నవంబర్, 2008ను భద్రపఱచుఅందరి దేవుడు

పర్ణశాల మహేష్ రాసిన సాపేక్ష సిద్ధాంతం – మానవ సంబంధాలు మరియు నాకు దేవుడు కావాలి అనే టపాలకి అన్వయించుకోదగ్గ సంఘటనొకటి నిన్న యధాలాపంగా యాహూ న్యూస్ చదువుతుంటే తారసపడింది.

అమెరికా – ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం. బయటివారికి ఇదో భూతల స్వర్గం, కుబేరుల నిలయం. ఇదంతా నాణానికి ఓవైపు. మరోవైపు – ఇక్కడా నీడ లేని అభాగ్యులెందరో. రాత్రివేళల్లో బస్ షెల్టర్లలోనూ, రైల్వే స్టేషన్లలోనూ, పబ్లిక్ పార్కుల్లోనూ చలికి వణుకుతూ ఆకలి తోడుగా ముడుచుకు పడుకునే నిర్భాగ్యులెందరో. చిత్తు కాగితాలు ఏరుకుని అమ్ముకునేవారు, సేవా సంస్థల దయతో ఏ పూటకా పూట ఆకలి తీర్చుకునేవారు కోకొల్లలు. వీళ్లకి ఇక్కడి సమాజం పెట్టిన పేరు – హోమ్‌లెస్ పీపుల్.

బ్రెండెన్ ఫోస్టర్ – వాషింగ్టన్ రాష్ట్రంలో లుకేమియాతో బాధపడుతూ ఆఖరి ఘడియల్లో ఉన్న ఓ పదకొండేళ్ల పిల్లవాడు. మరో రెండు వారాల్లో చనిపోతాడనగా అతని చివరి కోరిక – కొందరు హోమ్‌లెస్ పీపుల్‌కి భోజనం పెట్టడం. ఆ సంగతి ఆ పిల్లాడి బంధువుల ద్వారా మీడియాకి, అక్కడి నుండి అమెరికా మొత్తం పాకి ఎక్కడెక్కడినుండో వేలాదిమంది ఆ సత్కార్యం కోసం డబ్బు, భోజన పదార్ధాలు పంపటం మొదలు పెట్టారు. అలా పోగైన నిధులు, సరుకులతో బ్రెండెన్ స్వస్థలంలో వందలాదిమంది పేదవారికి ఒక పూట భోజనం ఏర్పాటు చెయ్యబడింది. ఇది జరిగిన రెండు రోజుల్లోనే బ్రెండెన్ కన్నుమూశాడు. బ్రెండెన్ కధ అతనిలాగే లుకేమియాతో బాధపడుతున్న డానియెల్ ఛైరెజ్ అనే పన్నెండేళ్ల క్యాలిఫోర్నియా పిల్లవాడికి ప్రేరణగా నిలిచింది. తను కూడా హోమ్‌లెస్ పీపుల్ కోసం ఏదైనా చేయాలని డానియెల్ నిర్ణయించుకోవటం విశేషం.

వీడియో గేములో, మరే ఇతర వస్తువులో కోరుకునే వయసులోని మనసులకి చివరి రోజుల్లో ఇటువంటి ఉదాత్తమైన కోరిక కలగటం, వాళ్ల ద్వారా వందలాది ఆకలిగొన్న కడుపులకి ఓ పూటైనా భోజనం దొరకటం దేవుడున్నాడనే దానికి సాక్షమా? ఆ మానవత్వం పదకొండేళ్ల ప్రాయంలోనే కొండెక్కనుండటం దేవుడు లేడనే దానికి సంకేతమా? అష్టైశ్వర్యాలతో తులతూగే ప్రజలోవంక, అత్యంత పేదలోవంక; అంతుపట్టని రోగ పీడితులోవంక, ఆరోగ్యవంతులోవంక .. కొందరికున్న దేవుడు అందరికీ ఉండడా? నిన్న బొంబాయిలో బలైన వారికి దేవుడు లేడా? బ్రతికిపోయిన వారికే ఉన్నాడా?

మంచి చెయ్యటానికి, చెయ్యమని నలుగురితో చెప్పటానికి దేవుడే అవసరం లేదు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల విచక్షణ, జ్ఞానం ఉంటే చాలు. ఆ జ్ఞానాన్నే దేవుడు అనుకుందాం. ఆ దేవుడు అందరికీ కావాలి – ఆ దేవుడే అందరికీ కావాలి.

ఏటేటా క్రిస్మస్ రోజుల్లో కొంత డబ్బు పేదల కోసం ఖర్చు చేయటం నాకలవాటు. ఈ ఏడాది దాన్ని రెట్టింపు చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇది బ్రెండెన్ ఫోస్టర్‌కి నా నివాళి. ఈ టపా చదివిన వారికి ఇదో చిన్ని ప్రేరణగా నిలుస్తుందని నా ఆశ.

యూట్యూబ్‌లో బ్రెండెన్ ఫోస్టర్ గురించిన కధనం కోసం ఇక్కడ నొక్కండి.


ఆరంభం

08 మే 08

వీక్షణలు

  • 301,188

పాత గోడులు

నా మాట


నే రాసింది ఓపికగా చదివిన వారికి, తిరిగి తమ విలువైన అభిప్రాయాలు వెల్లడించినవారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు.