(పుష్కరకాలం క్రితం 2008లో రిలీజైన ఈ సూపర్‌హిట్ సినిమా, నేటి తరం కోసం రీరిలీజ్)
* * * * * * * *
All characters and incidents in the following piece of work are purely fictional and bear no resemblance to persons living or dead and places and times
* * * * * * * *
“ఏదీ, ఇప్పుడోసారి మొత్తం కథ టూకీగా చెప్పు”
“మన కథానాయకుడు జమీందార్ల ముద్దుబిడ్డ. చిన్నప్పుడు దుష్టరాజు తరమటంతో అతని తల్లిదండ్రులు బీహారు తీసుకెళ్లి పెంచుతారు. యుక్తవయసులో మరదళ్లతో ఆడిపాడుతూ జాలీగా గడిపేస్తుండగా ఓరోజు హిమాలయాల్లో ముని శాపానికి గురౌతాడు. దాంతో జ్ఞానోదయమై ఆస్థిని త్యజించి ప్రజలకి శాంతిమార్గం బోధిస్తూ దేశాటనం చేస్తుంటాడు. అతని పేరుప్రఖ్యాతులు చూసి కన్నుకుట్టిన మతాధిపతులు రాజును రెచ్చగొట్టి హీరోకి మరణశిక్ష పడేలా చేస్తారు. క్లైమాక్స్‌లో ఉరి తీయబడ్డ హీరో – తల్లి పాడిన ఆవేదనాభరిత పాటకి దేవుడు కరిగి కరుణించటంతో – మళ్లీ బతుకుతాడు. కథ సుఖాంతం”
“బాగుంది. ఇది ఫైనల్ చేద్దాం”
“అలాగే గురూజీ. ఐతే .. నాదో చిన్న అనుమానం”
“ఏమిటది?”
“ఇది ఏసుక్రీస్తు కథ అని ఎవరికీ అర్ధమవదేమో .. ??”
* * * * * * * * * * * *
(వారం క్రితం)
“హలో, జి.హెచ్.భైరవి స్పీకింగ్”
“నేను .. జె.వైభవేంద్రరావు, సి.ఎ”
“గుడ్మోణింగ్ గురూజీ. చాన్నాళ్ల తర్వాత ఫోన్! ఏమిటి విశేషం?”
“కొత్త పౌరాణిక చిత్రం తీసే ఆలోచనలో ఉన్నా. అందుకే నీకు ఫోన్”
“భలే. నా పెన్నుకి మళ్లీ పని. ఈ సారెవరి గురించేం?
“ఏసు క్రీస్తు”
“అదేం .. మన పురాణాలు బోలెడున్నాయిగా!!”
“ఎప్పుడూ అవే తీస్తే మొనాటనీ వచ్చేస్తుందయ్యా. అందుకే ఈ సారి రొటీన్‌కి భిన్నంగా వెళ్దామని. అదీకాక, ఇప్పుడు పాత తెలుగు సినిమాలకి రీమేక్కొట్టే ట్రెండ్ నడుస్తుంది కదా”
“నిజమే గురూజీ. అసలా ట్రెండ్ మొదలెట్టిందే మనం. అలనాటి గోండురంగ మహత్యం పట్టుకుని మొన్న గోండురంగడు తీసేశాం. ఇప్పుడు పాత కరుణారసమయుడుని రీమేక్ చేసేద్దాం”
“రీమేకే కానీ మన బాణీలో ఉండాలి”
“అర్ధమైంది. హీరో ఎవరేంటి మరి?”
“ఇంకా ఎవరూ అనుకోలేదు”
“యువవజ్ర గోలకృష్ణ ఐతే బాగుంటుందేమో?”
“వద్దులే. ఉన్న డబ్బంతా ఆయన విగ్గులకే ఐపోతుంది. సెట్టింగులకి ఇంకేమీ మిగల్దు. మొన్న గోండురంగడికీ అంతే అయింది. దానికి తోడు మొత్తం లిప్స్టిక్కులు, మేకప్పు సామాన్లు కూడా ఆయనకే వాడేసే సరికి పాపం హీరోయిన్ ‘కుమారి’ స్నేషకి మేకప్ లేకుండానే లాగించాల్సొచ్చింది”
“ఔనౌన్నిజమే. పైగా తొడకొట్టే సీన్ ఒక్కటన్నా లేకపోతే ఆయనొప్పుకోడు. ఏసుక్రీస్తు తొడకొడితే బాగోదేమో. పోనీ .. బుల్లిబాబు లక్కినేని గానార్జున ఐతే? ఈయన మనకి లక్కీ మస్కట్ కూడాను. రెండు హిట్లు తీశాంగా ఈయన్తో. ఇంకా, బుల్లిబాబైతే ఎంచక్కా ఎంత కావాలంటే అంత సొంత జుట్టు, గెడ్డం కూడా పెంచుకుంటాడు. ఆ వారా మనకి విగ్గుల ఖర్చు మిగులుద్ది”
“బుల్లిబాబైతే బానే ఉంటుంది కానీ ఈయనీ మధ్య దుష్ట గాంక్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నాడు. తెల్సు కదా, నేను తెలుగురాష్ట్రం వాడ్ని. బుల్లిబాబొద్దులే”
“మరి పరంజీవి ఐతే? పురాణ పాత్రలెయ్యాలనే గుల వీరిక్కూడా ఉంది. అందుకే కదా శ్రీచెంచునాధలో చిన్న పాత్రే ఇచ్చినా ఎగిరి గంతేసి చేసేశారు. ఇప్పుడు ఫుల్‌ప్లెడ్జ్‌డ్ రోల్ అంటే మహదానందంగా ఒప్పుకుంటారేమో”
“ఏమయ్యా భైరవి. బొత్తిగా లోక జ్ఞానం లేదు నీకు. పరంజీవి సినిమాలు మానేసి సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు తెలీదా? ఎప్పుడూ పురాణాలే కాకుండా అప్పుడప్పుడూ న్యూస్పేపర్లూ చదూతుండాలయ్యా”
“ఓ. పరంజీవి సినిమాలు మానేశారా? మరి ఇంకెవరున్నారబ్బా?”
“తుమ్ముబాటి సంకటేష్ ఐతే ఎలా ఉంటాడని ఆలోచిస్తున్నా”
“అద్భుతం సార్, సూపర్ ఐడియా. ఈయనొక్కడితోనే మనం పౌరాణికం తియ్యలేదు ఇందాకా. ఫ్యామిలీ హీరోగా సంకటేష్ ఇమేజ్ కూడా మన సినిమాకి ప్లస్సవుద్ది. ఏసుక్రీస్తు పాత్ర ఈయనకి టైలర్ మేడ్ రోల్. ఇంకెందుకాలస్యం, సంకటేష్నే ఫైనల్ చేసెయ్యండి సార్”
“అదే అనుకుంటున్నా. పైగా వీళ్ల నాన్న మా తెలుగురాష్ట్రం పార్టీవోడే. సంకటేషే ఫైనల్”
“ఇంతకీ, సినిమా పేరు ఏమనుకుంటున్నారు”
“శ్రీ ఏసుక్రీస్తుడు”
“అబ్బో అదిరిపోయింది. పేర్లోనే తెలుగు నేటివిటీ కుమ్మేశారు”
“నేనెప్పుడూ చెబుతా కదా. నేటివిటీ లేపోతే సినిమా ఎంత బాగున్నా ఫ్లాపే. మొన్న గోండురంగడు అంత బాగుండీ ఢామ్మనటానిక్కారణం దాన్ని బ్యాంకాక్‌లో తియ్యటమే. ఈసారలాంటి సిల్లీ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడాలి సుమీ”
“ఔనౌను. పైగా గోండురంగడు థాయ్ అమ్మాయిల్తో గెంతులేసినట్లు కూడా చూపించాం. అదే దెబ్బ కొట్టింది”
“అలాంటి తప్పులు మళ్లీ దొర్లకూడదు. ఏసుక్రీస్తు మీద తెలుగు సినిమా తీస్తే ఆయనది రాయలసీమో, తెలంగాణో అని చూపించాలి. నేటివిటీ ముఖ్యం …. ఏమ్ముఖ్యం?”
“అర్ధమైంది సార్. సినిమాకి నేటివిటీ ముఖ్యం”
“భేష్. అందుకేనయ్యా నువ్వు నాకు నచ్చుతావ్. ఏం చెప్పినా ఠకీమని పట్టేస్తావ్. సరే, నేను సంకటేష్కి ఫోన్ చేసి కాల్షీట్ల గురించి మాట్లాడాలి. నువ్వు కథొండే పని మీదుండు”
“ఆగండాగండి, ఫోన్ పెట్టేసేముందు .. క్రీస్తు గురించి ఏవన్నా రిఫరెన్సు బుక్కులుంటే ఇద్దురూ”
“బైబిల్ చదవ్వయ్యా. అంతకన్నా పెద్ద రిఫరెన్సేముంటది”
“అలాగలాగే. ఐతే నేనో వారం తర్వాత కలుస్తా, స్చ్రిప్టుతో సహా”
“మంచిది. బై ఇంక”
“బై”
* * * * * * * *
(ప్రస్తుతం)
“నమస్తే గురూజీ”
“రావయ్యా భైరవి. కూర్చో. ఎంతవరకూ వచ్చిందేమిటి స్క్రిప్టు?”
“రెడీ సార్. వింటారా?”
“ఊఁ కానీ”
“జనాభా లెక్కల కోసం జోసఫ్ మేరీతో కల్సి సొంతూరికి బయల్దేరటంతో సినిమా మొదలౌతుంది. గాడిదల మీద ప్రయాణం, ఎక్కడా ఆశ్రయం దొరక్కపోటం, ఎక్కే గడపా దిగే గడపా, పశువులపాకలో క్రీస్తు జననం, ముగ్గురు జ్ఞానులు రావటం .. ఇదంతా టైటిల్సప్పుడు చూపిస్తాం. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ కూడా ఉంటుంది”
“బావుంది, బావుంది. జోసఫ్ పాత్రకి పాత సినిమాలో క్రీస్తు వేషమేసినాయన్ని పెడదాం. మేరీ ఎవరనేది చూడాలి. మదర్ సెంటిమెంటు కురిపించేవాళ్లు కావాలి”.
“జోసఫ్‌గా విజయసుందర్? అబ్బో .. మీకు మీరే సాటి గురూజీ. వెరీ యాప్ట్ ఛాయిస్”
“సరె, సరె. తర్వాత?”
“టైటిల్స్ తర్వాత, బాల ఏసుని చంపేయమని హేరోదు సైనికుల్ని పంపిస్తాడు. అప్పుడు మేరీ, జోసఫ్ ఏసునెత్తుకుని ఈజిప్టుకి పారిపోతారు”
“భలే. ఇక్కడో సిటుయేషనల్ సాంగ్ పెట్టొచ్చు. ‘బ్రోచేవారెవరురా’ బావుంటుంది”
“క్రీస్తు కథలో త్యాగరాజ కీర్తనా!?!”
“చెప్పా కదయ్యా. నేటివిటీ, నేటివిటీ ముఖ్యం”.
“ఓహ్. మర్చిపోయా సార్. అలాగే .. బ్రోచేవారెవరురా బాగుంటుంది. ఏసుబోస్ గారితో పాడిద్దాం”
“ఆయన పెద్దాడైపోయాడయ్యా. వాళ్లబ్బాయి వినయ్ ఏసుబోస్తో పాడిద్దాంలే. వాళ్ల నాన్నకన్నా బాగా ముక్కుతో పాడతాడు”
“అలాగే గురూజీ. ఇంతకీ సంగీత దర్శకుడెవరు?”
“ఉన్నాడుగా ఆస్థాన విద్వాంసుడు ఎన్.ఎన్.కూరవాణి. యూ కంటిన్యూ”
“ఇక్కడో ..”
“వెయిటే సెకండ్.. ఇందాక ఈజిప్టన్నావు? మార్చెయ్ .. దాన్ని బీహార్ చేసెయ్. హీరో బీహార్‌లో కొన్నాళ్లుండటం తెలుగు సినిమాల్లో లేటెస్ట్ ఫ్యాషన్. ట్రెండ్‌కి తగ్గట్లుండాలయ్యా”
“కానీ సార్ .. “
“కానీ గీనీ లేదు. కథ .. కథ ముఖ్యమయ్యా – ప్రదేశాలు కాదు”
“సరే గురూజీ. నేపధ్యంలో వినయ్ ఏసుబోస్ ‘బ్రోచేవారెవరురా’ వస్తుండగా బాల ఏసునెత్తుకుని జోసఫ్, మేరీలు బీహారుకి పారిపోతారు”
“దట్స్ మచ్ బెటర్. నౌ, కంటిన్యూ”
“ఇక్కడో డిజాల్వ్ షాట్, ఫేడిన్, తర్వాతో ఎస్టాబ్లిష్మెంట్ షాట్. మట్టి ఇల్లొకటి చూపిస్తాం. తర్వాత ఎక్స్ట్రీం క్లోజప్. కొయ్యని చిత్రిక పడుతున్న ఏసుక్రీస్తు – అదే మన సంకటేష్ బాబు – చేతులమీదనుండి జూమౌట్ చేస్తాం. హీరో ఇంట్రడక్షన్ కదా, కూరవాణి రీరికార్డింగ్ అదరగొట్టాలిక్కడ”
“ఆగాగు .. చిత్రిక పట్టటమేంటి? టూ సింపుల్. ఇంట్రడక్షన్ సీన్లు రాసేటప్పుడు హీరో ఇమేజ్ దృష్టిలో పెట్టుకోవాలయ్యా. ఆ సీన్ మార్చు. క్రీస్తు పిడికిలి బిగించి ఒక్కటి గుద్దితే దూలం విరిగిపోయినట్లు చూపిద్దాం. అలాగే గుద్ది గుద్ది చెక్కలన్నీ ముక్కలు చేసేస్తాడన్నమాట”
“వావ్. సూపర్ సార్. అందుకే మీరు దర్శకచంద్రులయ్యారు. అలాగే మారుద్దాం. ఒక్కో గుద్దునీ నాలుగైదు యాంగిల్స్‌లో తిప్పి తిప్పి చూపిద్దాం, స్లో మోషన్లో. ఎడిటర్‌కి ఫుల్లు పనే పని”
“సరె, సరె. కంటిన్యూ”
“ఓకే. చెక్కలు ముక్కలయ్యాక క్రీస్తు చెమటలద్దుకుంటూ ఇంటి బయటికొస్తాడు. అక్కడ అప్పటికే ఆయన ఉపదేశాలు వినటానికొచ్చిన జనం వెయిట్ చేస్తుంటారు”
“ఆగాగు మళ్లీ. చెమటలేంటి? హీరోకి చెమటలు పట్టకూడదు. మార్చు. ఇంకోటి .. అప్పుడే ఉపదేశాలేంటి? అవన్నీ సెకండాఫ్‌లో. ఫస్టాఫ్‌లో రొమాన్సేది, డ్యూయెట్లేవి?”
“ఏసుక్రీస్తు కథలోరొమాన్సు .. ?? బైబిల్లో అలాంటివి లేవు గురూజీ”
“నువ్వేం మనిషివయ్యా భైరవి. షో సమ్ క్రియేటివిటీ. బైబిల్లో లేకపోతే మాత్రం మనం ఇరికించకూడదని ఉందా? ఏం .. అక్కమయ్య, శ్రీఆదిదాసు కథల్లో రొమాన్సు దూర్చలా? ఇదీ అంతే”
“అలా చేస్తే హిందువులొప్పుకున్నారు కానీ క్రైస్తవులొప్పుకోరేమో?”
“అవి లేకపోతే ప్రేక్షకులొప్పుకోరయ్యా. నే చెప్పినట్లు చెయ్యి”
“ఎలా గురూజీ, ఎక్కడ ఇరికించాలి?”
“క్రీస్తు ముప్పయ్యేళ్లొచ్చేదాకా ఏం చేశాడో ఎవరికీ తెలీదు కదా. మనం సరిగా దాన్నే వాడుకుంటాం. ఆ సమయంలో ఆయన డ్యూయెట్లు పాడినట్లు చూపించేస్తే సరి”
“ఎవరితో గురూజీ?”
“ఇంకెవరితో …. మేనమామ కూతుళ్లతో. మొత్తం ముగ్గురు. ‘కుమారి’ స్నేష, ‘కుమారి’ త్రిహ, ‘కుమారి’ అనూహ్య ఐతే మంచి స్టార్ వాల్యూ కూడా వస్తుంది సినిమాకి. బిజినెస్ అదిరిపోతుంది”
“క్రీస్తు మేనమామ గురించి బైబిల్లో లే ..”
“లేకపోతే మనం పుట్టిద్దాం. ఎం.బేలయ్యతో ఆ పాత్ర వేయిద్దాం. రాసెయ్. ఎవరన్నా గొడవ చేస్తే క్రీస్తుకి మేనమామ లేడని వాళ్లనే రుజూ చెయ్యమందాం. ఎంత కాంట్రవర్సీ ఐతే అంత బిజినెస్”
“అలాగే గురూజీ. రాసేద్దాం”
“మరదళ్లతో మంచి బీటున్న పాటోటి పెట్టాలి. గుర్తుంచుకో”
“తప్పకుండా గురూజీ. పల్లవి ‘నగుమోము చూడరా, నజరేతు వీరుడా’ అనుంటే బాగుంటుందేమో”
“భేషో. ఆశుకవివైపోతున్నావయ్యా. పల్లవి బాగుంది. అదే ఉంచేద్దాం”
“అబ్బే ఆశుకవా పాడా. ఏదో అప్పుడప్పుడూ కవితావేశం తన్నుకొస్తుంది. అంతే సార్”
“సర్లె, సర్లె. ఫస్టాఫ్‌లో కామెడీ మిస్సవకూడదు. అది చాలా ముఖ్యం”
“కామెడీ ట్రాక్ సంగతొక్కటే తట్టలేదు గురూజీ. మీరే హెల్ప్ చెయ్యాలి”
“దానికంతాలోచనెందుకయ్యా. పరమానందంతో ఓ ట్రాక్ పెడదాంలే. ఆయన పాత్ర పేరు పిలక శాస్త్రులు. పక్కన మరో ఇద్దరు పంతుళ్లనేసుకుని హడావిడి చేస్తుంటాడు. వీళ్లకి మెయిన్ స్టోరీతో ఏం సంబంధం లేకుండా జాగ్రత్త పడితే సరిపోద్ది”.
“బాగుంది కానీ, గురూజీ .. బైబిల్లో బ్రాహ్మల్లేరు కదా!?!”
“పిచ్చి భైరవీ. నేటివిటీ, నేటివిటీ”.
“సరే సార్. మరదళ్లతో జాలీగా పాటలు పాడేస్కుంటూ తిరుగుతున్న హీరోని చూసి పైన యెహోవాకి కోపమొస్తుంది. నేను ఇతన్ని భూమ్మీదకెందుకు పంపాను, ఇతను అక్కడేమి చేస్తున్నాడు అని కోపించి అసలు పని గుర్తు చేయమని దేవదూత గేబ్రియెల్ని కిందకి పంపుతాడు …. గురూజీ, యెహోవా పాత్రకి సుందర నటుడు అమన్ ఐతే బాగుంటాడేమో. ఆయనకి ఎస్.బి.పాలసుబ్రహ్మణ్యంగారితో డబ్బింగ్ చెప్పిద్దాం”
“అమన్ .. గుడ్ ఐడియా. కానీ మధ్యలో గేబ్రియల్ ఎందుకు దండగ. యెహోవానే కోయవాడి వేషంలో భూమ్మీదికొచ్చి క్రీస్తుకి జ్ఞానోదయం చేస్తాడు”
“అలాగే మారుద్దాం. ఇక్కడ మళ్లీ ఓ సిటుయేషనల్ సాంగ్. ‘కోయవాడి ధాటికి మారిపోయె యేసువా’ అంటూ. సంకర మహదేవన్‌తో ఓ పదినిమిషాల బ్రీత్లెస్ వేయిద్దామిక్కడ”
“ఆగాగు. అప్పుడే మారిపోతే ఎలా? మన హీరో ధీరోదాత్తుడు. దేవుడే దిగొచ్చినా అతను మారడు, తనంతట తానుగా మారాల్సిందే”
“దేవుడు చెప్పినా మారనోడు ఉత్తినే తనంతట తానే మారాడంటే కన్విన్సింగ్‌గా ఉండదేమో?”
