రామ రసం

‘మంగుళూరు పబ్‌లో రామదండు దాడి చేసి అక్కడ తాగి తందనాలాడుతున్న వాళ్లని – ముఖ్యంగా అమ్మాయిలని – చితక్కొట్టింది’, నిన్నటి వార్త. దీని గురించి దేశమంతా మీడియాలో గగ్గోలు. ఎవరి ప్రతిభకు తగ్గట్లు వాళ్లు సంచలనాత్మక శీర్షికలు పెట్టి ఊదరగొట్టేశారు. దృశ్య మాధ్యమాల్లోనైతే చెప్పక్కర్లేదు. దాడి వీడియోని తిరగా మరగా వేసి చూపిస్తూ తెగ బాధపడిపోయారు. అందరిదీ ఒకే మాట: ‘మంగళూరులో దారుణం’. కొన్ని టీవీ ఛానళ్లైతే మరీ ముందుకెళ్లి ‘హారర్ ఇన్ మంగళూర్’ అని పేరు పెట్టేసి ప్రసారం చేశాయీ వార్తని – ఇదేదో బొంబాయి మీద తీవ్రవాదుల దాడంత ఘోరమైన సంఘటనలా చిత్రీకరిస్తూ! ఇది జరిగిన రోజే మన రాష్ట్రంలో ప్రేమ పేరుతో రెండు దాడి సంఘటనలు జరిగాయి. ఇలాంటివి ఈ మధ్య కాలంలోనే మరెన్నో జరిగాయి. వాటి గురించెప్పుడూ జాతీయ మీడియా ఇంత హడావిడి చేసిన పాపాన పోలేదు. పేజ్-3 విషయాల్లోనూ, తాజ్ హోటల్ ఘోరంలోనూ ఉన్న ఆకర్షణ వీటికెక్కడిది మరి?

పట్టణ ప్రజానీకంలో మంగళూరు ఘటనపై తలో మాట. ‘స్వతంత్ర దేశంలో ఎవరిష్టమొచ్చినట్లుగా ఉండే హక్కు వారికుంది. మోరల్ పోలీసింగ్ చెయ్యటానికి వాళ్లెవరు?’ అన్నది విమర్శకుల సూటి ప్రశ్న. మంచి ప్రశ్నే. ‘అలనాడు సారా వ్యతిరేకోద్యమంలో ఊరూ వాడా స్త్రీలంతా ఏకమై కల్లు బట్టీలు ధ్వంసం చేసినప్పుడు జైకొట్టిన నోళ్లే ఇప్పుడు నాలుక మడతేసి పబ్‌పై దాడిని ఖండిస్తున్నాయి. రెండు చోట్లా జరిగేది తాగి తందనాలాడటమే. ఒక చోట ఒప్పైన దాడి మరో చోట తప్పెలా అయింది? తేడా ఎక్కడ?’ – లాంటివి చొప్పదంటు ప్రశ్నలు. ‘ఇదే రామదండు హైదరాబాదు పాతబస్తీలో ఏ కల్లుపాకపైనో దాడి చేస్తే – అప్పుడూ మీడియా వైఖరి ఇలాగే ఉంటుందా? దాన్నీ ‘దారుణం’ అంటారా లేక ‘చిన్న సంఘటన’గా సరిపెడతారా? అప్పుడు ఈ విమర్శకుల గళాలు మరోలా ఉండేవా?’ – ఇవి నాలాంటి మధ్యేవాదుల కొసరు ప్రశ్నలు. భారతీయత విషయంలో కాషాయ దండుకి పేటెంట్లిచ్చేసిన వర్గమొకటి ఇప్పుడు పబ్బుల మీద వాళ్లు దాడి చేస్తే ఉలిక్కి పడుతుంది. మొత్తానికి – ‘మాదాకా రాకపోతే సంస్కృతి పరిరక్షణ పేరుతో ఎవరెలా పెట్రేగినా ఫర్వా నై, కావలిస్తే కూసింత నైతిక మద్దతూ అందిస్తాం’ అనుకునే గుణం పేరుకుపోయిన కొందరిలోనైనా చిన్నపాటి కలవరం – ‘పేనుకు పెత్తనమిచ్చామా’ అన్న శంక.

