పోయిన వారం జెనరల్ చెకప్ కోసం ఆసుపత్రికెళ్లాను. అవసరమున్నా లేకున్నా ఆర్నెల్లకోసారి చెకప్ చేయించుకోవాలని ఇక్కడి డాక్టర్ల సూచన. మనమ్మాత్రం ఏడాదికోసారి వెళ్తే ఎక్కువ. అదీ – నెల నెలా హెల్త్ కవరేజికని ఆరేడొందల డాలర్లు అప్పనంగా చదివించుకుంటున్నాం కాబట్టి – ఏడాదికోసారన్నా వెళ్లొస్తే ఊరికే అంత డబ్బు కడుతున్నామన్న ఫీలింగుండదని వెళ్లటమే.
ఈ చెకప్పనేదో తూతూ మంత్రం తంతు. డాట్రారొచ్చి ‘ఏదీ నిలబడు, కూర్చో, ఎగురు, గెంతు, కళ్లటు తిప్పు, నాలుక బయటెట్టు, నన్నెక్కిరించు’ అంటూ నాలుగైదు పిల్లిమొగ్గలూ, చిన్నప్పుడు స్కూల్లో చేసిన డ్రిల్ ఎక్సర్సైజుల్లాంటివి రెండూ చేయించి ఆనక ‘రిఫ్లెక్సులు టెస్ట్ చేస్తున్నా’ అన్జెప్పి మోకాలిమీదో అర చేతిమీదో రబ్బరు సుత్తోటి పెట్టి నాలుగు దెబ్బలేసి ‘యువారాల్రైట్. ఇహ పోవచ్చు’ అంటాడు. అంత డబ్బు పోస్తున్నాం కాబట్టి మనం మరీ పట్టు పడితే కొలెస్టరాల్ టెస్టొకటి రాస్తాడు.
అలా డాక్టర్నో పట్టుపట్టి కొలెస్టరాల్ టెస్ట్ రాయించుకుని దానికోసం ఆస్పత్రిలో ఓ చివరున్న ల్యాబ్కెళ్లాను. అదే మొదటిసారి రక్త పరీక్ష కోసమెళ్లటం. తీరా వెళ్లాక అక్కడున్న బోర్డు చూసి నా గుండెలదిరాయి. ఆ విభాగం పేరు ‘Blood Draw’ అట!! అది చదివి బిక్కుబిక్కుమంటూ లోపలికడుగు పెడితే అక్కడ నలుగురైదుగురు రక్త పిపాసులు తెల్ల కోట్లేసుకుని ఎదురు చూస్తూ కనిపించారు. నాకెందుకో వాళ్లంతా వ్యాంపైర్లలా అనిపించారు. భయంభయంగా వాళ్లలో ఒకడి దగ్గరికెళ్లి డాక్టరిచ్చిన చీటీ అందిస్తే వెంటనే నన్నో కుర్చీలో కూలేసి పనికుపక్రమించాడా వ్యాంపైర్. కుడి చేతికి సిరంజి గుచ్చి రక్తం లాగటం మొదలెట్టాడు. నా చూపేమో అతని కళ్లమీదనే ఉంది – అతను నా మెడకేసి చూస్తున్నాడేమో అని అనుమానం. ఎందుకైనా మంచిదని – అవసరమైతే ఒక్క గెంతులో పారిపోటానికి వీలుగా – ఎడం కాలు తలుపువైపుకి తిప్పి రెడీగా కూర్చుని అతని మొహంలోకి, సిరంజివైపుకి మార్చి మార్చి చూస్తున్నా. నేనలా చూస్తుండగానే మూడు బుల్లి సీసాలకి సరిపడా రక్తం లాగేసి ‘పనైపోయింది ఇక పో’ అన్నట్లు నాకేసి చూశాడతను. ఒక చిన్న టెస్టు కోసం మూడు సీసాల రక్తమెందుకు!?! ‘అనుమానం లేదు. వీడు నిజంగానే వ్యాంపైర్.వాటిలో రెండు సీసాలు వీడు తాగేసి మూడోది ల్యాబ్‌కి పంపుతాడు కాబోలు’ అనుకుని ఇంకా అక్కడే ఉంటే ప్రమాదం కాబట్టి గబగబా బయటపడిపోయా.
* * * * * * * *
అందాకా బాగానే ఉన్నానా, ఆస్పత్రికెళ్లొచ్చేసరికి తల్నొప్పొచ్చింది. దానికి నా దగ్గర రెండు మందులున్నాయి: ఇంటికెళ్లి నిద్రపోవటం, స్టార్బక్స్కెళ్లి కాఫీ తాగటం. ఇంటికన్నా స్టార్‌బక్స్ దగ్గర కాబట్టి అక్కడికే వెళ్లా. లోపలికడుగు పెట్టగానే కమ్మటి కాఫీ గింజల వాసన. దాని ధాటికే మూడో వంతు తలనొప్పెగిరిపోయింది. ‘ఏం కావాలి’ అన్న బరిస్టా ఆప్యాయతకి మిగిలినదాంట్లో సగం నొప్పెగిరిపోయింది. ట్రిక్ క్వశ్చన్: ఇప్పుడు నాకెంత తలనొప్పి మిగిలుంది?
ఇక్కడ ‘బరిస్టా’ అనే మాట గురించి కాసేపు పిడకల వేట. ఇదో ఇటాలియన్ పదం. ఆంగ్లంలో ‘బార్టెండర్’ అనేదానికి సమానార్ధకం. మొదట్లో బార్లలో డ్రింక్స్ అందించేవారిని ఈ పేరుతో పిలిచేవారుకానీ కాలక్రమేణా కాఫీ తయారు చెయ్యటంలో ప్రావీణ్యతగలవారిని బరిస్టా అని పిలిచే సాంప్రదాయం స్థిరపడిపోయింది. ఇండియాలో ఈ పేరుతో ఓ కాఫీ ఛైన్ కూడా వెలిసిందని విన్నాను. పిడకల వేట సమాప్తం.
‘వన్ రెగ్యులర్ కాఫీ ప్లీజ్’ అన్జెప్పి జేబులోంచి పర్సు తీశాను. (నాలాంటి రంధ్రాన్వేషులారా: ‘ఇర్రెగ్యులర్ కాఫీ’ అనేది లేదు, మన బ్లాక్ కాఫీకి అమెరికన్ నామం రెగ్యులర్ కాఫీ. మనూళ్లలో పాతకాలపోళ్లు డికాషన్ అనేదీ దీన్నే. దీనికే ఇక్కడ అమెరికానో అని మరో పేరు. కాఫీని శుభ్రంగా కాఫీ అనక ఇన్ని రకాల పేర్లేంటని నన్నడగొద్దు)
‘Can you wait for a few minutes? We’re still brewing. I apologize’, బరిస్టా నుండి క్షమాపణపూర్వక విన్నపం.
ఫర్లేదంటూ పర్సులోంచి డబ్బులు తీయటం మొదలెట్టాను. అంతలో ‘ఇట్స్ ఆన్ ది హౌస్, సర్’ అంటూ బరిస్టా గొంతు. ఎందుకన్నట్లుగా అతనికేసి చూస్తే ‘It’s not ready when you asked, so ..’ అనేది అతని వివరణ.
ఇదేదో బాగానే ఉందే. అయితే ఇంకేమేమి సిద్ధంగా లేవో అతన్నే కనుక్కుని అవన్నీ ఒక్కో కప్పు ఆర్డరిస్తే? మరీ చీప్‌గా ఉంటుందేమో. పోనీ, మిగతా కస్టమర్లందర్నీ కేకేసి ‘ఇందుమూలాన యావన్మందికీ తెలియజేయునదేమనగా .. వీళ్ల దగ్గర రెగ్యులర్ కాఫీ లేదహో. మంచి తరుణం మించిపోయేలోగా అడిగినోళ్లందరికీ ఫ్రీ కాఫీ అహోయ్ .. ఢంచికఢంచిక డగడగ’ అంటూ టముకేసి చాటింపేస్తే?
నా ఆలోచనలు కార్యరూపం ధరించేలోగానే బరిస్టాగారు కాఫీ సిద్ధం చేసి అందించటంతో అవక్కడితో తెగిపోయాయి. స్టోరీ శాక్రమెంటోకి, కాఫీ కప్పుతో నేనింటికి.
* * * * * * * *
కధ కంచికి అన్లేదు కాబట్టి ఇంకా ఉంది. ఇర్రెగ్యులర్ కాని రెగ్యులర్ అమెరికానో బ్లాక్ డికాషన్ కాఫీ మహత్యానికి నేనింటికి చేరేటప్పటికే మిగిలిన తలనొప్పీ మటుమాయం. కాబట్టి నిద్రపోవటమనే మరో మందుతో పన్లేదు. అందువల్ల బుద్ధి తక్కువై ఏదో తెలుగు సినిమా డీవీడి చూట్టం మొదలెట్టాను. దాని పేరు ‘స్వాగతం’. ఆ సినిమా తీసిన దర్శక శిఖామణి అనగనగనగనగనగనగా అప్పుడెప్పుడో ‘సంతోషం’ అని ఓ హిట్ సినిమా తీసి ఆ సెంటిమెంటుతో ‘సంబరం’, ‘స్వాగతం’ అంటూ ఒకేరకం పేర్లుగల చిత్రరాజాలు మరిన్ని తీసి మనమీదికొదులుతున్నటువంటి రామజనక నామధేయంగల ఒకానొక మహానుభావుడు. అసలీయన ముందు సినిమాకి ఓ పేరనుకుని ఆ తర్వాతే కధ గురించి ఆలోచిస్తాడని నా ప్రగాఢ విశ్వాసం. ఆయన తీసిన మూడు సినిమాల పేర్లకీ కధతో ఏం విడదీయరాని సంబంధముందో నాకంతుపట్టని విషయం. ఉంకో రకంగా జెప్పాలంటే, ఆయన మూడు సినిమాల్లో దేన్నే పేరుతో పిలిచినా ఒకటే. అంత జెనరలైజ్డ్ టైటిలెట్టటమనేది, అసలదో ప్రత్యేకమైన ఆర్టు గాఁబోలు (ఏ మాటకామాటే. ‘సంతోషం’ చూసినోళ్లకి ఆనందమే ఇస్తుంది)
ఇంతకీ, ‘స్వాగతం’ సంగతెందుకు చెప్తున్నానంటే, పదిహేడేళ్లుగా తీరని కోరికొకటి ఎట్టకేలకి తీరింది ఈ సినిమా చూశాక. నా జన్మ ధన్యమయిందనిపించిన ఆ సంగతేమిటో ఎవరన్నా కనుక్కోగలరా? క్లూ కావాలంటే ఈ టపా శీర్షికలో మూడో ముక్క చదవండి. అప్పటికీ వెలక్కపోతే ‘స్వాగతం’ మొదటి అరగంటా ఓపిగ్గా చూడండి.
ఇప్పుడు, కధ కాంచీపురానికి.
స్వాగతం నేను చూడలేదుగానీ..బెనర్జీ దోంట్లో మంచోడుగా చేసాడా ఏమిటి? అయినా ఇదివరకు సంతోషంలో కూడా మంచోడి పాత్రేనే….!!! హేమిటండీ మీ పజిల్సూ ఈ బెనర్జీ రహస్యం విప్పెయ్యండి మహాశయా!
చెప్తే చెప్పండి.. దానికోసం స్వాగతం అస్సలు చూడను గాక చూడను.
Hmm.. very co-incidental..
నాకు నిన్న రాత్రి వెళ్ళిన టయానికి, brew చేసి తయ్యారుగా లేదని, నన్ను వేచి ఉంచేలా చేసినందుకు, చింతించి నాకో free-drink-coupon ఇచ్చారు.
భలే, మీరూ one regular coffee please అంటారా? నేనూ ఎప్పుడూ one small regular coffee please అని అడుగుతా. ఎందుకంటే నేను అది తప్పితే ఇంకేదీ తాగను అక్కడ. ఆ లోటాలంతంత నావల్ల కాదు బాబోయ్.
నాలుక బయటెట్టు, నన్నెక్కిరించు..That was funny.
దశరధ్ గారు నాకు గురుతుల్యులు. ఆయనతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. వ్యక్తిగతంగా మంచి మనిషి, సున్నిత స్వభావం కలవారు. ఆయనలో క్రియేటివిటీకి కొదవలేదు కానీ ఆయనకి వస్తున్న అవకాశాలు, ఆయన ఉన్న పరిస్థితులు ఆయన ప్రతిభని బయటకి రానీయటంలేదు. సంతోషం తర్వాత ఆయనకి పూర్తి స్వేచ్చనిచ్చిన నిర్మాతలు దొరకలేదు(సంబరం గాని, శ్రీ గాని). అసలు నువ్వు-నేను, జయం సినిమాల విజయంలో కీలక పాత్ర దశరధ్ గారిది. ఆయనవే కధ,మాటలు. ఆయన మంచి కధా రచయిత,సంభాషణా రచయిత. సంతోషం, సంబరం సినిమాలలో పతాక సన్నివేశాల సంభాషణల్లో ఆయన ప్రతిభ మనకి తెలుస్తుంది. సెంటిమెంట్ ని పిండే కణ్ణీళ్ళతో కాక సున్నితంగా కొత్తగా చూపిస్తారు ఆ రెండు సినిమాళ్ళో. ఆడపిల్ల తండ్రి “సారీ రా భాను. నేను తప్పు చేసాను. ఈ పెళ్ళి నీకు ఇష్టమా అని అడగకుండా తప్పు చేసాను” అని అనటం ఎంత అందంగా ఉంది. ప్రతీ ఆడపిల్లకి ఇలాంటి తండ్రి కావాలి అనిపించేలా లేదూ? ఇలా చెప్పుకుంటూ పోతే నేను సంతోషం, సంబరం సినిమాల్లోని చాలా సన్నివేశాలే రాయాలి.
మీ మొదటి ట్రిక్ క్వశ్చన్ కి జవాబు : మీకు అప్పటికి ఇంకో మూడొ వంతు తలనొప్పి మిగిలి ఉంది… 🙂
ఎగురు, గెంతు, కళ్లటు తిప్పు, నాలుక బయటెట్టు, నన్నెక్కిరించు …. ఢంచికఢంచిక … బాగున్నాయి 🙂
ఇంక బెనర్జీ సంగతికి వస్తే మీకు 17 ఏళ్ళ నుండి ఈ ఒక్క పని అయ్యిపొతే చాలు భద్రాచలం లో సెట్టిల్ అయ్యిపొతాను అంటు ఉండే బాసు ఉన్నారా? లెక బెనర్జీ కమెడి రొల్ వెయ్యదం మీ 17 ఏళ్ళ కోరికా?
బాగున్నాయి కబుర్లు.ఆసుపత్రి ప్రహసనం బాగుంది.సాధారణం గా మాకు పిజ్జాలు అలా ఫ్రీగా వస్తూవుంటాయి.కొన్ని కొన్ని సార్లు మేము ఉత్తి చీజ్ పిజ్జా చెపుతాము .పిజ్జాహట్ వాడు చీజ్ పిజ్జా అంటే పెప్పరానీ కూడా ఇస్తాడు.ఎంత దయామయుడో.[ముందే ఏమీ వద్దురా బాబూ అని చెప్పినా కూడా మానడు].మళ్ళా ఒక పావుగంట వెయిట్ చెయ్యించి డబ్బులు తీసుకోకుండా దయతలుస్తాడు.
హ హ కబుర్లు బాగున్నాయండి. చెకప్ అదుర్స్… డప్పు సూపర్:-) ఢంచికఢంచిక డగడగ
మీరు brew అంటే, నాకు ఇక్కడ ఆఫీసులో brew – binary runtime environment for wieless గుర్తొచ్చి, అర్జెంట్ గా తలనొప్పి మొదలయ్యింది.
స్వాగతం సినిమా చూసే ఓపిక లేదు. దానిబదులు సంతోషం సినిమా టీవీ లో వస్తే ఇంకోసారి ట్రయ్ చేస్తా. అన్నట్టు సంతోషం సినిమా చూసిన తర్వాత ఆ సినిమాకు india vs newzealand అన్న టైటిల్ ఎలా ఉంటుంది ఆని ఓ ఆలోచన వచ్చింది.
@మహేష్,జ్యోతి,మున్నీ:
పజిల్‌కి సమాధానం: ఎట్టకేలకి – బెనర్జీ నవ్వాడు. జైత్రయాత్రలో అతను మొదటిగా కనపడ్డప్పట్నిండీ ఎదురు చూస్తున్నా బెనర్జీ ఒక్కసారన్నే నవ్వుతూ కనిపించే సన్నివేశం కోసం. ఆ కోరిక స్వాగతంతో తీరింది 🙂
@కుమార్,రాధిక,వేణు,రవి:
ధన్యవాదాలు.
@నాగ మురళీధర్:
దశరధ్ అంటే నాకేమీ కోపం లేదండీ. సంతోషం వంటి మంచి సినిమా తీసినవాడు తర్వాత తీసిన సినిమాలు చూసి చాలా నిరుత్సాహం కలిగింది. ఆయన బాధలు ఆయనకుండుండొచ్చు. ప్రేక్షకులకి అవన్నీ అనవసరం కదా.
బెనర్జీయా?? నవ్వుతాడే బాగానే !!!
ఆమధ్య ఎప్పుడో ఒకసారి ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో ఓ షూటింగ్ టైము లో కనిపిస్తే కాస్త ముచ్చటేసా,గురుడు మా కాలేజీయే కానీ,బారేసినా అందడు చాలా సీనియర్(1975,a.c.College,Guntur)మీరు ఏం గొడవలు చేసారయ్యా మేం చేసినట్టు అని యధాప్రకారం సీనియర్లందరూ వినిపించే క్యాసెట్ కాసేపు పెట్టినా చాలా జంటిల్ అనిపించారు.పైగా హైదరాబాద్
అమరావతి థియేటర్ లో కలిసాం ఓసారి,ఈ జైత్రయాత్ర సినిమాకే,నల్లత్రాచు అని ఒక సినిమా కూడా తీసాడీయన స్వంతగా
@కుమార్:
టాల్ కాఫీ కన్నా బుల్లి కప్పు స్టార్‌బక్స్ వాళ్ల hidden menu లో ఒకటుంది. Short లేదా kid కాఫీ అనడగండి. నేనెప్పుడూ అదే తీసుకుంటా.
@రాజేంద్ర:
నేను మాత్రం బెనర్జీ నవ్వటం చూసింది స్వాగతంలోనే 🙂
అబ్రకదబ్ర,
తాడేపల్లి గారి బ్లాగుని మళ్ళీ చూస్తారో లేదో అందుకని ఇక్కడ రాస్తున్నా.
That line “This is how liberty dies..with a thunderous applause. What a pity” was a pretty powerful one.
I didn’t know this line before. Thanks for sharing.
KumarN
@కుమార్:
మసాలా సినిమాల్లోనూ ఇలాంటి అద్భుతమైన లైన్లుండటం హాలీవుడ్ చిత్రాల్లో నాకు బాగా నచ్చిన విషయం.
అన్నట్టు, చివర్లో ‘what a pity’ అనేది నా సొంత కవిత్వం 🙂 పాద్మెది కాదు.
Abrakadabra garu,
One of the recent hollywood movies that had powerful dialogues is “The Dark Knight”.
“I believe whatever doesn’t kill you simply makes you…stranger”
“You either die a hero, or you live long enough to see yourself become the villain.”
“You won’t kill me because of some misplaced sense of self-righteousness. And I won’t kill you because…you’re just too much fun! I think you and I are destined to do this forever. This is what happens when an unstoppable force meets an immovable object.”
and many more like that. Some of those dialogues make you chilly in the spine.