“ఐతే ఎవరన్నా మునితోనో, ముష్టివాడితోనో హితబోధ చేయిద్దాం”
“మునే బెటరేమో గురూజీ”
“ఐతే ఈ లైన్ వేస్కో. హీరో హిమాలయాల్లో ఆడిపాడుతూ దుర్వాసన మహర్షి ధ్యానానికి భంగం కలిగిస్తే ఆయన ఆగ్రహించి ‘నువ్వు శిలువమీద కొట్టబడుదువుగాక’ అని శపిస్తాడు. అప్పుడు జ్ఞానోదయమైన హీరో మన్నించమని అడిగితే ఆయన ‘నా శాపానికి తిరుగులేదు, కానీ ఓ విరుగుడుంది. ఇకనుండీ జనులకి మంచి బోధిస్తూ బ్రతుకు. అలా చేస్తే నువ్వు మరణించిన మూడో రోజు మళ్లీ బ్రతుకుతావు’ అని చెబుతాడు”
“.. మునులూ, శాపాలూ అంటే జానపదం ఐపోతుందేమో గురూజీ? ఇది పౌరాణికం కదా”
“ఇప్పుడా తేడాలన్నీ ఎవరికి తెలుసోయ్? బాగుంటుంది. అలాగే ఉంచు”
“అలాగలాగే. ముని శాపం సినిమాకే హైలైట్. ఈ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో పెడదాం. అన్నట్లు, ముని వేషానికి కనెక్షన్కింగ్ నటసంపూర్ణ ‘పద్మశ్రీ’ డాక్టర్ ఎన్.నోషన్ బాబు, మాజీ ఎం.పి (రాజ్యసభ) ఐతే బాగుంటుంది సార్. ఆయన మామూలుగా మాట్లాడినా బూతులు తిట్టినట్లుంటుంది. శాపాలిచ్చే ముని వేషానికి ఆయనే పర్ఫెక్ట్ ఫిట్”
“ఎగ్జాక్ట్లీ…. నేనూ కనెక్షన్కింగ్ నటసంపూర్ణ ‘పద్మశ్రీ’ డాక్టర్ ఎన్.నోషన్ బాబు, మాజీ ఎం.పి (రాజ్యసభ) నే అనుకుంటున్నానయ్యా. సంకటేష్ బాబుకి లెక్చరివ్వాలంటే ఆ మాత్రం స్టేచరు, నేచరు, సీనియార్టీ ఉన్న లెజెండు కావాలి. ఆయన్నే ఖాయం చేద్దాం. యూ కంటిన్యూ నౌ”
“ఇంటర్వెల్ తర్వాత జ్ఞానోదయమైన హీరో జల్సాజీవితానికి స్వస్తి చెప్పి ప్రజలకి శాంతిమార్గాన్ని బోధిస్తూ దేశాటనం చేస్తుంటాడు. ప్రజల్లో ఆయనకి పెరుగుతున్న ఆదరణ చూసి కన్నుకుట్టిన మతాధిపతులు రాజుకి క్రీస్తుపై పితూరీలు చెప్పి ఆయన్ని శిక్షించమని గొడవచేస్తుంటారు. ఆయన శిష్యుల్లో ఒకడైన జూదాస్ వెన్నుపోటుతో క్రీస్తుని సైనికులు పట్టుకుంటారు. అక్కడినుండీ క్లైమాక్స్ సీన్ మొదలౌతుంది”
“హోల్డిట్ దేర్. సెకండాఫ్‌లో ఎంటర్టెయిన్మెంటేదీ? మరీ ఇంత డ్రైగా ఉంటే ఒక వర్గం ప్రేక్షకులు లేచెళ్లిపోతారు. కాబట్టి ఇక్కడో రొమాంటిక్ సాంగ్ పెడదాం”
“మరదళ్లని వదిలేశాడు కదా. రొమాన్స్‌కి తావెక్కడ?”
“పిచ్చోడా. రచయిత తల్చుకుంటే చెయ్యలేని పనుందా? మేరీ మాగ్దలీన్ అని ఓ క్యారక్టరుంది చూడు. ఆవిడతో పాటొకటి పెట్టేద్దాం”
“గొడవలైపోతై సార్. ఇలాంటి విపరీత కల్పనలు చేస్తేనే డావించీ కోడ్ సినిమాని బ్యాన్ చేశారు”
“వెర్రివాడా. ఏం చేసినా తెలివిగా చెయ్యాలయ్యా. ఇది పిలక శాస్త్రులు ఊహించుకునే డ్రీమ్ సీక్వెన్స్‌లా పెడతాం. అప్పుడు మనల్నెవరూ తప్పు పట్టలేరు”
“భలే ఐడియా. ఎంతైనా మీరు మీరే సార్”
“పొగడ్తలాపు. అన్నట్లు, గుర్తుంచుకో. ఈ పాట కోసం పది లారీలు ఖర్జూరాలు, ఇరవై లారీలు ఈత పండ్లు ఆర్డరివ్వాలి. చాలా రిచ్‌గా తియ్యాలీ పాట”
“అలాగే సార్. నాదో సలహా. మాగ్దలీన్ పేరుని ముగ్ధ అని మారుద్దాం”
“నేటివిటీ పాఠం బాగానే వంటబట్టిందన్నమాట. అలాగే మారుద్దాం. ముగ్ధ పాత్రకి డాబు ఐతే బాగా సూటవుతుంది”
“డాబు సూపర్ సెలక్షన్ గురూజీ. మీ కాస్టింగే కాస్టింగు”
“సర్లే, సర్లే. కంటిన్యూ”
“ఎక్కడున్నాం…. ఆఁ.. క్లైమాక్స్ మొదలౌతుందా, లాస్ట్ సప్పర్ చేసి ప్రార్ధన కోసం క్రీస్తు కొండమీదికెళతాడు. అక్కడ సైతానొచ్చి క్రీస్తుని టెంప్ట్ చెయ్యటానికి ట్రై చేస్తాడు, ‘ఈ కొండ మీంచి దూకు, నీ తండ్రొచ్చి రక్షిస్తాడేమో చూస్తా, ..’ ఇలాగన్నమాట”
“ప్చ్..ప్చ్.. తెలుగు సినిమా హీరో కొండమీంచి దూకితే దేవుడొచ్చి రక్షించటమేంటి? మార్చెయ్. టెంప్టింగంటే ఇదా? సైతాను నునైత్ ఖాన్ రూపంలో వచ్చి మాంఛి ఐటెమ్ సాంగ్ చేసినట్లు పెడదాం – కూరవాణితో అదిరిపోయే మసాలా బాణీలొండిద్దాం. అది చూసి కూడా హీరో చలించడు”
“అలాగే చేద్దాం సార్. పాటవ్వగానే సైనికులొచ్చి హీరోని పట్టుకుపోతారు. విచారణ, శిక్ష విధించటం, శిలువెయ్యటం, మరణించటం .. చివరి పావుగంటలో నడిపిస్తాం ఇవన్నీ. మూడో రోజు శాప విమోచనమై తిరిగి లేస్తాడు. ది ఎండ్”.
“ఏదో మిస్సైనట్లుందే .. ఆఁ.. మదర్ సెంటిమెంటేదీ?”
“శిలువ వేసినప్పుడు సిటుయేషనల్ సాంగ్ మదర్ సెంటిమెంటుది పెడదాం సార్. అన్ని రకాల పాటలూ కవరైపోతాయి”
“మరో ఐడియా. సెంటిమెంటు సాంగు కాకుండా ఆమె దేవుడిని ప్రశ్నిస్తూ పాడే పాటలా పెడదాం. దెబ్బకి దేవుడు దిగొచ్చి హీరోని బ్రతికిస్తాడు”.
“శాప విమోచనం ప్రకారం మూడో రోజు ఎటూ బ్రతుకుతాడు కద సార్”
“శాప విమోచనం క్యాన్సిల్. మునితో ఓన్లీ శాపం. నో విమోచనం. ఆ పని ఇప్పుడు మదర్ పాటపాడి చేయిస్తుంది”.
“మూడు రోజుల పాటు పాడుతూనే ఉంటుందా సార్!?!”
“నో. అదీ మారుద్దాం. అదే రోజు పునరుత్థానం జరుగుతుంది”.
“అలాగే. ఇదే బాగుంది. మార్చేద్దాం”
“ఇంకోటి. క్రీస్తుగురించి వచ్చిన అన్ని సినిమాల్లోనూ ఆయన్ని శిలువేసినట్లే చూపించారు. మనం వెరైటీగా ఉరి తీసినట్లు చూపిద్దాం”
“మరీ ఇన్ని మార్పులా?”
