళ్ళు పోసుకొని అందులో దుంకెయ్యాలి. అన్నట్టు “స్లమ్‌డాగ్‌కు అన్ని అవార్డులెందుకు?” అని ఇందాకే ఒకటి వ్రాసాను. మీ అభిప్రాయం చెప్పండి అబ్రకదబ్ర గారు.

 2. 3 sai brahmanandam 7:52 సా. వద్ద ఫిబ్రవరి 9, 2009

  కౌముదిలో గొల్లపూడి గారి కాలం చదివాక ఈ క్రింది ఉత్తరం ఆయనకు రాసాను. సమాధానం వచ్చింది. అది మీ ఊహకి ఒదిలేస్తున్నాను.

  మారుతీ రావు గారు, మీకు ఈ లేఖ రాయడానికి కారణం “స్లం డాగ్ మిలియనీర్” సినిమా. మీరు రాసిందీ, దానిపై వచ్చిన వ్యాఖ్యలూ అన్నీ చూసాను. మీరు డేనీ బోయిల్ ని తప్పు పట్టేరు. కాదనను. కానీ ఈ సినిమా మూల కథ రాసింది భారతీయుడు. పైగా ఆయన అంతర్జీతయ దౌత్యవేత్త కూడాను. అలాంటి వ్యక్తి రాసింది సినిమాగా తీస్తే మీరు డేనీ బాయిల్ పై విరుచుకుపడితే ఆశ్చర్యం వేసింది. మన దేశం గురించి చెత్తగా రాసిన భారతీయుణ్ణి వదిలేసి, అది సినిమా తీసినాయినపై ధ్వజం ఎత్తడం నేనంగీకరించలేక పోతున్నాను. మన దేశాన్ని, సంస్కృతినీ దిగజార్చేదీ, చీదరించుకునేది భారతీయులే! తూలనాడేది మనమే! మీరు నవల రాసిన వికాస్ స్వరూప్ గార్ని వదిలేసి డేనీ బోయిల్ని తన్ని తగలేస్తే నవ్వొచ్చింది. మీరు కథకులే కాబట్టి ఇలా రాయాల్సొచ్చింది.

  ఎప్పుడైనా కుదిరితే, ఉదయాన్నే ఏడు గంటలకి ముంబయిలో సయాన్ నుండి చెంబూరు మీదుగా మాహుల్ ఒక్కసారి వెళ్ళి చూడండి. రోడ్డుకి అటూ ఇటూ బారులుగా కాల కృత్యాలు తీర్చుకునే అనేకమంది కనిపిస్తారు. వారికి కనీస సౌకర్యాలు లేవు. సిగ్గూ, శరమూ వదిలి పెట్టి రోడ్డు మీదే మలమూత్ర విసర్జన చేయాల్సొచ్చిన దౌర్భాగ్య స్థితిలో వున్న వాళ్ళని చూస్తే జాలేస్తుంది. నేను ఇరవై ఏళ్ళ క్రితం ముంబైలో పనిచేసాను. అప్పుడు చూసినవి ఇవి. ఈ మధ్యనే రెండేళ్ళ క్రితం ముంబై వెళ్ళితే, ఫ్లైవోవర్లూ, కార్లూ పెరిగాయి కానీ రోడ్డుకి అటూ ఇటూ ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునే వారి సంఖ్యా మాత్రం తగ్గ లేదు. కనీస సదుపాయాలు లేవు. కొంచెం బాధ కలిగించినా పరిస్థితి ఇదే! ఒక్కసారి కలకత్తాలో కొత్త హౌరా బ్రిడ్జి దగ్గర చూడండి. ఒక పక్క ధన గంగ, రెండో పక్క మురికి గంగ, బ్లాక్ అండ్ వైటు సినిమాలా కనిపిస్తాయి. మీరుంటున్న చెన్నై కూడా దీనికి భిన్నంగా ఉంటుందని నేననుకోను. మనం సర్దుకుపోయినా, మన దేశానికొచ్చిన వారు దీన్ని బీదరికం క్రిందనే జమ కడతారు. ఇప్పటికీ అనేక చోట్ల మనకి పరిశుభ్రతా లోపం కనిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఎండగడుతూ రాసుంటే బావుండేది.
  చివరగా, డేనీ బాయిల్ నాకు మిత్రుడు కాడు. కేవలం మీ స్పందన చూసాక పుట్టిన ప్రశ్నలివి.

 3. 5 చైతన్య 9:39 సా. వద్ద ఫిబ్రవరి 9, 2009

  నిజం… ఇదే సినిమా ని ఒక ఇండియన్ తీసి ఉంటే ఇప్పుడు తిడుతున్నా వాళ్ళంతా అతన్ని ఆకాశానికి ఎత్తేవారు. నవల రాసిన ఇండియన్ని వదిలేసి తీసినందుకు ఆ దర్శకుడిని అంటున్నారు.
  ఐన వీరు అంతగా బాధపడిపోవలసినదేమి నాకు కనిపించలేదు మరి ఈ సినిమాలో. కథ ప్రకారంగా మురికి వాడల్లోనే చిత్రీకరించాలి ఈ సినిమాని… దానిలో ఏం తప్పుందో మరి? లేని మురికివాడలేమి చుపించలేడుగా… ఉన్నదాన్ని చూపిస్తే ఎందుకంత ఉలికిపాటు!

 4. 6 కొత్తపాళీ 9:59 సా. వద్ద ఫిబ్రవరి 9, 2009

  లేదు చైతన్య గారూ. ఈ ఏడ్చిన మహానుభావులు (సినిమహానుభావులు మరీను) వాస్తవిక దృక్పథంతో సినిమాలు తీసిన సత్యజిత్ రే, మృణాల్ సేన్ వంటి వారి సినిమాలు చూసి కూడా ఏడ్చారు. అదొహ తర్హా ఏదుపు గోల .. అంతే! 😦

 5. 7 రవి 11:23 సా. వద్ద ఫిబ్రవరి 9, 2009

  ఈ వారం స్వాతి వారపత్రికలోనూ ఈ సినిమా గురించి విమర్శా వ్యాసం వచ్చింది. ఓ సమాచారం కోసం చెబుతున్నాను. నాకు ఈ సినిమా మీద అభిప్రాయాల్లేవు. చూడలేదు కాబట్టి.

 6. 8 cbrao 11:44 సా. వద్ద ఫిబ్రవరి 9, 2009

  భారతదేశంలోని మురికివాడలు చూపిస్తే వారి చిత్రాలలో వాస్తవికత ఉట్టిపడగలదని ఈ దర్శకుల భావన అయ్యుండొచ్చు. అలా తీయడం చిత్ర వ్యాపార విజయానికి తోడ్పడితే ఏ నిర్మాత కాదంటాడు? సినిమాకు దారిద్ర్యం కూడా ఒక బాక్స్ ఆఫీస్ సూత్రమై కూర్చుందిప్పుడు.

 7. 9 మురళి 6:22 ఉద. వద్ద ఫిబ్రవరి 10, 2009

  “నిజమే, ఆత్మన్యూనత నిలువెల్లా కమ్మినోళ్లు చీమ చిటుక్కుమన్నా తమనెక్కిరిస్తుందనే అనుకుంటారు” …చాలా బాగుంది.

 8. 10 నిషిగంధ 8:09 ఉద. వద్ద ఫిబ్రవరి 10, 2009

  “ఒకానొక గలీజు సన్నివేశం తీసేస్తే మిగతా సినిమా చాలా ఆసక్తికరంగా అనిపించింది. అలాగని ఇదేమీ చరిత్రలో నిలిచిపోయే సినిమా కాదు; ఈ ఏడాది వచ్చిన వాటిలో ఒక మంచి సినిమా. అంతే.”

  పూర్తిగా ఏకీభవిస్తాను! It’s a love story told in a different way!

 9. 11 కన్నగాడు 10:15 ఉద. వద్ద ఫిబ్రవరి 10, 2009

  నా మిత్రుడితో ఈ విషయమై మాట్లాడినప్పుడు, నేను నిజంగా అంత పేదరికం మన దగ్గర ఉంది కదా అంటే అతని సమాధానం “నిజమే ఉంది కాని తెల్లోడు చూస్తే మన ఇజ్జత్ ఏంగాను, మనం చూస్తే ఓకే” అన్నడు. ఇదేదో మొగుడు కొట్టినందుకు కాదు సవితి నవ్వినందుకు అన్నట్టు లేదు.

  నాకు బీ పిచ్చపిచ్చగా నచ్చిన సినిమా, అన్నింటికంటే సలీం చిన్నపిల్లలందరికీ పనికెల్లమని హుకుం జారీ చేసే సన్నివేశంలో ఆ అబ్బాయి నటన అత్యద్బుతం.

 10. 12 sri 4:12 సా. వద్ద ఫిబ్రవరి 10, 2009

  పేదరికం మన దేశములొ వున్నది కాబట్టే చుపించారు. తప్పు లేదు.

  ఫరువు పొతుందనుకొంటె, పష్చ్యాత్యులకు మన దగ్గరున్న అధ్యత్మికతను చుపించండి. చెప్పండి వారికి. మీదగ్గర భౌతిక సంపద వున్నది, మదగ్గర అధ్యత్మిక సంపద వున్నది, ఒకరు యెక్కువ, ఒకరు తక్కువ కాదు, సుఖమయ జీవనానికి రెండు సమాన అవసరాలె అని చెప్పండి.

  కాని, మనము కూడ, మన దెశ ప్రజల అర్ధిక ప్రగతికి అంతొ ఇంతొ ప్రయత్నము తప్పకుండ చెయ్యాలి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: