జనవరి, 2009ను భద్రపఱచుఏమారిన మనిషి

‘నే మారిన మనిషిని’ అని చెప్పుకున్నారు నిన్న చంద్రబాబునాయుడు గారు ఉపాధ్యాయులకి సంబంధించిన ఒకానొక సభలో. ‘ఒకసారి మీ చేతిలో ఏమారాక కూడా మారక ఛస్తానా’ అన్నది ఆయన బయటికి చెప్పని మాట. ఆ మార్పేమిటో కూడా ఆయనే విడమరచి చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉండగా జన్మభూమి పేరుతో ప్రభుత్వోద్యోగులని పరుగులు పెట్టించాను. ఈ సారి అధికారంలోకొస్తే అలా చెయ్యను’, ఇదీ ఆయన వివరణ. దీనికి కొనసాగింపుగా, ‘అభివృద్ధి చెయ్యాలన్న కోరికే అప్పట్లో నన్నలా చేయించింది. ఇకముందు ఉద్యోగులను ఇబ్బంది పెట్టను’ అని కూడా ఒట్టేశారు.  ఆయన వాగ్దానాలకి సదరు సభలోని ఉద్యోగులు స్థిమిత పడ్డట్లే ఉన్నారు. నాలాంటి రంధ్రాన్వేషులకి మాత్రం – ‘నాకు మరో ఛాన్సిస్తే అభివృద్ధి ఊసెత్తనని ప్రమాణం చేస్తున్నా’ అన్నట్లుగా అర్ధమైందేంటబ్బా! నాలాంటోళ్ల గోలెప్పుడూ ఉండేదే కాబట్టి మా సణుగుడు పట్టించుకోనక్కర్లేదు. అభివృద్ధి ఏ గంగలో కలిస్తేనేం, ప్రభుత్వోద్యోగుల సుఖమే మనకి ముఖ్యం; వాళ్ల కడుపులు చల్లగా ఉంటే చాలు.

‘నా కార్యక్రమాల కారణంగా కోపించిన ఉద్యోగులు నన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ సారి వాళ్లని కష్టపెట్టను’ అని కూడా ఇదే సందర్భంగా బాబు గారన్నారు. అది హాస్యోక్తో, ఆవేదనతో కూడిన చురకో ఆయనకే ఎరుక. నేటి భారతావని దుస్థితికి అసలు సిసలు కారణాన్ని కళ్లకు కట్టిన వ్యాఖ్యది. ‘మంచి చేసినందుకు సిగ్గు పడుతున్నా, మళ్లీ ఆ తప్పు చేయను’ అని ఓ మాజీ ముఖ్యమంత్రితో అనిపించే స్థాయిలో కుళ్లిపోయింది మన సమాజం! ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసినవన్నీ మంచి పనులే అని ఆయన వీరాభిమానులు కూడా చెప్పరు. కానీ రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కొంత నిజాయితీగా కష్టపడ్డాడనేది ఆయన విరోధులు సైతం ఒప్పుకునే విషయం. జన్మభూమి వంటి కార్యక్రమాలు అనంతర కాలంలో తెదెపా కార్యకర్తలకు, సొంత పార్టీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టే దారులుగా మారాయని విమర్శలొచ్చినా, వాటివల్ల కలిగిన ప్రయోజనాలూ అనేకం. నేడు అందరి నోటా వినిపిస్తున్నఉచిత బియ్యం, ఉచిత కరెంటు, ఉచిత వైద్యం వంటి అర్ధరహిత పధకాలతో పోలిస్తే – చంద్రబాబు అమలు చేసిన శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, పనికి బియ్యం వంటివి నిర్మాణాత్మక పధకాలే. వీటన్నిట్లోనూ ప్రభుత్వోద్యోగులని భాగస్వాములుగా చెయ్యటమే కాకుండా ఆకస్మిక తనిఖీలు, ఫైల్ క్లియరెన్స్ వారోత్సవాల వంటివాటితో వాళ్లనెప్పుడూ ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉండేవాడాయన. బాబు హయాంలో ప్రభుత్వోద్యోగుల్లో లంచగొండితనం ఇప్పటితో పోలిస్తే తక్కువ, పని చేసే స్వభావం ఎక్కువ అనే భావన నేడు సాధారణ ప్రజల్లో కలగటానికి ఇవన్నీ ప్రధాన కారణాలు.

‘నేను రియలైజ్ అయ్యాను’ అనేది పై సభలో బాబు అన్న మరో ముక్క. అందులో ‘ప్రభుత్వోద్యోగులతో పెట్టుకుంటే అంతే’ అన్న భావమే వినిపిస్తుంది. 2004 ఎన్నికల్లో తెదెపా ఓటమికి కారణాలు బోలెడు. వాటిలో – ప్రభుత్వ వ్యతిరేక ఓటు ముఖ్యమైనది, ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వటం రెండవది కావచ్చు. పైకి కనిపించని మరో కారణమూ ఉంది. కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లని వాడే విషయంలొ అనేకమంది గ్రామీణ ఓటర్లు గందరగోళానికి గురయ్యారనీ, వారికి సహాయం చేసే నెపంతో ఓటింగ్ ఆఫీసర్లైన ప్రభుత్వోద్యోగులు హస్తం గుర్తు మీట నొక్కించేశారనీ అభియోగాలున్నాయి (అది చూస్తూ పోలింగ్ ఏజెంట్లేమి చేస్తున్నారనేది ఆసక్తికరమైన ప్రశ్న). ఏదేమైనా, బాబు ఓటమి వెనక – ఎన్నికల వేళ అపరిమిత అధికారాలు చెలాయించే ప్రభుత్వోద్యోగుల పాత్ర ఎంతో కొంత ఉందనేది నిజం. అనేక అసెంబ్లీ స్థానాలని తెలుగుదేశం రెండు మూడు వేల ఓట్ల తేడాతోనే చేజార్చుకున్న ఆ ఎన్నికల్లో ఇటువంటి వెన్నుపోట్లు లేకుంటే చరిత్ర మరోలా ఉండేదేమో. బాబు వ్యాఖ్యలకి నేపధ్యం అదే.

ఇదొక్కటే కాదు – చంద్రబాబు మరెన్నో విషయాలు రియలైజ్ అయ్యాడని ఈ మధ్య ఆయన వరసగా దూకుతున్న గోడలు, తిరగేస్తున్న పళ్లాలు, వేస్తున్న పిల్లిమొగ్గలు చాటి చెబుతున్నాయి. ప్రత్యేక తెలంగాణాకి జై, హైటెక్ విధానాలకు బై బై, ప్రభుత్వోద్యోగులపై ఆదరం, కమ్యూనిస్టులతో చెలిమి, ఉచితానుచితాల్లేని ఉచిత హామీలు .. ఒకటా రెండా? అవతల – ‘ర్రండి బ్బాబూ ర్రండి.. అడగనోళ్లదే పాపం, అన్నీ ఫ్రీ’ అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఇన్‌స్టంట్‌గా సిద్ధించే వరాలు, హామీలు గుప్పించి పారేస్తుంటే; ఫలాలెప్పటికో చేతికందే నిర్మాణాత్మక పధకాలు, విజన్లు, అభివృద్ధి జపాలతో తిరిగి అధికారంలోకి రావటం కల్ల అన్న నిర్వేదంలో పడిపోనట్లున్నాడు చంద్రబాబు. ఆ నిర్వేదమే ‘ఇలాంటి ప్రజలనుద్ధరించటానికి నేను కష్టపడాలా. వాళ్లు కోరిందే ఇచ్చేద్దాం’ అన్న తీర్మానానికి దారి తీసుండొచ్చు. చూద్దాం, ఈ మారిన మనస్తత్వం ఆయన్ని తిరిగి అధికారంలోకి తెస్తుందేమో. అదే జరిగితే – మాట మార్చే మనిషిగా కూడా పేరుంది కాబట్టి – ఆయన మరోసారి మారిపోతాడనీ, ఈ ఒట్లన్నీ తీసి గట్టు మీద పెట్టేస్తాడనీ ఆశిద్దాం. నేటి మార్పంతా ఎన్నికల ఎత్తుగడే కావాలని కోరుకుందాం. అప్పుడే .. సర్వేజనా సుఖినోభవంతు. లేకపోతే రాష్ట్రానికి చిప్పా మిగలదు.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.