“అమాయకుడా. వీటిని మార్పులూ చేర్పులూ అనకూడదు .. ఇంప్రొవైజేషన్స్ అనాలి. అంటే అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పటం అన్నమాట”
“ఓ. ఐతే ఓకే. మీరెలాగంటే అలాగే గురూజీ”
“మరోటి. బిగినింగ్‌లో క్రీస్తు పశువులపాకలో పుడతాడన్నావు .. ?”
“అవున్సార్. బైబిల్లో అలాగే ఉంది”
“దాన్నీ మార్చెయ్. హీరో అంత పేదవాడంటే సంకటేష్ బాబు ఇమేజ్ దెబ్బ తినుద్ది. బాగా రిచ్ ఫ్యామిలీలో – వీలైతే జమీందారీ కుటుంబంలో -పుట్టినట్లు చూపిద్దాం”
“ఓకే సార్. మీకలా బాగుందంటే అలాగే మారుద్దాం”
“గుడ్. ఏదీ, ఇప్పుడోసారి మొత్తం కథ టూకీగా చెప్పు”
“మన కథానాయకుడు జమీందార్ల ముద్దుబిడ్డ. చిన్నప్పుడు దుష్టరాజు తరమటంతో అతని తల్లిదండ్రులు బీహారు తీసుకెళ్లి పెంచుతారు. యుక్తవయసులో మరదళ్లతో ఆడిపాడుతూ జాలీగా గడిపేస్తుండగా ఓరోజు హిమాలయాల్లో ముని శాపానికి గురౌతాడు. దాంతో జ్ఞానోదయమై ఆస్థిని త్యజించి ప్రజలకి శాంతిమార్గం బోధిస్తూ దేశాటనం చేస్తుంటాడు. అతని పేరుప్రఖ్యాతులు చూసి కన్నుకుట్టిన మతాధిపతులు రాజును రెచ్చగొట్టి హీరోకి మరణశిక్ష పడేలా చేస్తారు. క్లైమాక్స్‌లో ఉరి తీయబడ్డ హీరో – తల్లి పాడిన ఆవేదనాభరిత పాటకి దేవుడు కరిగి కరుణించటంతో – మళ్లీ బతుకుతాడు. కధ సుఖాంతం”
“బాగుంది. ఇది ఫైనల్ చేద్దాం”
“అలాగే గురూజీ. ఐతే .. నాదో చిన్న అనుమానం”
“ఏమిటది?”
“ఇది ఏసుక్రీస్తు కథ అని ఎవరికీ అర్ధమవదేమో .. ??”
“పిచ్చివాడా. ప్రేక్షకులు మరీ అంత దద్దమ్మలనుకున్నావా? సినిమా టైటిల్లోనే ఉంది కదా అదెవరి కథో. తెలుగు సినీగోయెర్స్కి కథలో నవరసాలుండటం ముఖ్యమయ్యా, ఒరిజినల్ స్టోరీతో పోలికుందో లేదో వాళ్లు పట్టించుకోరు. కథకన్నా కథనం ముఖ్యమనే సినీ సామెత విన్లేదా? నీకు మరీ అంత అనుమానమైతే సినిమా మొదట్లో ‘ఈ కథలోని పాత్రలన్నీ కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు’ అని ఓ ముక్క పడేద్దాంలే. ఒక్క దెబ్బకి మూడు పిట్టలు – అటు సెన్సారోళ్ల పేచీ ఉండదు, ఇటు చరిత్రకారుల గొడవా ఉండదు – ప్రేక్షకజనాలకి మాత్రం ఇది ఎవరో ఒకర్ని ఉద్దేశించి తీసిందే అని అర్ధమైపోద్ది”
“సూపర్ సార్. ఎంతైనా వంద సినిమాలు తీసిన తెలివితేటలెక్కడికి పోతాయి? మీలాంటి గురువుగారు దొరకటం నిజంగా నా అదృష్టం”
“పొగడ్తలాపవయ్యా. నాకవి నచ్చవని తెల్సుగా. వెళ్లు, వెళ్లి స్క్రిప్టు రివైజ్ చేసే పన్లో ఉండు. నేను రేపట్నుండే గెడ్డం పెంచటం మొదలెడతా. పది రోజుల్లో సినిమా మొదలెట్టి క్రిస్మస్ నాటికి విడుదల చెయ్యాలి”
“అలాగలాగే. మళ్లీ వారంలో స్క్రిప్ట్ పక్కాగా రాసుకుని కలుస్తా సార్”
“శుభం”
నిజం చెప్పండి !! భైరవి , వైభవేంద్రరావు స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే మీరు సోఫా వెనకాల దాక్కొని ఉండి విని ఇదంతా రాసారు కదూ 🙂
ఈ అవిడీయా బాగుందే! అర్జంటుగా సినిమా ప్లాన్ చేసెయ్యాలి. లేకపోతే ఎవరో ఒకరు తీసేత్తారు.
అతను తీస్తే ఇలానే ఉంటుందేమో.
ఏమైనా ఇలాంటి ఓ ప్రమాదాన్ని
ఎదుర్కునేందుకు మీ టపా సంసిద్ధులను
చేసింది.
“ఈ పాట కోసం పది లారీలు ఖర్జూరాలు,
ఇరవై లారీలు ఈత పండ్లు ఆర్డరివ్వాలి.
చాలా రిచ్‌గా తియ్యాలీ పాట”
అసలు లాస్ట్ సప్పర్ ఎన్ని వంటకాలతో
చేస్తారో తలుచుకోటానికి కూడా ధైర్యం
చాలటం లేదు.
హ హ హ.
బాగుంది. మీరు దీన్ని అర్జంటుగా కాపీరైటు చేసుకుంటే మంఛిది. రేపిది సినిమాగా అవతరించినా ఆశ్చర్య పోనక్కర్లే.
భైరవి ఎవరో నేను గుర్తు పట్టలేదు! కుమారి అనూహ్య ఎవరో కూడా.
బైదవే బ్రోచేవారెవరురా మైసూరు వాసుదేవాచారి కృతి. అఫ్కోర్సు అది దర్శక చంద్రుడికి తెలిసే అవకాశం చాలా తక్కువే లేండి.
మహా రచయిత భైరవి తెలియకపోవటం ఏమిటండి? అఘ్నానపీఠ అవార్డు గ్రహీత కూడాను
@gangabhavani : క్షమించాలి. ఈతపళ్ళకీ last supper కీ సంబంధం లేదేమో. మరి?? చూడుడు: గోండురంగడు సినిమా.
@ఆధరుడు/ఆధరి : ఎవరండి అక్కడ… స్క్రిప్తు రాసుకుంటె సరిపోద్దా? common audience కొచ్చే ధర్మ సందేహాలను పట్టించుకోవద్దా?
సుపర్.. భలే చెప్పారు.
టపా భీభత్సం. పైన వేణుగారు చెప్పినట్లు, మీరు నిజంగానే సోఫా వెనక దాక్కుని విని రాసినంత కరక్ట్ గా ఉంది.
“సైతాను నునైత్ ఖాన్ రూపంలో వచ్చి మాంఛి ఐటెమ్ సాంగ్ చేసినట్లు పెడదాం” – ఈ లైన్ దగ్గర మాత్రం నవ్వు ఆపుకోలేకపోయాను.