అసలు కధలోకొస్తే – మంగుళూరు సంఘటనలో తప్పెవరిదన్న విషయంలో భిన్నాభిప్రాయాలు. ఇటువంటి ప్రతి సంఘటనలోనూ ఉన్నట్లే – ఇక్కడ తప్పు రెండు వర్గాలదీ. పులిని చూసి వాతలు పెట్టుకున్నట్లు అడ్డగోలుగా పాశ్చాత్య పోకడలు పోవటమే స్వేఛ్చ అనుకునే అబ్బాయిలూ, వాళ్లకి దీటుగా చెడిపోవటమే సమానత్వమనుకునే అమ్మాయిలూ, ఇలాంటోళ్లని దారిలో పెట్టటానికి భౌతిక దండనే దారనుకునే అతివాద మూకలూ .. వీళ్లు భావి భారత నిర్మాతలు! విశృంఖలతకి స్వేఛ్చ అనే పేరు తగిలించుకునే వాళ్లు కొందరు, రాముడి పేరుతో అరాచకాలకి తెగబడేవాళ్లు మరికొందరు. వీళ్ల దారులు కలవనంతవరకూ గొడవే లేదు. ఒకరికి ఒకరు అడ్డొచ్చినప్పుడే భీభత్స రసం. మంగళూరు ఘటనలో నాకైతే మంచే కనిపిస్తుంది. ఇలాంటి దాడులు సమర్ధనీయమని దానర్ధం కాదు. కనీసం ఈ ఘటన వల్లనైనా దేశమంతా యువతలో పెరిగిపోతున పబ్ కల్చర్, ఆధునికత ముసుగులో పొడుచుకొస్తున్న పెడపోకడలపై అంతో ఇంతో చర్చ జరిగే అవకాశముంది. అదే సమయంలో, కాషాయ దళాలకి పెత్తనమివ్వటమంటే తాలిబాన్ తరహా పద్ధతులకి తలుపులు తెరవటమేనన్న విషయమూ అవగాహనలోకొచ్చేలా చేసిందీ ఘటన. ఆ మేరకు రాముడే ఏదో తారకమంత్రమేసినట్లున్నాడు.

15 స్పందనలు to “రామ రసం”


 1. 1 జీడిపప్పు 9:49 సా. వద్ద జనవరి 27, 2009

  కొట్టడం – ఎవరిని కొట్టినా తప్పే.
  ఫలితం – చాలా మంచి ఫలితం

 2. 2 laxmi 10:37 సా. వద్ద జనవరి 27, 2009

  భలే చెప్పారండీ. సమానత్వం అంటే ఏంటో కాస్త ఈ అమ్మాయిలు తెలుసుకుంటే బాగుండు. అబ్బాయి తాగితే అతనొక్కడిదే ఆరోగ్యం పాడవుతుంది, అదే అమ్మాయి తాగితే ఆమె జన్మనిచ్చే ముందు తరానికి ఆరోగ్యం బదులు అవకరాలను గిఫ్ట్ గా ఇచ్చినది అవుతుంది. ఆ తేడా తెలుసుకుంటే ఇలాంటి దాడులు అవసరం ఉండవు

 3. 3 కామేశ్వర రావు 11:15 సా. వద్ద జనవరి 27, 2009

  బాగా చెప్పారు.
  మన sensitivitiesని కూడా ప్రచార సాధనాలే నిర్ణయించే, నియంత్రించే రోజులొచ్చాయి!
  మీరన్నట్టు, సంస్కృతిని కాపాడే పేర హింసావాదాన్ని ప్రోత్సహించడం ఎంత ప్రమాదమో, తప్పో తెలుసుకోవడం ఒకవైపు – స్వేఛ్చ, నాగరకత పేరుతో మనం ఎటు ప్రయాణిస్తున్నాం అని నిజాయితీగా ఆత్మశోధన చేసుకోడం మరోవైపు, రెండూ సమతూకంతో సాగితే బావుంటుంది. కానీ ఇలాటి పక్షపాతరహిత ఆలోచనా ధోరణి చాలా తక్కువగా కనిపిస్తోంది.

 4. 4 కె.మహేష్ కుమార్ 1:00 ఉద. వద్ద జనవరి 28, 2009

  మద్యపాన వ్యతిరేక ఉద్యమ నేపధ్యంలో పబ్ పైన దాడి జరిగుంటే ఇంత విషయం ఉండేది కాదు. దాడి చేసిన వారి లక్ష్యం కర్ణాటకలోని పబ్ లన్నింటినీ మూయించి మద్యరహిత కర్ణాటక చెయ్యడమయితే, కాస్తోకూస్తో మద్దతు తెలిపినా ఒక అర్థముంది. కానీ ఈ మూక అక్కసు, అమ్మాయిలు పబ్ లో తాగుతున్నారని.అది భారతీయ సంస్కృతికి విరుద్ధమని. మరి వీళ్ళు మాత్రం అక్కడ చేసిందేమిటి? చట్టవ్యతిరేకంగా ఒక సార్వజనిక ప్రదేశంలోకి జొరబడి తమ పర్సనల్ సమయం గడుపుతున్న ఆడా-మగల్ని కొట్టి తరమడం. అది చట్టపరంగా,సంస్కృతిపరంగా ఏ విధంగా చూసినా సమర్థనీయం కాదు.

  సార్వజనిక భద్రతకు హానికలగని ఏ వ్యక్తిగత హక్కుల్నీ కాలరాసేహక్కు మతానికీ,సంస్కృతికీ లేదు. దాన్ని విశృంఖలత్వం అని ఎవరైనా అనుకుంటే, చట్టపరంగా indecent exposure లేక immoral trafficking act ప్రకారం చర్య తీసుకోవలసిందిగా కంప్లెయింట్ చెయ్యొచ్చు. అంతేగానీ ఇలా దాడికి దిగితే అది ఆటవికం అవుతుందేగానీ నాగరికం అనిపించుకోదు.

 5. 5 ప్రభాకర్ మందార 1:04 ఉద. వద్ద జనవరి 28, 2009

  మంగుళూరులో మహిళల పై జరిగిన దాడిని సారా వ్యతిరేకోద్యమంతో పోల్చడం లో ఏమైనా ఔచిత్యం వుందా? సారా బట్టీలు ధ్వంసం చేసినప్పుడు జైకోట్టిన నోళ్లే పబ్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాయని వెటకారం చేయడం మరీ అన్యాయం.

  సారా ఎంతమంది పేద ప్రజల జీవితాలను కబలించిందో ఎన్ని పుస్తెలు తెగిపోఎందుకు కారణమయిందో నిజాయితీగా అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిచండి.

  పబ్ లు బాగా డబ్బున్న గుప్పెడు మంది ఉన్నత వర్గానికి సంబంధించిన వ్యవహారం లేదా వ్యామోహం. వాళ్లు పబ్బుల్లో కాకపోతే ఇళ్ళల్లో తాగి తందానాలాడతారు.

  పబ్ విష సంస్కృతికి వ్యతిరేకంగా ఉద్యమించే పధ్ధతి ఇదేనా? ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం ఎ సంస్కృతికి ప్రతీక? వీళ్ళా భారతీయ సంస్కృతిని కాపాడేది!

 6. 6 కొత్తపాళీ 1:17 సా. వద్ద జనవరి 28, 2009

  జీడిపప్పు – ఏమిటా మంచి ఫలితం? తాగబోయే వాళ్ళు మానేస్తారనా? పొరబడ్డారు.

 7. 7 అబ్రకదబ్ర 1:58 సా. వద్ద జనవరి 28, 2009

  @ప్రభాకర్:

  >> “సారా ఎంతమంది పేద ప్రజల జీవితాలను కబలించిందో ఎన్ని పుస్తెలు తెగిపోఎందుకు కారణమయిందో నిజాయితీగా అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిచండి”

  ఈ విషయంలో నేను కొత్తగా అర్ధం చేసుకోవటానికి ఏమీ లేదు. పేదలు తాగే సారా ఒక్కటే కాదు, అన్ని రకాల, అన్ని స్థాయిల మద్యపానమూ అనర్ధమేననేది నా నిశ్చితాభిప్రాయం. అయితే – కల్లు కాంపౌండ్లని ధ్వంసం చేస్తే జైకొట్టినోళ్లు పబ్‌లపై దాడిని ఛీకొట్టటం నావరకూ ఆశ్చర్యకరమైన విషయమే. రికార్డింగ్ డాన్సులని చీదరించుకుంటూ, క్యాబరేలని ఓ కళగా గుర్తించటం లాంటిదిది. ఎందుకంత వైరుధ్యం?

  >> “పబ్ లు బాగా డబ్బున్న గుప్పెడు మంది ఉన్నత వర్గానికి సంబంధించిన వ్యవహారం లేదా వ్యామోహం. వాళ్లు పబ్బుల్లో కాకపోతే ఇళ్ళల్లో తాగి తందానాలాడతారు”

  మీరు పదేళ్ల క్రితం సంగతి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పబ్‌లు ఉన్నత వర్గాల వ్యవహారాలెంతమాత్రమూ కాదు. పాకెట్ మనీతో పబ్‌లకెళ్లే కాలేజీ విద్యార్ధులనడగండి; మందు, మాదకద్రవ్యాలకోసం దిగజారిపోయే అమ్మాయిలనడగండి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, మరో పదేళ్ల తర్వాత మీరూ నా దారికే వస్తారనటంలో అతిశయోక్తి లేదు.

  >> “పబ్ విష సంస్కృతికి వ్యతిరేకంగా ఉద్యమించే పధ్ధతి ఇదేనా? ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం ఎ సంస్కృతికి ప్రతీక? వీళ్ళా భారతీయ సంస్కృతిని కాపాడేది”

  కాదనే నేనూ చెప్పేది. ఒక విష సంస్కృతిని అరికట్టటానికి మరో విష సంస్కృతికి అంటుకడుతున్నారు వీళ్లు. మనకి ఈ రెండూ వద్దు. రెంటినీ మొదట్లోనే తుంచకపోతే చివరికి మిగిలేది అరాచకమే.

 8. 8 chaitanya 3:50 సా. వద్ద జనవరి 28, 2009

  >> చాల మంచి ఫలితం — తప్పేమో ? ఎవరైనా స్వతహాగా, ఏది బలవంతపు అణచివేత ఐతే, దాన్ని మరింతగా చేయాలని ప్రయత్నిస్తారు, దొంగ చాటు గా అయినా ! ఈ లక్షణం యువతలో మరింతగా ఉంటుంది ! సేన ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే కానీ, చేసిన పధ్ధతి మంచిది కాదు !

  ఇప్పుడు తాగుడు, ఒకప్పుడు కూల్ డ్రింక్స్ తాగటం ఎంత ఫాషనో అంత ఫ్యాషన్ ఐపోయింది ! ఇక పబ్బుల్లో డాన్సులు …యువత ఆటవిడుపు కార్యక్రమాలు ! ఒకప్పుడు దీన్ని తాగి తందనాలు ఆడటం అనేవారు … ఇప్పుడు పబ్బు డాన్స్ అంటున్నారు !

  ఈ మద్యం అమ్మకాల్ని ప్రోత్సహించే మీడియా ప్రకటనలు, దాన్ని స్టైలు, ఫాషన్ అని చెప్పే సినిమాలు, ఎక్కడ పడితే అక్కడ యువతకి మద్యం సరఫరా చేసేందుకు లైసెన్సు ఇస్తున్న ప్రభుత్వ వైఖరి, వీటి మీద … ఈ దాడి చేస్తే, బాగుండేది ! అందరి మద్దతూ వచ్చేది !

  వేరులో తప్పు పెట్టుకుని ఆకులు రాల్చినట్టుంది సేన దాడి !

 9. 9 chaitanya 4:02 సా. వద్ద జనవరి 28, 2009

  @అబ్రకదబ్ర గారు, మీతో పూర్తీ గా ఏకీభవిస్తాను ! మంచి టపా !

  >>మీరు పదేళ్ల క్రితం సంగతి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పబ్‌లు ఉన్నత వర్గాల వ్యవహారాలెంతమాత్రమూ కాదు.

  పచ్చి నిజం !

 10. 10 Vamshee 6:55 ఉద. వద్ద జనవరి 29, 2009

  నిజమే మాస్టారు! కల్లు కాంపౌండ్ పగలగొట్టినా, పబ్ పకలగొట్టినా రెండూ ఒకటె. ఈ వ్యాఖ్యకు, సారా వ్యతిరేక వుద్యమానికీ సంబంధం లేదు. ఇవి రెండూ హింసాయుతమే అని చెప్పడం ఒక్కటే ఉద్దేశ్యం.

  ఇక పేనుకు పెత్తనమిచ్చామా అని ప్రశ్నించుకోవడం గురించి! ఈ ప్రశ్న తమను తాము వేసుకునే-ఓటేసే మారాజులు ఎంతమంది ఉన్నారంటారు? లేరండి…ఉన్నా వేళ్ళమీద లెక్కగట్టవచ్చు.మరో మాట. రాజకీయంగా కాషాయాన్ని వాడే మహశయులు, రాజ్యాధికారం వచ్చినవెంటనే విధానాలపరంగా ఇంచుమించు ఇతర పార్టీలలాగానే ఉంటున్నారు. మన ఎర్ర కండువా నాయకుల్లాగా! దేశకాలమాన పరిస్థితుల ప్రభావమన్నమాట!

  ఈ కాషాయ రాజకీయాలవారు మొదట మార్కెట్లో ఓపెనింగ్ కోసం రధయాత్ర చేసి, రెచ్చగొట్టి లబ్దిపొందారు. ఈ మిగితా పార్టీలు వాళ్ళను మేము ముట్టుకోమంటే మేము ముట్టుకోం అని వెలివేస్తున్న కారణంగా, వీళ్ళకి కాషాయమే దిక్కవుతోంది, అలాగే కాషయం మీద గుత్తాధిపత్యమూ వచ్చిపడుతోంది. కుల రాజకీయాలు చేయడానికి, మైనారిటీలను కాపాడుతాం అనటానికీ, మెజారీటీని కాపాడాల్సి వస్తోందని ధ్వజమెత్తడానికి అన్నిటికీ లింకుది. ఏతా వాత నేననేది ఏంటంటె, అన్నీ పెలే. కాబట్టి మనకు పేనుకొరుకుడు తప్పదు. మీరన్నట్టు ఆ రాముడు తారక మంత్రం తప్పక చెపుతూనే వున్నాడు కాబట్టే ఈ మాత్రమన్నా మన దేశం బతుకుంది. లేకపోతే ఈపాటికి డివైడెడ్ స్టేట్స్ ఆఫ్ సబ్‌కాంటినెంట్ అవతరించి వుండేది కాదూ!

 11. 11 satya 2:59 ఉద. వద్ద జనవరి 30, 2009

  @ మహేష్ కుమార్, దాడి చేసిన వారి అక్కసు అమ్మాయిలు తాగుతున్నారని మీరు ఊహిస్తే పొరపాటే. వాళ్ళు మొత్తంగా పబ్బుల సంస్కృతి కి వ్యతిరేకం. వాళ్ళు దాడి చెయ్యటాన్ని ఎవరూ సమర్ధించటం లేదు కానీ పబ్బులకి వ్యతిరేకం అన్న వాళ్ళ ఆలోచనలకే మద్దతు ఇస్తున్నారు. మీరు ఆంగ్ల మీడియాకి యే మాత్రం తీసిపోకుండా దాన్ని హిందు మతానికి చుట్టేయటానికి ఆరాటపడుతున్నట్లుంది. ఎదైతేనేం, ఇప్పుడు యడ్యూరప్ప సర్కార్, రాజస్థాన్ ప్రభుత్వం కూడా పబ్బులకి వ్యతిరేకం గా నిర్ణయాలు తీసుకోవటం/ఆ దిశ గా ఆలోచనలు చెయ్యటం ఈ ఉదంతం లో ఒక పాజిటివ్ పరిణామమే కదా. దాన్ని మీరు హర్షిస్తున్నారా లేదా? ఇక మీరు చెప్పే అన్ లాఫుల్ గా కొట్టారు అన్నప్పుడు నేను సారా ఉద్యమాన్ని కూడా తప్పు పట్టచ్చు. (వాళ్ళ లక్ష్యం ఏదైనా ‘సార్వజనీక ‘ ప్రదేశం లో చట్ట బద్ధ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళపై దాడి చెయ్యటం) ఇంక మీరు ఆడ, మగా ఒకటే అంటూ, మహిళలని కొట్టారో.. అని ఊదరగొట్టటం దేనికి? ఇది మిగతా సంధర్భాలలో మహిళలపై దాడి లాగా తీసుకోవచ్చుగా.. (అలాంటి ఎన్ని సంధర్భాలలో మీరు టపాలు వ్రాసి మీ అభిప్రాయం తెలియచేసారు ?) చేసిన చర్య ని సమర్ధించకపోయినా కొన్నిసార్లు ఆటవిక చర్యల వల్లే ఫలితాలు వస్తాయి. అదే వాళ్ళు చట్టబద్ధం గా పోలీసులకి కంప్లైంట్ చేసివుంటే, ఎవరూ పట్టిచ్చుకునే వాళ్ళు కాదు. మీడియాకి, మనకు ఇంత వినోదం ఉండేది కాదు. నిజం చెప్పాలంటే అదే రోజు దేశవ్యాప్తం గా వివిధ చోట్ల మహిళలపై జరిగిన ఆకృత్యాలతో పోల్చితే ఇది చాలా చాలా చిన్న సంఘటన. అక్కడ ఎవరినీ మీరు చెప్పేంత, ఊహించుకునేంత అమానుషంగా, పైచాచికంగా, నిర్దయగా, కొట్టలేదు, ఆంగ్ల మీడియా అతి చెయ్యటం వల్ల రెండు రాష్ట్రాలలో అయినా ఉపయోగం కలిగింది. అవసరం ఉన్నా లేకపొయినా హిందూఇజం పై దాడి చెయ్యటం మీ లక్ష్యం గా అనిపిస్తుంది., ప్రతి వ్యవస్థ లోనూ లోపాలు ఉంటాయి, నూటికి నూరుపాళ్ళు లొపాలే అయితే ఇన్ని వేల సంవత్సరాల పాటు మనగలిగేదే కాదు. అయినా నాదొక చిన్న రిక్వెస్ట్. హిందుయిజం పై/హిందు మతంలోను, భారతీయ సంస్కృతి లోను, ఆచారాల్లోను మత గ్రంధాలలోనూ మీకు వీటిలో అవగాహన ఉన్నంత మేరకు, అందులో మీరు తెలుసుకున్న పాజిటివ్ విషయాల గురించి ఒక టపా వ్రాస్తారా? we can speak a lot about negatives. but at the same time it is equally important that what are the positives we have identified. If we can’t see then it is not the problem with the system but lies with us. No Offense.

 12. 12 Marthanda 6:27 సా. వద్ద ఫిబ్రవరి 1, 2009

  మన వాళ్ళు ఈ సంస్కృతి విషయంలో సినిమాలని, టి.వి. చానెళ్ళని మాత్రమే తప్పుపడతున్నారు. పత్రికలని తప్పు పట్టాల్సిన అవసరం లేదా? సరసాన్ని నాలుగు గోడలు మధ్య జరిగే ప్రైవేట్ విషయంగా పరిగణిస్తే ఫర్వా లేదు. మరీ పబ్ లకి వెళ్ళి బహిరంగంగా ఒళ్ళు ప్రదర్శించుకోవడమే అసహ్యకరంగా ఉంటుంది. దేహ ప్రదర్శనల వల్ల ఆడవాళ్ళకే కాదు, కొంతమంది మగవాళ్ళకి కూడా అసహ్యం కలుగుతోంది. ఒకప్పుడు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళేవాడ్ని. అక్కడ కొంత మంది కస్టమర్స్ ఇంటర్నెట్ లో ఓపెన్ చేసిన xx ఫోటోలని డెస్క్ టాప్ వాల్ పేపర్స్ గా పెట్టే వాళ్ళు. అవి చూసిన నెట్ కేఫ్ ఓనర్ కి అసహ్యం కలిగి “xx వెబ్ సైట్స్ అనుమతించబడవు” అని బోర్డు పెట్టాడు. నా చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఒక తెలుగు పత్రిక చదువుతున్నాను. అందులో రెండు పీలికలు దుస్తులు వేసుకుని పోస్ ఇచ్చిన ఒక మోడల్ xx ఫోటో కనిపించింది. ఈమె సతీ సావిత్రి అని ఒకరు, సతీ అహల్య అని ఇంకొకరు ఆ xx ఫోటో పై వెక్కిరింపు కామెంట్లు చేశారు. ఆడదాని గౌరవం స్కూల్ పిల్లల దగ్గర కూడా నవ్వుల పాలయ్యింది.

 13. 13 ఏకాంతపు దిలీప్ 12:08 సా. వద్ద ఫిబ్రవరి 14, 2009

  @ అబ్రకదబ్ర, సత్య
  మీతో ఏకీభవిస్తున్నాను…

 14. 14 sri 5:54 సా. వద్ద ఫిబ్రవరి 20, 2009

  ఇంట్లొ తల్లితండ్రులు పిల్లలకు చెప్పె స్థితిలొ వుండరు (ఎందుకంటె వాళ్ళె తాగుడుకు బానిసలొ, లేక గారబమొ లేక అతి స్వెచ్చా వాదులొ), బయట రాజకీయ నయకులు చెప్పరు, సినిమాలు తాగమని చెప్పుతాయి(హిరోఇజం అని) మరియు మందు అమ్ముకొనె వాడు చెపుతాడు. తెలిసి తెలియని వయస్సులొ, బార్లకు పబ్బులకు వెళ్ళి బానిసలు గా మారి లేదా అలొచన శక్తి నశించి తప్పు చెసి, తెలుసుకొనె లొపు, జీవితము అయిపొయి భారత యువత జీవితాని వ్యర్ధం చెసుకొవలసిందేన?

  కనీసం ఇప్పుదైన శ్రీ రామ సేన దయతొ, పబ్ కల్చర్ పైన ఒక ఆలొచన రెగింది ప్రజలలొ. లెక పొతె, యెవరి కి వారు, మన కెందుకులె అని దెశాన్ని నాశనము చెసె వారు.

  ఆయిన పశ్చత్యులు మన దెశాన్ని మన సంస్క్రుతి ని అభిమానించి మన వద్దకు వస్తుంటె మన దెశ యువత త్రాగుడుకు బానిసై మత్తులొ జొగడమెమిటి. మన దెశ మహత్ముడు గాధిజీ ని, ఆయన జీవిథ బొధలను వాళ్ళు మనము ఎంత బాగ అచరిస్తున్నమొ అని అశ్చర్య పొతారు.

  స్వెశ్చ అనెది రెందు వైపుల పదునైన కత్తి వంటిది. దానిని నీ ఇగ్నొరెన్సు నశిపచెసుకొని మహొన్నతమైన వ్యక్తిత్వమును పొందుటకు వుపయొగించుకొవచ్చును, లెదా, అదే స్వెశ్చ నీకు శాపమై పొవచ్చును విచక్షణ లెకుండ వుపయొగిస్తె.

  నీ వరుకు నువ్వు ఇంట్లొ తాగు, చావు ఏమైన చెసుకొ. కాని పబ్బులు లెక బార్ల లొ వెళ్ళితే, నిన్ను గమనిస్తున్న వారిలొ, తప్పుడు భావములు మొలకెత్తుతాయి.

  ఈది ఎదో అమ్మాయిలకు మాత్రమే సంబంధించిన విషయము కాదు. మొత్తం యొవతకు సంబంధించినధి. ఆసలు త్రాగుదు వల్ల అలొచన శక్తి నశించి తప్పు చెసి జీవితాలు నషనము చెసుకొవడమె దరిద్రము. ఫైగ, ఈ దరిద్రానికి స్వెశ్చ అని పెరొకటి. దానికి తోడు, యెవత్తొ సెంట్రల్ మినిష్టర్ ఒకత్తె వచ్చి “తాలిబనైసెషన్” అని శ్రీ రామ సేన ను విమర్షించడము. సిగ్గు లేని జనాలు, సిగ్గు లెని నాయకులు.


 1. 1 మీడియా పోషించే వైషమ్యం « Rayraj Reviews 5:58 ఉద. వద్ద జనవరి 28, 2009 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 303,010

పాత గోడులు

వేడి వేడి గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: