నవంబర్, 2008ను భద్రపఱచునీరస హృదయం

రాముని తోక గురించి తెలీని తెలుగు వాళ్లుండరేమో. వాక్యాల్లో పదాలని ఇష్టమొచ్చినట్లు విరిచేస్తే వచ్చే తంటా అది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమనేలుతున్న గాయక శిఖామణుల్లో అత్యధికులు రాముడితో పాటుగా సీతకీ, కుశలవులకీ కూడా టోకున తోకలు తగిలించగల ఘనాపాటీలే. మన బాలు గంధర్వుడి తొలినాళ్లలో తమిళం నేర్చుకుంటే తప్ప అరవ పాటలు పాడనీయమన్న సంగీత దర్శకులున్నారు. ఇప్పటికీ బాలు హిందీ పాటల్లో ఉఛ్చారణా దోషాలెంచటానికి ఉత్తరాది వాళ్లు ముందుంటారు. మనం మాత్రం హిందీ నాసికా గాయకాగ్రేసురుల ధాటికి ముక్కలు చెక్కలౌతున్న తెలుగు పాటలు తన్మయంగా వింటూ తరించిపోతుంటాం. తెలుగు పదాలని ఇలాగే పలకాలి అన్నంత ధీమాగా ముక్కు విప్పి పాడే ఉదిత్ నారాయణులు, కుమార్ సానూలకి వహ్వా అంటూ వీర తాళ్లేసి ఊరేగిస్తుంటాం.

అసలే ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం ఎండమావి. పొంతన లేని పదాలతో కూర్చిన వాక్యాల్లో ఏదన్నా అర్ధముందేమో అని వెదుక్కునేసరికి తాతలు దిగొస్తారు. ఇంత కమ్మగా ఉండే సాహిత్యానికి పాటగాళ్ల విరుపుల మెరుపులు ఉచితాలంకారం. వీళ్ల దెబ్బకి పాటల అసలర్ధాలు కనుక్కోవటం తలకుమించిన పని. ఈ మధ్యొచ్చిన దశావతారంలో ‘లోక నాయకుడా’ అంటూ కమల్‌ని ఎత్తేసే పాటొకటుంది.  పాడినాయన పేరు వినీత్ సింగ్ అట. రాగాలల్లింది ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా. సందర్భమేదయినా, భాంగ్రా రీతిలో తప్ప మరో రకంగా బాణీలు కట్టలేకపోవటం ఈయన ప్రత్యేకత. ఆయనకొచ్చిన పదో పరకో రాగాలనే తిరగేసి, మరగేసి ఇప్పటికి ఓ పాతిక హిందీ సినిమాల్లో వాడేసుకున్నాడు. వాటిలో కొన్నిటినెత్తుకొచ్చి దశావతారంలోనూ పెట్టేశాడు. అంత ప్రతిష్టాత్మక చిత్రానికి ఈతడిని ఎంచుకోటంలో మతలబేమిటో ఆ సకల కళా వల్లభుడికే ఎరుక. సరే, మళ్లీ ‘లోకనాయకుడా’ దగ్గరికొస్తే, పాటలో ఓ చరణంలో ఓ వాక్యాన్ని గాయకులుంగారు ఆలపించిన విధానం: ‘నీరస హృదయం రాయని కవిత’! నా రస హృదయం అది విని నీరసించిపోయింది. గాయకుడు తప్పు చేస్తే దిద్దటానికి సంగీతకారునికి భాష తెలిస్తే కదా. పాట రికార్డింగప్పుడు గీత రచయిత పక్కన లేడా? అసలు ఆయనకన్నా తెలుగొచ్చో లేదో.

ఈ మధ్యకాలంలో నేవిన్న తెలుగు పాటల్లో ఇలాంటి విచిత్ర పద ప్రయోగాలెన్నో. తప్పుల్లేని పాట ఒక్కటీ ఉండదు. పోయినేడాదొచ్చిన బుడ్డ ఎన్టీయార్ ‘యమదొంగ’లో ఇలాంటిదే ఒకటుంది, ‘రబ్బరు గాజులు’ అనే పాటలో. పాడినాయన దలేర్ మెహందీ. ఈ సర్దార్జీ పల్లవిలోనే ‘నువ్వంటే పాడి పాడి ఛస్తానే’ అంటూ తెగ ప్రయాసపడిపోయాడు – నువ్వంటే పాడి పాడి అనేదాన్ని మూడు మూడు సార్లు ఒత్తొత్తి పలికి మరీ. పాడి పాడి ఆయన చావటమేమో కానీ నవ్వీ నవ్వీ నేను అల్లాడిపోయాను. కీరవాణికేం పోయేకాలమో. శుభ్రంగా తెలుగొచ్చినోడే కదా. పక్కనుండీ దిద్దకుండా ఏం చేశాడో మరి!

తెలుగు సినీ గేయాల మీద పరభాషా గాయకుల దాడి అనాదిగా ఉన్నదే. అలనాటి మధుర గాయకుడు మహ్మద్ రఫీ కూడా తెలుగు పాటల్ని ఓ పట్టు పట్టినోడే. కాకపోతే అర డజనో, డజనో పాడి వదిలేశాడు కాబట్టి ఆయనెంత పట్టి పట్టి పాడినా మనోళ్లు అబ్బురంగా విన్నారు. వర్తమాన గాయకులూ అలా తెలుగులో అప్పుడప్పుడూ మెరిసి మాయమైతే సమస్య లేదు. లేదా, ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలుగు పాటలు శుభ్రంగా పాడితే ఎన్నిట్నయినా హాయిగా వినొచ్చు. ఈ విషయంలో పాకీస్తానీ వాడయినా అద్వాన్ సమీ మెరుగు. తెలుగులో పాడింది ఒకట్రెండే అయినా ఉన్నంతలో ఉచ్ఛారణా దోషాల్లేకుండా పాడాడు. పాత తరంలో తలత్ మహ్మూద్ కూడా ఇలాగే ఒకటో రెండో పాడాడు – ఆయన తెలుగోడే అనిపించేంత బాగా (వాటిలో ఒకటి 1950లలో వచ్చిన ‘మనోరమ’ లోనిదని విఏకే రంగారావు గారంటే విన్నట్లు గుర్తు)

పరభాషా గాయకులనగానే అంతా ఉత్తరాది వాళ్లనుకోవటం సహజం. అయితే తెలుగుని భయంకరంగా ఖూనీ చేసేది మాత్రం మలయాళీ గాయకులు. జేసుదాస్ వంటి ఒకరిద్దరు పాతకాపులు తప్పిస్తే మిగిలిన వాళ్లంతా పరుషాలకీ సరళాలకీ తేడా లేకుండా పాడేసే రకాలే. వాళ్ల భాషలో ఆ రెంటికీ తేడా లేకపోవచ్చు. అయితే తెలుగులో విరివిగా పాడేటప్పుడు ఈ భాష తెలుసుకోవటం కనీస ధర్మం కాదా? ఇలా ఘోరాతి ఘోరంగా పాడే వాళ్లలో మొదటి వరుసలో ఉండేవాడు ఈ మధ్య తెలుగులో తెగ పాడేస్తున్న జెస్సీ గిఫ్ట్. తెలుగే కాక ఆంగ్ల పదాలు కూడా సరిగా పలకలేకపోవటం ఇతని విశిష్టత. ఆ రకంగా ఆయనకి భాషా భేదాల్లేవని మనం సరిపెట్టుకోవాలేమో మరి! ఈయన్లాంటోడే, ఓ రకంగా ఇతన్ని మించినోడు మరొకడున్నాడు, ఉలగనాధన్ అనే తమిళ సింగరుడు. మన అదృష్టం కొద్దీ ఇతను తెలుగులో ఒకే ఒక్క పాట పాడి క్షమించి వదిలేశాడు (‘ఖరత్నాక్’ లో). ‘మనసు’ ని ‘మణసు’, ‘కోలాటం’ ని ‘కోళాటం’ అంటాడీయన.

అడపాదడపా ఉత్తరాది గాయకులు, అప్పుడప్పుడూ జేసుదాస్ వంటి పొరుగు భాషల వాళ్లు వచ్చి ఒకటీ అరా పాడి వెళ్లిపోయినా ఎనభైల దాకా తెలుగు సినిమాల్లో తెలుగొచ్చిన గాయకులదే హవా. ఎనభయ్యో దశకం మధ్యలో నటశేఖరుడికి బాలసుబ్రహ్మణ్యంతో ఏవో గొడవలొచ్చి రాజ్ సీతారాం అనబడే పక్క రాష్ట్రపాయన్ని తెలుగులోకి తీసుకొచ్చాడు. ‘ఆకాసంలో ఒక తారా’ అంటూ దూసుకొచ్చిన ఆయన శషభిషల్లేకుండా , ,  లని ఏకరీతిన గౌరవిస్తూ కృష్ణ సినిమాల్లో వంద పైబడి పాటలు పాడేసి తర్వాత మనదృష్టం కొద్దీ కృష్ణ-బాలులకి సయోధ్య కుదరటంతో తిరుగు టపాలో వెళ్లిపోయాడు. ఆ రకంగా అప్పటికి తప్పిన ముప్పు తొంభయ్యో దశకంలో అల్లా రఖా రెహ్మాన్, మణిశర్మ ప్రభృతుల ప్రయోగాల పుణ్యాన మళ్లీ ముంచెత్తింది – ఈ సారి మరింత ధాటిగా. ఎస్పీ చరణ్ (‘ఎక్కడ ఉందో తారక’ – మురారి, ‘ఎగిరే మబ్బుల లోన’ – హ్యాపీ), కన్నడ గాయకుడు రాజేష్ (‘ఎటో వెళ్లిపోయింది మనసు’ – నిన్నే పెళ్ల్లాడతా, ‘బుగ్గే బంగారమా’ – చందమామ), వర్ధమాన గాయకుడు కారుణ్య (‘ఎక్కడో’ – చిరుత) వంటి ఆణిముత్యాలు బోలెడు మందుండగా ఈ తప్పుల తడకల పాటగాళ్ల మీద అంత మోజెందుకో సంగీత దర్శకులకి! గుడ్డిలో మెల్లలా, ఈ సమస్య దాదాపుగా గాయకులకే పరిమితం. అదృష్టవశాత్తూ ఆశా భోంస్లే లాంటి ఒకరిద్దరు తప్ప, పరభాషా గాయనీమణులు చాలావరకూ తెలుగు పదాలు బాగానే పలుకుతారు. వీళ్ల పుణ్యాన హీరోయిన్ల సోలో గీతాలు పూర్తిగానూ, యుగళ గీతాలు సగమైనా వినసొంపుగా ఉంటాయి కనీసం.

తెలుగు పాటలు తెలుగు వాళ్లే పాడాలని గిరిగీసుకోనవసరం లేదు. ఎవరైనా పాడొచ్చు. మనవాళ్లు ఇతర భాషల్లో జెండా ఎగరేసిన సందర్భాలూ ఉన్నాయి – ఎస్పీబీ ఈ మధ్యదాకా తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్రస్థానంలో ఉన్నవాడే. కానీ తమిళాన్ని తమిళులంత బాగా మాట్లాడటానికి ఆయన చేసిన కృషిలో కొంతైనా ఈనాడు తెలుగులో పాటలు పాడుతున్న పరభాషా గాయకులు చేస్తున్నారా? ఆమధ్య కీరవాణి ఏదో ఇంటర్వ్యూలో అన్నాడు, ‘ఒకప్పుడు సినిమా సంగీతం దుర్భేధ్యమయిన కోటలాంటిది. ఛేదించుకుని లోపలికెళ్లటం అత్యంత కష్టసాధ్యమైన విషయం. కష్టపడి లోపలకి వెళ్లినోళ్లకి మాత్రం వజ్ర వైఢూర్యాలు దొరికేవి. ఇప్పుడో, లోపలికెళ్లటం చాలా తేలిక. కానీ అక్కడ దొరికేదేమీ లేదు’. వర్తమాన తెలుగు సినీ సంగీతం గురించి ఒక్క ముక్కలో తేల్చేశాడలా. అయితే ఇందులో నాకర్ధం కానిది – లోపల విలువైనది ఏమీ లేదు కాబట్టి అందర్నీ ఎడాపెడా రానిచ్చేస్తున్నారా, లేక ఎవరుబడితే వాళ్లు విచ్చలవిడిగా లోపలికొచ్చేసరికి అక్కడేమీ లేకుండా పోయిందా?


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,298

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.