మహమ్మద్ ప్రవక్త మీద సినిమా తీయమని వైభవేంద్రరావుకి ఎవరైన అయిడియా ఇస్తే బావుండు. దెబ్బకి తెలుగు సినిమాకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.
“ఎలో..నేను ఆర్ట్ డైరెట్టరు అడవి భరణిని మాట్లాడతాండ. వేసు పాకలో చిన్న చిన్న బల్బులు, ముత్యాలు ఉన్నట్టు లైటింగు, సంకటేశ్ ముల్ల కిరీటం మధ్యలో వజ్రాలు..లైటింగు కామనే. శిలవ లో వైఢూర్యాలు, సంకటేశ్ పాట మధ్యలో బాణాలు వచ్చి హీరోవిను బొడ్డులో గుచ్చుకోడం ఇవన్నీ నాకు వదిలేసేయండి చెప్తాను…రిచ్ నెస్ తో ఇరగదీసేద్దాం ఏమంటారు?”
hahaha :)) LOL 😀
inta bheebhatsamgaa navvinchesarentandi?
:):):)
ha ha ha ha ha ha ha ha
bhale bhale bhale bhale baagundadi
dabrakaabra gaaru :):):):)
Hilarious post Abrakadabra Garu ! Couldn’t stop ROFL at the conclusion of the story !
Intha kanna goppa gaa darsaka chandrudi gurinchi evaru cheppaleru !
You’re awesome !
అహా భరవి ని భలే చమత్కరించారుగా బావుంది.
అసలు పాండురంగడు లో ఆ అమెతికా అమ్మాయిలతో డాంస్ ఏమిటండి ???
:-)))
అబ్రకదబ్ర గారు! నిజం చెప్పండి. అంతకు ముందు సినిమాలకి మీరే కద స్ర్కిప్ట్ రాసింది. భయపడి భారవి అని మార్చుకున్నారు కదూ!
ఎం నవ్వించారండీ బాబు! 3 గంటల సినిమా నిజంగా చూసినట్లే ఉంది.పేర్లు భలే పెట్టారు. కాని ఈ సినిమా కి ట్రెండీ గా ‘మరణ గోగుల ‘ సంగీతం ఐతే ఎలా ఉంటుందంటారు?
jEsuvaa!
Addirindi Mahaanubhava!
🙂 బావుంది. రెండు మాటలు..
1. నోషన్ బాబు లెజెండెప్పుడయ్యాడు? ఆయనుత్త సెలెబ్రిటీయేగా!
2. పాపం, బకరా ఎవరో టపాలో ఎక్కడా వచ్చినట్టు లేదే!
vammo..!! aentandi enta beebatshamina creative comeady?? navvaleka chachipoya.. Title nundi climax taaka keka. 100 days pakka.!!
సూపర్ గా ఉందండి. నిజంగా సినిమాని కళ్ళకట్టినట్టు చూపించారు. సూపర్, కత్తి, వందరోజులు అని టీవీలో లాగా అరుస్తున్నానిక్కడ.
కొత్తపాళీ గారు, భైరవిని గుర్తు పట్టలేదా?? మన మీదకి సున్నమయ్య శ్రీసీతదాసు వదిలాడుకదండి.. ఆయన్ని మర్చిపోతే ఎలా??
శ్రీ రామదాసు చిత్రాన్ని, మీ రచనలో పండిన వ్యంగాన్ని రెండిటినీ సమంగా ఆనందించాను. ప్రజలకు కావలసినది వినోదమేగా. “చరిత్ర అడక్కు, చూపింది చూడు” – ఈ సూత్రాన్ని అన్వయించుకుంటేనే, చిత్రాన్ని ఆనందించగలము. ఈకలు పీకితే చిత్ర వధ అవుతుంది.
@గంగాభవాని,చైసా,లక్ష్మి,లచ్చిమి,శివ బండారు,చావా కిరణ్,భాస్కర్,సుజ్జి,దైవానిక,సిబిరావు:
ధన్యవాదాలు.
@వేణుశ్రీకాంత్,చైతన్య కృష్ణ:
నేను సోఫా వెనక దాక్కుని వినటం అబద్ధం. అసల్నిజం ఏంటో సత్యకి తెలుసు.
@మహేష్:
నిర్మాత బకరా ఎవరని చదువరిగారి ప్రశ్న. మీరైతే ఎలా ఉంటుందని వైభవేంద్రరావుగారి ఆలోచన.
@కొత్తపాళీ:
కుమారి అనూహ్య ఎవరో అంత అనూహ్యం కాదండీ. బుల్లిబాబు గానార్జున ‘డూపర్’ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఇడ్లీ గజన్నాధ్ ఈమెని పరిచయం చేశారు. క్లూ చాలనుకుంటాను.
@ఇండియన్ మినర్వా:
ఆఢరుడు/ధరి ఎవరండీ?
@రవి:
తప్పకుండా ఇరగదీద్దాం. కెమెరామాన్ విజయ్ అన్సెంట్ పని కూడా మీ అడవి భరణి గారే చేసేట్లున్నారు చూడబోతే.
@చైతన్య:
పాత చైతన్యని చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.
@అశ్విన్:
ఈ మధ్య దర్శక నిర్మాతల పైత్యమది – పాటల్లో విదేశీయుల గెంతులు, సందర్భం లేకుండా.
@సత్య:
సత్యం పలికారు. ఈ రహస్యం ఎక్కడా లీక్ చెయ్యొద్దు మరి.
మరణ గోగులకి తప్పకుండా ఓ ఛాన్సిద్దాం. కూరవాణితో బోరొచ్చేస్తుంది.
@చదువరి:
నోషన్ బాబు స్వయంప్రకటిత లెజెండు. ఎవరో ఇచ్చేదేమిటి, ఆయనకాయనే ఇచ్చేసుకున్నాడు.
బకరాగా పర్ణశాల మహేష్‌ని ఇప్పుడే ఎన్నుకున్నాను.
తెలుగు బ్లాగర్లలో ఎంత హాస్య స్ఫోరకత (అదే, సెన్స్ ఆఫ్ హ్యూమర్) ఉందంటే టపా భీభత్సం అనుకుంటే కామెంట్లు ఇంకా భీభత్సం!
చైతన్య కృష్ణ, రవి సత్య గార్ల కామెంట్లు టపాతో సమానంగా నవ్వించాయి. నిజమే ఈ సినిమాని మనమే తీసేద్దాం….!
అబ్రకదబ్ర..మన రెంటచింతల చర్చి దగ్గర ఒక్క పాట కూడా వద్దా? అన్యాయం సుమా..!అడవి భరణి తో చెప్తే ఏ సేట్టైనా వేసేస్తారు కదా….!
ఇవాళే ఈ టపాని ప్రింట్లు తీసి ఫిలిం నగర్ దైవ సన్నిధానం గుడి దగ్గర ఎవరినైనా నిలబెట్టి అందరికీ పంచే ఏర్పాట్లు చేస్తున్నా!
హ్హహ్హహ్హ.. చాలా బావుంది.. మనవాళ్ళు సినిమా తీస్తే ఇలానే ఉంటుంది.. ముందే సంసిధ్ధులని చేసేస్తున్నారన్నమాట!!!
అలానే “నడిపించు నా నావ” పాట రీమిక్స్ పాట మన ద్మిత తో పాడించాలి.. ఏమంటారు..!?
శ్రీ యేసు క్రిస్తుడు లో పాటలు రాయడానికి పాసరి రానయణరావు కష్టపడి అవకాశం చేజిక్కించుకుంటాడు అన్నమాట . ఇంక పాట ”యేసు ని చూడటానికి జెరూసలెం ఎందుకు వెళ్ళాలి, బెత్లహెం ఎందుకు వెళ్ళాలి .జెరూసలెం , బెత్లహెం, అబ్బబ్బ జెరూసలెం అంటే వొడ వొంటె ఎకొచ్చు. బెత్లహెం అయితే గొర్రె బర్రె చూడొచ్చు.”క్లైమాక్స్ పాట ”గాలి వానలో వాన నీటిలో యేసు ఎడారి ప్రయాణం సిలువ ఎక్కడో వలువలుడేనో తెలియదు పాపం ఏమిటి శాపం”.అబ్బ ఈ సుత్తి పాసరి మాటలకి మ్యూజిక్ కొడితే పాట లేకపోతె మాట, భైరవి మనసులో మాట బయటికి వచ్చేస్తుంది.ఏమయ్య పాసరి ని ఘోస్ట్ రైటర్స్ చచ్చిపోతే మాత్రం ఇలా నీ పాత పాటలకి కొత్త మాటలు పెట్టి మా యేసు క్రీస్తు సినిమాకే శిలువ వేయిద్దమన దర్శకేంద్రుడి మందలింపుతో ముగింపు.
హ్హ..హ్హ..హ్హ.. ఈ మధ్యకాలంలో ఇంతనవ్వించిన సుధీర్గ టపా మరోటి లేదు
కాబట్టి టపా ఆఫ్ ది మంత్ అవార్డ్ మీకే ఇచ్చేస్తున్నాం పట్టుకుపొండి
ఇక మనవాళ్ళ కామెంట్లు అదరగొడుతున్నారు .మొత్తానికి ఈమద్య బ్లాగుల్లో నెలకొన్న చిరాకులన్నీ పటాపంచలు చేసి అందరూ హాయిగా నవ్వుకొనేలా వుంది మీటపా . వాతావరణ్ణాన్ని తేలిక పరచే ఇటువంటి టపాలు మరిన్నిరావాలని ఆసిస్తున్నాను అంతాబానేవుందికాని పాపం మహేష్ కుమార్ గారికి నా ప్రగాడ సానుభూతి
chaalaa bagundandi.. google lo edo search chestunte mee kada chadivaa.. baga nachhindi 🙂
టైటానిక్ సినిమా మొత్తం 14 నిమిషాల్లో,మన తెలుగు సినిమా మూసలో !
http://kluptanga.blogspot.com/2008/12/excellant-titanic-telugu-parady.html
మా ఫ్రెండు ఇచ్చిన ఈ బ్లాగు చూడగానే, మీ ఏసు క్రీస్తుడు టపా గుర్తొచ్చింది. :-))
LOL..Hilarious.. Godd..
మీ కామిడి చదివి నవ్వాగలేదు…
శ్రీ యేసుక్రీస్తుడు అని లక్ష్మీకర సంభొధనఏంటండి? నిజంగానే మన సినీజనాలు అందరికీ ఇది కరపత్రాలుగా పంచి చూపించాలనన్నత కసి గ ఉంది నాకు.. ఇప్పటికయిన వాళ్ళ బుర్రలు వెలిగి ట్రాక్ పడతాయా అని..
అన్నట్టు గోండురంగడు లో థాయి అమ్మాయిలతో డాన్సా?? పైత్యానికి పరాకష్ట…
hero entance adirindi,koyavadu scene inkaaa super,muni shapam
inkaa aduersss,last lo talli paataa aa chengelu ,
breath less song ,eela raste mee kadha antaa raseyali.
addda navvaleke chachenu.
meeku cinemalo manchi bhavishyattu undi.
try cheyyamdi.
అబ్రకదబ్ర గారు
ప్రజలకోరిక మేరకు మీరు గనక సినిమాల్లో ప్రవేశించి, భైరవిలా మారిపోతే,
తెలుగు బ్లాగులోకానికి తీరని నష్టం.
ఇక మేము మా కలాలు నూరుకోవాలేమో. మీమీద రాయడానికి.
lolllll .. good one! heheheeee!!
ఇంత మంది మెచ్చిన వాణ్ని మరొడు మెచ్చితె యెంత? లెక పొతె యెంత? కాని రచయితకి ఉత్సాహం ఇస్తుందనె ఈ టపా. అద్భుతంగా వ్రాశారు. ఈ జైత్రయాత్రని అప్రతిహతంగా కొనసాగించ ప్రార్థన.
Naaku chaala rojula nunchi oka purugu tolustundhi, Chinna script eedaina dorkite daanini video laaga teesi Youtube lo pedadamani, meeru permission iste ee conversation mottam anta video teesi you tube lo pedataanu, emantaaru?
Regards.
naku kopam vasthe mimmalni junier artistuluga pettesta.
Bagundi, Baga navvukunnanu.good.
ఓర్నాయనో ! ఇటువంటి టపాను ఇన్నాళ్ళు ఎలా మిస్సయ్యానా అనుకుకుంటున్నా? ఇది వ్రాసే టప్పటికి నేనింకా బ్లాగుల్లోకి రాలేదు. అద్భుతంగా వ్రాశారు. నవ్వలేక చచ్చిపోయాను. మా వాళ్లకు ఈ టపాను చూపించాల్సిందే. ఇక మీ బ్లాగు మీద త్రవ్వకాలు జరపాల్సిందే! .
ధన్యవాదాలు.
భలే నవ్వించారు. థాంక్స్
very creative. చాలా బావుంది.
Ragavendra rao garu idi chadivi unte eepatiki oka maanchi hit cenima vachedi bahusa ayana chudaledanukunt.nenu letuga chusanu.anyway please ee story naku mathrame isthe me peru titles lo vesta mulakatha rachaitha ani.
oke
please okasari alochinchandi
ok ithe na mobileki miss call
9059878980.
సైన్మా రీ రిలీజ్ అయినట్టుంది.
కెవ్వు కేక!! :)) )) ))
Super.
Hello Sir,
ee Tapa nijamga super. deeniki utthama haasya tapa birudu ivvocchu. mee rachana saily bagundi.
అభినందనలు అబ్రకదబ్ర గారూ ! మీ టపా ఇంతకు ముందు చదవలేదు. ఇప్పుడు “ఈనాడు” పుణ్యమా అని చదివేశాను. ఇంకా ఇలాటి మంచి టపాలెన్నెన్నో మీరు రాయాలని కోరుకుంటున్నాను. ఎలాగూ త్వరలో మీరు లక్ష హిట్లాధికారి కాబోతున్నారు. కోటి హిట్లు మీ బ్లాగులో పడాలని ఆశిస్తున్నాను
very very nice baasu
వామ్మో … అసలు ఇన్ని రోజులు ఈ టపాని చావకుండా నేను ఈ బ్లాగ్ లోకంలో ఏం చేస్తున్నానో ఏంటో…
మీ టపాల గురించి చాలా సార్లు updates చూసాను గాని ఎప్పుడు చదవలేదు.
ఇవాళ చూసి చదువుతూనే ఉన్నా… గత 3-4 గంటల నుంచి!!
మీ రచనా శైలి నాకు చాలా బాగా నచ్చింది.
మరిన్ని టపాల కోసం వేచి చూస్తూ…
సెలవు 🙂
sir, super. chalaa baaga rasaaru. ilantivi chusi annaa mana telugu cinema directors maarithe manaki kudaa manchirojulu vachi manchi cinemaalu chustaamemo. evarikainaa teliste please raghavendra rao gaariki chepparoo, please.
ఈ టపా లేటుగా చదివిన వాళ్ళలో కూడా నేనింకా లేటు! మీరెంత బాగా రాశారో వ్యాఖ్యాతల స్పందనలే చెబుతున్నాయి. వాళ్ళతో నేనూ గొంతు కలిపేస్తున్నా!
హ్హ..హ్హ..హ్హ.. ఇది నేను ఎన్ని సార్లు చదివానో గుర్తు లేదు. చదివిన ప్రతీ సారీ కొత్తగానే ఉంటుంది.మీ హాస్య చతురతకి ఈ కథ ఒక మచ్చు తునక. మీకు నా జేజేలు.
నాకు serials అంటే చిరాకు అయినా, ఈ మధ్య మహాభారత్ అంత గొప్పగా ఉండే శ్రీ కృష్ణ అని రామానంద్ సాగర్ తీసిన సీరియల్ చూస్తాను. ( సర్వదమన్ బెనర్జీ కృష్ణుడు ).మహాభారత యుద్ధం మీదే ఎక్కువ ఉంటుంది ఇందులో. ఒక రోజు ఆ సీరియల్ తర్వాత, నారద లీలలు అని కనిపించింది. సరే ఏమిటో చూద్దాం అనుకుంటే, దర్శకుడి పేరు చూడకుండా, బలైపోయా.
ఇంతకీ అందులో నారదుడు, ఒక పనిమనిషి వెనక పడుతుంటాడు. అదీ, పరమ అసయ్యంగా, అప్పట్లో అల్లు రామలింగయ్య వేసిన కొన్ని పాత్రల లాగ. నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.ఎవరు ఇంత తిక్కగా తీసింది అని చూస్తే సీరియల్ చివర్లో, ఇంకెవరూ ? నారదుడు లాంటి మునిని కూడా విడిచి పెట్టట్లా ఈయన. పోగాలం అంటే ఇదే !
http://www.greatandhra.com/ganews/viewnews.php?id=21531&cat=1&scat=4
seriously hope this project not to kick-off!!!
EE ROJULLO VASTHUNNA CINIMALAKU SUPER SETIRE MAREE DARIDRAM KAKAPOTHE CHOOSTHUNNARANI CINIMALU VALLA ISTAM VACHINATLU TEESEYYADAMENA ANY HOW I CONGRATES ANIL NAGENDAR THALAKOTI
ఇప్పుడే మీ కధ accidental గా చదివాను. comedy కోసం Christ ని ఇష్టానికి వాడుకోటం దారుణం. మీకు comedy గా వుందేమో గాని మాలాటి వాళ్లకి అసహ్యం పుట్టింది. ఇది క్రిష్ణుడి మీద రాస్తే apt గా వుండేది. మరదళ్లతో dance లు అవి…..ముందు మీరు చెప్పిన cinemaలు తీసింది ఆ దేవుళ్లని పూజించె వాళ్లేగ, వాళ్ల మీద కక్ష్యతో వేరే వాళ్ల దెవుళ్లని కించపరచటం మీకు భావ్యం కాదు. అందరూ చదివే చోత ఇలాటివి బాలేదు
ఏసుక్రీస్తును ప్రేమించని హిందువులుండరు. ఆయన కరుణామయుడు. అటువంటి దైవకుమారుని గాధను కూడా సదరు తెలుగు సినీచండశాసనులు ఎలా భ్రష్టు పట్టించగలరో ఊహించి రాసిన వ్యంగ్య రచన ఇది. మీరంటున్న ఇతర దేవుళ్లు, భక్తులు ఇప్పటికే వీళ్ల చేతుల్లో బలై పోయారు.
🙂 ఇరగదీసారు కాని,అయినా ఎక్కడా మా తెలంగాణా కళాకారులు కాని నటీనటులు లేకపొవడం చాలా దారుణం. ఈ కథలో ఒక్క బతుకమ్మ ఆట సీను అయినపెట్టలేదు ఇది సీమాంద్రుల కుట్ర.అందుకే మా తెలంగాణా మాగ్గావలే అనేది. ఈ కథని ఎవ్వరో ఒకరు సినిమా తియ్యకపొరా, గప్పుడు మా తెలంగాణాలో ఎలా ఆడిత్తరో చూస్తాం. 🙂
Nice
మీరు కాస్త సాయి బాబా నాగార్జున సినమా గురించి రాసి మా కళ్ళు తెరిపించండి 🙂
దేవుడు ఉత్తముండు. ఇది చలనచిత్రముగా మార్చకుండా మము రక్షించాడు. పాపము శమించుగాక !!!!
Superoooo sooopaarrr! Only the comedy part! But, it may hurt many people’s sentiments! If I keep the virtual character’s originality, BHEEBHATSAM.
Kaanee… mana blog-lokam lo unna dalita sena visionaries ibbandi padataaraemoo? 😉
esu kristu goppa santu mahaatmudu..mee comedy kosam aayana perunu avamaanaparachatam naaku nachaledu.
వినాయకచవితి శుభాకాంక్షలండి,
మనిషి ఊహకు ఒక హద్దు, సరిహద్దు లేకపోతే వచ్చే ప్రమాదం ఇలాగే ఉంటుంది. మీ కల్పన చాలా బాఉందండి. నిజంగా కొన్ని సందర్భాలలో అసలు ఇంకా కథ రూపంలో ఎం భీభత్సం సృష్టిస్తారో అనుకున్నానండి.
“కనెక్షన్కింగ్ నటసంపూర్ణ ‘పద్మశ్రీ’ డాక్టర్ ఎన్.నోషన్ బాబు, మాజీ ఎం.పి (రాజ్యసభ)” దగ్గర నవ్వపుకోలేపోయాను సుమండీ.
చాలా బాగుందండి. పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వుకున్నాను.
Meeku antha time pass kavali ante mee dhevulla pyna rasukondi……. Jesus is our savior… Thamasha ki kuda vere mathanini kinchaparichela chey kudadhu..
నాకైతే సగటు తెలుగు సినిమా చూసినట్టే ఉంది.ఇలా ఖచ్చితంగా తీసి చూపిస్తారు మనోళ్ళు సందేహం లేదు.
hilarious
విపరీతంగా కమర్షియల్ అయిన “తెలుగు సినిమా” గురించి బాగా చెప్పారు. నవ్వి నవ్వి పొట్ట నొప్పి వచ్చింది. మొదట మద్రాసులోనే ఉన్నా వాళ్ళ లాగా కమర్షియల్ సినిమాలతో పాటు ఇంకో పక్క “ఆర్ట్ సినిమాలు” తీయడం మన వాళ్ళు చేయడం లేదు. ప్రస్తుతానికయితే చాలా వరకు చెత్త సినిమాలే వస్తున్నాయి. బాహుబలికి కుడా Hype తప్ప మరోకటి లేదు.
ఇంత క్రియేటివిటీ వున్న వాళ్లంతా ఇలా బ్లాగుల వాగుల్లో కొట్టుకుపోబట్టే ‘అలాంటి ‘వాళ్లంతా తెలుగు సినిమాని శాసిస్తున్నారు.