తెగులు బ్లాగు

డిగ్రీ చదివేటప్పుడు నాకో తెలుగు మాస్టారుండేవాడు. కోపమొస్తే విద్యార్ధుల మీద ఆంగ్లంలో విరుచుకుపడేవాడు. ‘అదేంట్సార్’ అంటే ‘తెలుగులో తిడితే ఎవడు పట్టించుకుంటాడోయ్? ఎంతైనా ఇంగ్లీషు ఇంగ్లీషే. తిట్టినా పొగిడినా అందులో ఉన్నంత సోకు తెలుగులో ఎక్కడిదీ?’ అనేవాడు చిద్విలాసంగా. తన వాదనకి సమర్ధనగా ఓ పిట్టకధ కూడా చెప్పేవాడు.

ఆయన తెలుగు పండితుడి అవతారమెత్తిన తొలినాళ్లలో తరగతిలో విద్యార్ధులని హద్దులో ఉంచటం బహు కష్టంగా ఉండేదట. అసలే కొత్త మేస్టారు, పైగా తెలుగు మేస్టారు. ఇక ఆయన మాటెవడు వింటాడు? ఓ రోజో పిలగాడు హద్దులు మరీ మీరాడు. గమ్మునుండమని గద్దిస్తే లేచి నిలబడి మేస్టారితో గొడవేసుకున్నాడు. ఆయనకి కోపం అవధులు దాటింది. ఉరిమిచూస్తూ, ‘క్లాసులోంచి ఫో’ అన్నాడా కుర్రాడితో. వాడు విన్లేదు. మాస్టారు మళ్లీ చెప్పారు – వెళ్లిపొమ్మని. వాడు షరా మామూలే – అలాగే నిలబడున్నాడు తలపొగరుగా. మిగతా పిలగాళ్లు వినపడకుండా నవ్వుతున్నారు. మాస్టారికి తలకొట్టేసినట్లనిపించింది. ఏక కాలంలో కోపం, అవమానం. ఏమనాలో అర్ధం కాలేదు. కానీ ఏదో ఒకటనాలి కదా. ఆఖరి ప్రయత్నంగా ‘అయితే క్లాసులోంచి వెళ్లనంటావ్?’ అన్నారు వాడికేసి మరింతగా ఉరిమి చూస్తూ (ఈ సందర్భంగా రెబెల్ స్టార్‌ని అనుకరించటానికి ప్రయత్నించానని ఆయనే చెప్పిన మాట). వాడు అవునన్నట్లు తలూపాడు దర్జాగా. క్లాసులో రెండు క్షణాల పాటు నిశ్శబ్దం. దాన్ని ఛేదిస్తూ మేస్టారి గొంతు ఖంగున మోగింది, ‘ద్దెన్, ప్లీజ్ సిడ్డౌన్’ అంటూ. వేడుకోలే ఐనా, కోపంలోంచి పుట్టుకొచ్చింది కాబట్టి అరుపయిందది – పక్క తరగతిలోకీ వినపడేంత పెద్దరుపు. దాన్ధాటికా తుంటరి కుర్రాడు విస్తుపోయాడు. కళ్లు మూసి తెరిచేలోపు పుస్తకాలు సర్దుకుని క్లాసులోంచి పరుగో పరుగు. తెలుగులో వెళ్లమంటే లెక్కజెయ్యనోడు ఆంగ్లంలో కూర్చోమంటే అదిరిపోయాడన్నమాట!

అద్దీ ఇంగ్లీషు గొప్పదనం. చెప్పేదాంట్లో విషయమెంతున్నా, ఆంగ్లంలో మాట్లాడితే అదో గౌరవం. ఈ మధ్య ఈ ఒరవడి తెలుగు బ్లాగుల్లోకీ ప్రవేశించినట్లుంది. చాలా బ్లాగుల్లో రసవత్తర చర్చలు జరుగుతున్నప్పుడు వ్యాఖ్యాతలు తెలుగునొదిలేసి ఆంగ్లంలో వాదం లంకించుకోవటం అరుదుగా నుండి అడపాదడపాగా నుండి విరివిగా మారిన విషయం. కొన్నాళ్లుగా కూడలి కామెంట్స్ పేజీ చూస్తే ఇది తెలుగు బ్లాగుల సమాహారమేనా అనే అనుమానమొస్తుంది. ప్రధానంగా – తెలుగు బ్లాగుల్లోకి కొత్తగా ప్రవేశించేవారు ఆంగ్లంలో రాయటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కనిపిస్తుంది. తెలుగు లిపిలో ఎలా రాయాలో తెలిసుండకపోవటం, తెలిసినా రాసేంత ఓపికా సమయమూ లేకపోవటం, ఉన్నా తెలుగుకన్నా ఆంగ్లంలోనే తేలిగ్గా తమ భావం వ్యక్తీకరించగలుగుతామని అనుకోవటం, ఇవన్నీ కాకపోతే – మా మేస్టారిలాగా – ఆంగ్లంలో ఉన్న ‘ఫోర్సు’ తెలుగులో ఉండదనుకోవటం .. కారణమేదైనా, తెలుగు బ్లాగుల్లో ఆంగ్ల వాడకం బాగా పెరిగిందనేది నిజం. తెలుగు బ్లాగుల పరిధి విస్తరిస్తున్నందుకు, ఎక్కువ మంది ఇటువైపు వస్తున్నందుకు సంతోషపడాలో, తెలుగుదేశంలో మాదిరిగా ఇక్కడా తెలుగు చెలామణీ తగ్గిపోతున్నందుకు బాధపడాలో అర్ధం కాని సంగతిది.

మన భాషలో బ్లాగులు రాయటం వెనుక ఎవరి కారణాలు వాళ్లకున్నా, తెలుగు మీద అంతో ఇంతో ఉన్న ఇష్టం మనందర్నీ కలిపే దారం. బ్లాగర్లలో, వ్యాఖ్యాతల్లో అనేక విషయాలపై భిన్నాభిప్రాయాలుండొచ్చు. కానీ తెలుగు బ్లాగులు అని మనం చెప్పుకుంటున్న వాటిలో తెలుగు శాతం ఎక్కువ ఉండటం సమంజసం అనే విషయమ్మీద మరో అభిప్రాయం ఉండదు.  బ్లాగర్లు, వ్యాఖ్యాతలు తెలుగు వాడకం విషయంలో కొంచెం మడి కట్టుకుని కూర్చోవాలేమో. అంటే – గ్రాంధికమో, పదహారణాల అచ్చ తెలుగో మాత్రమే వాడాలని కాదు; ఆంగ్లం అసలు వాడకూడదనీ కాదు. తెలుగు బ్లాగుల్లో రాసేటప్పుడు – అది టపాయైనా, వ్యాఖ్యైనా – వీలైనంత ఎక్కువగా తెలుగులో రాయటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఏమంటారు?

గమనిక: 1. ఈ టపా ప్రత్యేకించి ఏ ఒకరిద్దరినో ఉద్దేశించినది కాదు; 2. పైన చెప్పిన ‘మేస్టారు’ నా ఊహ కాదు.

(తెలుగులో రాయాలనుకునేవారికి రెండు మూడు మార్గాలున్నాయి. నా వరకూ ఈ పనికి లేఖిని అతి సులభంగా అనిపించిన పనిముట్టు)

17 స్పందనలు to “తెగులు బ్లాగు”


 1. 1 sri 6:29 సా. వద్ద డిసెంబర్ 29, 2008

  Dear Abraka dabra,

  If you can please point me to a source that you are using as to how to write in telugu, I WILL BE PROUD TO USE TELUGU, Italian of the east. Please do write some instructions on how to write in telugu.

 2. 2 అబ్రకదబ్ర 6:42 సా. వద్ద డిసెంబర్ 29, 2008

  @శ్రీ:

  టపా చివర్లొ ఉటంకించినట్లు, నేను లేఖిని వాడతాను. మిగతా సాధనాల గురించి నాకు పెద్దగా తెలియదు. లేఖిని ప్రయత్నించండి.

  ఈ టపా మీ వ్యాఖ్యల వల్ల రాసింది కాదు. దాదాపు వారం క్రితమే రాసి పెట్టి ఇప్పుడు ప్రచురించాను.

 3. 3 వేణూ శ్రీకాంత్ 8:27 సా. వద్ద డిసెంబర్ 29, 2008

  మంచి విషయం చెప్పారు అబ్రకదబ్ర. నేను పూర్ణిమ గారి పుణ్యమా అని, ఈ మధ్యే బరహా డైరక్ట్ ఉపయోగించడం మొదలు పెట్టాను. ఇది మరింత సౌకర్యంగా అనిపిస్తుంది. శ్రీ, మీరు కూడా ప్రయత్నించండి. http://www.baraha.com/baraha.htm

  ఇందులో బరహా 7.0 download చేసి ఇన్ స్టాల్ చేసాక, బరహ డైరక్ట్ రన్ చేస్తే వర్డ్, ఎక్సెల్, నోట్పాడ్, బ్రౌజర్ ఎక్కడ పడితే అక్కడ తెలుగు లో టైప్ చేసేయచ్చు.

 4. 4 చిలమకూరు విజయమోహన్ 8:43 సా. వద్ద డిసెంబర్ 29, 2008

  బరహా ఇన్ స్టాల్ చేసుకుంటే మనకు వీలున్నప్పుడు టైప్ చేసి పెట్టుకుని అవసరమైనప్పుడు బ్లాగులో ప్రవేశపెట్టుకుంటే కాలం కలిసొస్తుంది.

 5. 5 చిలమకూరు విజయమోహన్ 8:44 సా. వద్ద డిసెంబర్ 29, 2008

  కాలం కాదు సమయం కలిసొస్తుంది

 6. 6 లలిత 11:11 సా. వద్ద డిసెంబర్ 29, 2008

  అబ్రకదబ్ర గారూ నూటికి నూరు శాతం మీతో ఏకీభవిస్తున్నాను

 7. 7 gaddeswarup 1:19 ఉద. వద్ద డిసెంబర్ 30, 2008

  లేఖిని వచ్చిన తరువాతతెలుగులో రాయటం తేలికైన మాట నిజమే. కాని నాబోటి వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నవి. యాభై ఏళ్లనుంచి బయట ప్రాంతాలలో ఉండటము. ఇంకా ముఖ్యంగా చదుకొన్నవి పనిచేసినవి అన్నీ ఇంగ్లీషులొనే. కొంచెము క్లిష్టమైన భావాలు రాయాలన్నా, ఏదైన రిఫరెన్సులు ఇవ్వాలన్నా ఇంగ్లీషులొనే ఎక్కువ దొరుకుతున్నవి. తెలుగులో ఈమధ్య చాలా పుస్తకాలు వస్తున్నయ్ కాని వాటిల్లొ రిఫరెన్సులు సోర్సులూ ఇచ్చేవి అలవాటు తక్కువ. పూర్వము గిడుగు, రాళ్ళపల్లి లాంటి వాళ్ళూ ఇలాంటివి చక్కగా ఇచ్చెవారు. ఈమధ్య పాత వ్యాసాలు రిప్రింటు చెసి, ఎప్పుడు ఎక్కడ పబ్లిషు అయిందో కూడ చెప్పరు. రాసినాయిన బ్రతికున్నాడో లెడో కూడ తెలియదు. ఆతరువాత ఏమివొచ్చునయో తెలుసుకోటం కష్టము. కొన్ని శాస్రాలలో తెలుగు మాట లేమిటొ తెలియదు. సాహిత్య ఎకాడమీ వాళ్ళ నిఘంటువులు చూస్తే పరిస్తితి తెలవ వచ్చు.
  ఐనా కొడవటిగంటి రోహిణిప్రసాదు లాంటి వారు వీలైనంతవరకు కష్ట పడుతున్నారు. బ్లూగర్లు, వికిపిడియా వచ్చినతరువాత అభివ్రుద్ధి చాలా కనపడుతున్నది. నేననుకొటం, విషయాన్నిబట్టి ప్రస్తుతానికి రెండూ ఫరవలేదేమో.

 8. 8 కన్నగాడు 4:26 ఉద. వద్ద డిసెంబర్ 30, 2008

  మీరు చెప్పింది అక్షరాల నిజం, తెలుగు వాడకం తప్పనిసరిగా పెరగాలి బ్ల్లాగులోనైనా, బతుకులోనైనా. మా అమ్మ విభేదించినప్పటికి మా నాన్న నన్ను తెలుగు మాధ్యమంలో చదివించినందుకు గర్వపడుతాను.

  నేను తెలుగులో రాయడానికి ఫైర్।ఫాక్సు యాడ్-ఆన్ Indic Input Extension 1.1 వాడుతాను. ఈ పరికరంతో ఫైర్।ఫాక్సులో ఏ ప్రదేశంలోనైనా తెలుగు, తమిలం మొదలగు పదకొండు భాషలలో రాయవచ్చు. అంతే కాక ఇది మాక్ లో కూడా పనిచేస్తుంది. వివరాలకు ఇక్కడ చూడండి.
  https://addons.mozilla.org/en-US/firefox/addon/3972

 9. 9 కె.మహేష్ కుమార్ 6:13 ఉద. వద్ద డిసెంబర్ 30, 2008

  లేఖిని ఆన్లైన్లో వుండేవాళ్ళకి కల్పవృక్షమైతే బరహ (www.baraha.com) నాబోటివాళ్ళకు కామధేనువు. బరహ IME దించుకుని తెలుగుతోసహా అన్ని భారతీయ భాషల్లోనూ దడదడలాడించడమే!ఈ మధ్యనే బరహ సహాయంతో హిందీనికూడా ప్రయత్నించి ఒక టపా నవతరంగం కోసం రాసాను ఈ లంకెలో చూడండి.
  http://navatarangam.com/2008/12/artha-sathya/

 10. 10 KRISHNA RAI JALLIPALLI 9:37 ఉద. వద్ద డిసెంబర్ 30, 2008

  అందరి అబిప్రాయాలు ఆలోచనలు సరి అయినవే. కాకపొతే… ఈ బ్లాగులు ఇంకా మొదటి దశలోనే ఉన్నాయి. బాగా ప్రాచుర్యం పొందాక .. ప్రచారంతో కొన్ని మార్పులు (అంటే పూర్తీ తెలుగులో) అనే ఆలోచన చేయ వచ్చు. ప్రస్తుతానికి o.k.

 11. 11 Shiv 1:25 ఉద. వద్ద జనవరి 8, 2009

  Abrakadabra garu,

  This is my personal opinion.

  If I am typing in English, I would prefer to write/type in English language only. That is why, I feel very difficult writing in Tinglish in all these transliteration sites.

  I know Telugu typewriting very well, but unable to find the software that can simulate a Telugu typewriter keyboard. Long ago, there used to be some software from CDAC which had this capability. I can’t find it anywhere now. Please do let me know if you know of any such software.

  I feel that people will show more interest in typing in Telugu if they feel that they are typing in Telugu and on a Telugu keyboard. It would be great if someone takes an initiative to create such a software in none available.

  Anyways, thanks for raising a good discussion topic.

  – Shiv
  sivaranjani9 at gmail dot com.

 12. 12 అబ్రకదబ్ర 9:54 ఉద. వద్ద జనవరి 8, 2009

  @శివ్:

  నేనెవరినీ బలవంతపెట్టటం లేదండీ 🙂 కొంచెం కష్టమైనా ప్రయత్నించి చూడమంటున్నాను. ఇది డిమాండ్ కాదు, రిక్వెస్ట్ మాత్రమే.

 13. 14 సుజాత 10:12 ఉద. వద్ద జనవరి 10, 2009

  బాగా చెప్పారు. ఎంతో మంది ఇలా తెలుగు టపాలకు కూడా ఇంగ్లీషులో కామెంట్లు రాయడం(పైగా పెద్ద పెద్ద పేరాగ్రాఫులు) చూస్తున్నాను. నా మటుకు నేను బయట ఇంగ్లీషు, తెలుగు కలేసి మాట్లాడినా, రాయడం మాత్రం ఎప్పుడూ తెలుగే! లేఖిని వాడుతూ జాగ్రత్తగా తెలుగులోనే రాయడానికి ప్రయత్నిస్తాను. నాకూ లేఖిని హాయిగా ఉంటుంది.అలవాటైపోయింది కూడా!

 14. 15 a2zdreams 11:20 ఉద. వద్ద జనవరి 21, 2009

  బాగుంది. ఇక్కడ కూడా టైపు చేయవచ్చు. 🙂

  http://www.google.com/transliterate/indic/Telugu


 1. 1 పొద్దు » Blog Archive » 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం 10:05 సా. వద్ద జనవరి 1, 2009 పై ట్రాక్ బ్యాకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ఆరంభం

08 మే 08

వీక్షణలు

 • 302,841

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.

%d bloggers like this: