ఉరేసుకునో, పురుగు మందు తాగో ప్రాణం తీసుకునే పాత తరం విఫల ప్రేమికుడి గురించి చిన్నప్పుడు వార్తాపత్రికల్లో చదివున్నాను. ఇప్పుడా బాపతు పిచ్చిమారాజులు దాదాపు మాయమైపోయారు. ప్రస్తుతం ప్రియురాళ్లకి శిక్షలేసే అబ్బాయిలదే హవా. సినిమాల్లో సీజనుకోరకం ట్రెండ్ మారినట్లే ఈ శిక్షల్లో కూడా ఏడాదికో కొత్త రకం అమల్లో ఉంటుంది.
ఆ మధ్య వాటర్ ట్యాంకులూ, టెలిఫోన్ టవర్లూ ఎక్కి దూకుతామని బెదిరించేవాళ్ల ట్రెండ్ నడిచింది. అవతలి వాళ్ల ప్రాణం తీసేదాకా పోలేదు కాబట్టి ఇది చాలావరకూ నయం. వీళ్లలో నిజంగా దూకిన కేసులెన్ననేది వేరే ప్రశ్న. దీన్తర్వాత, ప్రేమనంగీకరించని అమ్మాయి గొంతు కోసి హత్య చేసే ఫ్యాషన్ నడిచింది. అదీ పోయి యాసిడ్ దాడుల రోజులు మొదలయ్యాయి. ఇప్పుడు హెచ్ఐవి రక్తంతో కూడిన ఇంజెక్షన్లు చేసే పద్ధతొచ్చింది. ఇదెన్ని రోజులుంటుందో, దీని తర్వాత మరే విధానమొస్తుందో! చూడబోతే, భారతీయుల సృజనాత్మకత మిగతా రంగాల్లో చంకనాకిపోతున్నా కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు చేయటంలో మాత్రం ముందున్నట్లుంది.
సరే, ఇలాంటివి మరో రెండో మూడో జరిగితే వాటిలో ఏదో ఒకటి – ముఖ్యంగా అమ్మాయి కాస్త చూడ చక్కగా ఉందనుకున్న కేసు, అదీ అధమం వాళ్లది అప్పర్ మిడిల్ క్లాసైతేనే – మన మీడియా పతాక శీర్షికలకెక్కుతుంది. అప్పుడు ఆంధ్రదేశమంతా కొన్నాళ్లు గగ్గోలు పెడుతుంది. ఇటువంటి కేసుల్లో పోలీసులు కొత్తగా ఆటవిక న్యాయం అమలు చేయటం మొదలు పెట్టారు కాబట్టి ఆ కేసు వెంఠనే పరిష్కారమైపోవచ్చు. ఈలోగా దేశీయంగా అత్యంత ముఖ్యమైన మరో పరిణామమేదో సంభవిస్తుంది – అంటే ఐశ్వర్యారాయ్ నెల తప్పటం లాంటిదన్నమాట. దాంతో అందరి దృష్టీ అటు మళ్లుతుంది. అసలు సమస్య మాత్రం అక్కడే ఉంటుంది.
కొన్నేళ్లుగా ఇలాంటివి ఎందుకింత ఎక్కువగా జరుగుతున్నాయంటే ఎవరికి తోచిన సమాధానాలు వారు చెబుతారు. వయసు ఆకర్షణ గురించి పిల్లల్లో సరైన అవగాహన కల్పించని తల్లిదండ్రులదే తప్పనేవాళ్లు కొందరు. నాకర్ధం కానిది – ఈ ఆకర్షణ పూర్వమూ ఉన్నదే. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే తల్లిదండ్రులు ఇటువంటి విషయాల్లో పిల్లలతో ఎక్కువగా చర్చిస్తున్నారు. అయినా ఈ దారుణాలు మాత్రం పూర్వం కన్నా ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయి. దానర్ధమేమిటి?
సినిమాలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో పెట్రేగిన విచ్చలవిడి ధోరణులు దీనికో కారణం అనేది మరికొందరి సమాధానం. తల్లిదండ్రుల పెంపకం లోపం కన్నా ఇది అర్ధవంతమైన సమాధానం కావచ్చు. నా వరకూ మరో కారణం కూడా కనిపిస్తుంది.
ఎనభయ్యో దశకం దాకా మనవాళ్లది పొదుపు చేసే నైజం. అప్పో సొప్పో చేసి వస్తువులు కొనటం కన్నా ఉన్నదానితో సర్దుకోవటానికే మొగ్గు చూపే వారు. మిక్సీలు, ఫ్రిజ్‌లు, ఆఖరికి ఇళ్లైనా అదే ధోరణి. అందుకే అప్పట్లో ఎక్కువశాతం మధ్యతరగతి సుబ్బారావులు ఉద్యోగం నుండి రిటైరయ్యేనాటిగ్గానీ ఓ గూడు సమకూర్చుకోలేకపోయేవారు. మరి ఇప్పుడో? అంతా పోటీ. పక్కవాడికి ఉన్నదాన్ని అప్పు చేసయినా తానూ సొంతం చేసుకోవాలన్న ఆరాటం. కోరుకున్నది సొంతం కాకపోతే తట్టుకోలేని అసహనం.
దీనికి తోడు, పిల్లలకు చిన్నప్పట్నుండీ ప్రతివిషయంలోనూ పోటీ తత్వాన్ని నూరిపోసే గుణం కూడా ఎక్కువైపోయింది. జీవితంలో ప్రతి విషయాన్నీ గెలుపోటముల కోణంలోనుండే చూసే లక్షణం నేటి తరానికి నేర్పబడింది. పోటీ మంచిదే. అయితే, పోటీ పడ్డ ప్రతివాళ్లూ గెలవలేరనే తెలివిని కూడా నేర్పాలి కదా. తల్లిదండ్రుల పెంపకంలో తేడా రావల్సిందేమన్నా ఉందంటే అది ఈ విషయంలో; వయసు ఆకర్షణ గురించి బోధించటంలో కాదు. తల్లిదండ్రులు పిల్లలకి – ఓటమి ఉసూరుమనిపించొచ్చు, కానీ ఉసురు తీసేదవకూడదని నేర్పాలి. ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలోకి భారతీయులు జారిపోతున్నారనేదానికి ఉదాహరణలు రోజూ టీవీల్లో రకరకాల పోటీ కార్యక్రమాల రూపంలో మనకి కనిపిస్తూనే ఉన్నాయి. పాటల పోటీలు, నృత్యాల పోటీలు, క్విజ్ ప్రోగ్రామ్స్ .. ఏది తీసుకున్నా, చిన్నా పెద్దా తేడాలేకుండా ఓడిపోతే ఏడవకుండా వెనుదిరిగేవాళ్లు ఒక్కరున్నారా? ఓటమిలో హుందాతనమేది? పబ్లిక్‌గా ఏడవటంలో ఏం డిగ్నిటీ ఉంది? పదేళ్ల క్రితమూ ఇలాంటి పోటీలు జరిగేవి – ఇంత విరివిగా కాకున్నా. అప్పుడూ ఓడిపోయిన వాళ్ల బాధ వాళ్ల మొహాల్లో కనపడేది. తేడా అల్లా – అప్పట్లో ఇలా ఏడుపులూ పెడబొబ్బలూ ఉండేవి కావు.
వినిమయ మనస్తత్వం, పోటీ తత్వం .. ఈ రెంటికీ ప్రేమతో ముడిపెట్టి చూడండి. అంతర్జాతీయీకరణలో భాగంగా దేశంలో పెచ్చరిల్లిపోతున్న కన్సూమరిజానికీ, ప్రేమల పేరుతో జరుగుతున్న దాడులకీ ప్రత్యక్ష సంబంధమే ఉంది. వస్తువుల దగ్గర మొదలైన ఈ రెండు గుణాలు ప్రేమల దాకా పాకాయి. టీనేజ్ పిల్లల నుండి పాతికేళ్ల యువత దాకా ప్రేమ తిరస్కరించబడ్డవాళ్లు, విఫలమైన వాళ్లు ఘోరాలకొడిగట్టటానికి నాక్కనిపించిన కారణం మాత్రం ఇదే.
మరో కోణం కాదు ఇదే అసలయన కోణం అనిపిస్తుంది
నేటి పరిస్థితిని బాగా విశ్లేషించారు.నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
మంచి అనాలసిస్..
నూతన సంవత్సర శుభాకాంక్షలు అబ్రకదబ్రగారు.
మా బాగా చెప్పారు, మీ విశ్లేషణ చదివాక నాక్కూడా నిజమే అనిపించింది.
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మంచి విశ్లేషణ. మిగతా కారణాల కంటే మీరు చెప్పిన కారణమే ఇటువంటి ప్రవర్తనకు మూలం అనిపిస్తుంది. ప్రతిదానికి పోటీ పడమని పిల్లలకు నేర్పుతున్నాం కానీ ఓటమిని హుందాగా స్వీకరించటం నేర్పలేకపోతున్నాం.
ముఖ్యంగా ప్రేమ విషయం గెలుపు-ఓటముల పరంగా తీసుకోవలసిన విషయం కాదని నేర్పాలి. ప్రేమ విషయంలో మనం కోరుకుంటున్నది ఎంసెట్ ర్యాంకు లేక సాఫ్ట్వేర్ జాబ్ లాంటి విషయాన్ని కాదు, మనలాగే సొంత ఇష్టాయిష్టాలు ఉన్న ఒక స్వతంత్ర వ్యక్తినని అర్థం చేసుకోగల పరిణితి ఉంటే ఇలా ఓడిపోయినట్లు భావించటమూ, ఉద్రేకపడటమూ తగ్గుతుంది. ప్రేమే కాదు, అవతలివైపు మనలాంటి స్వతంత్ర వ్యక్తులే ఉన్న ఎలాంటి బంధంలోనైనా సక్సెస్ అవ్వటం, అవ్వకపోవటం అన్నది మన ఇష్టాలు, అర్హతలతో పాటూ, అవతలివారి ఇష్టాలు, వారి ప్రయారటీస్ మీద కూడ ఆధారపడి ఉంటుంది. దానికి ఉక్రోషపడిపోవలసిన అవసరం లేదని తెలుసుకుంటే ఇలాంటివి తగ్గుతాయి.
చాలా మంచి విశ్లేషణ. మీరు చెప్పిన మూలకారణం ఖచ్చితంగా ఈ తీరుని పెంచిపోషిస్తున్న ధోరణి.
మీరు చెప్పినవి నాకూ నచ్చినవి కాని కొన్ని సందెహాలు కలుగుతున్నవి. ఈలాంటివి ఒకరు చెప్పితే కొంతమంది బాగుంది అంటాము కొంతమంది తెలియదు అంటారు మనకు నిజమో కాదో ఎలా తెలుస్తంది? ఈ అభిప్రాయాలకు బేసిస్ ఏమిటి? వీటిని గురించి గుంపులలో కన్సెన్సస్ కాకుండా నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి. ఇంతకు ముందు ఎవరైనా పరిశోధించారా? మన అభిప్రయాలు చెప్పుకోటం కాకుండా ఎంతవరకు నిజమో ఎలా తెలుసుకోవాలి. మిమ్మల్ని విమర్శించటం కాదు. నాకు ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి.
మీరు చెప్పింది చాలా నిజం అబ్రకదబ్ర గారు ! పదునైన విశ్లేషణ !
వీటికి తోడు దొంగ లా, ఇంకోటి కూడా, జత పడుతోంది … మన సినిమాలు.( ఈ మధ్య ఒక సినిమా లో హీరో గారే, ఎందుకు నీకంత పొగరు, మొహాన ఆసిడ్ పోస్తా అంటాడు !!! ),
ప్రేమ ఒక్క సారే కలుగుతుంది జీవితం లో గనక, ఎలాగైనా సాధించేయాలి … దానికి తోడు, హీరో స్నేహితుల చేత , తరచు చెప్పించే డవిలాగు, ఒరెయ్ , నువ్వు ఆ అమ్మయి లేకుండా బ్రతకగలవా ?
ప్రేమ లేకుండా బ్రతకలేం, కాబట్టి దెనికైనా తెగించి , వెంట పడి, వేధించి సాధించుకోవాలి ! అవతలి వాళ్ళ ఇష్టా ఇష్టాల ప్రమేయం లేకుండా ! ప్రేమ నిజమైతే, గెల్చి తీరుతుంది , మీరన్న వినిమయ తత్వం, పొటీ తత్వం, “ప్రేమ” కి ఎలా అన్వయించవచ్చో, సినిమాలు దిశా నిర్దేశం చేస్తున్నాయి !
ఒక్క సినిమా చూపించండి, హీరొయిను నువ్వంటే అసహ్యం అని మొదట్లో అన్నా, చివరి దాకా ఆ మాట మీద నిలబడదు … అతను చావటానికి కూడా తెగించిన , అతని స్వచ్ఛమైన? , నిజమైన ? ప్రేమ ని వదులుకోలేక, ఒప్పుకుంటుంది ! అలా ప్రేమే? గెలుస్తుంది ! హీరో అవ్వాలంటే నాయనలారా, ఎదోకటి చేసి గెలవండి.
ఒకప్పటి సినిమాల్లో, కనీసం ఇలాంటి డవిలాగులు తక్కువ, విడిపొవల్సి వచ్చినా, ( పెద్దలు , లేక ఇతర కారణాల వల్ల ) నీ కుటుంబం నీది, నువ్వు ఎక్కడున్నా సంతోషం గా ఉండాలి అనే వారు ! నువ్వు లేకుండా బ్రతకలేను, లాంటివి తక్కువ ! బెదిరింపులు తక్కువే !
కాబట్టి కాదు అన్నా, ఛీ పో అన్నా అమ్మాయిలు, అది ఉత్తుత్తిదే !!! కాబట్టి కుక్క లా వెంట పడ్డం తప్పేం కాదు, పైగా హీరొయిజం !
అవతలి వారికీ కాదనే హక్కు ఉంటుందని, ఇద్దరికీ స్వచ్ఛందం గా, ఇష్టమైతే తప్ప ఒక బంధం లో పటుత్వం ఉండదని, పెద్దలు , సినిమాలు చెప్పనంత వరకు, మనం ఇలాంటి వాటికి మౌన సాక్షులు అవక తప్పేలా లేదు !
నిజమే.. ఓడిపోవడం తట్టుకోలేకపోతున్నారు.. అసలు ఈ రియాలిటీ షో లు చూడాలంటేనే చిరాకొస్తోంది… తల్లిదండ్రులు ఎంతసేపు గెలువు అని చెబుతారే తప్ప, ఓడిపోతే ఎలా నిబ్బరంగా ఉండాలో చెప్పట్లేదు.. మంచి విశ్లేషణ..
ఈ విషయం లొ, ఆలొచించితె, నాకు ఒక కారణం స్ఫూరించింది. అది యెమిటంటె మనము అసలు ప్రేమ అంటె ఏమిటో మరిచిపొతున్నాము.
పై పై మోహాలనె ఫ్రేమ అని యువతను తప్పుదోవ పట్టిస్తున్న సినిమాలు, మరియు సగటు జనాల ఆలొచనలె ఈ పరిస్థితి కి కారణము.
ఎప్పుడైతె అవతలి వాడిని మన ఆత్మ సాక్షిగ నెనె అని భావించగలమొ, అదే నిజమైన ప్రెమ. నువ్వు నేను అనే భావన లెనప్పుడె నిజమైన ప్రెమ వుంటుంది. యెల్లప్పుడు ఈ భావనలో వున్నవాడె నిజమైన ప్రెమికుడు. అది యెవరైన సరె.
@శ్రీ: ఇప్పుడు మీరు “నిజమైనప్రేమని” నిర్వచించే పనిపెట్టుకోన్నారన్నమాట! ప్రయత్నించండి.
హాయ్ శ్రీ 🙂
మీరు మాట్లాడేది the so-called soulmate గురించా 🙂 ?
KumarN
@శ్రావ్య,విజయమోహన్,వేణూశ్రీకాంత్,కన్నగాడు,చైతన్యకృష్ణ,మహేష్,చైతన్య,మేధ,కుమార్:
ధన్యవాదాలు.
@గద్దేస్వరూప్:
ఇవి నా అభిప్రాయాలు మాత్రమేనండీ. ఈ సమస్యకి ఇదో కోణం, అందుకే టపా శీర్షిక మరో కోణం 🙂 దీన్ని సమర్ధించే గణాంకాలు నా దగ్గర లేవు.
@శ్రీ:
మొత్తానికి తెలుగు నేర్చేసుకున్నారు. అభినందనలు. మీరు చర్చని మరో దారికి మళ్లించారు. మీ ప్రశ్నలకి సమాధానాలేంటోనని నాకూ ఆసక్తిగా ఉంది.
My apologies. నేను (68-69)ఇంగ్ళండ్, అమెరికా వెళ్ళినప్పుడు అనిపించేది. కార ణము తెలియదు కాని నేను చిన్నప్పుడు చూసిన తెలుగు వాళ్ళు వాళ్ళకెవరికీ తీసిపోరని. ఈమధ్య బ్లాగులు వచ్చిన తరవాత నిజమేనని అనిపిస్తుంది. ఇంకా కొంచెము లెవెలు పెంచితే బాగుంటుందేమోనని కోరిక. మీరందరు ఉద్యోగాలలోవుండి వీలైనతవరకు కష్టపడుతున్నరు. నాబోటి రిటైరు ఐన వాళ్ళకు చెప్పటం తేలికే.
ఈమధ్య గురుచరన్ దాస్ రాసాడు చూడండి. దానిమీద నా బ్లాగులో రాసాను.
http://gaddeswarup.blogspot.com/2009/01/lazy-journalism.html
కొంచెం అలా సోర్సులకు పోతే బాగుంటుందేమోనని నా అభిలాష. నేను రాయాలంటె, చాలా రోజులనుంచి బయట ఉండటము మూలాన నాకు పరిస్థితులు సరిగ్గా తెలియవు.
“నువ్వు నేను అనే భావన లెనప్పుడె నిజమైన ప్రెమ వుంటుంది. ”
నాకెంటో ఈ నిర్వచనం, భయం గొల్పుతోంది ! 🙂
నువ్వు, నేను కాదు “మన” గురించి అలోచించటం అనా ? అలా ఐతే వోకే ! 😀
i dont agree with u………..వినిమయ మనస్తత్వం, పోటీ తత్వం ..
naaku ala anipinchaledu……..
alane parents cheppedienti naaku artham kaadu evaraina gelavamane chebutaaru…….odi pote evaraina tidutunnara,kodutunnara………intaku mundu kooda parents gelava mane cheppe vaallu …….meeru prob ni ddoram nundi kaakunda go to the basis…………….
ennosaarlu love failure ayina calm ga vunde vallu intaku mundukante % ekkuve vunnaru.ane vallaki poteetatvam leda leka valla parents class cheppara vaallaki.
na point of view lo wrong analysis anipinchindi.
Well, I see your problem – habitual disagreement.
author is exactly talking about a behaviour like you.
Get well soon.