ఏమారిన మనిషి

‘నే మారిన మనిషిని’ అని చెప్పుకున్నారు నిన్న చంద్రబాబునాయుడు గారు ఉపాధ్యాయులకి సంబంధించిన ఒకానొక సభలో. ‘ఒకసారి మీ చేతిలో ఏమారాక కూడా మారక ఛస్తానా’ అన్నది ఆయన బయటికి చెప్పని మాట. ఆ మార్పేమిటో కూడా ఆయనే విడమరచి చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉండగా జన్మభూమి పేరుతో ప్రభుత్వోద్యోగులని పరుగులు పెట్టించాను. ఈ సారి అధికారంలోకొస్తే అలా చెయ్యను’, ఇదీ ఆయన వివరణ. దీనికి కొనసాగింపుగా, ‘అభివృద్ధి చెయ్యాలన్న కోరికే అప్పట్లో నన్నలా చేయించింది. ఇకముందు ఉద్యోగులను ఇబ్బంది పెట్టను’ అని కూడా ఒట్టేశారు.  ఆయన వాగ్దానాలకి సదరు సభలోని ఉద్యోగులు స్థిమిత పడ్డట్లే ఉన్నారు. నాలాంటి రంధ్రాన్వేషులకి మాత్రం – ‘నాకు మరో ఛాన్సిస్తే అభివృద్ధి ఊసెత్తనని ప్రమాణం చేస్తున్నా’ అన్నట్లుగా అర్ధమైందేంటబ్బా! నాలాంటోళ్ల గోలెప్పుడూ ఉండేదే కాబట్టి మా సణుగుడు పట్టించుకోనక్కర్లేదు. అభివృద్ధి ఏ గంగలో కలిస్తేనేం, ప్రభుత్వోద్యోగుల సుఖమే మనకి ముఖ్యం; వాళ్ల కడుపులు చల్లగా ఉంటే చాలు.

‘నా కార్యక్రమాల కారణంగా కోపించిన ఉద్యోగులు నన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ సారి వాళ్లని కష్టపెట్టను’ అని కూడా ఇదే సందర్భంగా బాబు గారన్నారు. అది హాస్యోక్తో, ఆవేదనతో కూడిన చురకో ఆయనకే ఎరుక. నేటి భారతావని దుస్థితికి అసలు సిసలు కారణాన్ని కళ్లకు కట్టిన వ్యాఖ్యది. ‘మంచి చేసినందుకు సిగ్గు పడుతున్నా, మళ్లీ ఆ తప్పు చేయను’ అని ఓ మాజీ ముఖ్యమంత్రితో అనిపించే స్థాయిలో కుళ్లిపోయింది మన సమాజం! ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసినవన్నీ మంచి పనులే అని ఆయన వీరాభిమానులు కూడా చెప్పరు. కానీ రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కొంత నిజాయితీగా కష్టపడ్డాడనేది ఆయన విరోధులు సైతం ఒప్పుకునే విషయం. జన్మభూమి వంటి కార్యక్రమాలు అనంతర కాలంలో తెదెపా కార్యకర్తలకు, సొంత పార్టీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టే దారులుగా మారాయని విమర్శలొచ్చినా, వాటివల్ల కలిగిన ప్రయోజనాలూ అనేకం. నేడు అందరి నోటా వినిపిస్తున్నఉచిత బియ్యం, ఉచిత కరెంటు, ఉచిత వైద్యం వంటి అర్ధరహిత పధకాలతో పోలిస్తే – చంద్రబాబు అమలు చేసిన శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, పనికి బియ్యం వంటివి నిర్మాణాత్మక పధకాలే. వీటన్నిట్లోనూ ప్రభుత్వోద్యోగులని భాగస్వాములుగా చెయ్యటమే కాకుండా ఆకస్మిక తనిఖీలు, ఫైల్ క్లియరెన్స్ వారోత్సవాల వంటివాటితో వాళ్లనెప్పుడూ ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉండేవాడాయన. బాబు హయాంలో ప్రభుత్వోద్యోగుల్లో లంచగొండితనం ఇప్పటితో పోలిస్తే తక్కువ, పని చేసే స్వభావం ఎక్కువ అనే భావన నేడు సాధారణ ప్రజల్లో కలగటానికి ఇవన్నీ ప్రధాన కారణాలు.

‘నేను రియలైజ్ అయ్యాను’ అనేది పై సభలో బాబు అన్న మరో ముక్క. అందులో ‘ప్రభుత్వోద్యోగులతో పెట్టుకుంటే అంతే’ అన్న భావమే వినిపిస్తుంది. 2004 ఎన్నికల్లో తెదెపా ఓటమికి కారణాలు బోలెడు. వాటిలో – ప్రభుత్వ వ్యతిరేక ఓటు ముఖ్యమైనది, ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వటం రెండవది కావచ్చు. పైకి కనిపించని మరో కారణమూ ఉంది. కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లని వాడే విషయంలొ అనేకమంది గ్రామీణ ఓటర్లు గందరగోళానికి గురయ్యారనీ, వారికి సహాయం చేసే నెపంతో ఓటింగ్ ఆఫీసర్లైన ప్రభుత్వోద్యోగులు హస్తం గుర్తు మీట నొక్కించేశారనీ అభియోగాలున్నాయి (అది చూస్తూ పోలింగ్ ఏజెంట్లేమి చేస్తున్నారనేది ఆసక్తికరమైన ప్రశ్న). ఏదేమైనా, బాబు ఓటమి వెనక – ఎన్నికల వేళ అపరిమిత అధికారాలు చెలాయించే ప్రభుత్వోద్యోగుల పాత్ర ఎంతో కొంత ఉందనేది నిజం. అనేక అసెంబ్లీ స్థానాలని తెలుగుదేశం రెండు మూడు వేల ఓట్ల తేడాతోనే చేజార్చుకున్న ఆ ఎన్నికల్లో ఇటువంటి వెన్నుపోట్లు లేకుంటే చరిత్ర మరోలా ఉండేదేమో. బాబు వ్యాఖ్యలకి నేపధ్యం అదే.

ఇదొక్కటే కాదు – చంద్రబాబు మరెన్నో విషయాలు రియలైజ్ అయ్యాడని ఈ మధ్య ఆయన వరసగా దూకుతున్న గోడలు, తిరగేస్తున్న పళ్లాలు, వేస్తున్న పిల్లిమొగ్గలు చాటి చెబుతున్నాయి. ప్రత్యేక తెలంగాణాకి జై, హైటెక్ విధానాలకు బై బై, ప్రభుత్వోద్యోగులపై ఆదరం, కమ్యూనిస్టులతో చెలిమి, ఉచితానుచితాల్లేని ఉచిత హామీలు .. ఒకటా రెండా? అవతల – ‘ర్రండి బ్బాబూ ర్రండి.. అడగనోళ్లదే పాపం, అన్నీ ఫ్రీ’ అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఇన్‌స్టంట్‌గా సిద్ధించే వరాలు, హామీలు గుప్పించి పారేస్తుంటే; ఫలాలెప్పటికో చేతికందే నిర్మాణాత్మక పధకాలు, విజన్లు, అభివృద్ధి జపాలతో తిరిగి అధికారంలోకి రావటం కల్ల అన్న నిర్వేదంలో పడిపోనట్లున్నాడు చంద్రబాబు. ఆ నిర్వేదమే ‘ఇలాంటి ప్రజలనుద్ధరించటానికి నేను కష్టపడాలా. వాళ్లు కోరిందే ఇచ్చేద్దాం’ అన్న తీర్మానానికి దారి తీసుండొచ్చు. చూద్దాం, ఈ మారిన మనస్తత్వం ఆయన్ని తిరిగి అధికారంలోకి తెస్తుందేమో. అదే జరిగితే – మాట మార్చే మనిషిగా కూడా పేరుంది కాబట్టి – ఆయన మరోసారి మారిపోతాడనీ, ఈ ఒట్లన్నీ తీసి గట్టు మీద పెట్టేస్తాడనీ ఆశిద్దాం. నేటి మార్పంతా ఎన్నికల ఎత్తుగడే కావాలని కోరుకుందాం. అప్పుడే .. సర్వేజనా సుఖినోభవంతు. లేకపోతే రాష్ట్రానికి చిప్పా మిగలదు.

23 స్పందనలు to “ఏమారిన మనిషి”


 1. 2 రవి 11:41 సా. వద్ద జనవరి 15, 2009

  ప్రభుత్వోద్యోగులతో పెట్టుకుని ఏమారాడు. ఇది నిజం. ఇప్పుడు ఎన్నికల్లో చిరంజీవిని కూడా ఎదుర్కోవాలి. కాబట్టి ఆయనకు వేరే మార్గాంతరం తోచి ఉండదు.

 2. 3 satya 11:46 సా. వద్ద జనవరి 15, 2009

  ఒక ప్రతిపక్ష నేత గా చంద్రబాబు దారుణంగా విఫలమయ్యాడు. ఇన్ని అక్రమాలు, దోపిడీలు సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళలేకపోయాడు. ఎప్పుడూ తిరిగి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని రోజులు లెక్కపెట్టుకుంటూ కూర్చోటమే కానీ ప్రజా సమస్యలపై పోరాడాల్సిన స్థాయిలో అతను కేడర్ ని నడిపించలేకపోయాడు. ఇక ఈయన మాటలు వింటుంటే క్రొత్త తరహా గవర్నెన్స్ తో ఉత్తమ ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకున్న ఆ బాబు ఈ బాబేనా అని అనుమానం వస్తుంది.
  ఏడాదిలో ప్రభుత్వోద్యోగానికి దాదాపు 150 రోజులు కూడా కేటాయించని ఉపాధ్యాయులు ఉన్నట్లుండి జన్మభూమి, శ్రమదానం, పిల్లలకి పాఠాలు చెప్పటం వంటి క్లిష్టమైన పనులు అప్పగిస్తే కోపం రాదు మరి!! పైగా ఆకస్మిక తనిఖీలు, సస్పెన్షన్లా? పాపం, వీళ్ళ దెబ్బ కి బాబు బిత్తరపోయాడు. నిద్రలో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ అంటే ఉలిక్కిపడి లేస్తున్నాడేమో.

 3. 4 చదువరి 12:58 ఉద. వద్ద జనవరి 16, 2009

  “ఒక ప్రతిపక్ష నేత గా చంద్రబాబు దారుణంగా విఫలమయ్యాడు.”, “…ప్రజా సమస్యలపై పోరాడాల్సిన స్థాయిలో అతను కేడర్ ని నడిపించలేకపోయాడు.” – సత్యా! సూటిగా, సరిగ్గా చెప్పారు.

 4. 5 సుజాత 1:01 ఉద. వద్ద జనవరి 16, 2009

  జన్మభూమి కార్యక్రమం, శ్రమదానం, ఆకస్మిక తనిఖీల వల్ల ఆయన ఓడాడని నాకెప్పుడూ అనిపించలేదు. నిజానికి అవి ప్రజలంతా మెచ్చిన పథకాలు, పనులు! ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమానికి(దూరదర్శన్ లో) కూడా స్పందన బాగుండేది.

  పైగా ఆయన ఓటమిని తట్టుకోలేక, ఈ అయిదేళ్ళూ ప్రభుత్వాన్ని తిట్టిపోయడం తప్ప, వాళ్ల అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాడన్నది నిజం! మరో పక్క బలపడుతున్న(?) తెలంగాణా నినాదం బాబుకి నిద్ర లేకుండా చేసింది.

  అన్నింటికంటే దిగజారుడుతనం చంద్రశేఖర్ రావు తో చేతులు కలపడం! నిన్నటిదాకా ఇవాళో మాటా, రేపో మాటా చెప్పకుండా సమైక్య వాదానికి కట్టుబడి నిలిచిన మనిషిగా ఆయన మీద కొద్దో గొప్పో గౌరవం ఉండేది. మంత్రి పదవి కోసం అలిగి రాష్ట్రాన్ని చీల్చడానికి పూనుకున్న మనిషితో బాబు చేతులు కలపడంకంటే ఏ అంశమూ నన్ను ఆశ్చర్యపరచలేదు.

 5. 6 దిలీప్ 3:50 ఉద. వద్ద జనవరి 16, 2009

  “ఒక ప్రతిపక్ష నేత గా చంద్రబాబు దారుణంగా విఫలమయ్యాడు.”, “…ప్రజా సమస్యలపై పోరాడాల్సిన స్థాయిలో అతను కేడర్ ని నడిపించలేకపోయాడు.”

  పై వ్యాఖ్యల మీద కొన్ని ధర్మ సందేహాలు… దేశంలో ఏ పార్టీ నడిపిస్తుంది కేడర్ని? పోరాడకుండా ఎమీ లేడు కదా? వ్యక్తిగానూ, పార్టీ పరంగానూ? పోనీ ప్రజలైనా పోరాడిన వాటిపై చైతన్యవంతులై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారా? ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రశ్నించండి అని చంద్రబాబు అనేక అంశాల మీద చాలా సార్లు పిలుపు నివ్వలేదా? ప్రజలు మాత్రం అధికారాన్ని అప్పగించేసి ఇంక మన చేతుల్లో ఏమీ లేదు అన్నట్టు ఐదేళ్ళు నిండేవరకు వోటేసే సమయం వచ్చేవరకు మన్ను తిన్న పాములా పడి ఉండటం లేదా?

  అది ప్రజల (అంటే మన) తప్పా? మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదా? మనవంతు ప్రయత్నం చెయ్యకుండా నాయకుల మీదకి నెట్టెయ్యడమేనా?

  ఒకవిషయం చెప్పగలరా? గడచిన నాలుగేళ్ళల్లో మన రాష్ట్రంలో టిడిపి కన్నా సమస్యల మీద నియత గా పోరాడిన పార్టీ ఇంకొకటి ఉందా?

  “…ప్రజా సమస్యలపై పోరాడాల్సిన స్థాయిలో అతను కేడర్ ని నడిపించలేకపోయాడు.” అన్నప్పుడు మీరు చంద్రబాబు నుండి ఏమి ఆశిస్తున్నారు? కాంగ్రెస్కి ప్రజలలో వ్యతిరేకత వచ్చేట్టు చెయ్యలేకపోయాడనా? తద్వారా తను అధికారంలో కి వచ్చే మార్గాన్ని సులభతరం చేసుకోలేకపోయాడు అని భావిస్తున్నారా? మీరు కాంగ్రెస్ ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటున్నారా?

 6. 7 a2zdreams 11:59 ఉద. వద్ద జనవరి 16, 2009

  చంద్రబాబుకి చరిస్మా లేదు. స్వయంగా ముఖ్యమంత్రి అయ్యేంత సీను లేదు. కేవలం N.T.R వలనే అయ్యాడు. కాకపోతే he was a good chief minister అని నాకు అనిపించేది. administration చాలా బాగుండేది. కాలం కలిసి రాక ఓడిపోయాడు. గత్యతంతరం లేక ఇలా మాట్లాడుతున్నాడు గాని, he was a king. He will be king if power given to him.

 7. 8 Dr.Acharya Phaneendra 1:59 సా. వద్ద జనవరి 16, 2009

  సుజాత గారూ!
  “మంత్రి పదవికై అలిగి రాష్ట్రాన్నే చీల్చడానికి పూనుకొన్న మనిషి” అన్నారు. ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంట్ నుండి తోసేస్తే అలిగి బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడిన మనిషి గురించి మరిచినట్టున్నారు.ఎవరికైనా వ్యక్తిగతంగా అవమానమైనప్పుడే వ్యవస్థలోని అసమానతలు అవగాహనకు వస్తాయి. ఒక్కడు శనిలా దాపురించి రాష్ట్రాన్ని ముక్కలు చేయబూనాడని అక్కసు వెళ్ళగక్కే బదులు, “ఒక్కడుగా బయలుదేరి ఇన్ని కోట్ల మంది ప్రజలను ఎలా కన్విన్స్ చేయగలుగుతున్నాడు? దేశంలోని దాదాపు అన్ని పార్టీల మద్దతును ఎలా కూడగట్టగలుగుతున్నాడు? ఎనిమిదేళ్ళుగా అతడు చెబుతున్నదాంట్లో సత్యాసత్యాలెంత?” అని ఆలోచించండి. విషయం అవగతమవుతుంది.

 8. 9 అబ్రకదబ్ర 2:12 సా. వద్ద జనవరి 16, 2009

  ఆచార్య గారు,

  ముప్పైలు, నలభైల్లో మానవాళి మీద కరమ్‌చంద్ గాంధీకన్నా అడాల్ఫ్ హిట్లర్ ప్రభావం ఎక్కువ. మరి అతడూ ఒక్కడే, కోట్లాదిమంది అతని వెంటా నడిచినోళ్లే, జేజేలు కొట్టినోళ్లే. అంతమాత్రాన హిట్లర్, అతని నాజీ హుంటా ముఠాలు చేసిన దారుణాలన్నీ ఒప్పైపోవు కదా. కేసీఆర్ విషయంలో మీ సమర్ధనలో చాలా డొల్లతనముంది. గాంధీనీ, కేసీయార్‌నీ ఒకే గాట కట్టటం సబబుగా లేదు. వ్యక్తిగత అవమానాలు – అంబేద్కర్, గాంధీలాంటి వారికి సమాజంలోని అసమానతలపై అవగాహన కల్పిస్తే, కేసీయార్‌లాంటి వారిని ఆ అసమానతల్నే స్వలాభానికి వాడుకొనేలా పురిగొల్పుతాయి. అదీ తేడా.

 9. 10 gangabhavani 2:56 సా. వద్ద జనవరి 16, 2009

  గుంపులో గోవిందం. ఆటలో అరిటిపండు.

 10. 11 satya 11:25 సా. వద్ద జనవరి 16, 2009

  దారుణం గా విఫలమయ్యాడు అని చెప్పటానికి నాకు అనిపించిన కారణాలు,

  2004 లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి వోక్స్ వాగన్ కుంభకోణం నించి, ఎలుగుబంటి వ్యవహారాల వరకు ఎన్నో అవినీతి, భారీ భూకుంబకోణాలు జరిగాయి. వీటన్నిటి మీదా చంద్రబాబు, టీడీఫీ సామర్ధ్యం మేరకే పోరాడాయా? కారణాలు ఏవైనా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఎదుర్కొన్న స్థాయి లో కూడా ప్రధాన ప్రతిపక్షం ఎదుర్కోలేకపొయింది అని నా అభిప్రాయం. ఇంకా ప్రభుత్వం చేసే ఎదురుదాడికి ప్రతిపక్షం సమాధానాలు వెతుక్కొనే పనిలో పడింది. అందుకే ఈ ప్రభుత్వం సొంత పత్రిక పెట్టి ఆ రెండు పత్రికలు అంటూ నిలువరించాలని చూసింది గానీ ప్రతిపక్షాన్ని లెక్క కూడా చెయ్యలేదు. అదే ఈ పరిస్థితుల్లో టీడీపీ అధికారం లో ఉంటే కాంగ్రెస్ దాడికి ఉక్కిరి బిక్కిరి అయ్యేది. శవపేటికల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ జార్జ్ ఫెర్నాండెజ్ పార్లమెంట్ లో మాట్లాడటానికి నిలబడితేనే వాకౌట్ చేసేవి. ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి అనుచరల మీదే ఆరోపణలు వచ్చినా కూడా ప్రభుత్వాన్ని ఏ మాత్రం ఇరుకున పెట్టలేకపొయింది. 300 ఎకరాలకి పైగా అస్సైండ్ భూమి ని అట్టేపెట్టుకొని, ప్రభుత్వానికి సమర్పించిన విషయంలో కూడా రాజశేఖర రెడ్డి ఏమాత్రం జంకలేదు. ఇది వైఫల్యం కాదా? ఎంత స్థాయి ఆరోపణల్లో ఐనా నాన్-సీరియస్నెస్ క్రియేట్ చేసి సమర్ధవంతంగా అమలు చెయ్యటంలో ఈ ప్రభుత్వం సఫలమయ్యింది. ఇలాంటప్పుడే ప్రతిపక్షం మరింత చురుగ్గా వ్యవహరించాలి. అలా చెయ్యగలిగారా? ఎమో, నాకైతే వీళ్ళు గవర్నర్ కి, రాష్ట్రపతి కి వినతి పత్రాలు సమర్పించటం తోనే బాధ్యత తీరినట్లు ప్రవర్తించారనిపిస్తుంది, ఎక్కువ సంధర్భాలలో. చెప్పుకుంటూ పోతే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వైఫల్యాలు చాలానే ఉన్నాయి, విజయాలతో పోల్చితే

  “…పోరాడకుండా ఎమీ లేడు కదా? వ్యక్తిగానూ, పార్టీ పరంగానూ?”

  ప్రతిపక్ష హోదా లో టీడీపీ ప్రజల్లో గుర్తింపు పొందేంతగా, ప్రభుత్వం ఇబ్బంది పడేంతగా సాధించిన విజయాలేంటి? నేను అనుకోవటం టీడీపీ కన్నా కమ్యూనిస్టులు భూపోరాటాల ద్వారా దీన్ని సాధించారు. కేవలం ఒక్క వ్యక్తి అయిన మంద క్రిష్ణ కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించినట్లే, చిన్నారుల గుండె ఆపరేషన్లు, వికలాంగుల పెన్షన్ల పెంపుకోసం చేసిన అందోళనల ద్వారా. టీడీపీ ఎదైనా మొదలు పెట్టటమే కానీ ఒక మూమెంటం లా తీసుకెళ్ళలేదు. తాను ఒక్కడిగా మొదలు పెట్టి అందరి చేతా తెలంగాణా జపం చేయిస్తూ, అధిష్టానం దగ్గర ఎదురులేకుండా చేసుకున్న వైయస్ కి కూడా ఈ విషయంలో తలనొప్పి సృష్టించటంలో కేసీఆర్ సఫలమయ్యాడు. మంచికా, చెడుకా అనేది కాసేపు పక్కన పెడితే… కెసీఆర్ లాగా, కమ్యూనిస్టుల్లాగా, నర్మదా డ్యాం విషయం లో మేధా పాట్కర్ లా సింగూరు ఆందోళనలో మమతా బెనర్జీ లాగా, చంద్రబాబు సాధించిందేంటి? పోనీ టీడీపీ కి ఏమైనా కార్యకర్తలు లేరా అంటే ఇటీవల మహాగర్జన ద్వారా వాళ్ళ స్థాయి ఏంటో చూసాం. అయినా ఎందుకో అధికారం లో ఉండగా సమర్ధుడిగా ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి ప్రతిపక్షం లో పార్టీ ని నడిపించలేకపొయాడు. వీళ్ళ పొత్తు కొసం చూడాల్సిన కమ్యూనిస్టుల కోసం ఈయనే వెంపర్లాడాడు.

  “పోనీ ప్రజలైనా పోరాడిన వాటిపై చైతన్యవంతులై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారా? ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రశ్నించండి అని చంద్రబాబు అనేక అంశాల మీద చాలా సార్లు పిలుపు నివ్వలేదా?”

  చంద్రబాబు పిలుపు ఇచ్చినా, ఇవ్వకపొయినా ప్రజలెప్పుడూ ప్రభుత్వ తప్పుడు విధానాలని వివిధ వేదికలపైన (ఉదా! బ్లాగ్స్, మీడియాలో,) వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇలా చెయ్యని వాళ్ళు కూడా సాధారణ రాజకీయ చర్చల్లో అభిప్రాయాలు తెలియచేస్తూనే ఉంటారు. రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్నవారు సమాచార హక్కు వాడుకోవటం ద్వారా కొంత కృషి చేస్తున్నారు. వీటన్నిటినీ సరైన పంధాలో వాడుకోవటం రాజకీయ పార్టీ ల బాధ్యత. అంతేగానీ చంద్రబాబు పోరాడమన్నాడు, ప్రజలే చెయ్యలేదనటం హాస్యాస్పదం. ఒక రాజకీయ పార్టీ కార్యాచరణే పోరాడటం. దానికి ప్రజల మద్దతు,ఆదరణ వివిధ స్థాయిలలో ఉంటుంది. అలా కాకుండ ప్రజలు పోరాడండి, మేం మద్దతిస్తామనటమేంటి?

  “…ప్రజలు మాత్రం అధికారాన్ని అప్పగించేసి ఇంక మన చేతుల్లో ఏమీ లేదు అన్నట్టు ఐదేళ్ళు నిండేవరకు వోటేసే సమయం వచ్చేవరకు మన్ను తిన్న పాములా పడి ఉండటం లేదా? ”

  ఇది తప్ప ప్రజలకున్న మరో చాయిస్ ఏంటి?

  “..దేశంలో ఏ పార్టీ నడిపిస్తుంది కేడర్ని?”

  దేశం లో కెడర్ ని నడిపించే పార్టీలు నాకు తెలిసి కమ్యూనిస్టులు, ఉద్యమ పార్టీలైన TRS, కొన్ని తమిళ పార్టీలు, అధికారం లో ఉండగా అన్ని పార్టీలు…

 11. 12 చైతన్య 12:29 ఉద. వద్ద జనవరి 17, 2009

  గాంధీని, కె.సి.ఆర్ ని ఒకే గాటిన ఎలా కట్టారు?
  మంత్రి పదవి, రైలు ప్రయాణం సంఘటనలు ఒకటేనా !!

  >>“మంత్రి పదవికై అలిగి రాష్ట్రాన్నే చీల్చడానికి పూనుకొన్న మనిషి”

  ఈ మాట స్వయంగా టి.డి.పి వాళ్ళు కూడా అన్నారు కదా !

 12. 13 అబ్రకదబ్ర 3:17 ఉద. వద్ద జనవరి 17, 2009

  @సత్య:
  >> “అదే ఈ పరిస్థితుల్లో టీడీపీ అధికారం లో ఉంటే కాంగ్రెస్ దాడికి ఉక్కిరి బిక్కిరి అయ్యేది. శవపేటికల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ జార్జ్ ఫెర్నాండెజ్ పార్లమెంట్ లో మాట్లాడటానికి నిలబడితేనే వాకౌట్ చేసేవి. ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి అనుచరల మీదే ఆరోపణలు వచ్చినా కూడా ప్రభుత్వాన్ని ఏ మాత్రం ఇరుకున పెట్టలేకపొయింది. 300 ఎకరాలకి పైగా అస్సైండ్ భూమి ని అట్టేపెట్టుకొని, ప్రభుత్వానికి సమర్పించిన విషయంలో కూడా రాజశేఖర రెడ్డి ఏమాత్రం జంకలేదు. ఇది వైఫల్యం కాదా?”

  వాకౌట్లు, మైకులు విరగ్గొట్టటాలు విజయాలెలా అవుతాయి. ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అంత గొప్పతనమా?

  లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌లో ఒక లైనుంది: “What can men do against such reckless hate”. సిగ్గూ ఎగ్గూ ఒదిలేసి, అడ్డూ ఆపు లేని స్థాయిలో బరితెగించే నేటి ముఖ్యమంత్రివర్యుల విషయంలో ఎవరైనా ఏం చేయగలరు?

 13. 14 సుజాత 5:49 ఉద. వద్ద జనవరి 17, 2009

  ఆచార్య గారు,
  దక్షిణాఫ్రికాలో గాంధీకి జరిగింది వ్యక్తిగత అవమానమని భావిస్తున్నారా మీరు? ఆయన వెనక ఒక జాతి లేదా?అది జాతికి జరిగిన అవమానం కాదా?కెసీఅర్ బయటికి వచ్చినపుడు ఆయన వెనక కనీసం ఒక వ్యక్తి గానీ, సెంటిమెంట్ గానీ లేవు. ఆ మాటకొస్తే ఇప్పుడైనా ప్రజల్లో తెలంగాణా సెంటిమెంట్ అంత బలంగా ఉందని విశ్వసించలేను.ఇదంతా పార్టీలు చేస్తున్న హంగామా తప్ప.

 14. 15 satya 7:15 ఉద. వద్ద జనవరి 17, 2009

  అబ్రకదబ్ర గారు, నా ఉద్దేశ్యాన్ని మీరు తప్పు గా అర్ధం చేసున్నారు, లేదు..నేనే సరిగా వ్యక్తీకరించలేదేమో…

  1) వాకౌట్లు, మైకులు విరగ్గొట్టమని కాదు కానీ, ప్రతిపక్షాల నించి తీవ్రస్థాయిలో ఇబ్బంది ఎదురవుతుందని భయమే రాజశేఖరుడికి లేదు అని.. సరె, ఒకవేళ అధిష్టానం నించి ముందస్తు అనుమతితో, పదవి గ్యారెంటీ తీసుకొని ఈ విషయం బయటపెట్టడనుకున్నా, ఈ నేరాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళ్ళగల్గింది అని..

  2) వాకౌట్ల ద్వారా కాంగ్రెస్ చేసింది ఫెర్నాండెజ్ ని రక్షణ మంత్రి గా గుర్తించబోం అని తెలియచెయ్యటం.. (ప్రభుత్వ వివరణ వినకపోవటం ఒక రకంగా తప్పే అయినా..) ఇలా బొత్స విషయం లోనో, సూరీడు విషయంలోనో, జేసీ విషయం లోనో, లేక స్వయంగా ముఖ్యమంత్రి విషయంలోనో ఏదైనా(?) చేస్తే బాగుండేది అని నా ఆశ/అభిప్రాయం.

 15. 16 దిలీప్ 1:17 సా. వద్ద జనవరి 17, 2009

  @సత్య

  మీరు చెప్పిన అన్ని విషయాల్లోను తెలుగు దేశం పార్టీ తీవ్రంగానే పోరాడింది.

  తీవ్రత పెరగగానే ఎదురు దాడి తోనో, ఏదో కమిషన్ వేసామనో, సి బి ఐ కి అప్పగించామనో, అసలు తప్పేమీ జరగలేదనో అసెంబ్లీలో అంగం బలంతోనో, రోసయ్య గారి లాంటి వాళ్ళని ముందు నుంచోపెట్టి వాళ్ళకి వాళ్ళు పరిశుద్ధులుగా ప్రకటించేసుకోవడమో ఈ ప్రభుత్వం చేస్తుంది…

  ఈలోగా ఇంకో కుంభకోణమో, రాజకీయ అత్యవసర పరిస్థితో వస్తుంది.. వారి దృష్టి ఇంకో విషయం మీదకు వెళ్తుంది. అయినా వాటిని పూర్తిగా వదిలెయ్యలేదు. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజలకి గుర్తు చేస్తూనే ఉన్నారు.

  అన్నీ వదిలేసి భరితెగించిన వాడు ఏమైనా చెయ్యగలడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి అదే చేస్తుంది. చంద్రబాబు కి కొన్ని పట్టింపులు ఉన్నాయి, ఎవరైనా ఏవైనా అంటారేమో అని ఆలోచిస్తాడు, ఎలా పడితే అలా చెయ్యడు. అలాంటి వాడు ఏవైనా అవకతవకలు జరిగినప్పుడు విమర్శిస్తే కంగారు పడతాడు. రాజశేఖరుడు అలా కాదు. ప్రజలు దీన్ని అర్ధం చేసుకోవాలి. రాజశేఖరుడుని ఇబ్బంది పెట్టలేకపోవడం అనేది చంద్రబాబు వైఫల్యం కాదు, అది రాజశేఖరుని లెక్కలేని తనం. ఆ తర్వాత యథా రాజా, తథా ప్రజా…

  కమ్యూనిష్టులు కూడా మన రాష్ట్రంలో తెలుగు దేశం పోరాడినంత నియతగా పోరాడలేదు. వాళ్ళు చాలా బ్రేక్లు తీసుకున్నారు. పేద వాళ్ళకి ఇళ్ళు గురించి మాత్రమే వాళ్ళు కోనేరు రంగా రావు కమిటీ రిపోర్టుని బయట పెట్టాలని అందరికన్న ఎక్కువ పోరాడారు. ఆ తరవాత, అంత కన్నా ముందు అన్ని విషయాల మీద తెలుగు దేశమే ముందుంది. ముఖ్యంగా అవినీతి, ముఖ్యమంత్రి బంధు ప్రీతి, పెరుగుతున్న ధరలు గురించి తెలుగు దేశం చేపట్టినంతగా ఏ పార్టీ పోరాటం చెయ్యలేదు.

 16. 17 దిలీప్ 1:28 సా. వద్ద జనవరి 17, 2009

  @ సత్య

  “వాకౌట్ల ద్వారా కాంగ్రెస్ చేసింది ఫెర్నాండెజ్ ని రక్షణ మంత్రి గా గుర్తించబోం అని తెలియచెయ్యటం.. (ప్రభుత్వ వివరణ వినకపోవటం ఒక రకంగా తప్పే అయినా..) ఇలా బొత్స విషయం లోనో, సూరీడు విషయంలోనో, జేసీ విషయం లోనో, లేక స్వయంగా ముఖ్యమంత్రి విషయంలోనో ఏదైనా(?) చేస్తే బాగుండేది అని నా ఆశ/అభిప్రాయం.”

  ఎమవుతుందండి అలా చేస్తే? అది ఇంకో పోరాటం అవుతుంది. మీలాగా అలా చెయ్యొచ్చు కదా అనుకునే వాళ్ళకి చేసారు అనిపిస్తుంది. 40 మంది సభ్యులని అసలు ప్రభుత్వం లెక్క చేస్తుందా? తెలుగు దేశం గవర్నరుకి, రాష్ట్రపతికి, ప్రధానికి కొన్ని పదుల రిపోర్టులు ఇచ్చి ఉంటుంది ఇప్పటి వరకు. ఇప్పటి వరకు దేని మీదైనా చర్య తీసుకున్నారా ఆ ముగ్గురూ? కేంద్రంలో కూడా అదే పార్టీ ఉండటం వల్ల మొద్దు నిద్ర నటిస్తున్నారు. అదే వేరే పార్టీ మీద అలాంటి రిపోర్ట్లు వస్తే రాష్ట్రపతి పాలనికి సిఫార్సు చేసేవారు! రాజీనామా చెయ్యాలి అంటే రాజీనామా చేసేస్తాడా? మన బొత్సా ఏమైనా ఫెర్నాండెజ్ లాగా ఏమైనా పోరాడి రాజకీయాల్లో ఎదిగాడా ఏదైనా సిగ్గు పడటానికి… 🙂

 17. 18 satya 4:09 సా. వద్ద జనవరి 17, 2009

  @dileep
  “ఎమవుతుందండి అలా చేస్తే? అది ఇంకో పోరాటం అవుతుంది. మీలాగా అలా చెయ్యొచ్చు కదా అనుకునే వాళ్ళకి చేసారు అనిపిస్తుంది. 40 మంది సభ్యులని అసలు ప్రభుత్వం లెక్క చేస్తుందా? తెలుగు దేశం గవర్నరుకి, రాష్ట్రపతికి, ప్రధానికి కొన్ని పదుల రిపోర్టులు ఇచ్చి ఉంటుంది ఇప్పటి వరకు. ఇప్పటి వరకు దేని మీదైనా చర్య తీసుకున్నారా ఆ ముగ్గురూ?”

  మీరు వాళ్ళనించి చర్యలు ఆశిస్తున్నారా? చిన్న పిల్లాడికి కూడా తెలుసు వినతి పత్రాలిస్తే ఏం జరుగుతుందో…అలాంటిది ఒక రాజకీయ పార్టీ వినతి పత్రాలించి బాధ్యత తీర్చేసుకుంటే జరిగేది శూన్యం. నేను idealistic politics గురించి చెప్పట్లేదు. మనదేశంలో వినతి పత్రాలు ఇస్తే చెత్త బుట్టలోకి చేరతాయి తప్ప ఏం జరగదు.

  ఇంక అధికారం కోల్పోయిన తొలి సంవత్సరం అంతా చంద్రబాబు ఏదో నైరాశ్యం లోనూ, ప్రజలు తప్పు చేసారన్నట్లు, తానే ఇంకా ముఖ్యమంత్రి ని అన్నట్లు గడిపాడు. ఆయనకు ప్రతిపక్షనేత పాత్రలో ఇమడటనికే ఆ సంవత్సరమంతా పట్టింది. తర్వాత పార్టీ పటిష్టత అని కొన్ని రోజులు, మూడో ఫ్రంట్ అని ఢిల్లీ లో కొంత సమయం గడిపాడు. కాంగ్రెస్ తన పధకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళిన స్థాయిలో టీడీపీ వాటిలోని అవినీతి తీసుకెళ్ళలేదు. ఈ పని పత్రికలే ఎక్కువగా చేసాయి.
  మొత్తంగా టీడీపీ మాత్రమే మొదలుపెట్టి పోరాడిన అంశాలు:
  * పరిటాల హత్య కేసు..
  * ‘దేవేందర్ గౌడ్’ నాయకత్వంలో ఎల్లంపల్లి పై పోరాటం
  * ఇంక ఈ చివరి సంవత్సరంలో మాత్రం కొంచెం ధరల పెరుగుదల, బాబ్లీ, మీకోసం, ఎరువుల సమస్యపై ఆందోళనలు. ఇందులో మీకోసం పూర్తిగా ఎన్నికల ప్రచారం లా సాగింది. అన్నిచోట్లా మ్యాజిక్ చేసినా సాధ్యం కాని ఉచిత హామీలు ఇచ్చాడు. ‘ఎవరైనా ఎమైనా అనుకుంటారేమో’ అని ఆలోచించే చంద్రబాబు నమ్మిన సిద్ధాంతాలకి వ్యతిరేకంగా, నమ్మలేని ఉచిత హామీలు ఎందుకు గుప్పించినట్లు?

  ఇక ఇదే సమయం లో మిగిలిన పార్టీలు (TRS, CPI, CPM) తెలంగాణా, 610 జీ.వో., పోతిరెడ్డిపాడు, భూపోరాటాలు వంటివి తీవ్రస్థాయిలో చేసాయి. ఇటీవలే ఏర్పడ్డ ప్రజారాజ్యం సిరిసిల్ల నేత కార్మికుల విషయంలో ప్రభుత్వంలో కదలిక తెచ్చింది.

  కమ్యూనిష్టులు కూడా మన రాష్ట్రంలో తెలుగు దేశం పోరాడినంత నియతగా పోరాడలేదు. వాళ్ళు చాలా బ్రేక్లు తీసుకున్నారు.”
  ఉద్యమం లో బ్రేకులు తీసుకోవటం ఎక్కడైనా సాధారణం. అందునా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తున్నప్పుడు ఇది అవసరం కూడా. అసలు ఉద్యమమే చెయ్యని, మధ్యలో వదిలేసే టీడీపీ కన్నా ఇది చాలా నయం.

 18. 19 స్నేహ 9:20 సా. వద్ద జనవరి 17, 2009

  నేను ఎప్పుడూ లంచం ఇవ్వలేదు, కట్నం ఇవ్వలేదు, లంచం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితిలో కూడా మా వారితో పోట్లాడి అది తప్పు అని ఒప్పించగలిగాను.

 19. 20 ఏకాంతపు దిలీప్ 12:22 ఉద. వద్ద జనవరి 18, 2009

  “ఇంక అధికారం కోల్పోయిన తొలి సంవత్సరం అంతా చంద్రబాబు ఏదో నైరాశ్యం లోనూ, ప్రజలు తప్పు చేసారన్నట్లు, తానే ఇంకా ముఖ్యమంత్రి ని అన్నట్లు గడిపాడు. ఆయనకు ప్రతిపక్షనేత పాత్రలో ఇమడటనికే ఆ సంవత్సరమంతా పట్టింది.”

  మొదట కొంత కాలం నైరాశ్యంలో ఉన్నమాట నిజం. కానీ తానే ఇంకా ముఖ్యమంత్రి అన్నట్టు గడిపాడు అనడం దారుణం. అది విమర్శ చెయ్యాలని చేసే విమర్శ.

  “మీరు వాళ్ళనించి చర్యలు ఆశిస్తున్నారా? చిన్న పిల్లాడికి కూడా తెలుసు వినతి పత్రాలిస్తే ఏం జరుగుతుందో…అలాంటిది ఒక రాజకీయ పార్టీ వినతి పత్రాలించి బాధ్యత తీర్చేసుకుంటే జరిగేది శూన్యం. నేను ఇదేలిస్తిచ్ పొలితిచ్స్ గురించి చెప్పట్లేదు. మనదేశంలో వినతి పత్రాలు ఇస్తే చెత్త బుట్టలోకి చేరతాయి తప్ప ఏం జరగదు.”
  ఆ మాటకి వస్తే బొత్సా లాంటి వాళ్ళని రాజీనామా చెయ్యాలని (కనీసపు బలం లేకుండా) అసెంబ్లీలో డిమాండ్ చెయ్యడం( అసెంబ్లీ బయట ఎలానూ చేసారు) ఎలాంటిదో అది కూడా అలాంటిదే. వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చిన అన్ని సంధర్భాల్లోను వాళ్ళు పోరాడిన తరవాత మన ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే అప్పుడు ఇచ్చారు.

  ఇంకా మీరు అడిగిన మిగిలిన ప్రశ్నలు చంద్రబాబుని, తను అవలంభించిన విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితిని అర్ధం చేసుకుంటే, మీ ప్రశ్నల్లోనే సమాధానాలు దొరుకుతాయి.

 20. 21 satya 11:03 ఉద. వద్ద జనవరి 18, 2009

  దిలీప్ గారు, ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు నేను బాబు అభిమానినే! విమర్శ చేయాలని కష్టపడి టైపు చేసే ఓపిక నాకు లేదు. బాబు ప్రత్యక్షంగా క్ష్యేత్రస్థాయి లోకి దిగి సుధీర్ఘంగా పోరాడిన ఒక సంధర్భం నాక్కొంచెం గుర్తు చెయ్యండి… రాష్ట్రం లో ఏ మాత్రం బలం లేని అందునా గెలిచిన ఇద్దరిలో ఒకళ్ళు పార్టీ ఫిరాయించిన బీజేపీ నించి కూడా కిషన్ రెడ్డి పాదయాత్ర ల ద్వారా కొంత ప్రయత్నం చేసాడు. ఇక్కడ సాపేక్షకత చూడండి. టీడీపీ ఎక్కువే చేసి ఉండవచ్చు, కానీ సామర్ధ్యం మేరకు సమర్ధవంతంగా చేసినట్లు, గా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్లు నాకు అనిపించలేదు. ప్రతీదీ ఆరంభించి వదిలెయ్యటమే. ఇటీవల అవినీతిపై వంద రోజులనో, ఏదొ (అప్పుడే పేరు కూడా మర్చిపోయా..) ఒక పోరాటం చేసి ప్రజల్లో విస్తృతంగా ప్రభుత్వ అవినీతి తీసుకెళ్తాం అని ఊదరగొట్టారు.. రోజువారి ప్రెస్ మీటుల్లో మీడియా ఏదో అడిగినప్పుడు చెప్పటమే కానీ ప్రణాళికాబద్దం గా చేస్తున్నారా? నేనింకా ప్రతి పధకం అవినీతి మీదా పూర్వపరాలు, పూర్తి విశ్లేషణలతో, పేపర్ వార్తల ఆధారాలతో అయినా ప్రజలకి వివరాలందిస్తారనుకున్నా..

  >>> ఇంకా మీరు అడిగిన మిగిలిన ప్రశ్నలు చంద్రబాబుని, తను అవలంభించిన విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితిని అర్ధం చేసుకుంటే, మీ ప్రశ్నల్లోనే సమాధానాలు దొరుకుతాయి.

  చంద్రబాబు అవలంభించిన విధానాలు ఆయనే తప్పు, మహా పాపం అంటున్నారనే కదా ఈ టపా.. విచిత్రం ఏంటంటే అవి మనకు నచ్చాయి, కానీ ప్రవేశపెట్టిన ఆయనకే నచ్చట్లేదు.. దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది?

 21. 22 Indrasena Reddy 7:36 ఉద. వద్ద ఏప్రిల్ 28, 2010

  పడికట్టు పదాల దూషణలు,అసత్య అరోపణలు,గొబెల్స్ ప్రచారాలు,రాజశేఖరుడి విజయాన్ని 2009 లో ఆపలేక పొయాయి.సత్యమేవ జయతే.


 1. 1 పొద్దు » Blog Archive » జనవరి బ్లాగావరణం 11:18 సా. వద్ద ఫిబ్రవరి 14, 2009 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: