హమ్మర్లూ, హారన్లూ

ఈ మధ్య బే ఏరియాలో ధ్వని కాలుష్యం ఎక్కువైపోయింది. కారణాల్రెండు: తగ్గిన చమురు ధరలు మరియు కమ్మిన ఆర్ధిక మాంద్యం. బోడి గుండుకీ మోకాలుకీ ముడి?? వేయుట బహు వీజీ. చదువుడి.

పోయినేడాది సెప్టెంబరు దాకా గ్యాసొలిననబడే పెట్రోలు ధర గ్యాలను ఒక్కింటికి మా ఏరియాలో నాలుగున్నర డాలర్లుండేదా, అక్టోబర్నుండీ అది అధో ముఖం పట్టి పాక్కుంటూ వచ్చి ప్రస్తుతం రెండు డాలర్లకి కాస్త తక్కువగా బిక్క చచ్చి కూర్చుంది. దాంతో, రెండేళ్లుగా రోడ్లమీదనుండి ఐపులేకుండా పోయిన ‘హమ్మర్’ నామధేయం గల భారీ వాహనరాజమ్ములు బిల బిల మంటూ మళ్లీ రోడ్లెక్కేసి మోత మోగించెయ్యటం మొదలెట్టాయి.

* * * *

ఉప్పుడు, అగ్నానుల కోసరం కుసింత సెరిత్ర (సఁవర్పణ: జి.గోయిందయ్య): పుస్కరంన్నర పైమాటిది. అనగనగనగనగా ఎ.ఎమ్.జెన్రల్ కార్పొరేసన్ అనే కంపెనీవోల్లు అమెరికా మిలట్రీవోల్ల కోసరం అమ్వీ అనీ – జీబుల్లాంటి బండ్లు – తయారుజేసిత్తండేవోల్లు. బండ్లంటే అసుంటిసుంటి బండ్లు గాదు మరి, మా దిట్టంగా ఉండే బండ్లులే. అల్లప్పుడు సద్దాం ఉస్సేన్ మీద పెద్ద బుస్సు దొర ఒకటో గల్పు యుద్దం జేసిండు దెల్సు గందా, అందులో తెగ వాడిండ్రులే యీటిని. ఎడార్లలో ఇసక దిబ్బల్లో ఇరక్కబోకండా బలే జోరుగా ఎల్తయ్యంట ఇయ్యి. ఒక్క ఎడార్లనేంది, కొండల్లో కోనల్లో ఈడా ఆడా అనేంది, యాడబడితే ఆడ లెవల్ మట్టంగా రోడ్లున్నా లేకబోయినా దూసక బోతనే ఉంటయ్యంట. ఆటిని టీవీలోనో యాడనో జూసిండంట ఆర్నాల్డు స్మార్జిలెగ్గర్ అనే ఆయిన. ఈయిన ఆలీవుడ్లో పెద్ద యాట్టరు. అంటే, మరీ ఎన్టీవోడంత గాకపోయినా, కుసింత పేరున్నోడే. సూసీ సూడంగనే ఆటిమీన మనసు బడ్డడంట. ఎంటనే సైన్నెం కాడికి బోయి ‘మిల్ట్రీవోడూ, మిల్ట్రీవోడూ నాకో బండియ్యవా అసుంటిది’ అని మారాం జేసిండు. ఈ మిలట్రీవోల్లున్నరే, ఈల్లకసలే స్మార్జిలెగ్గరంటే పీకల్దాకా మంట. ఆల్లంతా కల్సి గూడా సెయ్యలేని పన్లు ఈయినొక్కడే ఒంటిసేత్తో సేసేసినట్టు సిన్మాల్లో సూపిత్తాడు గందా, అందుకన్న మాట. ఆల్లు ఈయన్నోపాలి ఎగా దిగా జూసి ‘ధూ నీ మొగం జూడు. అమ్వీ గావాలా నీకు? అయ్యి మిలట్రివోల్లకే గానీ ఓడికిబడితే ఆడికిచ్చేటియ్యి గాదు. ముక్కెంగా, నీ అసుమంటోల్లకస్సలియ్యం. పన్జూసుకో పో’ అని కసిరిండ్రంట. ఇగజూడు, దెబ్బకి, ఆర్నాల్డుకి రోసమొచ్చేసినాది. ఎంటనే ‘నువ్వేంది నాకిచ్చేది’ అన్జెప్పి డవిరెక్టుగా ఆ బండ్లు తయార్జేసే కంపెనీవోడి కాడికే బోయి  ‘నాకో అమ్వీ తయారు జేసి బెట్టు’ అనడిగేసినాడు. ఆల్లలో ఆల్లు ముందు ‘ఈడెవడో తిక్కలోడ్లాగుండే’ అనుకుని తర్వాత ‘సరే ఓడైతేనేం, మనకి నాల్గు డబ్బులొత్తై గందా’ అనాలోసించి ‘సరే’ అన్జెప్పి ఆర్నాల్డు కాడ అచ్చరాలా లచ్చ డాలర్లు గుంజి అచ్చు మిలట్రీ బండి లాంటిదే ఓటి తయారుజేసిచ్చిండ్రు. ఈ సంగత్తెలిత్తే మిలట్రీవోల్లొప్పుకోరన్జెప్పి దానికి  అమ్వీ అని కాకండా అమ్మర్ అని పేరెట్టిండ్రు. ఆర్నాల్డు రయ్యి రఁయ్యిమని దాన్ని ఆలివుడ్డుకి దోలుకెల్లిండు. సరే, ఇగ నే బోయొత్తా. సేనుకి నీల్లెట్టాల. మిగతా సెరిత్ర అబ్రకదబ్ర జెప్తడ్లే.

* * * *

1992లో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ చలవతో మొట్టమొదటి ‘పౌర’ హమ్-వీ (High Mobility Multipurpose Wheeled Vehicle – HMMWV aka HumVee) అనబడే హమ్మర్ (Hummer) అమెరికా రోడ్లెక్కింది. చిన్నపాటి ట్రక్కులా ఉండి అత్యంత మోటుగా కనిపించే దీన్ని చూసి మొదట్లో ‘ఇదేం బండి’ అని నవ్వుకున్న వాళ్లే మెల్లిగా దాన్ని ఇష్టపడటం మొదలు పెట్టారు. అయితే దీని ధర (సుమారు లక్ష డాలర్లు) అందరికీ అందుబాటులో ఉండకపోవటంతో బెవర్లీహిల్స్ లాంటి కోటీశ్వరులుండే ప్రాంతాల్లో మాత్రమే దీని అమ్మకాలు బాగుండేవి. అప్పట్లోఎక్కువగా హాలీవుడ్ నటులు మాత్రమే దీన్ని కొనేవారు. హెచ్-1 పేరుతో విడుదలైన మొదటి తరం హమ్మర్లు ఏడాదికి మహా ఐతే ఏడు నుండి ఎనిమిది వందల వరకూ మాత్రమే అమ్ముడు పోయేవి. 1999లో హమ్మర్ బ్రాండ్‌ని ఎ.ఎమ్.జెనరల్ కార్పొరేషన్ నుండి జెనరల్ మోటార్స్ కార్పొరేషన్ (జి.ఎమ్.సి) కొనుగోలు చేశాక దీని దశ తిరిగింది. జి.ఎం వాళ్లు హమ్మర్‌ని ఆధునీకరించి మరిన్ని హంగులద్ది హెచ్-2, హెచ్-3 వగైరా మోడళ్లని మార్కెట్లో ప్రవేశ పెట్టారు. వీటి ధరలు కూడా అరవై వేల డాలర్ల పై చిలుకే ఉన్నా అవి హాట్ కేకుల్లా అమ్ముడు పోవటం మొదలెట్టాయి. హమ్మర్ పుట్టుకకి కారణమైన ఆర్నాల్డ్‌కి వాటి మీద ఎంత మోజంటే, 2004 నాటికి అతని వద్ద మొత్తం కలిపి పది లక్షల డాలర్ల విలువ చేసే ఏడు హమ్మర్లుండేవి!

సినీ నటుల్లాంటి ప్రముఖులు మాత్రమే ఎక్కువగా సొంతం చేసుకుంటున్న ఈ వాహనంపై మెల్లిగా ఇతర మిలియనీర్ల చూపు కూడా పడింది. క్రమంగా, డబ్బున్నవారికి హమ్మర్ కలిగుండటం ప్రతిష్టాత్మకమైన విషయంగా మారిపోయింది. సిలికాన్ వ్యాలీలో 2000 నాటికి డాట్ కామ్ యుగంలో రాత్రికి రాత్రి మిలియనీర్లయిన నయా ధనిక వర్గం ఒకటి పుట్టుకొచ్చింది. సహజంగానే వీళ్ల దృష్టి హమ్మర్లమీద పడింది. త్వరలోనే, బెవర్లీ హిల్స్ తర్వాత అతి ఎక్కువ సంఖ్యలో హమ్మర్లు కనిపించే ప్రదేశంగా సిలికాన్ వ్యాలీ పేరుపడిపోయింది.

అయితే, కాలం గడిచే కొద్దీ హమ్మర్ అంటే అబ్బురమే కాక అసహ్యం పెంచుకునే వర్గాలూ పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం: గ్లోబల్ వార్మింగ్‌పై అమెరికన్ ప్రజానీకంలో పెరుగుతున్న అవగాహన. గ్యాలను చమురుతో పది మైళ్లు (అంటే, లీటరు చమురుతో 4.2 కిలో మీటర్లు) మాత్రమే నడిచే ఈ భారీ వాహనం సహజంగానే పర్యావరణ ప్రేమికులకి భూతంలా కనిపించింది. ప్రపంచంలో మొట్టమొదటి ‘జిపిఎమ్’ (gallons per mile) వాహనంగా హమ్మర్ ద్వేషులు దీన్ని ఎగతాళి చేయటం మొదలు పెట్టారు. అతి తక్కువ మైలేజీ ఇవ్వటానికి తోడు, ఇది విడుదల చేసే బొగ్గు పులుసు వాయువు శాతం కూడా మోతాదు మించి ఉండటం వీళ్ల కోపానికి ఆజ్యం పోసింది.

ఇదిలా ఉండగా, 2003లో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ సినిమాలకి స్వస్తి చెప్పి కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరుగా ఎన్నికయ్యాడు. గవర్నరుగా ఆర్నాల్డ్ ప్రాధాన్యతల్లో ఒకటి కాలిఫోర్నియాని ‘గ్రీన్ స్టేట్’ గా తీర్చిదిద్దటం. ఆ క్రమంలో కాలిఫోర్నియా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ నిబంధనల్ని మరింత పదునెక్కించింది (‘మరింత’ అనటానిక్కారణం – అప్పటికే అమెరికాలో ఉన్న యాభై రాష్ట్రాల్లోకీ అత్యంత కఠినమైన పర్యావరణ చట్టాలు కాలిఫోర్నియాలో అమల్లో ఉన్నాయి కాబట్టి). ఐతే, మిలటరీకి పరిమితమైన హమ్మర్‌ని సాధారణ పౌరులకీ అందుబాటులోకి తెచ్చి పర్యావరణానికి తనవంతు హాని చేసిన ఆర్నాల్డ్ ఇప్పుడు పర్యావరణ పరిరక్షకుడి అవతారమెత్తటం చూసి బుగ్గలు నొక్కుకునే వాళ్లు బోలెడుమంది. వాళ్ల బుగ్గలు నొప్పెట్టకుండా చేసే సదుద్దేశంతో ‘గవర్నర్’ ఆర్నాల్డ్ జెనరల్ మోటార్స్ వారిని అధిక మైలేజీనిచ్చే హైడ్రోజన్ ఇంధనాధారిత హమ్మర్ తయారు చేసిపెట్టమని పోరటం మొదలు పెట్టాడు. ఇప్పటికైతే జి.ఎమ్ ఒకే ఒక హైడ్రోజన్ హమ్మర్‌ని తయారు చేసి ఆర్నాల్డ్ వాడుకోటానికిచ్చింది. మిగతా వాళ్ల కోసం దీన్ని మార్కెట్లోకి ఎప్పుడు ప్రవేశ పెడతారో ప్రస్తుతానికి తెలీదు.

* * * *

‘ఎహె.. శబ్ద కాలుష్యం అని మొదలెట్టి చరిత్ర పాఠాలేంది? సోదాపి సంగజ్జెప్పు’

అక్కడికే వస్తున్నా. చాలా మంది పర్యావరణ ప్రియులైన సిలికాన్ వ్యాలీ డ్రైవర్లకి హమ్మర్లంటే ఎంత కోపమంటే, రోడ్లమీద అవి కనిపించినప్పుడు హారన్లు మోగించి నిరసన తెలియజేస్తుంటారు. భారీగా పెరిగిన చమురు ధరలు హమ్మర్ చోదకుల చేతి చమురూ భారీగానే వదిలిస్తుండటంతో రెండేళ్లుగా పలువురు హమ్మరోపాసకులు వాటిని మూలన పడేసి ప్రయస్ వంటి హైబ్రిడ్ కార్లేసుకుని తిరగటం మొదలెట్టారు. అప్పట్నుండీ హారన్ల రొద తగ్గి కాస్త ప్రశాంతంగా ఉందా, పోయిన నవంబరు నాటికి చమురు ధరలు బాగా తగ్గటంతో హమ్మర్లు ఒళ్లు విరుచుకుని తిరిగి రోడ్లెక్కాయి. దాంతో హారన్లు మళ్లీ షురూ! ఇదే సమయంలో ముంచుకొచ్చిన ఆర్ధిక మాంద్యం దెబ్బకి ఉద్యోగాలు పోగొట్టుకున్నోళ్లూ పెరిగిపోయారు. ఇలాంటివాళ్లు రోడ్లమీద ఊరికే అయినదానికీ కానిదానికీ అసహనంతో హారన్లు కొట్టటం చేస్తున్నారీ మధ్య. అదండీ – ఆర్ధిక మాంద్యానికీ, పెట్రోలు ధరలకీ, హమ్మర్లకీ, హారన్లకీ లంకె.

‘ఆర్నీ.. ఈ ముక్కేదో ముందే చెప్పకుండా మూడు పేజీల కత చదివించావుగదటయ్యా! మొత్తానికి, బలేటోడివేలే’

 

 

1 ప్రతిస్పందన to “హమ్మర్లూ, హారన్లూ”


  1. 1 కన్నగాడు 9:16 ఉద. వద్ద ఫిబ్రవరి 4, 2009

    గీ ష్వార్జ్‌లెగ్గర్ ఉదజని(హైడ్రోజన్) సంగతైతే ఎర్కనే గని, గా ముందు జెప్పిన సంగతైతే ఎర్కలే నాకు, శానా బాగ శెప్పిండ్రు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: