జల కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం .. అందరికీ తెలిసిన మాటలే. కొత్తగా వెలుతురు కాలుష్యమేమిటి? నిజానికంత కొత్త మాటేమీ కాదిది. సుమారు పాతికేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక స్వచ్ఛంద, ప్రభుత్వ సంస్థలు దృష్టి పెట్టిన సమస్యే ఇది. మన దేశంలో మాత్రం దీన్ని గురించిన ప్రచారమూ, ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలూ పెద్దగా జరిగుతున్నట్లు లేవు.
మీరో మహానగరంలో- కనీసం ఒక మోస్తరు నగరంలో – నివశిస్తున్నారా? చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మీ తాతగారి పల్లెటూర్లో – ఆరుబయట – రాత్రిళ్లు లెక్కబెట్టిన చుక్కలు గుర్తున్నాయా? అటువంటి దృశ్యం మీ నగరంలో చూసి ఎన్నేళ్లయింది? మబ్బు తునక లేని నిర్మలాకాశంలో సైతం కళ్లెంత పొడుచుకు చూసినా చందమామ తప్ప ఒక్క చుక్కా కానరాదేం? అయితే గియితే పొలారిస్, మహా ఐతే మిణుగురు పురుగుల్లా మరో రెండో మూడో. తక్కిన తారకలెక్కడ?
నేటి నాగరిక సమాజాల్లో వెలుగుది అత్యంత ప్రధాన స్థానం. ఒక దేశపు అభివృద్ధిని ఆ దేశంలో ఎలక్ట్రిసిటీ వినియోగంతో కొలిచే రోజులివి. ఏ ముహూర్తాన ఎడిసన్ విద్యుద్దీపాన్ని కనుగొన్నాడోగానీ, ఆ క్షణం నుండీ భూమండలమ్మీద రాత్రి అనేది క్రమంగా కనుమరుగైపోతుంది. నియాన్, మెర్క్యురీ, సోడియం వగైరా దీపాల ధగధగలతో మెరిసిపోని ఊరు ఇంకా రాతి యుగంలోనే ఉన్నట్లు లెక్క. రాత్రులని పగళ్లుగా మార్చటంలో తప్పు లేదు. చిక్కల్లా, వృధాగాపోయే విద్యుద్దీపాల వెలుగులతో. వీధి దీపాలనే తీసుకోండి. వాటి పని – కిందనున్న రహదారులపై వెలుగులు విరజిమ్మటం. కానీ అనేక చోట్ల అవి పనిలో పనిగా కొంత వెలుగుని ఉదారంగా పైకీ వెదజల్లుతుంటాయి. ఆ రకంగా ‘ఒలికే’ వెలుగులతో ఆకాశం కలుషితమైపోతుంది. వెలుగు పైకి ప్రసరించకుండా వీధి దీపాలకి సరైన ఏర్పాట్లుండకపోవటం దీనికి ముఖ్య కారణం. వీధి దీపాలు ఒక ఉదాహరణ మాత్రమే. వెలుతురు కాలుష్యానికి ఇటువంటి చిన్నాపెద్దా కారణాలెన్నో – అనవసరమైన చోట్ల కూడా దీపాలు ఏర్పాటు చేయటం, వ్యాపార సంస్థలు తమ హోర్డింగులపైకి రాత్రిళ్లు ఆర్క్ లైట్లతో వెలుగు గుప్పించటం, మోటారు వాహనాల హై-బీమ్ లైట్లు, .. ఇలాంటివి. సహజంగానే – ఇటువంటివి గ్రామాలకన్నా పట్టణాలు, నగరాల్లో ఎక్కువ. అలా కింది నుండి పైకి ‘చిందిన’ వెలుగు నగరాలపై ఆకాశాన్ని పొగమంచులా కమ్మేసి, పైనున్న తారల తళుకుల్ని నగరవాసుల కళ్లలో పడనీకుండా ఆపేస్తుంది.
వెలుతురు కాలుష్యం గురించి బాధపడే వాళ్లలో మొదటి స్థానం టెలిస్కోపులతో చుక్కల్నేరుకునే భావుకులది, ఖగోళం లెక్కలు కట్టే శాస్త్రవేత్తలదీ. కానీ దీని దెబ్బకి అత్యధికంగా బలయ్యేది మాత్రం నోరులేని జీవులే. అనేక రకాల పక్షులు నిశాచరాలు. పునరుత్పత్తి కోసం ప్రతి ఏడూ ఇవి బృందాలుగా వలసలు వెళుతుంటాయి. వీటి ప్రయాణాలు రాత్రి వేళల్లో మాత్రమే జరుగుతాయి. చంద్రుడిని, నక్షత్రాలను చుక్కానులుగా వాడుతూ వేలాది మైళ్లవతలున్న గమ్యానికి పయనమవుతాయివి. రాత్రి వేళల్లో మిరుమిట్లు గొలిపే స్టేడియం లైట్లు, నగరాల్లోని ఇతర కృత్రిమ దీపాలు ఈ పక్షులని తరచూ గందరగోళానికి గురి చెయ్యటం, అవి దారి తప్పి ఏ ఎత్తైన భవనానికో, టెలిఫోన్ టవర్లకో ఢీకొని మరణించటం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సాధారణమైపోయిన విషయం. ఒక్క న్యూయార్క్ నగరంలోనే ఏటా పది లక్షల వరకు పక్షులు ఈ విధంగా మరణిస్తుంటాయి. పక్షులే కాదు, తాబేళ్లవంటి ఉభయ చర జీవులు, అనేక రకాల జలచర జీవులు కూడా వెలుతురు కాలుష్య పీడితులే. దీని ధాటికి ఆయా జీవరాశుల ఉనికే ప్రశ్నార్ధకమవుతుందనటంలో అతిశయోక్తి లేదు.
పక్షులు, ఇతర జంతువుల సంగతి అవతల పెడదాం. ఈ రకం కాలుష్యం వల్ల మనుషులకి కలుగుతున్న హాని కూడా తక్కువేమీ కాదు. అవసరమైన దానికన్నా ఎక్కువ కృత్రిమ వెలుగు వాడకం వల్ల తలనొప్పి, అలసట నుండి రక్తపోటు, రొమ్ము క్యాన్సర్ దాకా పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశముందని కొన్ని పరిశీలనలు, పరిశోధనల్లో తేలింది. ఇక వెలుతుర్ని వృధా చెయ్యటం వల్ల జరిగే ధన నష్టం ఉండనే ఉంది. ఒక్క అమెరికా దేశంలోనే ఏటా కనీసం ఐదు బిలియన్ డాలర్ల వరకూ ఈ విధంగా వృధా అవుతుందని అంచనా. ఇలా వృధాగా పోయే వెలుతుర్ని ఉత్పత్తి చేయటానికి వాడే బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాల నుండి జనించే వాతారణ కాలుష్యం దీనికి అదనం.
దీన్ని తగ్గించటానికి మనమేమీ చేయలేమా? తప్పకుండా చెయ్యొచ్చు. మిగతా రకాల కాలుష్యాలతో పోలిస్తే దీన్ని తగ్గించటం బహు తేలికే కాకుండా, అంతో ఇంతో సొమ్ము కూడా ఆదా అవుతుంది. మొదటి మెట్టుగా, మీ ఇంటి చుట్టూ ఉన్న అనవసరమైన దీపాలని ఆపేయండి. అవసరమైన వాటిని – వెలుగు కిందికి మాత్రమే ప్రసరించే ఏర్పాట్లు చేసుకోండి. మీ మోటారు వాహనాల హెడ్ లైట్ల పైభాగాన్ని కప్పే తొడుగుల వంటివి అమర్చుకోండి. ఇలాంటి చిట్కాలు ఆలోచిస్తే బోలెడు. అన్నిటికీ మించి, ఈ విషయం మరో నలుగురికి చెప్పండి. ఆలస్యమెందుకు, పదండి ముందుకు.
ఆలోచించాల్సిన విషయమే!
కృత్రిమ లైట్ల ధాటికి సహజమైన వెన్నెల వెలవెల బోతుంది. ఎక్కువ వెలుతురుతో నిద్ర సరిగ్గా పట్టదు. మా యింటి ఎదురుగా ఉన్న వీధిలైటు వలన మేమీ బాధలన్నీ పడ్డాము.
చక్కని విషయం పరిచయం చేసారు ! థాంక్సులు !
చంద్రుడు ఉన్న రోజుల్లో తప్ప, ఆకాశం వైపు చూడటం ఇది వరకు లా ఆసక్తికరంగా లేదు.
కాండిల్ లైటు డిన్నర్ లో ప్రత్యేకత ఏంటో అర్థం కాదేందుకో నాకు ! గుడ్డి వెలుతురు కన్నా, వెన్నెల మిన్న కదా ! అందుకే వేసవి కాలం, వెన్నెల రోజుల్లో “మూన్ లైట్ డిన్నర్” తప్పని సరి !
మీరు అన్నట్టు మనం ఇంట్లో , వాహనాలకి మన జగ్రత్తలు పాటిస్తాం ! చాల మంది ఇప్పటికే, కరెంటు కర్చు మిగులు కోసం ఐనా పాటిస్తున్నారు / పాటిస్తారు ! మరి రోడ్ల మీద దీప మాలల్లా ఉండే, ఫ్లడ్ లైట్లు , చీకటి పడక ముందే వేసే అపార్టుమెంటు లైట్ల సంగతి మనం ఏం చేయాలి చెప్మా ?
చీకటి పడక ముందే లైట్లు వేసే సంస్కృతి ఎప్పటికి దూరమయ్యేనో? (నేను చెప్పేది వీధి దీపాలు,అపార్టుమెంటు వాళ్ళ సౌజన్యంతో ఏర్పాటు చేయబడే లైట్ల గురించి) ! అన్ని చోట్ల ఇది కామన్ అనుకుంటా !
నేనుకూడా చాలాసార్లు నేనేరుకున్న చుక్కలు నా తర్వాతి తరం ఏరుకోలేని దుస్తితి ఏర్పడుతుందని భావించాను కాని ఈ మూగజీవాల తిప్పలు మీరు చెబితే తెలిసిన భాధాకరమైన్ విషయం. అమెరికా గురించి తెలియదు కాని ఇంగ్లాండులో మాత్రం వీధిదీపాలు ఇండియా వలె అంతప్రకాశవంతంగా ఉండవు. బహుషా వెలుతురు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొనే అలా ఏర్పాటు చేసారేమో.
మీ టపాకి ఇది వ్యాఖ్య కాకపోయినా, ఎప్పుడో నేను రాసుకున్నది ఇక్కడ పెడుతున్నా 🙂
భలే పోస్టు వ్రాసారండీ
అభినందనలు.
ఇదిగో నావంతు
మనం రోజూ చూసే ఒక ప్రక్రియ
కీటకాలు దీపం వైపుకు ఆకర్షించబడటం అనేది ఒక సహజ క్రియ కాదు. అలా ఆకర్షించబడిన కీటకాలు అలా అవిశ్రాంతంగా దానిచుట్టూ తిరుగుతూ సొమ్మిసిల్లి ఆ వేడికి మాడి చనిపోతాయి.
గణాంకాలప్రకారం ఒక లైటు ఒక రాత్రిలో సుమారు 150 కీటకాలను చంపగలదు, అంటే సుమారు 50 వేల కీటకాలు ఒక ఏడాదిలో చస్తాయి. ఇది ఒక వీధిదీపం లెక్క ఒక ఊరిలో ఎన్ని దీపాలు, ఎన్ని కోట్ల కీటకాలు – ఎంత దారుణం.
ఇలా కీటకాలు నశించిపోవటం వల్ల మరలా ఒక గొలుసు వలె దెబ్బతినే జీవులు పక్షులు, కప్పలు, తొండలు.
తాబేళ్లవైతే మరీ విషాదగాధ. వాటి పిల్లలు ఇసుకలోంచి బయటకు రాంగానే ఆకాశం అంచున ఉండే వెలుగుని బట్టి అది సముద్రాన్ని గుర్తించి ఆవైపుగా వెళ్లటం మాత్రమే దానికి తెలుసు.(సహజాతం). కానీ భూమిపై ఉండే వెలుగుని చూసుకొని ఆ వైపే సముద్రం ఉన్నదనుకొని ఆ చిన్న చిన్న తాబేలు పిల్లలు, సముద్రానికి వ్యతిరేకంగా బీచ్ రోడ్ ఎక్కి టైర్లక్రింద పడి ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో చచ్చిపోతున్నాయి.
అందుకనే తాబేళ్ల బ్రీడింగ్ సీజన్లలో ఆయా ప్రాంతాలలో వాలంటీర్లు కాపలా కాస్తూంటారు.
గూడ్ పోస్ట్
అవును ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు నగరాలలో అపార్టుమెంటుల పరిస్థితి ఎలా ఉంటుందంటే పగలు కూడా లైట్లు వేస్తేనే వెలుతురు. అసలు కృత్రిమ కాంతి మూలాన దృష్టి దోషాలు త్వరగా వచ్చేస్తాయి కూడా, అందుకే రోజుకి కొద్ది సేపు అయినా సహజ వెలుతురులో ఉండటం పర్యావరణానికే కాదు మనకూ అవసరమే.
ఇందాక లంకె పెట్టడం మరచిపోయినట్టున్నా…
http://ekantham.blogspot.com/2008/06/blog-post.html
నిజమే! ఇప్పుడు కట్టే ఆఫీసులలో కూడా పగలల్లా లైట్లుంచే పని చేసుకోవలసి వస్తుంది.
అపార్టుమెంట్లు కూడా చాలా మటుకు అంతే.
సహజమయిన కాంతి, వెలుతురు ఆరోగ్యానికి మంచిది. అది మనకి దక్కకుండానే పోతుంది 😦
Abrakadabra garu,
Good topic and certainly worth thinking.
Here is a good article in ‘Nature’ on the same topic.
http://www.nature.com/nature/journal/v457/n7225/full/457027a.html
– Shiv