కూడల్లో కిష్కింధకాండ

రెండువారాలుగా తెలుగు బ్లాగ్వనం రణనినాదాలతో మోత మోగిపోతుంది. ఒకరిపై ఒకరు తిట్లు, శాపనార్ధాలు, మూతబడుతున్న పాత బ్లాగులు, ప్రత్యేక అజెండాలతో వెలుస్తున్న కొత్త బ్లాగులు, సున్నితుల సూసైడ్ నోట్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లు .. మొత్తమ్మీద, దారిన పోతూ పోతూ ఇటుగా ఓ చూపేసిన వారికి ఎవరినెవరు ఎందుకు ఏమంటున్నారో అర్ధం కాని గందరగోళం. అంతటా అయోమయం. నవంబరు మొదట్లో టీకప్పులో తుఫానులా సమసిపోయిన కత్తి-సుత్తి సంవాదం దరిమిలా రెండున్నర నెలల ప్రశాంతత. ఇప్పుడా నిశ్చల తటాకంలోకి రాయి విసిరిందెవరనేది అప్రస్తుతం. చిన్న అపార్ధంతో రాజుకున్న నెగడు ఈ సారి బ్లాగ్వాతావరణాన్ని ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో కలుషితం చేసిందనేది నిజం.

ఇద్దరు బ్లాగర్ల మధ్య – కారణాలేవైనా – పొటమరించిన అపార్ధం నిజానికి ఆ ఇద్దరూ మాత్రమే తేల్చుకోవాల్సిన విషయం. అందులోకి ఇతరులు ప్రవేశించటం, ఎవరి ఉద్దేశాలతో వారు తలో చెయ్యి వెయ్యటంతో – పిట్టగోడ దగ్గర పుట్టిన ఇరుగు పొరుగుల కలహం వాడ మొత్తానికీ పాకినట్లు – అది కాస్తా అందరి సమస్యగా, అందరికీ సమస్యగా మారిపోయింది. సందట్లో సడేమియా అనుకుంటూ రాజకీయోద్యమాల్లో దూరి రాళ్లు విసిరే రౌడీ మూకలాంటిదొకటి సందు చూసుకుని ఇందులో చొరబడటంతో గొడవ ముదిరి పాకాన పడింది. వారం తిరిగేసరికి అసలు గొడవ మరుగున పడిపోయి పాత కక్షలు, కార్పణ్యాలు తెర పైకొచ్చి అనేక బ్లాగులు కురుక్షేత్రాలైపోయాయి. మొదట కొందరు మహిళా బ్లాగర్లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు మొదలై క్రమంగా – జాతి వివక్ష రహితంగా – ఇతరులపైకీ మళ్లాయి. తోలుమందపోళ్లు తూ నా బొడ్డని దులపరించేసుకు పోతుండగా, తట్టుకోలేని బేలలు మాత్రం బ్లాగింగుకి శాశ్వతంగా సెలవిచ్చేస్తున్నారు. దానికదే సద్దుమణుగుతుందిలే అనుకుంటూ ఇన్నాళ్లూ మౌనంగా చోద్యం చూస్తున్న నాలాంటోళ్లు ఇప్పటికైనా నోరు విప్పకపోతే పరిస్థితి మరింతగా విషమించే ప్రమాదం.

కలగజేసుకుంటున్నానని, ఇదేదో తప్పొప్పులు నిర్ణయించే పంచాయితీ అనుకునేరు. తీర్పులిచ్చేందుకు నే పెదరాయుడినీ కాను, తక్కిన బ్లాగర్లు నేనేలే ప్రజలూ కారు. ఇంత గొడవకీ కారణమైన ఒక చిన్న అపోహని దూరం చేసే ప్రయత్నం మాత్రమే నాది. బ్లాగర్లలో పాత కాపులు కొత్త తరాన్ని నొక్కేస్తున్నట్లు కొందరి వాదన. ఇది పూర్తిగా నిరాధారం, ఊహా జనితం. వర్గాలు, కూటములు ఉంటే ఉండొచ్చుగాక (నాకైతే కనపడలేదు), ఇక్కడ ఎవరూ ఎవరినీ ఎదగకుండా ఆపలేరు. ఎవరికుండే ఆదరణ వారికుంటుంది. నేనే ఉదాహరణ. తొమ్మిది నెలలుగా బ్లాగుతున్నా, నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిచయమున్న బ్లాగర్లు ఒకరిద్దరే (ఆ ఒకరిద్దరికీ ఈ గొడవతో సంబంధం లేదు కాబట్టి వాళ్లకి మద్దతుగా ఇది రాసే ప్రసక్తే లేదు). చాలామందివి కలం పేర్లే తప్ప నిజం పేర్లూ తెలీవు నాకు. నాకు ముందూ, నా తర్వాతా అనేక మంది వచ్చారు, వస్తున్నారు. వీళ్లలో నా రాతలు నచ్చే వాళ్లూ, నచ్చనోళ్లూ ఉన్నారే కానీ నన్ను పైకి ఎత్తేసిన వాళ్లూ లేరు, కిందకి తొక్కేసిన వాళ్లూ లేరు. ఎవరికన్నా లోలోపల అలాంటిదేదన్నా ఉన్నా, ఈ సైబర్ లోకంలో నా వాణి వినపడకుండా ఆపటం ఒకరిద్దరి తరం కాదు. ఇది నాకొక్కడికే కాదు, అందరికీ వర్తించే విషయం. కాబట్టి, ఎవరి గురించో ఎవరో ముఠాలు కట్టి ఏదేదో చేసేస్తున్నారని బాధ పడటం అనవసరం, అర్ధరహితం.

అపోహ వదిలించే ప్రయత్నం అయిపోయింది. అర్ధం చేసుకుంటారనే ఆశుంది. ఇక ముందేమిటి? ఎవరు మొదలు పెట్టారనే చర్చలోకి వెళ్లటం – మొదట్లోనే చెప్పినట్లు – రచ్చని కొనసాగించటమే కాబట్టి ఆ ప్రస్తావనొద్దు. ఇరు వర్గాలదీ ఎంతో కొంత తప్పుందనుకుందాం. ఎవరు చెప్పాల్సినవి వాళ్లు ఇప్పటికే చెప్పేశారు కాబట్టి ఇకనైనా దీన్ని ఆపేయటం ఉత్తమం. ఏ వారానికావారం వార్తాపత్రికల పుణ్యాన తెలుగు బ్లాగుల గురించి ఆసక్తితో వీటిలో అడుగు పెట్టే కొత్తవాళ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నారు. వచ్చీ రాగానే – కుళాయిల దగ్గర ఓటిబిందెల పోరాటాల్లా – ఇక్కడ జరుగుతున్న రభస వాళ్లకెదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పబ్లిక్ పాయిఖానాల్లో పిచ్చి రాతల్లాంటి కారు కూతలతో నిండిపోయిన టపాలు, వ్యాఖ్యలు చదివే వాళ్లకి బ్లాగింగంటే కోతి మూకల కంగాళీ గోల అనే దురభిప్రాయమేర్పడదా? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? కలహ భోజనమే ప్రియమైన వాళ్లని కడుపు మాడ్చుకోమని సలహా ఇవ్వటం లేదు. దానికీ పద్ధతైన పద్ధతులున్నాయి కదా. ఎదుటివారిలో నచ్చని విషయాలని నాటుగా కాకుండా సూటిగా, నీటుగా చెప్పటం ఏమంత కష్టం? ఇక్కడున్నోళ్లలో అధికులు విద్యాధికులే, నలుగురిలోకొచ్చినప్పుడు సంస్కారవంతంగా మెలిగే నాగరికులే. బ్లాగుల్లోకొచ్చేసరికి మనలోని మరో మనిషి బయటికి రావలసిన అవసరముందా? మన స్థాయి ఇదేనా? ఇంతకన్నా మెరుగ్గా ఉండలేమా? ఆలోచించండి.

 

14 స్పందనలు to “కూడల్లో కిష్కింధకాండ”


 1. 2 చిలమకూరు విజయమోహన్ 5:22 సా. వద్ద ఫిబ్రవరి 5, 2009

  ఈ ఇరవై రోజుల్లో ఏమి జరిగిందో తెలియదు ఎందుకంటే పంటల నూర్పిడిలో మునిగిపోవడంవల్ల విషయం తెలియలేదు జూన్లో బ్లాగుప్రపంచంలోకి ప్రవేశించాను.వచ్చినప్పుడున్న వాతావరణం ఇప్పుడులేదు.అయినా ఇదేంటండి బ్లాగులోకంలో అందరూ మంచి విద్యావంతులు,సంస్కారవంతులున్నారనుకున్నా,మా పల్లెటూరి ప్రజలే మేలు కదండి.అపార్థాలు పొడచూపినా త్వరగా మరచిపోయి మళ్ళీ కలిసిపోతూవుంటాము.అయినా ఎవరో ఏదో అన్నారని మనం బ్లాగులు మూసుకోవడమేంటండి.పొగడ్తల్నే కాదు విమర్శల్ను కూడా స్వీకరించే స్తితప్రజ్ఞత,మనస్తత్వం అలవరచుకోవాలి.ఇలా జరగడవల్ల మంచి బ్లాగర్లను కోల్పోయినవారమవుతాము.ఇప్పుడిప్పుడే తెలుగు బ్లాగులోకానికి పత్రికారంగంలో గుర్తింపు వస్తోంది,ఇలాంటి సమయంలో మంచి బ్లాగర్లు తమ బ్లాగులను మూసివేయడం తెలుగును ప్రపంచవ్యాప్తిచేయాలన్నమన ఆశయం నెరవేరదు.గత నెలలో దీనికోసం పుస్తక ప్రదర్శనలో మన బ్లాగు మిత్రులు కష్టపడినదంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా తయారవుతుంది.బ్లాగులను మూసివేయలన్న నిర్ణయాన్ని మరోసారి ఆలోచించమని నా విజ్ఞప్తి.

 2. 3 శ్రీ 7:59 సా. వద్ద ఫిబ్రవరి 5, 2009

  విజయకుమార్ గారు, తొందరలోనే బ్లాగర్లు ఈ సమస్య నుండి బయటపడుతారని నేను కుడా ఆశిస్తున్నాను.

  మనం మానవులం,సమస్యలలో పెరిగిన వాళ్ళం. ఇవే లేకపోతే మనిషి పుట్టుకకి అర్ధం ఏముందండీ?

 3. 4 Malakpet Rowdy 8:32 సా. వద్ద ఫిబ్రవరి 5, 2009

  I couldnt have said it better – As I too mentioned in my posts, a small issue sparked off between two individuals has been blown out of proportions by the others.

  While one group is accused of being obscene, the other is accused of being bullies – and yeah I am not taking sides here for I know neither of the groups well. (Of course, I know only one person who has been made use of, by both the groups and has been made a scapegoat)

 4. 5 రవి 10:44 సా. వద్ద ఫిబ్రవరి 5, 2009

  “బ్లాగర్లలో పాత కాపులు కొత్త తరాన్ని నొక్కేస్తున్నట్లు కొందరి వాదన.”

  సంవత్సరం పైన బ్లాగుతున్నా, నాకూ ఎవరూ వ్యక్తిగత మిత్రులూ లేరు, శత్రువులూ లేరు. అలాగని తొక్కాలని ప్రయత్నించిన వాళ్ళూ లేరు. నా ధోరణికి విసుక్కున్న వాళ్ళు లేరనే చెప్పాలి. ఏవో పేరు ప్రఖ్యాతులు రావాలని బ్లాగటం మొదలెడితే, ఇలాంటి ఆపోహలే వస్తాయి.

 5. 6 చైతన్య 11:07 సా. వద్ద ఫిబ్రవరి 5, 2009

  మీ పోస్ట్ చదివాను… నిజానికి మీరు దేని గురించి రాసారో నాకు అర్థం కాలేదు!
  నేను బ్లాగు లోకంలోకి అడుగు పెట్టి నాలుగు సంవత్సరాలు దాటింది… కాని నా బ్లాగు సంగతి తెలిసిన వాళ్ళని వేళ్ళ మీద లెక్కించొచ్చు. నేను అంత ఎక్కువగా అందరి బ్లాగులు చదివేదాన్ని కాను… కానీ కొందరివి మాత్రం రెగ్యులర్ గా ఫాలో అవుతాను. ఈ మధ్య కాస్త ఎక్కువగా బ్లాగులు చదువుతున్నాను…
  కానీ నాకు ఎక్కడా మీరు చెప్పిన గొడవలు కనిపించలేదు ఇంతవరకు… బహుశా నేను ఆ బ్లాగుల వైపు వెళ్ళలేదేమో!
  కొన్ని రోజులుగానే నేను ఇంకో బ్లాగు కూడా మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నాను…
  ఇలాంటి గొడవలు కొత్త బ్లాగరులను అంతగా ప్రభావితం చేస్తాయని నేను అనుకోను… ఆ గొడవలు నచ్చని వారు అటు వైపు చూడటం మానేస్తారు… గొడవలు లేకుండా చక్కగా ఉండే బ్లాగులు ఎన్ని లేవు…!
  కాకపోతే మీరు చెప్పినట్టు ఒక పెద్ద తెల్ల కాగితం పైన … అంత తెలుపు కంటే… చిన్న నల్ల మచ్చ ఎక్కువగా నోటీసు అవుతుంది… అది నిజమే…

 6. 7 rayraj 12:13 ఉద. వద్ద ఫిబ్రవరి 6, 2009

  గులిస్థాన్ లోని మలక్ పేట్ రౌడీ గారు, విషయం తెలుసులుందామని మీ సైటుకొచ్చి నే బకరా అయి పోయా!

  ఎంత వద్దన్నా ఏంటో విషయం తెలుసుకోవాలన్న కుతూహలం!సరే వదిలేస్తున్నా.

  అవును ఏదేమైనా! కక్ష్యలూ కార్పణ్యాలు పెంచుకోవడాని బ్లాగ్స్ ఎందుకండీ! తప్పైనా, రైటైనా మీ వ్య్యూ పాయింట్ మీకోటి ఉంటుంది.(“ఉండాలి” అని కూడా అనుకుంటాను).వాటిని మేం “రాయగలం” అన్న భావన ఉన్న వాళ్ళు రాసుకోవడానికి ఈ సెల్ఫ్ పబ్లిషింగ్.అంతే!

  కామెంట్ / వ్యాఖ్య అనేది చదివిన వారు ఆనందించారో,వ్యతిరేకిస్తున్నారో తెలుకోవటానికి.తద్వారా మన వ్యూ పాయింట్ మార్చు కోవడానికి, ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి ఉపయోగ పడతాయి.

  కొట్టుకోవడానికో, తిట్టుకావడానికో,ఎగతాళి చేసుకోవడానికో అయితే ఐడియాలజీ ఏంటండీ! దేని మేదైనా సరదాగా కొట్టేసుకోవచ్చు!

 7. 8 నాగప్రసాద్ 4:33 ఉద. వద్ద ఫిబ్రవరి 6, 2009

  కారణమేమిటంటే, కూడలి వీవెన్ గారిది కాకుండా, పబ్లిక్ కు సంబంధించిన సైటు అని బూతుటపాలు వ్రాసే వాళ్ళు అనుకుంటున్నారు. పబ్లిక్ కు సంబంధించిన సైటును కొద్దిమంది చేతిలోకి తీసుకుని అధికారం చెలాయిస్తున్నారని వాళ్ళ బాధ. అదీగాక వాళ్ళు వ్రాసే బూతుకథలను కూడలి లో అనుమతించలేదని, వాళ్ళ బ్లాగుల్లో అందరినీ అశ్లీల పదజాలంతో దూషిస్తూ టపాలు వ్రాస్తున్నారు.

 8. 9 సుజాత 5:52 ఉద. వద్ద ఫిబ్రవరి 6, 2009

  అబ్రకదబ్ర,

  “కిష్కింధ కాండ” అనే కోతులాటలో నా టపాకీ చోటిచ్చినందుకు థాంక్సు!

  దాదాపు ఏడాదిబట్టీ కూడల్లో ఉన్నాను, నాకెప్పుడూ ఏటువంటి ఆధిపత్య సమస్యా రాలేదు. నా గొంతునో, కలాన్నో, కీ బోర్డునో అప్పటి వరకూ ఉన్న పాత కాపులు నొక్కెయ్యలేదు. రాతల్లో పస లేకపోతే ఇలాంటి ఆరోపణలే వస్తాయి.

  కాకపోతే స్త్రీలను దెబ్బ కొట్టాలంటే శీలం గురించి చెడ్డగా మాట్లాడితే సరి, తిరుగులేని ఆయుధం అదే! ఆయువు పట్టు మీద తగిలే దెబ్బ! ఈ దెబ్బతోనే బ్లాగులు మూత పడ్డాయి.

  చేయని నేరానికి నా పేరు లాగబడటాన్ని నేను పది రోజులు సహించి, నిన్న రాశాను టపా, వీలైనంత సంస్కార వంతమైన భాషతో. నాకెవరితోనూ ముఠాలు లేవు, గ్రూపులంతకన్నా లేవు. నా గొంతెప్పుడూ నా సొంతమేనన్నది మీరు ఎరగని విషయం కాదనుకుంటాను.

  ఇకపై ఇది సమసిపోతుందనే నేనూ చూస్తున్నాను.

 9. 10 a2zdreams 7:51 ఉద. వద్ద ఫిబ్రవరి 6, 2009

  నాకు ఇప్పుడు పోసాని కృష్ణ మురళి లాంటి వ్యక్తీ అవసరం కనిపిస్తుంది. అటువంటి attackers కు సౌమ్యంగా చిరంజీవిలా చెపితే అర్ధం కాదు.

  to be frank, వాళ్ళను పట్టించు కోకుండా మన పని మనం చేసుకుంటూ పొతే ఎ బాదా వుండదు. కానీ అలా వుండలేము.

 10. 11 అబ్రకదబ్ర 8:11 ఉద. వద్ద ఫిబ్రవరి 6, 2009

  @సుజాత:

  ‘కిష్కిందకాండ’ అనకుండా ఉండాల్సిందేమో నేను. ఆ పేరు మీలాంటి బాధితులకి కాకుండా కోతిమూకకి మాత్రమే వర్తిస్తుందని గుర్తించ మనవి.

 11. 12 aswinisri 9:19 ఉద. వద్ద ఫిబ్రవరి 6, 2009

  interesting article. yes, it is creating a great confusion to the new-comers. But surely, i can say that new-comers are also being encouraged. i could recognise that much.

 12. 13 krishna rao jallipalli 12:11 సా. వద్ద ఫిబ్రవరి 6, 2009

  99% బ్లాగరులు, బ్లాగరులు-కం-పాఠకులు, పాఠకులు బ్లాగ్ దాడిని ఖండించారు. నైతికంగా బాదితులకు మద్దతునిచ్చారు. కనుక ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. ఇక మీ మీ టపాలతో మునిపటిలాగానే రెచ్చిపోండి, మమ్ముల్ని అలరించండి.

 13. 14 sudha 10:58 ఉద. వద్ద ఫిబ్రవరి 9, 2009

  hello everybody,

  nenu gatha konthakalamga blogs ni serious ga follow ayyi chadavatam prarambincha. bale vundi e vyapakam, nenu o blog open cheddamani avesapadda kuda. kani blog lokam loni parusha pada yuddalu chadivaka..sthrilani ento unnatamga sambodinchatam chusaka..thank god nenu blog open cheyyaledu anipinchindi. plz internet lo telugu chadavatam…blodanni vishayalu entlo kurchuni chadavatam chala bavundi. mala entike parimitamayina vallaki edo manchi grandalayam lantidi. maku me vignananni panchandi chalu, me avesakavesalani vaddu.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: